జీవితం చరమాంకంలో ప్రతి ఒక్కరూ చవిచూసేది వృద్ధాప్యం. ఆ వయసులో కావలసింది మన అనుకున్న వారి ప్రేమ ఆప్యాయత నీకు మేమున్నాం అనే ఒక చిన్ని నమ్మకం ఇవ్వగలిగితే వారి జీవితం ఇక ప్రశాంతమే.
భారతదేశంలో వృద్ధులు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య శారీరక మానసిక ఆరోగ్య క్షీణత. వృద్ధులు అనేవారు సాధారణంగా 60 సంవత్సరాల నుంచి ఆ వయసుకు పైబడినవారిగా పరిగణిస్తారు.
ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం అనేది సహజం అనివార్యంవయస్సు మీద పడుతున్న కొద్ది మన శరీరంలో పనితీరులోఅనేకమైన మార్పులు కలుగుతుంటాయి.
వృద్ధాప్యం గురించి ఆచార్య చాణుక్యుడు చెప్పిన విషయాలు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించేవి.. వృద్ధాప్య జీవనం ఆనందదాయకం చేసుకోవడానికి డబ్బులు ఆదా చేసుకోవాలి. క్రమశిక్షణతో దినచర్యను పాటించాలి. ఇతరులకు సాయం చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలి. యవ్వనంలో శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. భగవంతుడు మనకు ఇచ్చిన వాటితో సంతృప్తిగా జీవనం సాగిస్తే వృద్ధాప్యం బాగుంటుందని చెప్పారు.
భారతదేశంలోని వృద్ధ జనాభాలో గణనీయమైన భాగం ఆర్థిక అభద్రతలో జీవిస్తున్నారు. చాలా మందికి పింఛను పథకాలు లేదా పదవీ విరమణ ప్రయోజనాలు సరిగ్గా లేక ఆర్థిక మద్దతు కోసం వారు కొద్దిపాటి పొదుపు లేదా వారి పిల్లలపై ఆధారపడవలసి వస్తుంది. ఒంటరితనం భారతదేశంలోని వృద్ధులలో విస్తృతమైన సమస్య . సాంప్రదాయ కుటుంబ నిర్మాణాలు మారడం, యువత తరచు మంచి అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. ఇది చాలా మంది వృద్ధులను ఒంటరిని చేస్తుంది. ఇది వారిలో నిరాశ పెంచి జీవన నాణ్యతను తగ్గిస్తుంది. వయసు మీద పడుతున్నా కొద్దీ మన శరీరంలోని వ్యవస్థల పనితీరు అనేక మార్పులు జరుగుతుంటాయి. అవేమిటో వింటే మీరుఆశ్చర్యపోతారు.
డి ఎన్ ఏ లో మార్పులు : డీఎనఏ చెడిపోవడం వల్ల మూల కణాల పనితీరుపై ప్రభావం పడుతుంది. దాంతో కణాల పునరుద్ధరణ ప్రక్రియ దెబ్బ తింటుంది. క్రోమోజోమ్‌లు అరిగిపోతాయి. ప్రతి క్రోమోజోమ్ చివర టెలోమెరెస్ అనే రక్షణ కవచం ఉంటుంది. అయితే, వయసు మీద పడే కొద్దీ ఆ కవచాలు అరిగిపోతాయి. దాంతో క్రోమోజోమ్‌లకు రక్షణ లేకుండా పోతుంది.
కణాల ప్రవర్తనలో మార్పు : వయసులో పెరుగుదల, జీవన విధానం కారణంగా ఈ ప్రక్రియ సజావుగా సాగదు. దాంతో కణాలకు తప్పుడు ఆదేశాలు వెళ్తుంటాయి. అప్పుడు ఆ కణాలు అవసరమైన విధంగా కాకుండా మరోలా ప్రవర్తిస్తాయి. కణాల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వయసు పెరిగే కొద్దీ ఆ సామర్థ్యం తగ్గుతుంది. దాంతో మృతకణాలు అలాగే శరీరంలోనే ఉండిపోయి అల్జీమర్స్, పార్కిన్సన్స్, కళ్లల్లో పొరలు వంటి రుగ్మతలకు దారితీస్తాయి. కణాల జీవక్రియ నియంత్రణ తగ్గుతుంది. ఏళ్లు గడిచే కొద్ది కొవ్వులు, చక్కెర లాంటి పదార్థాలను ప్రాసెస్ చేసే సామర్ధ్యాన్ని కణాలు కోల్పోతాయి. దాంతో పోషకాలను కణాలు సరిగా జీర్ణం చేసుకోలేవు. ఇలాంటి పరిస్థితులే మధుమేహం లాంటి జబ్బులకు దారితీస్తాయి. మైటోకాండ్రియా పని ఆపేస్తుంది. శరీరంలోని కణాలకు మైటోకాండ్రియా శక్తిని అందిస్తుంది. కానీ, వయసు పెరిగే కొద్దీ వాటిలో క్రియాశీలత తగ్గుతూ వస్తుంది. అలా మైటోకాండ్రియా పూర్తిగా పనిచేయడం ఆగిపోవడం వల్ల డీఎనఏ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒక కణం బాగా దెబ్బతిన్నప్పుడు అపరిపక్వ కణాలు పుట్టుకను అడ్డుకునే పనిని ఆపేస్తుంది. అదే సమయంలో ఆ కణం వయసు పెరిగిపోతుంది. ఆ క్రమంలో అది ఇతర కణాల నాశనానికి కూడా కారణమవుతుంది
కణాల పునరుత్పాదన సామర్థ్యం తగ్గుదల అనేది వృద్ధాప్యానికి ప్రధానమైన లక్షణంగా చెబుతారు. వయసు మీదపడుతున్న కొద్దీ మూల కణాలు బలహీనపడి కణాల పునరుత్పాదనలో విఫలమవుతాయి. మన శరీరంలోని కణాల మధ్య నిత్యం సమాచార మార్పిడి జరుగుతుంది. అయితే, ఏళ్లు గడిచే కొద్దీ ఆ సమాచారం అందిపుచ్చుకునే సామర్ధ్యం తగ్గుతుంది. అది నొప్పికి దారితీస్తుంది. దాంతో కణాల మధ్య సమాచార మార్పిడి ఆగుతుంది. ఇన్ని రకాల మార్పులు స్త్రీలు పురుషులలోనూ జరుగుతాయన్నమాట. అందువల్ల వృద్ధాప్యం శరీరంపై ప్రభావం చూపుతుంది. వయసు పెరిగే కొద్దీ గుండె మూత్రపిండాలు మెదడు, ఊపిరితిత్తులు అనేక శరీర అవయవాల పనిత్నీపెరుగుతున్నకొద్దీ వినికిడి శక్తి తగ్గుతుంది. కంటి చూపు తగ్గుతుంది.
మహిళలలో వృద్దాప్యంలో ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన సమస్యలను ఈ విధంగా వివరించింది. మహిళలు తరచుగా ఇంటి పని చేయడం, వృద్ధ మహిళలకు తక్కువ పెన్షన్లు ప్రయోజనాలు కలిగి ఉండడం, పురుషుల కంటే ఆరోగ్య సంరక్షణకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వీటన్నిటి వల్ల చిత్తవైకల్యం, పేదరికం ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో మహిళల ఆరోగ్య సమస్యలపై ప్రభావం కలిగిస్తున్నాయి.
మొదట చెప్పుకోవలసిన ఆరోగ్య సమస్య గుండె జబ్బు. అధికంగా బరువు పెరగడం సరైన వ్యాయామం లేకపోవడం వృద్ధ మహిళలలో గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ రోజువారి ఉప్పు తీసుకోవడం తగ్గిస్తూ కొన్ని ఆహార మార్పులు చేసుకుంటే వృద్ధ మహిళలలో గుండె జబ్బులు, తర్వాత స్ట్రోక్లు రాకుండా తగ్గించవచ్చు.
వృద్ధాప్యంలో ఉన్న మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య మధుమేహం. మధుమేహం అనేది వారి జీవన శైలికి సంబంధించింది తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆహార నియమాలను కనుక సక్రమంగా స్వీకరించినట్లయితే శరీరం బరువును అదుపులో ఉంచుకోగలిగినట్లయితే తగిన వ్యాయామం చేసినట్లయితే ఎప్పటికప్పుడు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
వయసు పెరుగుతున్న కొద్ది మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలలో ఆర్థరైటిస్ ఒకటి. ఈ పరిస్థితి మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ మరింత ఎక్కువవుతుంది. రోజువారి కదలికలు జీవనశైలి వీటివల్ల ఇది ఆర్థరైటిస్‌గా కీళ్ల నొప్పులుగా శరీరంలో ఎముకల్లో దృఢత్వం కోల్పోయి కాళ్లు వాపులు వచ్చి వీరు ఈ సమస్యలతో బాధపడుతుంటారు. ఇటువంటి సమస్యలప్పుడు వీరు చేయవలసింది విటమిన్ డి మరియు కాల్షియం ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవాలి. సన్ బాత్ చేయాలి కొన్ని సాధారణమైన వ్యాయామాలు చేస్తుండాలి. వైద్యుల సూచనలను పాటించాలి. ప్రస్తుతం అత్యధికంగా మహిళలు ఎదుర్కొంటున్నటు వంటి ప్రధానమైన సమస్య క్యాన్సర్. రొమ్ము, గర్భాశయం, పెద్దపేగు అండాశయం, ప్యాంక్రియాసిస్ ఇవన్నిటికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్లలో రొమ్ములో వచ్చేటువంటి క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ చాలా సాధారణంగా మహిళల్లో వస్తుంది. దీనికి తగినచికిత్స తీసుకొని బయటపడవచ్చు. కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ మహిళల్లో ప్రధానంగా ఎక్కువ ప్రమాదకరంగా కనిపిస్తుంది. ధూమపానం చేయని మహిళల్లో వచ్చే క్యాన్సరు ధూమపానం చేసేవారికి వచ్చే పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని గణాంకాలు చెప్తున్నాయి. క్యాన్సర్ నివారణకు వ్యాయామంచేయాలి. ఆహార నియమాలు పాటించాలి బరువును సక్రమంగా పెరగకుండా చూసుకోవాలి. జీవనశైలి మార్చుకోవాలి. వీటిని పట్ల జాగ్రత్త వహిస్తే క్యాన్సర్ రాకుండా కొంతవరకు మనము కాపాడుకోగలిగిన వాళ్లమవుతాం.
వృద్ధాప్యంలో మహిళలకు ప్రధానంగా వచ్చే మరొక సమస్య మలబద్ధకం ఒకే చోట కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం మలబద్ధకానికి ప్రధానమైన కారణం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, పీచు పదార్థాలు తాము తీసుకునే ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన జాగ్రత్త వహించాలి.
నిర్జలీకరణ అంటే డీహైడ్రేషన్ కూడా వృద్దాప్యంలో ఎదుర్కొంటారు వీరు. తగినంత నీరు ఎప్పటికప్పుడు తాగుతూ ఉండాలి నిర్జలీకరణం అయితే వృద్ధ మహిళలకు మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది.
ఇంకా వయసు వచ్చినటువంటి మహిళలకు ఎక్కువగా వారు చెప్పుకునేటువంటి మరొక సమస్య మాకు నిద్ర పట్టడం లేదు అనిదీనివల్ల వారు ఒక రకమైన నిరాశ నిస్పృహకు లోనవుతారు. వీరి జ్ఞాపకాశక్తి కూడా నశించే ప్రమాదముంది. సమయానికి ఆహారం తీసుకోవడం తగిన వ్యాయామం చేయడం మానసికంగా ప్రశాంతంగా మనసును కేంద్రీకరించినట్లయితే నిద్రలేమి సమస్యని వీరు కొంత వరకు దూరం చేసుకోవచ్చు అయినప్పటికీ నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలి.
ఇంతవరకు చెప్పుకున్న సమస్యలు ఒకేత్తు అయితే ప్రస్తుతం చెప్పే సమస్య మానసిక ఆరోగ్యానికి సంబంధించింది. వృద్ధులలో మహిళల్లో మానసిక ఆరోగ్యంతో కూడిన సమస్యలు చాలాఎక్కువ ఉంటాయి.
డిమెన్షియ, అల్జీమర్స్, పార్కిన్సెన్స్ వ్యాధి వీటివల్ల చిత్త వైకల్యం జ్ఞాపకశక్తి కోల్పోవడం వ్యక్తీకరణలో ఇబ్బందులు ఎదుర్కోవడం నాకెందుకు ఇలా వచ్చింది అని నిరాశ నిస్సృహ రకరకాల ఆలోచనలు వీరిని మరింతగా బాధిస్తాయి. ఈ సమస్యలు వీరు వైద్యులను సంప్రదించిన తర్వాత తగిన చికిత్స తీసుకుంటూ మందులు వేసుకుంటూ జాగ్రత్తలు పాటించాలి.
వృద్ధులుగా మారుతున్నప్పుడు పురుషులైనా మహిళలైనాఆరోగ్య సమస్యలు వస్తుంటాయి ప్రధాన విషయం ఏమిటంటే వీరిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది అందువల్లనే వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లుగా అనిపిస్తుంది. రోజువారి జీవనశైలి ఆహార నియమాలు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం యోగ ధ్యానం సరైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వీటన్నిటి ద్వారా ఈ సమస్యల్ని వారు ఎక్కువ భారంగా అనిపించకుండా సులభంగా ఎదుర్కొని వాటిని అధిగమించి ప్రశాంతమైన జీవనం గడపగలుగుతారు.
వృద్ధాప్యంలో మహిళలు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ప్రధానంగా కుటుంబం అండదండగా నిలవాలి. వారికి ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో పాటు మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు కూడా తగిన తోడ్పాటును అందించాలి. వారికి మనసులో ఒక ధైర్యం ఒక విశ్వాసం కలిగించాలి. వారినిఎప్పటికప్పుడు పట్టించుకోవాలి, పలకరిస్తూ ఉండాలి. వారు పదే పదే చెప్పే మాటలను మనం ఓపికగా వినాలి. అప్పుడు వారిలో మన పట్ల నమ్మకం కలుగుతుంది. వారి మనోధైర్యం పెరుగుతుంది. వారికి వచ్చిన ఆరోగ్య సమస్యలను వారు ప్రశాంతంగా స్వీకరించగలుగుతారు. అందుకు తగిన తోడ్పాటును తోటి మహిళలుగా మనము వృద్ధాప్యంలో మహిళలకు అందిద్దాం.
