పి.సత్యవతి
విజయవాడలో మే నెలలో ఎండలు మెండుగా ఉండడం ఎంత నిజమో ప్రతి మేడేరోజున అందర్నీ అలరించే చల్లని సాయంత్రం కూడా అంత నిజం. ఈ సాయంత్రపు కవితా జల్లులతో తడిసి ముద్దవడానికి ఎండల్ని ధిక్కరిస్తూ కవులంతా విజయవాడ రైలెక్కేస్తారు. కవిత్వం ఒక ఊరట. కవిత్వం ఒక నేస్తం. ఎప్పుడైనా కాలం కదలక మొరాయించినప్పుడు ఒక్క తోపుతో ముందుకు నెట్టే శక్తి… ఈ సంవత్సరం కవయిత్రులు ఈ సాయంత్రానికి మరింత వన్నె తెద్చారు. ప్రతి సంవత్సరం వలెనే ఈ సంవత్సరం కూడా కవితా వార్షిక మే నెలని చల్లగా స్వాగతించింది, ఈసారి కవితా వార్షికలో ముగ్గురు కవయిత్రుల కవితలు అద్భుతంగా వున్నాయని నేనే కాదు సభలో శివారెడ్డి గారు చదివి మరీ అభినందించారు. ఆ కవితలల్ని మీతో పంచుకుని కవయిత్రులని మీరుకూడా అభినందించాలనే ఇట్లా ఈ తోటలో అడుగు పెడుతున్నాను.
వర్షం ఒక సినుకు పూల సీర! ఎంత అందమైన వ్యక్తీకరణ! అది ఎవరు సుట్టాలి?” ఇన్ని రోజుల సంది, జాడ లేకపోయిన, పత్తలేకపోయిన కర్రె మబ్బు వానోడు” చాలా కోపమొచ్చింది వానరానందుకు. ”నిన్ను దొంగలు కుమ్మ, నీయింట్ల పినిగెల్ల,” అని తిట్టింది. అసలు ఈ కర్రిమబ్బు వానోడొచ్చి యేళ్ళకు ఏళ్లైపోయింది. ఏడ తిన్నాడో యేడ పండినాడో తెల్వపాయె. సెట్టుల్ల సెట్టైనాడొ గుట్టల్లో గుట్టైనాడో తెల్వకపాయె. అందువల్ల ”పిల్లది మారకాంచి సెట్టుకు పుట్టెడు యేడుస్తున్నాం” అంటుంది. ముత్యాల సెరువుపేర్లు బంగారు పంటె గుళ్ళు కాల్వల దండెకడియాలు ఎక్కడ్నో కుదపడిపాయె…. ఆకుబెట్టిన తనువంతా ఎండి సొప్ప కట్టైపాయె. కోపం తరవాత వేదన… తరవాత వానోణ్ని రమ్మని ఎంత అర్థంగా ఎంత భావుకతతో పిలుస్తుందో చూడండి.
”తూర్పుదిక్కునించీ తుమ్మవనమోలె,
పచ్చిమం దిక్కున పాలనవ్వుల్తోని
ఉత్తరాన్నించీ ఉరుముకుంట
దచ్చినంనించీ దండిగొచ్చి
నిండిన సెరువు కుంటలతో అద్దాల రైకద్దవా
సినుకుపూల సీరె సుట్టవా
ఇంత సుందరమైన ఇమేజరీ సృష్టికర్త జుపాక సుభద్ర… కవిత 2008లోని నాకు చాలా నచ్చిన కవిత.
దుఃఖం అందరికి ఎప్పుడొ కప్పుడు ఎందుకో ఒకందుకు రావాల్సిందే, దుఃఖ పడని మనుషులు జడులు కదా!! దుఃఖం కూడా చాల ప్రియమైనది. స్వంతమైనది, ఎప్పుడంటే అప్పుడు బహిర్గతం చేసుకోవీల్లేనిది. ఎప్పుడైనా దుఃఖపడాలని అనిపిస్తుంది, లోలోపలి వేదనొకటి బయటపడి హృదయభారం కొంచమైనా తీరుస్తానంటుంది. కవి చెప్పినట్లు ”ఎద మెత్తనొటకై సొదగొందా” లనిపిస్తుంది.
దుఃఖ సమయం ఎలావుంటుందంటే”
”ఇప్పుడు సందర్భం కాకపోయినా
ఈ తీరికను దుఃఖించడానికి
వాడుకోవాలనిపిస్తుంది’ ”అంటూనే
”నిజానికి దుఃఖించడమంటే
కన్నీళ్ళు కార్చడమా
మనసును మరింత సున్నితంచేసేసి
ఓక్షణం విలలాడిపోవడమా
అది ఓర్చుకోలేక నిన్ను నీవు
ఓదార్చుకునేందుకు ప్రయత్నించడమా”
ఇలా సాగి ”ఇందాకటి ఏకాంత దుఃఖం, ఏకాకితనపు దుఖంలా అనిపిస్తుంది” అంటుందీ కవయిత్రి సి.హెచ్.వి. రత్నమాల. ఏకాంతానికి ఏకాకితనానికి ఎంత తేడా!!
ఈ కవితా సంకలనంలో నేను అనుభవిస్తూ చదివిన కవిత. మూడో కవయిత్రి పలపర్తి ఇంద్రాణి.
”చిలుం పీిలుస్తూ పారవశ్యంలో మునిగిన ఫకీరు
మాయింటి వెనక నిద్రమత్తులో జోగుతున్న పంటకాలవ” ఈ అమ్మాయి ఉపమానాలు, చిత్రాలు గీసినట్లుంటాయి. ఈ చిన్న కవితనంతా ఇక్కడ చెప్పొచ్చు గానీ ”కాలమ్”కి పరిమితం కదా ఈ మన సందర్శన.
సుజతా పట్వారి ఆదివాసీలని ఎట్లా అర్థం చేసుకుందో చూడండి ”చివురు రాలకుండా… కొమ్మవిరవకుండా… వొడినిండా కాయల్ని ఒడుపుగా తెంపడం తెలిసిన వాళ్ళు…” భుజాన గెంతికూర్చున్న కోతిపిల్లను.. చంకన బిడ్డతో పాటు మోసిన వాళ్ళు..” ఇలాంటి ఈ ప్రకృతి బిడ్డలకి, నాగరీకం ఖాకీి బట్టలేసుకుని ”కొండల్ని తవ్వి ఎలుకల్ని చెరుస్తారని వారికేం తెలుసు”.
ఇందులో కొండేపూడి నిర్మల ”రిస్క్ తీసుకుంటాను” కవితలో ఆమెకి సహజమైన వ్యంగ్యమూ పదునూ విమల సముద్రంలా బహురూపుల చందమామ, ఘంటశాల నిర్మల ”దాంపత్యం ఎలియాస్ పరస్పర హననం” వున్నాయి.
నాకు కవిత్వం ఒక సాంత్వన. చాలా చాలా అభిమాన విషయం. అందుకే నేనెప్పుడు కవిత్వ విమర్శజోలికి పోను. నచ్చిన కవిత్వం చదువుకుంటూ వుంటాను. అంత ఇష్టం కనకే ఎప్పుడు వ్రాసే ప్రయత్నం చెయ్యలేదు. ఈ మేడె సాయంత్రం కవయిత్రుల సాయంత్రమై ప్రశంశల జల్లులలో తడిశాక హర్షాన్ని మనందరం పంచుకోవాలని ఇలా ఒక సాహసం. మే ఒకటి సాయంత్రాన్ని కవితా ఝురిలో తడిపిన విశ్వేశ్వర్రావు, ప్రమీలలను అభినందిస్తూ…