సరంధి

కొ.కు
నేను మొదటిసారి జానకిని చూసింది మా పెత్తల్లి కొడుకు పెళ్ళిలో. మనిషి సన్నగా నాజూకుగా, ఆకర్షవంతంగా కనబడింది.
అప్పటికింకా జానక్కి పెళ్లికాలేదు.
”చక్కని పిల్ల. ఎంత అదృష్టవంతుడికి రాసిపెట్టి ఉందో!” అన్నది మా అమ్మ ఎవరితోనో.
”ఇంకేం నీ కొడుక్కే చేసుకో” అన్నది ఆ రెండో ఆవిడ.
”ఇంకా నయం!” అన్నది మా అమ్మ.
జానకి నా యీడుదేనని నేను అర్థం చేసుకున్నాను.
మా పెత్తల్లి అల్లుడికి జానకి ఏమవు తుందో నాకు సరిగా తెలీలేదు. అంత పెద్ద దగ్గిర చుట్టం కాదనుకుంటాను.
ఆ పెళ్ళిలో మందనంతకీ కలిపి ఒక గ్రూపు ఫోటో తీశారు. ఆ ఫోటో కాపీ మా పెత్తల్లి గారింట్లో చూశాను. ఫోటోలో జానకి అందరిలాగే ఉంది. ప్రత్యేకత ఏమీ లేదు. ఆ ఫోటోలో మా బంధువులే నాకు అపరి చితులల్లే కనబడ్డారు మరి. పెళ్ళి కొడుకు వైపు వాళ్ళ మాట చెప్పేదేమిటి?
ఎవరో ఆవిడ జానకిని నాకు చేసుకో మనటం జ్ఞాపకం వస్తే తలలో కాస్త కితకిత కలిగేది. అది కూడా సమసి పోయింది.
ఆ తరవాత పూర్తిగా పదేళ్ళకు నేను మద్రాసులో ఒక సినిమా థియేటరు దగ్గిర జానకిని మళ్ళీ చూశాను. మళ్ళీ చూడటం అన్న మాటకు నిజంగా అర్థం లేదు. ఎంచేతనంటే ఇదే అసలు చూడటం.
జానకిని చూడగానే మాడుమీద ఎవరో బలంగా కొట్టినట్లు తల తిరిగిపోయింది. ఆమెలో అంత ఆకర్షణ ఉన్నది. ముఖ్యంగా ముఖంలో, కాకపోతే చూపులో. ఆ ఆకర్షణ ఎక్కడ ఉన్నదీ నాకే స్పష్టంగా తెలీదు.
నూటికి తొంభై తొమ్మిది ముఖాలలో నాకు జైలు నీడలు కనిపిస్తాయి. ముఖంలో నుంచి ఆత్మ తొంగి చూస్తుందంటారు! అది అక్షరాలా నిజం, పసిపిల్లల ఆత్మలు నిర్మలంగా ఉంటాయి. గనకనే వాళ్ళ ముఖాలు అందంగా ఉంటాయి. పూర్వం చైనావాళ్ళు ఆడవాళ్ళ పాదాలను బంధించినట్లు, కొందరు రాక్షసులు రెండేళ్ళయినా నిండని తమ పిల్లల ఆత్మలను బంధించేస్తారు. అలాంటి పిల్లల ముఖాలు చూసినప్పుడల్లా వాళ్ళ తల్లిదండ్రులను కుంచీపాప నరకానికి పంపితే ఎంత బాగుండును అనిపిస్తుంది. పిల్లల ముఖాలు వికసించిన పువ్వుల్లా ఉండాలి. ఆ మాటకు వస్తే పెద్దవాళ్ళ ముఖాలూ అలాగే ఉండాలి.
జానకి ముఖం, సినిమాహాలు దగ్గిర చూసినప్పుడు వికసించిన డాలియా లాగుంది.
డబ్బుంటే ముఖాలు నిజంగా వికస్తిస్తా యనుకోను. డబ్బు తాలూకు కాలుష్యం కూడా ముఖాలలో కనిపిస్తుంది. దారిద్య్ర బాధవల్ల ముఖాలు ముడుచుకు పోవచ్చు. కాని, ఏ కాస్త ఆనందం లభించినా పేదవాళ్ళ ముఖాలు కూడా విచ్చుకున్న పూలల్లేనే ఉంటాయి. ఆ మాటకు వస్తే కార్లలో తిరిగే ముఖాల్లో నిజమైన ఆనందం చూసినట్టు నాకెక్కడా కనిపించలేదు.
డబ్బు సుఖాలివ్వగలదేమోగాని ఆనందం ఇవ్వలేదేమో ననుకుంటున్నాను.
జానకిని నేను గుర్తించలేదు. అందు చేత పలకరించాలని కూడా అనిపించలేదు. ఆమె నాకేసి తేరిపార చూసేసరికి అపోహ కూడా పడ్డాను.
ఆమే నన్ను పలకరించింది.
”మీరు రాధకు అన్నకాదూ?”
మా పెత్తల్లి కూతురు పేరు రాధ. అది కూడా గుర్తు రాలేదు.
”ఏ రాధ!” అన్నాను అయో మయంగా.
”మీ రాధ అన్ననే కదటండీ, మా సావిత్రి చేసుకున్నది? మీరు పెళ్ళికి వచ్చారు కూడా కదూ!”
”మిమ్మల్ని చూసినట్టు గుర్తు రావటం లేదు” అన్నాను.
”చాలా ఏళ్ళయింది, పెళ్ళి పందిట్లో నన్నసలు చూశారో లేదో!”
”మీ పేరు?”
”జానకి.”
ఆ ముచ్చు ముఖం ఇట్లా తయారవు తుందంటే మా అమ్మను బతిమాలి అయినా చేసుకునేవాణ్ణి.
”మీ జ్ఞాపక శక్తి -”
నా మాట పూర్తి కాకుండానే, ”ఆ పెళ్ళి ఫోటో మా ఇంట్లో ఉంది. మా నాన్న పోయాక దానికి చాలా విలువొచ్చింది. మా నాన్నకు అది తప్ప మరో ఫోటో లేదు. అందుచేత దాన్ని సొరుగులోనుంచి తీసి, ఫ్రేం కట్టించి, గోడకు తగిలించి, రోజూ తుడిచేదాన్ని. తుడిచినప్పుడల్లా మీ వేపు వాళ్ళందరినీ గుర్తుకుతెచ్చుకునేదాన్ని. అందులో వాళ్లు ఈనాడు ఏడెనిమిది మంది లేరు” అన్నది.
”కొంతకాలానికి అందులో ఒక్కరు కూడా ఉండరు. అందరూ ఘోస్టులై పోతారు” అన్నాను.
తన మనసులోని మాటే నానోట వచ్చినట్లుగా జానకి, ”అవునండీ ఒకరింట నలభై ఏళ్ళ క్రితం నాటి పత్రిక ఒకటి ఈ మధ్య చూశాను. అందులో యాభై పైబడిన వయస్సు వాళ్ళ ఫోటో కనిపించినప్పుడల్లా వాళ్ళు చచ్చిపోయి ఉంటారు గదా అనిపించి దిగులేసింది” అన్నది జానకి.
బుకింగాఫీసు దగ్గర బెల్లు మోగింది.
అప్పుడు గాని నేను జానకి వెంట ఉన్న ఇద్దరు ఆడవాళ్ళనూ గమనించలేదు.
”మగవాళ్ళకన్న ఆడవాళ్ళకు దబ్బున దొరుకుతాయి. మీ టిక్కెట్టు కూడా మేమే తెస్తాం. ఇక్కడే ఉండండి” అంటూ జానకి, నేను ఏ క్లాసు టిక్కెట్టు కొంటానో కూడా అడగకుండా, నేను పర్సు పైకి తీసేలోపల బుకింగు విండో దగ్గిరికి వెళ్ళిపోయింది.

తరవాత నేనూ జానకీ దగ్గిర అయ్యా నంటే అది నా ప్రయోజకత్వం కాదు. ఇనిషియేటివ్‌ ఆమెదే. ఇంటర్వెల్‌లో ఆమె నాకు తనవెంట ఉన్న ఇద్దరు స్త్రీలనూ పరిచయం చేసింది. వాళ్ళు అక్కచెల్లెళ్ళు. పెద్దావిడ వితంతువు. రెండో ఆవిడకు అసలు పెళ్ళేకాలేదు. ఎం.లిట్‌. పాసై కాలేజీ లెక్చరరుగా పనిచేస్తున్నది. పెద్దావిడకు ఇల్లూ, డబ్బు ఉన్నది, పిల్లలు లేరు. ముగ్గురూ కలిసి పెద్దావిడ ఇంట్లోనే ఉంటున్నారు. నాకు తెలీదుగాని, జానకి బాగా పాడుతుందిట. సంగీత పాఠాలు చెప్పి కాలక్షేపం చేస్తున్నదట. పెద్దావిడకు సంగీతం పిచ్చి, ఆ పిచ్చే జానకిని ఆవిడకు కట్టి ఉంచింది.
జానకి ఒంటరిగా ఎందుకుంటున్నది!
ఆమె భర్తను వదిలేసింది.
లేదు. భర్తను ఆమె వదిలెయ్యలేదు – ఆమె తనను వదిలేటందుకు చెయ్యదగిన పనులన్నీ చేశాడు. మాటలన్నీ అన్నాడు  ఆమె తనను వదిలేశాక, లబ్బున మొత్తుకుని, తనకు ఘోరమైన అన్యాయం జరిగిందను కున్నాడు. తెగేదాకా లాగటమంటూ ఉంటుందని అతగాడికి తెలీదు. అతనిది తప్పు అనలేం. భారతనారీత్వం స్పెషల్‌ రబ్బరులాంటిది. ఎంత లాగినా తిరిగి యథాస్థితికి వచ్చి, ఏమీ జరగనట్టుగా మసులుతుంది. దాన్నే మనవాళ్ళు ఆకాశాని కెత్తారు. ఇంకా ఎత్తుతున్నారు.
మరి రెండు రోజుల అనంతరం ఆది వారం నాడు జానకిని చూడబోయాను. ఆమె మాటాడే పద్ధతిలో ఎలాంటి మానసిక రుగ్మతలూ కనిపించలేదు. (వాటిని గమ నించే జబ్బు నాకున్నది).
మేం అండీలు మానేసి ‘నువ్వు’ అని ఒకరి నొకరం పిలుచుకోవటం ఎప్పుడారంభ మయిందో నాకు సరిగా గుర్తులేదు. ముందు నేనే ప్రారంభించానని తెలుసు. ‘అండీ’కీ ‘నువ్వు’కీ మధ్య ‘నో మాన్స్‌ లాండ్‌’ ఉంటుంది. అందులో ఉభయచర వాక్యా లుంటాయి. వాటిలో ఏకవచనమూ ఉండదు. బహువచనమూ ఉండదు. ‘ఇంకాస్సేపు కూచోరాదూ? తొందర పనే మైనా ఉందా? ఇకనేం? ఉద్యోగం ఏ ఆఫీసు లో? ఎంత జీతం ఇస్తారంటా!’ ఇలా.
జానకి నన్ను, నువ్వు అనటం చెవులకు భలే బాగుండేది.
మొదట్లో నేను జానకి స్త్రీత్వాన్ని ఏమీ పట్టించుకోలేదని చెప్పగలను. అంటే, ఆమె పట్ల నా ప్రవర్తన మగ మిత్రులతో సాగినట్లే సాగింది. సాధారణంగా నేను ఆడవాళ్ళతో స్వేచ్ఛగా మాట్లాడలేను. కారణం వాళ్ళు తాము ఆడవాళ్ళమన్న సంగతిగాని, నేను మగవాణ్ణన్న సంగతిగాని మరిచిపోలేనట్టు కనిపిస్తారు. వాళ్ళతో స్నేహమంటే సెక్స్‌ స్నేహమే – మరో స్నేహం సాధ్యంకాదు.
జానకిలో అంత ఆకర్షణ ఉన్నా, ఆమెతో స్నేహంగా మాట్లాడటానికి వీలయిందంటే అందుకు నేనెంత బాధ్యణ్ణో, ఆమె కూడా అంతే బాధ్యురాలు. మగవాళ్ళతో స్నేహం ఏర్పడినప్పుడు మనం అవతలివాళ్ళ జీవితావసరాలు ఇన్వెంటరీ తీసుకోం. వాళ్ళకి వాళ్ళే మనతో చెప్పుకోదగిన సంగతులన్నీ చెప్పేస్తారు. మనమూ ఆ పనే చేస్తాం.
మాటల సందర్భంలో నా విషయాలు నేనే చెప్పాను. జానకి వాటిని ఆసక్తిగానే విన్నది గాని, బోరైనట్లు కనిపించలేదు. అంతకన్న కూడా నాకు ఆమెలో నచ్చినదే మంటే నా నోటవచ్చిన మాటల్లో కపటం గాని, అసత్యంగాని ఉన్నదేమో నన్నట్లు ఆమె ఒక్కసారి కూడా ప్రవర్తించ లేదు.
నేను హోటలు తిండి మెతుకులు తినేవాణ్ణి గనక నన్ను వరసగా రెండు మూడు ఆదివారాలు భోజనానికి పిలిచింది. నేను ఏదన్నా చాలునంటే బలవంతం చెయ్యటం గాని, వద్దన్నది వడ్డించటంగాని చెయ్యలేదు. ఇది నా ప్రాణానికి చాలా మంచి లక్షణం. నా మాటలో ఆమెకు సంపూర్ణ విశ్వాసం ఉందనటానికి పెద్ద తార్కాణం.
జానకి తనకు సంబంధించిన విషయాలు – ముఖ్యంగా తన వైవాహిక జీవితం గురించి ఒక్కసారిగాకాని, ఒక్క క్రమంలోగాని చెప్పలేదు. కాని ఆ విషయా లన్నీ నా బుర్రలో ఒక క్రమంలోనే చోటు చేసుకున్నాయి.
జానకికి పదిహేడో ఏట పెళ్ళి అయింది. అప్పటికే ఆమె తండ్రిపోయి ఏడాది దాటింది. ఆమె పెళ్ళి గురించి తండ్రి ఏవో కలలుకన్నాడు. కాని ఆయన పోయాక జానకి పెళ్ళి ఆమె తల్లికి దుర్భర సమస్య అయింది. సంబంధాలు ఎవరు చూస్తారు? ఏ సంబంధం మంచిదో, ఏది కాదో నిర్ణయించుకునే శక్తి కూడా ఆమె తల్లికి లేకపోయింది.
కొద్దిమంది ”దయాదాక్షిణ్యాలు” ప్రకటించి సహాయం చెయ్యటానికి ముందుకు వచ్చారు. అయితే వారిలో అనాథరక్షణ చేసే వైఖరి కనబడి జానకికి చాలా చిరాకు కలిగింది. బిచ్చగాడి మొఖానికి అయిదు పైసలు చాలవా అన్నట్లుగా వాళ్ళు, వివాహార్హత లేని తమ దగ్గిర బంధువుల సంబంధాలనూ, వయసు మళ్ళిన వాళ్ళనూ తెచ్చారు. జానకి వాటిని నిరాకరించినపుడు వాళ్ళకు చాలా కోపం వచ్చి సహాయ నిరాకరణం కూడా చేశారు.
”అబ్బో! మీకు నచ్చేవాళ్ళను మేమెక్కడ తీసుకురాగలం తల్లీ?” అన్నదొక బంధువురాలు జానకి తల్లితో. తాను తెచ్చిన వెకిలి మొహాన్ని జానకి వద్దన్నదని కోపం.
జానకికి తమ్ముళ్ళూ, ఒక్క చెల్లెలూ ఉన్నారు గాని అన్నలు లేరు.
చిట్టచివరకు సంబంధం తెచ్చినవాడు వాళ్ళకేమీ కాదు. జానకి తండ్రికి స్నేహితుడట.
జానకి తిరుమలరావును చూసి, ఇష్టపడే చేసుకున్నది. అయితే ఆమె చూసినది తిరుమలరావు ముఖం మాత్రమే. ఆమె నిజంగా ఇష్టపడింది అతని తండ్రి సంభాషణ విని.
తిరుమలరావు తండ్రి పెద్ద రేషనలిస్టు. పనికి మాలిన పాత ఆచారం మీద తిరగ బడినవాడు. కొడుక్కు ఉపనయనం చెయ్య లేదు. వరకట్నాలు ఒప్పేవాడు కాడు.
”అమ్మా, మీరు చాదస్తానికి పోకుండా ఉంటే నేనొకటి చెబుతాను. మంత్రాలూ తంత్రాలూ మానేసి, నలుగురు పెద్దల సమక్షంలో వాళ్ళచేత దండలు వేయించు దాం” అన్నాడాయన జానకి తల్లితో.
ఆవిడ నిర్ఘాంతపోయి, ”వద్దులెండి, అన్నగారూ, ఏకరాత్రం శాస్త్రోకంగానే జరిపిస్తాం. ఎంత ఖర్చవుతుంది?”
ఆ తరవాత ఆవిడ ఇరుగుపొరుగు వాళ్ళతో, ”కథల్లో రాజకుమార్తెల్లాగా పూలదండలు వేసుకునే పెళ్ళేమిటయ్యా? తరవాత దానిమొగుడు దాన్ని వదిలేసి, తనకు పెళ్ళే కాలేదంటే ఆ దిక్కుమాలిన పూల దండలు వచ్చి సాక్ష్యం చెబుతాయా? అగ్ని సాక్షిగా జరిగితేనే పెళ్ళి అన్నది. మొత్తంమీద ఆవిడ తన కాబోయే వియ్యంకుడి సలహా విని గోతిలో పడనందుకు తనను తాను చాలా అభినందించుకున్నట్టే కనబడుతుంది.
జానకి పెళ్ళి సక్రమంగానే జరిగి పోయింది. తిరుమలరావు ఒక బాలకవి అని తెలిసి, జానకి కొంచెం గర్వపడింది కూడానూ. అతను బియ్యే పాసయినాడు. పెద్ద ఉద్యోగం దొరికే అవకాశం లేదు. చిన్న ఉద్యోగాలు చెయ్యటం అతనికిష్టం లేదు. అయినా ఇంటిపట్టున కూర్చుంటే జరుగుబాటు అయేపాటి ఆస్తి ఉన్నది.
కాని తిరుమలరావుకు ఇంటిపట్టున ఉండటం ఇష్టంలేదు. అతని దృష్టి మద్రాసు మీద ఉన్నది. అందుకు జానకి గ్రహించిన కారణం అతనికి పట్నం జీవితంమీద మోజు అన్నది మాత్రమే. అవిగాక ఇంకా రెండు ప్రబలమైన కారణాలున్నాయని ఆమె కొంతకాలానికి గ్రహించింది  (”అతను పెద్ద కూబి. మనసులో ఏముందో చచ్చినా తెలిసేదికాదు. నోటంట వచ్చిన ఏ మాటా నమ్మటానికుండేది కాదు” అన్నది జానకి).
అసలు సంగతేమిటంటే, అతనికి తన తండ్రి అంటే పరమ అసహ్యం. ఆయన భావాలంటే తగని మంట.
”మా నాన్న చాదస్తంతో నాకు మూడువేలు కట్నం వచ్చేది కాస్తాపోయింది” అని అతను చాలా సార్లు జానకితో అన్నాట్ట.
”కట్నం తీసుకోవడంలో గొప్ప ఏమన్నా వున్నదా?” అని జానకి అడిగిందట.
”ఎందుకు లేదూ? ఫలాని వాడు కట్నం లేకుండా ఫలాని పిల్లని చేసుకున్నా డంటే, దాని అందంచూసి కళ్ళు బైర్లు కమ్మి చేసుకుని వుంటాడని అందరూ అనుకోరూ?”
”నా బోటి అందంలేని దాన్ని చేసుకుంటే?”
”అప్పుడు, ఏం చూసి చేసుకున్నాడ్రా అనరూ?”
తండ్రికి ఎడంగా ఉండటం కాక, తిరుమలరావు పట్నం చేరటంలో మరో ఉద్దేశం  సినిమా కవి కావటం. దాన్ని అతను చాలా కాలం జానకికి తెలియనివ్వలేదు (”అదేం మనిషో. ఏ పని చేసినా దొంగ తనమో, రంకుతనమో అన్నట్టుగా చేసేవాడు. సినిమా పాటలు రాయటానికి సినిమా కంపెనీల చుట్టూ తిరుగుతున్నా నంటే నేనేం వద్దంటానా?” అన్నది జానకి).
జానకికి కొన్ని ఖచ్చితమైన భావా లున్నాయి. భర్త ఏమి చేసినా తాను విమర్శించదలచలేదు. అందుకు ఒక కారణం. అతను తన విషయాలేమీ ఆమెకు చెప్పేవాడుకాదు. మరో కారణం, అతను చేసే పనులు అవమానకరమైనవని తనకు అనిపించినా, తాను అతనికోసం సిగ్గుపడ దలచలేదు.
వారిద్దరి మధ్యా ఆత్మీయత లేదు.
(”అతను సినిమాలలో ఎక్‌స్ట్రా వేషాలు వేసినా నేను ‘ఇదేం పని?’ అని నా నోటిమీదుగా అని ఉండేదాన్ని కాను” అన్నది జానకి.)
పట్నంలో మకాం పెట్టి అతను ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్టులేదు. ఎక్కడెక్కడో తిరిగివచ్చేవాడు. అప్పుడప్పుడూ అతని వెంట ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. వాళ్ళు మాట్లాడుకునే ధోరణిని బట్టి కవులేమోనని జానకి అనుకునేది. అతను అడిగినప్పుడు కాఫీలూ, సాధ్యమైతే టిఫినులూ చేసి ఇచ్చేది. వాళ్ళెవరని అడిగేది కాదు. అతను చెప్పేవాడు కాడు.
భార్య తన జీవితంలో ఏమాత్రమూ పాలుపంచుకోకపోవటం అతనికి పట్టిచ్చినట్టు లేదు. ఆమె కావాలనే తన విషయాలలో ఎడంగా ఉంటున్నదా అని కూడా అతను గమనించలేదేమో నన్నది జానకి.
ఇంత మాత్రాన జానకి తన భర్తను ద్వేషించి ఉండదనుకుంటాను. ఆమెలో అతనిపైన ద్వేషాన్ని రెచ్చగొట్టినది వారిద్దరి దాంపత్య జీవితంలో అతని ప్రవర్తన………..
అతను తాను కూడా ఒక సాహితీ పరుడుగానే మాట్లాడేవాడు. అందుకు జానకికి అభ్యంతరం లేదు. సాటి కవులందరి లోనూ ఏదో ఒక దోషం ఎంచేవాడు. అసూయ అనుకున్నది జానకి. శ్రీశ్రీకీ తనకూ మాత్రమే రహస్యం అర్థమయిందని చెప్పాలన్నాడు, ఒకసారి ఎవరితోనో. అహంకారం అనుకున్నది జానకి. తరవాత సన్నసన్నగా శ్రీశ్రీ కవిత్వానికి కూడా ఏవో వంకలు పెట్టి తాను ఒక్కడేనని నిర్థారణ చెయ్యటానికి పిరికి ప్రయత్నం చేశాడు.
(”విశ్వనాథ వారి పద్యాలు అతనికి అర్థం కావని నేను రూఢిగా చెప్పగలను” అన్నది జానకి.)
జానకికి పుస్తకాలూ, పత్రికలూ చదవటం చాలా సరదా. లేకపోతే పాడుకునేది.
అతనికి సంగీతం ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళు చాలా మంది పుంటారు. కాని అతను ఆమె పాట సహించలేడని తెలిసింది.
ఒకటి రెండు సార్లు ఆమెను ”నీకు పాడటం జబ్బల్లే ఉందే?” అని అడిగాడు.
ఇంకోసారి తాను ఇంటికి వచ్చేసరికి ఆమె పాడుకుంటున్నది. తనను చూడగానే ఆమె పాట ఆపనందుకు అతనికి ఆశ్చర్యమూ, కోపమూ కూడా వచ్చాయట.
”నేను లేకుండా చూసి పాడుకుందూ, నీకు పుణ్యం ఉంటుంది” అన్నాట్ట. చాలా మంచిగానూ, మృదువుగానూ చెప్పు కుంటున్నాననుకున్నట్టుగా.
మరొకసారి, ”నువు పాడేది బూతుపాటల్లే వుందే!” అని ఆశ్చర్యంగా అడిగాట్ట.
”అవును, జావళీలు కొంచెం శృంగారంగానే వుంటాయి” అన్నదట.
”ఉబ్బసమే దగ్గు. శృంగారమే బూతు. ఇదేనా ఏమిటి నీకు మీనాన్న సంగీతం మేస్టర్ని పెట్టి చెప్పించినది?” అని అడిగాట్ట.
”తాను వున్నప్పుడు పాడకూడదు. తాను లేనప్పుడు పాడితే, ”ఎవరిని ఆకర్షించటానికి పాడుతున్నావు!” అని అడిగేవాట్ట.
”నా గొంతు వింటే వాంతి వస్తుందని చెప్పినట్టున్నారు?” అని అన్నదట జానకి.
”తాళి గట్టిన పాపంచేత నాకు అసహ్య మైతే, పరాయివాడికి అసహ్యం ఎందుకను కోవాలి? పరాయివాడి పెళ్ళాం ఎప్పుడూ రంభే!” అన్నాట్ట!
”అది మీ అనుభవం గామాలు!” అన్నదిట జానకి.
తిరుమలరావు నిప్పులు తొక్కిన కోతిలాగా గంతు వేశాట్ట.
ఇంటికి ఏ పత్రికలూ రానిచ్చేవాడు కాడు, పత్రికల నిండా బూతు కథలే ఉంటాయనేవాట్ట.
చలం పేరు చెబితే వెర్రెత్తినట్టు అయిపోయేవాట్ట.
”నేను చలంగారి నవలలూ, కథలూ చాలా చదివాను” అన్నదట జానకి, కేవలం అతన్ని రెచ్చగొట్టటానికే.
 అతను కళ్ళు పెద్దవి చేసి, ”అవి చదివి చెడిపోకుండా ఉన్నావంటే నేను నమ్మను” అన్నాట్ట.
సెక్స్‌ విషయంలో అతను ఉత్త పశువన్నది జానకి. ఆమె నా దగ్గిర ఏదీ దాచలేదు. అయినా కూడ ఒకవంక అలుగుతూనే సెక్స్‌కు సిద్దపడేవాట్ట-పగ సాధించుకోవటానికన్నట్టే!
ఒకసారి ఆమెకు జ్వరం తగులు తూంటే, తెలిసి కూడా అతను కామం తీర్చుకున్నాట్ట.
”అతనిమీద నాకు కలిగిన దురభి ప్రాయం మాటకేంగాని, నన్ను చూస్తే నాకు చాలా అసహ్యం పుట్టేట్టు చేశాడు. అతనికన్న కూడా భార్యలను హింసపెట్టే భర్తలు యీ లోకంలో ఉన్నారేమో – ఉండే ఉంటారు. అది భరించే వాళ్ళమాట నే నెరగను. వాళ్ళకు ఆత్మాభిమానం లేదేమో. నేను మాత్రం ఆత్మాభిమానంతో చచ్చి పోయాను. ఎదురు తిరిగి పోట్లాడితే కొంత ఉపశాంతి కలిగేదేమో. కాని అంతా పేర్చుకున్నాను. చివరకు నా అంత రోత ముండ ప్రపంచంలో ఉండదని పించింది. నాలో ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ మాదిరి మొగుడి దగ్గర ఒక్కక్షణం ఉండననిపించింది. అతను పెట్టే తిండి మెతుకులకుగాను ఇదంతా భరిస్తున్నానని పించింది.
”నాలుగేళ్ళు భరించాను. ఇక చాలనిపించింది. ఒకరోజు చెప్పేశాను. ‘నన్ను మీరు మెదడులేని ఆడగాడిద ననుకుంటున్నారో, ఊరందరితోనూ రంకు పోగల సాహసురాలిననుకుంటున్నారో నాకు తెలియడం లేదు. నేను చిన్నతనంలో కుర్రాళ్ళతో మొగుడూ, పెళ్ళాం ఆటలు ఆడినదాన్నే!’ అన్నాను.
”ఆ మనిషి మొహం చూసి తీరాలి. ‘ఎవరితో?’ అని అడిగాడు. ”ఎవరైతేనేం? పాపం, చిన్నతనంలోనే మశూచికం వచ్చి పోయాడు’ అన్నాను పళ్ళు బిగపట్టి. ‘నువు పోయినా పీడ విరగడై ఉండేది.’ అన్నాడు కొంచెం ఆలోచించి. ‘వెధవముండను పెళ్ళాడానన్న మాట! ఇదంతా నాకు చెప్పటానికి సిగ్గులేదూ?’ అని అడిగాడు, లేదన్నాను. ‘పో నా ఎదుటినుంచి! నిన్ను గొంతు పిసికి చంపెయ్యగలను.’ అన్నాడు.
”నేను వెంటనే వెళ్ళి పెట్టె సర్దసాగాను. తాను మాట్లాడలేదు. పెట్టె తీసుకుని బయలుదేరుతుంటే, ఎక్కడికన్నాడు. ‘ఎక్కడికైతేనేం? మీ వంటి నీతిపరుడికి నేను నిజంగా తగను.’ అన్నాను. ‘నిన్ను నేను ఇల్లు వదిలి పొమ్మనలేదు.’ అన్నాడు. పిరికిపంద అనుకుంటాను. లేకపోతే నేను చేసే ఇంటి చాకిరీ చెయ్యటానికి మరెవరూ దొరకరనే అనుకున్నాడో.
”మీరు పొమ్మంటేనే నేను పోవాలా ఏమిటి? మీ మొహం చూడటానికి నాకూ అసహ్యంగా ఉండొచ్చుగా, అని బయలుదేరి తిన్నగా రైలుస్టేషనుకు వెళ్ళాను” అన్నది జానకి.
ఆమె పుట్టింటి వద్ద రెండు నెలలేమో ఉన్నట్టున్నది.
”నేను చాలా అదృష్టవంతురాలిని. సాధారణంగా ఇట్లా మొగుణ్ణి వదిలేసి వచ్చిన ఆడదాన్ని పుట్టింటివాళ్ళు కుక్కకన్న హీనంగా చూస్తారుట. నన్ను మా అమ్మగాని, తమ్ముళ్ళుగాని హీనంగా చూడలేదు. ఊళ్లో వాళ్ళే చాటుగా రకరకాలుగా చెప్పుకున్నారని తెలిసింది. వాళ్ళూ సమాజం!
”అయితే నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. మా వూరి మునసబు కొడుకొకడు నా మీద కన్నేసి ఉంచాడు. మా ఇంటి ముందుగా తెగ తారట్లాడేవాడు. ఒకసారి నా మీదికి చిన్న కాగితం ఉండ విసిరేశాడు. తాను సినిమాల్లో నటించటానికి పట్నం పోతున్నాట్ట. నేను కూడా వస్తే నన్ను కూడా సినిమాల్లో చేరుస్తానన్నాడు.
”ఇటువంటి మోసగాళ్ళను గురించి చాలా కథలు చదివాను. అయినా నాకు భయం కలుగలేదు. అన్ని సంకెళ్ళనూ తెంపేస్తే కొంత స్వేచ్ఛ లభిస్తుంది. ఆ తరువాత చావును మించిన పెద్ద ప్రమాదం ఏదీ జరగదు. ఎందుకు భయపడాలో నాకు అర్థం కాలేదు.
”అతనితో ఆ రాత్రి బయలుదేరి వచ్చేశాను. అతను కథల్లో ఉండేటంత దుర్మార్గుడు కాడు. నాకు సినిమా ఛాన్సులు అవసరం లేదనీ, నేను అతన్ని మోహించి వెంట రావటంలేదనీ రైల్లోనే చెప్పాశాను. అతను నన్ను చాలా మర్యాదగా చూశాడు. నేనంటే కాస్త భయపడ్డాడు కూడా. మగవాడు తనని చూసి భయపడుతున్నాడంటే ఆడదానికెంత గర్వం వొస్తుందో తెలుసా! జీవితం గురించి అతనికున్న భ్రమలేవీ నాకులేవు. సగం అందుకే అతనికి నేనంటే భయమేమో.
”మేం కొంతకాలం ఈ పట్నంలో భార్యాభర్తలల్లేనే జీవించాం. అతనికి సినిమా ఛాన్సు రాలేదుగాని నాకు రేడియోలో పాడే ఛాన్సులు వచ్చాయి. రేడియోలో అతనికిద్దరు స్నేహితులుండేవారు. వాళ్ళు నా పాట విని ఆడిషన్‌ ఇప్పించారు.
”రేడియోలో నేను పాడిన చచ్చు పాటలు విని ఒక మ్యూజిక్‌ డైరెక్టరుగారు నన్ను సినిమా కోరస్‌లలో పెడతానన్నాడు. నేను అవసరం లేదన్నాను. రేడియోలో కూడా నన్ను పాట కచేరీలు చెయ్యనివ్వలేదు. నా అదృష్టం కొద్దీ ట్యూషన్లు దొరికాయి. మా వూరి మునసబుగారి కొడుకు తెచ్చుకున్న డబ్బంతా తగలేసి వెళ్ళిపోయాడు. నన్ను విడిచి వెళ్ళిపోవటం కష్టంగా ఉందన్నాడు. ‘నాకూ కష్టంగానే ఉంది. అయినా నీ బతుకు నువ్వు బతకాలి. నా బతుకు నేను బతకాలి. మనిద్దరి దారి ఒకటి కాదు!’ అన్నాను.
 ”అతను వెళ్ళిపోయేనాటికి నాకు నెల తప్పింది. ఆ సంగతి అతనికి చెప్పలేదు. తరవాత ఒక డాక్టరుగారి సహాయంతో అదికాస్తా రెండోనెల్లోనే వొదిలించుకున్నాను” అన్నది జానకి.

 ఆమె జీవితాన్ని గురించి చాలా ఆలోచించాను. ఆడదానికి ప్రకృతి అన్యాయం చేసిందంటారు. అన్నిటికన్నా ఆడదానికి హెచ్చు అన్యాయం చేసినది వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థే లేకపోతే ఆడదాని బతుకింత లేత అరిటాకులాగా తయారుకాదు. వివాహ వ్యవస్థ ననుసరించి వచ్చిన సామాజిక పరిణామాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ లేకుండానే చేశాయి.
జానకిలాగా నిజం చెప్పెయ్యటం తన స్వేచ్ఛకు ప్రధానం అనుకునే మనిషి, శరీరం అమ్ముకుని బతకను కూడా లేదు. ఆమె సంగీత పాఠాలు చెప్పుకుని ఎంతకాలం బతుకుతుంది? స్కూలు ఫైనలులో చదువు చాలించిన మనిషికి ఏం ఉద్యోగాలు దొరుకు తాయి? అక్కడా సెక్సు వెంటాడుతుంది. దాన్నుంచి తప్పించుకోవడం కష్టం.
ఈ మాటే నేనంటే, ”మెల్లగా అంటున్నావా? నేను ఎప్పుడు బస్సెక్కినా నాకు ఓ అరవై యేళ్ళ మగాడి శరీరం తగిలితే చాలు ఒళ్ళంతా ఝల్లుమంటుంది. ఈ సెక్సు లేకుండా చేసుకునేటందుకు కాబోలు మనవాళ్ళు జన్మరాహిత్యం కావాలనుకునే వాళ్ళు” అన్నది జానకి.
నాకు జానకి లాంటి మనిషి కావాలని తేల్చుకున్నాక, ఆమెకు నేనెందుకు పెళ్ళి చేసుకోలేదో చెప్పాను! ఒక ముక్కలో.
”మనిషిని ప్రేమించి పెళ్ళి చేసుకునే అవకాశం నాకు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించక నేను పెళ్ళి చేసుకోలేదు” అన్నాను.
”అసలే గొడవగా ఉంటే ఇందులోకి ప్రేమ ఒకటి తెచ్చిపెట్టావా?” అన్నది.
”నువ్వు స్వేచ్ఛ అనేదానికీ, నేను ప్రేమ అనే దానికీ చాలా దగ్గిర సంబంధం ఉన్నది. నాకు యుక్తవయస్సు వచ్చాక ఒకరు నాతోగానీ, నేను ఒకరితోగానీ స్వేచ్ఛగా మాట్లాడలేదు. అది ఒక అవసరం కాదా! నిజంగా స్వేచ్ఛగా మాట్లాడాలంటే ఒక మనిషి దొరికినాక మరొక మనిషికి ఆ స్థానం ఇవ్వగలమా? ఏదీ దాచుకోవటం చాతగాని మూఢులమాట చెప్పటం లేదు. నువ్వు నాతో చెప్పిన సంగతులన్నీ, ఇంకెంతమందితో చెప్పి వుంటావు?” అని అడిగాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.