అత్తగారిని బస్సెక్కించటానికి భర్త వెళ్ళగానే అమ్మయ్య! అని అనుకొంది అనూష. నెల రోజుల నుండి తీరికలేని పని. పని చేయొచ్చుగానీ తనని తన వాళ్ళని అత్త సూటీపోటి మాటలంటుంటే భరించటం కష్టమయింది. అలా అంటుంటే కోడలు పడి ఉండాలి గాని ఎదురు సమాధానం చెబితే ఆయనకు ఫిర్యాదు చేస్తుంది. తనమీద ఆయనకు కోపం తెప్పిస్తుంది.
ఆఫీసు నుండి రాగానే తల్లి మాటలు విని భర్త తగాదా పెట్టుకొంటాడు. మాట్లాడకుండా ఉంటే దున్నపోతు మీద వర్షం కురిసినా ఒకటే అని అంటాడు. సమాధానం చెబితే తన తల్లి వచ్చి ఉండటం యిష్టం లేక అలా ప్రవర్తిస్తున్నావని తల్లి ముందే తనని అవమానపరుస్తూ మాటలంటాడు. భార్యకొక మనస్సు ఉందనీ, గాయపరిస్తే తనతో కాపురం ఎలా చేస్తుందనిగాని ఆలోచన చేయడు. రాత్రి పూట మరీ. ముభావంగా ముడుచుకొని పడుకొంటే ఏం? నేనంటే నీకు యిష్టంలేదులే. నన్నుకాక ఎవరినైనా పెళ్ళిచేసుకొని ఉంటే బాగుండేదని అనుకొంటున్నావా? అంటాడు. బాబోయ్ చాలు, చాలు ఒకడ్ని చేసుకొనే ఇంత నరకం అనుభవిస్తున్నా. ఏ స్త్రీjైునా బుద్ధి ఉంటే జన్మలో మరొక మగవాడు భర్తగా కావాలనుకొంటుందా. వీళ్ళకు అర్థంకాదు. భార్యకు యిష్టం లేకపోయినా ఆయన కోరికలకు మాత్రం అడ్డు ఉండకూడదు. ఛీ.ఛీ. ఆడ జన్మకు ఆత్మాభిమానం ఉండకూడదా? రోజూ తనెందుకు ఈ శిక్షను అనుభవిస్తోందని అనుకొంటూ తెల్లారిన తరువాత యింటి పనులలో నిమగ్నమయింది అనూష.
… … …
బుఁయ్..బుఁయ్ అంటూ హారన్ మోతలతో వస్తూ వెడుతూన్న వాహనాలతో కిటకిటలాడే జనంతో హైద్రాబాద్ బస్సుస్టేషన్ కోలాహలంగా గందరగోళంగా ఉంది. మణుగూరు బస్సులోంచి దిగిన మధుకర్ చకచక అడుగులేస్తూ బయటకు నడుస్తుంటే అతనికి కాస్త ముందుగా నడుస్తున్న అజయ్ కనపడ్డాడు. ’’అజయ్ ! ఒరేయ్ అజయ్’’ అని పిలిచేసరికి అప్పుడే తన అమ్మను బస్సెక్కించి వస్తున్న అజయ్ వెనక్కి తిరిగి చూసాడు.
‘‘హాయ్ మధూ! ఏంటి ఈ సర్ ప్రైజ్! హైద్రాబాద్ ఎప్పుడొచ్చావురా?’’ అంటూ పదేళ్ళ తరువాత కలుసుకొన్న ఆనందంతో మధు భుజం మీద చెయ్యేసి పలకరించాడు అజయ్. ‘‘నాకు హైద్రాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఇదిగో ఇప్పుడే బస్సు దిగాను. నా అదృష్టం. ఆత్మీయుడ్ని చూడగలిగాను. నువ్వు ఇక్కడ ఉంటున్నావని తెలుసుగాని ఇంత తొందరగా కలుస్తాననుకోలేదురా! హోటల్‌లో రూమ్ బుక్ చేసుకొన్నాను. ఇల్లు చూసుకొని ఒక వారం తరువాత ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలనుకొంటున్నా’’. ‘‘సరేలే! పద! మా ఇంటికి పోదాం’’అంటూ అజయ్ మధుకర్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు.
‘‘అనూ! ఎవరొచ్చారో చూడు అప్పుడప్పుడు చెపుతుంటానే మధు అని నా ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని. వాడే వీడు ఇదిగో మా ఆవిడ అనూష’’ అని పరిచయం చేసాడు. ప్రతి నమస్కారాల అనంతరం మిత్రులిద్దరిని మాట్లాడుకుంటూ ఉండమని చెప్పి అనూష తాను కాఫి స్నాక్స్ తెచ్చి యిచ్చి లోపలికి వెళ్ళింది. స్నేహితులిద్దరూ గంటలోపే ఎన్నోవిషయాలు మాట్లాడుకుంటూ అజయ్ తనకొక పాప అని చెపితే మధు తనకొక బాబు అని చెబుతూ ఇంటి విషయాలను పరస్పరం పంచుకొన్నారు. కాసేపయిన తరువాత మధు లేస్తూ’’ ఇక నేను హోటల్‌లో రూమ్‌కి వెడతాను. అజయ్ నువు కూడా రారా’’ అన్నాడు. సరేనని తామిద్దరూ కలిసి హోటల్‌లోనే డిన్నరు చేస్తామని భార్యకు చెప్పి బయలుదేరాడు అజయ్. దారిలో మధు, అజయ్ ! నీ భార్య ఎక్కువ రిజర్వడుగా ఉంటుందనుకుంటా!’’
‘‘అవున్రా! ఏంచెప్పాలి? నేను వాగటమే కానీ తనేమి మాట్లాడదు. ఆమె అర్థం కావటం కష్టంరా!’’ ’’అదేమిటిరా పెళ్ళయి ఎనిమిదేళ్ళయిందన్నావు. ఇంకా భార్య అర్థం కాకపోవటం ఏమిటిరా?’’
‘‘అదేరా విచిత్రం! బిడ్డను కన్నాంగాని మా ఇద్దరి మధ్య ఏదో దూరం ఇంకా మిగిలే ఉందిరా’’
‘‘నాకు పెళ్ళయి ఆరేళ్ళవుతోంది నా భార్యకు నేనంటే దైవంతో సమానం మాయిద్దరి మధ్య తేడా లేదురా’’ అంటూ మాట్లాడుతూనే హోటల్‌కి చేరుకొన్నారు ఇద్దరు. మధు హోటల్ గదిలోకి ప్రవేశిస్తూ’’ అజయ్! మనిద్దరికోసం డిన్నర్‌కి ఆర్డరిచ్చాను. తీసుకొచ్చేలోపు నేను స్నానం చేసి వస్తాను. నువ్వు కాసేపు పేపర్ తిరగెయ్’’ అంటూ వాష్ రూమ్‌లోకి దూరాడు.
టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసి హెడ్ లైన్లు చదువుతున్న అజయ్‌కి భార్య విషయంలో అది రేప్ కాదు హెడ్‌లైను పేపర్లో కనపడిరది. వివరాల కోసం కాలమ్‌లోకి తొంగిచూసాడు. భార్య ఇష్టంతో సంబంధం లేకుండా ఆమెతో భర్తకు లైంగిక సంబంధాలను నెరవేర్చుకొనే అధికారం ఉందని దాని సారాంశం. దాన్ని మళ్ళీమళ్ళీ చదివాడు. ‘‘ఆఁ ఈ రోజు పొద్దున హడావుడిలో పడి పేపరు చదవలేదు. ఇటువంటి న్యూస్ ని మిస్సయినానేమిటబ్బా! ఆ విషయంలోనే కదా అనూష ముభావంగా ఉంటుంది. తను దగ్గర కాలేకపోతున్నాడు. భార్యకు యిష్టం లేకపోయినా బలవంతంగానైనా దగ్గర అవవచ్చు అన్నమాట.’’ అని తనకి తెలియకుండానే పైకి అనేసాడు. అప్పుడే వాష్ రూమ్ నుంచి వస్తున్న మధు ‘‘ఏమిట్రా నీలో నీవే గొణుక్కుంటున్నావ్ పేపర్ని చూసి’’. ‘‘ఏంలేదురా!’’ అన్నా కూడా అజయ్ మైండులో మెదులుతూ ఉన్న ఆ శీర్షికను గరించి బయటకు చెప్పాడు. ఆ అర్థాన్ని గ్రహించిన మధు’’ సరే తింటూ మాట్లాడుకుందాం రా’’. ‘‘ఓ అదా! నేను కూడా చదివారా. ఈ ఫెమినిస్టు పెళ్ళాలకు మంచి గుణపాఠం. అయినా పద్దెనిమిది ఏళ్ళు దాటిన భార్యల విషయంలో వాళ్ళ యిష్టాష్టాలతో సంబంధం ఏంటి? కుటుంబాన్ని పోషించే భర్తకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉండద్దా? పెళ్ళి వలన భర్తకు వచ్చిన హక్కు కదా అది! కొంతమంది భార్యలు తమకిష్టం లేదంటూ ఒప్పుకోకుండా కోర్టుకెక్కుతున్నారులే. ఈరోజుల్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి సంపాయించుకుంటున్నారుగా. అందుకే తమకు యిష్టం లేకపోతే భర్త దగ్గరకు వస్తే రేప్ చేసినట్టే అని వాదిస్తున్నారు.. ఆఁ యిష్టం ఏమిటి? శరీరానికి సంబంధించిన సుఖానికి మనస్సులు లొంగి ఉండక తప్పదు.’’
‘‘అలా అంటే ఎలారా? యిష్టపడితేనే కదా! ఆ విషయంలో సయోధ్యత ఉండేది’’. ‘‘అదా నీ బాధ. భలేవాడివిరా! ఇంట్లో పెళ్ళాం ఒప్పుకోకపోతే బయటకు వెళ్ళామంటే వాళ్ళ యిష్టంతో సంబంధం ఉండదుగా. భర్త దగ్గరకు వస్తే యిష్టపడని భార్య రేప్ చేసాడని భావిస్తే యిక పెళ్ళి చేసుకోవటం ఎందుకు. వివాహానికి వ్యభిచారానికి తేడా ఏమిటి? అయినా ఈ విషయాన్ని యింత సీరియస్‌గా తీసుకోకు. ఓ పెగ్గేసుకుందామా? మరిచిపోయా. నీకు అలవాటు లేదన్నావుగా! రెండు పెగ్గులు వేసుకోనిదే నిద్రపట్టదురా, ఆఁ మరిచిపోయాను. మన క్లాస్మేట్ రఘురామ్ గుర్తున్నాడుగా, వాడు ఈ ఊళ్ళోనే సైకియాట్రిస్ట్‌గా ఉన్నట్టు తెలిసింది. వాడ్ని కలుద్దామా?’’. ‘‘ఆఁ.అవున్రా మరిచిపోయాను, వచ్చే వారం తప్పని సరిగా కలుద్దాం. నువ్వు రేపు డ్యూటిలో జాయెన్ అవ్వాలిగా. ఇక రెస్టు తీసుకో. నీ ఫ్యామిలి వచ్చిన తరువాత మా యింటికి తీసుకు రావటం మరిచిపోకు, నేనిక ఇంటికి వెడతాను’’ అంటూ బయటపడ్డాడు అజయ్.
… … …
పదిహేను రోజుల కాలం చూస్తుండగానే గడిచిపోయింది.. ఒకరోజు మధు తన కొడుకును, భార్య మాలతిని తీసుకొని అజయ్ వాళ్ళింటికి వచ్చాడు. అనూష, మాలతీలు పరిచయమైన కాసేప్పట్లోనే మంచి మిత్రులయ్యారు. ‘‘అనూషా నువ్వేదో చాలా రిజర్వుడుగా ఉంటావని చెప్పారు. వచ్చేముందు భయపడ్డా. కాని నాకలా అనిపించటంలేదు సుమా’’. ‘‘ఓ అదా. అలా అని అజయ్ చెప్పి ఉంటాడులే. ఆడవాళ్ళు అలా ముభావంగా ఎందుకున్నారో ఈ మొగాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదులే. పైగా రిజర్వడ్ అని ఒక పాలిష్ మాటను తగిలిస్తారు’’ అని ఊరుకొంది అనూష. ‘‘అదేంటి? అనూషా. నువ్వు కూడా ముభావం అనే అంటున్నావు. ఏమిటీ సమస్య?’’ ‘‘అదా తరువాతెప్పుడైనా చెబుతానులే’’. ‘‘ఏం. ఇంకా మనం మంచి ఫ్రెండ్స్ కాలేదా, మనసులు పంచుకోలేమా? నేను కూడా ఒక స్త్రీని అర్థం చేసుకోగలను. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు. చెప్పకపోయినా మరేమి అనుకోనులే’’. ఇద్దరూ మాట్లాడుకుంటూనే పాయసం, పకోడీలు తయారుచేసారు. అనూష ప్లేట్లల్లోకి సర్ది ఇద్దరికి ఇచ్చి వచ్చింది. ‘‘మాలతీ! పిల్లలిద్దరూ ఆటల్లో పడ్డారు పిలిచినా రావటంలేదు, వాళ్ళు వచ్చినప్పుడే పెడదాంలే’’. ‘‘అనూషా! పకోడీలు చాలా రుచిగా ఉన్నాయి. నువ్వు కూడా తీసుకో’’. ‘‘మాలతీ! నిన్ను చూస్తుంటే నాకు అక్కచెల్లెళ్ళు లేరనే కొరత తీరిందనుకో’’. ’’అవునా! నాకూ అలానే అనిపిస్తోంది. అయితే ఇందాక తరువాత చెబుతానన్న విషయాన్ని ఇప్పుడు చెప్పు నాతో. సమస్యను మనసులో పెట్టుకొని బాధపడటం కంటే తోటి వాళ్ళతో చెప్పుకొని ఆ బాధను కాస్త తగ్గించుకోవచ్చు. అప్పుడే కాస్త పరిష్కారం దొరుకుతుంది.’’
‘‘ఆఁ. అవును. ఒకనాటి బాధ అయితే తీర్చుకోవచ్చు’’ అని నిట్టూర్చింది.’’ మాలతీ. నువ్వు పేపర్లో చదివే ఉంటావుగా. భార్యకు యిష్టం లేకపోయినా భర్త ఆమెతో బలవంతంగానైనా కోరికలు తీర్చుకోవచ్చట. అది లైంగికహింస కాదట. రేప్ కాదని నిర్ణయిస్తుంటే భార్యలు ఎవరితో మొరపెట్టుకోవాలి. దేశంలో ఎంతమంది భార్యలు తప్పనిసరి కాపురాలు చేస్తున్నారో అర్థంకాదా? చలం అన్నట్టు భార్యలందరూ వ్యభిచారులవ్వరా. పైగా నేరచట్టాలు పునస్సమీక్షిస్తారట. అభివృద్ధి చెందిన దేశాలేకాక, ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా భార్యకి ఇష్టం లేకుండా భర్త కోరికతో ఆమె దగ్గరికి వెడితే దాన్ని రేప్ కిందనే పరిగణించే చట్టాలు చేసుకున్నారు. మనదేశంలో మాత్రం.’’ అని అనూష బొంగురు గొంతుతో అంది. ‘‘అనూషా అసలు సమస్య ఏమిటో చెప్పు’’. ‘‘భర్త యింటికి అధికారినని అనుకోవటం, భర్త వైపు వాళ్ళందరూ తాము అధికారులనుకొంటూ సూటీపోటి మాటలతో అవమానిస్తంటే భర్త పట్టించుకోకపోవటం, చెప్పినా అర్థం చేసుకోకపోతే భార్య మనస్సు ఎంత గాయపడుతుందో ఈ మగవాళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో. రాత్రిపూట మాత్రం. నువ్వు ఉద్యోగం చేస్తున్నావుగా, నీకింత సమస్య ఉండదేమోలే.’’ అంటూ నిట్టూర్చింది.
‘‘అలా అనకు అనూషా! స్త్రీ ఉద్యోగం చేస్తున్నా దీనికి మినహాయింపులు ఉండవు. ఎందుకంటే ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళేది కూడా తమ కోసమే అనుకొంటారు ఈ మగాళ్ళు. అంతేకాదు, సిగిరెట్టు, తాగుడు వ్యసనంతో దగ్గరికి వచ్చినా భార్య భరించాల్సిందే. తనకు నలతగా ఉన్నా చెప్పుకొనే స్థితి లేదు. భర్త కొట్టి, తిట్టినా అనుభవింపబడాల్సిందే, ఆడవాళ్ళంటే మగవాళ్ళకు ఆటబొమ్మలతో సమానం. ఇది వరకు ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్ళిళ్ళవటంతో చెప్పుకొనే వీలు కూడా లేక ద్వేషాగ్నిని మనస్సులోనే ఉంచుకొని మదనకామరాజుల చేతిలో నలిగి వాళ్ళు మధనపడేవారు. ఇప్పుడు మహిళలకు వ్యక్తిత్వం తుళ్ళిపడి లేస్తున్న రోజులు. ఇంకానా ఇకపై సాగవులే అనూషా! ఇదంతా మగవాళ్ళ బలహీనత. అంచెలంచెల అధికార వ్యవస్థలో మగవాళ్ళు బయట విషయాలలో పోటీపడలేక, నిలదొక్కుకోలేక, అసంతృప్తులతో దాన్నుండి తప్పించుకోవటానికి భార్య దగ్గర ఆధిక్యం చూపించి తృప్తి పడాలనుకుంటారు. అప్పుడు కాని ఆ పైశాచికత్వం తగ్గదు. ఆ సమయంలో వాళ్ళు ఆడవాళ్ళ యొక్క మనసులను అర్థం చేసుకొనే స్థితిలో ఉండరు.’’
‘‘బాగా చెప్పావు మాలతి. భార్యలకు మనస్సుంటుందనేది ఈ మగవాళ్ళు ఎప్పుడు గ్రహిస్తారో. నిజానికి వైద్య పరీక్షలలో రేప్ జరిగిందని తెలుస్తుంది. కాని చట్టం ప్రకారం భార్య మనసుకు అంగీకారంమైతే అది రేప్ కాదని అంటున్నారు. కాని అసలు భార్య యొక్క అంగీకారాన్ని మాత్రం కోర్టులు ఎలా రుజువు చేస్తాయో అర్థం కాదు. నాలుగు గోడల మధ్య భర్త ఏమి చేసినా భార్య చెప్పుకోకూడదని కుటుంబ సంస్కృతి నూరిపోస్తూనే ఉంటుందిగా. ఒక్కప్పుడు మనస్సుకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి అంగీకారానికి ఆస్కారం ఉంటుంది. చట్టంలో ఇటువంటి మినహాయింపులున్నందుకే కుటుంబాలు నిర్వీర్యం అవుతున్నాయి.’’
‘‘అనూషా! పెళ్ళి విషయంలో ఆడపిల్లల మనస్సు బాగా ఎదగాలి. పెళ్ళి అనే దానిని మగ వాళ్ళు భార్యతో కోరికలు తీర్చుకోవటానికి లభించిన సామాజిక లైసెన్సుగా భావిస్తారని అని అర్థం అవ్వాలి.’’. ‘‘ఆఁ. కరెక్టు మాలతి. దీన్ని లైసెన్సు కింద అనుకోవటం చేతనే భార్యకిష్టం లేకపోయినా భర్త ఆ లైసెన్సును వాడుకొంటున్నాడు. దాన్ని అత్యాచారం కింద భావించే చట్టముండాల్సిందే.’’ ‘‘అందుకే అనూషా! స్నేహంలో పరస్పర ఇష్టాలతో ఏకనిష్ఠ లైంగిక సంబంధాలుగా కొనసాగే వీలున్న సహజీవనం బాగుంటుందంటున్నారు’’. ‘‘అప్పుడు కూడా మహిళలు మేధతో మానసికంగా ఎదిగితేనే హింసను ఎదుర్కొనే పరిపక్వత వస్తుంది’’ అంటూ ఇద్దరూ చర్చించుకుంటుంటే పిల్లలు గబగబా లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళకు స్నాక్స్ తినిపిస్తంటే ముందు గదిలో నుండి మధు ’’ ఇక ఇంటికి బయలుదేరుదామా మాలతీ’’ అని ముందు గది నుండే వినిపించేటట్టు పిలిచాడు. వాళ్లు వెళ్లిన తరువాత అనూషకు తన బాధ అర్థం చేసుకొనే మాలతి లభించినందుకు కొంత ఉపశమనం కలిగింది.
… … …
మరో పది రోజుల తరువాత మధు, అజయ్ తమ మిత్రుడైన సైకియాట్రిస్ట్ రఘురామ్‌ని కలవటానికి ఆతని క్లినిక్‌కి వెళ్ళారు. అతడు లోపల కేసు డీల్ చేసి వచ్చి విజిటింగ్ రూమ్‌లో కూర్చొన్న వాళ్ళను చూసి ‘‘హలో! ఎప్పుడొచ్చారు? లోపలికి రాకుండా ఇక్కడే కూర్చొన్నారెందుకు? సరి సరి! రండి లోపలకు. ఎన్నాళ్ళయిందిరా మిమ్మల్ని చూసి’’ అంటూ ఇద్దరితో కరచాలనం చేసాడు. ’’ఆఁ. నువ్వేదో సీరియస్‌గా కేసు మాట్లాడుతున్నావని అర్థమయి యిక్కడే కూర్చున్నాములేరా. మేము డిస్ట్రబ్ చేసామా?’’ ‘‘అదేమిలేదురా! కేసు సీరియస్ అంటే సీరియస్, కాదంటే కాదు.’’
‘‘అదేమిటి?’’
‘‘భార్యాభర్తలకు విరుద్ధ భావనలు. వారివి భిన్నవాదాలు. భర్తేమో తనకున్న లైంగిక అధికారాన్ని నెరవేర్చుకోవటం తప్పు కాదంటాడు. ఆమె ఏమో తనకిష్టం లేకపోతే భర్త అయినా కొన్ని సందర్భాలలో మనసుకు పరాయిగా అనిపిస్తే అతడ్ని దగ్గరకు రావటానికి వీల్లేదంటుంది. ఆ అధికారం అతనికి లేదంటుంది. ఇదీ వరస విడాకుల వరకు వెళ్ళాలనుకొంటే వివరించి సర్ది చెప్పాను.’’
‘‘ఇంతకీ నువ్వు ఏమి చెప్పావు’’
‘‘ఇద్దరి వైపు వారి వారి వాదనలు సమంజసంగానే ఉన్నాయి. పెళ్ళి అనే దానిని కేవలం లైంగిక సంబంధాలుగా భావిస్తే ఇలానే ఉంటుంది. మనసులు కలవటమంటేనే వివాహబంధం అని అనుకొంటే భర్తలకు భార్యలపై అత్యాచారం చేసే అవసరం రాదు. ఆ లాజిక్‌ను మిస్సవుతున్నారు. ముందుగా భార్యాభర్తలు తమ మనస్సులు ఎక్కడెక్కడ కలవటంలేదో విశ్లేషణ చేసుకొని గ్రహించుకోవాలి. లేకపోతే ఎవరికివారే తమ ఆలోచనలు కరెక్ట్ అనుకొంటారు. పరస్పరం ఒకచోట వారిద్దరే కూర్చొని ప్రశాంతమైన స్నేహ వాతావరణంలో సమస్యల మూలాలలను చర్చించుకోవాలి. స్వార్థం ఉండకూడదు. ఇద్దరి వైపు ఒకరి మీద ఒకరికి ఆధిపత్యంగాని, మరొకరిని తమ సొంతం అని గాని భావన రాకూడదు.’’
‘‘అవున్రా రఘూ! ఇంకా సమస్య తెగకపోతే మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళి ఏమీ దాచకుండా మాట్లాడుకొంటే పరిష్కారం దొరుకుతుంది’’. అన్నాడు మధు. ‘‘అంతేకాదు, అంతరాలు, అవసరాలు మారిపోయాయి. ఆర్థిక విషయాలయితే పెద్దల పంచాయతీలు పరిష్కరించగలవు. ఇక్కడ మాత్రం యిప్పటికైనా భర్త తాను అధికుడననే తరతరాల సంస్కృతిని వదిలించుకోక తప్పదు. నేటి మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు వ్యక్తిత్వ స్పృహ కూడా పెరుగుతోందని మగవాళ్ళు తెలుసుకోవాలి.’’ ‘‘రఘూ చిన్న దానికి లెక్చర్ దంచుతున్నావేమిటిరా?’’ అని మధు అంటుంటే మధ్యలోనే అతడ్ని ఆపి ‘‘రఘూ చెప్పరా చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది’’ అన్నాడు అజయ్ ‘‘ఇటువంటి విషయంలో బీద, ధనిక తేడా లేదురా. దంపతులిద్దరి మధ్య ముఖ్యమైంది ప్రేమ అనే ఆల్కమితో చర్యను ప్రేరేపిస్తే లైంగిక బంధం పటిష్ఠమౌతుంది. చర్యకు ప్రతిచర్య సహజం.’’ ‘‘రఘూ అంత పెద్ద సమస్యకు ఇంత సులభమైన పరిష్కారం చెప్పావు. కాని ప్రేమ అనే అమూర్తభావానికి చట్టాలు చేయలేరుకదా!’’ అన్నాడు మధు.
‘‘నేను అదే అంటున్నానురా. ఎందుకంటే ఒక్క రోజులోనో ఒక్క నిముషంలోనో చూపించేది కాదు ప్రేమ. ఇరువురి మధ్య ప్రతిక్షణం ఉండాల్సిన భావన. భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి గౌరవం ఉండాలి. ఇద్దరి మధ్య స్నేహం ఉంటేనే అది ఏర్పడుతుంది. భార్య తక్కువ అనే భావన ఉంటే స్నేహం ఎలా ఏర్పడుతుంది? న్యాయస్థానాలలోని తీర్పులు మారవచ్చు కాని భార్యాభర్తలు పరస్పరం తమ మనసులనే త్రాసులో ప్రేమను సమానంగా తూచగలిగితే ఆ ప్రేమస్వరూపమే లైంగిక విషయాలలో ధర్మదేవత అవుతుంది. అప్పుడు హృదయమే ఒక న్యాయస్థానం అవుతుంది. ప్రేమ లేనిచోట్ల భార్య భర్తల మధ్య జరిగేది వ్యభిచారమో అత్యాచారమో అనేది ఎవరి సంస్కారం వాళ్ళని హెచ్చరిస్తూనే ఉంటుంది. మనుషుల్లో పెరగాల్సింది ఆ సంస్కారం.’’ అంటూ ఆ కేసును ముగించాడు రఘు. సమస్యకు కారణాలు మదిలో కదులుతుంటే ఆలోచనలో పడ్డాడు అజయ్. మగవాడిననే తన ప్రవర్తన, తన మాటలు అనూషను ఎంతగా అవమానించి ఉంటాయో అనుకుంటున్న అజయ్‌కి అనూష ఎందుకంత ముభావంగా ఉంటుందో, దానికి కారణమేమిటో గ్రహింపుకు వచ్చి ‘‘సారీ! అనూషా!’’ అని పలవరించాడు.
‘‘రఘూ! ఇలాంటిదేనేమో ఇంకొక కేసు వచ్చినట్లుంది. ఇక నిన్ను డిస్ట్రబ్ చేయకుండా మేము వెళ్ళిపోవటమే దారి. వెడతామురా’’ అని మధు అంటుంటే మనసా! నీ జాడ తెలిసెనులే అని అనుకొంటూ అజయ్ కూడా కలిసి బయటకు నడిచాడు.
‘‘కథ కంచికి మనమింటికిరా’’ అన్నాడు మధు.