అనువాదం: ఎ. సునీత
బెల్ హుక్స్ ప్రముఖ అమెరికన్ స్త్రీ వాద సిద్ధాంత కర్త. ఉద్యమకారులు, తత్వవేత్త, నల్లజాతి స్త్రీగా స్త్రీ వాదాన్ని, పెట్టుబడిదారీ వ్యతిరేకతని, జాత్యహంకార విమర్శని కలిపి స్త్రీ వాదానికి పునర్నిర్వచనం ఇచ్చిన వారిలో ఆమె ఒకరు. కొన్ని నెలల క్రితం 67 సంవత్సరాల
వయసులో చనిపోయేనాటికి ఆమె అనేక పుస్తకాలు రాశారు. సినిమాలు, జన సమ్మత సంస్కృతి, జాత్యహంకారం, పెట్టుబడిదారీ విధానం, తెల్లజాతి స్త్రీ వాదం, పురుషులపై పితృస్వామ్య ప్రభావం, స్త్రీలలో కూడా నిండి ఉండే స్త్రీల పట్ల వివక్ష, స్త్రీ ద్వేషం, పితృస్వామ్య ధోరణుల గురించి విస్తృతంగా రాశారు. స్త్రీ వాదం గురించి సరళంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో ఆవిడ 2000లో రాసిన ‘ఫెమినిజం ఈజ్ ఫర్ ఎవ్రిబడీ’ పుస్తకానికి అనువాదం ఇది. పుస్తకంలో పరిచయంతో కలిపి 20 చిన్న అధ్యాయాలు ఉన్నాయి. ఈ క్రింద ఉన్నది పరిచయం, మొదటి అధ్యాయాలు.
పరిచయం: రండి, స్త్రీ వాదానికి దగ్గరవ్వండి!
నేను వెళ్ళినచోటల్లా కలిసిన వాళ్ళందరికీ నా పని గురించి, నేను రచయితనని, స్త్రీ వాద సిద్ధాంతకర్తనని, సాంస్కృతిక విమర్శకురాలినని గర్వంగా చెప్పుకుంటాను. సినిమాలు, జన సమ్మత సంస్కృతి గురించి, అవి ఇచ్చే సందేశాల గురించి విశ్లేషిస్తానని చెప్పినప్పుడు చాలా మంది విని ఉత్తేజితులవుతారు. అందరూ సినిమాలు, టెలివిజన్ చూస్తారు, మ్యాగజైన్ తిరగేస్తారు కాబట్టే వాటిలో చూపించే విషయాల గురించి, అవిచ్చే సందేశాల గురించీ అందరికీ తమవంటూ ఆలోచనలు తప్పకుండా ఉంటాయి. నేను కలిసే భిన్న ప్రజానీకంలో అనేకమందికి రచనలు చేయటంలో కూడా ఆసక్తి ఉంటుంది. అలాగే చాలామంది రాసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టే సాంస్కృతిక విమర్శకులేమి రాస్తారో, చేస్తారో తేలిగ్గానే అర్థం చేసుకుంటారు.
అయితే స్త్రీ వాద సిద్ధాంతం గురించి నేను మాట్లాడటం మొదలు పెట్టగానే అందరి నోరు మూతబడిపోతుంది. పైగా ఫెమినిజం ఎంత వినాశకరమైందో, ఫెమినిస్టులు ఎంత చెడ్డవాళ్ళోనని అబ్బో చాలా వినిపిస్తారు. ‘వాళ్ళు’ పురుషులని ద్వేషిస్తారని, ‘వాళ్ళు’ ప్రకృతికి, దేవునికి వ్యతిరేకులని, ‘వాళ్ళు’ అందరూ స్వలింగ సంపర్కులని, ‘వాళ్ళు’ అన్ని ఉద్యోగాలు తీసేసుకుని ఏ అవకాశాలూ లేక బాధపడుతున్న తెల్లజాతి మగవాళ్ళకి అనేక కష్టాలు కలుగజేస్తున్నారని… ఇలా అనేక ప్రతికూలమైన మాటలు చెప్తుంటారు. సరే, నేను తిరిగి వాళ్ళని ‘మీరు ఏ ఫెమినిస్టు పుస్తకాలు చదివారు, ఏ స్త్రీ వాద ప్రసంగాలు విన్నారు, ఏ స్త్రీ వాద కార్యకర్తలని కలిశారు’ అని అడిగాననుకోండి, అప్పుడు… ఎవరినుండో విన్నామని, ఇప్పటివరకూ స్త్రీ వాద ఉద్యమంలో ఏమి జరుగుతోందో ప్రత్యక్షంగా తాము చూడలేదని, తమకు తెలియదని చెప్తారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళందరి దృష్టిలో ఫెమినిస్టులంటే ప్రతి క్షణం కోపంతో రగిలిపోతూ మగవాళ్ళలాగా బ్రతకాలనుకునే స్త్రీలు. స్త్రీవాదమంటే హక్కులనో, స్త్రీలకి సమాన హక్కుల గురించో అనే కనీస అవగాహన కూడా వాళ్ళెవరికీ ఉండదు. నాకు తెలిసిన, నా అనుభవంలోకి వచ్చిన స్త్రీ వాదం గురించి నేను మాట్లాడితే మంచిగానే వింటారు. కానీ మాట్లాడటం ఆపగానే ‘మీరు వేరండి. ఆ కోపంగా ఉండే, మగవాళ్ళని ద్వేషించే స్త్రీవాది లాంటి వాళ్ళు కాదు’ అని అనేస్తారు. నేను అచ్చమయిన, రాడికల్ స్త్రీ వాదినని, స్త్రీ వాదాన్ని దగ్గరగా చూస్తే వాళ్ళు ఊహించుకున్నట్లు ఏ మాత్రం ఉండదని చెప్తాను.
ఇటువంటి సంభాషణ జరిగిన ప్రతిసారీ నా దగ్గర ఒక చిన్న పుస్తకముంటే బాగుంటుందని అనిపిస్తుంది. అప్పుడు అది వాళ్ళ చేతికిచ్చి ‘ఇది చదవండి, స్త్రీ వాదమంటే ఏమిటో, ఆ ఉద్యమమంటే ఏమిటో మీకు తెలుస్తుంది’ అని చెప్పేయవచ్చు కదా అనిపిస్తుంది. అది చిన్నదిగా, తేలిగ్గా చదివి అర్థం చేసుకోగలిగే పుస్తకమై ఉండాలి. పడికట్టు పదాలతో, అర్థం కాని అకాడమిక్ భాషలో ఉండే పెద్ద, బండ పుస్తకం కాకుండా, సూటిగా, స్పష్టంగా ఉండి, విషయ సంక్లిష్టతని కుదించకుండా, తేలిగ్గా చదవగలిగే పుస్తకమై ఉండాలి. స్త్రీ వాద రాజకీయాలు, ఆలోచన, ఆచరణ నా జీవితాన్ని మార్చేసినప్పటి నుంచి అటువంటి పుస్తకం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను ప్రేమించే వ్యక్తులకి ఈ సమస్యని, నా రాజకీయ జీవితానికి పునాదిగా ఉండి, నేను బలంగా నమ్మే స్త్రీ వాద రాజకీయాలు అర్థం చేయించే పుస్తకం ఇవ్వాలని ఎప్పుడూ అనుకుంటూ వచ్చాను.
స్త్రీ వాదమంటే ఏమిటి? అన్న వాళ్ళకి భయాలు, ఊహల్లో పాతుకుపోని సమాధానం ఇవ్వాలని అనుకున్నాను. స్త్రీ వాదమంటే మళ్ళీ మళ్ళీ చదవి చెప్పగలిగే ఒక నిర్వచనం ఇవ్వాలనుకున్నాను. ‘స్త్రీ వాదమంటే స్త్రీ ద్వేషం, దోపిడీ, అణచివేతని అంతమొందించే ఉద్యమం’ అని చెప్పదలచుకున్నాను.
నాకీ నిర్వచనం చాలా నచ్చుతుంది. దీన్ని పదేళ్ళ క్రితం నేను రాసిన ‘స్త్రీ వాద సిద్ధాంతం అంచుల నుండి కేంద్ర స్థానానికి’ అన్న పుస్తకంలో ఇచ్చాను. స్త్రీ వాదం స్పష్టంగా పురుష వ్యతిరేకి కాదని ఈ నిర్వచనంలో తెలుస్తుంది. సమస్య స్త్రీ ద్వేషానికి సంబంధించినదని స్పష్టం చేస్తుంది. మనందరం పెంపకం, సమాజం మనల్ని తీర్చిదిద్దే పద్ధతి, స్త్రీలు, పురుషులు తేడా లేకుండా… స్త్రీ వ్యతిరేక ఆలోచన, ఆచరణని ఒప్పుకునే విధంగా జరిగిందని గుర్తుచేస్తుంది. అందువల్లే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా స్త్రీ ద్వేషం కనబరచగలరు.
ఆడవాళ్ళు కూడా స్త్రీ ద్వేషం కనపర్చగలరని అన్నంత మాత్రాన మగవాళ్ళ ఆధిక్యతని సమర్ధించినట్లు కాదు. కానీ స్త్రీ వాదమంటే స్త్రీలని సమర్థించడం, పురుషులని వ్యతిరేకించటం అని ఎవరయినా అనుకుంటే అది కేవలం అమాయకత్వం, తప్పుడు ఆలోచన అని చెప్పటం దీని ఉద్దేశ్యం. పితృస్వామ్యాన్ని (వ్యవస్థీకృతమయిన స్త్రీ వ్యతిరేకత) అంతం చెయ్యాలంటే మన మెదళ్ళని, మనసుల్ని మార్చుకుని, వాటిలో నిండిపోయిన స్త్రీ వ్యతిరేక ఆలోచనలు, ఆచరణని బయటికి తరిమేసి స్త్రీ వాద ఆలోచన, ఆచరణతో నింపాలి. అలా చెయ్యకుండా ఉన్నంత కాలం మనమందరం కూడా దీన్ని కొనసాగించడంలో భాగస్వాములుగానే ఉంటామని ముందు గ్రహించాలి.
పితృస్వామ్యం నుండి, అంటే పురుషులు స్త్రీలకంటే ఆధిక్యులు కాబట్టి మనపైన అధికారం చెలాయించొచ్చు అనే సమాజ అవగాహన వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది మగవాళ్ళే. కానీ ఆ ప్రయోజనాల కోసం వాళ్ళు కొంత మూల్యం చెల్లించుకోవాలి. పితృస్వామ్యం వాళ్ళకందించే ప్రయోజనాల కోసం స్త్రీలపై పెత్తనం చెలాయించి, దోచుకుని, అవసరమయితే హింసని ప్రయోగించి, మనల్ని అణచివేసే పితృస్వామ్యాన్ని కాపాడాల్సి ఉంటుంది. చాలామంది మగవాళ్ళని ఇది కలత పెడుతుంది. వారిలో చాలామంది స్త్రీలని ద్వేషించడానికి ఇష్టపడరు. స్త్రీలపై ప్రయోగించే హింసని, స్త్రీలని హింసించే మగవాళ్ళని చూసి కూడా చాలామంది తీవ్రంగా కదిలిపోతారు. కానీ, తమకు లభిస్తున్న ప్రయోజనాలను వదులుకోవటానికి భయపడతారు. పితృస్వామ్యం మారిపోతే తమకు బాగా తెలిసిన ప్రపంచం ఏమయిపోతుందోనని అనుమానపడతారు.
వాళ్ళ మనసుకి, మెదళ్ళకి ఇది తప్పని అర్థమయినా, పెద్దగా ఎదురు తిరక్కుండా అలా పురుషాధిక్యతని సమర్ధిస్తూ జీవిస్తారు. మగవాళ్ళు పదే పదే ఫెమినిస్టులకి ఏం కావాలో తమకి తెలియదని నాకు చెప్పినపుడు, నేను అర్థం చేసుకుంటాను. వాళ్ళలో మారి, ఎదగగలిగే శక్తి ఉందని నేను నమ్ముతాను. వాళ్ళకి ఫెమినిజం అంటే అర్థమయితే అదంటే భయం పోతుందని, స్త్రీ వాద ఉద్యమం పితృస్వామ్యం నుండి తమని తాము విముక్తి చేసుకోగలిగే ఆశని వారికిస్తుందని నా నమ్మకం.
అటువంటి మగవాళ్ళ, యువకులు, పెద్దవాళ్ళ కోసం, మనందరి కోసమే ఇరవై ఏళ్ళ నుండి ఎదురు చూసిన నేను ఈ చిన్న పుస్తకాన్ని రాశాను. నేనెంత ఎదురుచూసినా ఎవరూ రాయకపోయేటప్పటికి నేనే రాయాల్సి వచ్చింది. ఇది లేకపోతే, ప్రతిరోజూ వాళ్ళకి తెలియని ఉద్యమాన్ని ద్వేషించమని, వ్యతిరేకించమనే ప్రచార హోరుకి గురవుతున్న లక్షలాది మంది వద్దకు మన ఆలోచన చేరే అవకాశమే లేదు. స్త్రీ వాదం గురించి తేలిగ్గా చదవగలిగే చిన్న చిన్న కరపత్రాలు, పుస్తకాలూ, గైడు పుస్తకాలు ఎన్ని రావాలంటే, నా ఈ చిన్న పుస్తకం స్త్రీ వాద రాజకీయాల గురించి ఉద్వేగంతో మాట్లాడే ఒక గొంతుకగా మిగిలిపోవాలి. స్త్రీ వాదం అంటే ఏమిటో చెప్పటానికి హోర్డింగ్స్ పెట్టాలి, పత్రికల్లో, బస్సుల్లో, రైళ్ళలో, టెలివిజన్లలో ప్రకటనలు రావాలి. మనం ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. ఈ ఉద్యమం అందరి మనసుల్లోకి, మెదళ్ళలోకి చేరాలంటే మనం స్త్రీ వాదాన్ని అందరితో పంచుకోవాలి. స్త్రీ వాద మార్పు మనందరి జీవితాల్లోకి మంచి మార్పులు తెచ్చింది. కానీ దాని గురించి ప్రతికూల వాదనలని కొంచెం విన్నా సరే, జరిగిందంతా మర్చిపోవటానికి సిద్ధమైపోతాం. నేను పురుషాధిపత్యాన్ని ధిక్కరించటం, పితృస్వామ్య ఆలోచనలని వ్యతిరేకించటం మొదలుపెట్టినపుడు… ముఖ్యంగా నా జీవితంలో అతి బలమైయిన పితృస్వామ్య గొంతుకయిన మా అమ్మని ఎదిరించటం ప్రారంభించినపుడు నేనొక యుక్త వయసులోకి అప్పుడే అడుగుపెడుతున్న పిల్లని. డిప్రెషన్‌కి గురై, ఆత్మహత్య అంచుల్లో ఉండేదాన్ని. నాకంటూ సమాజంలో ఒక స్థానం, నా జీవితానికి ఒక అర్థం దొరుకుతుందని అప్పుడు ఏ మాత్రం నాకు నమ్మకం ఉండేది కాదు. స్త్రీ వాదం నాకప్పుడు నిలబడడానికి సమానత్వం, న్యాయం అనే భూమికనిచ్చింది. తర్వాత మా అమ్మ కూడా నా స్త్రీ వాద ఆలోచనవైపే మళ్ళింది. తన ఆరుగురు కూతుళ్ళు స్త్రీ వాద రాజకీయాల వల్ల మెరుగయిన జీవితం గడపటం చూసింది. స్త్రీ వాద ఉద్యమం ఇచ్చే హామీ, ఆశని దగ్గరగా చూసింది. ఆ హామీ, ఆశలనే ఈ పుస్తకంలో నేను మీ అందరితో పంచుకోదలచుకున్నాను.
ఒక్కసారి ఏ పెత్తనం లేని ప్రపంచంలో బ్రతకటం ఎలా ఉంటుందో ఊహించుకోండి. అక్కడ స్త్రీలు, పురుషులు ఎప్పుడూ ఒకేలాగా బ్రతకకపోవచ్చు, ఇద్దరి మధ్య పూర్తి సమానత్వం ఉండకపోవచ్చు. కానీ మన జీవితాలలో, జీవించే వాతావరణంలో ఒక అన్యోన్యత నిండి ఉంటుంది. మనందరం ఏమి కావాలనుకుంటామో అవన్నీ సాధ్యమయ్యే ప్రశాంతమైయిన ప్రపంచాన్ని ఊహించుకోండి. స్త్రీ వాద విప్లవం ఒక్కటే అటువంటి ప్రపంచాన్ని సాధించలేదు. జాత్యహంకారాన్ని, వర్గ ఆధిపత్యాన్ని, సామ్రాజ్యవాదాన్ని కూడా మనం అంతమొందించాలి. చెయ్యగలిగితే మనమనుకున్న స్త్రీలుగా, పురుషులుగా మనల్ని మనం ఆవిష్కరించుకోవచ్చు. కలిసి బ్రతకటానికి, స్వేచ్ఛ, న్యాయం కావాలనే మన కలల్ని సాకారం చేసుకోవటానికి అవసరమయిన కమ్యూనిటీని నిర్మించుకోవచ్చు. మనందరం సమానమనే సత్యాన్ని జీవించొచ్చు. కొంచెం దగ్గరికి రండి, స్త్రీ వాదం మిమ్మల్ని తాకి మీ జీవితాన్ని, అందరి జీవితాలని ఎలా మార్చగలదో చూడండి. స్త్రీ వాద ఉద్యమం అంటే ఏమిటో మీ అంతట మీరే తెలుసుకోండి. స్త్రీ వాదం అందరి కోసమని మీరే అంటారు!
స్త్రీ వాద రాజకీయాలు`మన వైఖరి :
సరళంగా చెప్పాలంటే ఫెమినిజం స్త్రీల పట్ల వ్యతిరేకతని, లైంగిక దోపిడీని, అణచివేతని అంతమొందించే ఉద్యమం. పదేళ్ళ క్రితం రాసిన ‘‘స్త్రీ వాదం: అంచుల నుండి కేంద్ర స్థానానికి’’ అన్న పుస్తకంలో స్త్రీ వాదానికి నేనిచ్చిన నిర్వచనమిది. అందరూ వాడగలిగే ఉమ్మడి నిర్వచనంగా అది మారుతుందని నేనాశించాను. ఈ నిర్వచనంలో ఆడవాళ్ళకి మగవాళ్ళు శత్రువులనే భావన సూచన ప్రాయంగా కూడా ఉండదు కాబట్టి నాకు చాలా నచ్చుతుంది. అసలు సమస్య స్త్రీల పట్ల వ్యతిరేకత అని సూటిగా విషయాన్ని చెప్పేస్తుంది. ఎటువంటి సెక్సిస్టు ఆలోచన, ఆచరణ అయినా సరే, అది మగవాళ్ళు చేసినా లేక ఆడవాళ్ళు చేసినా, పిల్లలు చేసినా లేక పెద్దవాళ్ళు చేసినా, అది సమస్యాపూరితమని ఎత్తి చూపుతుంది. వ్యవస్థాపరమయిన, సంస్థాగతమయిన సెక్సిజాన్ని/ స్త్రీ వ్యతిరేకతని కూడా పొందుపరచుకోగలిగే విస్తృతమయిన నిర్వచనం అది.
ఈ నిర్వచనం ప్రకారం స్త్రీ వాద లక్ష్యాలు విస్తృతమైనవి, ఒకచోట ఆగేవి కావు. ఫెమినిజాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు సెక్సిజం అంటే అర్థం చేసుకోవటం అత్యవసరం. అత్యధిక ప్రజానీకం సెక్సిజం అంటే ఏంటో అర్థం చేసుకోరని, చేసుకున్నా అదో పెద్ద సమస్య కాదని అనుకుంటారని స్త్రీ వాద రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవాళ్ళకే బాగా తెలుసు. వీళ్ళలో అతి పెద్ద శాతం ఫెమినిజం అంటే పురుష వ్యతిరేకత అనుకుంటారని కూడా తెలుసు. పితృస్వామ్య ప్రచార సాధనాలయిన మాస్ మీడియా నుండి వీళ్ళు స్త్రీ వాద రాజకీయాల గురించి తెలుసుకోవటం వల్ల కలిగే పర్యవసానం ఇది. ఎక్కువగా వాళ్ళు ఫెమినిజం గురించి వినేది స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడే స్త్రీల నుండి. వాళ్ళు ఎక్కువగా స్త్రీలు, పురుషులిద్దరికీ సమానమయిన పనికి సమాన వేతనం ఇవ్వాలని, స్త్రీలు పురుషులు ఇంటి పనులు, పిల్లల పెంపకం పంచుకోవాలని మాట్లాడతారు.
ఇలా మాట్లాడే స్త్రీలు సాధారణంగా తెల్లజాతి స్త్రీలు, అదీ డబ్బు, అధికారం ఉన్నవాళ్ళు అయి ఉంటారు. స్త్రీల విముక్తి అంటే గర్భస్రావం చేయించుకోవటానికి, కుటుంబ హింస, లైంగిక దాడుల్ని వ్యతిరేకించడానికి స్వేచ్ఛ కలిగి ఉండటమని ప్రసార మాధ్యమాల నుండి తెలుసుకుని ఉంటారు. పని స్థలాల్లో అందరికీ సమానత్వం ఉండాలని చాలామంది ఒప్పుకుంటారు.
మన సమాజం ప్రధానంగా క్రిస్టియన్ సంస్కృతిలో నడుచుకుంటుంది కాబట్టి ఇప్పటికీ జన సముదాయం దేవుడు కుటుంబాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి లోబడి నడుచుకోవాలని ఆదేశించాడని బలంగా నమ్ముతుంది. పెద్ద ఎత్తున స్త్రీలు పని స్థలాల్లోకి ప్రవేశించినప్పటికీ, చాలా కుటుంబాలకి స్త్రీలే పెద్ద దిక్కయినప్పటికీ, మన జాతి ఊహల్లో కుటుంబం, ఇల్లంటే ఇప్పటికీ పురుషాధిపత్యం చెక్కుచెదరకుండా
ఉన్న ప్రదేశం, మగాళ్ళు అక్కడ ఉన్నా, లేకున్నా సరే. స్త్రీ వాద ఉద్యమమంటే పురుషులకి వ్యతిరేకం అన్న తప్పుడు అభిప్రాయంతో పాటు, స్త్రీలు మాత్రమే ఉండే ప్రదేశాలన్నీ పితృస్వామ్యం, సెక్సిస్టు ఆలోచన లేని ప్రదేశాలనే పనికిమాలిన భావన కూడా బాగానే ప్రబలింది.
స్త్రీ వాద రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసే స్త్రీలతో సహా అనేకమంది స్త్రీలు దీన్ని నమ్మటానికి సిద్ధపడ్డారు. పురుషాధిపత్యానికి కోపంతో స్పందించే చాలామంది మొదటి తరం స్త్రీవాద కార్యకర్తల్లో పురుష వ్యతిరేక సెంటిమెంట్ బలంగానే ఉంది. ఈ కోపమే స్త్రీ విముక్తి
ఉద్యమాన్ని సృష్టించడానికి కూడా దారితీసింది. వారి (చాలామంది తెల్లజాతి స్త్రీలు) చైతన్యం జాత్యహంకార వ్యతిరేక, వర్గ ఆధిపత్య వ్యతిరేక ఉద్యమాల్లో రూపుదిద్దుకుంది. ఒక పక్క ప్రపంచానికి స్వేచ్ఛ గురించి ఎలుగెత్తి చాటుతూ, ఇంకో పక్క తమతో పనిచేసే స్త్రీలని తొక్కిపెట్టి పురుషుల ఆధిపత్య ధోరణుల నేపధ్యంలో ఏర్పడిరది. సోషలిజం కోసం పనిచేసే ఉద్యమాలలో స్త్రీలు కావచ్చు, పౌర హక్కులు, నల్లజాతి విముక్తి కోసం పనిచేసే నల్లజాతి స్త్రీలు కావచ్చు. మూల వాసీ హక్కుల కోసం పనిచేసే దేశీయ అమెరికన్ స్త్రీలు కావచ్చు, అన్ని చోట్లా వారికి ఎదురయింది తాము మాత్రమే నాయకత్వ హోదాలో ఉండి స్త్రీలందరూ తమ వెనకే రావాలని అనుకునే మగవాళ్ళు. ఈ రాడికల్ స్వేచ్ఛా ఉద్యమాల్లో పాల్గొనటమే ప్రగతిశీల భావాలున్న స్త్రీలలో తిరుగుబాటు, ప్రతిఘటనా స్ఫూర్తిని మేల్కొలిపి వారిని స్త్రీ విముక్తి పోరాటాల వైపుకి నడిపించింది. స్త్రీ వాద ఉద్యమం ముందుకు కొనసాగిన క్రమంలో, పురుషులు మాత్రమే కాక, స్రీలు కూడా స్త్రీ వ్యతిరేక ఆలోచనలు, ప్రవర్తన సమర్ధిస్తారని అర్థమయ్యే కొద్దీ, ఉద్యమంలో పురుష వ్యతిరేక సెంటిమెంటు ప్రభావం తగ్గిపోయింది. దృష్టంతా జెండర్ న్యాయం సాధించటం పైకి తిరిగింది. అయితే తమలో ఉన్న సెక్సిస్టు ఆలోచనని ఎదిరించకుండా స్త్రీ వాదాన్ని ముందుకు తీసుకోళ్ళటం కష్టమని స్త్రీలకి అర్థమయింది. స్త్రీలు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్న కాలం సహోదరిత్వం (సిస్టర్ హుడ్) బలంగా ఉండదు.
పురుషాధిక్య సమాజంలో స్త్రీలందరూ బాధితులన్న వాస్తవంపై మాత్రమే ఆధారపడి నిర్మించుకున్న ‘సిస్టర్ హుడ్ కల’ వర్గం, జాతిపై వచ్చిన చర్చలతో చెదిరిపోయింది. వర్గ భేదాల గురించిన చర్చ స్త్రీ వాదంలో జాతి గురించిన చర్చలకి ముందే జరిగింది. స్త్రీలలో వర్గ విభజనల గురించి జరిగిన విప్లవాత్మక చర్చలని డయానా ప్రెస్ 1970ల మధ్యలోనే క్లాస్ అండ్ ఫెమినిజం అనే వ్యాసాల పుస్తకంలో ప్రచురించింది. దీనిలో ఎక్కడా కూడా ‘సహోదరిత్వం/సిస్టర్‌హుడ్ స్త్రీలకి ఒక బలమయిన చారిత్రక అవసరం’ అన్న స్త్రీ వాద ఆలోచనని తక్కువ చెయ్యలేదు. కానీ సెక్స్, వర్గం, జాతి విభేదాల ఆధారంగా కొంతమంది స్త్రీలు ఇతర స్త్రీలపై ఆధిపత్యాన్ని ఏర్పరచుకోవటం, దోచుకోవటాన్ని ఎదుర్కోకుండా, అలాగే ఆయా విభేదాల గురించి మాట్లాడుకునే రాజకీయ వేదికలు ఏర్పర్చుకోకుండా ఈ సహోదరిత్వం అసాధ్యం అని నొక్కి చెప్పింది.
నల్లజాతి స్త్రీలు వ్యక్తిగతంగా మొదటినుండి ఈ ఉద్యమాల్లో క్రియాశీలంగా ఉన్నప్పటికీ, ఆ ఉద్యమాల్లో ధృవతారలు కాలేకపోయారు. అందువల్ల మీడియా దృష్టికి కూడా రాలేదు. క్రియాశీలక నల్ల జాతి స్త్రీవాదులు, అనేకమంది లెస్బియన్ స్త్రీ వాదుల్లాగే విప్లవ ధోరణులు కలిగి ఉన్నవాళ్ళు. ఉన్న వ్యవస్థలో స్త్రీ పురుష సమానత్వం సాధించాలనే దృష్టితో పనిచేసే సంస్కరణ వాద స్త్రీ వాదులతో వాళ్ళు విభేదించే వాళ్ళు. జాత్యహంకారం స్త్రీ వాద సమూహాల్లో చర్చనీయాంశం కాకముందే నల్లజాతి స్త్రీలకి (విప్లవ భావాలున్న వారి స్నేహితులకి) తెల్ల జాత్యహంకారంతో కూడిన పెట్టుబడి దారీ పితృస్వామ్యంలో తమకి సమానత్వం రాదని స్పష్టంగానే తెలిసిపోయింది.
స్త్రీ వాద ఉద్యమం ఊపిరి పోసుకున్నప్పటి నుండే దానిలో భిన్న ధృవాలుండేవి. సంస్కరణ వాదులు సమానత్వంపై దృష్టి పెట్టేవాళ్ళు. విప్లవ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉన్న వ్యవస్థలో స్త్రీలకి హక్కులు సాధించటం మాతమ్రే సరిపోదని భావించాము. మేము ఆ వ్యవస్థని పూర్తిగా మార్చి పితృస్వామ్యం, సెక్సిజంలని అంతమొందించాలని భావించాము. పితృస్వామ్య మాస్ మీడియాకి ఇటువంటి విప్లవాత్మక దృష్టి పట్ల ఎటువంటి ఆసక్తి లేకపోవడం వల్ల మా ఆలోచనలు ప్రధాన స్రవంతిలోకి ప్రవేశించలేదు.
ఇప్పటికీ జన సముదాయం దృష్టిలో స్త్రీల విముక్తి అంటే పురుషులకి ఉన్నదంతా స్త్రీకి ఇప్పించటం అన్న భావన మాత్రమే. ఇది సాధించటం కొంత తేలిక కూడా. దేశ ఆర్ధిక వ్యవస్ధలో వచ్చిన మార్పులు, ఆర్ధిక మాంద్యం, ఉద్యోగాలు పోవటం మొదలైన మన దేశ పౌరులని పని స్థలాల్లో జెండర్ సమానత్వాన్ని ఒప్పించే వాతావరణాన్ని తయారుచేశాయి.
జాత్యహంకార కోణం నుండి ఈ పరిణామాన్ని చూసినప్పుడు తెల్లజాతి మగవాళ్ళు వారి స్త్రీలకి సమాన హక్కులను ఇవ్వటానికి సుముఖత చూపించటం, తెల్లజాతి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవచ్చనే ఉద్దేశంతో చేసిందేనని అర్థమవుతుంది. 1960లలో నల్లజాతి వారి పౌర హక్కుల కోసం జరిగిన ఉద్యమం తర్వాత జాతి వివక్ష చట్టపరంగా రద్దయి నల్ల జాతి మగవాళ్ళు పని స్థలాల్లో తెల్లజాతి పురుషులతో సమానత్వం సాధించే స్థాయికి వచ్చిన సందర్భంలోని తెల్లజాతి స్త్రీలు తమ స్వేచ్ఛ కోసం పట్టుబట్టడం మొదలుపెట్టారని మనం మర్చిపోకూడదు.
పని స్థలాల్లో స్త్రీలు పురుషులతో సమానంగా ఉండాలనే ఈ సంస్కరణ వాద స్త్రీ వాదం తన నీడలో జాతి మొత్తాన్ని సెక్సిజం నుండి విముక్తి చేసేందుకు అవసరమయిన వ్యవస్థీకృత మార్పులు అడిగే సమకాలీన స్త్రీ వాదాన్ని, దాని రాడికల్ పునాదులను కప్పెట్టేసింది. ఉన్న వ్యవస్థలో కొంచెం ఆర్థిక సామర్ధ్యం రాగానే చాలామంది స్త్రీలు, ముఖ్యంగా అధికార వర్గాల నుండి వచ్చిన తెల్లజాతి స్త్రీలు విప్లవాత్మక స్త్రీ వాద దృష్టికోణాలను పట్టించుకోవడం మానేశారు.
విచిత్రంగా ఈ దృష్టి కోణాలను యూనివర్శిటీ విద్యలో ఉండేవాళ్ళు దగ్గరకు తీసుకుని, స్వంతం చేసుకున్నారు. బాగా చదువుకున్న వీళ్ళు విప్లవాత్మక స్త్రీ వాద సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ పోయారు, కానీ అవి సాధారణ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోకి రాలేదు. బాగా పెట్టి పుట్టిన, పెద్ద చదువులు చదువుకున్న, బలమయిన సామాజిక వర్గాలకి చెందిన కొంతమందికి మాత్రమే ఆయా సిద్ధాంతం అందుబాటులో ఉంటూ వచ్చింది. ‘ఫెమినిస్టు సిద్ధాంతం: అంచుల నుండి కేంద్రానికి’ వంటి పుస్తకాలు ప్రధాన స్రవంతి దృష్టిలోకి ఎప్పుడూ రాలేదు. సాధారణ ప్రజలకు వాటి గురించి వినే అవకాశమే రాలేదు కాబట్టి కొట్టి పడేశారనటానికి ఆస్కారం లేదు.
మగవాళ్ళతో సమానత్వం కోసమో, వారిలాగా బ్రతకాలనే స్వేచ్ఛ కోసమో కాకుండా ఒక విశాల దృక్పథంతో రూపుదిద్దుకున్న ఇటువంటి స్త్రీ వాద ఆలోచనలను ఒక పక్క తెల్ల జాతి ఆధిపత్య భావజాలంతో నిండిపోయిన పెట్టుబడిదారీ పితృస్వామ్య వ్యవస్థ తొక్కిపెడితే, ఇంకో పక్క సంస్కరణ వాద స్త్రీ వాదం కూడా అంతే బలంగా పక్కకి పెట్టింది. వర్గ వ్యవస్థలో పై మెట్టుకి ఎక్కటానికి సంస్కరణ వాద స్త్రీ వాదం బాగా పనికొచ్చింది. ఆయా స్త్రీలకి దీనివల్ల పని ప్రదేశాల్లో మగవాళ్ళ ఆధిపత్యాన్నుండి బయటపడి, తమ వ్యక్తిగత జీవన విధానాలని స్వంతగా నిర్ణయించుకోవటానికి సాధ్యమయింది. సెక్సిజం అంతమవ్వలేదు కానీ, ఉన్న వ్యవస్థలో తమ స్వేచ్ఛా, స్వాతంత్రాలని పెంచుకోవటానికి వారికి సాధ్యమయింది. తాము చెయ్యమని వదిలేసిన మురికి/చెత్త పనులన్నీ చెయ్యటానికి వారికి క్రింది వర్గానికి చెందిన అణగారిన స్త్రీలు ఎలాగూ అందుబాటులోనే ఉన్నారు. ఇలా క్రింది వర్గాల, అణగారిన స్త్రీల దోపిడీకి ఒప్పుకుని, దానిలో పాలు పంచుకోవటం ద్వారా పితృస్వామ్య వ్యవస్థ, అది కొనసాగించే సెక్సిజంలో కూడా వారు భాగమైనప్పటికీ, తమకి తాము పని స్థలాల్లో, కుటుంబాల్లో సమానత్వం పొందే హక్కుని కూడా ఇచ్చుకున్నారు. వీళ్ళలో లెస్బియన్లు పని స్థలాల్లో పురుషులతో సమానత్వం సంపాదించుకుని ఇళ్ళల్లో కూడా పురుషులతో సంబంధం లేకుండా జీవించగలిగే జీవన విధానాన్ని ఏర్పరచుకున్నారు.
ఈ జీవన విధాన స్త్రీ వాదం (లైఫ్ స్టైల్ ఫెమినిజం) ఎన్ని రకాల స్త్రీలుంటే అన్ని రకాల స్త్రీ వాదం ఉండొచ్చనే భావనకి దారితీసింది. స్త్రీ వాదంలో రాజకీయ స్పృహే లేకుండా చేసింది. ఎటువంటి రాజకీయాల దృక్పథం ఉన్నా సరే, ఉదారవాది కావొచ్చు, మితవాది కావొచ్చు. అందరూ స్త్రీ వాదాన్ని తమ తమ జీవన విధానంలో కలుపుకు పోవచ్చనే భావన పాకిపోయింది. ఈ రకమైన ఆలోచనా విధానం స్త్రీ వాదాన్ని అందరికీ నచ్చేలా చేసింది కూడా. ఎందుకంటే దీనిలో తమని తాము గాని, సంస్కృతిని గానీ మౌలికంగా ధిక్కరించకుండా, మార్చుకోకుండా ఏ స్త్రీ అయినా స్త్రీ వాదిగా మారిపోవచ్చు.
ఉదాహరణకి గర్భస్రావం విషయాన్నే తీసుకుందాం. స్త్రీ వాదం సెక్సిస్టు అణచివేతని అంతమొందించే ఉద్యమం అనుకున్నప్పుడు, పిల్లల గురించిన నిర్ణయాధికారాన్ని స్త్రీలకి లేకుండా చెయ్యటం ఒక సెక్సిస్టు దోపిడీనే కాబట్టి గర్భ స్రావ హక్కుని వ్యతిరేకించేవాళ్ళు స్త్రీవాదులు కారు. ఒక స్త్రీ తన జీవితంలో గర్భస్రావం చేయించుకోననే వైఖరి తీసుకుని కూడా ఇతర స్త్రీలకి ఆ హక్కు ఉండాలనే డిమాండుని బలపరచి స్త్రీవాద రాజకీయాలని సమర్ధించొచ్చు. కానీ గర్భస్రావ హక్కుని మొత్తానికే వ్యతిరేకించేవాళ్ళు స్త్రీ వాదులు కాలేరు. కానీ ఇప్పుడు ఈ చర్చకి రెండువైపులా తమని తాము స్త్రీవాదులమని చెప్పుకునేవాళ్ళు తయారయ్యారు. అలాగే ‘పవర్ ఫెమినిజం’ కూడా ఇదే కోవకి చెందుతుంది. స్వీయ సాధికారత సాధించటాన్ని పవర్ ఫెమినిజంగా వ్యక్తీకరించాలని అంటుంటే ఇతరుల దోపిడీ, అణచివేత ద్వారా పొందిన దాన్ని కూడా పవర్ స్త్రీ వాదమని వర్ణిస్తున్నారు. తమ నుండి లాక్కున్నదాన్ని న్యాయంగా తిరిగి పొందితేనే అది న్యాయమయిన అధికారమవుతుంది తప్ప వేరే రకంగా అధికారాన్ని సంపాదించుకుంటే ఆధిపత్యమవుతుంది. స్త్రీ వాద ఉద్యమం స్పష్టమయిన నిర్వచనాలు వదిలెయ్యటం వల్లే స్త్రీ వాద రాజకీయాలు కూడా ఉరవడి కోల్పోయాయి. మళ్ళీ వాటిని స్వంతం చేసుకుందాం. వాటిని అందరితో పంచుకుందాం. ప్రపంచానికి స్త్రీ వాదం అంటే ఇదీ అని గొంతెత్తి చెబుదాం. టీ షర్ట్స్, బంపర్ స్టిక్కర్స్, పోస్టు కార్డులు, హిప్ హాప్ మ్యూజిక్, టెలివిజన్, రేడియో ప్రకటనలు, బిల్ బోర్డు ప్రకటనలు… అన్నీ వాడుకుని చెబుదాం. స్త్రీ వాదం అంటే సెక్సిస్టు అణచివేతని అంతం చేసే ఉద్యమమనే బలమమయిన, సింపుల్ మెసేజ్‌ని అందరికీ చేరవేద్దాం. ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభిద్దాం.