నీరాదేశాయ్‌ (1925 – 2009)

మూలం : విభూతి పటేల్‌, అనువాదం : ఆర్‌. శశికళ
(భారత మహిళా అధ్యయన కేంద్రాల సృష్టికర్త, స్త్రీ హక్కుల కార్యకర్తల స్త్రీ ఉద్యమాల సమన్వయకర్త మహిళాంశాల
అధ్యయనంలో అగ్రగామి)
 మహిళా అధ్యయన కేంద్రాల నమూనా సృష్టించిన వివిధ కుల, మత, ప్రాంతాలకు జాతులకు, సంబంధించిన స్త్రీల హక్కుల కోసం పనిచేసే కార్యకర్తలకు మహిళా ఉద్యమకారులకు తన జీవిత కాలమంతా సహకరిస్తూ, ఆదరిస్తూ వారి చైతన్యంలో భాగం అయిన నీరాదేశాయ్‌ జూన్‌ 25వ తేదీ 2009న తుదిశ్వాస విడిచారు. ఎస్‌.ఎన్‌.డి.టి, ముంబయి యూనివర్సిటీ కేంద్రంగా అమూల్యమైన తన కాలాన్ని మొత్తం స్త్రీల హక్కులకోసం నినదించే అధ్యాపకురాలిగా సేవ  లందించారు. విస్తృతమైన ఆమె జ్ఞానాన్ని స్త్రీల  పట్ల ఆమె అభిమానాన్ని స్మరిస్తూ ”ఎకనమిక్‌ మరియు పొలిటికల్‌” వీక్లీలో విభూతి పటేల్‌ అందిస్తున్న వ్యాసానికి స్వేచ్ఛానువాదం. విభూతి పటేల్‌  ఎస్‌.ఎన్‌.డి.టి. యూనివర్సిటీ ముంబయిలో 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. నీరాదేశాయ్‌ గారితో తన అనుభవాలను సాన్నిహిత్యాన్ని ఈ వ్యాసంలో వివరించే ప్రయత్నం చేశారు.
భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని అభిమానించే ఒకానొక గుజరాతీ మధ్య తరగతి కుటుంబంలో నీరాదేశాయ్‌ 1925న జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్ధినిగా ఉన్నరోజుల్లోనే గాంధీగారు ఏర్పాటుచేసిన ‘మంకీబ్రిగేడ్‌’ లో చురుకుగా పనిచేశారు. ఇప్పుడు కున్నీకల్‌ నారాయన్‌గా పిలువ బడుతున్న మందాకిని, స్వాతంత్య్ర ఉద్యమకాలంలో అండర్‌ గ్రౌండ్‌లో రేడియో వాయిస్‌ ఆఫ్‌ ఇండియా నడపిన ఉషా మెహతా కూడా ఆ బ్రిగేడ్‌లో నీరాదేశాయ్‌తో కలిసి పనిచేశారు. కళాశాల విద్యార్ధినిగా 1942లో క్విట్‌ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. పలుమార్లు అరెస్టు అయ్యారు. స్వాతంత్య్రం తర్వాత ‘నీరా’ తన పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ సోషియాలజీలో పూర్తిచేశారు. చిన్ననాటి నుండే ఆమెలో సోషలిస్టు భావాలు మొదలయ్యాయి. డాక్టరేట్‌ కోసం ‘ఆధునిక భారతదేశంలో స్త్రీలు’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. వైదిక కాలం నుండి ఉద్యమకాలం వరకూ భారత స్త్రీల ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక కోణాలనూ నిశి తంగా అధ్యయనం చేసిన పద్ధతి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ గ్రంథానికి కమలాదేవి ఛటోపాధ్యాయ ముందుమాట వ్రాశారు. ఆమె సునిశితమైన పరిశీలనను ‘ఫెమినిస్టు విశ్లేషణ’ గా పోల్చారు. అందులోని అనేక అంశాలు తర్వాతి కాలంలో స్త్రీల హక్కుల ఉద్యమకారులకు మార్గదర్శక మయ్యాయి. అంటే ఆమె అప్పటికాలం కంటే ఎంతో ముందున్నారు.
1950వ సం|| నీరాదేశాయ్‌ ఎస్‌.ఎన్‌. డి.టి మహిళా విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్ర అధ్యాపకురాలిగా చేరారు. ఆనాటినుండి ఎన్నో నిర్ణయాత్మక సంస్థల్లో విశిష్టమైన సేవలు అందించారు. ప్రొఫెసర్‌ మరియు హెడ్‌ గానే కాక 1970-84 లల్లో విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కూడా విశిష్టమైన సేవలను అందించారు. ఎన్నెన్నో అత్యున్నత పదవులు అలంకరించారు. ఉమెన్‌ స్టడీస్‌ అధ్యయనం కోసం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ మరియు పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశారు. రూరల్‌ డెవలప్‌మెంటు సెంటర్‌  ఫౌండర్‌ మెంబర్‌గా 1984 వరకూ పనిచేశారు. నిగర్విగా, విశిష్టమైన వ్యక్తిత్వంతో  ఆమె చేసిన సేవలను విస్తారమైన ఆమె జ్ఞానాన్ని ఎస్‌.ఎన్‌.డి.టి ఎన్నటికీ గుర్తుంచుకొంటుంది.
12వ శతాబ్ధంలోని భక్తి ఉద్యమం, 19వ శతాబ్ధంలో నడిచిన సాంఘిక సంస్కరణ ఉద్యమం స్ఫూర్తిగా ఆమె పరి శోధనా రచనలు వెలవడ్డాయి. ఈ అంశాలు యువ పరిశోధకుల రచనల్లో వ్యక్తీకరించ బడ్డాయి. కవితలు, పరిశోధనల్లో ప్రతిఫలించాయి. 1974లో తయారుచేసిన రిపోర్టు ‘సమానత్వం వైపుగా’ 1988లో శ్రమశక్తి రిపోర్టు  1988-2000 లో నేషనల్‌ పర్‌స్పెక్టివ్‌ ప్లాన్‌ ఫర్‌ ఉమెన్‌  వీటిని రూపొం దించటంలో  ఆమె  కీలక  భూమిక పోషించారు. 1988లో మైత్రేయి కృష్ణరాజ్‌తో కలిసి ‘భారతదేశంలో స్త్రీలు మరియు సమాజం’ అనే పుస్తకం వెలువరించారు. తర్వాతికాలంలో మహిళాంశాల అధ్యయనం లో, పాఠ్యాంశాల తయారీలో రాజకీయ, సామాజిక, ఆర్థిక భాషాశాస్త్రాల పాఠ్యప్రణా ళికల కోసం ఈ పుస్తకం ఒక ప్రాతిపదికగా ఎంతో ఉపయోగపడింది.
2001లో ఉషాధక్కర్‌తో కలసి ‘భారత సమాజంలో స్త్రీ’ అనే పుస్తకాన్ని నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ వారి సౌజన్యంతో ప్రచురించారు. స్త్రీ సాధికారతా సం|| 2001 ఉత్సవాల్లో న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ పుస్తకం వెలుగులోకి వచ్చింది.
శాస్త్రీయ పరిశోధనా పద్ధతిలో పశ్చిమ భారతదేశ ఫెమినిస్టులైన 100మంది వ్యక్తిగత జీవిత రేఖామాత్ర పరిచయంలో 17 సం||ల కాలంపాటు శ్రమించి ప్రొపైల్స్‌ రూపొందించారు. ”ఫెమినిజం ఒక అనుభవం : ఆలోచనలు మరియు వివరణలు” అనే ఈ గ్రంథాన్ని 2007లో సౌండ్‌ మరియు పిక్చర్‌ ఆర్కైవ్స్‌ పార్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఉమెన్‌  (ఐఆజుష్ట్రష్ట్రంఇ) వారు ప్రచు రించారు.
గుజరాతీ మరియు ఆంగ్లభాషల్లో  ఆమె అనేక  పరిశోధనాత్మక రచనలు ప్రచురించారు. గుజరాతీభాషలో గ్రామీణ పేద స్త్రీల శిక్షణ కోసం శిక్షణా మాన్యువల్స్‌ రూపొందించారు.
వీణా పూంచా (డైరక్టర్‌, రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌) దివ్యా పాండే (ఐఆజుష్ట్రష్ట్రంఇ)  నీరాదేశాయ్‌ గారిని తమ ఆప్తమిత్రురాలిగా, తాత్విక సలహాదారుగా భావిస్తారు. సి.ఎస్‌.లక్ష్మి (ఐఆజుష్ట్రష్ట్రంఇ, డైరెక్టర్‌)నిబద్ధత, తమిళంలో ఆమె ఫెమినిజం అంశంగా చేసిన రచనలంటే నీరాదేశాయ్‌  అభిమానిస్తారు.
సామాజిక ఉద్యమాలతో సంఘీభావం
అన్ని రకాల పురోగామి ప్రజాస్వామిక ఉద్యమాలు, సెక్యులర్‌, ప్రజా ఉద్యమాలతో కలిసి నడిచే తోటి ప్రయాణీకురాలిగా తన్ను తాను నీరాదేశాయి గారు ప్రకటించు కొన్నారు. నల్లచట్టాలు ప్రజాస్వామిక హక్కులను హరిస్తాయని వ్యతిరేకించారు. రాజకీయ ఖైదీల విడుదల కోసం చేసే క్యాంపెయిన్‌లలో పాల్గొన్నారు. నర్మదా బచావో ఆందోళనను సమర్ధించారు. ముంబయి, హైదరాబాద్‌, ఢిల్లీ, వడోదర, వల్సద్‌, అహ్మదాబాద్‌ లాంటి చోట పనిచేసే మహిళా హక్కుల కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించారు.
విప్లవ గాయకుడు గద్దర్‌  పాటలంటే ఆమెకిష్టం. ముంబాయి, సూరత్‌లలో ఎక్కడైనా పబ్లిక్‌ మీటింగు ఉంటే ఆమె తప్పక హాజరయ్యేవారు. అకడమిక్‌ సమావేశాల్లో ఎవరైనా ఎపుడైనా ఏ ప్రజా ఉద్యమాలను తక్కువ చేసి మాట్లాడినా, శాంతంగా వివరణ ఇస్తూనే, నిర్మొహ మాటంగా ఖండించేది. ఎక్కడున్నా ఆమె మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో అది ఎంత చిన్న గ్రూపు అయినా సరే ఆమె పాల్గొనేవారు. అక్కడ ఎటువంటి సౌకర్యాలు గురించి పట్టించుకొనేవారు కాదు.
గిరిజన, దళిత, కార్మిక మహిళా ఉద్యమ కార్యకర్తలకు ఎంతో తోడ్పాటునిస్తూ ఎన్నో విషయాల్లో నైతిక మద్ధతు ప్రకటించే వారు నీరాబెన్‌.
అధ్యయన కేంద్రాల ఏర్పాటులో కృషి :        నీరాదేశాయి 1974లో ఉమెన్స్‌ స్టడీస్‌ రీసెర్చ్‌ యూనిట్‌ నెలకొల్పారు. ఒక ఆదర్శ వంతమైన నమూనా అధ్యయన కేంద్రంగా యు.జి.సి. ప్రశంసలు అందు కొన్నది. 1990లో సౌండ్‌ మరియు పిక్చర్‌ ఆర్కైవ్స్‌ ఫార్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఉమెన్‌ ఏర్పాటులో కూడా సహకరించారు. అలాగే ఇండియా సెంటర్‌ ఫార్‌ హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ లా, ముంబయి, సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, ్పుఇఈఐ ఢిల్లీ ఏర్పాటులో కూడా నీరాబెన్‌ కృషి ఎంతో ఉంది. వచ (ముంబయి)   అస్థిత్వ (వల్సడ్‌) సహియార్‌ (వడోదర) లాంటి వివిధ ఫెమినిస్టు గ్రూపులతో కలసి పనిచేశారు. సెంటర్‌ ఫార్‌ ఎంక్వయిరీ ఇన్‌ టు హెల్త్‌ అండ్‌ అలైడ్‌ థీమ్స్‌ (ముంబయి) లాంటి సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు. అడ్వయిజరీ బోర్డులో ఉంటూ తన సేవలను అందించారు.
ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఉమెన్స్‌ స్టడీస్‌, గుజరాత్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఉమెన్స్‌ స్టడీస్‌, మహారాష్ట్ర అసోసియేషన్‌ ఆఫ్‌ ఉమెన్స్‌ స్టడీస్‌ సెంటర్లకు కూడా ఆమె వ్యవస్థాపక సభ్యురాలు. 1981లో ఆమె నాయకత్వంలో దేశంలో మొట్టమొదటి ‘మహిళా జాతీయ సదస్సు’ నిర్వహింప బడినది. విభిన్న ప్రాంతాలనుండి ఎంతో మంది విద్యా వంతులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్ధులు, పాలసీ మేకర్స్‌, కార్యనిర్వహణా ధికారులు, మహిళా ఉద్యమ కార్యకర్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఆమె నిరాడంబరత, చొరవ అక్కడున్న అందరి మనసులనూ తాకింది. ఆమెతో పాటు సన్నిహితంగా పనిచేసే అవకాశంఉన్న వాళ్ళకు ఆమెలోని అపార మైన విజ్ఞానం, లోతుగా విషయాలను అర్థం చేసుకొనే తీరు, అనుభవంతో ఆమె ఇచ్చే సలహాలు సేవాతత్పరత స్పష్టంగా అర్థం అవుతాయి. సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌లో పనిచేస్తున్న వీణా మజుందార్‌, కుముద్‌ శర్మ, లతిక సర్కార్‌లకు ఆమెతో సాన్నిహిత్యం ఉంది. మేరీ జాన్‌, డైరక్టర్‌, సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌ ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ జెండర్‌ స్టడీస్‌లో ఒక ఆర్టికల్‌లో ఉదహరించినట్లుగా అప్పటి తరంలోని అతికొద్దిమంది స్త్రీలలో తన్నుతాను ఫెమినిస్టుగా ప్రకటించుకొని తన రచనల్లో ప్రతిఫలించడం ఆసక్తికరంగా ఉంది.
ఆమె ఫెమినిస్టు అధ్యయన కేంద్రాల నిర్మాణం మాత్రమేకాదు, ఫెమినిస్టులను ఉమెన్‌ స్టడీస్‌ స్కాలర్స్‌ను కూడా ప్రభావితం చేశారు. వ్యక్తుల జ్ఞాపకాల్లో మాత్రమే కాదు సంస్థల్లో కూడా ఒకానొక ప్రత్యేకమైన స్థానాన్ని నీరాదేశాయ్‌ పొందారు అనటంలో అతిశయోక్తిలేదు.
వ్యక్తిగతమంతా రాజకీయమే
వడోదరలో 1970ల్లో ఎ.ఆర్‌. దేశాయి ఏర్పాటుచేసిన మార్కి ్సస్టు స్టడీ సర్కిల్‌కు నేను తరచుగా వెళ్లేదాన్ని. దీపావళి మరియు సమ్మర్‌ శెలవుల్లో అక్కడికి వెళ్ళటం బాగా అలవాటయింది. 1972లో ఎ.ఆర్‌. దేశాయి గారు నన్ను తన భార్యకు పరిచయం చేశారు. నీరాదేశాయిగారిని అప్పటినుండే మా విద్యార్థిసంఘాల అధ్యయన వేదిక సమావేశాలకు ఆహ్వానించాము. ‘భారత దేశంలో స్త్రీల స్థితి’ అనే కమిటిలో తాను ఒక సభ్యురాలినని అపుడు ఆమె మాతో చెప్పారు. 1974లో ‘సమానత్వం వైపుగా’ అనే రిపోర్టు తీసుకొచ్చినపుడు కూడా ఆమె స్టడీ సర్కిల్‌లో అందులోని అంశాల గురించి చర్చించారు. అప్పటివరకూ యువమహిళా కార్యకర్తలు కేవలం పశ్చిమ దేశాల్లోని ఫెమినిస్టుల రచనలను గురించి మాత్రమే చదివి ఉన్నారు. ఎవ్‌లీన్‌ రోడ్‌, మేరీ అలైస్‌ వాటర్స్‌, కాటే మిల్లట్‌, బెట్టీ ప్రీడన్‌ మరియు సైమన్‌ డి బొవియర్‌ లాంటి వాళ్ళ రచనలు మాత్రమే వాళ్ళ దృష్టిలో ఉండేవి. రీడ్స్‌ పుస్తకంలో ‘మహిళా విముక్తి సమస్యలు’ నుండి చాలా వ్యాసాలు గుజరాతీలోకి అనువదించానని తెల్సి ఆమె ఎంతో సంతోషించారు.
ముస్లిం కామ్రేడ్‌ను వివాహం చేసుకొన్న తర్వాత ‘వడొదర’లో నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎ.ఆర్‌. దేశాయి గారు నన్ను ముంబయికి రమ్మని సూచించారు. ఆయనతో కలిసి నేను వాళ్ళింటికి ముంబయికి వెళ్ళాను. నీరాబెన్‌ ఆమె కుమారుడు మిహిర్‌ నన్ను ఎంతో ఆత్మీయతతో చూశారు. వాళ్ళతో వారం రోజులు గడిపాను. ఆ తర్వాత ముంబై నాకు కొత్తగా అన్పించలేదు. మా ఇల్లు తర్వాత నీరాబెన్‌ గారి ఇల్లు నాకు రెండో నివాసం. నా జీవితంలోని అన్ని ఒడిదుడుకుల్లో, అనారోగ్య సమయాల్లో, ఆవేదనా భరిత సన్నివేశాల్లో వారి సహకారం, ఆత్మీయత నాకెంతో ఉపకరించాయి. ఆ ఇంట్లోని భిన్నమైన తాత్విక భావజాలం, మేధో వాతావరణం, ఆ కుటుంబానికి ఉన్న ఆసక్తులు, సంగీతం, కళలు, కవిత్వం, పాటలు, కలగలిసిపోయిన ఒక విశిష్టమైన వాతావరణం నాలాంటి ఎందరో యువ రాజకీయ కార్యకర్తలకు ఒక టానిక్‌లా పనిచేశాయి.
1979లో నేను మధుకిష్వర్‌తో కలిసి నీరాబెన్‌ను కలిసేందుకు వెళ్ళాను. ‘మానుషి’ మొదటి సంచిక గురించి ఆమె మాతో సూటిగా చర్చించారు. అందులో మేము ప్రచురించిన పుస్తకాల పట్టికలో ఆల్లేకర్‌, యం.ఎన్‌. శ్రీనివాస్‌ లాంటి వాళ్ళ స్త్రీల గురించి ప్రచురించిన పుస్తకాలు ఉన్నాయి. ఆమె వ్రాసిన ‘ఆధునిక భారతదేశంలో స్త్రీలు’ ఉదహరించలేదు. ఆ పొరపాటు కేవలం మా అజ్ఞానం వలనే జరిగింది. ఆ తర్వాత ఫెమినిజమ్‌ గురించిన ప్రశ్నలు, ట్రెండ్స్‌ గురించి ఎన్నో విషయాలు చర్చించారు. ఆ పుస్తకం కాపీని ఇచ్చారు. ఆ పుస్తకం చదివాక నా సంబంధం ఆమెతో 180 డిగ్రీల స్థాయికి చేరింది. ఆమె కూడా వామపక్ష ఉద్యమాల సానుభూతి నుండి బయటపడి మా సహచర ఫెమినిస్టుగా మారారు.
1980ల్లో మేం ఆమెతో కలసి ఎన్నో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేశాము. మహిళా ఉద్యమాల ఫలితంగా 1985లో జరిగిన నైరోబి సదస్సు స్పందనకు సంబంధించిన రిపోర్టు   ఇండియన్‌ ఉమెన్‌ : మార్పులు – సవాళ్ళు, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషియల్‌ రిసెర్చ్‌ కొరకు స్టేటస్‌ రిపోర్టు   1988 లో వెలువడిన క్రిటికల్‌ ఎవాల్యుయేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ స్టడీస్‌ రిసెర్చ్‌ ఇన్‌ ది పోస్ట్‌ ఇండిపెండెన్స్‌ పీరియడ్‌   శ్రమశక్తి రిపోర్టు (గుజరాతీలో) 1989   ఫెమినిస్టు క్వార్టర్లీ (గుజరాతీలో) 1988 -2002)  ్పుఇఈఐ, ఈలిజినీరి వాళ్ళ సౌజన్యంతో వెలువరించిన కేస్‌ స్టడీస్‌ ఫర్‌ ఫెమినిజమ్‌ ఇన్‌ వెస్ట్రన్‌ ఇండియా – ఇవన్నీ తీసుకొని రావటంలో నీరాదేశాయి గారి కృషి అమూల్యమైనది.
గొప్ప సలహాదారుగా నీరాబెన్‌
మన వాస్తవస్థితిని పరీక్షించాలని, సాధారణీకరణాలనుండి, సంక్లిష్టతలనుండి బయటపడి యువతరం ఫెమినిస్టులు మన సమాజంలో వేళ్లనుకొన్న మేధోపరికరాలు తయారుచేసుకోవాలని ఆమె బోధించారు. అనురాధా షాన్‌బాగు, ప్లావియా, లతా పి.యమ్‌  కల్పనా కన్నాభిరాన్‌, సోనల్‌ శుక్లా   తృప్తి షా   శిరాజ్‌ బల్సారా ఇంకా నాలాంటి ఎందరో మహిళా ఉద్యమ కార్యకర్తలను ఆమె తన వాదనలతో ఏకీభవించేలా చేశారు. మనకు బలమైన విశ్లేషణా శక్తులు కావాలి. మనం ఉమెన్‌ స్టడీస్‌ను బలోపేతం చేయాలి. స్త్రీల దృష్టికోణం నుండి సూక్ష్మమైన రీతిలో, సున్నితంగా, పారదర్శకంగా మహిళాధ్య యనం ద్వారా జ్ఞానం రూపొందించుకోవాలి అని ఆమె భావించారు. అందుకోసం పంచ భూతాల్లాంటి ఐదు ఆయుధాలు పేర్కొ న్నారు. బోధన, శిక్షణ, డాక్యుమెంటే షన్‌, పరిశోధన,ఆచరణ అవసరమని భావించారు.
యువ మహిళాకార్యకర్తలు, పరిశోధ కులు ఆమెను ”ఉమెన్‌ స్టడీస్స్‌కు తల్లి” గా భావించారు. నాల్గు తరాల స్త్రీలకు ఆమె అందుబాటులో ఉన్నారు. జ్ఞానం, మేధస్సు, విస్తారమైన సమాచారం, అనుభవ సంపత్తితో ఆమె సలహాలిచ్చేవారు. ఆమె ఎన్నడూ బోధించలేదు. మా సంబంధంలో అత్యంత కీలకమైన అంశం పరస్పరం గౌరవించు కోవడం అది సమానత్వ ప్రాతిపదికగా కొనసాగేది.
ఆమెతో తన సాన్నిహిత్యాన్ని యువతరం ఫెమినిస్టు కల్పనా కన్నాభిరాన్‌ ఇలా వ్యక్తీకరించారు :
”మహిళా ఉద్యమ కార్యకర్తలకే కాక, ఉమెన్‌ స్టడీస్‌ పరిశోధకులకు ఆమె లేని లోటు వ్యక్తీకరించటం అసాధ్యం. మేం ఒక ఉదాత్తమైన సలహాదారు, ఉపాధ్యాయిని, ఆంతరంగిక మిత్రురాలును కోల్పోయాం. ఆమె ఎప్పుడూ తన సమయాన్ని, భావాలను ఇష్టపూర్వకంగా పంచుకొంటూ అన్ని తరాల పరిశోధకులకు, కార్యకర్తలకు వ్యక్తిగతమైన, వృత్తిపరమైన మరియు రాజకీయ పరమైన సహకారాన్ని నిరంతరాయంగా అందించారు. రెండు దశాబ్దాలుగా ఆమె సలహాలు సూచనలతో, ఉదార స్వభావంతో మేమెంతో లాభపడ్డాం. మాలో చాలామంది 1980ల్లో ఉమెన్‌ స్టడీస్‌లో మా ప్రయాణం ప్రారంభిం చిన వాళ్ళం.
ఉమెన్‌ స్టడీస్‌ గుర్తింపుకోసం ఆరాట పడ్తున్న సమయంలో ఆమె యువ పరిశోధకులను తన బోధనలతో ప్రోత్స హించారు. వాళ్ళను సాహసోపేతమైన పరిశోధకులుగా మారేందుకు పురిగొల్పారు. ఈ బాటలో ఆమె ఇదివరకే ఎంతో దూరం ఒంటరిగా ప్రయాణం చేశారు. స్వాతంత్య్రా నంతర భారతదేశంలో ఉమెన్‌ స్టడీస్‌కు ఒక ప్రత్యేకమైన రాజకీయ పాత్ర ఉందని ఒప్పించేవారు. వారిరివురూ ఎ.ఆర్‌.దేశాయ్‌ మరియు నీరాబెన్‌ కలిసి మరియు వ్యక్తిగతంగా కూడా స్వతంత్ర భారతదేశంలో మహిళా విముక్తిని కలకనేవారు”.
చివరి రోజులు
ఏప్రిల్‌ 3, 2008వ తేదీన నీరాబెన్‌తో పాటు మరో ఐదుమంది ‘ఉమెన్‌ స్టడీస్‌’ అధ్యయనం చేసిన స్త్రీలను సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌, మరియు టాటా ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ సంయుక్తంగా ఆత్మీయ సత్కారం చేశారు.
ఉమెన్‌ స్టడీస్‌ సెంటర్‌, వారి జీవితా ల్లోని ముఖ్యమైన అరుదైన సన్నివేశాలతో కూడిన చిత్రాలను సేకరించి, ప్రతి ఒక్కరి ప్రొఫైల్స్‌ను తయారు చేసింది.
పాలిపోయి నీరసంగా ఉన్నప్పటికీ నీరాబెన్‌ గారు 21 వ శతాబ్ధంలో ఉమెన్స్‌ స్టడీస్‌ ఎదుర్కొనే సవాళ్ళను సైద్ధాంతిక, పరిశోధనా పద్ధతులను గురించి ఓపికగా ఉపన్యసించారు.
శరీరమంతా వ్యాపిస్తున్న క్యాన్సర్‌ కణజాలంతో ఆమె జీవితంలో చివరి ఆరునెలలు విషాదంగా గడిచిపోయాయి. కానీ మేము ఎప్పుడూ ఆమెను కలిసి మాట్లాడినా, తన బాధను అసౌకర్యాన్ని గురించి చర్చించలేదు. భారతదేశంలోని విభిన్న ప్రాంతాల ఫెమినిస్టు రచనలను గుజరాతీలోకి అనువదిస్తూ మాకు చూపించేవారు. నవలలు, సినిమాలు, సంగీతం, కవిత్వం గురించి చర్చించేవారు. ఆమె అల్లుడు నిర్మించిన ‘పర్జానియా’ సినిమా గురించి, ఎన్నెన్నో సమస్యలను గురించి మాట్లాడేవారు.
నీరా దేశాయ్‌, ఆమె కుమారుడైన మిహిర్‌ దేశాయ్‌, మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది, అతని సహచారి ఫెమినిస్టు సంధ్యా గోఖలేలతో ఎంతో అందమైన, మేధో పరమైన, ఉద్వేగ పూరితమైన సంబంధం ఉండేది.
నోబుల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయిన 1000 మంది స్త్రీలలో నీరాదేశాయ్‌  కూడా ఒకరు. ఆమెకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నాం. ప్రమాణాల రీత్యా, నిర్మాణ పరంగా కొత్త జ్ఞానం ఉన్నతీకరించి ఉమెన్‌ స్టడీస్‌ను సమున్నతంగా నిలబెట్టిన నీరాబెన్‌ స్త్రీలకోసం మాత్రమేకాక మొత్తం మానవ సమాజ పరివర్తనం దిశగా చేసిన కృషి అనితరసాధ్యమైంది.
మానవాళి విముక్తి జరగకుండా మహిళా విముక్తి సాధ్యం కాదని ఆమె ఎప్పుడూ చెప్తూండే వారు. మీ స్పూర్తి మాకెప్పుడూ ఉత్తేజాన్ని ఇస్తూనే ఉంటుంది. మీకు మా జోహార్లు అర్పిస్తున్నాం. నీరాబెన్‌ అమర్‌ హై !

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.