నమస్తే,
నేను ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగినిగా ఉన్నప్పుడు సత్యవతిగారితో పరిచయం జరిగింది. ఎ.పి.ఎన్జీఓస్ అసోసియేషన్ విమెన్ వింగ్‌లో ఆమె చైతన్యం చూశాను. తర్వాతి
కాలంలో తను ఉద్యోగం నుంచి స్త్రీల కోసం ఉద్యమించే పనిని చేపట్టారు. అందులో ప్రధానమైనది భూమిక స్త్రీవాద పత్రికను ప్రారంభించి విజయవంతంగా 30 సంవత్సరాలు నడపటం. తెలుగు సాహిత్య చరిత్రలో స్త్రీవాద సాహిత్యం 1980 సంవత్సరం నుండి ఊపందుకుంది. చలం చెప్పినట్లు స్త్రీలకి శరీరం, మనసు, మెదడు ఉన్నాయని సమాజం గుర్తించాలి. ఆమె శ్రమకు విలువ ఇవ్వాలి. భూమిక 30 ఏళ్ళుగా అవిశ్రాంత అక్షర పోరాటం చేస్తున్నది.
గతంలో స్త్రీల పత్రికలు వచ్చాయి. కానీ భూమిక స్త్రీల జీవితంలోని చీకటి కోణాలను వెలికితీసింది. ప్రతి రచన ఆసక్తికరంగా మనకే తెలియని మన అక్కచెల్లెళ్ళ వ్యథల్ని చెప్పింది. భూమిక చదవటం అంటే మనలో కొత్త కిటికీని తెరుచుకోవటమే. శ్రమజీవులైన మహిళలు అసంఘటితంగా ఉండటం వల్ల ఎలా అణచివేతకు గురవుతున్నారో భూమిక చెప్పింది. ఇందులో పనిచేస్తున్న వాళ్ళంతా మనకోసం ఆలోచించేవాళ్ళు… ఇది ఎంత అద్భుతం… మన కోసం ఒక పత్రికగా ఒక సైన్యం పనిచేస్తున్నది.
ప్రతి ఒక్కరికీ సెల్యూట్.
భూమిక మూడు దశాబ్దాల వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు
నమస్కరిస్తూ
– మీ భవానీదేవి