ఆ రోజుల్లో ఆడవాళ్ళు సినిమాల్లోకి వచ్చేవాళ్ళు కారు. చాలా చిన్న ఫ్యామిలీస్‌లోని ఆడవాళ్ళు అదీ డ్రామాల్లో పనిచేసే వాల్ళు సినిమాల్లోకి వచ్చేవాళ్ళు. మంచి ఫ్యామిలీనుంచైతే అసలు రారు. నేను ఎపుడూ స్టేజి మీద నటించలేదు. 1934లో అంటే నా నాలుగో ఏట నుండి కపిలవాయి రామనాథశాస్త్రి గారి పాటలు అవీ వినేదాన్ని. ఇంట్లో గ్రామ్‌ఫోన్ ఉండేది. పాటలు పెట్టుకుని విని, వెంటనే వాటిని పాడుతుండేదాన్ని. అట్లా పాడటం కూడా మా ఇంట్లో ఎవరికి రాదు. నేను సంగీతం నేర్చుకోలేదు. వేరే వాళ్ళు పాడే పాటలు విని పాడేదాన్ని. వాళ్ళని అనుకరించేదాన్ని. నేనలా పాడుతున్నపుడు మా నాన్న విని తన ఫ్రెండ్ కొప్పవరపు సుబ్బారావు గారని హెచ్.ఎం.వి రికార్డింగ్ మానేజరు, ఆయన నా పాట గురించి అడిగితే గ్రామ్‌ఫోన్‌లో విని అనుకరించి పాడతానని చెప్పారట. ఆయన నన్ను తీసుకురమ్మని చెప్పి నాతో హార్మోనియం మీద పాట పాడించారు. ఓగిరాల రామచంద్రరావుగారు ఆ రోజు హార్మోనియం వాయించారు. సుబ్బరంగా శృతిలోనే పాడాను. హెచ్‌ఏమ్‌వి వాళ్ళు రికార్డు చేసుకున్నారు.
అప్పట్లో సెట్స్ వచ్చేవి. భక్త కుచేల, భక్త ప్రహ్లాద రెండు సెట్స్ తీసారు. భక్త ప్రహ్లాదుడుగా నన్నెత్తుకుని మరీ పాడించారు. ఎందుకంటే నాకు మైక్ అందదు. కుచేల పిక్చర్‌లో కూడా నాలుగు లైన్లు పాడాను. చాలా ధైర్యంగా పాడానని మెచ్చుకుని ఒక సోలో పాట రికార్డు చేసారు. ఆ వయస్సులో సోలో పాడిన వాళ్ళు తెలుగులో ఎవరూ లేరు. ఫస్ట్ రికార్డు వాళ్ళు నాతో పాడించారు. ఈ పాట పాడింతర్వాత సి.పుల్లయ్యగారు కిడ్డీస్ పిక్చర్ ఒకటి ప్రోడ్యూస్ చేసారు. పదమూడేళ్ళ లోపు వారితో సతీ అనసూయ 1936లో వచ్చింది. నా పాట మాత్రం 1935లో రికార్డు అయ్యింది. నన్ను అదే సంవత్సరం కలకత్తా తీసుకెళ్ళిపోయారు. ఆ పిక్చర్‌లో గంగగా నటించాను. చిన్న పిల్లనపుడు. బోలెడంత మేకప్ చేసేవారు. చీరకట్టి, కిరీటాలు పెట్టి అంతా సిద్దం చేశాక నేను అర్జంట్‌గా బాత్‌రూమ్‌కు పోవాలని గొడవ చేసేదాన్ని. అన్నీ విప్పి మళ్ళీ కట్టేవారు. అపుడే ఆకుల నరసింహారావు గారని చాలా పెద్ద సింగర్ ఆయన. ఆయన ట్యూన్ చేసి పాట రికార్డు చేయించారు. నాకు అందరి పాటలు వచ్చేసివి. వాళ్ళు పాడుతుంటే గ్రాస్ప్ చేసి పాడేసేదాన్ని. కాని ఒకళ్ళు నేర్పితే చస్తే నేర్చుకునేదాన్ని కాదు. బాగా పాడతానని మెచ్చుకునేవారు. షూటింగ్‌కెళితే అక్కడ స్టూడియోలో కె.ఎల్. సైగల్, కె.సి.డే, పహారీ సన్వాల్ వీళ్ళంతా కలకత్తా వాళ్ళు కదా! ఒకరు ఇటు, ఒకరు అటు స్టూడియోల్లో పరగెత్తుతుండే వాళ్ళం. ఆడుకునేవాళ్ళం. మాకెవరికి పిక్చర్ తెలీదు. అందర్లోకి చిన్న నేను కదా. నువ్వు పాడతావా అని వొళ్ళొ కూర్చో బెట్టుకున్నాడు. గానా గావో అనగానే నా పాట పాడేసాను. ఎంత ధైర్యం నీకు అని అందరు మెచ్చుకుని నాకు రసగుల్లాలు పెట్టే వాళ్ళు.
అదే టైములో పక్క ఫ్లోర్‌లలో కె. సుబ్రహ్మణ్యంగారి తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆయన నన్ను చూసి ఎవరీ తెలుగు పిల్ల ఇంత హుషారుగా ఉంది. ఇంత బాగా చేస్తుందని అడిగి నన్ను పిలిచి తమిళ్ తెలుసా అని అడిగారు. మద్రాసు మాటిమాటికి వస్తా ఉంటాను కదా! మా తాతగారున్నారు. గుంటూరు నించి అక్కడికి వచ్చేదాన్ని. తమిళం తెలుసు అన్నాను. అప్పటికి నేను రెండో క్లాసు చదువుతున్నాను సెయింట్ జోసఫ్ స్కూల్‌లో. ఈ మధ్య మా స్కూల్ వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. నేను అన్ని సంవత్సరాల తర్వాత ఆ స్కూల్ కెళితే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. సుబ్రహ్మణ్యంగారు నన్ను అడిగేరు, తెలుగులో రాస్తే చదువుకోగలవా అని. చదువుతానని చెప్పాను. పెద్ద బ్లాక్‌బోర్డు మీద అరవాన్ని తెలుగులో రాసారు. దాన్ని చదవమన్నారు. తేలికగానే చదివేను. చిన్న చిన్న తప్పులుంటే కరెక్ట్ చేసారు. అప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ అంటూ ఏమీ లేదు. ఎవరూ ట్యూన్ చెయ్యడం అంటూ ఉండేది కాదు. మనకేదైనా ట్యూన్ వచ్చుంటే దానికి తమిళపదాలు రాసేసేవారు. ఎంత విద్వాంసుడైనా ఇదే పద్థతి. వాయిద్యాలు వాయించడమే గాని మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చెయ్యడమంటూ ఏమీ లేదు. ఏదో ఓ పాట మరాఠీదో ఏదో ఒకటి తీసి దానికి తెలుగు మాటలెయ్యడం చేసేవారు. నాకు కూడా నరసింహారావు గారు అలాంటి పాటలే వేసారు. కుచేలలో పాపనాశం శివన్ గారని మనకు కృష్ణశాస్త్రి గారు ఎలాగో అంత గొప్పపేరు. ఆయన చేత కుచేలుడు వేయించారు. ఆ వయస్సులో చాలా తుంటరిగా ఉండేదాన్ని. చాలా తుంటరి పిల్ల అని పేపర్లో కూడా వేయించారు. అలాగే నాతో నాలుగు పాటలు పాడించారు. అన్నీ హిందీ పాటలే. దాన్ని తెలుగులో పెట్టి, తమిళంలో పాడించారు. ఆ తర్వాత తుకారామ్‌లో నటించాను. సుబ్రహ్మణ్యంగారే బాలయోగిని అనే సినిమా తీసారు. ఆ సినిమాలో బాలయోగినిగా నటించాను. తుకారం, బాలయోగిని రెండూ బాగా విజయవంతమయ్యాయి. అప్పట్లోనే ఇరవై రెండు లక్షలు లాభం వచ్చింది వాళ్ళకి. ఏభై వేలు ఖర్చుపెట్టి సినిమా తీసారు. నాకు వెయ్యి రూపాయలిచ్చారు. వాళ్ళు ధనవంతులైపోయారు. ఆయన భార్య నేను షూటింగ్ నుండి రాగానే కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసేది. అంత ప్రేమగా చూసుకునేవారు. ఆ తర్వాత తుకారామ్ సినిమాలో తుకారాం కూతురుగా నటించాను. దీంట్లో నాతో నటించిన వాళ్ళంతా పెద్ద సింగర్‌లు. వాళ్ళు పాడేదంతా వినేదాన్ని. సైగల్ పాటలు విని మొత్తం పాడేదాన్ని. ఆయన ఎలా పాడతాడో అలాగే పాడతాను. ఇలా సినిమాలు, పాటలు నడుస్తుండగానే మా నాన్న ఇలాగైతే నీ చదువు కొండెక్కేస్తుంది అని గొడవ పెట్టి మా అమ్మ కూడా చివాట్లు పెట్టి తీసుకొచ్చి స్కూల్‌లో చేర్చేసారు. రెండో క్లాసో మూడో క్లాసో. పరీక్షలు పెట్టేరు. ఓపెన్ ఇసుకలో పరీక్ష పెట్టేరు. మొన్న వెళ్లినపుడు హెడ్‌మిస్ట్రెస్‌కి చూపించాను ఆ స్థలాన్ని. నేను ఏమైనా చదివి ఏడిస్తే కదా రాయడానికి. చివరికి వెళ్ళిపోయి కూర్చొన్నాను. ఇసుకలో బాగా తవ్వి తవ్వి పలకను పూడ్చిపెట్టేసాను. పుస్తకాలని ఇసుకలో పూడ్చేసి, నారింజ తొక్కని కళ్ళలో పిండుకొని ఒక్కటే ఏడుపు. సినిమాల్లో ఏక్టింగ్ అలవాటైంది కదా. ఇక్కడ చేయడం మొదలు పెట్టాను. అప్పుడు వచ్చింది మా టీచర్ మెల్లకన్నేసుకుని. ఎందుకు ఏడుస్తున్నావ్ అంటే పుస్తకాలు పోయినయి నేను ఏం చదవన్ టీచర్ అంటే, ఇట్టా ఎడమచేత పట్టుకుని కుడిచేత్తో గుద్దింది చూడండి. ఒక్కటే కొట్టడం. వీపు మీద బాదేసింది. అప్పుడు బాగా లావుగా ఉండేదాన్ని లెండి. టీచర్‌ను మా ఇంటికి లెటర్ రాసి మీ అమ్మాయి ఇక్కడ చదవక్కర్లేదు. అందరి పిల్లల్ని పాడు చేస్తోంది. చదవడం లేదు. గెట్‌అవుట్ అని పంపించేసింది. అబ్బా మాహా సంతోషం వేసింది. తింటే తిన్నానులే తన్నులు అనుకుని సుబ్బరంగా ఇంటికి వచ్చేసాను. మా అమ్మ చదువు ఏమీలేకుండా పిల్లని పాడుచేసారని చాలా బాధపడింది. మా అక్క బాగా చదువుకునేది. నేనేమో చదువుకోలేదు. నా మనసు పాటమీద పడిపోయిందని బుద్ది స్థిరంగా లేదని అర్థం చేసుకుని ట్యూషన్ పెట్టించారు. ఆయన చెప్పినంతసేపు ఏం వినకుండా బొమ్మలు గీసుకుంటుండేదాన్ని. అది పడలేక ఆయన మానేసారు. మా వాళ్ళు అరచి ఇక లాభం లేదనుకొని మళ్ళీ మద్రాసుకు తీసుకొచ్చేసారు.
అప్పుడే ఇంకో ఫిక్చర్‌కి కాంట్రాక్ట్ అయింది. ముసిరి సుబ్రమణ్యం గారిది. ఆయన పెద్ద మ్యూజిక్ కాలేజి ప్రిన్సిపాల్ కదా! అప్పటికి మా నాన్నకి థియేటర్ ఇంట్రెస్ట్ మాకు గుంటూరులో రత్న హాల్ అని థియేటర్ ఉంది. దాంట్లో డ్రామాలు అవి వేయించేవారు. పెద్ద పెద్ద వాళ్ళంతా పాటలు పాడేవారు. అవన్నీ విని, చూసి వాళ్ళలాగే పాడేదాన్ని. అప్పుడే జె.ఎన్ రానడే అని ఒక మరాఠి అయన చాలా పెద్ద సింగర్. అతి కష్టమైన పాటలు పాడేవాడయన. అప్పుడు నాకు ఎనిమిదో ఏడు. నన్ను పాడమన్నప్పుడు రానడే పాట పాడతాన్నాను ఏడిసావ్‌లే. ఆయన పాట చాలా కష్టమైంది అన్నారు. వాళ్ళకు కష్టం కానీ నాకు కష్టం లేదు. జానెడంత లేవు. దొండకాయంత ఉన్నావ్. రానడే పాటలు పాడతావా అంటే లేదు సార్ నాకొచ్చు. నేను పాడతాను అంటే పాడమన్నారు చాలా మంచి పాట. నేను పాడాను. పర్వాలేదే అని ఆ పాట పేట్టేయమన్నారు. ఆ పాట తుకారాంలో పాడాను. నేను తడుముకోకుండా పాడేసరికి వాళ్ళంతా అనుకునే వారు ఎంత ఈజీగా పాడుతోందని. ఫిక్చర్ రిలీజ్ అయ్యింది పద్దెనిమిది కీర్తనలు పాడేడాయన. అవన్నీ గాలికి పోయి నా పాట హిట్ సాంగ్ అయింది ఆ ఫిక్చర్‌కి. రోడ్ల మీద అందరూ పాడుకునేవారు. అంత ఈజీగా వచ్చింది ఆ పాట. సుబ్రమణ్యం గారు నీ దుంపతెగ నువ్వు ఏం సాధించావ్ గదే పిల్లా. భలే పాడావ్ కదా అన్నీ అని చాలా ముద్దు చేసేవారు. తరువాత త్యాగరాజ భగవతార్. ఆయన పెద్ద విద్వాంసుడు మద్రాసులో. ఆయనొస్తే ఇప్పుడు శివాజీ గణేష్, కమలహాసన్ వస్తే ట్రాఫిక్ ఏలా ఆగిపోతుందో అలా ఆగిపోయేది. అంత పెద్ద పేరు అయనకి. ఆయన పిక్చర్‌లో ఆయన చెల్లెలుగా నటించాను. అప్పుడు నాకు పదేళ్ళుంటాయి. ఆయన ఇరువై కీర్తనలు పాడేసారు. నన్ను పట్టుకుని నువ్వు బాగా పాడుతావ్. నీకు దేవుడు మంచి గొంతిచ్చాడు కానీ బుద్ది ఇవ్వలేదనేసాడు. నీకు నిలకడ లేదు. కర్ణాటక సంగీతం నేర్చుకుని పాడితే ఎంత బాగుంటుంది అని మా నాన్నని పిలిచి దీన్నిలా వదిలేయకండి బాగా తెలివితేటలున్నాయి. బాగా నేర్పించండి. ఆలతూరు సుబ్బయ్య గారు చాలా పెద్దవాళ్ళు. విద్వాంసులు ఆయనకి గురువులు. అయన్ని నా కోసం ఏర్పాటు చేసారు. ఆయన తెల్లారగానే మా ఇంటికి కారులో వచ్చి ఒక గంట సంగీతం నేర్పేవారు. సరళీ స్వరాల దగ్గర మొదలు పెట్టారు ఆయన నాకు. చాలా కష్టమైంది నాకు. ఆయన పాడినట్లు పాడలేకపోయేదాన్ని. కర్ణాటక సంగీతం వెయిట్ పెట్టి పాడాలి అని కోప్పడితే నాకు అవన్నీ వద్దు వర్ణాల దగ్గరి నుంచి నేర్చుకుంటానని అన్నాను. ఆ తరువాత అది వదిలేసి కీర్తనల్లోకి ఒకే జంప్‌తో వెళ్ళిపోయాను. ఓపిక పట్టి ఏడెనిమిది కీర్తనలు నేర్చుకున్నాను. త్యాగరాజు భాగవతార్ గారు పిలిచి అడిగారు ఈ పిల్లకి ఎంత వరకు వచ్చిందని. ఏం వస్తుంది. రాగానే కీర్తనల దగ్గర నుండి మొదలుపెట్టిందని చెబితే ‘అయ్యో’ అట్లానా అన్నాడు ఆయన. ఆ టైంలో స్టూడియోలో త్యాగరాజ భాగవతార్ తన గురువుగారు ఆలతూర్ బ్రదర్స్ దగ్గర విజయాంబికే అనే కీర్తన నేర్చుకుంటుండేవారు. విజయ నాగిని రాగంలో కీర్తన అది. ఫస్ట్ క్లాస్ కీర్తన అది. ఈ చిన్న పిల్లకి అంత పెద్ద కీర్తనలెందుకులేనని నన్ను తీసి పారేసి ఆ కీర్తన త్యాగరాజ భాగవతార్ గారికి నేర్పుతున్నాడు ఆయన. నేను ఆ పాట విని మర్నాడు క్లాస్‌కి వచ్చినప్పుడు నాకు కూడా ఆ పాట నేర్పమని గొడవ చేసాను. ఆయన అయ్యయ్యో! అలా అనకూడదు ఆయన పాడే పాట నువ్వు పాడకూడదు అంటే నేనెందుకు పాడకూడదు. పాడతాను నేర్పించండి, నేర్చుకుంటాను అని గొడవ చేసాను. అప్పుడు నాకు నేర్పించారు ఆ పాట. అయితే ఆయనకి చెప్పొద్దన్నారు. ఈ పాటని చాలా శ్రద్ధగా నేర్చుకున్నాను. తరువాత మా ఫిక్చర్ రిలీజ్ అయ్యింది. మా అందరికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. అందులో ఫస్ట్ డే స్టేజ్ అప్పీయరెన్స్ నేను, త్యాగరాజ భాగవతార్ గారు. నాకు ఆ పిక్చర్‌లో చాలా పేరు వచ్చింది. ఆయనికి చెల్లెలుగా నటించాను కదా! ఆ స్టేజి ప్రొగ్రామ్‌లో ముందు చిన్న బిడ్డ కదా అని నన్ను పాడమన్నారు రెండు పాటలు పాడాలి అన్నారు. మా గురువు గారు, త్యాగరాజ భాగవతార్ గారు అక్కడే ఉన్నారు. నాకు సైగల్ పాటలు పాడటం ఇష్టం కదా! ఎక్కడైనా ప్రొగ్రామ్‌లో సైగల్ పాటలు పాడడం, నేను చాలా బాగా పాడుతానని పేరొచ్చేసింది నాకు. అందుకని దుష్మన్ సినిమాలో సైగల్ పాడిన పాటని ముందు పాడాను. అందరూ బాగా మెచ్చుకున్నారు. రెండో పాటగా మా సినిమాలో పాట పాడొచ్చుగా. నేను పాడలేను. టక్కునా విజమాంభికే పాడేసాను. త్యాగరాజ భగవతార్ ఆ పాట పాడాలని బాగా ఫ్రిపేర్ అయున్నారు. అయితే నేను ఆ పాట పాడేసాను. ఆయన తెల్లబోయి అలాగే చూస్తుండి పోయారు. అంత పెద్ద పాటను తీసుకుని పాడేసింది. నేను ఏం పాడాలి ఇప్పుడు అంటూ చూసాడు. ఆయన ఫిక్చర్‌లో పాట పాడొచ్చు కదా. పాడలేదు. నేనేమో ఆ పాటకి ఎన్ని సంగతులున్నాయో అన్ని సంగతులేసి ఒక్కటి కూడా వదలకుండా, ఆయన ఎన్ని నేర్పించారో అన్ని పాడేసాను. అందరూ భలే పాడిందని బాగా మెచ్చుకున్నారు.
అప్పట్లో అందరు ఎవరి పాటలు వాళ్ళే పాడుకోవాలి. బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ వినబడగానే లేచి వెళ్ళి అక్కడ నిలబడుకుని పాడాలి. పాఠం ఒప్ప చెప్పినట్లే పాడేసి వచ్చి కూర్చోవాలి. ఒక పాటకి నెల రోజులు రిహార్సల్స్ చేస్తారు. పాటలు ఇప్పుడు లాగా ఇన్‌స్టెంట్ గులాబ్ జామ్ మాదిరిలా కాదు. నెల రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఈ నెల రోజులు విని విని నాకు వేరే పాటలు కూడా వచ్చేవి. అసలు వేరే వాళ్ళ పాటలే ముందు వచ్చేవి నాకు. ఓ రోజు ఆ సినిమాలో కాంచనమాల నటిస్తోంది. కానీ నేను, రాజేశ్వరావ్‌గారు కలిసి నటిస్తోన్న ఫస్ట్ పిక్చర్ కూడాను. రాజేశ్వర్‌రావు గారికి అప్పటికి పదహారో, పదిహేడో ఉంటాయి. నాకు పన్నెండేళ్ళుంటాయి. ఆ రోజుల్లో పాటలు పాడటం అంటే తేలిక కాదు. నెల రోజులు రిహార్సల్ చేసి చేసి పాట కంఠత వచ్చేసేది. నిద్రలో లేపి అడిగినా పాడేసేవాళ్ళం. అదే డ్రామా ఆర్టిస్టులైతే అపశ్రుతి వినబడకుండా ఫుల్ ఆర్కేస్ట్రా పెట్టేసేవారు. ఆ విషయం నాకు తెలిసి పోయేది. వీళ్ళేదో పప్పులో కాలేసారు అందుకే ఆర్కేస్ట్రా హోరు అని నవ్వేసేదాన్ని. ఆ పిక్చర్‌లో సూరిబాబు, రఘురామయ్య లాంటి వాళ్ళు నటించారు. పాట పాడేవాళ్ళం. పై ఇద్దరు నేను, రాజేశ్వర్‌రావుగారే. మిగితా వాళ్ళకి ఏమీ రాదు. ఆయన అంత శ్రద్ధ తీసుకుని పాడించారు. ఆ సినిమాలో అన్ని పాటలు పాడాము. చివరికి సినిమా ఇంకో పదిరోజుల్లో రిలీజ్ అవుతుందని అనగా, వీళ్లిద్దరివి రెండే పాటలు ఉన్నాయి. ఇంకా ఉంటే బాగుంటుందని చెప్పి, పిక్చర్ చివర్లో అప్పటికప్పుడు ట్యూన్ చేసి రాత్రి 12గంటలకి నన్ను లేపి కార్లో ఎక్కించుకుపోయారు, నన్ను, రాజేశ్వర్‌రావు గారిని. ఆ అర్ధరాత్రి పాట రికార్డు చేసారు. డైరెక్టు టేకులో ఆ పాట పాడించారు. అప్పటి నుండి రాజేశ్వర్ గారితో లైట్ మ్యూజిక్ పాడేదాన్ని. నేను ఎక్కువ అరవ సినిమాల్లో చేయడం అరవ వాళ్ళతో తిరగడంతో నన్ను అరవ పిల్ల అనుకునే వారసలు. నేను తెలుగండి అని చెప్పుకునే దాన్ని. క్లాసికల్ మ్యూజిక్ పాడాతావుంటే ఎఐఆర్ వాళ్లొచ్చి మా పాట విన్నారు. వాళ్లకి పాడేవారు ఎవరో ఎగ్గొట్టారంట. మాతో పాడించుకుంటే బాగుంటుందనుకున్నారు. మేము మేకప్‌లో ఉన్నాం. మమ్మల్ని అలాగే కార్లో ఎక్కించుకెళ్ళి పోయారు. ఆర్కెస్ట్రాని పికప్ చేసుకుని ఎఐఆర్ స్టూడియో బ్రాడ్‌కాస్ట్ చేసేసారు. ఇది 1940లో జరిగింది. మేము 1940నుండి పాడతా వచ్చాం. అప్పటికి వాళ్ళకి లైట్ మ్యూజిక్ లేదు. అప్పటి నుండి మాకు కాంట్రాక్ట్ రావడం మొదలైంది. రాజేశ్వర్‌రావు గారికొస్తే నేను, నాకొస్తే ఆయన పాడేవాళ్ళు. ఇద్దరం అలా కలిసే పాడతా వచ్చాం. అట్లా మాకు చాలా పేరు వచ్చింది. ఎన్నో కచేరీలు చేయడం జరిగింది. అప్పుడే హెచ్‌ఎంవి వాళ్ళు లైట్ మ్యూజిక్ రికార్డులు తీసారు. ఆయనతో కలిసి పాడటం మొదలెట్టాక డ్యూయెట్‌లు పాడటం మొదలైంది. 1944 వరకు ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే వచ్చాను.
1944లోనే నా మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. అప్పుడు మా నాన్న గారు పార్ట్నర్‌షిప్‌లో తీసిన ‘రాధిక’లో చివరి సారిగా నటించాను. అప్పటికి నాకు పదిహేనేళ్ళు.. చివరికి మూడు సినిమాల్లో మాత్రమే హిరోయిన్‌గా నటించాను. ఎంజిఆర్‌తో ఒక పిక్చర్ తమిళంలో, తరువాత కెఆర్ రామస్వామి అని, ఆయన కూడా పెద్ద సింగర్ ఆయనతో ఒకటి, తరువాత తెలుగులో రఘురామయ్య గారితో ఒకటి. ఆయన క్రిష్ణుడు, నేను రాధగాను వేసాం. అదే ‘రాధిక’ సినిమా. ఆ ఫిక్చర్‌లో చాలా పాపులర్ సాంగ్స్ ఉన్నాయి. ‘గోపాలకృష్ణుడు నల్లన’ పాట అందులోదే 1944లో ఇక జనగణమణ పాడేసి మొత్తం అన్ని ఆపేసాను. మొత్తం 12 సినిమాల్లో నటించాను. పెళ్ళి తరువాత నా అంతట నేను మానేయలేదు. వారికి మ్యూజిక్ ఇష్టం లేదు. నేను పాడతానని తెలుసు అయితే పదిమందిలోకి వెళ్ళి పాడడం ఆయనకి నచ్చలేదు. అందులోను ఆ రోజుల్లో పాటకి ఎక్కువ పేరు కదా! ఎక్కడైన పబ్లిక్ ప్రోగ్రామ్‌కి వెళితే విపరీతంగా జనం వచ్చేసేవారు. ఆంధ్రా సైడ్‌గాని వెళ్ళానంటే చాలా జనం ఇదంతా చూసి ఇదేంటి ఇలా? ఎక్కడా కనబడటానికి వీల్లేదని అన్నీ క్లోజ్ చేసేసారు. అప్పటి నుండి పాడలేదు. మూడేళ్ళు మానేసాను. ఆ తరువాత దుక్కిపాటి మధుసూధనరావుగారు, అక్కినేని నాగేశ్వర్‌రావు, ఘంటసాల బలరామయ్యగారు వాళ్ళు ముగ్గురు కలిసి మా ఇంటికి వచ్చారు. స్వప్న సుందరి పిక్చర్ తీస్తున్నాము. దాంట్లో పాడించమని వచ్చి ఆయన్నే అడిగారు. పాడించనన్నారు. ఎంత చెప్పిన ఒప్పుకోలేదు. తరువాత వాళ్ళన్నారు అదేమిటండి మీరు రాజులు కదా! ఇంత పెద్దవాళ్ళు, సంస్థానాలు
ఉన్నాయి. ఒక ఆర్ట్‌ను పైకి తేవాల్సిన వారు. అలా నొక్కేస్తా ఉంటే తప్పు కాదా అని ఆయన్ని కూర్చోబెట్టి నూరారు. అప్పుడేమైందో ఏమో, ఒప్పుకొని ఒక పిక్చర్ పాడేసి వచ్చేయన్నారు. అందులో పాటలన్ని చాలా హిట్ సాంగ్స్. రచనలు తెలుసుకుని అనే పాట కూడా అందులోనిదే ఘంటసాల, నేను పాడాము. అది పాడుతుండగానే షావుకారు మొదలుపెట్టారు. ఇక్కడికి రిహార్సల్స్‌కి వచ్చినట్టే వచ్చి ఆ పాటలు పాడేసి వచ్చేదాన్ని. ఆయనకి తెలియనే తెలియదు. నేను ఇక్కడే స్వప్న సుందరికి పాడుతున్నానని ఆయన అనుకునే వారు. నాకు చాలా ధైర్యమని పేరు. అంత ధైర్యం ఎటుపోయిందో ఆయన దగ్గరికి రాగానే. అన్నీ పోయినయి. ఆయన్ని చూడగానే భయమొచ్చింది. ఎందుకంటే వాళ్ళలవాటులేదట్లా. బయటకు రావడమూ, పాడటమూ, ఎవరూ లేరు ఆ ఫ్యామిలీలో. నేనొక్కదాన్ని బయటికొచ్చి పాడుతున్నానంటే అది ఆయనకు అగౌరవం కదా! బంధువులందరికి కొంత జలసి కూడా ఉండొచ్చును. ఇంత పేరొచ్చేస్తావుంటే అది కూడా ఉంది కదా! ఆడవాళ్ళందరూ వాళ్ళకి ఏమీ తెలియదు. ఎంత సేపు చీరలు, నగలు తప్ప రెండో మాట మాట్లాడి ఎరుగరు వాళ్ళు. ఎంత సేపు దాసీలు, పని మనుషులతో తప్ప బయట ప్రపంచం తెలియదు. వాళ్ళు చెప్పితేనే వినాలి. అట్లా ఉండేవాళ్ళకు నేను బయటకు పోయి పాడతున్నానంటే ఆయనకు కష్టమే. ఆలోచించి, ఆలోచించి ‘పోనీలే, ఛీ.. ఎందుకులే ఈయన్ని కష్టపెట్టటమెందుకు, పోతే పోనియ్ పాటే కదా’ అనుకుని మానేసుకున్నాను. ఎక్కడా పాడలేదు. అట్లాచాలా కాలం పాడకుండా ఉన్నాను. మా ఇద్దరబ్బాయిలు పుట్టింతర్వాత మళ్ళీ మామూలుగా పాడుతున్నాను. పిక్చర్స్‌కి కూడా పాడమన్నారు. పాడుతున్నానుగాని ఆయనకి ఇష్టం లేదు. నేను మద్రాసుకొస్తేనే పాడటం. ఆయనూర్లో అయితే ఏదీ లేదు. మూడు నెల్లకో, నాలుగు నెల్లకో మద్రాసు వస్తాను. ఆ వచ్చినపుడు పాడించుకునేవారు. లేకపోతే పాటా లేదు. ఏమీ లేదు. పబ్లిక్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మానేసాను. అయితే ఒక సారి బెజవాడలో సంగీత సమ్మేళనం జరిగి పాడమని పిలిచారు వాళ్ళు. అయితే ఆయనకి ఐడియా లేదు. అది ఎటా ఉంటుందనేది తెలియదు. ఆయన కూడా నాతో వచ్చారు. మూడు కార్లు, తుపాకుల్తో మనుషులు, నౌకర్లు చాకర్లు అందరూ వచ్చారు. ఆ రోజు ఇసకేస్తే రాలనంత జనం వచ్చేసారు. నా ప్రోగామ్ రాత్రి పన్నెండుకి వచ్చింది. నా ముందు చాలా మంది పాడారు. చాలా మంది బయట ఊళ్ళ నుంచి కూడా వచ్చారు. నన్ను స్పెషల్‌గా మద్రాసు నించి పిలిపించారు ఈ ప్రోగ్రామ్‌కి. నేను ముందు పాడేసి పోతానన్నాను. వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు ముందు పాడి వెళ్ళిపోతే ప్రోగ్రామ్ ఫెయిలయిపోతుంది. మీరు చివర పాడాలి అన్నారు వాళ్ళు. చివరిదాకా ఉండి పదకొండున్నరకి నా ప్రోగ్రామ్ మొదలైంది. ”నడిరేయి దాటింది. నా చేయి వదిలేయి” అనే పాట పాడేను. ఆ పాటకి జనం ఎట్లా గోల చేసారంటే ఈయనకి ఎట్లాగో అయిపోయింది. మండి పోయిందాయనకి. వీళ్ళకేమైనా పిచ్చా, మ్యూజిక్ అంటే ఇంత వెర్రా అని ఆశ్చర్యపోయారు. నిజానికి ఆయనకి ఆ విషయాలేవీ తెలియవు. ఇప్పటికీ మా వాళ్ళ కేమీ తెలియదు సంగీతం గురించి, పాట గురించి. పాడటం ఎంత కష్టమో తెలియదు. అందరి కంటే చిన్న నేను మా ఇంట్లో. ఆయన దగ్గర ఏమీ మాట్లాడటానికే లేదు. మా సంస్థానమంటే ఎంత పెద్ద పేరో. మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని కూడా నేను పాడటం మానేసాను.
ఆ మధ్య రమేష్ నాయుడు సంగీతంలో ఒక పాట పాడాను. అది ఇంకెవరైనా అయితే పాడేదాన్ని కాదు. రమేష్ నాయుడిది కొంచెం సాఫ్ట్ మ్యూజిక్. బాగుంటుంది. అందువల్ల పాడగలిగాను. పైగా విజయనిర్మల నా కజిన్ కదా తను ఫోర్స్‌చేసి పాడించింది. కాని ఆ తర్వాత ఎమ్.ఎస్. విశ్వనాథం, సుసర్ల దక్షిణామూర్తి వాళ్ళందరూ కూడా ఇంక వచ్చేసాం, అడ్డమొచ్చేవాళ్ళు ఎవరూ లేరని పాడమని అడిగారు. అయితే ఏముంది? ధనా ధనా రిథమ్. దాని మీద పాట పాడేస్తున్నారు. దీనికి కష్టమేముంది. ఎవరు బడితే వాళ్ళు చదవొచ్చునే. దీనికి పెద్ద సంగీతం రానక్కర్లేదు పాడ్డానికి. ఒద్దని చెప్పాను. పాడలేనని అన్నాను. పైగా చిన్న చిన్న కుర్రాళ్ళు, ఏమీ రాని వాళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్లు. నా లైఫ్‌లో నేను చూసిన మ్యూజిక్ డైరెక్టర్లందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళు. అందువల్ల వాళ్ళకంటే కూడా నేనే సీనియర్‌ని. వాళ్ళ దగ్గరైతే అట్లా ఇట్లా కాదని నా ట్యూన్ నేను చేసుకుని పాడతా వచ్చాను. వీళ్ళతో మార్చేదేముంది. పాటే లేనపుడు ట్యూన్ చేసేదేముంది. ఇపుడు ఇళయరాజా వచ్చింతర్వాత కొంచెం బాగా వచ్చింది. అంటే కర్నాటిక్ మీద బేస్ చేసి పాటలుగాని చేస్తే అవి కొంచెం వినగలుగుతాం. అన్నమయ్య, శంకరాభరణం లాంటివి వచ్చాయి కదా. మహదేవన్‌లాంటి వాళ్ళు ఎక్కువగా క్లాసికల్ మీద బేస్ చేసి సాంగ్స్ చేస్తారు. ఇపుడొచ్చే వాళ్ళల్లో అదీ లేదు కేకలు, అరుపులు తప్ప. ఎమ్.ఎస్. విశ్వనాథం, సుబ్బరామన్, రాజేశ్వరరావు, పెండ్యాల వాళ్ళందరు బాగా శ్రద్ధ తీసుకుని, బాగా రిహార్సల్స్ చేయించి, మనసుకు పట్టింతర్వాత రికార్డు చేసేవాళ్ళు. అంతేకాని ఇన్‌స్టెంట్‌గా, పేపర్ చూసుకుని, పాడేసి వెళ్ళిపోవడం కాదు. ఇప్పటి వాళ్ళకి సిట్యుయేషన్ తెలియదు. ఆ పాట ఎక్కడొస్తుందో తెలియదు. అప్పట్లో రికార్డింగ్ జరుగుతున్నపుడు డైరక్టరొచ్చి, కూర్చుని ఆ సిట్యుయేషన్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఫలాన దగ్గరొస్తుంది ఈ పాట, ఫలానా సందర్భానికి సరిపడా భావంతో పాడాలి అని చేప్పేవారు. అదేం తెలియకుండా పాడితే ఏం బాగుండదు.
ఇప్పటి పాటల్లో మధ్యలో గావుకేకలు విన్పిస్తాయి. అవెందుకు పెడతారో నాకర్థం కాదు. కాబట్టి ఇప్పటి మ్యూజిక్‌లో పాడటానికి నేను అన్‌ఫిట్. నేను పాడలేను అలా. గప్‌చుప్‌గా ఊరుకోవాలి లేదా గ్రాండ్‌గా రిటైర్ అయిపోవాలి. పాత వాళ్ళందరూ పాడి ఉన్న పేరును పొగొట్టుకోకూడదు.. ఎన్నో అవస్థలు పడి సంపాదించిన పేరు ఇది. ఈ పిచ్చి పాటలు రెండు పాడి ఉన్న పేరు పోగొట్టుకోకూడదు.