పరిచయం: భారతీయ సమాజం ప్రగతిశీల సమసమాజ లక్షణాలను అలవర్చుకోవడానికి భారత చరిత్రలో బుద్ధుడు, బసవేశ్వరుడు, జ్యోతిబాఫూలే, నారాయణ గురు మరియు డా.బి.ఆర్.అంబేద్కర్ వంటి గొప్ప సామాజిక సంస్కర్తల భావజాలం ఎంతో
ఉపకరించింది. భారతదేశంలో తొలి నుంచి సామాజిక మరియు సాంస్కృతిక ఆచారాల నెపంతో వర్గ భేద, వర్ణ భేద, లింగ భేదాలు మొదలైన భేద సంస్కృతులు సృష్టించబడ్డాయి. అందువల్లనే 12వ శతాబ్దం నాటికి ధనికులు`పేదలు, పాలకులు`పాలితులు, పురోహితులు`భక్తులు మొదలైన వర్గ భేదం, స్పృశ్య`అస్పృశ్యులనే వర్ణ భేదం, స్త్రీ`పురుషులనే లింగ భేదం అనే విభిన్న భేదాలతో సామాజిక సంక్షోభానికి తెరతీసింది. ఇటువంటి భేద సంస్కృతిని తృణీకరించి వర్గ, వర్ణ రహిత సామాజిక సంస్కృతిని రూపొందించడానికి భారతదేశంలో అనేకమంది పోరాటం చేశారు. ఈ పోరాటాలు సలిపిన వారిలో తగినంత గుర్తింపు రాకుండా కేవలం ఆధ్మాత్మిక వాదిగా మాత్రమే గుర్తించబడిన వారిలో బసవేశ్వరుడు ముందు వరసలో ఉంటాడు. వాస్తవానికి బసవేశ్వరుడు కుల, వర్గ, వర్ణ భేదాలు లేని ఒక నూతన సమసమాజ నిర్మాణానికి అంకురార్పణ చేశాడు. ఈ క్రమంలోనే సామాజిక సంస్కరణల ద్వారా ఒక నూతన సిద్ధాంతాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడు.
భారతీయ ధార్మికవాదం సమాజం కంటే వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చే తత్వజ్ఞానం ఒకవైపు, సమాజంలో చివరి విభేదాలు మరోవైపు ఉన్న ఆ కాలంలో బసవుడు వ్యక్తికి, సమాజానికి సమపాళ్ళలో ప్రాధాన్యత ఇచ్చి ఒక సమగ్ర జీవన సిద్ధాంతాన్ని రూపకల్పన చేశాడు. 12వ శతాబ్దంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు మతపరమైన రుగ్మతలు బసవుడిని తీవ్రంగా ఆలోచింపచేశాయి. వర్ణ వ్యవస్థ వల్ల సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలుగా విభజించబడి, కులాలకు, అనేక ఉపకులాలు, విభిన్న వర్గాలు ఏర్పడ్డాయి. కొన్ని కులాలు ఉన్నతమైనవిగా, మరికొన్ని నీచమైనవిగా పరిగణించబడేవి. అంతేకాకుండా, ఆ కాలంలో స్త్రీలను అర్థ బానిసలుగా చూసేవారు. వ్యక్తి గుర్తింపు అనేది తన శక్తి, సామర్ధ్యాల ఆధారంగా కాకుండా, వారి పుట్టుకతో, కులంతో ముడిపడి ఉండేది. అంతేకాకుండా బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్న పురాణాలు, శాస్త్రాలన్నీ పవిత్ర శాసనాలుగా గుర్తించబడి కర్మ సిద్ధాంతాన్ని బోధించి స్వర్గం, నరకం అనే భావజాలాన్ని మనుషుల మనసుల్లోకి చొప్పించి, మోక్షం అనేది బ్రాహ్మణులకు సేవచేయడం ద్వారా మాత్రమే లభిస్తుందని నమ్మబలికారు. 12వ శతాబ్దం నాటి కర్నాటకలో రాజుల రాజ ప్రాసాదం, బ్రాహ్మణ మహాజన వ్యవస్థ, సన్యాసుల మఠాలు ఈ మూడు మాత్రమే సమాజంపై పెత్తనం చెలాయించేవి.
బసవుడి సంస్కరణ ఉద్యమానికి ముందు కర్నాటకలో జైనం, బౌద్ధం, వైష్ణవం మరియు శైవం ఆచరణలో ఉండేవి. కానీ అవి సాధారణ వ్యక్తుల ఆధ్మాత్మిక అవసరాలను తీర్చలేకపోయాయి. ఈ క్రమంలోనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ప్రజాస్వామిక భావాలతో బసవేశ్వరుడు లింగాయత ధార్మిక వాదాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకువచ్చాడు. బసవేశ్వరుడ్ని ఒక ఆధ్యాత్మిక వేత్తగా, సంఘ సంస్కరణ వాదిగా, సామాజిక విప్లవకారుడిగా, దూరదృష్టి కలిగిన రాజకీయ, ఆర్థిక తత్వవేత్తగా కుల, వర్గ రహిత సమసమాజాన్ని నిర్మించడానికి కృషి చేసిన సమతా మూర్తిగా చెప్పవచ్చు.
మహిళా విముక్తికై బసవేశ్వరుడి పోరాటం
ప్రాచీన కాలం నుండి నేటి వరకు భారతదేశంలో మహిళలకు సముచితమైన స్థానం కానీ, గౌరవం కానీ లభించలేదు. అందుకు ప్రధానంగా బ్రాహ్మణ మత భావజాలాలు, దానికి ఆధారమైన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, శృతులు, అరణ్యకాలు, ఉపనిషత్తులు మొదలైనవి సృష్టించిన పితృస్వామిక వ్యవస్థ అని చెప్పవచ్చు. అయితే సమాజంలో వారు అనుభవిస్తున్న దుస్థితి నుంచి వారిని విముక్తి చేయడానికి ప్రయత్నాలు ప్రాచీన కాలం నుంచే జరిగాయి. ముఖ్యంగా బుద్దుడు మహిళలకు సమాజంలో సముచిత స్థానాన్ని, గౌరవాన్ని కల్పించాడు. అదే తరహాలో బుద్ధుని తదనంతరం మత మౌఢ్యానికి, మూఢ విశ్వాసాలకు, సామాజిక దురాచారాలకు నిలయంగా మారిన మధ్యయుగం నాటి 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు ప్రారంభించిన సామాజిక విప్లవం మహిళలను సాంఘిక, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లో విముక్తులను చేసింది.
బసవేశ్వరుడు మహిళల యొక్క శక్తి సామర్ధ్యాలను, వారి వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గుర్తించి వారికి పురుషులతో పాటు సమానమైన స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని, హక్కులను కల్పించాడు. మహిళల హక్కులను తిరస్కరించడంలో ఉన్న అంతరార్ధాన్ని గమనించిన బసవుడు పురుషులతో పాటు మహిళలు సైతం అన్ని రంగాల్లో సమానమైన పాత్రను పోషించగలరని పేర్కొన్నాడు. జెండర్ ఆధారంగా మహిళలపై వివక్ష, దోపిడీ, అణచివేత, పీడనలను బసవుడు ప్రశ్నించాడు. స్త్రీ, పురుషుల మధ్య జెండర్ పరమైన తేడాలే ఉంటాయి తప్ప వారిరువురూ సమానమైన శక్తిసామర్ధ్యాలను కలిగి ఉంటారని ప్రకటించాడు.
12వ శతాబ్దంలో బసవుడి ప్రేరణతో 33 మంది వచనకారిణులు సుమారు 1144 వచనాలను రచించి మహిళల మేధోపరమైన శక్తి సామర్ధ్యాలను, ఔన్నత్యాన్ని నిరూపించారు. ఈ వచనాల ద్వారా వారు మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతను, దోపిడీని ఖండిరచారు. మేధా సంపత్తి, శక్తి సామర్ద్యాలలో స్త్రీలు పురుషులకు ఎందులోనూ తీసిపోరని బసవుడు బలంగా నమ్మడమే కాకుండా ఆ భావజాలాన్ని సమాజంలో పాదుగొల్పడానికి కృషి చేశాడు. 12వ శతాబ్దం నాటికి ఆచరణలో ఉన్న అనేక సాంఘిక దురాచారాలను వ్యతిరేకించి బాల్యవివాహాలను ఖండిరచాడు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు.
సమసమాజ నిర్మాణంలో స్త్రీల హక్కులు కేవలం సాంఘిక, ఆర్థిక సమానత్వంపై మాత్రమే ఆధారపడి ఉండవని మత సమానత్వంపై కూడా ఆధారపడుతుందని విశ్వసించి మహిళలకు మత, ఆధ్యాత్మిక రంగాల్లో సమానత్వాన్ని ప్రభోదించాడు. బసవుడి అభిప్రాయంలో స్త్రీ, పురుషుల మధ్య శారీరక భేదం ఉన్నప్పటికీ వారిరువురిలో ఉండే ఆత్మ ఒక్కటే కాబట్టి మానవత్వం అనేది శరీరం రూపంలో కాదు ఆత్మరూపంలో ఉంటుందన్నాడు. బసవుడి సమకాలీనుడైన జాడె దసమయ్య యొక్క ఈ క్రింది వచనం ద్వారా స్త్రీ, పురుషుల భేదాన్ని తెలియపరిచాడు.
శరణుల ప్రకారం ఆత్మ లేదా లింగం గురించి వివక్ష చూపదు. శరీరం ప్రాథమికంగా ఒకటి, ఇది ఆత్మ మాత్రమే, ఇది పురుషుడు మరియు స్త్రీగా కనిపిస్తుంది. కాబట్టి మానవుడు శరీరంలో కాదు ఆత్మలో ఉన్నాడు. బసవుడికి సమకాలీనుడైన దేవర దాసిమయ్య యొక్క ఈ క్రింద వచన ద్వారా స్త్రీ, పురుషుల వీరశైవ దృక్పథాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు.
‘‘కటి కేశములుండ స్త్రీ అనెదరు
గడ్డము మీసములుండ పురుషులనెదరు
మధ్య సంచరించె ఆత్మ
పురుషుడు కాదు, స్త్రీ కాదు
ఓ రామనాథా!’’
ఆత్మకు స్త్రీ, పురుష సంబంధం లేదు, కాబట్టి వారిని అథమ స్థాయిలో చూడటం అనేది సరైనది కాదని బసవుడు ప్రకటించిన వీర శైవ దృక్పథం ప్రకటిస్తుంది.
తొలి వేదకాలంలో గార్గి, మైత్రి వంటి కొందరు మహిళలు ఆధ్యాత్మికతను సంపాదించి సూక్తులను, స్మృతులను రచించి పురుషులతో సమానమైన కార్యాలను నిర్వహించగలిగారు. కుటుంబంలో గౌరవాన్ని అధిష్టించారు. మలివేద కాలంలో ధర్మశాస్త్రాలు మహిళలు మోక్షానికి అనర్హులని, ఆధ్యాత్మికతలకు, మతపరమైన క్రతువులను నిర్వహించడానికి అనర్హులని చెప్పబడిరది. ఇటువంటి విషమ సమయంలో ఉదయభానుడిగా వెలసిన బసవుడు మహిళల స్థానాన్ని సామాజిక న్యాయం ఆధారంగా పునఃనిర్మాణం చేయదలిచాడు.
భారతీయ బ్రాహ్మణ సంస్కృతిలో ‘స్త్రీ, బంగారం మరియు భూమి’ ఈ మూడిరటినీ మాయ అని పరిగణిస్తారు. స్త్రీని మాయగా భావించి ఆమెను ప్రాపంచిక, పారమార్ధిక విషయాల నుంచి దూరంగా తోసివేసి, దుష్టశక్తిగా చిత్రీకరించారు. స్త్రీ కేవలం పిల్లలను కనే యంత్రంగా, పురుషుడి మోహాన్ని తీర్చుకునే ఆట వస్తువుగా వర్ణించారు. అయితే దీన్ని ఖండిస్తూ బసవుడు ఈ వచనం ద్వారా మాయ అంటే ఏమిటో వివరించాడు.
‘‘బంగారం మాయ అంటారు, బంగారం మాయ కాదు
స్త్రీని మాయ అంటారు, స్త్రీ మాయ కాదు
మట్టి మాయ అంటారు, మట్టి మాయ కాదు
మనసులోని ఆశయే మాయ
ఓ సంగమేశ్వర’’
మనిషి తన కంటికి కనిపించిందంతా తన వశం కావాలని కోరుకోవడమే ఆశ. ఆ ఆశ మానవుడి దుఃఖానికి కారణమన్నాడు బసవుడు.
స్త్రీని బ్రాహ్మణ వేదిక మతం అస్పృశ్యురాలిగా చూడటాన్ని బసవుడు ఖండిరచాడు. స్త్రీకి గల ప్రాకృతిక క్రియలు, ఋతుచక్రం అపవిత్రమని భావించి స్త్రీని శూద్రుల వరుసలోకి చేర్చింది. ఈ కారణం చేతనే వేద అధ్యయనానికీ, మంత్రాన్ని పఠించడానికీ, ధార్మిక క్రియలను నిర్వహించడానికి అనర్హురాలిని చేశారు. బ్రాహ్మణ మతం స్త్రీకి కల్పించిన ఈ హీన స్థితిని ఖండిస్తూ ‘‘ముట్టు (ఋతుచక్రం) లేకపోతే పిండానికి తావులేదు’’ అని ప్రకటించి మహిళా లోకానికి పవిత్రతను, అపారమైన గౌరవాన్ని కల్పించాడు. ఈ విధంగా స్త్రీ అస్పృశ్యురాలనే భవబంధం నుంచి విముక్తురాలిని చేశాడు.
బసవుడి కాలం నాటి విశిష్ట మహిళా శరణులలో ఒకరైన అక్క మహాదేవి బసవుడి నుంచి అత్యధిక ప్రశంసలు అందుకుంది. బసవుడు ఆమెను తన తల్లిగా అభివర్ణించి ఈ వచనం ద్వారా ఆమెను ఈ విధంగా ప్రశంసించాడు.
‘‘నీవు నా భక్తి యొక్క శక్తి
మీరు నాన యుక్తి యొక్క శక్తి
మీరు నా శక్తికి మహా శక్తి’’
అదే విధంగా, అక్క మహాదేవి కూడా బసవుడిని తన ఆధ్మాత్మిక తండ్రిగా భావించి, తాను బసవుడు ఇంటి కుమార్తెగా జీవించాను అని పేర్కొంది. బసవుడు స్థాపించిన అనుభవ మంటప లోని పంచరత్నాలుగా గుర్తించబడిన ఐదుగురు వ్యక్తుల్లో అక్క మహాదేవి ఒకరు. అనుభవ మంటప ను సందర్శించే అనేక మంది శరణుల అనుమానాలను, మీమాంసలను, సందేహాలను అక్క మహాదేవి మంచినీళ్ళ ప్రాయంగా నివృత్తి చేసేది. అక్క నాగమ్మ, ఆయుక్తి లక్కమ్మ, ఆముగె రాయమ్మ, కాలవ్వ, మసణమ్మ లాంటి ఎందరో మహిళా శరణులు పురుషాధిక్య సమాజంలోని దురాగతాలను తమ వచనాల ద్వారా ఎండగట్టడంలో బసవుడు పరోక్షంగా ప్రేరణనిచ్చాడు.
అనుభవ మంటప ద్వారా బసవుడు మరియు స్త్రీ సాధికారతకై అంగీకరించిన ప్రాథమిక సూత్రాలు ఈ విధంగా ఉన్నాయి.
1. పుట్టుక, లింగం లేదా వృత్తి ద్వారా ఎవరూ ఎక్కువ లేదా తక్కువ కాదు.
2. వ్యక్తికి, మరో వ్యక్తికి మరియు స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదు.
3. స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు ఉండాలి.
4. మహిళలు ఏ వృత్తినైనా (కాయక)ను స్వీకరించవచ్చు.
5. సహపంక్తి భోజనాలను మరియు కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.
మహిళలు తమకు నచ్చిన ఏ విధమైన పనిని చేపట్టడానికి మరియు ఆర్థిక స్వాతంత్య్రం పొందటానికి అనుమతించబడాలని బసవుడు ప్రబోధించాడు. స్త్రీలు ఇతర కులాల నుండి కూడా వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛను కల్పించాలన్నాడు. బసవుడి ఆదర్శ సూత్రాలు 800 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగంలోకి ప్రతిఫలించాయి.
అనుభావ మంటప చర్చలలో పాల్గొన్న అనేక మంది స్త్రీలు సంసార జీవితం గడుపుతూనే, ఆధ్మాత్మిక జీవితాన్ని గడిపినట్లు మనకు కనపడుతుంది. ఉదాహరణకు, బసవుడి భార్యలు, నీలాంబికే మరియు గంగాంబికే, అతని సోదరి నాగలాంబికే, మాలవ్వ, మసనమ్మ, రేవమ్మ, వీరమ్మ, సత్తక్క మొదలైన వారి పేర్లు పేర్కొనవచ్చు. వైవాహిక జీవితం లేని మహిళలు కూడా అనుభవ మంటప చర్చల్లో పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయి. వారు కూడా ఆధ్యాత్మిక, మత చర్చలలో పాల్గొనేవారు.
బసవుడు వ్యభిచారాన్ని ఖండిరచాడు. కులవేశ్యలను ప్రధాన ప్రజా స్రవంతిలోకి తీసుకువచ్చి, వారిని ప్రతిభామూర్తులుగా మార్చినట్లు ఆధారాలున్నాయి. అందుకు ప్రబల నిదర్శనమే కుల వేశ్య అయిన సంకవ్వ తన వేశ్యా వృత్తిని విరమించుకోవడాన్ని ఈ వచనం ద్వారా తెలుసుకోవచ్చు.
నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను మరో విటుడి దగ్గరకు పోనని,
నేను ప్రతిజ్ఞని అతిక్రమించినట్లయితే
వారు నా చేతులు, చెవులు, ముక్కును నరికివేస్తారు.
నన్ను వాళ్ళు విచ్ఛిన్నం చేసి చంపేస్తారు
నేను ఖచ్చితంగా సిగ్గులేని పని చేయను.
ఓ ప్రభువా!
బసవుడు ప్రారంభించిన సాంఘిక, మత, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక ఉద్యమంలో ఆయనతో పాటు అన్ని వర్గాల స్త్రీలు పాల్గొన్నారు. అయదక్కి మరయ్య భార్య లక్కమ్మ అలాంటి ఒక ఉదాహరణ.
నేటి ఆధునిక మానవ సమాజానికి బసవేశ్వరుని భావాలు, బోధనలు మరియు ఉద్యమ ఔచిత్యం, అన్వయింపు అత్యంత అవసరం. కేవలం భారత సమాజానికి మాత్రమే కాకుండా ప్రపంచ మానవాళికి సైతం బసవుడు సంస్కరణ వాదం ప్రతి దశలోనూ, ప్రతి రంగంలోనూ మార్గనిర్దేశనం చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది కేవలం ఏ ఒక్క జాతికి, మతానికి, రంగానికి మాత్రమే పరిమితమైంది కాదు. అది విశ్వమానవాళి అభ్యున్నతికి సంబంధించినటువంటి భావజాలం. వ్యక్తిని పరిపూర్ణంగా సంస్కరించడం ద్వారా సమాజాన్ని, ప్రపంచాన్ని సంస్కరించవచ్చు అనే ఆలోచన బసవుడి తాత్విక అంతస్సారం అని చెప్పవచ్చ. మానవులు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు చేసే ప్రతి పనిలో బసవుడి తత్వం ఒక నిర్దిష్టమైన దశ దిశను చూపిస్తుంది. వాస్తవానికి మానవుడు వివిధ దశలలో వివిధ పాత్రలు పోషించాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒక మంచి సభ్యుడిగా, సమాజంలో మంచి వ్యక్తిగా, దేశంలో ఉత్తమ పౌరుడిగా అనేక సందర్భాల్లో అనేక బాధ్యతలను నిర్వహించవలసి వస్తుంది. ఆ విధమైన బాధ్యతల నిర్వహణలో బసవుడి బోధనలు విస్పష్టమైన మార్గాన్ని చూపిస్తాయి.
నేడు ప్రపంచ వ్యాప్తంగా పౌరుల మరియు సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అనేక చట్టాలు, విధానాలు రూపొందించబడుతూనే ఉన్నాయి. అయితే చట్టాలు, విధానాలు రూపొందించుకున్న లక్ష్యాలు, ఆదర్శాలు సాకారం కావాలంటే వ్యక్తుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగు పడకుండా అది సాధ్యం కాదు. అందుకు ప్రబల నిదర్శనమే మన భారతదేశ పరిస్థితులు. స్వాతంత్య్రం వచ్చిన 75 వసంతాల కాలంలో అనేక ప్రగతిశీల చట్టాలు, విధివిధానాలు రూపొందించబడ్డాయి. అవి భారతీయ సమాజంలోని వైకల్యాలను తగ్గించడంలో చాలా పరిమితమైన ప్రభావాన్ని చూపాయి. వ్యక్తిని, సమాజాన్ని సంస్కరించుకోవడానికి కార్యాచరణ రూపొందించుకోక పోవటమే అందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో బసవుడి బోధనలు పునఃశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, సహోదరత్వం, మహిళా సాధికారత, మానవ హక్కుల పరిరక్షణ వంటి బసవుడి బోధనలను ప్రతి పౌరుడూ తన నిజజీవితంలో పాటించడం ద్వారా తనను తాను, తాను ఉన్న సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే భారత రాజ్యాంగం ఏర్పరచుకున్న ఆశయాలు, ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడచినా భారతదేశంలో స్త్రీల స్థానం పురుషుల ఆధిపత్యంలోనే ఉండటం చాలా ఆందోళన కలిగించే విషయం. మహిళల స్థితిగతులను మెరుగుపరచడానికి మరియు సమాన హక్కులు కల్పించడానికి ప్రభుత్వం అనేక చట్టాలను ఆమోదించింది కానీ అలాంటి చట్టాలు అమలులో విఫలమయ్యాయి. మహిళా సాధికారతకు మరియు వారు సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను పొందేందుకు కృషి చేసిన సంస్కర్తలు చాలామంది ఉన్నారు. అయితే మతపరమైన సమానత్వ హక్కుల గురించి జరిగిన కృషి పాక్షికమైనదని చెప్పవచ్చు. బుద్ధుడి తదుపరి మత, ఆధ్యాత్మిక రంగాలలో మహిళల సమాన స్థితి గురంచి విశిష్టమైన కృషి చేసిన వారిలో బసవుడు ప్రథముడు.
స్త్రీల హక్కులు విశ్వజనీనమైన మానవ హక్కులలో అంతర్లీనమైనవని బసవుడు బలంగా నమ్మాడు. కాబట్టి స్త్రీల హక్కులను మానవ హక్కుల నుంచి విభజించడానికి గానీ, విడదీయడానికి గానీ వీలు కాదని పేర్కొన్నాడు. సమాజంలోని అన్ని రంగాలలో స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించాలన్నాడు. స్త్రీలపై జరిగే అణచివేత, వివక్షతలను నిర్మూలించడమే లక్ష్యంగా బసవుడి ఉద్యమం కొనసాగింది. బసవుడు స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రబోధించాడు. మానవ హక్కులను ప్రోత్సహిస్తూ స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమే జీవితాశయంగా బసవుడి జీవనం కొనసాగింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లో స్త్రీ యొక్క పాత్రను, హోదాను మెరుగుపరచడం బసవుడు సాధించిన మరో ఘనత. సహజ న్యాయం ప్రకారం, దైవిక న్యాయ సూత్రాల ప్రకారం ఉన్నత కులంలో పుట్టినా, అథమ కులంలో పుట్టినా, మానవులందరూ సమానులేనని బసవుడు విశ్వసించాడు.