మిణుకు… మిణుకు… మంటున్న
చుక్కల గుంపు
మసక కాంతిని వెదజల్లుతూ
పెంజీకటిలో గుడ్డిగా
దూరంగా మొరుగుతున్న కుక్కలు
ఏడుస్తున్న పసిగుడ్డును నుచ్చకొడుతూ
ఉండి… ఉండి… పురాగానం
ఆ తల్లినోట దుఃఖపు జీర
అలలు అలలుగా
అంతా భ్రాంతియేనా… అంటూ!
చింతల అగాధంలో కూరుకొనిపోతూ
పెంటి కోసం నిరాశా నిస్పృహా
జమిలిగా ఎదురుచూపు
నిద్రలేని రాత్రుల్ని
కష్టాల కన్నీటి వాగుల్నీ ఈదివచ్చింది
రెక్క లొచ్చిన పక్షులు తప్పుకొన్నాయి
ఎదురుంగ అంపశయ్యపై ఉన్న తోడు
మునివాకిట మృత్యుచ్చాయ
పొడసూపంగ
నెమరేసుకొంటున్న యాదులు
పొడుచుకు తింటుండంగ
ఆది నుంచి నడక మాత్రం
ముండ్ల బాటే
అన్నది ఒక నిష్టూర సత్యం
అప్పుడామే
ఒక నవనవోన్మేషరూపం
అనుమానపు తెరల్ని
హింసను… తిరస్కారాల్ని
పురస్కారాలుగా స్వీకరించింది
నిర్ధేశించిన మనువురాజ్యాన్ని
అవలీలగా దాటుకొని వచ్చిన సరంగు
కాలం తన గుర్తును నిర్ధాక్షిణ్యంగా
మోపిన నిలువెత్తు సాక్ష్యం
శుష్కించిన రూపం
చివికి రంగు మాసిపోయిన కాయితమొలె
అయినప్పటికీ
సువాసనలు పంచుతున్న గంధపు చెక్క చెక్కులా
ఒక ఎదిరి చూపు
అప్పుడు రాలేదని
ఇప్పుడు……….