జంటలు, భార్యా భర్తలు, పెళ్ళిళ్ళూ, బంధాలు, సంబంధాలూ – ఇవన్నీ మాట్లాడే శాక, మాట్లాడేముందు, మాట్లాడదాం అనుకునే సమయాల్లో – ఆఖరున ఒక శాక్సఫోన్ అంత అట్టహాసంగా మోగే మంత్రపు మాట – ఈ రోజుల్లో అమ్మాయిలు అస్సలు అడ్జస్ట్ అవడం లేదేంటో! చిన్న చిన్న విషయాలకే గొడవలుపడి విడిపోతున్నారు.
‘‘పొద్దున్నే ఇంట్లో అందరికి టీ పెట్టి ఇమ్మంటున్నారు, నాకు ఇవ్వడం ఇష్టం లేదు, మరీ ఫోర్స్ చేస్తే వెళ్ళిపోతాను’’ – ఇది ఒక అడ్జస్ట్ కానీ మహిళ స్వరం. ‘‘భర్త తనని ఎక్కడికి తీసుకెళ్లలేదని భార్య కోర్టు లో విడాకులకు కేసు వేసిందట!- పేపర్లో వార్త. సరే ఇంతకీ విషయా నికి వద్దాం – ఇప్పటి అమ్మాయిలలో అడ్జస్టు మెంట్ బాగా తగ్గిపోయింది. నిజమేనా? ఎందుకు?
ఇప్పటి అమ్మాయిలంటే ఎవరో గుర్తిం చుదాం. ఈ అడ్జస్ట్ అవని అమ్మాయిల మొదటి లక్షణం సిటీలలో ఉండడం లేదా ఉండాలను కోవడం. పెళ్లి అంటే చాకిరీగానో, బాధ్యతగానో చూడకుండా, జీవితాన్ని మరింత రంగుల మయం చేసే సాధనం అని నమ్మడం. అంతో ఇంతో చదువు ఉండడం, చాలాసార్లు ఉద్యో గాలు చేయడం, కొన్నిసార్లు తన సంపాదన లేదా విద్యార్హత భర్త కన్నా ఎక్కువగా ఉండడం – ఇవేవి లేకపోయినా బ్రతకాలనుకునే ధైర్యం ఉండడం. ఇది వరకు లేదా ఇటువంటి వారు ఉన్నారు. కానీ సీత లాగ అగ్నిప్రవేశం వంటి నానారకాల హింసలను ఎదుర్కొని భరించలేక పిల్లల కోసం అని చెప్పుకుని పెళ్లిని వదిలించు కున్న వారున్నారు. కానీ కొద్దీ మందే. ఈ రోజుల్లోలా కాదు.
అందుకే వయసు మీరకుండా ఉన్న అమ్మాయిలను చేసుకుంటే మన మాట వింటారు. కాస్త వయసు పెరిగి ఉద్యోగం చేసిందనుకో అసలు అడ్జస్ట్ అవలేరు, కొరకరాని కొయ్యలుగా తయారవుతారు. లేతగా ఉన్న అమ్మైjైుతే చక్కగా ఉంటుంది మాట బాగా వింటుంది. సంబంధాలు వెతికే వేళ – ఈ రోజుల్లో అమ్మాయిలలా కాదు – అని ఒక క్వాలిఫికేషన్ లాగ చెబుతారు. మరి ఆ రోజుల్లో అమ్మాయిలంటే ఎవరు?
అత్తమామలతో అడ్జస్ట్ అయ్యేవారు. మొగుడి మూడ్ స్వింగ్స్ తెలుసుకుని మసలేవారు. పడకవేళ తమకంలో ఉన్నప్పుడే కావలసినవి అడిగే విద్యను ఔపోసన పెట్టినవారు. పిల్లల్ని కనేవారు-అందులో మగపిల్లాడు ఒకడైన
ఉండకపోతే కుమిలిపోయేవారు. ఇంటి పేరు మార్చుకునేవారు. వంట పద్ధతులు నేర్చుకునే వారు. అందరితో బంధాలు మోసేవారు. చిరునవ్వుతో మెలగేవారు, సహనంతో సాధించు కొనేవారు. లౌక్యంగా మెలగేవారు. ఎక్కడ నోరుమూసుకోవాలో లేదా అసలు నోరు తెరవకుండా ఉండడమంటే ఏమిటో అర్థం చేసుకునేవారు. వద్దంటే అక్కడ పుట్టింటి వారు రానివ్వరు. ఇక్కడ మెట్టినింటి వారు పోనివ్వరు. రోడ్డునేక్కితే మనుషులు బతకనివ్వరు.
చదువు లేక, స్వంత ఆస్తి లేక, ఖర్చు పెట్టుకోడానికి స్వాతంత్య్రం లేక, పెళ్లి నుండి బయటకు వచ్చేస్తే పీక్కు తినే రాబందుల భయంతో, అసలు పెళ్లి నుండి బయటకు రావొచ్చు అనే అవకాశం ఉందనే ఆలోచనలు లేక బావిలో దూకి చచ్చే ఆడవారు కొందరు, గన్నేరు పప్పు నూరుకుని మింగే మనుషులు కొందరు, ఉరేసుకునేదొకరు, పిల్లల్ని మేడ మీద నుండి తోసి వాళ్ళు దూకేదొకరు, నరాలు కోసుకునో, మంటలు అంటించుకునో చచ్చేది ఇంకొందరు. చావు మార్గాలకు ధైర్యం సరిపోకపోతే పూనకాలు తెచ్చుకుని బెదిరించో, హిస్టీరియాలు వచ్చో, మూర్ఛల బారిన పడో, పిల్లలను ఎడాపెడా హింసించో, తమను తాము హింసించుకునో – కన్నీళ్లు కనపడకుండా ఏడ్చుకునో, బాధ దిగమింగుకుని, అతి సుభ్రమలు, అతి పూజలు-ఆరోగ్యం మీదకు తెచ్చుకునే ఆడవారి మధ్య కొత్తగా అసలు అడ్జస్ట్ అవని ఆడవారెలా వచ్చారు సుమతీ? ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్లు చెరసాలలు కావని అమ్మాయిలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి. పెళ్లి జీవితంలో సంతోషాన్ని పెంచేందుకే అని తెలుసుకున్నారు కాబట్టి. ఆడదై పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలు అనుకోవట్లేదు కాబట్టి.
ఆడపిల్ల, మగపిల్లాడు సమానం అన్నారు. చదువు చెప్పించారు, ఉద్యోగం దక్కే వరకు ఊరుకున్నారు. సొంత సంపాదన తెలిసిన ఆడమనిషి రక్తం మరిగిన పులి వంటిది. సంపాదన ద్వారా వచ్చే స్వేచ్ఛను అనుభవించే మహిళా, దానిని ఊరికే వదులుకోలేదు. వదులుకున్నా సంపూర్ణ సంతోషంతో ఉండలేదు. ఇంకేం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. తల్లి తండ్రి అండగా ఉన్నారు. ఉద్యోగార్హత ధీమాగా భుజం తడుతోంది. కూతురు ఆస్తికి హక్కులొస్తున్నాయి. ఇవేమి లేకపోయినా సమాజం మారింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగాలున్నాయోయ్! భద్రత పెరుగుతోంది. ఇంకెందుకీ పెళ్లి?
అన్నం పెట్టేవాడిపై ఆధారపడే జాలి దినాలు పోయాయి. వెక్కిరించే సమాజం కిక్కురుమనడం లేదు. ఇంటి చాకిరీ మీద పెట్టిన శ్రద్ధ
ఉద్యోగంలో పెడితే సంపాదన మాత్రమే కాదు-గుర్తింపు, ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. మరి తిండి బట్ట, పరువు మర్యాద, ఇంటిపేరు, పిల్లలు ఇచ్చే మొగుడు అవసరమా? టీ పెట్టివ్వట్లేదని మొత్తుకునే అత్తగార్లు అమ్మాయి ఇంటికి రాకముందు టీ తాగేవారు కాదా? అసలు ఇదో సమస్య ఎందుకైంది? ఇంట్లో చాకిరి చేయించు కోడానికి అసలు మొహమాట పడని భర్త, షికారుకు, సరదాగా బయటకు వెల్దామనే ఆలోచన చేయకపోతే ఇంకెందుకు పెళ్లి చేసుకున్నట్లు. ‘మా అమ్మని బాగా చూసు కోవాలి, మా ఇంట్లో కలిసిపోవాలి’ లాంటివి కాదు. నా భార్యతో సంతోషంగా గడపాలి. ఇద్దరం ఒకరికొకరు సహకరించుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి-అన్నింటికన్నా ముందు ఆమెను ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఆమెకున్న అర్హతను, తనను వరించిందన్న కృతజ్ఞత లేని భర్తతో ఎందుకుంటారు ఇప్పటి అమ్మాయిలు? కాదు. స్నేహితుడు కావాలి. ప్రియుడు కావాలి. భరించే భర్త అవసరం లేదు. మెడ నిటారుగా నిలబెట్టి, అవసరమైతే తల ఎగరేసి చెబుతున్నారు అమ్మాయిలు. ‘చాకిరి, త్యాగం ప్రేమకు పర్యాయ పదాలు కావు.’ తమ కామ, క్రోధ, ధన వాంఛలు తీరకపోతే అవమా నించి, కొట్టి తన్ని చంపే మనుషులున్న సమా జం నుండి ముందుకు నడచి, ఈ రోజు వారికి కావలసిన జీవితం కోసం, పెళ్లి వద్దను కుని విడాకుల నడిగితే అమ్మాయిలకు అడ్జస్ట్మెంట్ పోయిందని అంటున్నారు పెద్దలు!
Otherwise, these non adjusting girls really are doing.