కొడవంటిగంటి కుటుంబరావు
ఆత్మగౌరవం గల జాతి తన కళలను ఎంతో అభిమానంతో చూచుకుంటుంది. మన కళలమీద మనకున్న అభిమానం చూస్తే మనకు ఆత్మగౌరవం ఏమీ లేదని స్పష్టమవుతుంది.
ఎప్పుడన్నా ఒక కవిని ఏనుగెక్కి ఉరేగిస్తేనూ, ఒక కవికి శాలువలు గప్పి, నూటపదహార్లు సమర్పిస్తేనూ, జాతికి గల సాహిత్యాభిమానతృష్ణలు రుజువైపోవు. నిజమైన సాహిత్యపరత గల జాతి సాహిత్య ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది. ఏజాతిమీద ఆ జాతియొక్క సాహిత్య ప్రభావం కనిపించదో ఆ జాతి భ్రష్టమైన జాతి.
ఏ ఢిల్లీలోనో, బొంబాయిలోనో, లండనులోనో, వాషింగ్టన్‌లోనో, మాస్కోలోనో జరిగేవే రాజకీయాలనీ, మన రాష్ట్రములో జరిగేవి రాజకీయాలు కావనీ మన ప్రజలకు భ్రమ వున్నట్టే ఇతర చోట్ల సృష్టి అయేదే సాహిత్యమని కూడా ఒక భ్రమ లేకపోలేదు. అందుకనే మనం రచయితల కీర్తిని బట్టి వారి రచనలలో గొప్పతనం చూస్తాంగాని రచనల గొప్పతనాన్ని బట్టి రచయితలకు గొప్పతనం ఇచ్చేశక్తి మనకు లేదు. మన రచయితలలో ఎవరికైనా పై వాళ్ళు కీర్తి అంటగట్టితే ఆ తరువాత మనం ఆ రచయితను కొనియాడతామనేది ఈనాడు అందరికీ తెలిసిన సంగతే. ఇది కూడా మనకు నిజమైన సాహిత్య ప్రియత్వం లేదనే సంగతి రుజువు చేస్తుంది.
ఇన్ని మాటలనుకున్న తరువాత ”మనకి సాహిత్యం యెందుకు? అది లేకపోతే జరగదా?” అనే సందేహం వస్తుంది.
సాహిత్యం లేకుండా తప్పక జరుగుతుంది – పశుపక్ష్యాదులకు జరిగినట్టే? మానవులకు జరిగినట్టు జరగదు. పశుపక్ష్యాదులు జీవిస్తాయి. అనుభవం పొందుతాయి. కాని అవి జీవితాన్ని జీర్ణం చేసుకోవు. అనుభవం నుంచి విజ్ఞానం సంపాయించలేవు. జీవితాన్నీ అనుభవాన్నీ జీర్ణించుకునే శక్తి అందరు మనుషులకూ వుంటుందనటం అతిశయోక్తి అవుతుంది. అదీ కాక అటువంటి శక్తి అందరికీ వుంటే ఇక సాహిత్యమే అవసరం లేదు. అందరికీ వుండే శక్తి యేమిటంటే సమర్థులైన వాళ్లు తమ అనుభవసారాన్ని సాహిత్య స్వరూపంలో అందిస్తే దాన్ని జీవితానికి వినియోగపరచుకొని తమ జీవితాలను వికాసవంతం చేసుకొనే శక్తి. ఈ శక్తిని కూడా వినియోగించని జాతి భ్రష్టమైన జాతి.
ప్రతి మనిషికీ స్వతస్సిద్దంగా ఒక హృదయం వుంటుందనీ, ప్రేమానురాగాలు, రాగద్వేషాలు, సానుభూతి సమభావాలు సహజంగా పుట్టుకొస్తాయనీ అనుకోవటం వెర్రి భ్రమ, స్వార్ధం ప్రేరేపించే కాంక్షలూ, వైముఖ్యాలు ఉచితమైన వ్యక్తులతో పంచుకున్నప్పుడే మానవ జీవితానికి వికాసం కలిగేది. భార్యను చూసి ఎప్పుడన్నా కామోద్రేకం ప్రతి భర్తకూ కలుగుతుంది. ఈ ఉద్రేకాన్నీ, దాని సంతృప్తి గల ఆనందాన్నీ తన భార్యకు పంచగలిగితేనే – అంటే ఆ భార్యను ప్రేమించగలిగితేనే – ఆ మొగుడి జీవితానికింత వికాసం వుంటుంది. భార్యలనూ, పిల్లలనూ, స్నేహితులనూ ప్రేమించటం చేతగాని స్వభావం కలవారు ప్రపంచంలో లక్షోపలక్షలున్నారు. సాంఘిక జీవితానికి మనుష్యులను బంధించే సూత్రం ఒకటుండాలి. సాంఘిక భావాలను పంచుకొనే శక్తి అందరికీ స్వతస్సిద్ధంగా వస్తుందనేది కేవలమూ భ్రమ.
భావసంపర్కంగల జాతిని జీవితం కదిపినప్పుడు గాలివల్ల సముద్రంలో కెరటాలు లేచినట్టుగా జాతి లేస్తుంది. భావసంపర్కంలేని జాతిని జీవితం కదిపినప్పుడు సముద్రతీరాన ఇసకరేణువులు కొట్టుకుపోయినట్టుగా వ్యక్తులు మాత్రమే ఆందోళనకు గురి అవుతారు. మనకు మంచి సాహిత్యం ఉందా అనే మరొక ప్రశ్న ఈ సందర్భములో కలుగుతుంది. మంచి సాహిత్యం ప్రతి జాతికీ ఉంటుంది. దాన్ని ఇతర జాతుల సాహిత్యంతో, లేక ఇతర భాషల సాహిత్యంతో పోల్చి లాభంలేదు. మంచో, చెడో, ఎక్కువో తక్కువో యెవరి సాహిత్యం వారికి ఉపయోగిస్తుంది. గాని ఒక భాషలో సాహిత్యం మరొక భాష వారికి ఉపకరించదు.
అయితే ఈ బాధ వెనక వున్నట్టుగా ఇప్పుడు లేదని ఒప్పుకుతీరాలి. అంతర్జాతీయ రాజకీయ ప్రభావం జాతీయ జీవితం మీద ప్రబలంగా ఉంటున్నట్టే అంతర్జాతీయ సాహిత్య ప్రభావం కూడా వుంటున్నది. పై భాషల సాహిత్యం సులువుగా తర్జుమా అవుతున్నది. ”ఇట్లా జరగరాదు. ఇతరుల సాహిత్యాలను మనం విషంతో సమానంగా చూడాలి.” అనే దురభిమానం వల్ల ఏమీ ప్రయోజనం వుండదు. అట్లాగే ”ఇంత మంచి అంతర్జాతీయ సాహిత్యం ఉండగా మనకు వేరే సాహిత్యం దేనికి?” అనుకున్నా కూడా నష్టమే. భాషలోనూ, జీవితంలోనూ, జాతీయత అనేది ప్రత్యేకంగా ఉన్నంతకాలమూ జాతీయ సాహిత్యం విలువ వుంటూనే ఉంటుంది.
అయితే మన జాతిలో సాహిత్య పిపాస లోపించడానికి కారణమేమిటి? దేశంలో డబ్బులేకపోవటం ఒక కారణమని ఒక అభిప్రాయం ఉంది. ఇది సరియైన అభిప్రాయం కాదు. తెలుగు దేశంలో ఎంత హీనంగా చూసినా ప్రతినెలా రెండు లక్షల రూపాయలు విలువగల పత్రికలు అమ్ముడుపోతున్నాయి. సినిమాల క్రింద అవుతున్న ఖర్చుకు అంతేలేదు.
సాహిత్యం ఒక ఉద్యమం. అది కొద్దిమందితో ఆరంభించినా సంఘానికి సంక్రమించాలి. సంఘఛాయలు సాహిత్యంలోనూ, సాహిత్యం ఛాయలు సంఘంలోనూ అల్లుకుపోయిన రోజులుండేవి. నలుగురు విద్యావంతులు చేరినప్పుడు సాహిత్య గోష్ఠి జరగటమూ, సాహిత్య గోష్ఠి జరిగే చోటకి నలుగురు చదువుకున్న వాళ్ళు చేరటమూ, బతికున్న రచయితలు రచించిన పద్యాలు అటవిడుపు పద్యాల కింద పంతుళ్లు పిల్లలకి నేర్పటమూ, బతికున్న కవులు రాసిన ప్రార్థనా పద్యాలు బళ్ళలో పిల్లలు చదవటమూ – ఇవన్నీ నా యెరుకలోనే జరిగాయి.
ఆరోజులు అకస్మాత్తుగా అంతరించాయి. తిరుపతి వెంకటేశ్వర కవుల శతావధానాలు చరిత్రలో చేరిపోయాయి. పద్యాలు రాసేవాడు వింతజంతువైనాడు. కథలు రాసేవాడు చవకబారు చవట అయినాడు. సాహిత్యోద్యమం పోయింది. దాన్ని పునరుద్ధరించడం నవ్యసాహిత్య పరిషత్తుకు సాధ్యం కాలేదు. అభ్యుదయ రచయితల సంఘానికీ చాతకాలేదు.
సాహిత్యం చూసినా అట్లాగే వుంది. పద్యాలలో గల భాషమీదా, భావాలమీదా కూడా విజాతీయ ప్రభావం వచ్చి పడింది. కొందరు రాసే పద్యాలు చూస్తే వీళ్లు ఇంటి దగ్గిర తెలుగే మాట్లాడుతారా అనిపిస్తుంది. కొందరు రాసే కథలు చూస్తే వీళ్లకు అక్కలూ చెల్లెళ్లూ, పెళ్ళాలు, పిల్లలూ ఉన్నారా అనిపిస్తుంది. ఇదే సాహిత్యోద్యమమయితే ఈ ఉద్యమాన్ని వెలివేయటం ప్రజల తప్పుకాదు. శరత్‌బాబు, ఓహెన్రీ, మోపాసా మన పత్రికలలో ప్రధాన రచయితలైతే ఆశ్చర్యమూలేదు.
కాని ఈ సాకు చెప్పి మనలో సాహిత్యాభిలాష అంతరించడాన్ని సమర్థించటం కన్నా పొరపాటుండదు. తెలుగు సాహిత్యం ఎన్నోదశలు గడిచింది. నన్నయభట్టు మొదలుకొని ఈనాటి వరకు ఎంతో మంది ప్రతిభావంతులైన కవులూ రచయితలూ ఉత్తమ తరగతి రచనలు, అనేక అభిరుచులను తనియించగల రచనలు చేశారు. వానిమీద ప్రజలు ఏవిధమైన ఆసక్తీ లేకుండా పోవటానికి ఈనాటి తుక్కుకవులూ, చచ్చు కథకులూ కారణమనటం కన్నా హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు.
చదువుకున్నవాళ్ళు సహితం బుర్రలకు సెలవిచ్చి, పంచేంద్రియాలకు ప్రాధాన్యం యిస్తున్నారు. ఈ విషయం అన్ని కళలలోనూ రుజువవుతున్నది. కంటికింపుగా ఉండే సినిమా తారకు నటనాసామర్థ్యం లేకపోయినా ప్రజారాధన లభిస్తున్నది. లోపల తుక్కూ, ధూగరావున్నా అందంగా అచ్చు వేసిన పత్రికకు అమ్మకం బాగుంటున్నది. మాక్స్ ఫాక్టరు మేకప్ సామాను, జాన్ కిడ్స్ అచ్చు సిరాలు, త్రివర్ణచిత్రాలను అచ్చు వేసే యంత్రాలు, అందంగా ఫోటో తీసే కెమేరాలు, మన కళలకు శాసనకర్తలైపోయాయి. ప్రాణ చైతన్యమూ, భావచైతన్యమూ గల మానవుడు మన కళలను నడిపించటం మానేశాడు. ఆపని యంత్రాలు పుచ్చుకొన్నాయి. ఆ వెంటే మన కళల నుంచి జీవం కూడా నిష్క్రమించింది.
సాహిత్యాన్ని గురించి ఇటువంటి వైఖరిగల మనం జీవితాన్ని అవగాహన చేసుకోగలమనేది వట్టి భ్రమ. ఈ భ్రమ నించి బయటపడ్డ నాడు మనం సాహిత్యాభిలాష తెచ్చుకోగలుగుతాం తిరిగి సాహిత్యం ఒక ఉద్యమం చేసుకో కలగలుగుతాం. అది ఎప్పటికైనా ఉన్నతమైన అభిరుచులు గల వారి ద్వారానే సాగాలి కాని తుచ్ఛమైన అభిరుచులకు లొంగిపోయి అలుకు గుడ్డల్లాంటి పత్రికల పఠనంతో మైమరచి ఓలలాడే దౌర్భాగ్యుల వల్ల ఒక్కనాటికీ సాధ్యంకాదు.
ముద్రణ : అరుణరేఖ మాసపత్రిక, ఫిబ్రవరి, 1949
పునర్ముద్రణ : సాహిత్య ప్రయోజనం (వ్యాసావళి)
విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్, అక్టోబరు, 1969
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags