థెరీ గాథలు ఆనాటి స్త్రీ జీవితాలను ప్రతిబింబిస్తాయి. దుర్భరమైన వైవాహిక బంధంలో ఇమడలేని ఇసిదాసి జీవితాన్ని తీసుకొన్నప్పుడు అనాదిగా స్త్రీల జీవితాలతో ఎంతటి విషాదం, దుఃఖం, నిస్సహాయతలు పెనవేసుకొని ఎంతమందిని కబళించి ఉంటాయో ఊహింపశక్యం కాదు.
ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఈ విషాదం పరిష్కృతమైందని చెప్పలేం. ఇలాంటి స్త్రీలకు కుటుంబం, మతం తప్ప ఎవరు ఓదార్చారు చరిత్రలో. ఇలాంటి విధివంచితుల కన్నీళ్ళను తుడవడంలో మతం పాత్రను విస్మరించలేం. ఇసిదాసి గాథ ద్వారా అప్పట్లో స్త్రీ పునర్వివాహం పట్ల సమాజానికి ఏ పట్టింపులు లేవని తెలుస్తున్నా, రెండు, మూడవ వివాహాలలో ఎక్కువ కట్నం, అయోగ్యుడైన భర్త లాంటి అంశాలు కూడా గమనించదగినవి.
1. థెరికా: థెరికా క్షత్రియ కుటుంబంలో జన్మించింది. ఒకనాడు ఈమె బుద్ధుని బోధనలు విని ఆకర్షితురాలై, సంఘంలో చేరాలని నిర్ణయించుకొంది. భర్త అందుకు అంగీకరించని కారణంగా థెరిగా గృహస్తుగా సంసారిక బాధ్యతలు నిర్వర్తిస్తూ తథాగతుని బోధనలు మననం చేసుకొంటూ జీవనం సాగించసాగింది. ఒకనాడు వంటింట్లో మంటలు చెలరేగగా థెరికాకు ప్రాణాపాయం తప్పింది. ఆ క్షణంలో మానవ జీవితం ఎంత అశాశ్వతమో అర్థమై, భర్తను ఒప్పించి బౌద్ధ భిక్షుణిగా దీక్ష తీసుకుంటుంది. ఒకనాడు బుద్ధుడు ఆమెతో ఇలా అన్నాడట.
థెరికా
ఇప్పుడు నీవు థేరీలలో కలిశావు
నీకు చిన్నప్పుడు పెట్టిన పేరు ఇన్నాళ్ళకు నిజమైంది
నీవు స్వయంగా కుట్టుకొన్న దుస్తులను కప్పుకొని
హాయిగా నిదురించు
నీ వాంఛలన్నీ కుండలో దాచిన ఆకుకూరల్లా
వడలి ఎండిపోతాయి ఇక. (1)
2. ముత్త: ముత్త (ముక్త) పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. దుర్భర దారిద్య్రం కారణంగా ఆమె తల్లిదండ్రులు ఆమెను ఒక గూనివానికిచ్చి వివాహం జరిపించారు. అనాకారితో వివాహం కన్నా వైవాహిక జీవితంలో ఎదురైన కష్టాలు ముత్తను కృశింపచేశాయి. భర్త అనుమతి తీసుకొని ఆమె బౌద్ధ ఆరామంలో చేరింది. నియమ నిష్టలతో జీవనం సాగించి సంఘంలో భిక్షుణి హోదాను పొందింది.
నేను స్వేచ్ఛనొందాను
నేను స్వేచ్ఛనొందాను
మూడు కుటిల విషయాల నుండి
మూడు కుటిల విషయాల నుండి
నా భర్త, రోలు, రోకలి
జననం, మరణం, పునర్జన్మ
నేను స్వేచ్ఛనొందాను (11)
3. దంతిక: కోసల రాజు వద్ద మంత్రిగా పనిచేస్తున్న ఒక బ్రాహ్మణుని కూతురు దంతిక. ఈమె యుక్తవయసులోనే బౌద్ధ సన్యాసినిగా ప్రజాపతి గౌతమి శిష్యురాలిగా బౌద్ధ దీక్ష తీసుకొంది. పరిపరి విధాల ప్రవహించే మనసుని స్వాధీనపరచుకోవటానికి సాధన చేయటమే మార్గమని, కఠోర సాధన ద్వారా ఎంతటి మృగప్రాయ చిత్తమైనా మచ్చిక కాక తప్పదని గొప్ప దుష్టాంతం ద్వారా దంతిక తన గాథలో ఇలా చెప్పింది.
గృద్ధకూట పర్వతంపై ధ్యానం కొరకు వెళ్ళాను
అక్కడ ఒక ఏనుగు
నదిలోంచి నడుచుకొంటూ బయటకు వస్తోంది
పురుషుడొకడు ఆ ఏనుగును ఆపి
దానికి అంకుశాన్ని చూపాడు
అది ముంగాలు ముందుకు చాచింది
ఆ పురుషుడు దానిని అధిరోహించాడు
ఒక అడవి మృగం నా కళ్ళముందే
మానవునిచే మచ్చిక కాబడిరది
అది చూశాక నాకు నమ్మకం వచ్చింది
అడవిలోకి వెళ్ళి సాధన మొదలుపెట్టాను (48`50)
సాధారణ జీవనం సాగించే స్త్రీలు బౌద్ధమతం పట్ల ఆకర్షించబడటానికి కారణాలు వివిధ రకాలుగా ఉన్నాయి. స్వేచ్ఛ, జన్మరాహిత్యాన్ని కోరుకోవటం అనేక గాథలలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తరువాత దుఃఖం, వియోగం నుండి విముక్తినొందటానికి కొందరు, ఐహిక సుఖాల పట్ల వైముఖ్యం పొంది మరికొందరు, క్రతువులు వ్రతాల పట్ల అయిష్టతతో ఇంకొందరు అంతవరకూ పాటిస్తున్న జైన లేదా వైదిక సాంప్రదాయాలను త్యజించి బౌద్ధాన్ని ఎన్నుకొన్నట్లు ఈ గాథల ద్వారా తెలుస్తోంది.
బౌద్ధ మతం వైపు ప్రజలు ఆకర్షితులవటం ఒకరకంగా గొప్ప చారిత్రక చిక్కుముడి. మిత్తా, నందుత్తరలు చెప్పిన ఈ గాథలు ఆ చిక్కుముడిని కొంత విప్పే ప్రయత్నం చేస్తాయి.
మిత్తా: ఈమె క్షత్రిక కుటుంబంలో జీవించింది. మహాప్రజాపతి గౌతమి ఈమెకు దీక్షనిచ్చింది. కఠోర సాధనతో ఈమె అనతికాలంలోనే గొప్ప భిక్షుణిగా పేరు తెచ్చుకొంది.
ఉత్తమ జన్మకొరకు
ఈ రోజు
ఎన్నో ఉపవాసాలు చేశాను
శిరోముండనం గావించుకొని
అష్టమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి
కాషాయ వస్త్రాలు ధరించి,
ఇంకా అన్ని పర్వదినాల్లోను
ఒక పూటే తింటున్నాను
కఠోరమైన ఉపవాసాలు ఉండేదాన్ని
ఉత్తమ జన్మ పట్ల నా మనసులో
ఏ బెంగా లేదిక (31`32)
… … …
ఇదే మోక్షమార్గమని వైదిక ధర్మం ఎన్నో క్రతువులను నిర్దేశించింది. వాటిని పాటించకపోతే ఏమౌతుందో అనే ఆందోళన, భయం సహజం. పై గాథలో మిత్తాకు అలాంటి ఆందోళనల నుండి ఉపశమనం దొరికింది. నిజానికి ఒక పూటే తింటూ మునుపటికన్నా ఎక్కువ నిరాహారంగా ఉన్నది మిత్తా. బౌద్ధం జీవన్ముక్తి పేరుతో చెప్పిన జన్మరాహిత్య భావన మిత్తా లాంటి విశ్వాసులను ఆకర్షించి ఉంటుంది. పరలోకం కాదు అన్నీ ఇక్కడే అనే ఆలోచనతో వారు బెంగ, ఆందోళనా లేని జీవనాన్ని సాగించి ఉంటారు.
నందుత్తర: నందుత్తర ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె మొదట జైన మతాన్ని స్వీకరించి దేశమంతా తిరుగుతూ ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ ఎంతో మందిని ఓడిరచింది. ఒకరోజు బుద్ధుని ప్రియశిష్యుడైన మొగ్గల్లనతో చర్చల్లో పాల్గొని వాదనలో ఓడిపోయి బౌద్ధాన్ని స్వీకరించి అనతికాలంలోనే సంఘంలో గొప్ప సన్యాసినిగా పేరుతెచ్చుకొంది.
అగ్నిని, సూర్యచంద్రులని శరీరానికి తైలమర్దనాలు చేయించుకొంటూ
దేవతలను భక్తితో ఆరాధించాను విషయభోగాసక్తిని త్యజించలేదు
పవిత్రనదులలో స్నానమాచరించాను ఎప్పుడైతే సన్యసించానో
ఎన్నో పూజలూ వ్రతాలూ చేశాను ఎప్పుడైతే ఈ దేహ నిజస్వరూపాన్ని దర్శించానో
నేలపై పడుకొన్నాను కోర్కెలు, వాంఛలు, లాలసలు అన్నీ నశించాయి
రాత్రిపూట ఉపవాసం ఉండేదాన్ని సంకెళ్ళన్నీ తెంచబడ్డాయి
మరోపక్క ఆభరణాలు ధరిస్తూ, హృదయం ప్రశాంతంగా ఉంది. (87`97)
సుగంధద్రవ్యాలు పూసుకొంటూ
Satipatthana – Satta లో మానవ దేహం మరణించాక ఏ విధంగా కుళ్ళిపోతుందో దశలుగా వర్ణించబడిరది. కొత్తగా సన్యసించిన వారిని కుళ్ళిపోతున్న శవాల మధ్య కూర్చోబెట్టి ధ్యానం చేయించేవారట. దానివల్ల ఈ దేహంపై మమకారం, అనురక్తి నశించి కోర్కెలను జయించగలరని విశ్వాసం. పై గాథలో నందుత్తర ‘‘ఎప్పుడైతే ఈ దేహ నిజస్వరూపాన్ని దర్శించానో’’ అన్న వాక్యం బహుశా ఆ విధంగా కుళ్ళిపోతున్న మానవదేహాన్ని పరిశీలించి నా దేహం కూడా కొంతకాలానికి ఇంతే కదా అని వైరాగ్యాన్ని పొందే థేరీగా మారి ఆధ్యాత్మిక శాంతిని పొంది ఉంటుంది.