స్త్రీ జీవిత ఆరాట పోరాట కథ -కాత్యాయనీ విద్మహే

కాలగమనంలో సమాజం ముందుకు పోతున్నట్లు అనిపిస్తున్నా, కనిపిస్తున్నా లింగ వివక్ష యథాప్రకారం కొనసాగుతూనే ఉండడం వలన స్త్రీల జీవితంపై గుణాత్మకమైన మార్పులు ఏవీ రాలేదన్నది యదార్థం. సంస్కరణ దశ నుండి స్వావలంబన దశకు స్త్రీ పురోగమించిందని అనుకోవడమే కానీ స్త్రీ రెండవ స్థానం మాత్రం చెక్కుచెదరలేదు. స్త్రీ పురుషుల మధ్య కౌటుంబిక సంబంధాలలోనూ, సామాజిక సంబంధాలలోనూ కొనసాగుతున్న అసమానతలు స్త్రీని ఒత్తిడికి లోను చేస్తున్నాయి. తీవ్రమైన హింసకు గురిచేస్తున్నాయి. స్త్రీలపై అత్యాచారాలు, వేధింపులు, గృహహింస 2012 నాటికంటే 2013 నాటికి ఐదింతలు పెరిగాయన్న అధికార గణాంకాలు ఆందోళన కలిగించేవే. ఈ పరిస్థితులలో సంఘర్షిస్తూ, రాజీ పడుతూ, ప్రతిఘటిస్తూ, కొత్త పోరాట రూపాలను ఎన్నుకొంటూ, కొత్త చైతన్యాన్ని కూడగట్టుకుంటూ స్త్రీలు నిత్య గాయాల నదులై ప్రవహిస్తున్న వర్తమాన దృశ్యం భిన్న పార్శ్వాల నుండి తెలుగు కథకు వస్తువు అవుతున్నది. 2013లో వచ్చిన కొన్ని కథల ఆధారంగా దానిని నిరూపించడం ఈ వ్యాసం లక్ష్యం. ఆడపిల్ల పుట్టుకను అసహ్యించుకునే సమాజం, భ్రూణహత్యలకు పాల్పడుతున్న మనుషుల అల్పత్వం దగ్గర నుండి అన్ని వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొంటూ అవరోధాలను అధిగమిస్తూ స్వయం సిద్ధలుగా స్త్రీలు తయారుకావడం వరకూ స్త్రీల జీవితంలోని ఎన్నో దశలు, స్థితులు, చలన చైతన్యాలు అన్నీ ఈ కథలలో కనిపిస్తాయి. ఇలాంటి కథలు రాసిన వాళ్ళు ఎక్కువగా స్త్రీలు.

స్త్రీ పురుష వివక్ష పశుపక్ష్యాదులలో లేనిది మనుషులలో ఎందుకున్నది అని ప్రశ్నిస్తుంది శాంతి ప్రబోధ. ఆడపనీ… మగపనీ… అనే కథలో (విహంగ, మే), ఇంటి పని ఆడవాళ్ళదైన సమాజంలో ఆడవాళ్ళ అనారోగ్యం మగవాళ్ళకు సమస్య అవుతుంది. సింగరాజు రమాదేవి రాసిన బెడ్‌రెస్ట్‌ (ఆంధ్రభూమి, ఫిబ్రవరి) కథకు కూడా వస్తువు అదే. విశ్రాంతి, సెలవు లేని ఇంటిపనులలో తన అస్తిత్వం ఎక్కడైనా మిగిలి ఉందా అన్న సందేహంలో పడినపుడు స్త్రీ సహాయ నిరాకరణ చేసి ఇంట్లోవాళ్ళకు తన పట్ల ఉన్న అక్కర స్వభావం ఏమిటో తెలుసుకొనడం వస్తువుగా ఆలపర్తి రామకృష్ణ ఊటబావి (స్వాతి, ఆగస్టు 9) కథ రాశాడు.

నిత్య నిఘాకు, నిరంతర నియంత్రణకు గురయ్యే స్త్రీలు జీవితంలోని ఆరాట పోరాటాలు వస్తువుగా చెయ్‌ (ఎస్‌.శ్రీదేవి, భూమిక, మార్చి), వదిలెయ్‌ (విమల), సప్తవర్ణ సమ్మిశ్రితం (పి.సత్యవతి, తెలుగువెలుగు, మార్చి) మొదలైన మంచి కథలు వచ్చాయి. పుట్టినప్పటి నుండి పుట్టింట, అత్తింట, ఆఫీసులో కూడా ఈ పనిచెయ్‌, ఆ పనిచెయ్‌ అని నిర్దేశించే అధికార వ్యవస్థలో మనసు చెదరిన స్త్రీ కేంద్రంగా రాయబడిన కథ ‘చెయ్‌’. స్వతంత్రంగా ఎంత పనైనా చేయవచ్చుగానీ ఒకళ్ళ పెత్తనం కింద చేసే పని చిన్నదే అయినా చాలా బరువు అనిపిస్తుంది. అనుక్షణం ఆ బరువు కింద నలిగి మనసు చెదిరిన తల్లి వ్యథను కొడుకు కోణం నుంచి చూపిందీ కథ.

భార్యల మీద భర్తల పెత్తనాలు, సహజీవన సంసారంలో భార్యల పాత్రకు, భర్తల పాత్రకు మధ్య తేడాలు – గాయాలు పైకి కనబడనీయని హింసగా ఉంటుందని తల్లిని, పినతల్లులను చూస్తూ ఒక కూతురు గ్రహించిన విషయం విమల రాసిన వదిలెయ్‌ కథాంశం. తన అభిరుచులు, సామర్ధ్యాలు, ఆలోచనలు నవ్వుతూనే కొట్టిపారేసే భర్తతో సంసారంలో ఊపిరాడక తనదైన ఇంటిని, జీవితాన్ని ఏర్పరచుకొనడాన్ని కరుణ పిన్ని చేసిన ప్రయత్నం ఇందులో ఉంది. తన మానాన తనను ‘వదిలెయ్‌’మనే ప్రతి భార్య కరుణ పిన్నిలాగా అనగలగాలన్నది కూతురి ఆకాంక్ష. మగవాళ్ళు, భర్తలు కూడా అది గ్రహించి పెత్తనాలు వదిలేసే రోజు వస్తేనే సంసారాలు నిలబడతాయని ఈ కథలో సూచించింది విమల. నండూరి సుందరీ నాగమణి రాసిన ‘జీవిత సహచరి’ (నవ్య, మార్చి 27) భార్యల పట్ల భర్తల వైఖరిలో రావలసిన మార్పును గురించే చెప్తుంది.

సంసారంలో పెత్తనాల కింద నలిగిన స్త్రీల అంతరంగ విషాదాన్ని అంతిమ ఘడియలలో ఉన్న మంచం పట్టిన ఒక వృద్ధ స్త్రీ కోణం నుండి వినిపించిన కథ సప్తవర్ణ సమ్మిశ్రితం. తనలో తాను మాట్లాడుకునే మాటల ద్వారా, తన పనులు చూసే స్వర్ణతో చేసే సంభాషణల ద్వారా ఆ ముసలమ్మ అంతరంగం అంచెలంచెలుగా ఆవిష్కృతమవుతుంది ఈ కథలో.

లోకం దృష్టిలో ఆమెది సార్థక జీవితం. పదిహేనో ఏట పెళ్ళయి కాపురానికి వచ్చి అత్తమామల నీడలో ఒద్దికగా కాపురం చేసి ఇద్దరు బిడ్డల తల్లి అయి వాళ్ళనూ ప్రయోజకులను చేసి అత్తమామలకు బాధ్యతతో మరణించే వరకు సేవలు చేసి, భర్త మరణానంతరం బాధ్యతగా చూసుకునే కొడుకు దగ్గరో, కూతురు దగ్గరో కాలం గడుపుతున్న స్త్రీగా లోకం దృష్టిలో ఆమె అదృష్టవంతురాలే కానీ 85 ఏళ్ళ వయసులో మరేమీ పనిలేకుండా మంచం మీద పడుకున్న ఆమెలో 70 ఏళ్ళ సంసార జీవితంలో కోల్పోయిందేమిటి? పొందినదేమిటి? అనే ప్రశ్న ఉదయించి వేధించింది. చదువు, సంగీతం, స్వేచ్ఛ కోల్పోయినవి. అన్నీ అందరికీ అందించే పని తప్ప స్వతంత్రంగా ఏదీ చెయ్యగల అవకాశం లేదు. నియంత్రణ తప్ప స్నేహం లేదు. పుట్టింట రంగురంగుల పూలమొక్కల మధ్య గడిపిన బాల్యం అదృశ్యమై గచ్చు చేసిన అత్తింటివారి వాకిలి, పెరడు తనలో నింపిన శూన్యంలో గడిచిన సంసారం ఆమెది. ఆ శూన్యంలో ఆమె కార్చిన కన్నీళ్ళెన్నో… దిగమింగిన దుఃఖం ఎంతో…! కళ్ళల్లోనో, ముక్కులోనో నీళ్ళొస్తే గబుక్కున పమిటతో తుడుచుకునే తన అలవాటును అందుకు తనను తిట్టే అత్తగారిని తలచుకొనటం దానికి సాక్ష్యం. తుడుచుకునే వ్యవధి కూడా లేనప్పుడు ఆ కన్నీళ్ళు కళ్ళల్లోనే ఇంకిన అనుభవాలు కూడా ఆమెకు ఉన్నాయి.

ఆ శూన్యాన్ని పూరించుకొంటూ సర్దుబాటు చేసుకొంటూ సంసారంలో ఒదిగిపోవడానికి దొరికిన ఒకే ఒక అవకాశం చీరెలు కొనుక్కోవడానికి అత్తారింటివారిచ్చిన స్వేచ్ఛ. పువ్వుల రంగులపై ప్రేమను చీరెల రంగుల మీదికి మళ్ళించుకొనడం దాని పరిణామమే. ఆడవాళ్ళకి చీరెల పిచ్చి అని తరచు సరదాగా అంటున్నట్లో, సాధిస్తున్నట్లో మగవాళ్ళు చేసే వ్యాఖ్యానాలకు ఇదొక జవాబు, సవాలు కూడా.

తన చీరెల పిచ్చి రహస్యం ఇన్నాళ్ళు కడుపులో మోసిన ఆ ముసలమ్మ దానిని ఎవరి ముందు బయటపెట్టింది? తన సేవల కోసం జీతానికి నియమించబడిన పనిపిల్ల ముందు. తన ఆలోచనలు, ఇష్టాలు అణచివేయబడుతున్నప్పటి అంతరంగపు ఆక్రోశాన్ని విన్నవాళ్ళు పిల్లలతో సహా ఆమె ఇంట్లో ఎవరూ లేరు. అందరికీ తానే చేస్తూ ఒంటరిగా మిగిలే ఆడవాళ్ళు సంసారంలో ఉంటూనే దానిని పరాయిగా బ్రతికే పరిస్థితిలోని విషాదాన్ని చిత్రించింది ఈ కథ. వినేందుకు ఆ పనిపిల్ల కూడా లేకపోతే అది ఆమెతోపాటు అందరికీ రహస్యమే.

ఎగువ మధ్యతరగతికి చెందిన వయసు మళ్ళిన స్త్రీకి సమాంతరంగా శ్రామిక వర్గానికి చెందిన నవయవ్వనంలోకి అడుగుపెడుతున్న స్త్రీని, ఆమె ఆలోచనల అనుభవాల కోణాన్ని చూపటం ‘సప్తవర్ణ సమ్మిశ్రితం’ కథలోని ప్రత్యేకత. పొలం పనులకు కూలికి పోయే అమ్మాయిని ఐదువేల నీడపట్టు ఉద్యోగానికి తరిమిన కట్నాలు, సౌందర్య సాధక వస్తు వినిమయ మోహం మొదలైన సామ్రాజ్యవాద సంస్కృతి ప్రభావాలను వ్యక్తిగత సేవలకు అవసరాలలో ఉన్న అమ్మాయిలకు శిక్షణ యిచ్చి పంపే దళారీ సంస్థల దోపిడీని ఏకకాలంలో కథాంశం నుండి విడదీయరాని భాగంగా ప్రదర్శించింది ఈ కథ. స్వర్ణ, సునీత లాంటి అమ్మాయిలకు పరాయి ఇంట్లో పనిభారం, పని స్వభావం, ఒంటరితనం భరించరానివైనప్పుడు, తమను పనికి కుదిర్చేటప్పుడు యజమానులతో మాట్లాడిన జీతంలో సగం తామే కొట్టేస్తున్న దళారుల దోపిడీ అర్థమైనప్పుడు – ఈ పని ఇక వద్దు అని వెళ్ళిపోయే స్వేచ్ఛ, పొలం పని చేసుకునే అవకాశం

ఉన్నాయి కానీ సంసారంలో పీడన, దోపిడి అర్థమవుతున్నా ఆ వెసులుబాటు స్త్రీలకు లేకపోవడాన్ని ఈ కథలో సూచించింది సత్యవతి.

మధ్యతరగతి స్త్రీలలో వున్న మిధ్యా పరువు ప్రతిష్టల భయం, పిల్లల భవిష్యత్తు అనే అదృశ్య లక్ష్మణరేఖ భర్తలు చేసే పెత్తనాలను, అవమానాలను భరిస్తూ ఆ హింసామయ సంసారాలకే అలవాటుపడిపోయి నిత్య ఆందోళనల మధ్య జీవితం గడిపే స్థితికి తీసుకువస్తాయి. కవిని ఆలూరి రాసిన ముగింపు మాటలా… (భూమిక, ఏప్రిల్‌), విషవలయం (భూమిక, సెప్టెంబరు) కథలు ఆ కోవకే చెందుతాయి. మావయ్య వస్తాడంట… మనసిచ్చి పోతాడంట… అనే సినిమా పాటను ఉపయోగించుకుంటూ దాంపత్య సంబంధాలలోని హింసను ఆ హింసకు బలవుతూ బతుకీడ్చుతున్న భార్యకోణం నుండి చిత్రిస్తూ సాయిపద్మ రాసిన కథ ”మావయ్య వస్తాడంట” (ఆంధ్రజ్యోతి, ఆదివారం, ఆగస్టు 4). ఆడబ్రతుకే మధురం అన్న పాట రేడియోలో వస్తుండగా ఆడబ్రతుకులోని చేదును పది పన్నెండేళ్ళ అమ్మాయి కోణం నుండి విప్పి చెప్పిన కుటుంబరావు కథను గుర్తుకు తెస్తుందీ కథ. రమాసుందరి బత్తుల రాసిన ‘మనిద్దరమే కలిసి ఉందాం అమ్మా’ (ఆంధ్రజ్యోతి, ఆదివారం, సెప్టెంబరు 1) అనే కథ కూడా దాంపత్య సంబంధాలలోని హింసను చిత్రించేదే. సాయిపద్మ కథలో అది భార్య శరీరంతో, మనసుతో పనిలేని శృంగారం, తన విచ్చలవిడి లైంగిక సంబంధాలతో ఆమె శరీరాన్ని రోగాలపుట్ట చేసి బాధించటం. అయితే రమాసుందరి కథలో అది భార్య శరీరాన్ని, మనసును లెక్కచేయనితనం, అనుమానపు భూతం, ఇంటా బయటా అవమానాలపాలు చేస్తూ పెట్టే మనసును డొల్ల చేసే హింస. మావయ్య వస్తాడంట కథలో పార్వతి థిక్కారం కూతురికి తనలాగే మేనమామతో పెళ్ళి జరగకుండా ఆపడం. మనిద్దరమే కలిసి ఉందాం అనే కథలో స్నేహ సాహచర్యాలకు తావేలేని దాంపత్య సంబంధాలను కాదనుకొనడం.

హింసామయ వైవాహిక జీవితంలో సర్దుబాట్లు చేసుకొని నిలబడిపోవడానికి స్త్రీలకు పుట్టిల్లు ఒక ఆసరా అవుతుందని, భార్యకు పుట్టింటి బలం, అండ ఉన్నాయని అర్థమయినప్పుడు మొగుడి పెత్తనపు ఒత్తిడి కొంత తగ్గుతుందని భావిస్త్తూ వారణాసి నాగలక్ష్మి రాసిన కథ ‘పుట్టిల్లు’ (తెలుగువెలుగు, మార్చి).

స్త్రీలలోని సృజనాత్మక శక్తులను నియంత్రిస్తూ, హరిస్తూ ఉన్న దాంపత్య సంబంధాలలో, సంసారాలలో స్త్రీలు నిరాశా నిస్పృహలకు లోనవుతూనే తన ఆదర్శాలు, తమ ఆకాంక్షలు పిల్లలద్వారా తీర్చుకొనడానికి సిద్ధపడి సంసారాలలో ఒదిగిపోతున్న తీరును తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం ‘వీణమాస్టారు’ (ఆంధ్రభూమి, అక్టోబరు 31) అనే కథలో చిత్రించింది. అరిపిరాల సత్యప్రసాద్‌ కూడా చీకటి కోయిల (సాక్షి, ఫన్‌డే, సెప్టెంబర్‌ 8) కథలో భర్తల పెత్తనాల కింద అణచివేతకు గురవుతూ సృజన శక్తులు చంపుకొని కాపురాలు నిలబెట్టుకుంటున్న స్త్రీల జీవిత విషాదాన్నే చిత్రించాడు. కూడూరి సుమన మాత్రం అందుకు భిన్నంగా స్నేహితురాలి సలహా మీద తాను చనిపోయినట్లు పేపరు ప్రకటన ఇచ్చి తన సంగీత రచనాసక్తులను అవమానించి అణచివేయడానికి ప్రయత్నిస్తున్న భర్తను దోషిగా బోనులో నిలబెట్టి బుద్ధిచెప్పిన భార్యను ఊహించింది ‘శ్రద్ధాంజలి’ కథలో (నెలవంక, నెమలీక, శ్రావణం).

స్త్రీ శరీరం తమ అనుభవానికి, సౌఖ్యానికి, తన వంశాన్ని నిలబెట్టే పిల్లలను కనడానికి మాత్రమే అనుకునే పురుషాహంకార అధికార కుటుంబ వ్యవస్థలో దాంపత్య సంబంధాలు, మాతృత్వం స్త్రీ పాలిట పరమ హింసారూపాలే. వీటిని కథా వస్తువుగా చేసుకొన్నారు గీతాంజలి, కొండేపూడి నిర్మల. సౌష్టవమైన వక్షోజాలు లేని భార్యతో లైంగిక జీవితం సంతృప్తికరంగా, సౌఖ్యంగా లేదనుకొన్న భర్త కృత్రిమ వక్షోజాలు అమర్చుకునే ఆపరేషన్‌కు ఆమెను ఒత్తిడి పెట్టడం, దానివల్ల శరీరంలో వచ్చిన దుష్పరిణామాలు ప్రాణాంతకంగా మారుతుంటే ఆ స్త్రీ పడిన ఆవేదన ‘శిలకాని శిల’ (విహంగ, సెప్టెంబర్‌) కథలోని ఇతివృత్తం. నియంత్రణ, ఆధిపత్యం, హింస స్త్రీలలో సహజ లైంగిక స్పందనలను చంపేస్తున్న దశలో వచ్చే సమస్యల గురించిన కథలు నింఫోమేనియా, ఫ్రిజిడ్‌ (విహంగ, ఆక్టోబర్‌ డ నవంబరు సంచికలు), హజ్బెండ్‌ స్టిచ్‌ (అరుణతార, మే).

తొలిచూలు బిడ్డ మగబిడ్డ కాకపోతే చంపేసే సంప్రదాయం వున్న బీహారులో కన్నతల్లి కడుపు శోకాన్ని, తెగింపును చిత్రిస్తూ కొండేపూడి నిర్మల రాసిన కథ ‘సారీఘర్‌ (పురిటిగది) (విహంగ, జనవరి), కుప్పిలి పద్మ రాసిన ‘మాన్వి’ కథ (నవ్య, ఫిబ్రవరి 27) ఈ కోవలోనే. సంసారంలో స్త్రీ జీవిత అస్తిత్వం గర్భం రావడంపైన, పిల్లలు పుట్టడంపైన ఆధారపడిన పరిస్థితిపై నిశిత పరిశీలన, విమర్శ ఈ కథ. పెళ్ళయి ఉద్యోగ జీవితాన్ని వదులుకోలేక విదేశాలలో ఉన్న భర్త దగ్గరకు కాపురానికి పోవడానికి వాయిదా కోరిన ఆధునిక యువతికి ఎదురైన ఇద్దరు స్త్రీల అనుభవాలు ఈ కథలో ఉన్నాయి. పిల్లలు లేని కారణంగా అత్తగారు కొడుకుకు రెండో పెళ్ళి చేద్దామనుకున్నప్పుడు, ఆ సంసారాన్ని నిలబెట్టుకోవడానికి కృత్రిమ గర్భధారణ విధానాలకు తన శరీరాన్ని ప్రయోగశాలను చేయడానికే కాదు అందుకు కావలసిన డబ్బు కూడా సంపాదించాల్సిన బాధ్యత తనదే కాగా ఆ క్రమంలో జరిగిన ఒక ప్రమాదం కారణంగా భర్తచేత అనుమానించబడి తిరస్కరించబడిన స్త్రీ ఒకరు. పిల్లలు లేరన్న కారణంగా తనను వదిలేసి రెండవ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న మొగుడితో కాపురానికి, తగువుకు దిగిన మరొకరు. పిల్లలు కావాలనుకొనే భర్తను, పిల్లలే ముఖ్యమనుకునే భర్తను కాదనుకోలేకపోవడం ఎందుచేత అన్నది మాన్వి ప్రశ్న. ఎలాగో ఒకలాగా పిల్లలను కనాలనుకోవడమే స్త్రీల లక్ష్యంగా చేయబడుతున్న వ్యవస్థ పట్ల కోపం… భార్యాభర్తల సంబంధాలు సహజీవనం కోసం – పిల్లలు దాని ఫలం. కానీ పిల్లల కోసమే నిర్బంధ సహజీవనం ఎంత నరకం అన్నది ఆమె ఆలోచన. పిల్లల కోసం, కాపురాల కోసం స్త్రీ ఎన్నింటిని వదులుకోవాలి? ఎంత సహనాన్ని కూడగట్టుకోవాలి – అన్న ఆందోళన ఆమెది.

ఉద్యోగం చాలు, భర్త దగ్గరకు కాపురానికి వెళ్ళు, అతనికి చిరాకు తెప్పించకు అని తల్లి ఒత్తిడి పెట్టినప్పుడు పరిస్థితులతో రాజీపడుతున్నామా అన్న విచికిత్సలో పడుతుంది మాన్వి. మూసుకున్న సమాజం కళ్ళు తెరిపించడానికి నీలా ఆలోచించేవాళ్ళు నీకక్కడ దొరకవచ్చు అని తల్లి ఒక ఆశను కూతురికి ఆసరాగా ఇవ్వడం ఈ కథకు ముగింపు.

స్త్రీల సంసారాలు భర్తల ఆగ్రహానుగ్రహాలమీద ఆధారపడినవి మాత్రమే. అందువల్ల భర్తల అనుగ్రహానికి పాకులాడడమే వాళ్ళ కర్తవ్యం. అప్పుడే వాళ్ళ సంసారాలు చల్లగా ఉంటాయి. భర్తకు ఆగ్రహం కలిగిందా సంసారాలకు వాళ్ళు బహిష్కృతులే. సంసారంలోని చీదరను భరించలేక స్త్రీ తానంతట తాను సంసారాన్ని వదిలిరావడం చాలా అరుదు. అలా వచ్చిన సందర్భాలలో కూడా వాళ్ళను తిరిగి సంసారంలోకి నెట్టి, కుదించే కౌటుంబిక సామాజిక ఒత్తిడులు అనేకం ఉంటాయి. జి.లక్ష్మి రాసిన రెండు గదులు (చినుకు, నవంబర్‌) కథ అటువంటి పరిస్థితిని చిత్రించిన కథ. నిర్బంధ సంసారం వదిలి బయటకు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ తమ ఇంట్లోని రెండు గదులలో అద్దెకుండి ధీమాగా గడిపిన అమ్మాయి ఏ కారణాల వల్లనో అద్దె ఇల్లు వదిలి భర్తతో సంసారానికి సిద్ధపడినప్పుడు ఆ ఇంటి యజమానురాలు చేసిన ఆలోచనల సారం ఈ కథాంశం. ”ఒకసారి సంసారాలు వదిలితే ఉండే స్వేచ్ఛా స్వాతంత్య్రాల వికాసం అనుభవంలోకి వచ్చాక మళ్ళీ సంసారంలో కూరుకుపొమ్మనే లోకపు ఒత్తిడులకు లొంగినపుడు జీవితం ఎంత నరకప్రాయం అవుతుంది” అన్నది ఆమె వేదన.

సంసారాలు నరకప్రాయంగా ఉన్నాయి కనుకనే కుటుంబం కూడా ఒక జైలే అంటుంది బి.అనురాధ. రాజకీయ కారణాల వలన, విశ్వాసాల వలన జైలుకు వెళ్ళిన అనురాధ సహ మహిళా ఖైదీల అనుభవాలను కథలుగా రాసింది. అటువంటి కథలలో ఏది జైలు (ఆంధ్రజ్యోతి, డిసెంబర్‌ 29) ఒకటి. బీహార్‌లోని సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబపు పెద్ద కోడలు సునీత అనుభవం అందులో ప్రధానం. తోడికోడలి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా జైలుపాలయిన స్త్రీ ఆమె.

చక్కగా పాడగలిగిన స్వరమాధుర్యం ఉండి కూడా స్వేచ్ఛగా పాడలేకపోతున్న బెరుకు ఏదో ఆమె గొంతులో గిరికీలు కొట్టడాన్ని కథకురాలు గుర్తించటం దగ్గర ప్రారంభించి ఈ కథలో స్త్రీ సమస్య విచ్చుకొంటుంది. స్వేచ్ఛకు శత్రువు భయం. ఆ భయం ఆడవాళ్ళకు మప్పబడుతుంది. అత్తగారింటి అధికార వ్యవస్థలో, మామగారి నియంత్రణలో గట్టిగా నడవరాదు, నవ్వరాదు, మాట్లాడరాదు, పాడరాదు, మేలిముసుగు జారనీయరాదు – వంటి సవాలక్ష నిషేధాల మధ్య భయంతో ముకుళించుకొనడం ఆడవాళ్ళ జీవలక్షణం అవుతుంది. ఎవరైనా వింటే ఏమనుకొంటారో అన్న భయం రక్తంలో భాగమై ఒంట్లో ప్రవహించేంత శిక్షణ స్త్రీలకు ఇవ్వబడుతుంది. ఆ క్రమంలోనే సునీత స్వేచ్ఛగా పాడలేకపోతుంది. ‘ఇంటికీ, జైలుకూ తేడా లేదు. ఇంట్లో పిల్లలు, ఆయనా ఉంటారని తప్ప రెండూ జైళ్ళే’ అన్న ఎరుక సునీతకు జైలుకు వచ్చాకే కలిగి ఉంటుంది. ఆ విషయమే కథకురాలికి చెప్పింది. కుటుంబంలో మంచి తిండి, చక్కని వసతి సౌకర్యాలు, చీరెలు, నగలు అన్నీ దొరకవచ్చు, కానీ జైలులో లేనట్లే కుటుంబంలోనూ స్త్రీలకు స్వేచ్ఛలేదు – అని ఈ కథ స్పష్టం చేస్తుంది. జైలు నుండి ఖైదీలు విముక్తి కోరుకొన్నట్లే స్త్రీలు కూడా ఇంటి జైలు నుండి విముక్తిని ఆశిస్తారు. అది సాధించడం ఎలాగో తెలియక చాలాసార్లు చాలామంది దానిలో ఒదిగిపోతారు. కానీ సునీతలాంటి వాళ్ళు తమ అవగాహన మేరకు, తమకున్న పరిధులలో దానిని చక్కదిద్దుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తారు. మామగారి పెత్తనం నుండి, పెద్ద కోడలిగా మోయవలసిన కుటుంబ పరువు ప్రతిష్టల బరువు నుండి విముక్తికి అప్పటికి ఆమెకు ఉన్న మార్గం భర్తతో విడి కాపురం పెట్టడమే. అది ఆమె సాధించగలిగింది. అది అక్కడికి ఒక విజయం కావచ్చు. కానీ స్వేచ్ఛను స్వాతంత్య్రాన్ని నిలుపుకోవాలంటే చేయాల్సిన యుద్ధాలు అనేకం, అనంతం.

అమ్మా బయలెల్లినాదే కథ (నవ్య, మే 29)లో సమ్మెట ఉమాదేవి అత్తింట ఆరళ్ళను ఎదుర్కోవడానికి అమ్మవారు పూనినట్లు నటించడాన్ని ఆయుధంగా చేసుకొన్న కోడలిని చూపించింది. మగవాళ్ళ అహంకార ఆధిక్య స్వభావం తెలిసిన స్త్రీలు, తమ చైతన్యంతో, చొరవతో సంసారంలో సంస్కరణ కార్యక్రమాలకు పూనుకొంటారు. అమ్మమ్మ మాట బంగారు బాట కథలో (స్వర్ణ వేణుగోపాల్‌, ఆంధ్రభూమి, అక్టోబర్‌ 24) కొడుకు పురుషాహంకారాన్ని తొలగించి కోడల్ని ప్రేమగా, గౌరవంగా చూసుకునేలా చేయాలని తపన పడిన ఒక తల్లిని, తన తల్లి సహాయంతో ఆమె సాధించిన విజయాన్ని చూస్తాం. స్త్రీకి స్త్రీ శత్రువు కాదని నిరూపించిన తల్లి కూడా ఆమె. అలాగే అసలు అత్తాకోడళ్ళ సంబంధాలలోని వైరుధ్యాలకు కారణం అత్తా కోడళ్ళు కాదు, మగవాళ్ళే అన్న అవగాహన కనబరుస్తూ ఆడవాళ్ళకున్న సహనం, అర్థం చేసుకునే లక్షణం మగవాళ్ళకుంటే కుటుంబాలు వీడిపోవు అని హెచ్చరించి చెప్పిన కథ ‘ఎంతెంత దూరం’ (స్పందన, విహంగ, జనవరి).

సంసారాలను నిలబెట్టడంలో సహనానికి ఉన్న పాత్రను చర్చిస్తూ కవనశర్మ రాసిన కథ ‘సహనానికి సరిహదు’్ద (ఆంధ్రజ్యోతి, ఆదివారం, సెప్టెంబరు 15). రామాయణ కథ రామాయణంలో సీత పాత్రకు వ్యాఖ్యానంగా సత్యశారద రాసిన ూఱ్‌aఃర శీజ్‌ూఱశీఅర గీతం – ప్రాతిపదికలుగా చేసి స్త్రీ సంసారంలో సర్దుకోవడం, సంసారం నుండి విముక్తి కోరుకోవడం అనే రెండు వైరుధ్యాల మధ్య నడిపిన కథ ఇది. సంసారాలు నిలబడడానికి కారణం ఆడవాళ్ళ సహనమే. సహనానికి సరిహద్దు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొనేదే. ఒక స్త్రీ తన భర్తకు పరాయి స్త్రీతో సంబంధం ఉందని తెలిసి కూడా సంసారం ఎందుకు వదలెయ్యలేదు – అంటే ఆర్థిక భద్రత, సామాజిక గౌరవాల కోసం. ఆర్థిక భద్రత, తనదైన సామాజిక గుర్తింపు ఉన్న స్త్రీకి ఆ అవసరం లేకపోవచ్చు. ఈ కథలో తల్లి సహనం కూడదీసుకుని సంసారంలో ఇమిడి పోవడానికి, కూతురు నచ్చని భర్తను ఒదిలేసి పెళ్ళితో నిమిత్తం లేని సహజీవనం ఏర్పరచుకోవడానికి ఉన్న తేడా అదే. అగ్ని ప్రవేశాన్ని ఆమోదించి శీలాన్ని నిరూపించుకున్న సీత రెండవసారి రాముడు తన శీలాన్ని శంకించి గర్భవతి అని అయినా చూడకుండా అడవులపాలు చేసి చివరికెప్పుడో కుశలవులతో సహా తనను స్వీకరించడానికి సిద్ధమైతే తిరస్కరించి భూమాత ఒడిని ఆశ్రయించిన దానితో పోలిక తీసుకువచ్చి సీత సహనానికి సరిహద్దు మొదటి ఘట్టమే, రెండవ ఘట్టంలో ఆమె సహనం సరిహద్దు దాటింది అని చెప్పి స్త్రీలు వాళ్ళ వాళ్ళ అవసరాలు, ఆలోచనలు, అవకాశాలు మొదలైన వాటిని బట్టి సహనానికి ఎవరి సరిహద్దులు వారు నిర్ణయించుకొంటారని సూచించాడు కవనశర్మ ఈ కథ ద్వారా. సహనానికి సరిహద్దును విస్తరించడాన్ని బట్టి, కుదించడాన్ని బట్టి కాపురాలే కాదు, ఏ రకమైన సంబంధాలైనా నిలబడడమో, కూలిపోవడమో జరుగుతుందని చెప్పిన కథ ఇది.

ఈ క్రమంలో చెప్పుకోవలసిన మరొక కథ అల్లూరి గౌరీలక్ష్మి రాసిన ‘కొత్త పాఠం’ (నవ్య, జూన్‌ 12). ఒక వితంతు స్త్రీ టీచర్‌ ఉద్యోగం చేస్తూ ఒంటరి స్త్రీ ఎదుర్కొనే సమస్య. ఇందులో వస్తువు సహనం, శాంతి అభ్యాసం చేయవలసిన విలువలుగా స్త్రీలకు బోధించే సమాజంలో పురుషులకసలు అవి లక్ష్యపెట్టవలసినవే కాకపోవడం ఒక వైరుధ్యం. స్త్రీల సహనాన్ని, శాంతాన్ని చాతకానితనంగా చులకన చేసి పెత్తనానికి పీడనకు దిగుతారు. ఈ పరిస్థితులలో స్త్రీలు తిరగబడాల్సిందేనన్న కొత్త పాఠాన్ని ఆ ఒంటరి స్త్రీ కొడుకు నుండి నేర్చుకొనడం ‘కొత్త పాఠం’ కథా విషయం.

స్త్రీలు ఒంటరిగా చేయబడడం వెనక ఉండే పితృస్వామిక ద్వంద్వ విలువల రాజకీయాలవైపు ఆలోచింపచేసే కథ విమల రాసిన ”నీలా వాళ్ళమ్మ… మరికొందరు” (నవ్య, జూన్‌ 26) నీలా వాళ్ళమ్మ పద్మ. మరికొందరికి ప్రతినిధి శ్యామల. శ్యామల అంతిమ ఘడియలలో ఉన్నప్పుడు దుఃఖోద్విగ్నంలో ఉన్న నీల అంతరంగపు అలజడిలో కదలిన జ్ఞాపకాల అలల రూపంలో నడుస్తుంది ఈ కథ. పద్మ అయినా, శ్యామల అయినా ప్రేమ, పెళ్ళి, సుఖ సంసార లాలసలోనే తమ పరిచయంలోకి వచ్చిన పురుషులను నమ్మి మనసు, శరీరం ఇచ్చారు. అంతకు ముందే పెళ్ళయి పిల్లలున్న విషయం చెప్పకుండా ఒకడు పద్మను వాడుకుంటే, మరొకడు మరొక అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడి ఉన్న విషయాన్ని మరుగుపరచి శ్యామలను వాడుకొన్నాడు. నాలుగో నెల గర్భంతో కాళ్ళావేళ్ళా పడి వేడుకుంటే పద్మకు దక్కింది రహస్య అనధికార కాపురం. ఉంపుడుగత్తె అన్న లోకనింద. ఉంచుకొన్నవాడు కొట్టినా, కోసినా అడిగే దిక్కులేనితనం. అతని భార్యవైపు వాళ్ళు వచ్చి ఇంటి నుండి బయటకు లాగి కొట్టి కొట్టి చంపితే ఆ శిక్ష ఆమెకు తగిందే అన్నట్లు నిర్లిప్తత వహించిన సమాజం, మనుషులు, చట్టం… ఇక తనను అన్యాయం చేయవద్దు అని వేడుకున్న శ్యామలకు దక్కింది అతని తిరస్కారం. ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలురాలై స్వతంత్రంగా బతకడానికి పెనుగులాడిన స్థితి శ్యామలది. పద్మకు సహాయపడడం, సానుభూతితో ఆమె సమస్యను అర్థం చేసుకొనడం, ఆమె మరణానంతరం కూతురు నీలను దత్తపుత్రికగా స్వీకరించడం, తాను నిలబడుతూ, మరొకరికి ఆసరా కావాలన్న స్పృహనుండి చేసిన పనులే.

భార్య ఉండగా మరొక స్త్రీతో సంబంధం ఏర్పరచుకొన్న రాజేశ్‌ లాంటి వాళ్ళు కానీ, ప్రేమ పేరుతో అవసరాలు తీర్చుకొని పెళ్ళికి తిరస్కరించే డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ లాంటివాళ్ళు కానీ సమాజంలో దోషులు కారు. వాళ్ళచేత వంచితలు, తిరస్కృతులు అయిన స్త్రీలు ఈ సమాజంలో దోషులు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు కూడా వాళ్ళకు ఆసరాగా నిలబడరు. శీలం చెడినవాళ్ళుగా, దోషమంతా మొయ్యాల్సింది, శిక్ష అనుభవించాల్సింది స్త్రీలే. ఈ ద్వంద్వ విలువలవైపు వేలెత్తి చూపడం ఈ కథ లక్ష్యం. స్త్రీల జీవితాలకు పితృస్వామిక సమాజం ఇచ్చిన నిర్వచనాలలోని, నిర్దేశించిన ప్రమాణాలలోని అణచివేత రాజకీయాల గురించి ఎరుకను కలిగించడం దీని ఉద్దేశ్యం. స్త్రీలు తమ జీవితాలను తాము నిర్వచించుకొని, నిర్దేశించుకొని నిలబడగల కొత్త విలువల గురించిన ఆవేదన, ఆకాంక్ష ఇందులో అంతర్గర్భితం.

వంచనకు, మోసానికి అవకాశం ఉంటుంది. కనుకనే ఆడపిల్లలు అసలు ప్రేమ జోలికి వెళ్ళకుండా జాగ్రత్తపడితే బాగుంటుందన్న అభిప్రాయం లోకంలో బలంగానే ఉంది. రెక్కలు (సదానంద్‌ శారద, నవ్య, మార్చి 27), నీకు నీవే రక్ష (మంత్రిప్రగడ స్రవంతి, ఈనాడు, మే 19), ఫేస్‌బుక్‌ (కె.వి.సుమలత, ఆంధ్రభూమి, జూన్‌), అమ్మా నాన్నా… అయామ్‌ సారీ (గోదావరి మురళీమోహన్‌, ఆగస్టు 29), సశేషం (డి.కామేశ్వరి, ఆగస్టు 8), అడుసు తొక్కనేల (సలీం, విపుల, అక్టోబర్‌) వంటి కథలు ఈ అభిప్రాయాన్నే రకరకాల జీవిత సందర్భాల నుండి ప్రతిఫలించాయి. ఆడపిల్లల పట్ల గౌరవంగా, బాధ్యతగా ప్రవర్తించే సమదృష్టిని మగపిల్లలలో పెంచడానికి పెంపకం నుండే రావాల్సిన మార్పును ఆశించిన ‘మొదటి అడుగు’ కథ (సలీం, ఆంధ్రభూమి, సెప్టెంబర్‌ 5) వీటికంటే భిన్నమైనది. అలాగే మగపిల్లల వంచనకు గురయిన ఆడపిల్లలు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి కావలసిన ధైర్యం కుటుంబం నుండి రావాలని చెప్పిన ‘నాన్నగారు’ కథ (పొన్నాడ విజయకుమార్‌, నవ్య, మార్చి 20) చెప్పుకోదగింది. ఇలాంటి కథలు వెలిగించిన ఆశాదీపాన్ని ఆరిపోకుండా ఇంధనం సమకూర్చవలసిన వాళ్ళు కథకులే.

ఆడవాళ్ళను లైంగిక వస్తువులుగా తప్ప చూడలేని దుష్టతనం, ఆడవాళ్ళపై అత్యాచారాల వికృత రూపాన్ని తీసుకొంటున్న సందర్బాలు ఎక్కువవుతున్న కాలంలో ప్రసవించిన కథలు ఈ సంవత్సరంలోనూ ఉన్నాయి. కచ్చెరకోట కమల రాసిన ఆడపిల్ల కథ (ఈనాడు, ఆగస్టు 25)లో ఎదుగుతున్న ఆడపిల్ల పట్ల ఇంట్లోని దగ్గర మగ బంధువుల నుండి వచ్చే పైకి చెప్పలేని ఒక లైంగిక వేధింపు ఆడపిల్లల్లో కలిగించే ఆందోళన, భయం కథా వస్తువైంది. మూడేళ్ళ వయసు నుండి తనను పెంచిన బావ స్పర్శలో, చూపులో, ప్రవర్తనలో తను పెద్దదయిన తర్వాత వచ్చిన మార్పు గ్రహింపుకు వస్తూ ఆందోళన పడుతున్న అమ్మాయి అక్కకు ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక తండ్రిని వచ్చి తీసుకువెళ్ళమని కోరుతుంది. ఎందుకు నాన్నా తీసుకువెళతావు అని పెద్ద కూతురు అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం అప్పుడు పసిపిల్లను నీ వెంట పంపాను, ఇప్పుడది ‘ఆడపిల్ల’ అని నొక్కి చెప్పడం ఈ కథకు ముగింపు.

కుప్పిలి పద్మ రాసిన టి.జంక్షన్‌ కథ (సాక్షి, ఫన్‌డే, సెప్టెంబర్‌ 1) ఒంటరి ఆడది కనిపిస్తే మగవాళ్ళ దృష్టి, ఆలోచన ఎంత లేకిగా ఉంటాయో చూపింది. రాత్రిపూట రోడ్డుమీద ఆడది కనిపించిందంటే తమ హక్కు భుక్తాలకేనన్న నీచస్థాయిలో ఉన్న మగ ప్రబుద్ధులకు చురక ఈ కథ. విజయవాడలో హాస్టల్‌లో ఆయేషా మీద జరిగిన అత్యాచారం, హత్య దాని పరిణామాలను విమర్శకు పెడుతున్నట్లుగా విడుదల సాంబశివరావు అంతులేని క(వ్య)థ (భూమిక, సెప్టెంబర్‌) రాశాడు. అమ్మాయిల మీద జరిగే యాసిడ్‌ దాడి సందర్భం నుండి ప్రేమలు, వైఫల్యాలు, ఆడపిల్లల మీద పడే బరువు బాధ్యతలు, వాటి పరిణామాలను ఒక జర్నలిస్టు అనుభవకోణం నుండి చిత్రించిన కథ మామూలు మనుషులు (సాయి బ్రహ్మానంద గొర్తి, పాలపిట్ట, జనవరి).

బడులలో ఆడపిల్లల పట్ల మగ అధ్యాపకుల అపసవ్య ప్రవర్తనను ఎత్తి చూపి, అది ఆడపిల్లలను బడికి రాకుండా చేస్తున్న ఒక ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తూ బాధిత విద్యార్థినులే ఒక్కటై అలాంటి గురువులకు బుద్ధి చెప్పాలని బోధించిన కథ నిప్పుతో చెలగాటం (మొలకలపల్లి కోటేశ్వరరావు, నవ్య, ఆగస్టు 7). స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించిన మధ్యతరగతి మొనాటనస్‌ ప్రతిస్పందనలకి, బాధితులనే బాధ్యులుగా చూపే పురుషానుకూల భావజాల ధోరణికి సమాధానంగా వచ్చిన చక్కని కథ శ్రీ ఉదయిని రాసిన పగిలినది అద్దం కాదు (ఆంధ్రభూమి, మే 9). ఒక లంబాడీ స్త్రీ మీద జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన నిజనిర్థారణ కమిటీ సభ్యుడిగా కథకుడు పొందిన అనుభవం నుండి వచ్చిన కథ ‘చివరి వాక్యం’ (భూమిక, మే). ఊరి పెద్దలు, రాజకీయ నాయకులు, పోలీసులు, చట్టాలు, కోర్టులు… ఎవరూ ఏవీ స్త్రీల కొరకు లేరన్న వాస్తవం కథకుడిని అలజడికి గురిచేస్తాయి. ఆమె సమూహంలో కలిసి, ఆమె కోసం సమూహం నిలబడి నినాదాలిస్తున్నప్పుడు అన్యాయం మీద తిరుగుబాటు ప్రకటించినప్పుడు అది చూచిన కథకుడికి ఒక ఊరట లభించడం ఇందులో విషయం. స్త్రీ సమస్యకు పరిష్కారం సమిష్టి పోరాటాలలోనే ఉన్నదన్న ఉదయమిత్ర అంతరంగాన్ని ఆవిష్కరించిన కథ ఇది.

ఒంటరిదైపోయి శరీరం అమ్ముకోవడం అనివార్యమైన జీవనపోరాటంలో స్త్రీల మనసు లోపలి అగాధాలను, మానవ ఔన్నత్యాన్ని ఏకకాలంలో చూపిన రెండు కథలు ‘నక్షత్రదేవి (అరుణ పప్పు, నవ్య, మే 15), ‘రామేశ్వరం కాకులు’ (తల్లావజ్జల పతంజలి శాస్త్రి, ఆంధ్రజ్యోతి, డిసెంబరు). ఆర్థిక అవసరాలు పంచుకునే బాధ్యత వహించలేని తాగుబోతు భర్తతో సంసారం సాగించలేక పిల్లలతో పట్నాలు చేరి, శ్రమను అమ్ముకొనే అవకాశాలు తక్కువ కావడం వలనో, శ్రమను అమ్ముకొంటే వచ్చేది బతకడానికి చాలదని అర్థం కావడంవల్లనో తమ శరీరాన్నే పెట్టుబడిగా మార్చే దశకు వచ్చే స్త్రీలకు ప్రతినిధి నక్షత్రదేవి. లోకం దృష్టిలో వాళ్ళు హీనులు. కానీ తమను ఆ స్థితికి తెచ్చిన లోకం, తమ చుట్టూ చాటుమాటుగా తిరిగే లోకం వాళ్ళ దృష్టిలో అంతకన్నా హీనమైనదే. సూర్యుళ్ళను నరికి చంద్రుళ్ళను ఆకాశంలో నిలిపి నక్షత్రాలను తలలో పువ్వులుగా ధరించేంత ఎత్తులో తామున్నామన్న ఆత్మగౌరవ చైతన్యమే వాళ్ళ అసలు సౌందర్యమని చెప్పిన కథ నక్షత్రదేవి. స్నేహం, ప్రేమ వంచనకు మారు రూపాలైనప్పుడు స్త్రీలు అత్యాచారానికి గురికావడమే కాదు, ఆదరించి ధైర్యమియ్యగల సామాజిక కౌటుంబిక సంస్కృతి లేకపోవడం వల్ల చెయ్యని దోషానికి శిక్ష తామే విధించుకొన్నట్లు పారిపోవడం, బతకడానికి శరీరం అమ్ముకోవలసి రావటం తరచు జరిగేదే. ‘రామేశ్వరం కాకులు’ కథలో పద్మ అలాంటిదే. వేశ్యగా బతకడానికి అలవాటు పడ్డ తరుణంలో ఆమెకు ఎదురైన ఒక వ్యక్తి పురుషులలో పుణ్య పురుషులు వేరని తన ప్రవర్తనతో తెలియపరిచాడు. భార్యపట్ల ప్రేమ, భార్య మరణం వల్ల ఏర్పడిన శూన్యాన్ని పూడ్చుకోవడానికి అతడు చేసిన ప్రయాణాలు ఆమె ముందర పరచుకొన్నాయి. ఆడదాన్ని శరీరాన్ని మోహంతోనే కాదు స్నేహంతో మేల్కొల్పవచ్చన్న అనుభవం అతని సన్నిధిలో ఆమె పొందింది. అతను భార్యతో సహజీవనం చేసిన రామేశ్వరం ఆమెకు పుణ్యక్షేత్రమైంది. అక్కడకు వెళ్ళాలనుకుంటున్న తరుణంలో పోలీసు రైడింగులో దొరికి స్టేషన్‌కు తరలించబడింది. రామేశ్వరం వెళ్ళాలన్న గాఢమైన కోరికతో అభ్యర్థించిన పద్మ ఎస్సై రెడ్డి మనసు లోపలి పొరలలోని అక్కకు సంబంధించిన జ్ఞాపకాల తుట్టెను కదిపింది. ఆమె రామేశ్వరం పోవడం, సముద్రంలో కలిసిపోవడం – ఈ రెండింటికీ ప్రేరణ స్త్రీలపట్ల ఎక్కడో ప్రేమ, గౌరవం కలిగిన మనిషితనమే. ‘పద్మ’లు ఎప్పుడూ స్వచ్ఛమైనవాళ్ళే. సమాజం సృష్టించిన బురద అంటని మనుషులు ఆ ఎరుక కలిగిన పురుషులు పెరిగేకొద్దీ, మానవ సంస్కారం మొదలవుతుంటుంది.

ఆర్థిక అంతరువులు ఉన్న సమాజంలో స్త్రీలంతా ఒకటే కాదు. పాయిదేర్లతనం కథలో (మార్చి) జూపాక సుభద్ర రెవిన్యూ ఆఫీసులో పనితీరులో అదెట్లా ప్రతిఫలిస్తుందో చెప్తుంది. నక్సలైట్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు పరిహారమివ్వడంలో చూపే తొందర పోలీసు జీపు డ్రైవర్‌ భార్యకు ఇవ్వడంలో చూపకపోవడం సామాజిక, ఆర్థిక స్థాయిలోని

అంతరువుల వల్లనే అన్న అవగాహన ఉన్న రెవిన్యూ ఆఫీసు మహిళా ఉద్యోగి జీపు డ్రైవరు భార్యకు స్నేహ హస్తం అందించడం ఈ కథలోని విషయం. ఉద్యోగినుల సమస్యల పరిష్కారానికి పనిచేసే మహిళా ఉద్యోగుల సంఘాలు తమ ఆఫీసుల చుట్టూ తిరిగి పనులు కాక అవస్థలు పడే స్త్రీల సమస్యల గురించి కూడా పనిచేయాలన్న సూచననిస్తుంది ఈ కథ.

‘బినామి’ కథలో (వాకిలి, మార్చి) మల్లీశ్వరి భూకామందు భార్య అమ్ములత్త వాళ్ళింటో పై పనులు చేసే అయిమావతి ఒకటి కాదనే చెప్తుంది. భూ కామందు, ఆయన భార్య ఆస్తికి హక్కుదారులు. వారి ఆస్తిని కాపాడడానికి తన ప్రమేయం లేకుండానే పేరును అరువిచ్చిన బినామీ అయిమావతి. ఇరవై ఏళ్ళ నుండి ఆ ఇంటికి చేసే చాకిరి, మూడెకరాల భూమి తన పేరుమీద ఉన్నా అందులో పండిన పంటమీద ఏ మాత్రం లేని అనుభవం – ఆమె జీవితం. పొలం తమ పేరుమీద తిరిగి రాయమనే పెదబాబుగారు, పెదబాబు భార్యగారి ఒత్తిడి ఒకవైపు, ఆ పొలం అమ్ముకొని ఊరు విడిచి వెళ్దామని మొగుడు చేసే హఠం ఒకవైపు అడచక్కెరలో పోకచెక్కలా నలిగింది. మొగుడూ తనమీద అధికారే, పెదబాబూ తనమీద అధికారే. బినామి పొలాల రాజకీయాలలో నలిగిపోయిన శ్రామిక మహిళ నిస్సహాయ క్రోధం పూనకం రూపంలో వ్యక్తం కావడం – ఇందులో కథ.

తిట్టిన, తూస్కరించి పారేసిన పెదబాబు, ఆయన భార్య అయిమావతి కాళ్ళముందు నీరు వారబోసి మొక్కడం వారిపై ఆమె సాధించిన విజయం. అది తాత్కాలిక ఉపశమనమే కావచ్చు. కానీ ఒక థిక్కార ప్రకటనే. అహాన్ని సంతృప్తి పరచుకునే చర్యే. నారశూల చేతబట్టి చిందు వేస్తున్న నల్ల మారెమ్మ పూనిన అయిమావతిని బాగుంది కదూ అని తల్లి చెవిలో గుసగుసలాడిన బుజ్జి నోటిని అరచేతితో మూసింది చారుమతి అన్న వాక్యంతో ముగుస్తుంది ఈ కథ.

మొగుడు చనిపోయి రెండెకరాల పొలం చూసుకుంటూ కూతురిని పెంచుకొంటున్న ఒంటరి మహిళ చారుమతి. కూతురు అయిమావతి క్రోధంలోని సౌందర్యాన్ని గుర్తిస్తే ఆ మాటే పైకి వినబడకుండా ఆమె ఆ బిడ్డ నోరు ఎందుకు నొక్కేసింది? నిజానికి తనకూ, తన కూతురికి కూడా చేదోడు వాదోడైన మనిషి అయిమావతి. కానీ ఆమె మధ్యతరగతి సంస్కారం అయిమావతి పక్షాన తాను గానీ, తన బిడ్డ గానీ నిలబడటాన్నైనా ఊహించలేదు. ఆ లోపాన్ని ఎత్తి చూపింది ఆమె చర్య. ఆ రకంగా బినామీ కథ స్త్రీలలో ఎన్ని సామాజిక, ఆర్థిక అంతరువులకు అవకాశం ఉందో ఆలోచించమంటుంది పాఠకులను.

స్త్రీల సమస్యలకు సంబంధించి ప్రస్తావించవలసిన మరి రెండు కథలు శ్రీవల్లీ రాధిక రాసిన సతీ సావిత్రి (నవ్య, జులై 31), కుప్పిలి పద్మ రాసిన ద లాస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌ (చినుకు, నవంబర్‌). సతీసావిత్రి కథ పురుషుడి కోణం నుండి, ద లాస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌ కథ స్త్రీ కోణం నుండి నడుస్తాయి. ఆధునిక స్త్రీలలో విచ్చలవిడితనం, పురుష ద్వేషం, అవకాశవాదం ముప్పేటలుగా పెనవేసుకొని పోయాయని పై మార్పులను బట్టి అనుకొనటం, ప్రత్యేక చట్టాలు, పనిచేసేచోట లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉమెన్‌ సెల్‌లు రూపొందుతున్న వర్తమానం నుండి రాజ్యం స్త్రీలకేదో ప్రాధాన్యత ఇచ్చి తమనుండి వాళ్ళను ప్రత్యేక వ్యక్తులుగా వేరుచేసి చూస్తున్నారని ఉక్రోషపడడం మగవారిలో ఎక్కువైన సందర్భం నుండి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ స్త్రీలను విమర్శించే పురుష వర్గానికి ప్రతినిధిగా ఉన్న యువకుడు అనుభవం మీద తమ ఆలోచనా విధానం ఎంత తప్పో తెలుసుకొనడం సతీ సావిత్రి కథాంశం. అతనా విషయం ఎలా తెలుసుకోగలిగాడు? బస్సు ప్రయాణంలో ఒక వివాదంలో నువ్వేమన్నా సతీ సావిత్రివా అన్న మాట పడిన సహ ప్రయాణీకురాలు – ఆమె తన సహోద్యోగి కూడా దానిని స్వీకరించిన పద్ధతిని బట్టి తెలుసుకోగలిగాడు. నువ్వేమన్నా సతీ సావిత్రివా అని ఎద్దేవా చేసిన స్త్రీకి ఏమ్మా నువ్వు కాదా అని తిరుగు సమాధానం ఇయ్యాల్సింది అని మరొక ప్రయాణీకురాలు ఆమెతో అన్నప్పుడు అలా ఎలా అంటాను, పతివ్రతలంటే ఆమెకు గౌరవం లేదేమో కానీ నాకు ఉంది కదా అంటుంది. పతివ్రతలంటే ఎవరు? అవతలి వారి మంచి చెడులతోనూ, పరిస్థితులతోనూ సంబంధం లేకుండా తాము మాత్రం తమ ధర్మాన్ని పర్ఫెక్ట్‌గా నిర్వర్తించేవారు అని వివరణ కూడా ఇస్తుంది. ఆ వివరణ అతనికి తన ఆలోచనలోని దోషాన్ని తెలుసుకునేలా చేస్తుంది. స్త్రీలను గౌరవిస్తామనుకునేవాళ్ళు – గౌరవించడం ధర్మం అనుకునేవాళ్ళు స్త్రీల వేషధారణనో, కలివిడితనాన్నో, ఎన్నుకొన్న జీవన విధానాన్నో విమర్శించే పని చేయరాదన్నది అతనికి కలిగిన తెలివిడి. ఆ విధంగా ఈ కథ పతివ్రత అనే మాటకు కొత్త నిర్వచనం ఇచ్చి ఆధునిక యుగంలో, గ్లోబల్‌ సంస్కృతిలో సామాజిక రంగాలలోకి అడుగుపెడుతున్న స్త్రీల జీవితాలలో చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో అత్యంత సున్నితంగా చెప్పింది.

సతీ సావిత్రి కథలో చర్చకు వచ్చిన స్త్రీల జీవిత పరిణామాలలో ఒక అంశం – జంకూ గొంకూ లేని స్నేహాలు, స్వేచ్ఛా విహారాలు, ఉద్యోగ జీవితంలో పనులు చక్కబెట్టుకోవడం కోసం ఎంతకయినా తెగించడం, స్త్రీ కోణం నుండి అది అటు ప్రేమలోనూ, ఇటు ఉద్యోగంలోనూ స్త్రీ ఎదుర్కొనే ఒత్తిడి, పనిచేసే చోట మానవ సంబంధాలను నిర్ణయించే శక్తులతో ఘర్షణ. ఆ ప్రవాహంలో పురుషులు కొట్టుకుపోతూనే ఉన్నారు. స్త్రీలు దానిని తట్టుకొని నిలబడడం సాధ్యమా? నిలబడాలనుకోవడం స్త్రీ మీద మరింత ఒత్తిడి కాదా!? ఈ పరిస్థితులలో స్త్రీలు పరిస్థితులతో రాజీపడుతూ, అమాయకత్వాన్ని, ‘పాతివ్రత్యాన్ని’ వదులుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకుని అధికారాన్ని అలవరచుకోవడం సంభవం కాకుండా ఉంటుందా? అన్న ప్రశ్నలతో కుప్పిలి పద్మ రాసిన కథ ‘లాస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌’. నష్టాన్ని గురించిన బాధ, ఆరోపణ ఏమీ లేకుండా ఒక స్థితిని చిత్రించి చూపింది పద్మ ఈ కథలో. ఆధునిక స్త్రీ ఎంత సంఘర్షణాత్మక జీవనయానంలో ఉందో చూపిస్తుందీ కథ.

స్త్రీల జీవితంలో హింస ఎంత చెప్పుకున్నా ఒడవని ముచ్చటే. అయినా దళిత ముస్లిం మహిళలకు ప్రత్యేకమైన సామాజిక, కౌటుంబిక మత హింసా కోణాల నుండి రావలసిన కథలు ఇంకా రానేలేదు. ఆదివాసీ స్త్రీలు ఎదుర్కొంటున్న హింస, అణచివేతల గురించిన కథలు కూడా రాయవలసి ఉంది. ఈ అన్నింటి నుండి నిర్మాణమవుతున్న మహిళా ఉద్యమ సూత్రాన్ని అందిపుచ్చుకున్నాం. కథలు కూడా కావాలిప్పుడు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.