మనం సమాజంలోని ఎన్నో జీవితాలను చాలా దగ్గరగా చూస్తాం. ఎన్నో అనుభూతులను అనుభవిస్తాం. అలాంటి అనుభవాలను ఇంకొకరితో పంచుకోవాలనిపిస్తే ఒక్కొక్కసారి మాటలు కూడా రావు. అలాంటి జీవితానుభవాలను మంచి కథలుగా, మాటలు
రాని భావాలను అక్షర రూపాలుగా మార్చి మలచిన కథలు ‘సింధూరి’ కథలు. చిన్న చిన్న సమస్యలే గొడవలకు కారణమై కుటుంబ జీవనాన్ని ఛిద్రం చేసే సంఘటనలు చూస్తాం. సమాజంలోని మనుషులు, పరిస్థితులు, సమస్యలు ఎన్ని విధాలుగా మనకు జీవితంలో తారసపడతాయో, వాటిల్లో వేటిని మనం స్వాగతించాలి, వేటిని తిరస్కరించాలి అని మాత్రమే కాకుండా ఎక్కడ తటస్థంగా ప్రవర్తించాలి అనే జీవితపు విలువలను, చిరపరిచితమైన అంశాలను ఒక కొత్త కోణంలో పరిచయం చేస్తుందీ పుస్తకం.
సోమంచి శ్రీదేవి గారు సింధూరి కథాసంపుటిని 2005లో ప్రచురించారు. సుశీలా నారాయణరెడ్డి అవార్డు పొందిన ఈ కథా సంపుటిలో మొత్తం 15 కథలున్నాయి. వీటిలో దేనికదే ఒక ఆణిముత్యం. ఈ కథలన్నీ ఆంధ్రభూమి పత్రికలో ముద్రితాలు. ప్రతి కథలో మనమో లేక మన చుట్టూ ఉన్న పాత్రలో కనిపిస్తాయి. కథలు చదివిన తర్వాత పాఠకులు ఎంతో తృప్తి చెంది, మనసులు తేలికపడతాయి. అందుకే పుస్తకం చదవగానే సమీక్ష చేయాలనే ఉబలాటం మనసులో మెదిలి ఇలా మీముందుంచుతున్నాను.
సింధూరి : మనుషుల మనసులు ఎలా కలుస్తాయో ఎప్పుడు కలుస్తాయో చెప్పడం చాలా కష్టం. పెళ్ళి చేసుకున్న రెండు వ్యతిరేక భావనలు కలిగిన దంపతులలో ఎవరి మానసిక బాధ ఎంత అనేది వివరించారు రచయిత. భర్తతో సర్దుకు పోదామన్న ప్రయత్నంలో మనసుకు సర్ది చెప్పలేకపోయింది సింధూరి. భర్త మాత్రం సర్దుకుపోదామనే ఆలోచనే లేకుండా తన ఆలోచనలను భార్యపై రుద్దడం, దీనివల్ల పడ్డ మనోవేదన భార్యను ఎంతో డిప్రెషన్‌కు గురి చేసింది. భార్యను మారుద్దామనే ప్రయత్నంతో సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే డాక్టర్ మనసుకు దగ్గరై బయటకు చెప్పలేని సంబంధంగా మారిన తీరు, ఇటు భర్త ఆధిక్యత, అటు డాక్టర్‌పై తపన, సమాజంలో తన స్థానం ఇలాంటి ఆలోచనల మధ్య అంతఃర్ముఖురాలైన సింధూరి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమెను మార్చే ప్రయత్నం గానీ, ఆమెతో నడిచే ప్రయత్నం గానీ ఎవరూ చేయలేకపోయారు.
డా॥ రావు, వెరోనికాల మధ్య ఉన్న సంబంధం ఎంత తెరచిన పుస్తకంగా ఉన్నా, ప్రతి విషయంలో సర్దుకుపోవాలంటే కష్టమయ్యేది. అందుకే ఎవరి మనసుకు నచ్చిన దారిలో వారు ప్రయాణం కొనసాగించారు. నరేంద్ర, నీరజల మానసిక ఆలోచనలు వేరైనా మంచి అవగాహనతో సంసారం సాగిస్తారు. సింధూరి మరణానంతరం తన భర్త మళ్ళీ పెళ్ళి చేసుకుని వచ్చిన తన కొత్త భార్యను ఏ మేరకు అర్థం చేసుకుంటాడు అనేది పాఠకుల ఆలోచనకు వదిలేశారు రచయిత.
కథలో వ్యతిరేక ఆలోచనలు గల దంపతుల జీవనం మరియు వేర్వేరు దంపతుల జీవన విధానాలను చాలా సహజంగా చూపించారు. భౌతిక అవసరాలు, మానసిక అవసరాల మధ్య తేడా వాటివల్ల కలిగే అనర్థాలు, ప్రయోజనాలు, సంతృప్తి వంటి అంశాలను కథలో గమనించవచ్చు.
యుద్ధం ముగిశాక: కుల, తమ, జాతి, వర్ణాంతరంగా సమాజానికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్ళి చేసుకుని సంసార జీవితాన్ని సాగిస్తున్న కుటుంబం ఎన్ని ఆటంకాలను అధిగమించాలి, ఎన్ని ఆటుపోట్లను తట్టుకుంటూ ముందుకు సాగాలో తెలిపే కథ. ఇలా పెళ్ళైన జంటకు కూతురు ఉంటే కూతురి పెళ్ళి కోసం పడే తపన అర్థం చేసుకోవచ్చు. విశ్వజనీనమైన భావాలు కలిగిన వ్యక్తులు కూడా సమాజంలో ఉంటారని గ్రహించే కథ.
కులం, మతం, ఆస్తి, అంతస్థు, కట్నకానుకలు ఇవన్నీ స్త్రీ పురుషులు ఒకరికొకరు ఏమీ కానప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. కానీ ఒకరికొకరు కావాలి అనుకున్నప్పుడు తమ అస్థిత్వాన్ని కోల్పోతాయి. ప్రేమ సమాజాన్ని జయించి వ్యక్తుల విలువను పెంచుతుంది. ఎంత గొప్ప సత్యం. దీన్ని గ్రహించడమే మన కర్తవ్యం.
మరో మజిలీకి: రిటైర్మెంట్‌తో చివరి మజిలీకి చేరుకున్నాను అనే ఉద్యోగికి ఇంకా జీవితం ఉంది అని తెలపడంలో భార్య, మేనేజర్, కొడుకులు, కోడళ్ళు ఎలా సహకరించగలిగారన్నది ఈ కథలోని అంశం. రిటైరవ్వగానే కొడుకుల వద్దకు వెళ్ళి వాళ్ళతో కలిసి ఉండడం కాకుండా మనం స్వతంత్య్రం అనే చేతనైనన్ని రోజులు బ్రతుకుదాం అని చెప్తూ దూరంగా ఉంటేనే బంధాలు నిలబడతాయని వివరించి భర్తకు ధైర్యం చెప్తుంది భార్య. రిటైర్మెంట్ అని ఆఫీసులో ముభావంగా కూర్చున్న తనని మేనేజర్ పిలిచి రిటైర్మెంట్ వయసును బట్టి వచ్చేదని ఇంకా పని చేసే సత్తా ఉందని చెప్పి తనకు తెలిసిన వారి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో పూర్తయిందనుకున్న జీవితంలో చైతన్యం నింపుకొన్న ఉద్యోగి కొత్త ఉత్సాహంతో రిటైర్మెంట్ తీసుకుంటాడు. కొడుకులు రిటైర్మెంట్ డబ్బు ఆశించినపుడు కొద్ది మొత్తాన్ని తమ మనమల పేర్లన ఫిక్స్‌డ్ చేసి కొడుకులతో తన స్వతంత్య్ర జీవనాన్ని గురించి ఆలోచన వ్యక్తపరుస్తాడు. అతని భార్య కొడుకులను ప్రేమగా పండగలకు, పబ్బాలకు ఎప్పటిలాగే తమ వద్దకు రావాలని కుటుంబంలో డబ్బు బంధంకన్నా బాంధవ్యాలకు విలువలను ఇవ్వాలని, బాధ్యతాయుతంగా నడుచుకోవాలని తెలపడమే కాకుండా తల్లిదండ్రుల ఆలోచనలు బిడ్డలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేసే కథ.
ప్రేమ రాహిత్యం : కలిసి ఆడుకుని, తిరిగి చదువుకున్న ఇద్దరు స్నేహితులలో, ఒకరిని ప్రేమించి కుల మతాల అడ్డుగోడలైతే ఇంకొకర్ని పెళ్ళి చేసుకున్న యువతి తన భర్తతో జీవనం యాంత్రికంగా సాగిస్తుంటుంది. పిల్లలయినా తమ బంధం అంతే యాంత్రికం. తను ప్రేమించిన స్నేహితుడికి వేరే అమ్మాయితో పెళ్ళి అనే విషయాన్ని జీర్ణించుకునే సమయంలో పడ్డ తపనను గ్రహించిన భర్త తనకంటే ముందు ఎవరిని ప్రేమించినా, పెళ్ళైన తర్వాత కూడా తనను ఇంకా ఎందుకు ప్రేమించడంలేదో అని, తప్పు ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. భార్యకు కలిగిన భావనని అర్థం చేసుకుని ప్రేమ రాహిత్యం నుండి ప్రేమలోకి అడుగుపెట్టిన విధానాన్ని తెలియ చెప్పిన కథ. సమాజంలో జరుగుతున్న ఇలాంటి విషయాలకే కుటుంబాలను ధ్వంసం చేసుకుంటున్న రోజులలో ఈ కథ పాఠకులకు మార్గదర్శకంగా, ఒక అద్దంలాగా ప్రతిబింబిస్తుంది.
కోడలొచ్చింది : సాధారణంగా కోడలొస్తే అత్తకు, ఇంట్లో సభ్యులకు అసరాగా ఉంటుందని పనుల నుండి విశ్రాంతి దొరుకుతుందని, ముందే ఒక నిర్ణయానికి వచ్చిన కుటుంబం కోడలొచ్చిన తర్వాత పెరిగిన బాధ్యతల గురించి, ఆవరించిన నిరుత్సాహం గురించి వివరించిన కథ. ఉద్యోగం చేస్తూ కొడుక్కి ఆసరాగా ఉండాలి. ఇంట్లో పనుల్లో అత్తకంటే ఎక్కువ పాలుపంచుకోవాలి. ఇంకా మర్యాదలు అవీ ఇవ్వడంలో ఏ లోటూ ఉండకూడదు. ఇవన్నీ ఉద్యోగం చేసే మహిళలకు సాధ్యమవుతాయా? సాధ్యం కాకపోవడం వల్ల ఇంట్లో జరిగే గొడవలు, వాటివల్ల అందరి మనసుల్లో రేగే కల్లోలం… ఇవన్నీ కళ్ళకు కట్టినట్లుస చూపించారు రచయిత. చివరగా ఇంట్లో ఉండే పెద్దలు పిల్లల పెళ్ళిళ్ళు చేశాక వారి నిర్ణయాలకు విలువ ఇచ్చి, వారికి పెళ్ళితో కుటుంబం విస్తృతమై బాధ్యతలు పెరుగుతాయని గ్రహించి స్వేచ్ఛ కల్పించాలని, ఇంటికి వచ్చిన కోడళ్ళపై ముందుగానే అంచనాలు వేసుకోకుండా తమ బిడ్డల్లానే భావించి వారు ఉన్నతి సాధించాలనే తపనలో భాగం కావాలని గ్రహించే విధంగా కథను మలిచిన తీరు అద్వితీయంగా అనిపిస్తుంది.
బలిదానం : తల్లిగా కొడుకుల పెళ్ళిళ్ళు చేశాక ఎవరి బాధ్యతలు వాళ్ళకు అప్పజెప్పి ప్రశాంత జీవనాన్ని ఎన్నుకోవాలి. కానీ అందుకు భిన్నంగా చిన్నకొడుక్కి ఉద్యోగమేమీ లేదని, పెద్ద కొడుక్కి చిన్నకొడుకు కుటుంబ బాధ్యతలు కూడా అప్పచెప్పి ఆర్థికంగా సహకరించే విధంగా ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతుంటే ఆ కుటుంబాలలో గొడవలు కాక ఇంకా ఎలా
ఉంటుంది? ఉద్యోగం చేస్తున్నా పెద్ద కోడలికి కుటుంబం వెళ్ళదీయడానికి చాలా కష్టమయింది. తన పిల్లలను, మరిది పిల్లలని అందరినీ సమానంగా చదివించడమే కాకుండా కుటుంబ అవసరాలు కూడా నెత్తిమీద వేసుకున్న భర్త అంటే ఎంత గౌరవమున్నా ఎదిరించక తప్పలేదు. తనకు మాలిన ధర్మం ఎంత ఆప్తుడికైనా చేయకూడదు. తల్లి అతిప్రేమ వల్ల కూడా బిడ్డలు బాధ్యతారాహిత్యానికి గురవుతారు. బిడ్డల పెళ్ళిళ్ళు చేశాక, వాళ్ళకు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయ్యాక కూడా వాళ్ళ సంసారాల్లో తలదూరిస్తే ఎవరు మాత్రం ఎంతకాలం ఊరుకుంటారు. ఇంట్లోని పెద్దలు పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. లేకపోతే మౌనంగా ఉన్న గొంతులే ఆకాశం బద్దలయ్యేలా అరిచి తమ ఉనికిని చాటుకుంటాయి. మౌనం అంగీకారం కాదనీ, భావాలను, ఆమోదాన్ని తెలపడానికి అందమైన మాటలు, ఆశ్రయించడానికి ఉన్నప్పుడు మౌనం ఎందుకు వహిస్తారు. అందుకే మౌనంగా ఉంటే ‘‘అంగీకారం’’ అని భావించడం ‘‘కోడలు భయపడ్తుంది’’ అని అర్థం చేసుకునే అత్తలు ఇంకా ఈ లోకంలో ఉన్నారని తెలిపారు ఈ కథలో రచయిత.
మరిది కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి తమ ఆర్థిక స్థోమత సరిపోదని వదిన నిక్కచ్చిగా నిర్ణయం తీసుకున్న తర్వాత మరిది కోపంగా వదినపై చెయ్యెత్తిన క్షణం అది చూసిన మరిది కొడుకు చాలా అవమానపడతాడు. ఇన్ని సంవత్సరాలూ వాళ్ళ సాయంతోనే కుటుంబాన్ని వెళ్ళదీసిన తండ్రిపై కోపం వస్తుంది. అతను మంచి ఆలోచనలతో ఆర్మీ ఉద్యోగం చేయడానికి బయలుదేరిన క్షణం పెద్ద కోడలు పడిన బాధ కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. తల్లిదండ్రుల నిస్సహాయత, బాధ్యతారాహిత్యం, తెలివితక్కువ తనం పిల్లల బలిదానాలు కోరుకుంటుందని కథ అంతరార్థం.
అతనూ, నేనూ, మధ్యలో మౌనం : డబ్బు, ప్రేమ, వ్యామోహం, ఆకర్షణ, బాధ్యత, కుటుంబం ఈ పదాలకి చక్కని నిర్వచనం ఇచ్చిన కథ. నిజంగా ఇష్టపడిన వ్యక్తిని పొందడానికి సహనం చాలా అవసరం. స్నేహితుడి కొడుకుని చేరదీసి ఇంట్లో ఉంచుకున్నప్పటికీ అబ్బాయి మీద ప్రేమ చూపించినట్లు ఎక్కడా కనిపించదు, అలా అని అతన్ని వెళ్ళగొట్టనూ లేదు. ఇంట్లోని వస్తువుల మాదిరే అతన్నీ ఒక స్టోర్ రూమ్‌లో ఉంచి చేరదీశాడు. తల్లిదండ్రులు తన కూతురిని అటువైపే చూడనివ్వలేదు. ఒకతను తన ఇంట్లో ఉంటున్న భావనే లేని విధంగా పెంచారు కూతుర్ని. కూతురు కూడా ఏమీ పట్టించుకోలేదు. కానీ అబ్బాయి మాత్రం అదే తన కుటుంబం అని భావించిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. అబ్బాయి, ఆ అమ్మాయిని ప్రేమించినా ఆమె వేరే అబ్బాయిని ప్రేమించిందని తెలియగానే అతను ఎలాంటివాడో తెలుసుకొని ఆ అమ్మాయిని కాపాడిన పద్ధతి, అమ్మాయిలో మార్పును తీసుకొస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడినా అమ్మాయి కుటుంబం సహకరించదని దూరంగా ఉండి బాధ్యతగా ప్రవర్తించిన తీరు, ఒంటరితనంలో దగ్గరై చూపించిన ఓదార్పు అన్నింటా ప్రేమ ఎంత గొప్పది అనిపిస్తుంది. ప్రేమించినా తెలియపరచుకోని వాళ్ళ సాన్నిహిత్యం ఎంతో చైతన్యాన్ని నింపుతుంది.
వారసత్వం : తండ్రి తెలివిపరుడైనా సంపాదన లేకుండా ఉండడం, తల్లి తన పుట్టింటివారిపై పరాధీనురాలిగా ఉండడంవల్ల పిల్లల పెంపకానికి అవసరమైన సంసాదన తల్లి తన అన్నల వద్ద నుండి తీసుకొని వారి ఉదారంతో తన పిల్లలను పెంచి చదివించి ఒక స్థితికి చేర్చిన తర్వాత పిల్లల హృదయాలు ఒక విధమైన కృతజ్ఞతా భావంతో ఎలా దహించుకుపోతాయో వివరించారు. ఎలాంటి సందర్భాలలో కలిసినా తనను దెప్పిపొడిచే మాటలు అనడం, తన తండ్రి చేతకానితనాన్ని గుర్తు చేయడం వల్ల, వాళ్ళ ఆసరాతో పెరిగిన కొడుకు తిరిగి అనలేకపోవడం, తన ఉన్నతికి కారకులైన వారే ఇలా చేస్తే తను ఎదుర్కొనే ఒక నిస్సహాయ స్థితి వేదనా భరితంగా అనిపిస్తుంది. ఎవరైనా కుడి చేతి సాయం, ఎడమ చేతికి తెలియకూడదని భావించాలి. కానీ చేసిన సాయాన్ని ప్రతి సందర్భంలో గుర్తు చేయడం లాంటి సందర్భాలు చూస్తూ ఉంటాం. దీనివల్ల ఇలాంటి ఇబ్బందుల నుండి ఎలా దూరం కావచ్చో మంచి ఆలోచన స్ఫురింపచేశారు రచయిత. మేనమామ మంచి గుణాన్ని తన వారసత్వంగా పాటించి మేనమామకు పేరు తెచ్చే పని చేయడం వల్ల కొంత ఊరట కనిపిస్తుంది. కథలో నేను పెంచిన వారసత్వం నా బాటలో నడుస్తుంది అని గర్వంగా తన మేనమామ భావించడంతో తాను వారిపట్ల రుణానుబంధాన్ని కొంతైనా తీర్చుకున్న స్వేచ్ఛను అనుభవించవచ్చని తెలిపారు. ఈ ఆలోచన పాఠకులకు ఎంతో గొప్పగా అనిపించక మానదు.
పెళ్ళిచూపులు : ఒక్క పావుగంట పెళ్ళి చూపుల్లో ఏమేం చూసి పెళ్ళికి ఒప్పుకుంటారో చాలా చిన్నచిన్న మాటల్లో వివరంగా చూపించారు రచయిత. బాహ్య సౌందర్యాన్ని చూసి ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే తన భార్య ఆలోచనలు, భావాలు, అలవాట్లు తనకు భిన్నంగా ఉంటే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో కూడా చిన్న సంఘటనల్లో చూపించారు. ఎంతో గొప్ప అనుభూతి కలుగక మానదు కథ చదివితే. పెళ్ళి చూపుల్లో ఒకరి స్థోమతను ఒకరు, ఒకరి అందాలను ఇంకొకరు, ఒకరి దర్పాలను ఇంకొకరు చూపించుకొని హీరో అయిపోయిన పెళ్ళికొడుకు పెళ్ళి తర్వాత భార్యకు జీరోలా కనబడిన వైనం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. నిజమే కదా! పెళ్ళి చూపుల్లో ఒకరి గురించి ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్న అందరూ తమకు తాము వేసుకుని వెనక్కి చూసుకుంటారు తప్పకుండా.
చిరుకానుక : అమ్మ ప్రేమను పొందే కొడుకు, అమ్మ కోరికను నెరవేర్చడానికి పన్నిన చిన్న పన్నాగం తండ్రి హృదయంలో ఆలోచన మొలకెత్తేలా చేసింది. కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు… ఇలా వీళ్ళందరికీ ఎవరికి ఇవ్వాల్సిన సమయం వారికి కేటాయించాలి. ముఖ్యంగా భర్త భార్యకు, పిల్లలు తల్లిదండ్రులకు సమయాన్ని వెచ్చించి సరదాగా గడిపినప్పుడు బంధాలు గట్టిగా నిలబడతాయి.
ప్రతి చిన్న పండక్కి స్నేహితులను పిలిచి విందు ఏర్పాటు చేసే తండ్రి తన పుట్టినరోజున కూడా ఆహ్వానించి అమ్మకు వంట పనులు పురమాయించడం చూసిన కొడుకు అమ్మ మనసు చదివినట్లు ‘‘నాకు ఈ పనుల నుండి విముక్తి ఎప్పుడో’’ అని ఆలోచించే అమ్మకు బహుమతిగా ‘అమ్మను నాన్నను బయటికి తీసుకువెళ్ళి భోజనం బయటే చేద్దామని’ తండ్రిని ఒప్పించిన పద్ధతి చూస్తే నిజంగా ఇలాంటి బిడ్డలు ఉంటే ఏ తల్లిదండ్రులైనా అదృష్టవంతులే అనిపిస్తుంది.
నిన్నటి మొగ్గ : ఆడపిల్లగా ఎదిగే క్రమంలో వచ్చే ప్రతి మార్పుని పండుగలా జరుపుకుంటాం. కానీ కొన్ని ఆర్భాటాలు అంతగా నచ్చవు కొందరికి. అయినా ఇంట్లోని పెద్దలు సాంప్రదాయాల పేరిట పిల్లల మీద రుద్ది పడేస్తారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ప్రజ్ఞ తిరిగి మామూలు స్థితికి వచ్చిన విధానాన్ని తెలిపారు. కథలో రజస్వల పేరుతో ఆడపిల్లలను పది పదిహేను రోజులు ఇంట్లోనే కూర్చోబెట్టి అది ముట్టుకోవద్దు, ఇది చేయొద్దు అని ఆంక్షలు విధించి, పెద్దలు చెప్పినట్లు వినాలి, నువ్వు ఇప్పుడు పెద్దదానివైపోయావు అని చెప్పే మాటలు ప్రజ్ఞకు వింతగా అనిపిస్తాయి. చుట్టూ అమ్మలక్కలు చేరి చేసే అట్టహాసమంతా సంతోషాన్నిచ్చినా మనస్సులో ఏదో తెలియని భయం చోటు చేసుకున్న ప్రజ్ఞకు తనకు రాధిక ఆంటీ ఇచ్చిన బహుమతితో మళ్ళీ చిన్నపిల్లలా మారి ఎగిరి గంతేసిన దృశ్యం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. సాంప్రదాయాలన్నీ మనం పెట్టుకున్నవే. ఇష్టమున్నా లేకపోయినా సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఆచరించాలి అనే ఆలోచన మాని మనకు ఎలా ఉంటే మంచిది, ఎలా అయితే సంతోషంగా బ్రతుకుతాం అని కొత్త ఆలోచనతో ముందుకెళ్ళాలి అని వివరించారు.
అపరిచిత మిత్రులు : కేవలం ఉత్తరాల ద్వారానే కథను నడిపించారు. ఎంతో సృజనాత్మకంగా… ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువు అనే సామెతను తిరగరాశారు రచయిత. తన భర్తకు వేరే స్త్రీతో ఉన్న పరిచయం, అతను రాసిన ఉత్తరాలు పొరపాటున తారుమారుగా పంపడంతో అతని భార్యకు మరియు అతని ప్రేయసికి కూడా విషయం అర్థమవుతుంది. తన భర్త తనను మరియు వేరే మహిళను కూడా మోసం చేస్తున్నాడని ఆమె తెలుసుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని స్నేహితులుగా మారి సమస్యను అతనికి తెలియకుండానే సానుకూలంగా పరిష్కరించుకున్న నిధానం నిజంగా అద్భుతంగా గోచరిస్తుంది. ఒకర్నొకరు చూసుకోకపోయినా ఇద్దరు మహిళలు తమ బాధను, సమస్యను పంచుకొని ఒకరికొకరు సహకరించుకొన్న పద్దతి ఉత్తరాల ద్వారా చాలా గొప్పగా ఆవిష్కరింపచేశారు రచయిత.
మళ్ళీ వసంతం : ప్రేమించి పెళ్ళి చేసుకుని భర్త చేతిలో మోసపోయి కొడుకుతో తల్లిదండ్రుల వద్దకు చేరిన కూతురుని చూసి వాళ్ళు ఎంతగా బాధపడతారో కథలో తెలిపారు. కొడుకు పెరిగి తల్లిని మోసం చేసిన తండ్రి వద్దకు వెళ్ళినపుడు ఆ తల్లి బాధతో ఎంతగానో కుంగిపోతుంది. అన్న, తమ్ముడిని చేరదీసి ఆర్మీలో మంచి ఉద్యోగంలో చేర్పించిన తర్వాత అన్న, వదినలు చనిపోయారని తెలిసి వాళ్ళ పిల్లలనే తన పిల్లలుగా అక్కున చేర్చుకుని బాధ్యతగా వ్యవహరించిన పద్ధతి అద్వితీయం. మోసపోయిన కూతురికి వివాహం చేయాలని తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం అన్న పిల్లలను తన పిల్లలుగా సాకుతూ పెళ్ళికి దూరమై బ్రతుకుతున్న తమ్ముడు. వీరిద్దరూ తమ గతాలను ఒకరికొకరు పరిచయం చేసుకుని తమ జీవితాలలోకి కొత్త వసంతాన్ని స్వాగతించిన పద్థతి అటు తల్లిదండ్రులకు, ఇటు పాఠకులకు ఒక మంచి భావనను కలుగచేస్తుంది.
వాకిట్లో అభ్యుదయం : ప్రేమించి పెళ్ళిచేసుకుని పుట్టింటి నుంచి వచ్చేసిన స్త్రీకి పుట్టింట్లోని ప్రేమ, ఆదరాభిమానాలను కూడా భర్త అందిస్తే సంసారం సాఫీగా సాగుతుంది. కానీ భర్త తన పుట్టింట్లో కాపురం పెట్టి భార్యకు, తన అమ్మకు మధ్య అభిప్రాయ భేదాలు వస్తే సరిదిద్దలేకపోతే, ఎప్పుడూ చిన్నదానివి కాబట్టి భార్యనే ఓపిక పట్టాలని సర్దిచెపితే భార్య ఎంతగా బాధపడుతుంది. ఎంతసేపూ బాధ్యతగా వ్యవహరించడమే తప్ప ఆదరణ, ప్రేమ కోరుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోతే తను భర్తతో కాక ఎవరితో పంచుకోగలదు. ఇవన్నీ భార్యాభర్తలు ఒకరికొకరు చర్చించుకొని తమ సంసారాలను తామే చక్కదిద్దుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది నేటి కాలంలో. ఇలా మూడు కుటుంబాల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ వాళ్ళ కుటుంబాలలో వెలుగులు నింపుకోవడానికి చేసుకునే ప్రయత్నం, వాళ్ళలో వచ్చిన మార్పులు అద్భుతం.
తేడా : శ్రీధర్ తన ఇద్దరు కూతుళ్ళ పెళ్ళి తర్వాత తమ కూతుళ్ళ కుటుంబాలు, వారి ఆస్తులు, ప్రేమానురాగాల మధ్య ఉన్న తేడాను కథలో చూపించారు. కూతురు ఇళ్ళల్లో శుభకార్యాలకు వెళ్ళినపుడు కనపడిన తేడా తల్లిదండ్రులను బాధకు గురిచేస్తుంది. మంచి మనుషులు, మనసులు ఉన్న చోటనే ఎవరైనా సంతోషంగా ఉంటారు. ప్రేమ, ఆప్యాయతలు కనబడతాయి. ధనవంతుల ఇంటికి వచ్చిన పెద్ద కూతురు తన సొంత వాళ్ళు అనుకొన్న వాళ్ళ దగ్గర కూడా నోరువిప్పి తనకేం కావాలో చెప్పలేదు. అలాంటిది తన అందాన్ని ఇష్టపడి పెళ్ళిచేసుకున్న ధనవంతుడైన భర్తతో ఎలా సంతోషంగా గడపగలదు. తల తాకట్టు పెట్టి బాగా డబ్బున్న ఇంటిని కూతురికి ఇస్తున్నాం అని గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులకు గుణపాఠం ఈ కథ. ధనవంతులు డబ్బుతోనే మనుషులను కొలుస్తారు. డబ్బులుంటేనే అందలం ఎక్కిస్తారు. లేకపోతే అగాధంలోకి తోసేస్తారు. ఇవన్నీ ధనవంతుల ప్రవర్తనల్లో సహజంగా ఇమిడిపోయి ఉంటాయి. కూతురు మనసును అర్థం చేసుకోకుండా తన డాబు దర్పంతో మెదిలే అల్లుడితో సంసారాన్ని ఊహించుకుని ఎంతగానో బాధపడతారు. అదే చిన్న కూతురికి అంత సంపద లేకపోయినా ఇంట్లో అందరూ కలివిడిగా ఉంటూ ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఉండాలంటే వారిద్దరి మధ్య అంతస్థుల తేడా ఉండకూడదు. అప్పుడే ఆ బంధం ప్రేమతో సాగుతుంది. లేకపోతే ఎప్పటికీ ఒక్కటిగా మెలగలేదు. సమాజం దృష్టిలో కలిసి ఉన్నా అంతరాల తేడా మనసుల్లో ఉంటుంది.
ఇలా 15 ఆణిముత్యాల్లాంటి కథలతో సింధూరి కథా సంపుటిని ఒక ప్రవాహంలా జనవాహినిలోకి జారవిడిచారు రచయిత్రి సోమంచి శ్రీదేవి గారు. కథలు చదువుతున్నంతసేపు పాఠకులు ఎన్నో అనుభూతులకు లోనవుతారు. సమాజంలోని ఎన్నో విషయాలు తెలుసు అనుకునేవారికి సైతం ఎంతో కొంత తప్పక నేర్పిస్తాయి ఈ కథలు. ఇలా ఇంకా ఇంకా కుటుంబ చిత్రాలను తమ అక్షర గళంతో ప్రజావాహినిలోకి జారవిడచాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ…