అడాలసెన్స్‌ – రఘు మందాటి

ఒక చిన్నారి మనసు – సమాజం దాని మీద ఆశలతో, భయాలతో వేసే చిత్రపటంలా
ఉంటుంది.
అడాలసెన్స్‌ – అనేది కేవలం ఓ సిరీస్‌ కాదు, ఒక నిజాయితీ గల అద్దం.

మన సమాజం, కుటుంబ వ్యవస్థ, పిల్లల మనస్తత్వ మార్పులను కనిపెట్టించే ఒక కఠోర దృశ్యం. టీనేజ్‌ అనేది ఒంటరిగా నడిచే మార్గం కాదు, అది ఒక భావోద్వేగ యుద్ధరంగం. ఈ వయస్సులో పిల్లలు ఎదుర్కొనే అనుభవాలు, ఒత్తిళ్లు, అంతర్మథనం ఇవన్నీ ఈ సిరీస్‌లో ఒళ్లు గగుర్పొడిచేలా చూపించబడతాయి. పిల్లల అమాయకత్వం, ప్రపంచాన్ని అర్థం చేసుకునే తపన, తమ పాత్రలను అవగతం చేసుకునే ప్రయత్నం ఇవన్నీ టీనేజ్‌లో మితిమీరిన స్థాయిలో ఉంటాయి. కానీ, అడాలసెన్స్‌ మనకు ఒక నిర్దాక్షిణ్యమైన నిజాన్ని తెలియజేస్తుంది. నేటి పిల్లలు తమ బాల్యం కోల్పోయారు. సోషల్‌ మీడియా, స్మార్ట్‌ఫోన్లు, యూట్యూబ్‌, ఫాలోయర్స్‌, లైక్‌లు… ఇవన్నీ కలిపి ఒక ప్రత్యామ్నాయ ప్రపంచం (Alternative Reality)ని సృష్టించాయి. ఓ వైపు మానసిక వయస్సు పెరుగుతుండగా, మరోవైపు అంతులేని ఒంటరితనం పెరుగుతోంది.
సిరీస్‌లో జేమీ (Jamie) పాత్ర నేను ఎవరు? అనే ప్రశ్నను ప్రతిక్షణం ఎదుర్కొంటూ ఉంటుంది. ఇది కేవలం ఒక పాత్రకే సంబంధించిన ప్రశ్న కాదు. ఇది నేటి సమాజంలోని ప్రతి టీనేజర్‌ ఎదుర్కొంటున్న సమస్య. మునుపటిలా తల్లిదండ్రులు పిల్లలను పెంచడం లేదు. ఇప్పుడు, ఇంటర్నెట్‌ వాళ్లను పెంచుతోంది. పిల్లలకు స్వేచ్ఛ అవసరమే, కానీ అది ఎంతవరకు సమంజసం? తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతవరకు నియంత్రణ అవసరం? పూర్తి నియంత్రణ ఒక ప్రమాదం. కానీ, పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ఇంకా ప్రమాదకరం. అడాలసెన్స్‌ ఈ సున్నితమైన స్థితి గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది. జేమీ తల్లి అతన్ని అర్థం చేసుకోవాలనుకోవడం, కానీ సమాజం అతనిపై పడే ఒత్తిడి ఈ రెండిరటి మధ్య ఆమె పడే సంఘర్షణ మనందరికీ ఒక గుణపాఠం. డిజిటల్‌ ఒంటరితనం. ఇదొక కొత్తతరం మానసిక వ్యాధి. ఈ సిరీస్‌ లోతుగా అధ్యయనం చేసే మరో విభాగం డిజిటల్‌ ఒంటరితనం. సోషల్‌ మీడియా ఎలిమెంట్స్‌ చాలా బాగా మిళితం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌, కామెంట్లు, టీనేజర్లు ఎలా మాట్లాడుకుంటారో, ఎలా సమాజంలో స్పందిస్తారో చాలా సహజంగా చూపించారు. ఎమోజీల వాడకం, వేగంగా జరిగే చాటింగ్‌లు, సోషల్‌ మీడియా పోస్ట్‌ల ద్వారా ఒక విషయానికి ఎంత వేగంగా స్పందన వస్తుందో బాగా చూపించారు. ఇవన్నీ చూస్తుంటే, నిజంగా ఈ రోజుల్లో టీనేజర్లు ఎలా ఉంటారో చూపించడానికి ప్రయత్నించారని స్పష్టంగా అనిపించింది. మానవ సంబంధాలు మానవీయ అనుభూతి కలిగించేలా ఉండాలి. కానీ, సోషల్‌ మీడియా మనకు కనెక్షన్‌ మాత్రమే ఇస్తుంది, మన మధ్య సాన్నిహిత్యం కాదు.
జేమీ కూడా ఒక hyper-connected world లో జీవించే ఒంటరి బాలుడు. మన పిల్లలకు ప్రేమనిచ్చే తల్లిదండ్రులు ఉన్నారు, కానీ వాళ్లతో సమయం గడిపే తల్లిదండ్రులు ఎంతమంది? అడాలసెన్స్‌ మనకు మోరల్‌ జడ్జ్మెంట్‌ ఇవ్వదు. మనసుకు నచ్చినట్టు మంచి-చెడులుగా వర్గీకరించదు. కేవలం ఒక నిజమైన జీవితానుభవాన్ని ప్రతిబింబిస్తుంది. జేమీ చేసే తప్పులు అతనికి తెలియనివి కావు. కానీ, అతన్ని ఆ మార్గంలో నడిపిన సమాజం, తల్లిదండ్రులు, ఆసక్తుల ప్రపంచం ఇవన్నీ ఎంతవరకు బాధ్యులు? ఒక వ్యక్తి నిర్ణయాలు పూర్తిగా అతని బాధ్యతా? లేక, తను ఎదిగిన సమాజం కూడా అతనికి ఒక ప్రభావాన్ని కలిగిస్తుందా? అడాలసెన్స్‌ సీరిస్‌ సినీ ప్రేమికులకు మాత్రమే కాదు. ఇది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, యువతకు ఒక మేల్కొలుపు (Wake-up call). నన్ను అడిగితే పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్స్‌ లో ఈ నాలుగు ఎపిసోడ్స్‌ చూపిస్తే మరి మంచిది. పిల్లలను ప్రేమించడం సరిపోదు. వాళ్లతో జీవించాలి. వాళ్ల ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. పిల్లలను పెద్దవాళ్లుగా చూడదలచిన సమాజం, పిల్లలను పిల్లలుగానే చూడదలచిన తల్లిదండ్రులు… ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్న భావోద్వేగ సంఘర్షణే అడాలసెన్స్‌ అనుభవం. పిల్లలని ఈ సమాజం వాళ్లను త్వరగా పెద్దవాళ్లను చేసేలోపు, చిన్నతనం చిన్నదే.. దాన్ని పూర్తిగా అనుభవించనివ్వండి… ఈ సిరీస్‌లో నటన అద్భుతంగా ఉంది. జేమీ పాత్రధారి అసాధారణంగా నటించాడు. అతను పాత్రను పూర్తిగా ఒదిగించుకున్నాడు. ప్రతి సన్నివేశంలో అతని అభినయం సహజంగా అనిపించింది. అలాగే, తండ్రి పాత్ర చేసిన నటుడి పెర్ఫార్మెన్స్‌ నిజంగా కలచివేసింది. చివరి ఘట్టాల్లో అతను తన పిల్లలను సరిగ్గా పెంచలేదన్న బాధలో మునిగిపోవడం మునుపెన్నడూ నేను చూడని భావోద్వేగాన్ని తెచ్చింది. చివరికి అతని ఆవేదనను చూడగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఇంకా, ఈ కథ కేవలం జేమీ గురించే కాకుండా, అతని చుట్టూ ఉన్న కుటుంబంపై అతని చర్యలు ఎలా ప్రభావం చూపించాయో కూడా చూపించారు. చాలాసార్లు ఇలాంటి కథలు ఒక వ్యక్తి చుట్టూ మాత్రమే తిరుగుతాయి. కానీ, అడాలసెన్స్‌ అందరికీ సంబంధించిన సంక్షోభాన్ని వివరిస్తూ, మరింత హృదయానికి హత్తుకునేలా మార్చింది. నన్ను అడిగితే – పిల్లలు కుటుంబంలో భాగమని చిన్నప్పటి నుంచి తెలియజేయాలి. మన ఆనందాలు, కష్టాలు, బాధ్యతలు ఇవన్నీ వాళ్ళకూ అర్థమయ్యేలా సహజంగా భాగస్వామ్యం చేసుకోవాలి. మనకు అప్పులు ఉంటే ఉన్నాయని, బాధ్యతలున్నాయని చెప్పడం ఒకవైపు… కానీ వాటిని వాళ్ళకు అర్థమయ్యేలా, భయపెట్టకుండా, బాధ్యతను అర్థం చేసుకునేలా చెప్పడం ముఖ్యం. పిల్లల్ని కుటుంబ సమస్యల నుంచి పూర్తిగా దూరంగా పెంచితే, భవిష్యత్తులో వాళ్ళు నిజమైన జీవితాన్ని ఎదుర్కోలేరు. అదే సమయంలో, వాటి భారాన్ని వారిపై పడేయకూడదు. మన కుటుంబ పరిస్థితి, మనకున్న సమస్యలు, మన విజయం, అపజయం ఇవన్నీ వాళ్ళతో ఓపికగా పంచుకుంటే, వాళ్ళలో సహజంగా ఒక అవగాహన పెరుగుతుంది. చిన్న చిన్న నిర్ణయాల్లో వాళ్లను భాగం చేసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాల వెనుక ఉన్న కారణాలు అర్థమయ్యేలా చెప్పాలి.
కుటుంబం అంటే కేవలం తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవడం కాదు… పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళలో బాధ్యత పెరుగుతుంది. మన కుటుంబాన్ని, మన పరిస్థితిని అర్థం చేసుకుని, జీవితాన్ని తేలికగా కాకుండా, బాధ్యతగా తీసుకునేలా మారతారు. 6-12 ఏళ్ళ మధ్య వారిని నడిపించాలి. 13-17 ఏళ్ళ మధ్య వారితో పాటే నడవాలి. 18 పైబడిన తర్వాత వారు కోరితేనే సలహా ఇవ్వాలి. అలా వారికి మన సలహాలను ప్రేమగా అందుకునే స్థానంలో మనం ఉండగలగాలి. సరైన సూచనలు ఇవ్వడానికి మనం కూడా సిద్ధం అవ్వాలి. పిల్లల్ని ప్రేమతో, అవగాహనతో పెంచితేనే, వాళ్ళు నిజమైన జీవితం గురించి తెలుసుకుంటారు. కష్టాలను తట్టుకుని నిలబడటం నేర్చుకుంటారు. మనం వాళ్ళతో కలిసి నడిచినప్పుడే, వాళ్ళు కూడా మన బాధ్యతను గౌరవించగలరు.
నా చిన్నప్పుడు మా అమ్మ మా ఇంటి ఆర్ధిక పరిస్థితుల గురించి, వ్యసనాల గురించి వ్యసనాల భారిన పడితే ఏం జరుగుతుందో అనే విషయాలు అర్ధమైయ్యేలా చూపించగలిగింది. అదే సమయంలో ఏదో ఒక ఆధ్యాత్మిక దార్మిక చింతన చిన్నతనంలో పరిచయం అవ్వడం దాని ద్వారా మనిషి నడవడిక సమాజాన్ని చూసే దృష్టి కోణం, సాటి మనుషుల్ని ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో ప్రేమలు గౌరవాలు ఇవ్వడం ఎంత ప్రధానమో ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలిసొచ్చాయి అనే చెప్పాలి. మొత్తానికి ఈ సిరీస్‌ చూస్తున్నంత సేపు ఒకలాంటి గగూర్పాటు కలుగుతూనే ఉంది. ఒక తండ్రిగా నేనేం నేర్చుకోవాలో ఎందుకు నేర్చుకోవాలో, నా అవసరం నా పిల్లలకు ఎంత ఉందో.. ఇంకెంత ఉండబోతుందో దానికి తగ్గట్టు నన్ను నేను ఎలా సిద్ధ పరుచుకోవాలో అనే తీవ్రమైన ఆలోచనలతో తెల్లవారింది. Netflix ఉంది. తెలుగులో చూడొచ్చు.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.