బెంగుళూరులో జరిగిన ప్రపంచ అందాల సుందరి పోటీల పట్ల నిరసన మునుపెన్నడూ లేని విధంగా వివిధ వర్గాల నుంచీ వివిధ దృక్పధాల నుంచీ వెల్లడయ్యింది. ఒకవైపు అందాల పోటీల నిర్వాహకులైన ఎబిసిఎల్‌కు అన్ని విధాలా సహకరించాలనే ధోరణితో వ్యవహరించిన ప్రభుత్వం, ఇంకోపక్క ఏది ఏమైనా సరే అందాల పోటీలను అడ్డుకుంటామన్న వివిధ వర్గాల ఆందోళనకారులు. అయితే ఈ రెండూ కాకుండా కూడా అందాల పోటీల సంస్కృతి, తాత్వికత గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి, జరుగుతున్నాయి. అందాల పోటీలు జరగటం సరైనవా, కావా అనే చర్చలోకి వెళితే ఎంత కాలమయినా ఆ విషయం చుట్టూనే పరిభ్రమించటమే తప్ప, అందం అనే అంశం చుట్టూ అల్లుకుని ఉన్న ఇతర అంశాల్ని మనం విశ్లేషించుకోలేం. వ్యక్తులుగా మనం అనేక రకాల భయాల్ని జీర్ణించుకునేలా సమాజం కృషి చేస్తూ ఉంటుంది. ఇవి స్త్రీలుగా, పురుషులుగా, వర్ణాలుగా, కులాలుగా, మతాలుగా మన స్థానం ఏమిటి అనే వాటి మీద ఇవి ఆధారపడి ఉన్నాయి. స్త్రీలుగా మనం మన రూపం గురించి అనేక రకాల భయాలు, ఆదుర్దాలతో ఉండటానికి చిన్నతనం నుంచీ సాంస్కృతికంగా అలవాటు పడేలా రకరకాల వ్యవస్థలు మన చుట్టూ నిర్మించబడి ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ ఆయాకాలాలకు తగినట్లుగా రూపం మార్చుకుంటూ స్త్రీత్వాన్ని నిర్వచిస్తూ ఉంటాయి. వీటిలో ప్రధాన అంశం ‘అందం’. దీన్ని చుట్టూ పటిష్టమైన చట్రాలు తయారుచేసి వాటిల్లోకి మనల్ని ఇరికించటం. విమల రాసిన కవితను మరోసారి ఇక్కడ గుర్తు చేసుకుంటే ఈ చట్రాలు ఎలా మన నినత్యజీవితంలో భాగమయ్యాయో అర్థమవుతుంది.
”మనమంటే 34, 24, 35 కొలతలమైనచోట
మొటిమలు మొలవడం, జట్టురాలడం
నడుం సన్నగా లేకపోవడమే
మన నిరంతరాందోళనలైన చోట
దైహిక సౌందర్య పిపాసయే
మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట
ఎంత హింసను అనుభవిస్తున్నామో కదా!”
మనం ఏ ప్రకటన చూసినా, వాటి పని కేవలం సరుకులను అమ్మటం కోసమే కాదు, వాటి వెనకాల ఒక స్పష్టమైన భావజాలం కూడా ఉంది. ఈ భావజాలం మన కోరికల మీదా, ఆదుర్దాల మీదా, భయాల మీదా పనిచేస్తూ వాటిని మరింత బలపరచే విధంగా పనిచేస్తూ ఉంటుంది. ఎంత ఆధునికత సంతరించుకున్నా, ఒకపక్క ఇంటికి, ఇంటి పనులకీ, కుటుంబానికీ అంకితమయ్యేటట్లు, అదే సమయంలో అందం సున్నితత్వం, సుకుమారం, వినమ్రత ఇవి స్త్రీత్వ లక్షణాలుగా నిర్వచించటం జరుగుతోంది. ఇవన్నీ కూడా పితృస్వామిక విలువల మూస పద్ధతులకు ఏ మాత్రం ఆటంకం రాకుండా నడుస్తున్నవే. ఇది ఎంత హింసతో కూడుకున్న విషయమో మనకు నిత్యజీవితంలో అనుభవమే, కనిపించకుండా భావజాలం ఎంత శక్తివంతంగా మన మీద ప్రభావం చూపిస్తోందనే విషయం కూడా మనకు అనుభవమే. ఈ రకమైన సంక్లిష్ట పరిస్థితుల్లో వ్యక్తులుగా మనం మనలో ఉన్న ప్రత్యేకతలను గుర్తించలేని విధంగా, ఈ ప్రకటనల హోరులో చిక్కుకుని పోతాం. వాస్తవ జీవితంలోకి మన దృష్టిని నిశితంగా సారిస్తే వ్యక్తులుగా, స్త్రీలుగా మన రోజువారీ జీవితం సంఘర్షణతో నిండివున్నదనే విషయం మనకు అర్థమవుతుంది. స్త్రీలుగా, బయటి ప్రపంచంలోనూ, వ్యక్తుల్లోనూ మన అస్థిత్వాన్ని నిలమెట్టుకోవటానికి, మన మీద రుద్దుతున్న అసహజమైన ‘లక్షణాన్ని’ వదిలించుకోవటానికి మనం నిరంతరం పోరాటం చెయ్యవలసిందే.