‘‘భూమిక’’తో పెనవేసుకున్న భూమిక
‘‘భూమిక’’ సరిగ్గా 30 ఏళ్ళ క్రితం కొండవీటి సత్యవతి గారు, ఆమె మిత్రబృందంతో కలిసి ఒక స్త్రీ వాద పత్రిక తీసుకురావాలన్న తన అభిలాష గురించి చెప్పారు. అప్పటికి పత్రిక గురించిన స్పష్టమైన కార్యాచరణ, డిజైన్, పత్రిక పేరు… ఇవేమీ అనుకోలేదు. కేవలం తన కోరిక మాత్రం చెప్పడం జరిగింది. అప్పటికి స్త్రీవాద పత్రికల సంఖ్యా వేళ్ళమీద లెక్కబెట్టదగినదిగా మాత్రమే ఉంది. ఆ పరిస్థితుల్లో స్త్రీలకు వారి స్వరం వినిపించడానికి ఒక వేదిక ఉండాలన్న వాంఛ మా అందరిలోనూ అంతర్గతంగా ఉండడంతో ఆమె ప్రపోజల్ ఆనందంగా స్వాగతించాము. అన్నట్లే అనూహ్యంగా కొద్దిరోజుల్లోనే ‘భూమిక’ అనే పేరుతో పత్రిక మొదటి సంచిక వచ్చింది. పేరే ఎంతో అందంగా, క్యాచీగా అనిపించింది.
చాలామందికి చాలా ఆశయాలు ఉంటాయి. కొందరు మాత్రమే తమ ఆశయ సాధన కోసం పట్టుదలగా, దృఢంగా అడుగులు వేసి, సాధించగలుగుతారు. వారిని సమర్థులు అంటాము. సమర్థత, శక్తి, పట్టుదల, ప్రతిభ అన్నీ సమకూడితే ఆ విజయానికి ఎల్లలు ఉండవని నిరూపించారు ‘భూమిక’ సంపాదకులు, నిర్వాహకులు అందరూ కలిసి. పత్రికను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దడానికి సత్యవతి గారు చేసిన కృషి నేను మర్చిపోను. చెదరని చిరునవ్వుతో, మొక్కవోని దైర్యంతో ఆమె ఎందరో మహిళలను కూడగట్టుకుని ముందుకు సాగిపోవడం నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను కూడా కొంతకాలం ఆమె అడుగుల వెంట నడిచాను కాబట్టి.
‘‘భూమిక’’ కేవలం ఒక పత్రిక కాదు. కథలు, కవిత్వాలు, వ్యాసాలు ప్రచురిస్తూ ఒక రెగ్యులర్ పత్రికలా కాకుండా మహిళల చేత, మహిళల కోసం నడపబడుతూ అనేకమంది మహిళల సమస్యలకు పరిష్కారం చెబుతూ ఆ మహిళలకు అండగా ఉన్న సంస్థ. బాగ్‌లింగంపల్లిలోని భూమిక ఆఫీస్‌లో అనేక సమావేశాలు జరుపుతూ ‘‘ఉమెన్ ఫోరం’’ ఏర్పాటు చేసి ఆపదల్లో ఉన్న స్త్రీలకు తమ సేవలు అందించే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎందరో నిస్సహాయ స్త్రీలకు కొండంత అండగా ఉన్న కొండవీటి సత్యవతి వ్యక్తిగా కాక శక్తిగా తనని తాను మలచుకున్నారు.
నిజానికి ఆధునిక మహిళలు చదువుల్లో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, ఇతర అనేక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందినట్లు కనిపిస్తూ ఉన్నా, ఇంకా కొందరి జీవితాల్లో ఎవరికీ తెలియని విషాదాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల సాంఘిక, కుటుంబ పరిస్థితుల్లో అనేక అసమానతలు, అణచివేతలు కొనసాగుతూ ఉంటాయి. భర్త లేదా తండ్రి అనే పురుషుల చేతుల్లో వారు అస్తిత్వాన్ని కోల్పోయి యంత్రాల్లా జీవిస్తూ ఉన్నారు. అలాంటి స్త్రీల జీవితాల్లో ఉన్న చీకటి కోణాలను వెలుగులోకి తెస్తూ, వారిలో చైతన్యం నింపడం ద్వారా వారిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం వయసు, వావి తేడాల్లేకుండా పాశవికంగా జరుగుతున్న అత్యాచారాల పట్ల కూడా ఈ సంస్థ స్పందిస్తూ, అందిస్తున్న చేయూత సామాన్యం కాదు.
‘భూమిక’ పత్రికల్లో ప్రచురించే కథలు, వ్యాసాలు, కవితలు అన్నీ ఎంతో బాగుంటున్నాయి. నా కథలు కూడా కొన్ని ఈ పత్రికల్లో చోటు చేసుకున్నాయి. అనివార్య కారణాల వల్ల ఇటీవల కొంతకాలంగా భూమికకు దూరమైనా, మాది అని అనుకుంటున్న ఈ సంస్థతో అనుబంధం మాత్రం ఎన్నటికీ ఇలానే ఉంటుంది. ఈ పత్రికకు రాసే రచయిత్రులందరూ కూడా ప్రొగ్రెసివ్ భావాలు ఉన్నవారే. స్త్రీ చైతన్యాన్ని, అభ్యుదయాన్ని కాంక్షించేవారే. తన, పర అనే తేడాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఒకే భావజాలంతో ముందుకు నడుస్తూ ఉన్న భూమిక సంపాదక వర్గానికి, సంస్థ నిర్వాహకులకు, రచయిత్రులకు, కవయిత్రులకు, ముఖ్యంగా సత్యవతి గారికి అందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
` అత్తలూరి విజయలక్ష్మి, రచయిత్రి
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags