ప్రశ్న నుంచే రచయిత్రినయ్యాను – వాసిరెడ్డి సీతాదేవి

మాది గుంటూరు జిల్లా చేబ్రోలు. నా చిన్నతనం అక్కడే గడిచింది. 18 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఆ రోజుల్లో పరదా ఆచారం ఉండేది. బయటికి వెళ్ళాలంటే బండికి తెరలు కట్టి తీసుకెళ్ళేవారు. బస్సులయితేే ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవి. ఆ రోజుల్లో అలాంటి పరిస్థితి ఉండేది. 10 సంవత్సరాల వరకు వీథి బడిలో ఐదవ తరగతి వరకు చదివాను. మా ఊళ్ళో హైస్కూల్‌ లేదు. మిడిల్‌ స్కూల్‌ ఉండేది. ఆ స్కూల్‌కి రోడ్డు దాటి వెళ్ళాలి.

ఆడపిల్లవు రోడ్డు దాటి పోవడమేంటి అంటూ నేను చదువుకుంటానని ఏడ్చినా కూడా పంపలేదు. నేను, నా తర్వాత తమ్ముడు. ఇద్దరమే మేము. నా చుట్టూ ఉన్న వాతావరణంలో పెద్దగా చదువుకున్న

వాళ్ళు లేరు. మా నాన్నగారు భాగవతం చదువుకుంటూ, ఒక రుషిలాగా ఏమీ పట్టించుకోకుండా తన మానాన తాను ఉండేవారు. ఎందుకో నాకు తెలియదు కానీ 7, 8 ఏళ్ళు వచ్చేసరికి నా బుర్రలో ఎన్నో ప్రశ్నలు మెదిలి రెస్ట్‌లెస్‌గా ఉండేది. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు. చావంటే ఏమిటి? బతకడం అంటే ఏమిటి? మనం ఏం చేసినా చివరికి చచ్చిపోవాలి కదా! ఇవన్నీ ఎందుకు చెయ్యాలి… ఆ రోజుల్లో ఇటువంటి ఆలోచనలు వచ్చేవి. స్త్రీలను చాలా దారుణంగా చూసేవాళ్ళు. ముఖ్యంగా పరదా ఉన్న కుటుంబాల్లో మగవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే తలుపు చాటునుండే గొంతు తగ్గించి చిన్నగా ఆయన లేరు, బయటికి వెళ్ళారు అని చెప్పాలి. నాకు ఎన్నో సందేహాలొచ్చేవి. మగాళ్ళు హాయిగా బజార్లో వెళతారు, ఆడవాళ్ళు బయటకు ఎందుకు రారు అనుకునేదాన్ని. మా అమ్మగారిని అడిగితే మనం ఆడవాళ్ళం కదా అని అనేది- అంతే.

మా అమ్మగారికి మాత్రం నన్ను చదివించాలని చాలా ఉండేది. నీ కూతుర్ని మగరాయుడిలా పెంచుతావేంటి? అనేవాళ్ళు పెద్దవాళ్ళు. నాకు చదవాలని చాలా కోరిక ఉండేది. మా చుట్టుపక్కల భర్తలు తమ భార్యలను కొట్టడం చూస్తుండేదాన్ని. మా అమ్మను అడిగేదాన్ని ఎందుకు కొడతారు అని. అవన్నీ చూసి ఎందుకు పెళ్ళి చేసుకోవాలి అనుకునేదాన్ని. నాకు ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు వచ్చేవి. ఎప్పుడూ ఆడమనిషినే మగవాళ్ళు ఎందుకు కొట్టాలి? ఆడవాళ్ళు తమని కొట్టేవాళ్ళని నెట్టేయాలి కదా అంటే, అమ్మ ‘పిచ్చి ప్రశ్న. ఆడవాళ్ళు మగవాళ్ళను నెట్టేయడం ఏంటి?’ అనేది.

ఇళ్ళల్లో ఎప్పుడూ ఆడపిల్లని అత్తారింటికి వెళ్ళే పిల్ల అని అనేవారు. నాకు చాలా కోపం వచ్చేది. ఆడపిల్లలు గబగబా నడవకూడదు, గబగబా మాట్లాడకూడదు, గట్టిగా నవ్వకూడదు అని అనేవాళ్ళు. నన్ను అనేవారు కాదు. నేను అసలు మాట్లాడేదాన్ని కాదు. ఎప్పుడూ పుస్తకాలు పట్టుకొని మౌనంగా కూర్చొని ఉండేదాన్ని. నా జోలికి వస్తే మాత్రం ఎదురు తిరిగేదాన్ని. ఏమైనా సరే చదువుకోవాలని అనుకున్నాను. మా ఊర్లో స్వాతంత్య్ర సమరయోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మి గారు హిందీ స్కూలు పెట్టారు. మా ఊర్లో ఒకరి ఇంట్లో పెట్టారు. అక్కడికెళ్ళి ఆడపిల్లలంతా హిందీ చదువుకునేవాళ్ళు. పదమూడు ఏళ్ళు వచ్చాయి. పెళ్ళి చేసెయ్‌, ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటావు? అనేవాళ్ళు బంధువులు. అమ్మ పట్టించుకునేది కాదు. భార్య చనిపోయిన, విడాకులు తీసుకున్న సంబంధాలు వచ్చేవి. రెండవ పెళ్ళి వాడితో సంబంధం కుదర్చబోతే అమ్మ ఎదురు తిరిగింది. నేను అసలు పెళ్ళి చేసుకోను పో అనేదాన్ని. ‘పెళ్ళి’ అంటే చాలు ఏడ్చేదాన్ని. నేను దారిలో వెళుతుంటే రచ్చబండలో కూర్చున్న పెద్దవాళ్ళు, ‘రాఘవరావుగారి అమ్మాయి వెళుతోంది. పట్టుకోండి పెళ్ళి చేసేద్దాం’ అని తమాషాకి అంటే చాలా ఏడ్చేదాన్ని. ‘చిన్నప్పుడు ఏడ్చేదానివి’ – అలాగే ఉండిపోయావు అని ఇప్పటికీ అంటారు. ఆధ్మాత్మిక వాతావరణంలో పెరిగి ఉంటే బహుశ అటు వెళ్ళిపోయేదాన్నేమో. భక్తి లేదు కానీ అరవింద ఆశ్రమం వెళ్ళడానికి ప్రయత్నించాను. గుళ్ళోకెళ్ళి దేవుడికి నమస్కరించినట్లు గుర్తు లేదు. అక్కడ కూడా ప్రశ్నలే! రాయిలో దేవుడు ఉన్నాడా లాంటి ప్రశ్నలు.

నేను హిందీ విశారద పాస్‌ అయ్యాను. నాతోపాటు హిందీ చదివిన నా ఫ్రెండ్‌ వెంకట సుబ్బమ్మ మద్రాస్‌లో ఉద్యోగం చేస్తుండేది. ఆవిడ చాలా సంవత్సరాలుగా అక్కడ ఉంది. నేను ఆమెను నాకు

ఉద్యోగం చూడమని, మద్రాసు వస్తానని ఉత్తరం రాశాను. బాబోయ్‌ నీ కుటుంబం నుంచి ఆడపిల్ల బయటికి రావడమే! అంటూ సరే రా అని రాసిందామె. అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నాకు. అసలు టౌన్‌ వాతావరణం తెలియదు. నేను మద్రాస్‌లో రైలు దిగాక నాకు బాగా దుఃఖం వచ్చి ఏడ్వాలనిపించింది. ఈ స్టేషనే మా ఊరుకన్నా పెద్దదిగా ఉంది అనిపించింది. ‘సనాతన-ధర్మ కన్యా పాఠశాల’లో

ఉద్యోగం చూసి, సెక్రటరీ దగ్గరికి తీసుకెళ్ళింది. ఇంత చిన్న అమ్మాయికి ఉద్యోగం ఇవ్వను అని ఆయన అంటే వెనక్కు వెళ్ళాల్సి వస్తుందేమోనని భోరున ఏడ్చాను. ఆ స్కూల్‌ ఛైర్మన్‌ జగన్నాథ శర్మ అని ఒకాయన ఉండేవారు. నా ఫ్రెండు ఆయన దగ్గరకు తీసుకెళ్ళి చెప్పింది. నేను ఇప్పిస్తాను జాయిన్‌ అవ్వు అన్నారాయన. ఒక సంవత్సరం అక్కడే చేశాను. ఆ స్కూల్‌ ఇన్‌స్పెక్షన్‌ జరిగినపుడు నన్ను తీసేసారు. మైనర్‌తో చేయిస్తే వాళ్ళకు ఏదో గ్రాంట్స్‌ కట్‌ అవుతాయట. అక్కడనుండి జైన్‌ హైస్కూల్‌కు వెళ్ళాను. అక్కడి నుండి హిందీ ప్రచార సభ. అక్కడే ఉండి ఉంటే ఎమ్మెల్యే అయినా కాకపోయినా ప్రధానమంత్రిగా రిటైర్‌ అయ్యేదాన్ని అని సరదాగా అంటుంటాను. హిందీ ప్రచార్‌ సభలో ప్రధానమంత్రి, విద్యా మంత్రి. అలా అనేవాళ్ళు.

అప్పుడు నేను హిందీ ప్రచార సభలో ప్రవీణ చదువుతున్నాను. మింట్‌ స్ట్రీట్‌లో 371వ నంబరు ఇంట్లో నివాసం. మా అమ్మమ్మ నాతో ఉండేది. ఒకరోజు బాగా జ్వరం వచ్చింది. తల బద్దలైపోతున్న బాధ. రెండు రోజులైనా నార్మల్‌కి రాలేదు. మా ఇంటి పక్కనే ఉన్న డాక్టర్‌ నారాయణరావు దగ్గరకు వెళ్ళాను. మలేరియా ఇంజక్షన్లు ఇచ్చి క్వినైన్‌ టాబ్లెట్లు ఇచ్చారు. ”నాకు మలేరియా కాదండీ, టైఫాయిడ్‌” అన్నాను ఆయనతో. డాక్టర్‌ నా ముఖంలోకి చిత్రంగా చూస్తూ ”నువ్వు మెడిసిన్‌ చదువుతున్నావా?” అని అడిగారు. ”కాదండీ నాకెందుకో అలా అనిపిస్తోంది” అన్నాను. ఆయన నవ్వి ”అవే మందులు వేసుకో. అదే తగ్గిపోతుంది” అన్నారు. మరి రెండు రోజులు గడిచాయి. జ్వరం తగ్గలేదు. నాకు వచ్చింది టైఫాయిడ్‌ అంటే ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. నాకు మాత్రం నేను మృత్యువుకు దగ్గరగా జరుగుతున్నాననిపించింది. నేను చచ్చిపోతాను. చచ్చి ఎక్కడికి పోతాను? అసలు చావడం అంటే ఏమిటి? బతుకులో ఉన్నది, చావులో లేనిదీ ఏమిటి? బతుకులో ఉన్నది ‘నేను’, చావులో లేనిది నేనే! అసలు నేను అంటే నాలోని చైతన్యమా లేక ఈ శరీరమా? ఇదేం ప్రశ్న? పిచ్చి ప్రశ్న. రెండూ కలిసే నేను చచ్చిపోయాక, ‘నేను’ – అంటే ఈ చైతన్యం ఇంకా మిగిలే ఉంటుందా? ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకు చావులేదని అంటారే. ఆత్మను ఎప్పుడైనా, ఎవరైనా చూశారా? లేక వట్టి ఊహాగానాలు మాత్రమేనా? అసలు సృష్టి తత్వం ఏమిటి? దీని అస్తిత్వం ఏమిటి? భగవంతుడు ఉన్నాడా? లేడు. భగవంతుడూ లేడు. ఆత్మా లేదు. అయితే మరణమే జీవితానికి ముగింపా? మంచం పక్కనే దిగులుగా కూర్చుని ఉన్న మా అమ్మమ్మను చూశాను. నా చుట్టూ ఉన్న వీళ్ళందరూ ఇలాగే ఉంటారు. నేను పడుకుని ఉన్న ఈ మంచం, నేను కూర్చునే ఈ కుర్చీ, కుర్చీ ముందు ఉన్న బల్లా, నా వస్తువులూ అన్నీ ఎక్కడివి అక్కడే ఉంటాయి. నేను మాత్రం ఉన్నట్లుండి మాయమైపోతాను. అంతవరకు లేని భయం ఏదో నా మనసును చుట్టేసింది. పిచ్చి పిచ్చి ఆలోచనలు క్యాన్సర్‌ వ్యాధిలా నా మెదడులో ఎటుపడితే అటు అల్లుకుపోతున్నాయి. తల పగిలిపోతున్నది, జ్వరం పెరిగిపోతున్నది.

నా ఆలోచనలు మళ్ళించుకోవడానికి ప్రయత్నించాను. మర్చిపోవాలనే ప్రయత్నంలోనే జ్ఞాపకం ఉంటుంది. చెద

పురుగుల్లా బుర్రని తొలిచేస్తున్న ఆలోచనల్ని ఎలా వదిలించుకోవడం? వీటన్నిటినీ కాగితం మీద రాస్తే ఈ బాధనుంచి బయటపడతాననిపించింది. దిండు ఆసరాగా కూర్చుని రాయడం ప్రారంభించాను. మొదటిసారిగా నా ఆలోచనలన్నిటినీ అక్షరాలలో బంధించాను.

జీవితం అంటే? అని హెడ్డింగ్‌ పెట్టాను.

అల్లంత దూరం నుంచి ”జీవితం అంటే సంగీతం” అని నా ప్రశ్నకు సమాధానం ఇస్తున్నట్లుగా కోకిలగానం వినిపించింది. కాదు కాదు, జీవితం అంటే సంగీతం కాదు. మరేమిటి?

పక్క వాటాలోని విద్యార్థి దాశరథీ శతకంలోని పద్యం పెద్దగా చదువుతున్నాడు. ‘జీవితం అంటే బడి, పంతులు, బెత్తం, హోమ్‌వర్క్‌, పద్యాలు బట్టీ పట్టడం’ అని నాకు సమాధానం ఇస్తున్నట్లుగా. పక్కింటి గుమాస్తా ఖళ్ళు ఖళ్ళున దగ్గుతూ, ”జీవితం అంటే ఇవేవీ కాదు. ఆకలి, రోగం, దుఃఖం” అని చెప్తున్నట్లు అనిపించింది. కలం చకచకా నడుస్తోంది. ఇప్పుడు నాకు ఆ రచన పూర్తిగా గుర్తులేదు. భావం మాత్రం గుర్తుంది. ముగింపు గుర్తుంది.

ఆ సాయంకాలం కిన్నెర పత్రిక ఎడిటర్‌ పందిరి మల్లికార్జునరావుగారు, ఆయన సతీమణి మీరాబాయి గారు వచ్చారు. నా మంచం మీద పడి ఉన్న కాగితాలను ఆయన చూశారు. తల ఎత్తకుండా చకచకా చదివేశారు. ”ఈ భావాలన్నీ నీవేనా? ఈ వయస్సులో ఇలాంటి ఆలోచనలా? నమ్మలేకుండా ఉన్నాను” అన్నారు. ఆయన మాటలు నా మనస్సుకు గుచ్చుకున్నాయి. ”అవునండీ, అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు నన్ను ఊహ తెలిసినప్పటి నుంచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి” అన్నాను. ఆయన ఒక్క క్షణం నా ముఖంలోకి జాలిగా చూసి చేతిలోని కాగితాలను భార్యకు అందించారు.

ఆ తెల్లవారే నన్ను మద్రాసు జనరల్‌ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్‌ టైఫాయిడ్‌ అని చెప్పి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది, జ్వరం రాగానే అది టైఫాయిడ్‌ అని ఎందుకు అనిపించిందా అని!

ఇరవై రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాను. ఇంట్లో అడుగుపెట్టగానే ”అమ్మాయ్‌, ఇందులో నీ కథ వచ్చింది. నీ బొమ్మ కూడా వచ్చింది” అంటూ అమ్మమ్మ కిన్నెర కాపీ నాకు అందించింది. అచ్చులో తాటికాయంత అక్షరాలలో నా పేరూ, బొమ్మా ఎన్నిసార్లు చూసుకున్నానో, ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది.

చాలా మంది వ్యాసం బాగుందని అన్నారనీ, ఆ వయసులో ఒక ఆడపిల్ల ఈ వ్యాసం రాసిందంటే నమ్మలేకుండా

ఉన్నామని అన్నారనీ ఆ తర్వాత మల్లికార్జునరావు గారు నాతో అన్నారు. బహుశా వారి ఉద్దేశం – ఆ వయసులో ఉన్న ఆడపిల్లల ఆలోచనలన్నీ ప్రేమ చుట్టూ, పెళ్ళి చుట్టూ తిరుగుతూ ఉంటాయని కాబోలు.

నా బుర్రను తొలిచే ప్రశ్నల నుంచి పుట్టుకువచ్చిన నా మొదటి రచన – (అక్షరబద్ధమైన ఆలోచనల రూపం) ఇదే!

తరువాత ‘సాంబయ్య పెళ్ళి’ రాశాను. అది నా మొదటి కథ. ఆ తర్వాత కాలేజీలో జరిగిన పోటీ కోసం ”ధర్మదేవత గుడ్డికళ్ళు” కథ రాసాను. దబ్బనాలు అమ్ముకునే వాళ్ళ జీవితం గురించి రాసాను. ఆ కథకు నాకు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. కొడవటిగంటి కుటుంబరావు గారు ఆ పోటీకి జడ్జిగా వచ్చారు. ”ఈ కథని ఒక విద్యార్థిని రాసిందంటే నమ్మలేకపోతున్నాను. ఈ వయసులో మామూలుగా రొమాన్స్‌ రాస్తారు. అంతగా లేకుంటే కుటుంబం గురించి రాస్తారు. ఈ వయస్సులో అలాంటి సబ్జక్టు రాయడం ఆశ్చర్యం” అన్నారు. అలా అనడం నాకు సంతోషమనిపించింది. ఇలా మొదలైంది నా సాహిత్య యాత్ర. నాకు జీవితంలో వేరే ఏ ఆసక్తులూ లేవు. నా ఉద్యోగం, చదవడం-రాయడం ఈ రెండే జీవితంలో.

1955లో ”రత్తమ్మ కష్టాలు” అని ఒక కథ రాశాను. ఆ కథ అచ్చయ్యాక హిందీ ప్రచార సభలో గొడవైంది. ‘ప్రధాన మంత్రి’ భార్యమీద రాశానని ప్రచారం జరిగింది. ప్రధానమంత్రికి నా మీద ఫిర్యాదు చేయడం, నా ఉద్యోగం పీకేయడం జరిగింది. ఆ రోజే నేను అక్షరానికున్న బలం ఏమిటో అర్థం చేసుకున్నాను. అక్షరం చాలా బలమైంది. అక్షరాన్ని వృధాగా వినియోగించకూడదు. అసలు ఎందుకు రాస్తున్నాం? ఏం రాస్తున్నాం? ఎవరి కోసం రాస్తున్నాం అని ఆలోచించుకుని మరీ రాయాలి. ఒక కథ చదివి చాల పెద్ద పొజిషన్‌లో

ఉన్నవాళ్ళు, చిన్న అమ్మాయి ఉద్యోగాన్ని పీకి పడేశారు అంటే మనిషి మీద ఎంత ప్రభావం కలిగిస్తుందో నేను అర్థం చేసుకున్నాను.

ఉద్యోగం పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మద్రాస్‌లో హిందీ వ్యతిరేక ప్రచారం జరుగుతుండడం వల్ల హిందీ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చే అవకాశమూ పోయింది. నాకు మద్రాసు వదిలేయాలని లేదు. చిట్టూరి సత్యనారాయణ గారని ప్రఖ్యాత ఇ.ఎన్‌.టి. సర్జన్‌

ఉండేవారు. ఆయన భార్య లక్ష్మీదేవిగారు నన్ను కన్నబిడ్డలా చూసేవారు. సత్యనారాయణ గారే దుర్గాబాయి శిష్యురాలు జమునాబాయి గురించి, సౌభాగ్య పత్రిక గురించి చెప్పి ‘సౌభాగ్య’లో సబ్‌ ఎడిటర్‌ కావాలంట వెళ్ళి ఆమెను కలువు అన్నారు. జమునాబాయి గారికి ఖద్దరు చాలా ఇష్టమని, ఖద్దరు చీరే కట్టుకు వెళ్ళమని లక్ష్మీదేవిగారు చెప్పారు. ఖద్దరు ఎందుకు కట్టుకోవాలి నేను కట్టుకోను అంటే అయితే ఆ

ఉద్యోగం నీకు రాదు అన్నారు. హిందీ ప్రచార సభలో ఉన్న ఫ్రెండు దగ్గర చీర తెచ్చుకుని కట్టుకుని వెళ్ళాను. జమునాబాయి చాలా అందంగా ఉండేవారు. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించే సౌందర్యం ఆవిడది. ఆవిడ ఎన్నో ప్రశ్నలడిగి నన్ను సెలక్ట్‌ చేసినట్లు చెప్పారు. అయితే సబ్‌ ఎడిటర ఉద్యోగం కాకుండా యు.డి.సి. ఉద్యోగం ఇచ్చారు. కానీ నాకు పత్రిక పనే అప్పజెప్పారు. అలా ఉమన్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంటులో చేరాను. కొంతకాలం తర్వాత ‘సౌభాగ్య’ ఆగిపోయింది. ఆఫీసు హైదరాబాద్‌కు మారింది. అలా హైదరాబాద్‌ వచ్చేశాను.

అప్పట్లో హైదరాబాద్‌లో ఇన్ని ఇళ్ళు, జనం లేరు. ఇక్కడో ఇల్లు, అక్కడో ఇల్లు ఉండేది. మద్రాస్‌ లాంటి పట్టణం నుండి వచ్చాను కదా. చాలా ఒంటరితనం ఫీలయ్యేదాన్ని. ఎప్పుడూ దిగులుగా కూర్చుంటుంది, ఎప్పుడో పారిపోతుంది అనేవారు. చివరికి ఇక్కడే

ఉండిపోయాననుకోండి. ఆ టైంలో రాయడం మానేశాను. 1955లోనే కథల పుస్తకం వచ్చింది. బొందలపాటి వారి కథాసాగరం సిరీస్‌లో నాది పదకొండో పుస్తకం. పదవ పుస్తకం కుటుంబరావు గారిది. పన్నెండు పద్మరాజు కథలు. వాసిరెడ్డి సీతాదేవి కథలు అనే పేరుతో నా పుస్తకం వచ్చింది.

నాటకాలు అంటే చాలా ఇష్టం. మద్రాసులో ఉండగానే హిందీ నాటకాలలో నటించేదాన్ని. చాలా మెడల్స్‌ కూడా వచ్చాయి. షాజహాన్‌, నూర్జహాన్‌ కూతురిగా వేశాను. ఇంటర్‌ కాలేజి కాంపిటీషన్‌ అపుడు ఒక నాటకాన్ని డైరెక్ట్‌ చేస్తే దానికి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డు వచ్చింది. ఆ నాటకంలో నటించిన పద్మ సేథ్‌కు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వచ్చింది. డిప్లొమా ఇన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌లో హైదరాబాద్‌లో చేశాను. 1962వ సంవత్సరంలో కె.వి.రమణారెడ్డి గారు రాసిన ‘రాజీవం’ నాటకాన్ని నేను డైరెక్ట్‌ చేసాను. గోకిన రామారావు గారిని, నూతన్‌ప్రసాద్‌ని మొదటిసారిగా స్టేజి ఎక్కించాను. కుర్రాళ్ళంతా కలిసి రవీంద్రభారతి ముందు ఒక పెద్ద బోర్డు పెట్టారు. గోకిన రామారావుకు రామారావు, ఇంకొక ఆయన పేరు నాగేశ్వరరావు అని పెట్టారు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లు నటిస్తున్నారు కాబోలని జనం రవీంద్రభారతి మీద వచ్చి పడ్డారు. టిక్కెట్లు దొరకక పెద్ద గొడవ అయింది. రవీంద్రభారతి డైరెక్టర్‌ పాతూరి శ్రీరామశాస్త్రి గారు అని ఒకాయన ఉండేవారు. ”అమ్మా! చూడండి. మీ వాళ్ళు ఏం చేశారో. రామారావు, నాగేశ్వరరావుగారు నటిస్తున్నారనుకొని జనం మా ప్రాణం తీసేస్తున్నారు’ అన్నారు. నూతన్‌ ప్రసాద్‌ వాళ్ళను పిలిచి, ”ఏమయ్యా! చిన్నపిల్లాడి చేష్టలు చేస్తున్నావు” అని కోప్పడాల్సి వచ్చింది.

నాట్య సంఘంలో ఏడెనిమిది సంవత్సరాలు జాయింట్‌ సెక్రటరీగా ఉన్నాను. జాతీయ స్థాయిలో కమలా భట్టాచార్య గారు, ఇక్కడ ఎ.ఆర్‌.కృష్ణగారు ప్రెసిడెంట్‌గా ఉండేవాళ్ళు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్‌లో నాటకం వేశాం. నేను నటించలేదు కానీ వెనకనుంచి సలహాలు ఇవ్వడం లాంటివి చేశాను.

సాధారణంగా కొన్ని కథలు రాశాక గ్యాప్‌ వస్తే ఆ రచయితని జనం మరచిపోతారు. కానీ నా విషయంలో అలా జరగలేదు. పేరులో బలమో, రచనల్లో బలమో, కలంలో బలమో తెలియదు కానీ నా రచనల్ని పెద్దవాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు. నేను నా కోసం గ్రూప్‌ని తయారుచేసుకోవడం లాంటివేమీ చేయలేదు. నా గురించి పనికట్టుకుని ప్రచారం చేసేవాళ్ళు లేరు. అలాంటివాళ్ళు ప్రచారం చేసినన్ని రోజులే ప్రముఖులుగా ఉంటారు. వాళ్ళ ప్రచారం ఆగిపోతే పేరు కూడా ఆగిపోతుంది. మనం మంచి రచనలు చేస్తే అవే మనల్ని నిలబెడతాయి. నేను చాలా తక్కువ మాట్లాడేదాన్ని. సీరియస్‌గా ఉండేదాన్ని. ఎవరైనా కలవడానికి వస్తే మళ్ళీ బాగానే మాట్లాడేదాన్ని. అలా వచ్చి మాట్లాడిన వాళ్ళు ఆశ్చర్యపోయి మీరు భలే మాట్లాడతారే. నాకు ఎవరో చెప్పారు మీరు సీరియస్‌గా ఉంటారని, అసలు మాట్లాడరని అనేవాళ్ళు. నాకు ఆరుద్ర, కృష్ణశాస్త్రి లాంటి వారు చాలామంది పెద్దవాళ్ళతో పరిచయం కలిగింది. కృష్ణశాస్త్రి గారు నన్ను బాగా ఇష్టంగా చూసేవారు.

నేను సృష్టించిన పాత్రల్లో నాకు నచ్చిన పాత్ర ఏది అంటే మీ పిల్లల్లో ఏ పిల్ల ఇష్టం అని అడిగినట్లు, చెప్పడం కష్టం కదా. మట్టి మనిషిలో వరూధిని, వైతరిణిలో పార్వతి పాత్రలు చాలా నచ్చాయి. సమతలో అరుంధతి పాత్ర నాకిష్టమైన పాత్ర.

ప్రగతి పత్రికలో ప్రశ్నలు సమాధానాలు నిర్వహించేదాన్ని. ఒకాయన ఒక ప్రశ్న అడిగాడు. రాయలసీమలో కరువు వచ్చింది. మంత్రగాళ్ళను పిలిస్తే వర్షాలు వస్తాయి కదా అని అడిగితే నేను సమాధానంగా ‘క్యాబినెట్‌లో కూర్చున్నారు కదా ఇక మంత్రగాళ్ళెక్కడి నుండి వస్తారు’ అని చెప్పాను. దీనిమీద చాలా గొడవయింది. నేను సంజాయిషీ ఇవ్వాలని ప్రభుత్వం అడిగింది. నేను రచయిత్రిని, చమత్కారంగానే అలా చెప్పాను. సంజాయిషీ ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని సమాధానమిచ్చాను. అప్పుడు చీఫ్‌ సెక్రటరీగా రామమూర్తి గారు ఉండేవారు. ఆయన నా సమాధానం చదివి ”నీ సమాధానాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేశాను. రచయితకు ఆ మాత్రం అధికారం ఉండాలి. క్లోజ్‌ ది ఫైల్‌” అని ఆర్డర్‌ ఇచ్చారు. మరీచిక నవలను ప్రభుత్వం నిషేధించిన విషయం మీకు తెలిసిందే.

ఇప్పటి రచయితలు కొందరు రచనను సీరియస్‌గా తీసుకోవడంలేదు. పేరుకోసం, డబ్బుకోసం, రచయితగా నిలబడాలనే తాపత్రయంతో రాస్తున్నారు. పూర్వ సాహిత్యం గురించి అధ్యయనం చేయడంలేదు. మనలో కళ అభివృద్ధి కావడానికి మనం చదవాలి. కొందరు బాగా రాస్తున్నారు కానీ వాదాల దృక్పథంతో రాయడంవల్ల వాదమే మిగిలిపోతోంది. కానీ పాత్రలు మిగలడంలేదు.

స్త్రీవాదం వచ్చాక చాలామంది రచయిత్రులు వచ్చారు. పవర్‌ఫుల్‌ కవిత్వం వస్తోంది. కథలు వస్తున్నాయి, ఆలోచింపచేసే సాహిత్యం వస్తోంది. ఫెమినిజం వచ్చాక స్త్రీలు ఆలోచిస్తున్నారు. స్త్రీ పురుష వివక్ష ఉన్నచోట ఫెమినిజం తప్పకుండా అప్లై అవుతుంది. పాశ్చాత్య ఆలోచనలు కావొచ్చు. స్త్రీవాదం అనే మాట ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది. మేం రాస్తున్న టైంలో ఆ వాదం లేదు. నేను ”ఎల్లమ్మ కథ” అనే కథలో మాంగల్యం గురించి ప్రశ్నించాను. ఎవరో అన్నారు ఫెమినిజానికి దగ్గరగా ఉంది అని. స్త్రీ చైతన్యం పెరిగేకొద్దీ సమస్యల గురించి ఆలోచించడం వాటి మూలాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే ఫెమినిజం. దీన్ని మనం ఇంకేదో దేశం నుండి అరువు తెచ్చుకోనక్కరలేదు.

ఇప్పటి పిల్లలు సాహిత్యం చదవడం మానేస్తున్నారు. కేవలం చదువుమీద, కెరియర్‌ మీద దృష్టి ఉంటుంది. సమాజం గురించి, ప్రక్కవాళ్ళ గురించి ఆలోచించడంలేదు. వాళ్ళ కెరియర్‌, సంపాదన ఇవే ముఖ్యమయ్యాయి. మిగిలిన సమయంలో డాన్సులు చేయడం, టీవీ చూడడం, డిస్కోలకు పోవడం చేస్తున్నారు. వెనుకటితరం ఆలోచించినంత ఆలోచించడంలేదు. అప్పటివాళ్ళు బాగా చదువుతుండేవాళ్ళు. ఆశయాలతో ఉండేవాళ్ళు. ఇప్పుడేమో ఏ సమస్య వచ్చినా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితమంటే స్పష్టమయిన అవగాహన లేకపోవడం, తమాషాగా తీసుకోవడం చేస్తున్నారు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువగా

ఉండడం కారణాలు కావొచ్చు. సెల్ఫ్‌ ఓరియంటేషన్‌ వల్ల కూడా వీళ్ళు సమస్యలనెదుర్కొంటున్నారు. పరిష్కరించుకోవడం చేతకాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

విజువల్‌ మీడియా ద్వారా చాలా చాలా చేయొచ్చు. ప్రస్తుతం మీడియా స్థితి చాలా భయంకరంగా ఉంది. మీడియా ప్రభావం జనం మీద చాలా ఎక్కువగా పడుతుంది. మీడియాలో వచ్చే సీరియళ్ళు చాలా చెడు ప్రభావం చూపిస్తాయి. ఈ సీరియళ్ళలో స్త్రీలను భయంకర విలన్‌లుగా కాకుంటే ఏడుపుగొట్టులుగా చూపిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో మగ విలన్‌ ఉండేవాడు. టీవీ సీరియల్స్‌ వచ్చాక ఆడ విలన్‌లు ఎక్కువయ్యారు. వీటిలో ఆడ విలన్‌ చిటికెలేస్తూ ఎదుటివాళ్ళను చంపేయాలని ఆదేశాలిస్తుంటుంది. వస్తాదుల్లాంటి వాళ్ళు కూడా సరే అమ్మా అంటారు. నిజానికి వాళ్ళు ఓ దెబ్బ వేస్తే ఈమె చస్తుంది. ఏమిటిది? ఒక సీరియల్‌లో అయితే విడాకులు ఇచ్చినామె అయితే నేను మాంగల్యం ఉంచుకోవచ్చా? అని అడుగుతుంది. విడాకులిచ్చాక ఇంకా మాంగల్యం గోలేమిటి? భోరున ఏడవడం తప్పించి ఏమీ ఉండదు. గట్టిగా ఎదురు చెప్పే పాత్రలు రావడంలేదు. చదువుకున్న ఆడవాళ్ళు, ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్న ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకు? భర్త జబ్బుతో చనిపోతే భరించలేక ఒకావిడ హాస్పిటల్‌ భవనం మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే ”సౌభాగ్యవతి”గా పోవాలనే ఉద్దేశ్యంతో చనిపోయిందని పేపర్ల వాళ్ళు పిచ్చిగా రాసారు. జీవితంలో కలిసిమెలిసి ఉన్న భర్త చనిపోతే భరించలేక ఆమె చచ్చిపోతే మీడియా వాళ్ళు మాత్రం సౌభాగ్యవతిగా పోవాలనే ఉద్దేశ్యంతో ఆవిడ చనిపోయింది అని రాశారు. ఇదంతా ఒక విష ప్రచారం.

ఇంకో కేసులో ఇద్దరూ డాక్టర్లే. అతను ఫోరెన్సిక్‌ డాక్టర్‌, ఇద్దరు పిల్లలు. ఆమె చాలా అందంగా ఉండేది. భర్తకి భార్యమీద అనుమానం. నిన్ను నేనే ఎప్పుడో పోస్టుమార్టం చేస్తాను అని అనేవాడు. ఊరికే సతాయించేవాడు. ఒకరోజు కొడుతుంటే బెడ్‌షీట్‌ కప్పుకుని రోడ్డుమీదకు వచ్చింది. ఉద్యోగం చేస్తూ ఉండి కూడా భర్తను ఎదిరించకుండా తానే ఆత్మహత్య చేసుకుంది. ఆడవాళ్ళకి ధైర్యం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం ఉండాలి. ఎందుకు భయపడాలసలు? మగవాడు లేకుండా ఎలా ఉంటావు లాంటి డైలాగులు టీవీ సీరియల్స్‌లో విన్పిస్తుంటాయి. నేను 18వ ఏట ఒంటరిగా మద్రాస్‌ పట్టణంలో ఉన్నాను. అప్పుడు ఏమీ తెలియదు నాకు. నేను ఎప్పుడూ కూడా చేయదలచుకున్నది చేశాను. ముందుకు పోయానే తప్ప వెనకకు చూడలేదు. మధ్యలో ఏదైనా ముళ్ళబాట వస్తే ఇంకొకరు వచ్చి చేయి అందించాలని నేనెప్పుడూ అనుకోలేదు. కష్టాలు వస్తే తట్టుకుని నిలబడడం నేర్చుకున్నాను. కష్టం దాటిన వెంటనే దాన్ని మర్చిపోతాను తప్ప దాన్నే తలచుకుని కుమిలిపోవడం నేనెప్పుడూ చేయలేదు.

అసలు ఆడపిల్లలకే వివాహ అవసరం ఎందుకు? మగవాళ్ళకు కూడా అవసరం ఉంటుంది. ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కూడా స్త్రీకే వివాహం అవసరం అనేది నాటుకుపోయింది. అది మారాలి. న్యాయంగా ఆలోచిస్తే స్త్రీ కన్నా పురుషుడికే పెళ్ళి అవసరం ఎక్కువ ఉంది. ఒక వయసు వచ్చాక భార్య చనిపోతే పురుషుడు నిలబడలేడు. అదే స్త్రీ అయితే తనకు తానే అన్ని పనులూ చేసుకుంటుంది. భర్త పోతే ఆర్థికంగా నిలబడి పిల్లల్ని పెంచగలదు. స్త్రీకి ఎప్పుడూ బతగగలిగే శక్తి ఉంటుంది. పురుషుడే స్త్రీ మీద ఆధారపడి ఉన్నాడు. అందుకే పురుషుడికే పెళ్ళి అవసరం. ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. కట్నం తీసుకునేవాడిని నేను పెళ్ళి చేసుకోను అని గట్టిగా నిర్ణయించుకోవాలి. డాక్టర్‌ చదువుకున్న అమ్మాయి కూడా లక్షలు పెట్టి మొగుడ్ని కొనుక్కుంటోంది. ఇది చాలా అవమానకరమైన విషయంగా నాకనిపిస్తోంది.

హాబీలు అనేవి ప్రత్యేకంగా ఏం లేవు. నాటకాలు వేయడం, చూడడం ఉండేది. ఆత్మకథ రాయాలని ఉంది. ఇప్పుడు రాయాలని ఉంది. హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ వారు ఫెలోషిప్‌ ఇచ్చారు. స్త్రీ విముక్తి గురించి నవల రాయాలి. వంద పేజీల సినాప్సిస్‌ రాశాను. దాన్ని పూర్తి చేసి పంపాలి.

మతం జోక్యం మన జీవితంలో ఎక్కువైంది. ఈ స్పీడ్‌ యుగంలో మనిషి బతుకే అభద్రతలో కూరుకుపోయింది. డబ్బు మీద ఆశ ఎక్కువయింది. కమ్యూనిస్టు భావాలున్న వాళ్ళు కూడా సినిమాలు తీసి ఆ సినిమా బాక్సు తీసుకెళ్ళి తిరుపతిలో పూజలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కోరికలు ఎక్కువయ్యాయి. అభద్రత పెరిగిపోయి కూడా ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

నాకు రాయడానికి స్ఫూర్తి ఎవరు అంటే అలా ఏమీలేదు. చిన్నప్పటినుంచే ఎక్కువగా ఆలోచించేదాన్ని. ప్రేమ్‌చంద్‌ సాహిత్యం ఎక్కువగా చదివాను. నాకు తెలియకుండానే ప్రేమ్‌చంద్‌ ప్రభావం కాస్తో, కూస్తో ఉందేమో అన్పిస్తుంది. మట్టిమనిషి హిందీ అనువాదం వచ్చినపుడు ప్రేమ్‌చంద్‌ గోదాన్‌తో పోలుస్తూ సమీక్షలొచ్చినపుడు నేను నిజంగా చాలా సంతోషించాను. ఎందుకంటే ప్రేమ్‌చంద్‌ నాకు చాలా ఇష్టమైన రచయిత.

నా బాల్యం గురించి చెప్పాలంటే చిన్నప్పుడు స్కూలుకి పోకుండా మా ప్రక్కనుండే నాయుళ్ళ అమ్మాయితో తిరిగేదాన్ని. వాళ్ళు గేదెలను మేపడానికి పోతే నేనూ పోయేదాన్ని. వాళ్ళతో పొలం వెళ్ళేదాన్ని. వాళ్ళ మూటల్లోని అన్నం తినడం నాకు చాలా ఇష్టం. పొలంలో ఆడుకోవడం, కాలువలో ఈత కొట్టడం, చెట్లు ఎక్కడం నాకు ఇష్టమైన పనులు. ఎర్ర చెరువు అని ఒక చెరువు ఉండేది. ఓసారి అక్కడికి పోయి చెరువులో స్నానం చేసి వస్తుంటే మా బాబాయి చూసి నన్ను దగ్గరకు పిలిచి కొట్టాడు. ”ఆడముండవు కాదా? ఆడపిల్లగా ఉండు” అని తిట్టాడు. కోపంగా చూసి పరుగు తీశాను. గుడిసెల్లోకి వెళ్ళి అక్కడ కబుర్లు చెబుతూ వాళ్ళ మధ్యలో ఉండేదాన్ని. అక్కడ ఆడుకుని మా ఇంట్లో వాళ్ళు చూడకుండా పరుగు తీసేదాన్ని. మా అమ్మ మాత్రం ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు అని ఎప్పుడూ ప్రశ్నించలేదు.

నేను ఏనాడూ బొమ్మల పెళ్ళిళ్ళు, అమ్మానాన్న ఆటలు ఆడలేదు. అమ్మా నాన్న ఆటలో కూడా నేను నాన్నగా

ఉంటాననేదాన్ని. మగపిల్లలతో బచ్చాలు ఆడేదాన్ని. చెట్లు ఎక్కేదాన్ని, బిళ్ళంగోడు ఆడేదాన్ని. నీ కూతుర్ని మగరాయుడిలా పెంచుతున్నావ్‌ అనేవారు బంధువులు. అమ్మమీద కోపం వచ్చినపుడు కూడా చెట్టు ఎక్కి కూర్చునేదాన్ని. వైతరిణి నవలలో పార్వతి పాత్రలో నేను కొంతవరకు కన్పిస్తాను. మగపిల్లలతో బచ్చాలు ఆడతావా అని తిట్టేటపుడు మగవాళ్ళు ఆడవచ్చు కాని నేను ఎందుకు ఆడకూడదని ఎదురుతిరిగేదాన్ని.

నా నవలలు సినిమాలుగా ప్రజానాయకుడు, ఆమెకథ, మనస్సాక్షి వచ్చాయి. మృగతృష్ణ రిలీజ్‌ కాలేదు. ఈ సినిమా ఇండియన్‌ పనోరమాకి ఎంపికయింది. నాకు వంట అసలు రాదు. టీ పెట్టుకోవడం కూడా రాదు.

పురస్కారాలు చాలా వచ్చాయి. మొట్టమొదట వస్తే సంతోషమే కానీ అమ్మో! నాకు అవార్డు వచ్చేసింది అని ఆనందపడిపోలేదు. భారతీయ భాషా పరిషత్‌ వాళ్ళు ‘లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు’ ఇచ్చారు. సంతోషం, సంతృప్తి ఉండొచ్చు కానీ అవార్డు వచ్చినపుడు

ఉప్పొంగిపోయింది లేదు.

– ఇంటర్వ్యూ ః కె. సత్యవతి, ఘంటసాల నిర్మల

(నవంబర్‌ 2004 భూమిక నుంచి)

 

 

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.