డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి తండ్రి నారాయణస్వామి అయ్యర్, తండ్రి చంద్రమ్మాళ్ (ఆమె ఒక దేవదాసి). ఆ రోజుల్లోనే బాగా చదువుకున్న నారాయణస్వామి అయ్యర్ దేవదాసి దురాచారాలను ఎదిరించి నిలిచి, పోరాడి చంద్రమ్మాళ్‌ను వివాహం చేసుకున్నాడు.
ముత్తు లక్ష్మీరెడ్డి 1886 జులై 30న మద్రాసులో ప్రిన్స్‌లా స్టేట్‌లోని పురుక్కొట్టెలో జన్మించారు. ఆమె భర్త డాక్టర్ సుందర్ రెడ్డి. వారికి ఎస్.కృష్ణమూర్తి, ఎస్.రామ్మోహన్ అనే ఇద్దరు కుమారులు. ప్రముఖ సినీనటుడు, రాజకీయవేత్త జెమినీ గణేశన్ ఆమె మేనల్లుడు. ఆమెకు కుమార్తెలు లేకున్నా సమాజం చేత మోసగింపబడుతున్న ఆడపడుచులందరూ ఆమెకు కూతుళ్ళే.
కూడూ, గుడ్డా, గూడూ లేని నిరుపేద అనాథల కోసం, తాను దేవదాసి కూతుర్నయినందున ఇంకొకరికి ఆ దౌర్భాగ్యం రాకూడదని పోరాడిన శక్తివంతురాలు డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి.
ఆదిమ సమాజం విచ్ఛిన్నమై వర్గవైరుధ్యాలు తలెత్తిన నాటినుంచి స్త్రీ స్థానం దిగజారుతూ ఎన్నో కష్టాలను, పరాభవాలను ఎదుర్కొంటూనే ఉంది. నాగరికత తెలియని సమిష్టి జీవన కాలంలో అంటే ఆదిమ కాలంలో స్త్రీ గణనాయకి, శక్తిస్వరూపిణి, దైవపూజిత. కాలక్రమంలో తొలి వ్యవసాయ కాలంలో పురుషునికంటే ముందు పునరుత్పత్తి పద్ధతిని గ్రహించి వ్యవసాయం ప్రారంభించింది స్త్రీనే. వేటలో పురుషునితో సమానురాలు. అంతటి సాహసి, పురుష పీడన లేని స్వతంత్ర జీవనం గడిపిన స్త్రీ పురుషుడు కలలో కనిపించినా కంపించిపోయే దుస్థితికి చేరుకుంది.
సామాజిక పరిణామంలో రాజులు ఏర్పడుతున్న తరుణంలో అంతకుముందున్న సామాజిక ధర్మాలు మారుతున్న పరిస్థితులలో బౌద్ధమతం ఆవిర్భవించింది. బౌద్ధం స్త్రీని సంతానాన్ని నిరాకరించి ప్రజలను సన్యాసులుగా చేర్చింది. సంతానం వద్దనుకుని శూన్యంలో చేరి ప్రార్థనలు చేసిన కాఫిర్ల్లాగా అది ఆమరణ దీక్షలాంటిదే.
బ్రాహ్మణ, బ్రాహ్మణేతరుల మధ్య నిరంతర దీక్ష కొనసాగింది. ఘర్షణ చెలరేగింది. పుష్యమిత్రుడు సుమతీ భార్గవ అనే బ్రాహ్మణ పండితుడి చేత మనుస్మృతి రాయించాడు. హిందూ ధర్మం వేదాంతాన్ని తలెత్తుకుని స్త్రీలను తాంత్రిక పూజలకు పరిమితం చేసింది.
బానిసగా, బానిసకు బానిసగా, శృంగార నాయికగా, వేశ్యగా, దేవదాసిగా, సంతలో సరుకుగా, అతిధికి ఆతిధ్యంగా, భోగవిలాస వస్తువుగా, సంతానమిచ్చే యంత్రంగా, తాంత్రిక పూజకు బలిపశువుగా మార్చబడిరది స్త్రీ. కొన్ని తెగలు నీచమైన, హేయమైన మధ్యయుగ కాలంనాటి దురాచారాలు, మూఢనమ్మకాలు ఆత్మన్యూనతా భావాన్ని కలిగించడమే కాక ఆత్మగౌరవాన్ని కించపరిచే విధానాలను పురుషుల ప్రయోజనాల కోసం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. స్త్రీ ఎదుర్కొంటున్న కష్టాలు తలచుకుంటే కలలు కూడా కన్నీటి కడలులే! ఎదురీది పోరాడినా, సాధించినా, పరిష్కారాలు వెతుక్కున్నా మరొక కొత్త సమస్య ఎదురవుతూనే ఉంది.
బహు భార్తృత్వ విమోచనకై దీక్ష బూనినా, నిండు సభలలో మానభంగాలు, మహా పవిత్ర పతివ్రతలను కూడా అపహరించి అడవిపాలు చేసి అగ్ని పరీక్షలు గావించి, నిందలు శాపాలతో చిత్రహింసలపాలు చేశారు. గార్గి మైత్రేయి, విశ్వల ఘోష వంటి తార్కిక జ్ఞాన ధీరస్త్రీలను హైందవ ధర్మంలో అత్యున్నత ప్రామాణికమైన వివాహ తంతులో, మహోత్సవంలో పఠించే వేదమంత్రాలలో 8 శ్లోకాలు సౌమిత్రి అనబడే ఒక స్త్రీ వ్రాసినవే. పురాణ చరిత్రలలో వీరి ప్రాముఖ్యత చాలా తక్కువ. అన్నిటనీ త్యజించి జీవితాన్ని దైవారాధనకు అంకితం గావించుకుని ప్రజలలో ప్రేమ, ఆరాధన, దైవభక్తి పెంపొందించాలనుకున్నారు.
కొంతకాలం వీరిని పవిత్రంగా, దైవారాధకులుగా గౌరవించినా రాజ్యాధికారాలు, మత ఛాందస వాదుల కామవాంఛకు పశుబలంతో దేవదాసీలు, రాజనర్తకులుగా కాలక్రమంలో వేశ్యలుగా మార్చారు. రాజులు, ఆగ్రవర్ణాధిపతులు బౌద్ధ, జైన వ్యాప్తికి వ్యతిరేకంగా శైవ, వైష్ణవ మతవాదులు ప్రజలను ఆకర్షింపచేయుటకు స్త్రీని వశపర్చుకుని ఆయుధంగా మార్చుకున్నారు.
స్త్రీ విద్యకు, విజ్ఞానానికి దూరమై గౌరవస్థానం దిగజారి దిక్కులేని అనాధగా, ఆటబొమ్మగా మారింది. క్షీణదశలో చీకటిలో కూరుకుపోయింది. మతవ్యాప్తి కోసం ఆలయాలు నిర్మించారు, కళలను పోషించారు. ఆలయంలో దేవుని ప్రతిష్టించి దైవపూజకు అర్చకులను నియమించారు. పూజలో భాగంగా స్త్రీల నృత్యం ఏర్పాటు చేశారు. వారిని ‘దేవదాసీ’లని పిలిచారు. బ్రిటిష్ ప్రభుత్వం వారిని వేశ్యలుగా చూసింది. వ్యవస్థలెన్ని రూపాలు మార్చినా స్త్రీ స్థితిగతులు, సమస్యలు మారలేదు.
బ్రాహ్మణాధిపత్య సమాజం మీద, కుల వ్యవస్థ మీద ఆయుధంలేని భావజాల పోరాటం, యుద్ధం చేసిన స్త్రీలెందరో?!
ఆధునిక రాజకీయ వాతావరణ పురుషాధిక్యత మత, సాంఘిక, సాంస్కృతిక జీవితంలో విఘాతమేర్పడి మేథాపరిజ్ఞానలు, విద్యావంతులు, ధీరవనితలు క్షీణదశకు చేరుకున్నారు. స్త్రీ విద్యకు దూరమయింది. స్త్రీల దురాచార కట్టుబాట్ల పీడన, బానిసత్వం నుండి విముక్తి, స్వేచ్ఛ పొంది అభివృద్ధి చెందుటకు ఎందరో మహాపురుషులూ పోరాడారు.
హైందవ సమాజంలో సతీసహగమనం, కన్యాశుల్కం వ్యాప్తిలో ఉండేవి. ఈ దురాచారాన్ని రాజారామ్మోహన్ రాయ్ చట్టపరంగా రద్దు చేయించారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వితంతు వివాహాలను అడ్డుకున్నారు. జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాలికల పాఠశాలలు నడిపించారు. ఇలా ఎందరో! ప్రకృతి అందాలకు తన్మయుడైన మానవుడు దాని విపత్తులకు కూడా భయభ్రాంతుడయ్యాడు. గ్రహాలను, దిక్కులను, పంచభూతాలను దేవుళ్ళుగా భావించి అనుభవ స్పందనలతో చైతన్యం చెంది ఆడాడు, పాడాడు, నర్తించాడు. జానపద కళల నుండే శాస్త్రీయ నృత్యాలు సంస్కరించబడ్డాయి, కళలు ఉద్భవించాయి, శిల్పాలు చెక్కబడ్డాయి. అంతటి అనుభవ శాస్త్రీయతను మరుగుపరచి వాటి స్థానంలో భోగ రసిక విలాస పురుషులు కామక్రీడ, బూతు బొమ్మలు చెక్కించారు. ఆలయాల్లోని పవిత్ర కళ్యాణ మండపం భోగమండపంగా మారింది. శాస్త్రీయ నృత్యాలను సామాన్య ప్రజలకు అందకుండా దేవదాసీలకు పరిమితం చేశారు.
కవులు రచించిన స్త్రీ, పురుష దేవుళ్ళకు మధ్య సాగిన శృంగార కార్యకలాపాలే ఆరాధనకు మూలాలు. పచ్చి శృంగార జావిళులు పురుషులు సృజించినా వాటిని అనుభవంలో పోషించింది దేవదాసీలు, ఉన్నత వర్గాలే. 19వ శతాబ్ది నుండి కొందరు ప్రముఖులు స్త్రీ అభివృద్ధి సంస్కరణలు ప్రారంభించారు.
ఈ తరం దేవదాసీలు అంటే ఎవరు? వారి బ్రతుకులు ఎలాంటివి? అని అడిగితే… ఆయా ప్రాంతాలలో దేవదాసీలను జోగిని, మాతంగి, గణికలని పిలిచేవారు. గ్రామ ప్రజలు 15`20 సం॥లలోపు కన్యలను గ్రామ పెద్దలు లైంగికానందం కోసం ఈ వ్యవస్థలోకి దింపుతారు. కొన్ని ప్రాంతాలలో ఈ విషయం రహస్యంగా ఉంచడం కోసం గౌరవనీయంగా, పెద్ద ముత్తయిదువులని పిలవబడతారు. కర్నాటక రాష్ట్రంలోని నవిశపన కల్లు మండలంలోని ఒక గ్రామంలోని పవిత్ర ప్రసిద్ధ దేవాలయమయిన ‘‘ఉలింగమ్మ’’ అనే దేవత దగ్గరకు పరిసర గ్రామాల్లోని ప్రజలంతా వెళ్ళి అక్కడ దేవుడితో దేవదాసీలకు పెళ్ళి అనే తంతు చేస్తారు. వీరికి ఎరుపు, తెలుపు రంగులతో కూడిన పెద్ద పూసల హారాన్ని మెడలో కట్టిస్తారు. చేతికి రెండు వెండి గాజులు తొడిగి దేవదాసి వృత్తిలోకి దింపుతారు. అందుకోసం అమ్మవారిని (దేవతని) వేడుకుని అనుమతి పొందుతారు. దండోరా వేయించి ఆమెను దేవదాసీగా ప్రకటిస్తారు. ఆమె దేవతకు నిత్య ఆరాధనార్చకులుగా, ఉత్సవాలలో నృత్యం చేసేదిగా చెప్తారు. నిజానికి వారు గ్రామ పెద్దల కోరికలకు, విలాసాలకు బలవుతుంటారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా….
ఒడిస్సా లోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ఇప్పటికీ నృత్య ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. స్త్రీ వాదం పట్ల, చరిత్ర పట్ల, ఆత్మగౌరవ అవసరాల పట్ల చాలామందికి అవగాహన ఉండదు. ముత్తు లక్ష్మీరెడ్డి ఒక విద్యావంతురాలిగా పై పరిస్థితులన్నింటినీ ఆకళింపు చేసుకున్నారు. ఆమె కేవలం తన తలరాతనే కాకుండా దేవదాసీలందరి దౌర్భాగ్య దుస్థితిని మార్చాలనుకున్నారు. బానిసత్వంతో మగ్గిపోతున్న స్త్రీల బ్రతుకులను పునరుద్ధరింపదలచారు. తండ్రి నారాయణస్వామి అయ్యర్ స్కూల్ ప్రిన్సిపల్ కావడం చేత అదే పాఠశాలలో చదువుకోవడం ఆమెకు సులభమైంది. ఆయన కూతురి చదువు విషయంలో ఎంతో శ్రద్ధ వహించారు. ఆమెకు శక్తివంతమైన ఆత్మవిశ్వాసాన్ని అందచేశారు. తరగతిలో మొదటి శ్రేణి మార్కులు పొందేలా తీర్చిదిద్దారు. తరగతిలో మగపిల్లలు 60 మంది ఉంటే ఆడపిల్లలు ముగ్గురే
ఉండేవారు. తర్వాత ఆ పాఠశాలలో ఎంతోమంది తమ పిల్లల చదువులను మాన్పించారు, కారణం ఆ పాఠశాలలో ఒక దేవదాసి కూతురు ఉండడమే. కొందరు ఉపాధ్యాయులు తరగతులను బహిష్కరించారు, ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అయినా నారాయణస్వామి అయ్యర్ వెనుకాడక మాధ్యమిక విద్యను పూర్తి చేయించి ఇంటినుండే ప్రైవేటుగా పాఠాలు చెప్పించి ఆ మాస్టారు సహాయంతో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేయించారు.
ముత్తులక్ష్మీరెడ్డి అంతటితో తృప్తి చెందక చదువు కోసం పురుక్కొట్టె మహారాజు దగ్గరకు వెళ్ళి తనకు వైద్యవిద్య చదవాలని కోరిక ఉందని, డబ్బు సహాయం చేయవలసిందిగా ప్రాధేయపడిరది. ఆమె కోరిక విని విభ్రాంతి చెందిన మహారాజు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుని ఆమె చేతిలో రూ.150 పెట్టాడు. ఆ సహాయం ఆమె జీవిత గమనాన్నే మార్చివేసింది. అలా ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీలో చేరిన మొదటి మహిళా విద్యార్థిని అయింది. ఎంతో తెలివైనది కావడం వల్ల, కష్టపడడం వల్ల ఎన్నో బహుమతులు, మెడల్స్ ఆమెను వరించాయి. రక్తం కళ్ళ చూడడం అంటే ఆడవాళ్ళకు అసాధ్యం అనుకునే రోజులవి.
ముత్తు లక్ష్మీరెడ్డి తాను సర్జన్‌ను అవుతానని ప్రొఫెసర్లకు విన్నవించుకుంది. అది విని ప్రొఫెసర్లు విభ్రాంతికి గురయ్యారు. కానీ ఆమె కోరిక, కార్యసాధన వల్ల గైనకాలజిస్టు అయ్యింది. ఎన్నో క్లిష్టమైన కేసుల్లో తల్లీ, బిడ్డల ప్రాణాలు కాపాడి ఎలైట్ ప్రొఫెషన్లకు తన సేవలందించింది. అక్కడినుండి ఆమె జీవితంలో మరో మలుపు మొదలయింది. తన చెల్లెలు క్యాన్సర్ జబ్బుతో మరణించడం వల్ల ఆ వ్యాధికి ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంది ఆమె. దానికోసం బ్రిటన్‌లోని రాయల్ మార్సడన్ హాస్పిటల్‌కు శిక్షణకు వెళ్ళింది. అక్కడ చాలావరకు నేర్చుకుని మద్రాస్‌కు తిరిగి వచ్చింది. అనేకమంది క్యాన్సర్ రోగులకు సేవలందించింది.
ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ సంస్థ సహాయాన్ని కోరి వారిచ్చిన విరాళాలతో మొదటి క్యాన్సర్ ఆస్పత్రిలో అడయార్ క్యాన్సర్ సంస్థను ప్రారంభించింది. వేశ్యాగృహాల నుంచి తప్పించుకుని పారిపోయి శరణు కోరి వచ్చిన యువతులకు ఆశ్రయమిచ్చి వారికి అన్ని వసతులు కల్పించింది. అంతేకాకుండా వారి సమస్యలను మూలాలతో సహా తొలగించాలని పట్టుదల పూనింది. ముగ్గురు దేవదాసీలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఒక గొప్ప యోగిని అయిన ‘‘అవ్వయ్యార్’’ పేరిట ‘అవ్వాయి హోమ్’ను స్థాపించింది. అందులో చేరి చదువుకుని ఉత్తమ జీవితాలను గడిపినవారెందరో! తర్వాత ఆమె సరోజినీ నాయుడుని కలిసింది. ఆ పరిచయం ఆమెను జాతీయస్థాయికి మార్చింది. ఆమె రాజకీయ శక్తిని అర్థం చేసుకుంది. బ్రిటిష్ ఇండియాలో లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎంపికైన మొదటి మహిళగా నిలిచింది. అనేకమంది చీకటి బ్రతుకుల్లో ఆనంద జ్యోతులు వెలిగించి, బాసటగా నిలిచి వెలుగుబాటను చూపింది. ఆమె అమృత హృదయి అని, ప్రతి మానవునిలో మాధవుడిని చూసిందని, ఒక మహత్తర మానవీయ వ్యక్తి అని వారి కుటుంబానికి సన్నిహితుడైన నటరాజు రామకృష్ణ పేర్కొన్నారు.
బుద్ధుని కాలంలో ఆమ్రపాలి ఒక వేశ్య. నాగరత్నమ్మ ఒక దేవదాసి ఉండేవారు. బెంగుళూరు వాసి అయిన ముద్దుపళని అనే వేశ్య వ్రాసిన గ్రంథాలను నాగరత్నమ్మ అచ్చు వేయించారు. నాగరత్నమ్మతోను, ఆమె కుమార్తె యామిని పూర్ణ తారకంతోనూ బెంగుళూరులో యువతీ శరణాలయాన్ని నిర్వహిస్తున్న చెంచయ్య ఒక పత్రికను ప్రారంభింపచేశారు. జోగినీ మాతంగి ఆరవ తరం అన్నాబత్తుల వంశంలోని ఒక దేవదాసి జరిపిన పోరాటంతో ఆమె కీర్తి నలుదిశలా వ్యాపించింది. కాన్పూర్ పట్టణంలో ఒక దేవదాసి స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిరది. ఆమెను ఆంగ్లేయులు ఫిరంగి గుండ్లతో చంపివేశారు. ఇలా బయటికి తెలియని ఎంతోమంది స్త్రీ మూర్తులు ఉన్నారు. దక్షిణాది కళల గురించి వ్రాసేవారిలో చాలామంది నేడు స్వర్గీయ కృష్ణయ్యర్ సతీమణి రుక్మిణీ ఆరీండేల్ గురించి, ఇతర కళావేత్తల గురించి ప్రస్తావిస్తూ
ఉంటారు కానీ ముత్తు లక్ష్మీరెడ్డిని గురించి, ఆమె తెచ్చిన చట్టం గురించి ఎవరూ తలచుకోకపోవడం దురదృష్టకరం.
కాశ్మీరులో దేవదాసీలను ‘హఫీజా’లని, దక్షిణ భారతంలో ‘దేవదాసీ’లని, అస్సాంలో ‘నటి’ అని (అస్సాంలో నటి అనబడే నృత్యాన్ని దేవదాసీలు చేస్తారు), ఒరిస్సాలో ‘మహరీ’లని, ఇతర ప్రాంతాలలో నా చక్, నాచ్నీ, రండీ నాచ్గనా, పతిత, తవైఫ్… ఇలా ఒకోరకంగా పిలుస్తారు. ఎలా పిలిచినా అందరి బ్రతుకులు ఒక్కటే. వీరి కుటుంబాలలో స్త్రీల శారీరక, మానసిక, లైంగిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపులకు, సమాజంచే చిన్నచూపునకు గురవుతున్నారు. యవ్వనం ఉడిగిన తర్వాత వీరు భిక్షాటన చేస్తూ బ్రతుకును వెళ్ళదీస్తున్నారు.
ముత్తు లక్ష్మీరెడ్డి తీసుకువచ్చిన చట్టం జారు ప్రభుత్వంపై రష్యా సాధించిన విజయంగా, రష్యా విప్లవం వంటిదేనని నటరాజ రామకృష్ణ తన వ్యాసంలో అభివర్ణించారు. ప్రముఖుల, ప్రసిద్ధుల జయంతి, వర్ధంతి తేదీలలో వారికి సంబంధించిన సంస్మరణలు, సమావేశాలు జరుపుకుంటారు కానీ సమాన స్థాయి శక్తివంతురాలైన ఒక మహా మనీషి, గొప్ప మహిళను తలచుకోలేని మన దురదృష్టం ఎంతో బాధాకరమైనది. స్త్రీ పురుషులు సమానం అనే నిబంధనతో డాక్టర్ సుందర్ రెడ్డిని పెళ్ళి చేసుకున్నారు ఆమె. ఒకే సమయంలో రెండు యుద్ధాలు చేసిన ఘనురాలు ఆమె. క్యాన్సర్ హాస్పిటల్ కోసం స్థలాన్ని సేకరించడం, దేవదాసీలకు విముక్తి కల్పించడం… రెండిరటిలోనూ విజయం సాధించింది. ఒక సభలో సి.రాజగోపాలాచారి దేవదాసీల పట్ల అసభ్యంగా, అమర్యాదగా సంబోధించడంపై అదే సభలో వక్తగా ఉన్న ముత్తు లక్ష్మీరెడ్డి ఆయనపై గర్జించింది. ‘‘ఇదేనా సంస్కారం? మగవాళ్ళు పవిత్రతను ఆచరించకుండా ఆడవాళ్ళు పవిత్రులెలా కాగలరు? కళలు, సంస్కృతిని కాపాడవలసినది ఒక్క దేవదాసీలేనా? మీ ఇంటి ఆడవారికి ఆ బాధ్యత లేదా?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు.
నిండు సభలో ఆమె సి.రాజగోపాలాచారితో పాటు యస్.సత్యమూర్తి మీద విరుచుకుపడిరది. నిర్భయంగా, ధైర్యంగా ప్రశ్నించింది. ఆమె మాటలు తూటాలై నిలిచాయి. 5 డిసెంబర్ 1947లో దేవదాసీ వ్యవస్థను రద్దు చేస్తూ మద్రాస్ ప్రెసిడెన్సీలో బిల్లు పాస్ అయింది. మరోవైపు క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది. ఆమె నిధుల కోసం కనిపించిన ప్రతివారినీ అర్థించింది. కింగ్ జార్జి ` 5 ని కూడా అర్థించింది. ఈనాటి వరకు ఈ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. పద్మభూషణ్ వంటి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. తమిళనాడు ప్రభుత్వం గర్భిణీలకు ఇచ్చే ‘ప్రగ్నెన్సీ బెనిఫిట్స్ స్కీం’కు ఆమె పేరే పెట్టింది. చెన్నైలో ఆమె పేరుతో ఒక రోడ్డు కూడా ఉంది. ఆమె తన విజయాన్ని అందరికీ పంచిపెట్టింది. ఫలితాన్ని అనుభవింపచేసింది. తుదకు ఆమె 22 జులై 1968లో తుదిశ్వాస విడిచింది. ఆమె నిజమైన వీరనారి.
ఇకనుండి అందరూ ఆమెను ఎల్లవేళలా స్మరించుకోవాలని ఆశిద్దాం.