తలాఖ్‌

 పి. రాజ్యలక్ష్మి
(భూమిక నిర్వహించిన కథల పోటీలో రెండో బహుమతి పొందిన కథ)
షబనా కొడుతున్న దెబ్బలకు రెండేళ్ళ సారా గుక్కతప్పుకోకుండ ఏడుస్తూ వున్నది. నా మనస్సు వూరుకోలేక అడ్డం వెళ్ళి చిన్నిదాన్ని చంకన వేసుకొని యింట్లోకి తీసుకొని వచ్చాను.
అరగంట తరువాత కళ్ళనీళ్ళతో సారాను తీసుకొని వెళ్ళటానికి షబానా వచ్చింది,
వద్దులే షబానా, దాన్ని నిద్ర లేపకు, నీవు కొట్టే దెబ్బలకు అది ఏదో ఒక రోజు చచ్చిపోతుంది.
అది చచ్చినా బాగుండు. నా కడుపున పుట్టటమే అది చేసుకున్న పాపం. ఏమి చేయమంటావు అక్కా, రెండురోజులనుండి పెద్దదానికి ఒళ్ళు తెలియని జ్వరం. నాకు నిద్రలేదు. యింట్ల ఎంత చాకిరి వుంటుందో నీకు తెలియనిది కాదు కదక్కా. మా ముగ్గురిని మామయ్య పోషిస్తున్నందుకు యింట్ల చాకిరి గూడ చేయకపోతె ఎట్లా అక్కా. యిది బాగా అల్లరి చేస్తుంది. అవి కావాలి, యివి కావాలి అని మొండికేస్తుంది. నా దగ్గరా చిల్లిగవ్వ లేదు.
యిలా మీ మామయ్య యింటి చాకిరి చేసుకొని ఎంతకాలం బ్రతుకుతావు. ఎక్కడో దుబాయ్‌లో వున్న మీ ఆయనను నమ్ముకుంటే ఎలా కుదురుతుంది. అతను వెళ్ళి రెండు సంవత్సరాలు అయింది. యింత వరకు నీకు ఒక్క పైసా పంపలేదు. మీ మామయ్య నీకు యింత నీడ యిచ్చాడు. లేదంటే నీ బ్రతుకు ఏమి కావాలి. మామయ్యకు మంచి పేరు వుంది. ఏదన్నా పని నేర్చుకొని నీ బ్రతుకు నీవు బ్రతుకు.
నీకు తెలియదులే అక్కా. మా శాయిబుల్లో ఆడోళ్లు బానిస బ్రతుకులు బ్రతకవలసిందే. అతను నన్ను బయటకు పోనీయడు. ఏ పని చేయనీయడు. బురఖా లేనిది బయటకు పోనీయడు, యింట్ల వున్నంతసేపు అతని ఎదురుగా కూడ ముసుగులో వుండాలి. అంత దూరంలో వున్నా భయంకరంగా అవమానిస్తాడు. యింట్ల ల్యాండుఫోను అర్ధరాత్రి, అపరాత్రి ఫోనుచేసి నన్ను రకరకాల పరీక్షలకు గురిచేస్తాడు, సెల్‌ఫోను వుంది కదా యింట్లో, ఫోను తీసేద్దామనుకుంటే అతను వద్దని మామయ్యను బ్రతిమిలాడాడట.
షబానా బాధపడి ప్రయోజనం లేదు. కొంచెం ధైర్యం తెచ్చుకొని నీ కాళ్ళమీద నీవు బ్రతకటానికి ప్రయత్నం చేయి.
వద్దులే అక్కా ఈ బ్రతుకును యిలా పోనియ్యి అంటుండగా యింట్లో ఫోను మ్రోగుతుంటే ఒక్క వుదుటన చిన్నిదాన్ని చంకన వేసుకోని పరుగు లంకించుకుంది.
ఫోను ఎత్తగానే, ”ఏమిటి ఎత్తటానికి ఎంతసేపు పడుతుంది. ఎవడితోనయినా కులుకుతున్నావా, లేదంటే మగాడికి మొహం వాచి వున్నావా,  ఏమి చేస్తున్నావు, పిల్లలు ఎలా చచ్చారు. వాళ్ళకు నీ బుద్దులు నేర్పించమాకు”.
పిల్లలకు ఫీజులు కట్టాలి. మామయ్య ఎలాగో తిండి బట్ట యిస్తున్నాడు. పైగా ఏమని డబ్బులు అడగాలి.
క్యా బాత్‌ కరతి హై. పైసే పూచేతో తలాఖ్‌ దేతుం, నేను యిక్కడ కుక్కబ్రతుకు బ్రతుకుతున్నాను. నేను డబ్బులు పంపలేను. నీవు నీ పిల్లలు కట్టకట్టుకోని చావండి. పీడ పోతుంది అని గట్టిగా ఫోను పెట్టేశాడు.
ఎప్పుడూ యిలానే మాట్లాడతాడు. పిల్లలు, నీవు ఎలా వున్నారని ప్రేమగా మాట్లాడడు. అలాటప్పుడు అసలు ఫోనులో మాట్లాడుకోవటం ఎందుకు అనిపిస్తుంది.
యింతలో అత్తయ్య పిలుస్తోంది.
ఎవరూ మీ ఆయనేనా ఫోను చేసింది. ఎప్పుడు వస్తున్నాడట.
ఏమి చెప్పలేదత్తయ్యా.
యింకా ఏమి వస్తాడు. నీ పాటికి నిన్ను, పిల్లలను వదిలి బాధ్యతలు వదిలించుకొని పారిపోయి వాడి వరకు వాడు బాగానే బ్రతుకుతున్నాడు. అయినా తప్పదు కదా! కొంచెం కాఫీ పంపించమ్మా.
కాఫీ పెడుతుందే గాని మనస్సు గతంలోకి వెళ్ళి తొంగిచూస్తుంది.
నాన్న రిక్షా తొక్కేవాడు. ఆ రోజుల్లో అబ్బాయి కోసమంటూ నలుగురు ఆడపిల్లల్ని కనేసారు. యిక అక్కడినుండి అమ్మలో చాలామార్పులు వచ్చాయి. నాన్న తెచ్చిన కూలీ డబ్బులతో యిల్లు గడవటం చాలా కష్టంగా వుండేది. అమ్మ ఏమయినా పనులు చేస్తానంటే అంత చేతగానివాడిని కాదు. ఆడదానిచేత పనులు చేయించి సంపా దించిన డబ్బులు తీసుకొనటానికి నేను సాయిబు పులుక పుట్టిన మగాడిని అనేవాడు.
రోజులు గడిచేకొద్ది అమ్మలో కోపం, కసి, అసహనం చోటుచేసుకుంది. ఈ మధ్యకాలంలో మామయ్యలకు చిన్నిచితకా ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు ఒక మోస్తరుగా బ్రతుకుతున్నారు. అప్పటినుండి అమ్మకు తానొక్కతే అందరికంటే తక్కువగా వున్నదని, ఎలాగయినా, వాళ్ళందరితో సమానంగా బ్రతకాలని తాపత్రయపడేది. నాన్న దగ్గర వుంటే యింతకంటే బాగా బ్రతుకుతుందన్న నమ్మకం లేదు. వున్నట్లుండి నాన్నతో గొడవ జరిగింది. ఆ గొడవల్లో నాన్నదే తప్పు, మగపిల్లల్ని కనకుండా నాలుగు ఆడదెయ్యా లని కన్నావు అని తిట్టి, కొట్టాడు. దాంతో అమ్మ యిక యిక్కడ వుండనని యింట్ల నుండి ఒక్కతె వెళ్ళిపోయింది. నాన్న పట్టు దలకు పోయి ఆమెను రమ్మని పిలవలేదు. యిక నేను అందరికంటె పెద్ద కాబట్టి యింట్ల చేతులు కాల్చుకొని చెల్లెళ్ళను చూసు కుంటున్నాను. అమ్మ ఆయాగా ఒక డాక్టరు యింట్ల అక్కడే వుండేట్లు పనికి కుదిరింది. అక్కడ వాళ్ళ కుటుంబంలో అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా వుంటూ మంచిపేరు తెచ్చుకుంది. వాళ్ళు కూడ అమ్మను పనిమనిషిలాగా చూడరు. ఎక్కడికెళ్ళినా వాళ్ళతో కార్లలోను షికార్లకు తీసుకొని వెళతారు. యివన్ని అమ్మకు అక్కడ స్వర్గంలాగా, మా దగ్గరకు వస్తే నరకంలాగ భావించేది. అప్పుడప్పుడు మాకు తినటానికి చాలా తెచ్చేది. మంచిబట్టలు తీసుకొని వచ్చి రెండురోజులు వుండి పోయేది. అమ్మ వచ్చింది అంటే సంతోషంగా వుండేది. మేము పెద్ద అయ్యేకొద్ది చుట్టుప్రక్కల వాళ్ళ మాటలు ఒకరకంగా వున్నాయి.  మీ అమ్మకేం తక్కువ  హాయిగా మంచి డాక్టరును పట్టుకుంది అని చెవులు కొరుక్కొనేవారు.
అందుకని అమ్మను యిక్కడే వుండమని ఏడ్చేవాళ్ళం. అయినా అమ్మ వుండేది కాదు. మీ నాన్నతో వుంటే మీ బ్రతుకులు తెల్లారతాయి. అందుకే నేను అక్కడ వుంటే మీకు మంచి సంబంధాలు వస్తాయి. డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చు అనేది.
నేను పెద్దయ్యాక అమ్మ నన్ను అందరి పెళ్ళిళ్ళకు, పేరంటాలకు తీసుకొని వెళ్ళేది. అమ్మ వచ్చింది అంటే నన్ను ఎక్కడికయినా తీసుకొని వెళ్ళటానికి వచ్చిందని అర్థమయ్యేది. నీతో పంపనని నాన్న గొడవ పెట్టుకునేవాడు. నాన్న గట్టిగా మాట్లాడినప్పు డల్లా మామయ్యలు వచ్చి అమ్మను వెనకేసుకొని వచ్చి నాన్నను బండబూతులు తిట్టి కొట్టినంత పనిచేసేవాళ్ళు.
అబ్దుల్లా నన్ను ఒక పెళ్ళిలో చూసాడట. అంతే అమ్మ దగ్గరకు వచ్చి నన్ను తప్పితే ఎవ్వరిని చేసుకోనని పట్టుబట్టి కూర్చున్నాడు.
అమ్మ కట్నకానుకలు యివ్వలేను. పెళ్ళి చేయటానికి కూడ మా చేతిలో చిల్లిగవ్వ లేదు. యింట్లో ఒప్పించుకో పిల్లని యిస్తానని చెప్పింది, నేను మాత్రం అబ్దుల్లాను చూడలేదు.
అబ్దుల్లా యిరవై ఏళ్ళ వయస్సు అప్పుడు నాన్న చనిపోయాడట. అతని అమ్మ పొగాకు కంపెనీకి వెళ్ళేది. వాళ్ళ నాన్న చనిపోయిన తరువాత చిన్నిగా వెల్డింగు పనులు నేర్చుకున్నాడు. తెలిసినవాళ్ళను పట్టుకొని ఒక కాంట్రాక్టరు వద్ద చేరి దుబాయికి వెళ్ళాడు. అక్కడ నుండి డబ్బులు పంపించి యిద్దరు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేసాడు. యిద్దరి తమ్ముళ్ళకు చదువులు చెప్పించాడు. యిప్పుడు పెళ్ళి చేసుకోవాలని అనుకొని షబానాను చూడటంతో బాగా యిష్టపడ్డాడు. కాని కట్నంతేలేకపోతే అబ్దుల్లా అమ్మ పెళ్ళికి ఒప్పుకోదు.
ఆ మాట అంటే యింతకాలం నా కుటుంబానికి చాలా చేసాను. ప్రస్తుతానికి సొంత యిల్లు వుంది. వున్న డబ్బులతో అందరికి పెద్దగా యిబ్బందులు లేవు, కాకపోతే మాకోసం మా అమ్మ చాలా కష్టాలు పడింది. ఆమె యిష్టప్రకారమే యిప్పటికి అందరము నడుచుకుంటాము. అందుకని మీరు షబానాను యిస్తానంటే ఏదో ఒక విధంగా మా అమ్మకు సర్ది చెప్పుకుంటాను. నేను వారం రోజుల్లో దుబాయి వెళుతున్నాను. మరలా సంవత్సరానికి వచ్చి షబానాను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. అమ్మకు తెలియకుండా మీకు డబ్బులు నెలనెలా పంపిస్తాను. వాటిని కట్నంకింద మా అమ్మకు యివ్వండని సలహా యిచ్చాడు.
అమ్మ సంతోషానికి హద్దులు లేవు. దుబాయి అల్లుడు దొరికాడు. యిక కష్టాలన్ని తీరిపోతాయి. అంతగా యిష్టపడి షబానాను చేసుకుంటున్నాడంటే అల్లుడిని యిక కొంగుకి ముడివేసుకుంటుంది. పెళ్ళి అయిన తరువాత సంపాదించిన డబ్బులు తనకే పంపిస్తాడని, అతని సాయంతో మిగతా ముగ్గురి ఆడపిల్లలను సెటిల్‌ చేసుకోవచ్చని అనుకుంది. తన పెద్దకూతురు విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతుందని అప్పుడు చులకనగా చూసిన వాళ్ళందరు కుళ్ళుకోవాలని అనుకుంది. అడిగినవాళ్ళకు అడగనివాళ్ళకు దుబాయి అల్లుడు దొరికాడని గొప్పలు చెప్పుకునేది.
సంవత్సరం అంతా అబ్దుల్లా వాళ్ళ అమ్మకు సరిగా డబ్బులు పంపకపోయేసరికి వాళ్ళ అమ్మ అసలు విషయం పసిగట్టింది. పెళ్ళికాకముందే వీడు వాళ్ళకు దాసోహం అయిపోయాడు. పెళ్ళి అయితే వీడు వాళ్ళ మనిషి అవుతాడని, యిక వీడిపైన ఆశలు వదులుకోవలసిందేనని అనుకుంది. షబానాను వద్దు అన్నా, ఎదిరించి పెళ్ళి చేసుకుంటే తన పెద్దరికం దెబ్బతింటదని అబ్దుల్లా యిష్టప్రకారమే జరుగుతున్నంత వాతావరణం కల్పించింది.
పెళ్ళి అయింది. అబ్దుల్లాను చూసి మూర్ఛ వచ్చినంత పని అయింది. అతనికి ముప్ఫైఅయిదు సంవత్సరాలు వుండొచ్చు. తనకేమో యిరవై ఏళ్ళు కూడా నిండలేదు. ఆ రాత్రి అంతా ఏడుస్తూనే వున్నది. మరుసటిరోజు అబ్దుల్లా నీ కూతురికి నేనంటే యిష్టంలేదా. నాతో సరిగా వుండలేదని ఫిర్యాదు చేసాడు.
నేను ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏముంది. అమ్మతో చెబితే యిదంతా మామూలే. శాయిబుల్లో యిలా జరుగుతూనే వుంటాయి. నాలుగురోజులు పోతే అన్ని సర్దుకుంటాయి అని సమర్ధించింది. యిక అబ్దుల్లాతో కాపురానికి వెళ్ళింది.
ఎన్ని రోజులు గడుస్తున్నా అబ్దుల్లా దుబాయికి వెళ్ళటం లేదు. అమ్మ వచ్చి అబ్దుల్లాను ఎప్పుడు వెళుతున్నారని అడిగింది.
లేదు నేను వెళ్ళటం లేదు. యిన్నేళ్ళకు యిక్కడకు వచ్చింది పెళ్ళి చేసుకొని యిక్కడే వున్న డబ్బులతో వ్యాపారం చేసుకుంటానని అన్నాడు. ఈ సంభాషణ విని అబ్దుల్లా అమ్మ యింత ఎత్తున లేచింది.
నీకు ఆఖరుగా చెబుతున్నాను. ఈ యిల్లు నా పేరున పెట్టుకున్నాను. నేను చస్తేగాని నీకు రాదు. డబ్బులంటావా అన్ని యింటి ఖర్చులకు అయిపోయాయి. నా చేతిలో చిల్లిగవ్వ లేదు. నీవు నీ పెళ్ళాం బయటకు పోయి సంపాదించుకొని బ్రతకండి అని గట్టిగా చెప్పింది.
అబ్దుల్లాకు పిచ్చిపట్టినట్లు అయింది. అమ్మ ఎంత దూరం ఆలోచించింది. తన భద్రత తను చూసుకుంది. అప్పటికే షబానా నిండునెలల మనిషి. యింట్లనుండి వెళ్ళిపొమ్మని అమ్మ చెల్లెళ్ళు రోజు ఒకటే గొడవ. షబానాకు సరిగా తిండిగూడా పెట్టడం లేదు. పోనీ వెంటనే దుబాయికి వెళ్ళటం వీలుకాదు. మరల క్రొత్త కాంట్రాక్టరు కోసం వెతకాలి. అదీగాక అంతకుముందులాగ ఎక్కువ కష్టం చేయలేక పోతున్నాడు. వెళ్ళినా పెద్ద ఆదాయం వుండదు. ఈ వెల్డింగు పనులు చేయటానికి ఇంజనీర్సు వస్తున్నారు. పని దొరకటం కష్టం. అదే వెల్డింగు పనికి ఒకరి వద్ద చేరి షబానాను బయటకు తీసుకొని వచ్చాడు. రోజులు ఎలాగోలా అతికష్టం మీద గడుస్తుంటే మరల రెండవసారి ఆడపిల్ల పుట్టింది. షబానాను వేధించటం మొదలుపెట్టాడు. తనని చేసుకోబట్టి కష్టాలు మొదలయ్యాయి. అందం చూసి యిష్టపడ్డాను . ఆ అందం కొరుక్కు తింటానా. దరిద్రపు మొహాన్ని చేసుకోబట్టి దరిద్రం వెంట తీసుకొని వచ్చిందని తిట్టేవాడు. కోపం ఎక్కువ అయినప్పుడు పిచ్చిపిచ్చిగా కొట్టేవాడు. ఒక్కరోజు దెబ్బలు తినితిని తిండిలేక నీరసం వచ్చి పడిపోయేది. యిటు తండ్రి దగ్గరకు వెళ్ళినా మెతుకు దొరకదు. అమ్మ పరాయిది అయింది. ఏమి చేసినా యితని దగ్గర పడివుండక తప్పదని అర్థం అయింది.
అమ్మ చెప్పినట్లు విని కట్నం తీసుకొని పెళ్ళి చేసుకుంటే కట్నం డబ్బులు వచ్చేవి. యిటు అమ్మ ఆస్థి యిచ్చేది, దగ్గర పెట్టుకునేది, అమ్మను మోసం చేసాను కాబట్టి నాకు సరైన శాస్తి జరిగింది. ఎర్రగా, బుర్రగా వుందని చేసుకున్నాను. ఈ ఊబిలోనుండి బయటపడాలి. వీళ్ళ ముగ్గురిని పోషించటం చేతకాదు. యిక్కడ వుంటూ వీళ్ళను వదిలించుకోవటం అయ్యే పని కాదు, అని ఆలోచనలో పడ్డాడు.
అబ్దుల్లా వాళ్ళ అమ్మ దగ్గరికి చేరి కాళ్ళు పట్టుకొని తప్పయిపోయిందని ఏడ్చాడు. మళ్ళీ దుబాయికి వెళ్ళమని సలహా యిచ్చింది. ఛార్జీలకు డబ్బులు కూడా యిచ్చింది. మొత్తానికి దుబాయికి వెళ్ళటానికి సిద్ధపడి వెళుతున్నానని ముందురోజు చెప్పాడు.
షబానా నా పరిస్థితి ఏమిటి అని నెత్తీనోరు మొత్తుకుంది. తను ఎక్కడ వుండాలని అడిగింది.
నీ యిష్టం నీ చావు నీవు చావు. ఉద్యోగం దొరికితే డబ్బులు పంపిస్తాను. లేదంటే మీ అయ్య దగ్గరికో, మీ అమ్మ దగ్గరికయినా పో అన్నాడు. అమ్మ నాన్నకు కబురుచేస్తే యిటు ప్రక్కకు గూడ చూడలేదు.
నా అదృష్టం బాగుండి పదిరోజుల తరువాత మామయ్య నన్ను చూడటానికి వచ్చాడు. అత్తయ్యకు ఆరోగ్యం సరిగా లేదు మంచంలో వున్నదని, యింట్లోనే వుండి అన్ని చూసుకోవటానికి మనిషి అవసరం పడిందని ఎక్కడ వెదికినా ఎవ్వరూ దొరకలేదని, ఈ వూరిలో ఎవరో ఒకావిడ వుందని తెలిసి మాట్లాడుకుందామని వచ్చి పనిలో పని నన్ను చూడటానికి వచ్చాడు. విషయం తెలుసుకొని బాధపడ్డాడు.
యిక నేను వుండబట్టలేకపోయాను. మామయ్య ఆమె బదులు నేను వస్తాను. మీ యిద్దరిని కంటికి రెప్పలా చూసుకుంటాను. నాకు నా పిల్లలకు యింత తిండి పెడితే చాలు. వూళ్లో అందరూ నన్ను మొగుడు వదిలేసిపోయాడని చాలా అవమానకరంగా చూస్తున్నారు. సమాజంలో యిలా ఒంటరిగా వుండటం అంత మంచిది కాదు. నాకు కొంచెం భద్రత కల్పించమని అడిగాను.
అంతే మామయ్య యింటికి చేరాను.
యింతలో మామయ్య పిలుపు విని ఈ లోకంలోకి వచ్చాను.
ఏమిటి మామయ్య నీకు కూడ కాఫీ¦ి కలిపేదా అని అడుగుకుంటూ ఏమ్మా అలా వున్నావు. వాడు గుర్తుకు వచ్చాడా ఏమిటి. ఏమయినా అతని మీద ఆశలు వదులుకో తల్లి. ఏదయినా పని నేర్చుకో.
అదికాదు మామయ్యా! మొన్న ఫోనుచేసి నన్ను అయిదుపూటలా నమాజు చేస్తున్నావా అని అడిగాడు. పిల్లలతో యింట్ల పనులతో కుదరటం లేదని అన్నాను. బాగా తిట్టిపోసాడు. నేను యిక్కడ అయిదు పూటలా నమాజు చేయకపోవటం మూలాన అక్కడ అతనికి మంచి ఉద్యోగం దొరకటం లేదట. అందుకని నమాజు చేయమని చెబుతున్నాడు.
అవునులే అమ్మా. అందరూ యిలానే నమాజులు చేస్తే యిక కష్టపడవలసిన పని ఏముంది, యిక నీ యిష్టం నేను మాత్రం ఎన్ని రోజులు చూస్తాను. నీ పుణ్యమా అని మీ అత్తయ్య ఆరోగ్యం కుదుటపడుతుంది. యిక యిప్పుడు మా పనులు మేము చేసుకోగలము. కాబట్టి నీకు టైము వుంటుంది. ఏదయినా పని చూపిస్తాను. నేర్చుకొని బ్రతకవచ్చు. ఈ రోజుల్లో ధైర్యం వుండాలే కాని బ్రతకటం పెద్ద కష్టమేమీ కాదు.
రాత్రి పడుకుందే గాని నిద్ర రావటం లేదు. నిజమే కదా అయిదుపూటలా నమాజు చేస్తే అతనికి ఉద్యోగం వస్తుందా! నిజంగా అతను తిరిగి వస్తాడా! వచ్చినా తనతో కాపురం చేస్తాడా. అనుమానమే. వాళ్ళ అమ్మ ఎప్పుడూ అంటుంది. ఈసారి దుబాయి నుండి రాగానే కట్నకానుకలతో నా కొడుక్కి యింకో పెళ్ళి చేస్తాను. నీకు యిష్టమయితే మొదటి పెళ్ళాంగా వుండు, యింత కూడు పడేస్తాను. రెండో పెళ్ళాంతోనన్నా నా కొడుకు సుఖపడతాడు, నీతో సుఖంలేదు పాడులేదు అనేది.
ఆలోచిస్తూ వుండగానే తెల్లవారింది. మనస్సు స్థిమితంగా లేదు. యిక అతని మీద ఆధారపడడం కష్టం. తన బ్రతుకు తాను బ్రతకాలి. ఈ యిద్దరి పిల్లలను బజారుపాలు చేయలేను. పిల్లలకోసమన్నా ధైర్యం తెచ్చుకోని బ్రతకాలి. మనస్సులోనే అంతదూరంలో వున్న అబ్దుల్లాకు మూడుసార్లు తలాఖ్‌, తలాఖ్‌, తలాఖ్‌ అని చెప్పుకుంది.
గబగబ లేచి యింట్ల పన్నులన్ని చేసుకుంది. యిద్దరి పిల్లలను స్కూలుకు పంపింది.
మామయ్యకు టిఫిన్‌ పెడుతూ యిక మనకు యింట్ల ల్యాండుఫోను అవసరం లేదని చెబుతూ వైరు పీకేసింది.
అత్తయ్య నీకు కావలసినన్ని చేసి పెట్టాను. పెట్టుకొని తినండి. మామయ్య నేను రెడి, ఏదయినా పని కుదిరించు. ఈ రోజు నుండి నీతో బయటకు వస్తాను అని లోపలికి వెళ్ళి అలవాటుగా బురఖాను వేసుకోబోయి దీని అవసరం లేదని దూరంగా విసిరేసి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.