సందర్భం: మహిళల కోసం, మహిళా దృక్పథంతో ఒక ప్రత్యేక కథా కార్యశాల నిర్వహించాలని ఎన్నాళ్లుగానో అనుకున్నాము. బండారు విజయగారు స్వయంసిద్ధ, యోధ కథా సంకలనాలు వెలువరించాక కార్యశాల నిర్వహణకై పూనుకున్నారు. అలా అందరినీ సంప్రదించి హైదరాబాద్ బుక్‌ఫేర్ ముగియగానే కథా వర్క్‌షాప్ 2024లోనే అనుకున్న ప్రకారంగా జరపాలని నిర్ణయించు కున్నారు.
అలా హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్, కీసర సమీపంలోని బోగాపురంలో కథా వర్క్‌షాప్ ప్రారంభ మైంది. మొక్కపాటి సుమిత్రగారు చాలాకాలంగా నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఈ కథ వర్క్‌షాప్ జరిగింది. 35 మంది కథా రచయిత్రులు అనేక ప్రాంతాల నుంచి విచ్చేశారు. పరిచయాలు చేసుకోవాలని కోరినపుడు ఎవరి పరిచయం వారు చేసుకున్నారు.
ఈ కథా వర్క్‌షాప్‌కు రిసోర్స్ పర్సన్స్‌గా సామాజిక తత్త్వవేత్త, సుప్రసిద్ధ రచయిత బి.ఎస్.రాములు, శిరంశెట్టి కాంతారావు, సుబ్బారావు హాజరయ్యారు. పరిచయాలు అవుతున్నప్పుడు తాను ఏమీ చెప్పలేనని బి.ఎస్.రాములుగారి సహచరి శ్యామలగారు మిన్నకుండిపోయారు. అందరి పరిచయాలు పూర్తయ్యాక తాను కూడా చేసుకుంటానని ఉత్సాహంగా ఉద్వేగపూరితంగా ముందుకు వచ్చారు. ఏమీ మాట్లాడను అనుకున్న శ్యామలగారు తమ జీవితంలోని కష్టాలు, కన్నీళ్లు గడిచొచ్చిన క్రమాన్ని ఉద్వేగపూరితంగా చెప్పుకుంటూ వెళ్ళారు. అందరికి కన్నీళ్ళొచ్చాయి. కొండవీటి సత్యవతిగారు పిలిచి మరిన్ని వివరాలు కోరడంతో వివరంగా చెప్పారు. కథలకన్నా జీవితం ఎంత గొప్పగా మలుపులు తిరుగుతుంది అని అందరికీ ఉత్తేజం కలిగింది. చాలామంది కథా రచయిత్రులు శ్యామలగారి జీవితాన్ని కథలుగా, నవలగా రాయాలని ఇంటర్వ్యూలు చేయాలని అనుకున్నారు.
రెండు రోజుల కథా కార్యశాల మా అందరిలో సాన్నిహిత్యం పెంచింది. మధురానుభూతులను హృదయంలో పదిలపరచుకొని అందరం సెలవు తీసుకున్నాం. ఒక్కొక్కరి జీవితం ఒక కథ కన్నా ఆసక్తికరంగా చెప్పుకున్న ముచ్చట్లు, చర్చలు కథా రచన పట్ల మరింత కర్తవ్యం పెంచింది. నేను హైదరాబాద్‌కు చేరిన తరువాత శ్యామలగారిని వెంటనే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను.
అలా ఇద్దరి సమయం కుదుర్చుకొని కలుసుకోవడం జరిగింది. హైదరాబాద్‌లో ఈసీఐల్‌లో నేను, భాగ్‌లింగంపల్లి సుందర విజ్ఞానకేంద్రం సమీపంలో గల భండారు విజయగారి కారులో ఇద్దరం కలిసి బయలుదేరాము. అప్పుడు శ్యామలగారు వాళ్ల పెద్దకోడలు ఉంటున్న గచ్చిబౌలి సమీపంలో గల రాంకి టవర్స్‌కు బయలుదేరాము. శ్యామలగారి పెద్దకోడలు సులేఖ సాదరంగా ఆహ్వానించింది. పరిచయాలు, పరామర్శలు పూర్తయ్యాక ఏకాంతంగా నేను శ్యామల కలిసి అనేక విషయాలు మాట్లాడుకున్నాము. మేము మాట్లాడుతున్నంతసేపు భండారు విజయ, బి.ఎస్.రాములు, సులేఖగార్లు అవి ఇవీ మాట్లాడుకుంటూ ఉన్నారు. మా ఇంటర్వ్యూ పూర్తయ్యేసరికి వెజ్ బిర్యానీతో చక్కటి విందు భోజనం రడీ చేశారు పెద్ద కోడలు సులేఖ. జీవితంలోని కష్టాలు, కన్నీళ్ళు గురించి అవి దాటి రెండోతరం ఉన్నతంగా ఎదిగి స్థిరపడిన ఆనందం మా అందరిలో… కొడుకులే కాదు, కోడళ్లు కూడా ఉన్నత విద్యావంతులే…!
శ్యామల ఎన్ని కష్టాలు అనుభవించిందో, ఎలా వాటి నుండి జీవితం గడిచి వచ్చిందో! ‘‘అట్టడుగున పడి కాన్పించని, కథలెన్నో కావాలిప్పుడు’’ అన్నాడు శ్రీశ్రీ. 80వ. దశకంలో స్త్రీశక్తి సంఘటన వారు పూనుకొని ‘‘మనకు తెలియని మన చరిత్ర ’’ పుస్తకాన్ని తెచ్చి ఉండకపోతే ఉద్యమంలో పని చేసిన ఎందరో మహిళలు మరుగున పడి ఉండేవారు. ఉద్యమంలోకి వెళ్ళిన వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న కష్టాలు ఇబ్బందులు ప్రజలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వాళ్లలో బి.ఎస్.రాములు గారి సహచరి శ్యామల గారి గడిపిన జీవితాలు ‘‘భయంలో నుంచి భద్రతలోకి’’ సాగిన జీవన గమనం చూద్దాం.
1. నమస్తే! శ్యామల గారూ! బాగున్నారా?
జ. నమస్కారమండీ! బాగున్నాము.
2. మీరు ఎప్పుడు? ఎక్కడ జన్మించారు?
జ. 14 సెప్టెంబర్ 1954లో పుట్టాను. కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల తాలూకాలోని పైడిమడుగు అనేది మా ఊరు.
3. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి.
జ. మా నాన్న పేరు చెన్న నారాయణ. మా అమ్మ పేరు చెన్న గౌరమ్మ. మేము ఎనిమిది మంది తోడబుట్టినోళ్ళం. నాకు ముగ్గురు అన్నలు, తరువాత నేను. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు.
4. మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. మా వూరిలో గవర్నమెంటు స్కూల్ ఉండేది. కాని బాగా దూరం. మా ఇల్లు ఊరికి తూర్పు దిక్కున. బడి పడమర దిక్కున ఊరి కొసకు ఉంటుంది. అందుకని నన్ను బడికి పంపలేదు. మా ఇంటి పక్కనే గల మా పెదనాన్న కొడుకు భీమ రాజన్న మూడో తరగతి దాక ఇంట్లనే బడి నడుపుతుండే. అక్కడికి పోయి కూర్చునేదాన్ని. ఆ తరువాత మా కుటుంబ మిత్రులు ప్రభాకర్ స్మిత దంపతులు శాతవాహన స్కూల్ నడిపేది. మా పిల్లలు బడికి పోయినంక నేను స్మిత మేడం దగ్గరికి పోయినపుడు చదువు పట్ల నాకున్న ఆసక్తిని గమనించి ఆమె నాకు చదువు నేర్పింది. ఇపుడు వార్తా పత్రికలు, కథల పుస్తకాలు చదువుతా.
5. మీకు ఎప్పుడు పెళ్ళి అయింది? మీ కుటుంబ వివరాలు చెప్పండి.
జ. మాకు 17 మే 1973లో మా పైడిమడుగులోనే పెళ్ళయింది. అప్పుడు నాకు 18 ఏళ్ళు. మా మామ పేరు మిట్టపల్లి నారాయణ. అత్తమ్మ పేరు బేతి లక్ష్మిరాజు, మరిది పేరు గోపాల్. అప్పుడు మా సారుకు (బి.ఎస్. రాములు ) ఉద్యోగం కూడా లేకుండే… నాకు నలుగురు కొడుకులు.
6. మీ సారుకు ఎప్పుడు ఉద్యోగం వచ్చింది? ఎక్కడెక్కడ పనిచేశారు?
జ. 1975లో మా సారుకు ఉద్యోగం వచ్చింది. ఎలుగందల, హుజూరాబాద్, వేములవాడ, మల్యాల, రాయికల్‌లో పనిచేసి 2006 జులైలో రిటైర్ అయ్యిండు.
7. బిఎస్ రాములుగారు ఎప్పుడు జైలుకు వెళ్లారు?
జ. మా ఆయనను 1984 జనవరిలో అకస్మాత్తుగా వచ్చి అరెస్టు చేశారు. జగిత్యాల నుండి తీసుకొని వెళ్లి కోరుట్ల లాకప్‌లో వారం రోజులు ఉంచారు. ఏదో కేసు పెట్టి కరీంనగర్ జైలుకు పంపినారు. కరీంనగర్ జైల్లో మూడు వారాలున్నాడు. కోరుట్ల లాకప్‌లో ఉన్నప్పుడు మా చెల్లెలు సరోజ లంచ్‌బాక్స్ ఇస్తే మా మరిది చంద్రశేఖర్ స్టేషన్‌లో ఇచ్చి వస్తుండే. అప్పుడు మా చిన్న కొడుకు నరేశ్ వయసు ఒక నెల. ఆయనకు బెయిలు తీసుకు రావడానికి చాలా కష్టపడ్డాను. దానికి అవసరమైన కాయితాల కొరకు లాయర్ దగ్గరికి పోవలసి వచ్చినప్పుడు… నెల బాలింతగా నెల పిలగాడు నరేశ్‌ను చంకలో వేసుకొని, సరిగ్గా నడవడం కూడా రాని మూడో కొడుకు కిరణ్‌ను ఒక చేత్తో పట్టుకొని తిరిగేదాన్ని. అట్లా జైలు నుంచి బైటికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఇబ్బందులెదురైనాయి.
8. సార్ ఇంటికి వచ్చాక ఏం జరిగింది?
జ. మా సారును తిరిగి ఉద్యోగంలో తీసుకోలేదు. సస్పెండు చేసిన్రు. రూల్ ప్రకారం సగం జీతం ఇవ్వాలన్నారు. కాని అది కూడా ఇవ్వ లేదు. ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మాకు రేషన్ కార్డు కూడ లేకుండె. అపుడు మా తల్లి గారి బలంతోటి నేను మా పిల్లలు బతికినం. మూడవ కొడుకు కిరణ్ గవర్నమెంట్ స్కూలుకు పోను, నేను బీడీలకు దారం కడతా, ఇంట్ల పనులన్నీ చేస్తా, నాకు ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టు అని ఏడ్చి ఏడ్చి జ్వరం వచ్చి పడుకున్నాడు. ఆ సమయంలో నిజాం వెంకటేశం అన్నయ్య, అలిశెట్టి ప్రభాకర్ పలకరించడానికి ఇంటికి వచ్చిన్రు. నిజాం వెంకటేశ్ శారదా విద్యాలయం ప్రైవేట్ స్కూల్‌లో జెయిన్ చేసిండు. స్కూల్ ఫీస్ కట్టి పుస్తకాలు కొని ఇచ్చిండు.
వరంగల్ నుంచి బాల్యమిత్రుడు మంచాల గంగాధర్ ఒకటి రెండుసార్లు వచ్చి కలిసిండు. ఎప్పుడూ పోలీసుల నిఘా ఉంటుండే. అందువల్ల ఎక్కువమంది రాకపోదురు. మిషన్ కాంపౌండ్‌లోని మా కొత్త ఇంట్లో కిరాయికి ఉన్న వారిని బెదిరించి వెళ్లగొట్టిండ్రు. మమ్ములను ఈ ఇంట్లో ఉండవద్దు అని బెదిరించారు. దానితోటి నేను మా పాతింటికి అత్తమ్మ దగ్గరికి పిల్లలను తీసుకొని పోయిన.
9. నక్సలైట్ ఉద్యమం పైన మీకు అవగాహన ఉందా?
జ. కొంతవరకు ఉంది. అప్పటికే మా చిన్నబాపు అల్లుడు కల్లూరి నారాయణ పార్టీలో పని చేస్తుండే. కొంచం అవగాహన ఉంది.
10. సారు ఎన్నేళ్లు లోపల (అండర్‌గ్రౌండ్) ఉన్నారు? అప్పుడు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు ఏమిటి?
జ. 1984-90 వరకు ఆరేళ్లు లోపల ఉన్నారు.
11. అప్పుడు మీ జీవితం ఎలా గడిచింది?
జ. నేను నలుగురు పిల్లలతో మా పాత ఇంటిలో రెండు చిన్న గదుల్లో సర్దుకొని ఉన్నాము. నేను బీడీలు చేసేదాన్ని. అది చిన్న పెంకుటిల్లు. బాత్రూం కూడా లేకుండే అవతలికే పోతుంటిమి. ఆ రోజులలో వెయ్యి బీడీలు చేస్తే 15 రూపాయలు ఇచ్చేవాళ్ళు. రోజుకు వెయ్యి బీడీలు చేసేదాన్ని. ఆ మొత్తం పైసలు 15 రోజులకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. బీడీ కార్మికులు సమ్మె చేసినప్పుడు పని ఉండేది కాదు. ఆ సమయంలో నా తోడబుట్టినోళ్ళు సాయం చేసిండ్రు. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు చీరలు రేషన్ కార్డు మీద ఇచ్చేవారు. ఒక చీర కట్టుకుంటే ఇంకో చీర పరుచుకుని పండుకునేదాన్ని.
ఆ పరుచుకున్న చీరనే స్నానం చేసి కట్టుకునేదాన్ని. పిల్లలకు ప్యాంట్లు కుట్టియ్యలేకపోయిన. నిక్కర్లే వేసుకొన్నరు.
తిండికి బాగా కష్టమయ్యేది. అన్నం ఉంటే కూర ఉండేది కాదు, కూర ఉంటే అన్నం ఉండేది కాదు. ఒక్కొక్కసారి ఉన్న అన్నం పిల్లలకు పెట్టి నేను నీళ్ళు తాగి పండుకునేదాన్ని. నేను బొట్టు, పూలు పెట్టుకుంటే… ‘‘మొగడు ఎప్పుడో చచ్చిపోయి ఉంటడు’’ అని నాకు విన్పించేటట్లు అమ్మలక్కలు మాట్లాడుకునేటోళ్ళు. ఆ మాటలు నన్ను మరింత కుంగదీస్తుండే.
ఊరిలో ఉన్న మా పెద్దన్న జగతన్న అన్నింటికి సాయపడుతుండే. మా పెద్ద వదిన ప్రతి పండుగకు నన్ను, పిల్లలను భోజనానికి పిలుస్తుండే. మా చెల్లె సరోజ రేషన్‌బియ్యం పంపిస్తుండే. మా నాన్న కొన్ని పంట బియ్యం తెస్తుండే. ఎంబిబిఎస్ చేసి కొడిమ్యాలలో ప్రాక్టీస్ చేస్తున్న శంకరన్న అరుణ వదినెల దగ్గరికి పోయి పాణి అప్పుడప్పుడు రేషన్ బియ్యం తెస్తుండె. శంకరన్న ఎస్సై, సిఐలతో చెప్పి మా చెల్లెను ఏమనకురి అని చెప్తుండె.
నేను బీడీలమీదనే ఆధారపడి బతుకుతున్నా అని బీడీ కంపెనీలో నాకు ఎక్కువ బీడీలకు తంబాకు ఆకు ఇస్తుండె. మా మేనమామ కస్తూరి రాజ నర్సయ్య, కస్తూరి వెంకటమ్మ అత్తమ్మలు వాళ్ళ బట్టల షాపులో నుంచి కొన్ని చీరలు కట్టుకొమ్మని ఇచ్చింది.
మా కొత్తింటికాడ పోలీసులు వచ్చి బెదిరించినప్పుడల్లా వనమాల సహదేవ్ బావ, భాగ్యక్క నాకు సపోర్ట్‌గా వాళ్ళతోటి మాట్లాడి పంపించేది. మా పాతింటికాడ మా పక్కింట్లో కిరాయకున్న నర్సయ్య వార్డెన్ సార్ వాళ్ళు మార్కెట్‌కు పోయినప్పుడు కూరగాయలు కొని తెచ్చి ఇచ్చేది. సాయక్క అప్పుడప్పుడు వండిన కూరలు తెచ్చి ఇస్తుండె. పోచయ్య వార్డెన్ సార్ పిల్లలకు నోట్‌బుక్కులు, పుస్తకాలు తెచ్చి ఇస్తుండే.
పెద్దోడు పాణికి ఏడో తరగతిలో మెరిట్ స్కాలర్‌షిప్ వచ్చింది. ఎనిమిదో తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇట్టె ప్రభాకర్‌గారి విద్యానికేతన్ స్కూల్‌లో ఫీజు తీసుకోకుండా చదివించిండు. ఆ తరువాత ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు గవర్నమెంటు కాలేజీలో చదువుతున్నప్పుడు పాణి ట్యూషన్‌కు పోతుండే. ట్యూషన్ ఫీజు మా నాన్న కట్టిండు. ఇంట్లో గడియారం లేదు. పొద్దున ఐదింటికే ట్యూషన్, ఓ రాత్రి నిదురలేసి గడియారం చౌరస్తాకు పోయి చూసేసరికి ఏ నాలుగో అయితుండే. చలిలో వణుకుంటా ఐదు దాకా అక్కడే ఉండి ట్యూషన్‌కు పోయి వస్తుండే. అట్లా ఇంటర్మీడియట్ ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయ్యిండు. పాణిని ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు కాలేజీ తరఫున ఎక్స్‌కర్షన్‌కు పోయినపుడు మా జగతన్న పైసలు కట్టి పంపించిండు.
12. మీకు జీవితంలో చాలా కష్టమనిపించిన సంఘటనలు చెప్పండి.
జ. ఒకసారి నేను నెల బాలింతగా ఉన్నప్పుడు మిషన్ కంపౌండ్‌లోని మా కొత్తింట్లో నిచ్చెనెక్కి సజ్జమీద సర్దుతున్న. అప్పుడు షాబాద్ బండమీద నిచ్చెన జారి కింద పడ్డ. పొద్దుగాల పదిగంటలకు కింద పడితే సాయంత్రం ఆరుగంటలకు నన్ను నాయుడు దవాఖాన్ల చేరిపిచ్చిన్రు. అప్పటి దాకా ఇంట్లోనే వైద్యం చేసిన్రు. అపుడు రెండు కాళ్ళకు సిమెంటు పట్టీలు కట్టిండు డాక్టరు. గట్ల రెండు నెలలు మంచం మీదనే ఉన్న. దానికి తోడు చిన్నపిల్లలు. వాళ్ళను సముదాయించుడు చాలా కష్టమయ్యేది.
మా పాత గూన పెంకుటింట్లో ఎలుకలు చాలా ఉండేవి. అటక మీద ఉన్న సామాన్లు పాడు చేసేటివి. వాటి కోసం పాములు వచ్చేవి. పైన వాసాలు, దూలాల మీద పాకుతూ కనిపించేవి. పగలు కనిపిస్తే ఆ రాత్రి పక్కింట్లో కస్తూరి శ్రీను వాళ్ళ ఇంట్లో పిల్లలను తీసుకొనిపోయి పడుకునేదాన్ని. కానీ ఒకరోజు మధ్య రాత్రి పిల్లలు పండుకున్నాక పాము కనిపించింది. ఆ అర్ధరాత్రి పిల్లలను తీసుకొని బయటకు పోలేక మెలకువతో ఉండేదాన్ని. అది యాదికస్తే ఇప్పటికీ పెయ్యంతా జలదరిస్తది. నేనొక్కదాన్ని బీడీలు చేస్తుంటి. అప్పుడప్పుడు ఏడుస్తుంటే నీలక్క నా దగ్గరికి వచ్చి బీడీలు చేస్తుండే. నన్ను వాళ్లింటికి తీసుకుపోతుండే.
మా పాత ఇంటికాడ ఉన్నప్పుడు వానకాలం. మా ఇంటిపక్కన సరస్వతీ శిశుమందిర్ స్కూల్ ఉంటుంది. వాళ్లు మా జాగ హద్దుతో కొత్తబిల్డింగ్‌కు పిల్లర్ల కోసం రెండు గజాల లోతు గుంతలు తవ్విన్రు. వాన, వరద నీళ్లకు అవన్నీ నిండి మా ఇంటిముంగట మోరెడెత్తు వరద పారుతున్నది.
మా పాణి, పాణి దోస్త్ మా పక్కింటి కస్తూరి శీను కలిసి నీళ్లలో ఆడుకోవడానికి పోయిన్రు. వాళ్ళ వెనక రెండో కొడుకు శ్రీకాంత్ ఉరుక్కుంట పోయి ఆ గుంటల పడ్డడు. అయ్యో అయ్యో అని పాణి తమ్ముణ్ణి తియ్యబోయి వాడు కూడా ఆ గుంటలో జారిపడ్డడు. ఆ సమయంలో కస్తూరి శ్రీను ధైర్యం చేసిండు. ఒక్కొక్కరిని మీదికి చేయిపట్టి ఇవతలికి గుంజిండు. లేకపోతే వాళ్లిద్దరు అందులోనే మునుగుదురు. మాకు ఎక్కడ పోయిన్రో తెలవకపోవు. శ్రీను ధైర్యం చేసి వాళ్ళను కాపాడి తీసుకచ్చి నాకప్పజెప్పిండు. ఒంటి నిండ బురదతోని, భయంతోని నా బిడ్డలను చూసి నా గుండె ఆగినంత పనైంది. (శ్యామలగారు చాలా ఉద్వేగభరితులయ్యారు)
13. మీ అత్తా కోడళ్ళ అనుబంధం గురించి చెప్పండి.
జ. మా అత్తమ్మ చాలా మంచిది.’’ నువ్వూ మొగడు లేక, బీడీలు చుట్టి పిల్లల్ని పెంచినవు. నేనూ మొగడు లేక బీడీలు చుట్టి పిల్లల్ని పెంచుతున్న. మన బతుకులింతే… అని నేను బాధ పడుకుంట అత్తమ్మతోటి అరుస్తుంటి. దానికి ఆమె ‘‘అట్లనకే శ్యామలా! నా మొగడు చచ్చిపోతే నేను పిల్లల్ని పెంచిన. కానీ నా కొడుకు (నీ మొగడు ) వత్తడే’’ అని నన్ను సముదాయించేది. కానీ నాకు మాత్రం ఆయన వస్తడనే ఆశ లేకుండే…. ఎక్కడ ఎన్ కౌంటర్ వార్త విన్నా మస్తు భయమయ్యేది.
14. బి.ఎస్.రాములు గారు తిరిగి వచ్చినప్పటి మీ ఫీలింగ్స్ చెప్పండి.
జ. పెద్దోడు పాణికి అప్పుడే ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినయి. ఎండకాలం. రాత్రి దబ దబా తలుపులు కొట్టిండ్రు. తలుపు తీసి చూద్దును కదా… ఎదురుంగ పెద్ద గడ్డంతో మా సారు, ఆ ఎనక గద్దరు, మాభూమి సంధ్య, వరవరరావు, దేవులపల్లి అమర్ మరికొందరున్నరు. నాకు నోట్ల నుంచి మాట రాలేదు. వస్తడనే ఆశ లేదు కదా… పిల్లలను, నన్ను చూపించి తీస్కపోనికి వచ్చినరు అనుకున్న. ‘‘ఏమ్మా! ఉంచి పొమ్మంటవా? తీసుకపొమ్మంటవా?’’ అని నన్ను అడిగిన్రు. ‘‘ఉంచితే మరి క్షేమంగా ఉంటడ’’ అని అడిగినరు, మా పెద్దన్న జగతన్నను పిలిపించిన.
మీ బావను ‘‘ఉంచుమంటవ, తీసుకుపొమ్మంటవ. ఉంచితే మరి క్షేమంగా ఉంటడ అడిగిన్రు. మా పెద్దన్న ‘‘బావను బాగా చూసుకుంటమని’’ చెప్పిండు. అట్లా ఇంట్లో అప్పగించి వాళ్ళు వెళ్ళిపోయారు.
తెల్లారి మా పెద్దన్న ఇంకొంత మందిని తీసుకొని ఎస్‌పి ఆఫీసుకు పోయిండు. తరువాత మా సారు యూనియన్ వాళ్ళతో పోయి కలెక్టర్‌ను కలిసిండు. వారం రోజులలో ఉద్యోగంలో జెయిన్ అయిండు.
15. మీ పిల్లల గురించి చెప్పండి.
జ. నాకు నలుగురు కొడుకులు. వరుసగా మూడేళ్ళ ఎడమతో 74, 77, 80, 83 లలో పుట్టారు. పాణిగ్రాహి, శ్రీకాంత్, కిరణ్, నరేశ్ వాళ్ళ పేర్లు. అందరు పెద్ద చదువులు చదువుకున్నరు.
16. మీ పిల్లలందరూ ఇంజనీరింగ్ చదివారు కదా… అందులో మీ కృషి గురించి చెప్పండి.
జ. పెద్దకొడుకు పాణిగ్రాహి బి.టెక్, ఎం.టెక్ చదివి, ఒక ఏడాది బెంగుళూర్‌లో ఉద్యోగం చేసిండు. తరువాత 1998లో కంపెనీ వాళ్ళు అమెరికాలో చికాగోకు పంపిన్రు. ఇప్పుడు చికాగోకు మూడు గంటల దూరంలో ఉన్న ఇండియానా పొలిస్‌లో ఇల్లు కట్టుకుని ఉంటున్నరు. వాళ్లకు ఇద్దరు కొడుకులు. పెద్ద మనవడు అమెరికాలోనే డిగ్రి చదువుతున్నడు. చిన్నోడు టెన్త్.
రెండవ కొడుకు శ్రీకాంత్ ఎంసిఏ చదివి అమెరికాలో చికాగోలో సొంత ఇంట్లో ఉంటున్నడు. వాళ్లకు కూడా ఇద్దరు కొడుకులు. పెద్దవాడు టెన్త్, చిన్నోడు సెవెంత్.
మూడవ కొడుకు కిరణ్ బిటెక్ చేసి ఇప్పుడు ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉంటున్నడు. వాళ్లకు ఒక పాప. నాల్గవ తరగతి.
చిన్నోడు నరేశ్ బిటెక్ చేసిండు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసి నాలుగేండ్ల కింద ఐర్లాండ్ పోయిండు. వాళ్లకు ఒక కొడుకు, ఒక బిడ్డ. కొడుకు నైన్త్, బిడ్డ సెకండ్ క్లాస్.
పిల్లల చదువుల కొరకు నేను 2001లో హైదరాబాదుకు వచ్చిన. నాకు ఐదుగురు మనుమలు, ఇద్దరు మనమరాండ్లు. ఎన్ని కష్టాలు పడ్డా మా నల్గురు పిల్లలను ఇంజనీరింగు చదివించిన. రాత్రి నిదురపోకుండ వాళ్లతో పాటు కూసుండి చదివించిన. చిన్నప్పటి నుండి నాకు చదవంటే చాలా ఇష్టం. అందుకని పిల్లలను కష్టపడి చదివించిన. వాళ్ల నాన్నకు ఆయన మీటింగ్‌లు, ఆయన ఉద్యోగం, ఆయన ఉద్యోగ సంఘాలు, రచయితల సంఘాలు అంటూ అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నారు. రాస్తూనే ఉన్నారు. పుస్తకాలు వేస్తూనే ఉన్నారు. ఆయన లోకం ఆయనది. పిల్లలను అన్నీ నేనై సాదిన. చదివిచ్చిన.
2000వ సంవత్సరంలో మా పెద్ద కొడుకు పాణిగ్రాహి, సులేఖల పెండ్లి హనుమకొండలో జరిగింది. అది స్టేజి మ్యారేజి. కాళోజి, డా॥కొత్తపల్లి జయశంకర్, అనిశెట్టి రజిత ఈ స్టేజి మ్యారేజిని జరిపిన్రు.
17. మీరు మొదటిసారి అమెరికా ఎప్పుడు వెళ్ళారు? ఆ అనుభవం గురించి చెప్పండి.
జ. మొదటిసారి 2005లో నేనొక్కదాన్నే అమెరికాకు పోయిన. నరేశ్ ఫ్రెండ్ వెంట ఉండే. నేను విమానం ఎక్కుతానని ఎన్నడూ కల గనలేదు.
చిన్నప్పుడు తడకలు అడ్దం కట్టుకొని స్నానం చేసిన రోజులల్ల నుండి అమెరికాలో పెద్ద పెద్ద బాత్రూములల్ల, టబ్బులల్ల స్నానం చేసిన. ఐదుసార్లు అమెరికాకు పోయిన. ఒకసారి మూడవ కొడుకు కిరణ్ దగ్గరికి ఆస్ట్రేలియాకు పోయిన. మా చుట్టాలల్ల మొట్టమొదట పాణి అమెరికా పోయిండు. ఆ తరువాత నేనే అమెరికా పోయిన. అప్పుడు మా చుట్టాలందరు ఈ విషయం గొప్పగా చెప్పుకున్నరు.
నేను పల్లెలో పుట్టి, పల్లెలో పెరిగిన. జగిత్యాల అత్తగారింటికి వచ్చిన. నాకు చిన్నప్పుడు హైదరాబాద్ కూడా తెలవదు. అటువంటిదాన్ని అమెరికాలో ఎన్నో రాష్ట్రాలు తిరిగిన. ఆస్ట్రేలియాలో ఎన్నో సిటీలు, రాష్ట్రాలు, ప్రదేశాలు చూసిన. మా సారు మీటింగ్‌లకు రమ్మంటడు. పిల్లల చదువులుంటాయి కాబట్టి నేను పోకపోతుంటిని. ఇటీవల మొదటిసారి కీసర కథల శిక్షణ తరగతులకు వచ్చిన. నాకెంతో సంతోషమేసింది. మీరందరు కలిసిన్రు. ఆ రెండు రోజులు బాగా ఎంజాయ్ చేసిన.
18. బి.ఎస్. రాములుగారికి తెలంగాణా బి.సి. కమిషన్ చైర్మన్ పదవి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు?
జ. అది వస్తది అనుకోలేదు. అది అంత పెద్ద పోస్ట్ అని కూడా నాకు తెల్వదు. కానీ అది వచ్చినాక మేము యాదగిరి గుట్ట దర్శనానికి పోయినం. అప్పుడు కలెక్టరు, ఎస్‌పి వచ్చి స్వాగతం చెపుతూ చప్పుడుతో గుడి లోపలికి తీసుక పోయినరు. ఐదు మంది వేద పండితులు దగ్గర ఉండి పూజ చేయించిన్రు. అది ఎంత పెద్ద పోస్టు అని అపుడు తెల్సింది. ఒకప్పుడు కన్పిస్తే కాల్చి వేత ఉత్తర్వులు కూడ ఉండే. ఆ పోలీసులే ఇప్పుడు సెక్యూరిటీగ వచ్చిరి. నాకంతా అయోమయంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది.
19. గొప్ప రచయిత సహచరిగా మీ ఆలోచనలు చెప్పండి.
జ. అది నా అదృష్టం. కాళోజి, దాశరథి, సి. నారాయణ రెడ్డి లాంటి పెద్ద పెద్ద కవులను పిలిచి మా సారు మీటింగ్‌లు పెడుతుండే. దానివల్ల నేనే కాదు, మా వాళ్ళు అందరూ వాళ్ళను చూసే అవకాశం దొరికింది. నేను ఇట్ల మీకు ఇంటర్వ్యూ ఇస్తున్ననంటే అందువల్లనే.
20. భరించలేని కష్టాలు, ఆనందాలు మీ జీవన గమనంలో చూసారు కదా… మీకేమనిపిస్తుంది?
జ. నేను దేవుల్లను నమ్ముత. కష్టాలల్ల ఉన్నప్పుడు నేను చాలా వారాలు సంతోషి మాత పూజ చేసిన. అప్పుడు మా సారు క్షేమంగా ఇంటికొస్తే చాలని కోరుకున్న. అంతే… కానీ ఆ అమ్మ నేను అడిగిన దానికంటే చాలా ఎక్కువ నాకిచ్చింది. జీవితంల ఎప్పుడు ఏమైతదో తెల్వదు. అందరు మంచిగుండాల. మనం మంచిగుండాల.
21. ఇంకా జీవితంలో మీరేం కోరుకుంటున్నారు?
జ. నాకిప్పుడు ఏ కోరికలూ లేవు. ఎన్నో కష్టాలు చూసిన. పిల్లలు ఎదిగిన్రు మా సార్ బీసీ కమిషన్ చైర్మన్ అయ్యిండు. మా పిల్లలు చాలా సంతోషపడ్డరు. మా కుటుంబాలల్ల ఊహించని గౌరవం ఇది. ఆరోగ్యంగా ఉండాలి. నా పిల్లలు, వాళ్ళ పిల్లలూ బాగుండాలి. అందరూ బాగుండాలి.
22. మీ సహచరుని పై మీ అభిప్రాయం చెప్పండి.
జ. మా సారు ప్రజల మనిషి. నక్సలైట్, తెలంగాణ, దళిత, బహుజన ఉద్యమాలల్ల ఎందులో పని చేసినా ప్రజల కొరకే పని చేసిండు. చేస్తున్నడు. రచయితగా కూడా ఆయన ప్రజల పక్షమే… ఈ మధ్య మూడు భాగాలు ఆయన స్వీయ చరిత్ర రాసిండు.
23. చివరగా ఈ తరం ఆడపిల్లలకు మీరిచ్చే సలహా ఏమిటి?
జ. ఆడపిల్లలు మంచిగ చదుకోవాలె. ఉద్యోగాలు చేయాలె. ఎన్ని కష్టాలొచ్చినా నిలబడి ధైర్యంగా ముందుకు పోవాలె. ఎవరికి
వాళ్లు తాము మంచోల్లే అనుకుంటరు. కానీ అందరి దృష్టిలో కూడా మంచోల్లు కావాలె.