పదేళ్ళపైన అయిందనుకుంటాను నేను ‘‘గ్రీఫ్ టు బరీ’’ అనే పుస్తకం రాసి. చాలా కష్టపడి రాశానా పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని కమల భసీన్కు అంకితం ఇచ్చాను. నాకు తెలిసిన వారందరిలో ఎక్కువ విషాదాన్ని, బాధనీ అనుభవించిందీ, దాన్ని లోపల పాతేసిందీ కమలే.
గత నాలుగు దశాబ్దాలుగా మేమిద్దరం కలిసి తిన్నాం, తాగాం, డాన్స్ చేశాం, వాదించుకున్నాం, పోట్లాడుకున్నాం, పిచ్చిగా నవ్వుకున్నాం. గత నెలలో ఆమెకు 75 సంవత్సరాలు నిండాయి. ఎవరైనా ఈ విషయం విని ఫరవాలేదు, పోవచ్చు అంటారేమో. కానీ ఆమె సృష్టించిన అనుబంధాలు, ప్రేమ అంతులేనివి. ఆమె వందేళ్ళు బతికినా సరే ఆమె వెళ్ళిపోతుందంటే ఏడుస్తాం. ఆమె అలాంటి మనిషి. ఆమె జీవితాన్ని అమూలాగ్రం జీవించింది. కమల ఇక తన జీవితానికి ఇదే ఆఖరి క్షణమన్నట్లు పాడేది, డాన్సు చేసేది, నవ్వేది, దూకేది. ఆమెనుంచి నేను, నా నుంచి ఆమె ఎంతో నేర్చుకున్నాం.
ప్రతిదాన్నీ పాటగా మార్చే వరమేదో ఆమెకు ఉంది. సినిమా పాటలను, జానపద పాటలను, పోరాట పాటలను తీసుకుని నిమిషంలో ఆ వరసల్లో ఫెమినిస్టు పాటలుగా మార్చి అక్కడున్న వారందరిచేతా నృత్యం చేయించేది. ఆమె వీర ఫెమినిస్టు. అందరినీ తన విశ్వాసంవైపు మార్చాలనే ఆతృతతో పితృస్వామ్యం గురంచీ, ఆ తరువాత జెండర్ గురించీ మాట్లాడేది. ఆమె పిల్లల కోసం కథలు, పాటలు, కవితలు రాసింది. మాట్లాడేటపుడు పితృస్వామ్యం గురించీ, స్త్రీల సమానత్వం గురించీ, విముక్తి గురించీ, శాంతి గురించీ ఆవేశంగా మాట్లాడేది. కమల కేవలం భారతదేశానికి చెందిన మనిషి కాదు. ఆమె ప్రేమ, స్నేహం, శాంతి గురించిన కాంక్ష ఉపఖండమంతా వ్యాపించాయి. నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో నాకున్న స్నేహాలు ఈమెవల్ల ఏర్పడినవే. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ)లో ఆమె ఒక ఆఫీసరుగా పనిచేసింది. తనకున్న సంబంధాలను ప్రజా ఉద్యమాలు, స్త్రీల సంఘాలు అవతరించి అనేక నెట్వర్క్లు ఏర్పడటానికి కారణమయ్యేది. పనిలో తన భాగస్వాములైన వారిని స్త్రీల హక్కుల గురించీ, శాంతి గురించి, పని చేయడంలో తమ బాధ్యతలను గురించి అర్థం చేయించడానికి ఆమె చూపే సహనం అసాధారణమైనది. ఆమె ఆనందం, ఆకర్షణ ప్రజలు ఆమెను అభిమానించటానికి, ఆరాధించటానికీ కారణం. ఆమె ప్రభావం, పలుకుబడీ పెరిగిన క్రమంలో ఆమె ఒక ఆరాధ్య అయిపోయింది, అభిమానించబడిరది, పూజించబడిరది. ఆమె మొదలుపెట్టిన లేదా ఎంచుకున్న ఏ ఉద్యమమైనా ఈవ్ విన్స్లర్ ప్రారంభించిన ‘‘వన్ బిలియన్ రైజింగ్’’లా ఒక ప్రపంచ స్థాయి ఉద్యమ స్వభావాన్ని సంతరించుకునేది. ‘‘పీస్ విమెన్’’ అనే గ్లోబల్ గ్రూపులో ఆమె భాగస్వామి. ఆ గ్రూపు ఏం చేసిందంటే` నోబుల్ శాంతి బహుమతి ఒక వ్యక్తికి ఇవ్వటం కంటే ప్రపంచమంతటి నుంచీ వేయిమంది స్త్రీలను ఎంపిక చేసి వారికి ఇవ్వాలని డిమాండ్ చేసి దానికోసం పనిచేసింది. భారతదేశం నుంచి ఎంపికైన నూరుగురు మహిళలలో నేనూ ఉన్నాను. ఆ సమయంలో రాష్ట్రమంతటి నుంచీ ఎందరో స్త్రీలు వచ్చి నన్ను స్నేహా లింగనాల్లో ముంచెత్తి నేను ఎంపికైతే వారు ఎంపికైనట్లేనని చెప్పిన ఆ సందర్భాన్ని నేనెన్నటికీ మర్చిపోలేను. నేను ఏ స్త్రీలతో పనిచేశానో వారు నాపై చూపిన ప్రేమను, నమ్మకాన్నీ అనుభవించేలా చేసినందుకు వారికి కృతజ్ఞురాలినై ఉంటాను. నేను అలా అనుకుంటే ఇక కమల పొందిన ప్రేమను, విశ్వాసాన్ని, కృతజ్ఞతను ఊహించుకోండి. కొన్ని పొరపాట్లు చేయకుండా, కొందరు శత్రువులు లేకుండా ఆ ఎత్తులకు ఎదగటం సులభం కాదు. కానీ కాలం గడిచేకొద్దీ ఆమెతో కలిసి పనిచేసిన వారంతా ఆమెను ప్రేమాభిమానాలతో తలుచుకుంటారు.
ఆమె వెళ్ళిపోయినా ఆమె పాటలు, పుస్తకాలు ఎంతో కాలం జీవించి ఉంటాయి. ఆమె అనుచరులం కాని కొద్దిమంది స్నేహితులం, సమానులం ఆమె ఆత్మీయతను, ఆదరాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఆమె స్త్రీల భుజాల మీద మోశారు, వారు ఆమె అంతిమ సంస్కారాల సమయంలో ఆమె పాటలు పాడారు. ఏ మహిళకూ ఇంతకంటే గొప్ప ముగింపు ఉండదు. శక్తితో, శక్తిలో విశ్రాంతి పొందు కమలా, నా ప్రియ స్నేహితురాలా! నా ప్రేమ నిత్యం నిరంతరాయంగా నీతో ఉంటుంది.