గోళ్లమూడి రామచంద్రరావు
కుటుంబరావు గారితో నా పరిచయం ఎక్కువకాలం లేదు కాని ఉన్నంతవరకు చాలా సన్నిహితంగా ఉండేది. ఆయన వ్యక్తిగతంగా చాలా కలుపుగోలు మనిషి. అందువలన ఆయన తత్వం బాగా అర్థం చేసుకున్నానని అనుకుంటున్నాను. ఆయన ఎంత యధార్థవాదో అంత సెంటిమెంట్సు ఉన్నవారు.
ఏ రచనలోనైనా ఒక ప్రత్యేకత ఉంటే చాలు అని ప్రచురణకు స్వీకరించేవారు. సాహిత్యప్రయోజనం లేని రచనలను ఆయన అంతగా ఇష్టపడేవారు కాదు. సిద్ధాంతాల ఒత్తిడికి లొంగిపోకుండా విషయాన్ని వ్యక్తీకరించేవారు. ఒక సమస్యను ముఖ్యవస్తువుగా తీసుకున్నప్పుడు దానికి అనువయిన పద్ధతిలో తన రచనను మలిచేవారు. రామాయణం, భారతం, భాగవతాలను చరిత్రగానే భావిస్తూ, వాటిలోని కొన్ని సంఘటనలు తీసుకుని సామాజిక సంస్కారాన్ని సాధించటం కోసం తిరగరాశారు. వాటిలో చెప్పుకోదగినవి ‘అశోకవనం’, ‘హరిశ్చంద్రుడి ఆత్మ’, ‘జాంబవంతుడి కల’, ‘బకాసుర’.
‘బకాసుర’ నవలలో రాజు బకాసురుడిని యితర రాజుల దాడినుంచి తన రాజ్యాన్ని కాపాడే రక్షణకవచంగా వాడుకోవటం, విరాటరాజు కీచకుడిని వాడుకోవటంలా కనిపిస్తుంది. కుటుంబరావు ఒకచోట అంటారు : ‘బకాసురుడు ఏకచక్రపురానికి పెట్టనికోట. వాడు మూడు అక్షౌహిణుల సైన్యానికి తుల్యుడు. వాడే చతురంగ బలాలూను. అందుకే వాడు రాజుగారికి దివ్యమైన అంగరక్ష, వాడు పోవటానికి వీల్లేదు. వాడి ఖర్చు ఏడాదికి మూడువందల అరవైమంది ప్రాణులు! కారుచౌక!’ అంతేకాకుండా ఈనాడు ప్రమాద పరిస్థితులని రాజకీయనాయకులు, వ్యాపారస్థులు, ఇతర వర్గాలు స్వప్రయోజనాలకు వాడుకుని అసలు సహాయనిధులని, వస్తువులని మింగేసి బాధితులకు అందకుండా చేసే కుట్రలు కూడా బకాసురలో సూచించబడ్డాయి. పాలకులు చెయ్యని పనులు ప్రజా ఉద్యమాలు నిర్వర్తించాలన్నది కూడా ఆయన సూచించారు. పాత వస్తువుకి ఆయన యిచ్చిన కొత్తరూపం నాకెంతో నచ్చింది.
కుటుంబరావు గారు తెనాలిలో పెరిగారు. అక్కడి సాహిత్య వాతావరణం విషయ పరిశోధనకు చర్చలకి అనుకూలంగా ఉండేది. అందువలన ఆయనలో బహుముఖ పరిజ్ఞానం, నిశిత పరిశోధన మొదటినుంచి చోటుచేసుకున్నాయి. ఆయన సైన్సు చదువుకోవటం వలన శాస్త్రీయదృక్పథం ఏర్పడింది. అయితే ఆయన హేతువాదం పేరుతో యితర విషయాలని ఉపేక్షించేవారు కాదు. దేనికైనా అనుభవమే గీటురాయని అనేవారు. ఆయన ‘బుద్ధికొలత’ వ్యాసాలు రాసినప్పుడు కొందరు ‘వీరహేతువాదులు’ ఆయన మీద దుమ్ము ఎత్తిపోయటం జరిగింది. దానికి వారు తగిన సమాధానం యిచ్చారు కూడా. సంగీతం – ముఖ్యంగా హిందూస్తానీ సంగీతం అంటే ఆయన ఎంతో యిష్టపడేవారు. హోమియోపతి అన్నా ఆయనకి మంచి అభిమానం, అందులో ఆయనకు ప్రావీణ్యత ఉండేది. వాటికి సంబంధించిన విషయాల్నికూడా తన రచనలలో ప్రస్తావించేవారు. ఆంధ్రపత్రికలో సాధారణంగా వచ్చే రకరకాల జబ్బులకు చికిత్సలు సూచిస్తూ అనేక వ్యాసాలు రాశారు. కుటుంబరావుగారూ నేనూ ఆంధ్రపత్రికలో దాదాపు మూడేళ్ళు, 50వ దశకంలో, కలిసి పనిచేశాం. మొదట్లో కొద్దికాలం వారు దినపత్రికలో ఉండేవారు. తర్వాత ఆయన వారపత్రిక సారథ్యం తీసుకుని దాని రూపురేఖలని పూర్తిగా మార్చివేసి అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దినపత్రిక సగం సైజులో ఉండే వారపత్రికని యిప్పుడున్న ఏ-4 సైజుకి కుదించారు. కవర్‌పేజీ మీద సినిమా తారల బొమ్మలు వేయడం అప్పుడే ప్రారంభమైంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రచనలను తెలుగు వాడుకభాషలో అనువాదం చేయించి సీరియల్స్‌గా వేశారు. దానితో పత్రిక సర్క్యులేషన్ వెయ్యి పై చిలుకున్నది పాతికవేలకు పైగా అనూహ్యంగా పెరిగింది. వారపత్రిక ఎలా ఉండాలి అనేదానికి ఒరవడి సృష్టించింది కుటుంబరావు గారే అని నా అభిప్రాయం. నేను ఇమాజనరీ ఇంటర్యూల రూపంలో అనేక గ్రంథాలకు సంబంధించిన విషయాలను హాస్యధోరణిలో రాశాను. ఆయన నా పద్ధతిని ఎంతో మెచ్చుకుని వాటిని ప్రచురించారు. ఆ రోజుల్లో మాతోపాటు ఆంధ్రపత్రికలో సూరంపూడి సీతారాం, పిలకా గణపతిశాస్త్రి, తెన్నేటి సూరి, తిరుమల రామచంద్ర, మద్దాలి సత్యనారాయణశర్మ, నండూరి రామమోహనరావు, ముళ్లపూడి మొదలైన సుప్రసిద్ధ పాత్రికేయులు పనిచేస్తుండేవారు. కుటుంబరావు గారితో నేను పనిచేసిన ఆ రోజులు నా జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి.
మాకు చాలా భావసామీప్యత ఉండేది. ఆయన ‘చందమామ’కు సారధ్యం స్వీకరించేందుకు ఆంధ్రపత్రికను వదిలివెళ్లారు. నేను ఆకాశవాణి (ఢిల్లీ)లో చేరాను. అయినా వారు చివరిరోజుల వరకు తన కుటుంబవిషయాలు కూడా నాతో సంప్రదిస్తూ, నామీద ఎంతో అభిమానంతో ఉండేవారు. ఇది నేను ఎప్పుడూ మరిచిపోలేని విషయం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags