` అనువాదం: ప్రభాకర్ మందార
(గత సంచిక తరువాయి…)
మొదట్లో పార్టీ మా యువ సభ్యులను కొంత ప్రత్యేకంగా చూసుకునేది. ఇక్కడ నీలం రామచంద్రయ్య (ఎన్‌ఆర్) వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘ఎన్‌కౌంటర్’లో చనిపోయే వరకూ కూడా మా విషయాలన్నీ ఆయనే చూసుకునేవారు. తను ఎంతో హుందాగా, మాతో కాస్త వ్యూహాత్మకంగా కూడా వ్యవహరించేవారు.
పార్టీలో మిగతా బృందాలతో పోలిస్తే మాది కొంత భిన్నంగా ఉండేది. మాది ఇంగ్లీష్‌లో మాట్లాడుకునే బృందం. మాలో చాలామంది తెలుగువాళ్లం కాదు. క్యాంపస్‌లో మా బృందం అంటే ప్రత్యేక ఆకర్షణ కూడా ఉండేది. అప్పటి వరకూ పార్టీలో చాలా వరకూ కామ్రేడ్ల పిల్లలో, లేక పార్టీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వచ్చిన వారో మాత్రమే ఉండేవాళ్లు. ఒక రకంగా వాళ్లంతా పెద్ద నాయకులకు యువ నకళ్లు. కానీ మేం ఇందుకు పూర్తి భిన్నం. మాది జార్జి రెడ్డి నుంచి స్ఫూర్తి పొంది, క్యాంపస్‌లో అతను చేసిన పోరాటాలతో ప్రభావితమై పార్టీలోకి వచ్చిన బ్యాచ్. అందరం సామాజికంగా కాస్త ముందున్న, మధ్యతరగతి కుటుంబాల నుంచి, పట్టణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లం. అందులోనూ మళ్లీ చాలామందిమి బ్రాహ్మలం. మేమందరం ఏదైనా ధైర్యంగా మాట్లాడేవాళ్లం. ఇక హైదరాబాద్ కాకుండా బయటి జిల్లాల నుంచి వచ్చిన పార్టీ క్యాడర్‌ను పరిశీలిస్తే వాళ్ల నేపథ్యాలు కొంత వేరేగా వుండేవి. అయితే వాళ్లలో కూడా ఎక్కువ భాగం అగ్ర కులాలకు చెందిన, భూములున్న కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే.
1976లో, మార్చి నెలలో అనుకుంటా, మా పార్టీ నాయకుడు చండ్ర పుల్లారెడ్డి, ఆయన సహచరి రాధక్క సిరిల్‌తో, నాతో కలసి వుండేందుకు మా ఇంటికొచ్చారు. ఇలా ఆయన్ని దగ్గర నుంచి గమనించే అవకాశం రావటంతో నాకీ తేడా స్పష్టంగా బోధపడిరది. 1975 నవంబర్ ఎన్‌కౌంటర్‌లో నీలం రామచంద్రయ్య (ఎన్‌ఆర్) చనిపోయిన తర్వాత మా గ్రూపు వ్యవహారాల బాధ్యతలను చండ్ర పుల్లారెడ్డి(సీపీ) తీసుకున్నారు. అప్పటి నుంచే సమస్యలు పొడసూపటమూ మొదలైంది. ఎందుకంటే సీపీ, ఎన్‌ఆర్‌లది పూర్తిగా భిన్నమైన శైలి. వాళ్ల మధ్య అస్సలు పోలికే లేదు. సీపీ నిరంకుశుడు. తను చెప్పటమే తప్పించి, ఆయనకు వినే అలవాటు లేదు. ఇప్పుడు వెనుదిరిగి చూస్తే` మేం పార్టీకి దూరమవడానికి ఎమర్జెన్సీనే ప్రధాన కారణమైనా, సీపీ కూడా దానికి బాగానే దోహదం చేశారనిపిస్తుంది. విప్లవమనేది ప్రజల మేలు కోసం అన్న భావనతో మేం పార్టీలో చేరాం. 1976 మార్చిలో సీపీ రహస్య స్థావరం మీద పోలీసుల దాడి జరిగింది. అప్పుడు ఆయన విడిగా కాకుండా ఒక ఉమ్మడి కుటుంబంలా వుంటే పోలీసులకు అంత అనుమానం రాదు, ఇబ్బందులు తక్కువన్న భావనతో` మేం నలుగురం అంబర్‌పేట్ ప్రాంతంలో కాస్త విశాలమైన మూడు గదుల ఇల్లు ఒకటి అద్దెకు తీసుకుని అందులో ఉంటే మేలని నిర్ణయించారు. అలా మేం నలుగురం ఒక ఇంట్లో కలిసి ఉన్నాం. ఆ సమయంలో సీపీ ప్రవర్తన, ఆయన సహచరి తీరు చూసి నా ఉత్సాహమంతా చప్పున చల్లారిపోయింది. వస్తూనే ఇంటి పెత్తనమంతా రాధక్క తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె తరచూ కోడి కూర వండేది. మేమేమో గొడ్డు మాంసం తినే అలవాటుతో పార్టీలో అడుగుపెట్టాం. మేమెప్పుడూ ఖరీదైన మాంసాహారం తినేవాళ్లం కాదు. సామాన్యులు, పేదలు ఏం తింటారో మేమూ అదే తినాలని నమ్మేవాళ్లం. రాధక్క తరచూ కొత్త బట్టలు కొని, వాటిని దర్జీ దగ్గరకు తీసుకుపోయి కుట్టిస్తుండేది. మేమేమో పార్టీ సానుభూతిపరులు ఇచ్చే, వాడిన దుస్తులే కట్టుకోవాలన్న నియమానికి కట్టుబడిన వాళ్లం. ఆమె షాపింగ్ కూడా చాలా ఎక్కువగా చేసేది. మాలో మేం ఆడా ` మగా అన్న తేడా లేకుండా పనులన్నింటినీ సమానంగా పంచుకునేవాళ్లం. కానీ ఇక్కడ రాధక్క సీపీ కోసం రోజూ స్నానానికి నీళ్లు పెట్టేది, సబ్బుతో ఒళ్లు రుద్దేది, తర్వాత టవల్‌తో తుడిచేది. ఆయనకు భోజనం వడ్డించి, వెనకాలే నిలబడి ఇంకా ఏంకావాలో చూసుకునేది. ఇంటి పనులన్నీ తనే చేసేది, ఆయన బట్టలు తనే ఉతికేది. ఆ దంపతుల్ని అంత సన్నిహితంగా చూసిన తర్వాత నాకు అనిపించింది` వీళ్లేనా ప్రజల్ని కొత్త జీవితంలోకి తీసుకువెళ్లగలిగేదీ, అందుకు నాయకత్వం వహించేదీ అని!
మేమంతా కలిసి ఉండటం మొదలుపెట్టిన ఓ పదిహేను రోజుల్లోపే నేను వీటి గురించి గొంతెత్తటం మొదలుపెట్టాను. ‘విముక్త ప్రాంతాల’ంటూ పార్టీ మాకెందుకు అబద్ధాలు చెబుతోందని సీపీని నిగ్గదీశాను. అక్కడ కేవలం పార్టీ ఆదేశాలే అమలవుతుంటాయనీ, రాజ్యానికి సంబంధించిన రెవెన్యూ, పోలీసు, పంచాయితీ వంటి విభాగాలేవీ ఉనికిలోనే ఉండవని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించటం మొదలుపెట్టాను. మాకేమో అడవులను పూర్తిగా విముక్తి చేశామని చెబుతున్నారు, కానీ అడవుల్లో ఉండి వస్తున్న క్యాడర్‌లో చాలామంది అక్కడ తలదాచుకునే వీలు కూడా లేక వెనక్కి వస్తున్నట్టు వాపోతున్నారు. మరి అక్కడ ఏం జరుగుతున్నట్టు? నగరానికి వచ్చిన క్యాడర్ ఇక్కడ మేం కూడా తీవ్ర ఇబ్బందుల్లో వున్నామని గ్రహించి ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే క్యాంపస్‌ను విముక్తి చేసినట్టు అక్కడ వాళ్లందరికీ చెప్పారంట. అలాగే సీపీని` మీకు అన్ని పనులూ రాధక్కే ఎందుకు చేస్తోందని అడిగాను. ఖరీదైన కోడి మాంసం ఎందుకు తింటున్నారు? వేసుకోటానికి కొత్త బట్టలు ఎందుకు కుట్టించుకుంటున్నారు? పార్టీలోని పేద క్యాడర్‌కీ, మీకూ మధ్య ఈ తేడాలేమిటి? ఇలా వేర్వేరు ప్రమాణాలు ఉండొచ్చా? అని ప్రశ్నించాను. వెంటనే సీపీ తను చదువుతున్న పుస్తకాన్ని గదిలో నేల మీద విస్సిరి కొట్టి… ‘‘వాళ్లీ పుస్తకం చదవగలరా? నవ్వూ నేనూ చదవగలం. వాళ్లు చదవలేరు. మమ్మల్ని జనం గాటన కట్టకు’’ అన్నారు. ‘‘వాళ్లూ, మనమూ ఒకటెలా అవుతాం.. మనం నాయకులం.. ’’ అంటూ మనం ప్రజలను ఎలా ముందుకు నడిపించాలి, వాళ్లు మన ఆదేశాలను ఎలా పాటించాలి, వాళ్లకంటే మనకు కొత్త విషయాలు ఎలా తెలుస్తాయి.. ఇలా పెద్ద ఉపన్యాసం చెప్పుకొచ్చారు. ‘మీకు తెలియని విషయాలు ఇంకా చాలా వున్నాయి, అవన్నీ మీరిప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది సాయుధ పోరాట కాలం. పనికి మాలిన చర్చలు పెట్టుకునే సమయం కాదు’ అన్నారు.
ఒకవైపు పార్టీలోని యువ క్యాడర్‌లో రకరకాల చర్చలు, తీవ్రస్థాయి అంతర్మథనం జరుగుతోంది, ఆ సమయంలోనే సీపీతో ఈ వాదులాటా జరిగింది. మేం క్రమంగా మా ఉద్యమంపైనే విమర్శలు ఎక్కుపెట్టటం మొదలుపెట్టాం. జార్జి రెడ్డి కాలం నుంచీ స్థానిక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుపక్కల బస్తీలన్నీ చూస్తుండగానే పార్టీకి రిక్రూటింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ఉద్యమాలు నిర్మించాలనే ప్రయత్నంగానీ, ఆలోచనగానీ ఎక్కడా కనబడలేదు. ఇతర ఎంఎల్ గ్రూపులతో కలసి పనిచేసేప్పుడు పైచెయ్యి సాధించటానికి మేం రకరకాల వ్యూహాలు పన్నుతుండేవాళ్లం. మేం బలంగా వున్నచోట దూకుడుగా ముందుకెళ్లి.. మిగతా వాళ్లెవరూ అక్కడ మిగలకుండా తరిమేసేవాళ్లం. అలాగే వాళ్లు బలంగా వున్న చోట్ల.. వాళ్ల కార్యక్రమాలను దెబ్బతియ్యాలని చూసేవాళ్లం. మేమే కాదు, ఇతర పార్టీలు మాపట్లా ఇలాగే ప్రవర్తించేవి. మా గ్రూపుల మధ్య సైద్ధాంతిక విభేదాల కంటే ఇతరాలే ఎక్కువ. ఉదాహరణకు మాకూ, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డిఎస్‌ఓ, సీపీఐ`ఎంఎల్ తరిమెల నాగిరెడ్డి గ్రూపుకు అనుబంధం), రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యు, పీపుల్స్‌వార్‌కు అనుబంధం)లకూ మధ్య ఉన్న విభేదాలు పెద్దగా సిద్ధాంతపరమైనవేం కాదు. మేం కొంతకాలం హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని బస్తీల్లో జి.ఎం.అంజయ్యతో కలసి పనిచేశాం. ఏదో పైకి అలా చెప్పాంగానీ, వాస్తవానికి వాళ్ల ప్రాంతాలనూ, పనినీ మా చేతుల్లోకి తీసేసుకోవాలని నానా ప్రయత్నాలూ చేశాం. చివరికి ప్రజల్ని సమీకరించటంలో ఘోరంగా విఫలమయ్యాం. అంజయ్య న్యాయవాది, మాజీ సోషలిస్టు. సికింద్రాబాద్ ప్రాంతంలో మురికివాడల్లో నివసించేవారి కోసం పని చేసేవాడు. వాళ్లకు ఇంటి పట్టాలు తెప్పించటం, నల్లా కనెక్షన్లు, కరెంటు కనెక్షన్లు ఇప్పించడం వంటి బస్తీ ప్రజల తక్షణ సమస్యల మీద పోరాడుతుండేవాడు. మంచి వక్త. మాట్లాడుతుంటే నిప్పులు చెరుగుతున్నట్టే ఉండేది. 1967లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసంఫ్‌ు టికెట్ మీద పోటీ చేశాడు. కొన్ని రియల్ ఎస్టేట్ దందాలు కూడా చేసేవాడని చెప్పుకొనేవాళ్లు. అతనితో కలసి పనిచేసేందుకు పార్టీ నన్నూ, శశినీ పంపించింది. మేం వాళ్లతో కలిసి చాలా బస్తీల్లో విస్తృతంగా పనిచేశాం. మెల్లగా తన నాయకత్వాన్ని పక్కనపెట్టి, జనాన్ని మా ర్యాలీలకు తీసుకుపోవటానికి ప్రయత్నిస్తుండటంతో.. ఆ విషయం పసిగట్టిన అంజయ్య మమ్మల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. మాతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోవద్దని తన అనుచరులను గట్టిగా ఆదేశించాడు కూడా.
మిగతా సంస్థల విషయంలో కూడా మా వైఖరి ఇలాగే వుండేది, అది రోజురోజుకూ మరింత సంకుచితం అవుతోంది కూడా. ఉదాహరణకు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్లు ఊరేగింపుల్లో ‘సాయుధ పోరాటం వర్థిల్లాలి!’, ‘నక్సల్‌బరి జిందాబాద్!’, ‘చైనా ఛైర్మనే మన ఛైర్మన్!’, ‘తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది!’ వంటి నినాదాలు ఇస్తుంటే మేం విమర్శించేవాళ్లం. కానీ మేం కూడా అలాంటి రెచ్చగొట్టే నినాదాలనే ఇస్తుండేవాళ్లం. నిజానికి ఈ నినాదాలన్నీ పోలీసుల ముందు మమ్మల్ని మేం బయటేసుకోవటానికి తప్పించి.. ప్రజలకు ఇవేం అర్థమయ్యేవీ కాదు, అంతుబట్టేవీ కాదు. గతంలో మేం నగరాల్లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది… అడవుల్లో ఉన్న మా దళాల మీద పోలీసుల ఒత్తిడిని తగ్గించేందుకేనంటూ ప్రజలు బాహాటంగానే చెప్పుకోటం, విమర్శించటం మొదలుపెట్టారు. అడవుల్లో ఉండే దళాలకు వేసవి చాలా కష్టకాలం. ఎక్కడో చిన్న కుంటల్లో తప్పితే నీళ్లు దొరకవు, పోలీసులేమో వాటి దగ్గరే మాటు వేసి ఉంటారు. అందుకే ఆ సమయంలో పార్టీ వాళ్ల దృష్టి మరల్చేందుకు రకరకాల కార్యక్రమాలు చేపట్టేదని చెప్పుకొనేవాళ్లు.
ఇక నా పనులు కూడా అంత ప్రజాస్వామికంగా ఏముండేవి కాదు. ప్రజలేం ఆశిస్తున్నారన్నది పట్టించుకోవటంగానీ, వాళ్ల అవసరాల పట్ల కాస్త సహానుభూతి చూపటంగానీ.. అలాంటివేం లేవు. నేనెంత సేపూ ప్రజల్ని పార్టీ లైన్‌లోకి ఎలా తేవాలన్న దాని గురించే ఆలోచించేదాన్ని. 1976 ద్వితీయార్థంలో దేశంలో ఎంఎల్ కార్యాచరణ అంతా కూడా` చాలావరకూ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవటం ఎలాగన్న దానిపైనే కేంద్రీకృతమైంది. సమాజంలో మార్పు తేవటం, ప్రజా సంక్షేమం వంటివన్నీ వెనకబాట పట్టాయి. నిర్ణయాలు, ఆదేశాలన్నీ పైనుంచే వచ్చేవి. పైనుంచి కింది వరకూ` అధికార క్రమం మొత్తం` చాలా స్పష్టంగా నిర్దేశితమై ఉన్న పార్టీలో ప్రజాస్వామిక పనితీరుకు అంతగా ఆస్కారం వుండదు. ఆ మాటకొస్తే సీపీ గ్రూపుకే చెందిన రామ నర్సయ్య అనే నాయకుడు ఓ సారి మా మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడి, అగ్ర నాయకత్వానికి ఫిర్యాదు కూడా చేశాడు. ‘‘గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లయితే మనం నుంచోమన్నప్పుడు నుంచుంటారు, కూచోమన్నప్పుడు కూచుంటారు. కానీ వీళ్లు (నగరాల నుంచి వచ్చిన వాళ్లు) అలాకాదు.. సాయుధపోరాటంలో కూడా చర్చలూ, గోష్ఠులూ మొదలెట్టగలం అనుకునే మహా సమర్థులు వీళ్లు’’ అని ఈసడిరచుకున్నాడు. వాస్తవానికి ఆచరణలోకి వచ్చేసరికి ‘ప్రజాస్వామిక కేంద్రీకరణ (డెమోక్రటిక్ సెంట్రలిజం)’ అన్నది కూడా సమస్యాత్మకమైనదే. సిద్ధాంతపరంగా చెప్పుకోటానికి చాలానే ఉంటుందిగానీ` మెజారిటీ తీసుకున్న నిర్ణయాన్ని లేదా నాయకత్వ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించటానికి వీల్లేదు. మనకే సందేహాలున్నా నిస్సంకోచంగా మన సెల్‌లో లేవనెత్తచ్చంటారు. దాన్ని మళ్లీ మళ్లీ సెల్‌లో చర్చకు పెట్టొచ్చంటారు. కానీ మనం ఆ విషయాన్నే పదేపదే లేవనెత్తుతుంటే.. చివరికి సెల్‌లోని మన సహచరులు కూడా విసుక్కోటం మొదలెడతారు. ఎందుకంటే సెల్‌లో జరిగే ఆ చర్చల వల్ల ఏ ఉపయోగమూ వుండదనీ, చివరకు విధానపరంగా ఎలాంటి మార్పులూ రావని వారికీ తెలుసు. అందుకే, ‘ప్రజాస్వామిక కేంద్రీకరణ’ అంటే వాస్తవంలో మరేం కాదు, ఒట్టి కేంద్రీకరణ విధానమనే అర్థం. నాయకత్వం కూడా ఫలానాది చర్చకు పెట్టటం తమకు ‘సమంజసమని’ భావించినప్పుడే అందుకు అనుమతిస్తుంది, దాన్ని అంగీకరిస్తుంది. నిజానికి ఈ ‘ప్రజాస్వామిక కేంద్రీకరణ’ అన్న ఒకే ఒక్క ఆయుధంతోనే వామపక్షాలు.. అంతర్గతంగా పార్టీలో వాదనలు, చర్చల వంటివేవీ లేకుండా భ్రష్టు పట్టించి, చివరికి తమను తాము ధ్వంసం చేసుకున్నాయి.
కళ్లకు గంతలు కట్టుకున్నట్టున్న నాటి రాజకీయాలను చూసిన తర్వాత.. ఇక మేం పార్టీలోనే కొనసాగితే ప్రజా ఉద్యమాన్ని విస్తృతం చేయటమనే ఆశయాన్ని సాధించటం చాలా కష్టమని గ్రహించాం. మార్క్సిస్ట్ ` లెనినిస్ట్ (ఎంఎల్) వర్గాల అవగాహన అంతా కూడా ప్రధానంగా మూడు సైద్ధాంతిక భావనల చుట్టూనే తిరుగుతుంటుంది.. అర్ధ భూస్వామ్యం (సెమీ`ఫ్యూడలిజం), అర్ధ వలసవాదం (సెమీ`కలోనియలిజం), దళారి బూర్జువా వర్గం (కాంప్రడర్ బూర్జువాజీ)… దేశంలో నెలకొన్న అణచివేత పరిస్థితులను వివరించేందుకు తరచూ మహా పర్వతాల్లాంటి ఈ మూడు భావనలనే ముందు పెడుతుంటారు! దశాబ్దాలుగా వల్లె వేస్తున్న ఈ మూడు పడికట్టు పదాలనూ వినీవినీ నాకు మహా చికాకు వచ్చేసింది. వరకట్న చావుల నుంచి రైతు ఆత్మహత్యల వరకూ.. ఏ సమస్య గురించి చర్చ మొదలుపెట్టినా చివరికి వాటన్నింటికీ ఈ మూడు మహా పర్వతాలే మూల కారణమని, మనం వీటిపైనే పోరాడాలని తేల్చేస్తారు. వినీవినీ చివరికి నా కలల్లోకి కూడా ఈ మూడు పదాలే వస్తుండేవి. ఈ డొల్ల సూత్రాల్లేకుండా ఏ సమస్యనూ విశ్లేషించే ప్రయత్నం కూడా చేసేవాళ్లు కాదు. పార్టీకి, పార్టీ కమిటీలకు సంబంధించిన ఏ డాక్యుమెంట్ చూసినా.. ఇదిగో.. ఈ ‘మూడు పర్వతాల’పై పోరాటమన్న మాట పంటి కింద రాయిలా పదేపదే తగులుతూనే ఉంటుంది. అలాగే పార్టీలో తరచుగా వినిపించే దిగ్భ్రాంతికరమైన విశ్వాసం మరోటి ఉంది. అన్నింటికీ ‘ఎండ్స్ జస్టిఫై ది మీన్స్’ అంటుంటారు. దీనర్థం మన లక్ష్యం మంచిదైనప్పుడు దాని సాధనకు మనం ఎలాంటి పద్ధతులను అనుసరించినా తప్పులేదని! నన్ను చాలా ఇబ్బందిపెట్టిన భావన ఇది. రాజ్యం అనుసరించే విధానాలనే మనమూ అనుసరిస్తుంటే.. దాన్ని ధ్వంసం చేసి మనం సరికొత్త రాజ్యాన్ని ఎలా నిర్మించగలం? విశాల ప్రాతిపదికన సామాజిక మార్పు కోసం ప్రయత్నించకుండా కేవలం అధికారాన్ని హస్తగతం చేసుకోవటమే లక్ష్యంగా పెట్టుకుని, ‘విప్లవం’ అనే వ్యూహాత్మక ఎత్తుగడ చుట్టూతానే పరిభ్రమిస్తుంటే సరిపోతుందా? హింస పట్ల పార్టీ వైఖరి విషయంలో కూడా నాకు తీవ్రమైన భేదాభిప్రాయం ఉంది. ఆలోచనారహితంగా సాగుతున్న మారణకాండకు సంబంధించిన కథలెన్నో విన్నాం. ఎక్కడా రాసి లేకపోయినా.. పార్టీ వర్గాల్లో దీనికి సమర్థనగా బలమైన వాదన కూడా వినిపిస్తుంటుంది, ముఖ్యంగా పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి. హింస ద్వారా భయోత్పాతాన్ని సృష్టించి, తదనంతరం వేగంగా మారిపోతుండే పరిణామాలను గమనిస్తూ పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని చెబుతుంటారు. కానీ ఎంఎల్ వర్గాలు సృష్టించే హింస వల్ల తీవ్రంగా దెబ్బతింటున్న బాధితులెవరంటే నిరుపేదలే. పైగా ఎంఎల్ హింస వల్ల` అట్నుంచి రాజ్య హింస మరింత పెరిగేది. భారత రాజ్యం దగ్గర అత్యాధునికమైన ఆయుధ సంపత్తి ఉంది, శక్తివంతమైన సైన్యం ఉంది. అది తన శక్తిసామర్థ్యాలకు సవాల్ విసిరేవారెవరినీ అంత తేలికగ్గా ఉపేక్షించదు. దానిపై హింసను ప్రయోగించాలను కోవటం వల్ల ప్రతికూల ఫలితాలే ఎక్కువయ్యాయి. ప్రాథమికంగా ఎంఎల్ ఉద్యమం ఉనికిలోకి వచ్చిందే ప్రస్తుత కమ్యూనిస్టు పార్టీలతో విభేదిస్తూ, వాటిని సవాల్ చేస్తూ. కానీ వాస్తవంలో సాయుధ పోరాటమనేది అంతిమంగా ఎవరో కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, వారిపై చిల్లరమల్లర హింసను ప్రయోగించేదిగా తయారైంది.
1976 నాటికి నేనూ, సిరిల్ పార్టీ విధానాల్లో లోపాలను ఎత్తిచూపుతూ విమర్శనాత్మకంగా కొన్ని డాక్యుమెంట్లను తయారుచేసి, వాటిని పార్టీలోని వివిధ కమిటీలకు పంపించటం మొదలుపెట్టాం. మాకు వ్యతిరేకంగా పార్టీ కూడా ఎంతో సాహిత్యాన్ని సృష్టించింది, వాటన్నింటికీ మేం మళ్లీ ఖండనలు సిద్ధం చేశాం. ఒకప్పుడు పార్టీలో ఎన్‌ఆర్ మా మాటలను ఎంతో శ్రద్ధగా వినేవారు, సానుకూలంగా ఆలోచించేవారు. కానీ పార్టీలో ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరైనా తమతో విభేదించారంటే చాలు, వెంటనే వాళ్ల పైన.. పార్టీలో సమస్యలు సృష్టించేవారిగా ముద్ర వేయటం మొదలుపెట్టారు. అత్యవసర పరిస్థితికి భయపడే, అణచివేతలకు బెదిరిపోయే వీరంతా పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. అయితే నాయకత్వం వినకపోయినా… మేం లేవనెత్తిన అంశాలు పార్టీలోని ఇతర యువ సభ్యుల మనసులను కూడా తొలుస్తూనే ఉన్నాయి. పార్టీ నిర్వహణ పనుల మీద విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలు వెళ్లిన వారు సైతం పార్టీ వ్యవహార శైలి మీద తమకూ అలాంటి అభిప్రాయాలే వున్నట్టు మాతో చెప్పారు. ఇలా పార్టీలో మాలా ఆలోచిస్తున్న వాళ్లు దాదాపు ఇరవై, ముప్ఫై మంది వరకూ ఉన్నారు, కాకపోతే వాళ్లెవ్వరూ బయటపడేవారు కాదు. మేమిద్దరమే మా వైఖరి ఏమిటో స్పష్టం చేస్తూ బహిరంగంగా డాక్యుమెంట్లను పంచుకున్నాం. దీంతో పార్టీ మమ్మల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని, మమ్మల్ని పార్టీలో చిచ్చుపెట్టేవాళ్లుగా చిత్రించటం మొదలుపెట్టింది. మాకు నెలకు ఇచ్చే 150 రూపాయల పార్టీ స్టైపెండ్‌ని నిలిపేశారు. మమ్మల్ని ఎవరూ కలవకూడదని ఆంక్షలు విధించారు.
విప్లవోద్యమాలలో హింసపై ఒక వైఖరి తీసుకునే విషయంలో నేను ఇప్పటికీ చాలా జాగ్రత్తగా, ఆచితూచి వ్యవహరిస్తాను. హింసను సమర్థించక తప్పని సందర్భాలు కొన్ని వుండొచ్చు. ఎలాంటి సందర్భాల్లో అని మీరు నన్ను నిలదీస్తే వెంటనే చెప్పలేక, కాస్త బుర్ర చించుకోవాల్సి రావచ్చు. అయితే నేను పనిచేసిన ఉద్యమంలో గానీ, నేను సన్నిహితంగా గమనించిన పీపుల్స్ వార్ గ్రూప్ (పీిడబ్ల్యూజీ) కార్యకలాపాల్లో గానీ ఉపయోగించిన హింస ఏమాత్రం సమర్థనీయం కాదని ఖచ్చితంగా చెప్పగలను. ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికి అప్పటికప్పుడు ప్రజ్వరిల్లే హింసాత్మక ఘటనల గురించి నేను మాట్లాడలేనుగానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ చేసిన హింస మాత్రం అతి క్రూరమైనది, ఉద్దేశపూర్వకమైనది, అవసరం కంటే ఆధిపత్య ప్రకటన కోసం చేసిందే ఎక్కువ. మేం నగరంలో ఎప్పుడూ హింసను ఆశ్రయించలేదు, మాలో ఎవరి దగ్గరా మారణాయుధాలు లేవనుకోండి. అయినా క్రూరంగా సాగిపోయిన హింసాకాండ గురించి చాలానే విన్నాం. ఓ స్థానిక దళ సభ్యుడు చేసిన పొరపాటు వల్ల సత్యనారాయణ అనే సీనియర్ పీడీఎస్‌యూ కామ్రేడ్‌ని విప్లవ ద్రోహిగా భావించి, వరంగల్ ప్రాంతంలో సొంత పార్టీ దళ సభ్యులే కాల్చిచంపేశారు. ఎమర్జెన్సీ సమయంలో నేను పార్టీ సిటీ యూనిట్ కార్యదర్శిగా వున్నప్పుడు చలపతిరావు అనే కామ్రేడ్ పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నాడని తెలిసింది. అతను గనక లొంగిపోతే పార్టీ రహస్య స్థావరాలు ఎన్నో బయటపడతాయి. ఆ సందర్భంగా జరిగిన ఒక సమావేశంలో నేనే స్వయంగా ‘అతణ్ని ఎందుకు చంపేయకూడదు?’ అని ప్రశ్నించాను. పెద్ద ఊరట ఏమిటంటే అదృష్టవశాత్తూ ఆ రోజు మిగతా పార్టీ సభ్యులెవరూ నా అభిప్రాయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత చాలా ఏళ్లకు నేను మళ్లీ చలపతిని కలిసి, మా స్నేహాన్ని పునరుద్ధరించుకున్నప్పుడు` తనతో మొట్టమొదటగా చెప్పిన విషయమే దీని గురించి. ఆ నాడు పార్టీ మీటింగులో నీ గురించి నేనిలా సూచించానని తనతో చెప్పేసిన తర్వాత, నా తల మీది నుంచి పుట్టెడు బరువు దించుకున్నట్లుగా.. ఎంతటి ఉపశమనం పొందానో మాటల్లో చెప్పలేను.
హింసావాదం మీద 1975`76లతో పోలిస్తే ఇవాళ చాలా స్పష్టత వుందని చెప్పుకోవచ్చు. నర్మదా బచావో ఆందోళన్, ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా, చిప్‌కో వంటి అనేక ఉద్యమాలు.. ప్రజా ఉద్యమాలను ఎలా ప్రభావవంతంగా నిర్వహించవచ్చో చాటిచెప్పాయి. ఏ విప్లవోద్యమానికైనా ప్రజలే ప్రాణాధారమనీ, ఏ విప్లవ పార్టీకైనా ప్రజాస్వామిక విధానాలను అనుసరించటం అత్యంత కీలకం, శ్రేయోదాయకమని అవి నిరూపించి చూపాయి.
పార్టీ మా మీద అంతకంతకూ శత్రు వైఖరిని పెంచుకుంటూ పోతుండటంతో మాకు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఈ ఉద్యమం కోసమని విద్యార్ధులుగా మా బృందంలోని ప్రతి ఒక్కరం ఎంతో వదులుకుని వచ్చినవాళ్లం. మమ్మల్ని వేధించి అవమానిస్తామంటే సహించి
ఉండాల్సిన అవసరం లేదు. మనం ప్రజలతో కలసి ఎలా పనిచేయాలి? మన కార్యాచరణ ఏ విధంగా వుండాలి? ఉద్యమాన్ని ప్రజలు తమదిగా భావిస్తున్నారా, లేదా? ఉద్యమ పగ్గాలు ప్రజల చేతుల్లో ఉంచేందుకు మనమేం చెయ్యాలి? ప్రజల హృదయాలకూ, వారి జీవితాలకూ సన్నిహితంగా వుండటం మన ఉద్యమ ఎజెండా కావాలి కదా? వీటి గురించి మాలో మేం చాలా మథనపడుతుండేవాళ్లం. కానీ పార్టీలో మాత్రం ఇవి ఎన్నడూ సరిగా చర్చకు వచ్చేవి కాదు. ఎంతసేపూ మా పార్టీ కార్యక్రమాలను ప్రజల దగ్గరకు ఎలా తీసుకెళ్తున్నామన్నది తప్పించి వాళ్లకు మరోటి పట్టేది కాదు. పొద్దున లేచిన దగ్గర్నుంచీ` ప్రజలకు మనమేం చెప్పాలి, ప్రజల సమీకరణలో మన వ్యూహాలు ఎలా ఉండాలి? పార్టీకి మరింత ప్రయోజనం కలిగేలా ఎలా చూడాలి?.. ఇలా మా ఆలోచనలన్నీ వీటి చుట్టూతానే తిరిగేలా, గిరి గీసుకున్నట్టుగా మేం పూర్తిగా వీటిలోనే నిమగ్నమయ్యేలా చూసేవారు. మొత్తమ్మీద దీని గురించి పార్టీలో పరిస్థితి కొద్దిగా ఉద్రిక్తంగానే వుండేది. మేం పార్టీలో చేరిన కొత్తలో మావో రచనలు చాలా ప్రాచుర్యంలో వుండేవి. మావో రచనలు స్థూలంగా ప్రజల పట్ల మనకు గౌరవం ఉండాలని, సమాజంలో పరిస్థితుల పట్ల వాస్తవికమైన అంచనా చాలా ముఖ్యమని నొక్కిచెబుతుండేవి. కానీ పార్టీ పంథాగానీ, ప్రణాళికలు గానీ ఎక్కడా ఈ సూత్రాలకు దగ్గరగా ఉండేవి కాదు. రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవటమే పరమావధిగా, అందుకోసం పార్టీ ప్రభావ పరిధిని విస్తరించుకోవటం, క్యాడర్ బలాన్ని పెంచుకోవటం మీదే ప్రధానంగా దృష్టి పెడుతుండేవాళ్లు.
దీని గురించి మేం పైశ్రేణి నాయకత్వానికి ఎప్పటికప్పుడు చెబుతూనే వచ్చాం. ‘మేమిందుకు సిద్ధంగా లేం. మనం ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సింది ఈ రకం నినాదం కాదు.. పైనుంచి వస్తున్న ఈ రకం ఆదేశాలు, ప్రణాళికలు, కార్యాచరణతో మేం అంతగా ముందుకు వెళ్లలేం’ అని చాలాసార్లు చెప్పి చూశాం. నిజానికి మేమేం విప్లవం ఆవశ్యకతను ప్రశ్నించలేదు. విప్లవం అవసరమా? కాదా? అన్న చర్చేం పెట్టలేదు, అలాగే సాయుధ పోరాట పంథానూ ప్రశ్నించ లేదు. కేవలం పార్టీ అనుసరిస్తున్న వ్యూహం గురించే విమర్శనాత్మకంగా వాదించాం. ఇలా చాలాకాలం నడిచింది. చివరికి మేం పార్టీ నుంచి బయటకు వచ్చేసినప్పుడు` ఇక ఎలాంటి నియంత్రణలూ, బంధనాలూ లేకుండా స్వేచ్ఛగా ప్రజలతో కలసి పనిచేయాలనీ, పైనుంచి వచ్చే నిర్దేశాలూ, నినాదాల కోసం పని చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాం. ఈ విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రజలు తమకు తాముగా వచ్చి మా వెంట నడవాలని మేం కోరుకోలేదు. కానీ ఇక మీదట మేం ప్రజలు కోరుకునే కార్యక్రమాలపైనే పని చేయాలనీ, వాళ్లు ముందుకు సాగడానికి అవసరమైన సాయం మాత్రమే మేం అందించాలని అనుకున్నాం.
1976 నవంబర్‌లో సిరిల్, నేనూ, మరో ఇరవై`ముఫ్పై మందిమి పార్టీ నుంచి బయటికి వచ్చేశాం. అట్నుంచి పార్టీ కూడా మమ్మల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అది మేం ఊహించిందే. జనం తనను వదిలేసి పోతున్నారన్న వాస్తవాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోయింది. ఇక మేం హైదరాబాద్ వదిలేసి వెళ్లిపోక తప్పదు. ఎందుకంటే ఇక్కడ వుండేందుకు మా దగ్గర డబ్బు లేదు, షెల్టర్ కూడా లేదు. ఒకవైపు పోలీసులూ, మరోవైపు మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్న పార్టీ.. ఈ రెంటికీ మధ్య నలిగిపోతూ మేం ఇంక హైదరాబాద్‌లో వుండటం శ్రేయస్కరం కాదని భావించాం. మా విద్యార్థి గ్రూపుల్లో చాలామంది పార్టీని వదిలిపెట్టేశారు. మరెంతో మంది ప్రభుత్వ యంత్రాంగానికి లొంగిపోయారు లేదా చడీచప్పుడు కాకుండా పక్కకు తప్పుకున్నారు.
నేనుగానీ, సిరిల్‌గానీ రాజకీయాలకు అతీతంగా, వాటికి దూరంగా జరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకోలేదు. ఇద్దరం ప్రజలతో కలసి పనిచేయాలనే నిర్ణయించుకున్నాం, అందుకు మా ఇద్దరికీ, ఎవరికి వాళ్లకే బలమైన కారణాలున్నాయి. తను మొదట్లో తన అన్న జార్జి రెడ్డి ఆశయాలను నెరవేర్చాలన్న లక్ష్యంతో విప్లవోద్యమంలోకి ఫుల్‌టైమర్‌గా వచ్చాడు, క్రమంగా అదే తన విశ్వాసంగా మారిపోయింది. ఇక నా విషయానికి వస్తే దారులన్నింటినీ నేనే బాహాటంగా ధ్వంసం చేసుకున్నాను. ఇంక మా కుటుంబం వైపు తిరిగి వెళ్లే అవకాశమే లేదు.
1976 డిసెంబర్‌లో మేమిద్దరం హైదరాబాద్‌ను వదిలిపెట్టేసి చండీగఢ్‌కు ప్రయాణమయ్యాం. సిరిల్ పెద్దన్నయ్య కార్ల్ అక్కడే వుంటారు. అదో దుర్భర ప్రయాణం. మాకున్న కొద్దిపాటి సామాన్లూ రెండు సంచుల్లో కుక్కుకుని రైలెక్కాం. పోలీసుల నిఘా కళ్లను తప్పించుకునేందుకు నానా రూట్లలో అష్టకష్టాలు పడుతూ వెళ్లాం. అసలు ఏ రూట్‌లో వెళితే మంచిదన్న దానిమీదే నాకూ, సిరిల్‌కూ పెద్ద గొడవ అయ్యింది. మధ్యప్రదేశ్ ఇటార్సీ జంక్షన్‌లో ట్రైన్ మారే సమయానికి మా గొడవ తారాస్థాయికి చేరింది. చుట్టుపక్కల వాళ్లంతా మావంక వింతగా చూస్తుండగానే.. మేమిద్దరం మా సంచుల్లోని దుస్తుల్ని, వస్తువుల్ని తీసి ప్లాట్‌ఫాం మీదకు విసిరికొట్టేసుకున్నాం. మళ్లీ మేమే ఎలాగోలా సర్దుకున్నాం. ఆ ప్రయాణ సమయంలోనే నాకు తొలిసారి సిరిల్ కుటుంబం గురించి చాలా వివరాలు తెలిశాయి.
వాళ్లు మొత్తం ఐదుగురు సంతానం. నాకు వాళ్ల పెద్దన్నయ్య కార్ల్, ఆయన భార్య సత్వంత్ ముందే తెలుసు. జార్జి రెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. ఇక వీళ్లందరికంటే పెద్దామె డాన్ (ఆమెను ఇంట్లో జిప్సీ అనీ పిలుస్తారు), ఒక ఒరియా వ్యక్తిని పెళ్లి చేసుకుని, భువనేశ్వర్‌లో టీచర్‌గా పనిచేసేది. తర్వాత ఒడిషాలోని జయ్‌పుర్‌లో తనే సొంతంగా ఒక స్కూలు ప్రారంభించింది. ఇక మూడో సంతానం, సిరిల్ మరో అక్కయ్య జాయ్ (లావణ్య). ఆమె కన్నడ వ్యక్తిని పెళ్లి చేసుకుని, మైసూర్‌లో స్థిరపడిరది, అక్కడే పరిశోధకురాలిగా, అధ్యాపకురాలిగా పని చేసింది. నాలుగో సంతానం జార్జ్. అందరికంటే చిన్నవాడు సిరిల్. జిప్సీ, లావణ్య ఇద్దరూ కూడా తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచే వాళ్లు. కేవలం పార్టీ శరణార్థులకే కాదు, తమ చుట్టు పక్కలుండే పేదవాళ్లందరికీ అండగా ఉండి, ఆశ్రయం ఇస్తుండేవాళ్లు. పేద పిల్లలకు చదువు చెవ్పించేవాళ్లు, వాళ్లకు ఉపాధి దొరికే వరకూ సాయంగా నిలబడేవాళ్లు. వీళ్ల బాల్యం చాలా కష్టాలతో గడచింది. బ్రాహ్మణీయ వ్యవస్థ బాంధవ్యాలను ఎంతలా ధ్వంసం చేయగలదో, పసిపిల్లల్ని ఎలా దిక్కులేని వారిగా మారుస్తుందో వాళ్లు ప్రత్యక్షంగా చూశారు, ఆ బాధలన్నీ స్వయంగా అనుభవించారు. అందుకే ఈ వ్యవస్థ మార్పు కోసం కృషి చేసే ఏ వ్యక్తికైనా, ఏ ఉద్యమానికైనా తమవంతు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్లు. అలా వాళ్లు మాకెంతో మద్దతిచ్చారు, సిరిల్ చనిపోయిన తర్వాతా అది అలాగే కొనసాగింది.
చండీగఢ్‌లో మాకు ఉపాధి దొరికే వరకూ ప్రతి నెలా స్టైపెండ్‌గా కొంత డబ్బు ఇస్తానన్నారు కార్ల్. వాళ్ల ఇంట్లో ఉండటం మాకు అంత సురక్షితం కాదని భావించి, మేమే ఓ గది అద్దెకు తీసుకుని దూరంగా ఉన్నాం. ఆయన ఇచ్చే డబ్బుతో అద్దె కట్టుకుంటూ, మా ఇతరత్రా అవసరాలు తీర్చుకుంటూ వుండేవాళ్లం. అక్కడే మేం పేద ప్రజలతో కలసి పనిచేయాలనుకున్నాం. ఎవరి దాతృత్వం మీదా ఆధారపడకుండా అలా పని చేయటానికి మార్గాలు ఏమున్నాయో అన్వేషించటం మొదలుపెట్టాం. మేం అక్కడే ఉండి, సురక్షితంగా ఏదైనా పని చెయ్యాలంటే కొత్త గుర్తింపు అవసరం. ఎమర్జెన్సీని అంత త్వరగా ఎత్తేసే పరిస్థితులుంటాయని మేమెవ్వరం ఊహించలేదు. అప్పటికే పి.కె.మూర్తి, నీతా` ఇద్దరూ మారు పేర్లు, గుర్తింపులతో సెంట్రల్ మధ్యప్రదేశ్‌లో పని చేస్తున్నారని విన్నాం. మూర్తి తమిళ మూలాలున్న వియత్నాం పౌరుడు. విప్లవోద్యమంలో పాల్గొనాలన్న ఆకాంక్షతో భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొంబాయికి చెందిన నీతాను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ సీపీ గ్రూపులో చేరి, సెంట్రల్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో పని చేసేందుకు వెళ్లారు. అక్కడ ఆయన గని కార్మికుడిగా పనిచేశాడు. (ఆయన 2020లో చనిపోయాడు). మరోవైపు శంకర్ గుహ నియోగి ఛత్తీస్‌గఢ్‌లో స్వతంత్రంగా కార్మికోద్యమాన్ని నిర్మించారు. ‘ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా’ కార్యాచరణలో భాగంగా ఆయన కార్మిక వర్గ కుటుంబాలకు విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలను కూడా చేర్చి, ఆ దిశగా కృషి చేయటం ఆరంభించారు. మమ్మల్ని ప్రభావితం చేసిన కొన్ని ఉదాహరణలివి.
చండీగఢ్‌లో కొత్త గుర్తింపును సృష్టించుకోవటం కోసం నేనూ, సిరిల్ పంజాబీ భాషను నేర్చుకోవడం మొదలుపెట్టాం. పంజాబీలో పదో తరగతి పరీక్షలు రాసి, ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులమయ్యాం కూడా. అయితే ఆ కొత్త గుర్తింపు కాగితాలకే పరిమితమైంది, మేం ఎక్కడా దాన్ని వాడాల్సిన అవసరం రాలేదు. తర్వాత కొద్దిరోజులకే 1977లో అత్యవసర పరిస్థితిని ఎత్తేయటం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీని ఓడిరచి జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవటం చకచకా జరిగిపోయాయి. అయినా కూడా మేం వెంటనే చండీగఢ్‌ను వదిలిపెట్టేసి రాలేదు. మా మీద నిఘా కొనసాగడం లేదని నిర్ధారణ అయ్యేంత వరకూ అక్కడే వుండి, ఆ తర్వాత వచ్చాం.
అత్యవసర పరిస్థితి వల్ల నాకు జరిగిన అతిపెద్ద నష్టం ఏమిటంటే నా గొంతు మూగపోవడం! ఎమర్జెన్సీ మొదలైన నాటి నుంచీ నేను జనంలో ధీమాగా, బహిరంగంగా ఎన్నడూ మాట్లాడిరది లేదు. ఆ తర్వాత కూడా ఎక్కడైనా వేదిక ఎక్కి మాట్లాడాల్సి వస్తే నా గొంతు పెగిలేది కాదు. ఇది కేవలం గొంతు సహకరించకపోవటమే కాకపోవచ్చు. ఒకప్పుడు మేం ప్రగాఢ విశ్వాసంతో తోటి విద్యార్థుల్లో, బస్తీ జనంలో ఎంతో ఉధృతంగా ప్రచారం చేసిన విప్లవ రాజకీయాల మీదే నా నమ్మకాలు సడలిపోవటం వల్ల అలా జరిగిందేమో అనుకుంటాన్నేను. అక్కడి నుంచీ నాకు` ఉపన్యాసాలు దంచికొట్టి, ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసి, ఆ తర్వాత వారిని అసంభవ పరిస్థితుల్లోకి నెట్టేసే చదువుకున్న వాళ్లంటే తీవ్రమైన అపనమ్మకం, అసహనం పెరిగిపోయాయి.