”లవ్ జిహాద్” ఆర్డినెన్స్ తెచ్చేసింది యు.పి. యోగి సర్కారు. ఈ అరుపు ఇవ్వాళ కొత్తగా మొదలు కాలేదు. భాజపా ప్రభుత్వాల చేతకానితనం, అసమర్ధత, పరిపాలనలో అవకతవకలు బయటపడినప్పుడల్లా సంఘ్ పరివార్‌లోని ఏదో ఒక అంశం భజరంగ్‌దళ్ లేదా విశ్వ హిందూ పరిషత్ గొంతు చించుకొని లవ్ జిహాద్ అంటూ రంకె వేస్తుంది.
నిజానికి కేరళ సమాజంలో చిచ్చుపెట్టడం ద్వారా లబ్ది పొందడానికి ఆరెస్సెస్ వండిన వంటకం ఇది. అక్కడ పెద్దగా ఫలితం ఇవ్వలేదు కానీ ఇది మొదటగా హిమాచల్ ప్రదేశ్‌లో మార్మోగింది. అక్టోబర్ 26న హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక కాలేజి అమ్మాయి తన ప్రేమను తిరస్కరించిందని ఆమె పీక కోసిన ఉన్మాది ఒక ముస్లిం యువకుడు. దాంతో అక్కడి అధికారంలోని భాజపా మంత్రి లవ్ జిహాద్ అంటూ పెడబొబ్బ పెట్టాడు. పాపం ఆ అమ్మాయి తల్లిదండ్రులు, నేరస్తుడ్ని అరెస్టు చేసిన పోలీసులు కూడా బాబూ ఇది ఏ జిహాదూ కాదు, ఇది తిరస్కారం తట్టుకోలేని స్వచ్ఛమైన పురుషాధిక్యత అని పదే పదే చెప్పినా ఆ బొబ్బలు ఆగలేదు. అవి ఉప ఎన్నికల్లో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్నాటకల్లో కూడా మారుమోగాయి.
అదే సమయంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని ఆధారం చేసుకుని ”యోగి” ”లవ్ జిహాదీయులు వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, కుట్రలు ఆపేయాలి లేకుంటే వాళ్ళందర్నీ కాటికి పంపుతానని” ఎన్నికల సభలో బహిరంగంగా బెదిరించారు. చావు ఫత్వా జారీ చేశారు. ఇప్పుడు భారీ మెజార్టీ ఉన్నా అసెంబ్లీలో ఆమోదం పొందదని భయమో, ప్రేమికుల్ని వేటాడడానికి అసెంబ్లీ సమావేశం అయ్యేదాకా ఆగలేకనో గాని ఆర్డినెన్స్ తెచ్చారు.
ఆరునెలల్లో ఆమోదం పొంది చట్టం కాకపోతే ఆర్డినెన్స్ అటకెక్కుతుందని తెలుసు. కోర్టులో లవ్‌జిహాదీ చట్టం నిలబడదనీ తెలుసు. అయినా తమ బిడ్డలు ప్రేమ పెళ్ళిళ్ళు… అందునా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని ఇంటి పరువు మంట కలుపుతారని భయపడి చస్తున్న మధ్యతరగతి అగ్రవర్ణ, సవర్ణలకు ఊరట కలిగించి ”నేను ప్రయత్నించా కానీ కోర్టులు, రాజ్యాంగం అడ్డం పడ్డాయి. మన మతం నిలబడాలంటే వీటిని ఎత్తేయాలి. పోలీసు యూనిఫాంలో ఆరెస్సెస్ కార్యకర్తలుంటే ఇంకా పకడ్బందీగా ఉంటుందనే” వాదన ముందు పెట్టడానికిదో అవకాశం కదా!
కాబట్టి నల్ల కళ్ళద్దాలు, సెల్ఫోన్లు, జీన్స్ ప్యాంటులతో ఇదే పని కోసం శిక్షణ పొందిన (ఎక్కడ, ఎవరిచ్చారు, ఏ విషయంలో అని అడక్కండి, అదంతా అంతర్జాతీయ కుట్ర) అమ్మాయిల్ని ఆకర్షించగలిగే అందమైన ముస్లిం యువకులు. అమాయకులయిన హిందూ అమ్మాయిల్ని వలేసి పట్టుకుని పెళ్ళి పేరిట మతం మారుస్తారు. మార్చాక ఆ నిఖా ఉంటుందా పోతుందా? తెలీదు. ఒక్క యువకుడు ఇట్లా ఎంతమందిని ‘ఇస్లాం కోసం నిఖా చేసుకుంటాడు? తెలీదు… పోనీ ఇట్లా ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి? ఈ చివరి ప్రశ్న ఆసక్తికరమైంది.
కాన్పూర్‌లో వేలకొద్దీ మతాంతర వివాహాలు జరిగిపోతున్నాయని సంఘ్ పరివార్ గగ్గోలు పెడుతోంది. అందుకని ఐ.జి గారు ఒక ”సిట్”ను వేసి గత రెండేళ్ళు 2018-19లలో మతాంతర వివాహాలు… అందునా ప్రత్యేకించి ”లవ్ జిహాద్” నిర్వచనంలో ఇమిడే వాటి లెక్క తీయమన్నాడు. వారం క్రితం పత్రికా సమావేశం నిర్వహించి స్వయంగా ఆ గణాంకాలు వెల్లడించాడు. గత రెండేళ్ళలో కాన్పూరు మొత్తంలో 14 మతాంతర వివాహాలు జరిగితే వాటిలో 3 పెళ్ళిళ్ళలో మత మార్పిడి జరిగింది. (కాన్పూర్ జనాభాలో దాదాపు మూడో వంతు ముస్లింలు) అది కూడా వారి ఇష్టపూర్వకంగా జరిగింది. మిగిలిన 11 పెళ్ళిళ్ళలో అమ్మాయిలు హిందువులు. కానీ వారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్ళి చేసుకుని మతం మార్చుకోలేదు. ప్రతి అమ్మాయికి తాను చేసుకోబోతున్న వ్యక్తి మతం కుటుంబం ముందే తెలుసు. అంటే ”లవ్ జిహాద్” కేసు ఒక్కటి కూడా దొరకలేదు.
చట్టం చేయించాలంటే / ఆమోదం పొందాలంటే దానికి వాస్తవమైన ఆధారాలు ఉండాలి. ”యోగి” కాన్పూర్ కొండని తవ్వించినా ఒక్క ఎలుకా దొరక్కపోవడంతో ఇల్లు తగలబెట్టడానికి ఆర్డినెన్స్ అవసరమయ్యింది. భారత మానవాభివృద్ధి సర్వే ప్రకారం 15-19 సంవత్సరాల మధ్య వయస్సు అమ్మాయిల్లో 2.21% మంది మతాంతర వివాహాలు చేసుకున్నారు. ఈ వయస్సు అమ్మాయిల్లోనే మతాంతర, కులాంతర వివాహాలు మిగిలిన వయస్సు వారితో పోలిస్తే అత్యధికం. ఢిల్లీలో 2016-18 మధ్య 355 పెళ్ళిళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగితే 2019లో ఇది 598కి పెరిగింది. అంటే మతాంతర వివాహాలు పెరిగాయి. 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏ మతం, ఏ కులానికి చెందిన యువతీ యువకులయినా పెళ్ళాడవచ్చు. వారికి వారి మతం గురించి కానీ, పెళ్ళాడే వ్యక్తి మతం గురించి కానీ తెల్సి ఉండాలనే షరతు ఏదీ ఈ చట్టంలో లేదు. ఏ మతాన్నయినా అనుసరించే హక్కు రాజ్యాంగంలో
ఉంది. మత ప్రచార హక్కు కూడా ఉంది. కానీ బలవంతంగా మతం మారిస్తే అది నేరమవుతుంది. తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు కూడా ప్రాథమిక హక్కే. ఆ హక్కు ప్రకారం వచ్చిందే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్.
ఇప్పుడు యు.పి. సర్కారు వారి ఆర్డినెన్స్ 2019 హిమాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం 2019 (2006 చట్టానికి సవరణ) పై ఆధారపడింది. ఈ చట్టం బలవంతపు మత మార్పిడి గురించిన చట్టం తప్ప లవ్ జిహాదీ చట్టం కాదు. బలవంతంగా ఎవరి మతమయినా మారిస్తే 1 నుండి 5 ఏళ్ళ శిక్ష అని చెప్పే ఈ చట్టం కేవలం వివాహం కోసం మతం మార్చుకుంటే ఆ వివాహం గుర్తింపబడదు, రద్దవుతుంది అని కూడా చెబుతుంది. వాళ్ళు దళిత, ఆదివాసీ మహిళలు, మైనర్ బాలికలైతే 2 నుండి 7 ఏళ్ళ శిక్షను ఈ చట్టం ప్రకటించింది.
అలాగే మతం మార్చుకోదల్చుకున్న వాళ్ళు (పురుషులు కూడా) నెల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్‌కు తననెవరూ బలవంతపెట్టలేదని డిక్లరేషన్ ఇవ్వాలి. సదరు అధికారి దానిపై విచారణ జరిపి అనుమతించాలో వద్దో నిర్ణయిస్తారు. ఇటువంటి డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆ మత మార్పిడి చెల్లదు. ఈ చట్టం కిందికి వచ్చే నేరాలన్నీ బెయిల్ ఇవ్వకూడనివి/రానివి.
పెళ్ళికోసం మత మార్పిడి చేసుకుంటే ఆ యువకుడికి ఐదేళ్ళు, అదే ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలను చేసుకోవడానికి వారి మతం మారిస్తే పదేళ్ళు శిక్ష వేస్తామని ”యోగి” ఆర్డినెన్స్ ప్రకటించింది.
”లవ్ జిహాద్” పదాన్ని కేరళ కోసం వండి వార్చిన నేపథ్యంలో వచ్చేది హదియ (అఖిలా అశోకన్) కేసు. అఖిల తండ్రి 2016లో తన బిడ్డ అపహరణకు గురైందని ఫిర్యాదు చేస్తే ఆమె కోర్టుకు వచ్చి తాను మతం మార్చుకుని ఇల్లు వదిలానని అది తన అభిమతమని తెలిపింది. కానీ తండ్రి ఆమెను బలవంతంగా మతం మార్చి, మనసు మార్చి తీవ్రవాదిగా తయారు చేశారని వాదించాడు. అతను ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తి. అదే సంవత్సరం డిసెంబర్లో ఆమె తను వివాహం చేసుకున్నానని కోర్టులో చెప్పింది. కేరళ హైకోర్టు ఈ వివాహం మోసపూరితం కాబట్టి చెల్లదని హదియాను తల్లిదండ్రుల రక్షణలోకి పంపించింది. దీన్ని వారు సుప్రీంకోర్టులో సవాలు చేస్తే కోర్టు చాలా స్పష్టంగా… ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకున్న ఇద్దరు యుక్త వయస్కుల వ్యవహారం వ్యక్తిగతమైనదనీ, దానిలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. 24 సంవత్సరాల హదియ మానసిక ఆరోగ్యంతో నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నందున తల్లిదండ్రుల సంరక్షణ కుదరదని ఖరాఖండిగా ప్రకటించింది. ఇక్కడ లవ్‌జిహాద్ ఏమీ లేదని స్పష్టం చేసింది.
జాతీయ నేర పరిశోధనా సంస్థ (ఎన్ఐఎ) 2019లో కేరళలో, 2009లో కర్నాటకలో భూతద్దంలో గాలించి ”లవ్ జిహాద్” లేదని చెప్పాల్సి వచ్చింది. 2020 ఫిబ్రవరిలో ఒక ప్రశ్నకు జవాబుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ”లవ్ జిహాద్” కేసులేవీ లేవని లోక్‌సభలో ప్రకటించడమే కాకుండా రాజ్యాంగంలో 25వ అధికరణాన్ని ఉదహరించారు. అయినా లవ్‌జిహాద్ భూతాన్ని హిందూత్వ తవ్వి తీసింది.
ఈ లవ్‌జిహాద్ అనేది 1920ల నుండి హిందూ మతోన్మాదుల బుర్రలో పుట్టిన పురుగు. సవర్ణ హిందూ మేధావులు, సాధు సన్యాసులు, ఆర్య సమాజం, హిందూ మహాసభ, ఆరెస్సెస్ చత్రఛాయల్లో పెరిగిన రాజకీయ నాయకులు… వందల సంవత్సరాల ముస్లిం పాలనను కంటగించుకున్నారు. హిందువులు మగతనం (మగటిమి) కోల్పోవడం వల్లనే ముస్లిం పాలన వచ్చిందని ప్రచారం చేశారు… చేస్తున్నారు. కాబట్టి హిందూ యువకులు శారీరక దృఢత్వం పెంచుకోవడానికి హనుమాన్ వ్యాయామశాలలు కూడా స్థాపించారు. హిందూ స్త్రీలు దారితప్పకుండా చూసుకోవాలని కూడా హెచ్చరించారు.
అందమైన, అమాయకమైన హిందువులపై ముస్లింలకు మోజు (ముస్లింలు అందంగా ఉండరా?) ఎక్కువ కాబట్టి వారికి దొరక్కుండా హిందూ స్త్రీలను శిక్షించాలని పిలుపులు ఇచ్చారు. అష్టవర్షాభవేత్ కన్యా 8 ఏళ్ళకే కన్య… పెళ్ళి చేసేయాలని ఒకటవ శతాబ్దంలో మనువు చెప్పేశాడనేది కప్పిపెట్టి ముస్లిం బారినుండి కాపాడడానికే బాల్య వివాహాలు జరుగుతున్నాయని విషం జిమ్మారు. (పెళ్ళయిన స్త్రీల సింధూరం, తాళిబొట్టు చూసి వారిని ముట్టుకోని ముస్లింలు ఎంత ఉత్తములు పసి పిల్లల నుండి ముసలోళ్ళ దాకా ఎవర్నీ వదలకుండా అత్యాచారాలు చేసే రేపిస్టు హిందువులతో పోలిస్తే) స్త్రీల శీలాన్ని కాపాడి వారిని పవిత్రంగా ఉంచాలని అప్పుడే వారు ”దేశ మాత’లవుతారని వక్కాణించారు. కులాలకు, ప్రాంతాలకు అతీతంగా హిందూ మగాళ్ళ సౌభ్రాతృత్వం సంఘీభావం ఈ అంశంలో విరాజిల్లింది. ముస్లిం మగాళ్ళ మగటిమి, సంతానోత్పత్తి శక్తి ఆకర్షణ వల్ల హిందూ మగాళ్ళ మగతనం అవమానపడిందనే అబద్దపు వాదన మత భావనలున్న వారికి, వలస పాలన పరాజయంతో కుంగిన వారికి స్వాంతన కలిగించింది. స్త్రీలు చంచల స్వభావులు, అజ్ఞానులు కాబట్టి వారికి ఏం కావాలో వారికి తెలియదని, వారికి స్వేచ్ఛ ఉండకూడదన్న ”మనువు” స్వాతంత్య్ర పోరాటపు వింత వాదుల్లో, గత వైభవ పునరుద్ధరణ వాదుల్లో తిరిగి జన్మించాడు.
ఇప్పుడు ఒక లేని శత్రువును సృష్టించి విద్వేషం రగిలించకపోతే మతోన్మాదానికి మనుగడ లేదు కాబట్టి వారి మతాన్ని రక్షించడానికి హిందూ పురుషులు నడుం కట్టాలనే పిలుపు వలపుపై దాడి చేస్తున్నది. మెజారిటీతో రాజ్యాధికారం ఉంది కాబట్టి ఈ అనాగరిక రాజ్యాంగ విరుద్ధ భావనకు ఆర్డినెన్స్ తోడు తెచ్చారు. కానీ దీని మూలం మాత్రం అదే అరిగిపోయిన, పాతబడిన, కాలం చెల్లిన ఛాందస వాదమే. అది స్త్రీల శరీరాలను, వారి లైంగికత్వాన్ని, వారి కామవాంఛలను, సంతానోత్పత్తిని నియంత్రించడమే దీని అసలు రూపం.
తమకు ”తగని” అంటే కులం, మతం కాని పురుషుల పట్ల ఆకర్షింపబడకుండా జాగ్రత్త పడాలని అమ్మాయిలకు హెచ్చరికలు… మగవాళ్ళు… ప్రత్యేకించి కింది కులాలు దళితులు – సవర్ణుల్ని, ముస్లింలు… ముస్లిమేతర మతాల యువతులకి గాలం వేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. కాబట్టి స్వకులంలో స్వమతంలోనే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు మాత్రమే చేసుకుని పది మంది పుత్రుల్ని కని దేశమాతలుగా ఉండాలని ప్రబోధం.
కానీ సవర్ణ హిందూ పురుషులు తమ మగతనం నిరూపించుకోవడానికి ఉన్నావ్, హథ్రస్, బైర్లాంజి.. ఇంకా ఇటువంటి ఘటనల మాదిరి దళిత స్త్రీలపై, ముజఫర్‌పూర్, కతువా వంటి వాటి మాదిరి మైనారిటీ స్త్రీలపై అత్యాచారాలకు తెగబడవచ్చు. (”సమాధుల్లోంచి తవ్వి తీసి ముస్లిం స్త్రీలపై లైంగిక దాడి చేస్తాం” – యోగి 2013) ఎవరయినా స్త్రీలు కట్టు తప్పితే కింది కులం, వేరే మతం వారిని ప్రేమించే తెంపరితనం చూపే స్త్రీలు, తమ కులానికి ఎగువన పెళ్ళాడే దుస్సాహసం చేసే పురుషులు శిక్షించబడతారు.
అసలు యాంటీ రోమియో స్క్వాడ్లు, విహెచ్పి, భజరంగ్‌దళ్ గూండా గుంపులు యుక్తవయస్సులోని యువతీ యువకులు ఎక్కడ కలిసి కనబడినా వారిపై దాడులకు తెగబడడంద్వారా ప్రేమకు మాత్రమే సమాధి కట్టడం లేదు… స్త్రీలు తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే రాజ్యాంగబద్ధమైన హక్కును కూడా పాతిపెడుతున్నారు.
పరిపాలించే ప్రబుద్ధులు రాజ్యాంగానికి ట్టుబడి చట్టాన్ని అమలు చేయకపోతే ఆచారాలు, సాంప్రదాయాలు, మత కట్టుబాట్లు వంటి చట్టంకాని వాటి ఆశీస్సులతో అరాచకం రాజ్యమేలుతుందని డా||బి.ఆర్.అంబేద్కర్ ముందే హెచ్చరించారు. ఇది పౌరుల ఆలోచనా సరళిని, ప్రవర్తననే కాదు, అధికార యంత్రాంగం, చట్ట వ్యవస్థలు, న్యాయ వ్యవస్థల్లోని వ్యక్తుల భావాల్ని కూడా ప్రభావితం చేస్తుంది.
యువతీ యువకులు కుల మతాలకు అతీతంగా ప్రేమించుకుంటే పెళ్ళాడాలనుకుంటే, పోలీసులు, అధికారులు వారికి రక్షణ కల్పించడం అటుంచి ఆచార సాంప్రదాయాల్ని, కుటుంబ గౌరవాల్ని కాపాడమని సలహా ఇచ్చి తల్లిదండ్రులకు అప్పచెబుతారు. ప్రత్యేకించి స్త్రీలకు బుద్దులు, నీతులు, కర్తవ్యాలు బోధిస్తారు.
”వనవాసానికి వెళ్ళేటప్పుడు అస్త్రశస్త్రాలెందుకు”? అని అడిగిన సీతకు ”నువ్వు ఆడదానివి కాబట్టి నీకేం తెలియదన్న” రాముడి నుండి ప్రతి సందర్భంలో స్త్రీలను అజ్ఞానులుగానే, అబలలుగానే చూసిన మత సంస్కృతి కావచ్చు, ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలకు సమానమన్న ఇస్లాం కావచ్చు, స్త్రీని పురుషుడి కోసం అతని పక్కటెముకతో తయారుచేశాడు. దేవుడు అన్న క్రైస్తవం, ఇతర సవాలక్ష మతాల్లో స్త్రీలను మతిమాలిన వాళ్ళుగా, సహేతుకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేని వాళ్ళుగానే పరిగణించాయి. కుటుంబం, సమాజం, కులం, మతం, అన్నీ కూడా స్త్రీలు ఏం చేయాలి, ఏం చేయకూడదో అడుగడుగునా నిర్దేశించాయి. తమకు లభించిన పురుషులతో సంతృప్తి పడి సేవలు చేసి (వాడెంత నీచుడయినా, దుష్టుడయినా) పతివ్రతలుగా నిరూపించుకోవాలి. దిగజారిన, తలపొగరు… స్త్రీలు ఎవరయితే ఇతర కులాలు, మతాలలో ఉంటారో లేదా తమలో కూడా తిరగబడడం ద్వారా చెడిపోయిన స్త్రీలకు దూరంగా ఉండాలని నేర్పిస్తాయి. లక్ష్మణ రేఖ దాటితే శిక్షలు ఖరారు చేస్తాయి.
కనుకనే కుల దురహంకార హత్యల నివారణకు, ఖాప్ పంచాయతీల కట్టడికి చట్టం తేవాలని సుప్రీంకోర్టు సలహా చెప్పి ఏడేళ్ళయినా, వందలమంది ప్రేమికులు కుల మతాలకు బలయిపోతున్నా ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.
”వేశ్యలు మాత్రమే వారి భాగస్వాముల్ని ఎంచుకుంటార”న్న హర్యానా ఖాప్ పెద్ద మహేరుతికాయత్కు శిక్ష కాదు కదా కనీస ఖండన కూడా లేదు. తమ జీవన సహచరుల్ని ఎంపిక చేసుకునే హక్కును ఉపయోగించుకోవడం స్త్రీలు సిగ్గుపడాల్సిన విషయంగా, కుటుంబ పరువుగా తయారుచేసింది ఆరెస్సెస్. ప్రతిరోజూ ఈ లవ్‌జిహాద్ గాధలు భాజపా ఐటి సైన్యం సోషల్ మీడియాలో నింపుతోంది. వీటిలో ఎంత మాత్రం వాస్తవం లేదని, ఇది పూర్తి తప్పుడు ప్రచారమనీ కాస్తంత వివేచన ఉన్నవారికెవరికయినా అర్థమవుతుంది. కానీ అగ్ర రాజ్యం విశ్వగురువుగా మారే మైకంలో ఉన్న మధ్యతరగతికి ప్రశ్నే పరాయిదయ్యింది.
నాజీ పాలనలోని న్యూఎంబర్గ్ చట్టాలు యూదులకు, మిగిలిన వారికి వివాహ సంబంధాలే కాదు, లైంగిక సంబంధాలను కూడా నిషేధించాయి. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే మొదట్లో జైలు శిక్ష విధించారు. తర్వాత కాన్సంట్రేషన్ క్యాంపులకు పంపించారు. జాతి వివక్ష గల అమెరికాలోనూ, దక్షిణ ఆఫ్రికాలోనూ కూడా జాత్యాంతర వివాహాలు నిషేధించే చట్టాలు ఉండేవి. జాత్యహంకారులు, పోలీసులు ప్రేమ జంటలపై, దంపతులపై దాడులు చేసేవారు. ఆ చట్టాలు నల్ల చట్టాలుగా వివక్షాపూరితమైనవిగా భావించి ఎప్పుడో తొలగించారు. ఇప్పుడు మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆటవికత వైపు తిరోగమిస్తున్నాయి. మత దురహంకారానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం ఇది.
అయితే ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధమా? దీని అవసరం ఎంత? మొదటిది దాదాపుగా 10 రాష్ట్రాల్లో బలవంతపు మత
మార్పిళ్ళు నేరం… వాటికి శిక్షలున్నాయి. మైనర్ బాలికల వివాహం చట్టరీత్యా నేరం. ఒక కులంలో, ఒకే మతంలో జరిగినా అది నేరమే. 16-18 సంవత్సరాల యవ్వనపు వేడిలో లేచిపోయే వారిలో ఆ యువకులపై రేప్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. మొత్తం మైనర్ బాలికలపై జరిగే అత్యాచార కేసుల్లో ఉత్తర భారతంలో ఇవి 30% దాకా ఉంటాయి. మరిప్పుడు మైనర్ బాలికల పెళ్ళికి, మత మార్పిడికి ప్రత్యేక చట్టం ఎందుకు? 1929 నుండి బాల్యవివాహ నిషేధ చట్టం ఉంది కదా! అయినా 45 శాతం స్త్రీలకు 18 ఏళ్ళలోపే వివాహం జరుగుతోంది. ప్రపంచంలో మూడవ వంతు బాల్య వివాహాలు మన దేశంలోనే జరుగుతున్నందుకు మనకేం సిగ్గు, శరం లేదు. పైగా 18 ఏళ్ళ లోపు బాలికతో సంబంధం పెట్టుకుంటే, ఇష్టపడి లేచిపోతే అదే వయస్సు కుర్రాళ్ళకు జైలు… కానీ, ఘనమైన హిందూ వివాహం చేసుకుంటే 16 ఏళ్ళ బాలికపై 30 ఏళ్ళ మొగుడు అత్యాచారం చేయడానికి చట్టం అనుమతిస్తుంది.
పిల్లల జీవితాలను శాసించి అదుపులో ఉంచడమే పెద్దరికం అనుకునే తల్లిదండ్రులకు కొదవలేదు. అది ప్రేమని వాదించే మేధావులు తక్కువ లేరు. అసలు మౌలిక హక్కులకు భంగం కలిగించే ఈ ఆర్డినెన్స్ చట్టంగా ఆమోదం పొందదని తెలిసి చేయడానికి కారణం ముస్లింలను శత్రువులుగా, కుట్రదారులుగా విద్వేషం పెంచడానికే. చాంధసం తలకెక్కిన మెజారిటీని సంతృప్తి పరచడానికే…
ఈ ఆర్డినెన్స్ చెబుతున్నదేంటి? ముస్లిం యువకులు ఉద్యోగం వెతుక్కోకుండా పెళ్ళి చేసుకుని స్థిరపడకుండా… హిందూ అమ్మాయిల్ని ఆకర్షించి పెళ్ళి పేరిట మోసం చేసి మత మార్పిడి చేస్తారు. దీనికి ఏ సాక్ష్యం లేదు. హిందూ యువతులు అమాయకులు, కుర్రాడి గురించి ఏమీ తెలుసుకోకుండా (ముస్లిం యువకులు మతం దాచిపెడతారు) బుర్ర లేనట్టు పెళ్ళి చేసుకుని మోసపోతారు. వారిని రక్షించాలి. ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలు ఎర్రాళ్ళు కాబట్టి వారికి ప్రత్యేక రక్షకులుగా హిందుత్వ వాదులు అవతారం ఎత్తారు.
ఈ ఆర్డినెన్స్‌ను బట్టి ఎవరు ఫిర్యాదు చేయాలి? తల్లిదండ్రులే కాదు… బంధువులు, తెలిసినవాళ్ళు ఎవరయినా ఫిర్యాదు చేయవచ్చు… అంటే పాపం ప్రేమికులకు ఎటువంటి అవకాశం లేదు. ప్రతివాడూ ఒక్క ఉద్దారకుడైపోతాడు.
యుపిలోనే…రుకయ్యా… మతం మార్చుకుని ఆర్య సమాజపు పెళ్ళి చేసుకుని ముస్కాన్ ఆర్యగా మారింది. నెలరోజుల్లో ఆ ఆదర్శ హిందూ భర్త బయటికి తగిలేశాడు. ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయడం ఆమె వల్ల కావడం లేదు. తెలంగాణలో… రుక్సానాని పెళ్ళి చేసుకోవడానికి ఇస్లాం స్వీకరిస్తానని అంటున్న శ్రీనివాస్‌ను రుక్సానా తండ్రి ఆమోదించడం లేదు. మరి వీళ్ళ సమస్యల్ని ఎవరు… ఎట్లా తీరుస్తారు?
అట్లాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ క్రింద నెలరోజుల నోటీసు ఇవ్వనవసరం లేదని… అది యువతీ యువకుల వ్యక్తిగత ఎంపికను బహిరంగం చేసి ప్రశ్నించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ యువ జీవితాల్ని, ప్రేమల్ని అధికారుల పరం రాజకీయం చేసి వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా హరిస్తోంది.
ఇది కేవలం ఒక మతస్తులపై జరుగుతున్న దాడి కాదు. ఇది స్త్రీలను ఘోరంగా అవమానిస్తోంది. వారి విచక్షణపై, జ్ఞానంపై, తెలివిపై, ఎంపిక స్వేచ్ఛపై దాడి చేస్తోంది. దీన్ని పూర్తిగా మట్టిలో కలపాల్సిన బాధ్యత అవసరం అందరికంటే ఎక్కువగా స్త్రీలకే ఉంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ చట్టాలకి వక్రభాష్యాలు చెబుతోంది. సెప్టెంబర్ 2020లో అలహాబాద్ హైకోర్టు లవ్‌జిహాద్‌పై చట్టం తేవాలని సూచించింది. పోలీసులు, తల్లిదండ్రులు తమ విషయంలో జోక్యం చేసుకోరాదని మతాంతర వివాహం చేసుకున్న ఒక జంట కోర్టును ఆశ్రయించారు. కోర్టు కేసు తీసుకోవడానికి నిరాకరించింది. ఆ ముస్లిం యువతి ఒక నెల రోజుల్లో పెళ్ళి కోసం మతం మారింది కాబట్టి ఆ పెళ్ళి చెల్లదని భావించింది. ఇదే కోర్టు 2014లో పెళ్ళి తర్వాత మతం మారిన హిందూ యువతులకు రక్షణ కల్పించడానికి నిరాకరించింది. ఆ యువతులను తాము పెళ్ళి చేసుకుంటున్న వారు ముస్లింలని తెలిసి చేసుకున్నారో లేదో నిర్ధారించడానికి కూడా నిరాకరించింది.
ఒక కేసులో ఇస్లాంపై నమ్మకంతో మతం మారి, ఆ మతాన్ని హృదయపూర్వకంగా అనుసరిస్తే సరే కానీ, పెళ్ళి చేసుకోవాలనే
ఉద్దేశ్యంతోనో, పెళ్ళి ఆపుకునేందుకో, దత్తత కోసమో మారితే అది ఆమోద యోగ్యం కాదన్న సుప్రీంకోర్టు వాదనను ఉటంకించింది.
అదే సందర్భంలో, అనేకానేక సందర్భాల్లో జస్టిస్ చిన్నపరెడ్డి వంటి నిష్ణాతులయిన న్యాయమూర్తులు మత ఎంపిక స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ, లౌకిక వాదం కేవలం రాజ్యాంగ పీఠికలోని పదాలు కాదని, అవి రాజ్యాంగం మొత్తంలో అంతర్వాహినిగా కొనసాగే స్ఫూర్తి అని పదే పదే చెప్పిన వ్యాఖ్యలను మర్చిపోయింది.
కేవలం 2018లో హదియ కేసులో తీర్పు చెబుతూ ముగ్గురు జడ్జిల బెంచి చేసిన వ్యాఖ్య ”సామాజిక, నైతిక విలువలకు వాటికున్న స్థానం వాటిదే కానీ ఇవేమీ రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛకంటే అధికమైనవి కాదు. ఇటువంటి స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు, మానవ హక్కు కూడా. విశ్వాసం పేరిట అటువంటి స్వేచ్ఛ నుండి వంచించబడటం అనుమతించరానిది. ఒక హక్కును ప్రసాదించడం కంటే అది వాస్తవ రూపం దాల్చడం ముఖ్యం. వాస్తవంలో అమలయిన అటువంటి హక్కు ఎటువంటి సాంఘిక అపఖ్యాతినయినా త్రోసిపుచ్చుతుంది. పితృస్వామిక ఆధిపత్యాన్ని దూరంగా ఉంచుతుంది”. దీన్ని అలహాబాద్ హైకోర్టు పక్కనపెట్టింది.
ఇదే కేసులో తన ప్రత్యేక వ్యాఖ్య రాస్తూ జస్టిస్ చంద్రచూడ్ ”ఎలాంటి జీవితాన్ని ఎంచుకోవాలన్నది పూర్తిగా హదియ వ్యక్తిగత విషయం. వివాహం కోసం కానీ, వివాహ బంధానికి బయటగాని ఎటువంటి భాగస్వామి కావాలన్నది పూర్తిగా వ్యక్తిగతమైనది. వివాహంలోని సన్నిహిత సంబంధాలు వ్యక్తిగత జీవితపు పరిధి కేందంలో ఉంటాయి. ప్రభుత్వం కానీ, చట్టం కానీ భాగస్వాముల ఎంపికను శాసించడం గాని, ఆయా విషయాల్లో వ్యక్తి ఎంపికను పరిమితం చేసే పరిధులు విధించడం గాని కుదరదు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛా సారాంశం ఇదే” అన్న మాటలు ఈ దేశపు స్త్రీల జీవితాల్లోకి ఎప్పుడు వాస్తవాలుగా ప్రకటితం అవుతాయో!