“హం హైదరాబాదీ” జిలాని బానో – కె.సజయ, కె. సత్యవతి, ఎ. రజిత.

హం హైదరాబాదీ. హమేషా హైదరాబాదీ రహతీహు, మా చిన్నప్పుడు మేము, హిందూస్ అందరం కలిసి ఆడేవాళ్ళం.
బోనాలు పండుగలు, దసరా పండుగలకి బొమ్మలు తీసుకురావడం, మిఠాయిలు తీసుకురావడం మేము కూడా ఆ పిల్లలతో కలిసి వెళ్లేవాళ్ళం. బోనాలు సమయంలో మేకల్ని బలివ్వడం, పూజలు చేయడం నా చిన్నతనంలో చూసేదాన్ని.

మేము కూడా గుళ్ళకి వెళ్లే వాళ్ళం. నన్ను హసన్‌ని( నా తమ్ముడు) అందరినీ తీసుకెళ్లేవాళ్లు. ఆ సమయంలో ఇదంతా లేదు. గుళ్లోకి ఎందుకు వెళ్లాలి? హిందువులతో కలిసి ఎందుకు వెళ్లాలి అనే భేదం మా అమ్మకి లేదు. మా నాన్నకి లేదు. మా కేవ్వరికీ అలాంటి భేదభావం ఉండేది కాదు. హోలీ రోజునైతే మా హిందూ మిత్రులంతా వచ్చి ఇల్లంతా రంగుల్తో నింపేసేవారు. దీపావళి పండుగని మేమే జరుపుకునే వాళ్ళం. ఇంట్లో నేను, నా చిన్న చెల్లెలు దీపావళిని జరిపేవాళ్ళం. టపాకాయలు కాల్చే వాళ్ళం. పూజలు చేసే వాళ్ళం. బొమ్మల కొలువు పెట్టేవాళ్ళం. హసన్ అయితే చాలా బాగా బొమ్మల కొలువు చేసేవాడు. అలా మేము పండుగలన్నీ చేసేవాళ్లం. మేము ముస్లింలము. వాళ్లు హిందువులు. వాళ్లు పూజ చేస్తారు. మేము నమాజ్ చేస్తాం అని అందరికీ తెలుసు. అలాగని మేము ముస్లింలము కాదు. మీరు హిందువులు కారు అని కాదు. ఎవరి ఐడెంటిటీలు వాళ్లకు ఉన్నాయి. నాకు ఇంతవరకు ఎప్పుడూ కూడా కమ్యూనల్ ఫీలింగ్స్ కలగలేదు. మా చుట్టుపక్కల హిందూ మిత్రులు ఉన్నారు. మతకలహాలు జరిగినప్పుడు, మూడేళ్ల క్రితం జరిగాయి కదా అప్పుడు మేము ఆ మతకలహాలలో ఇల్లు తగలబడిన వాళ్లని, లూటీ చేయబడిన వాళ్లని కలిసి అలా చేసిన వాళ్లని మీరు గుర్తుపడతారా, మీ ఇల్లు కాల్చినవాళ్లు మీ చుట్టుపక్కల వాళ్లా మీకు తెలిసిన వాళ్ళా అని అడిగినప్పుడు వాళ్లను మేము ఎరుగము, మా చుట్టుపక్కల వాళ్ళు కాదు ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని కొట్టారు అని చెప్పారు. మతకలహాలు రాజకీయ నాయకులు సృష్టిస్తారు. కిరాయి మనుషులను పెట్టి రాజకీయ లాభాల కోసం చేయిస్తారు. చాలా ప్లాన్ ప్రకారం ఫలానా వారి ఇల్లు తగలబెడదాం. ఫలానా వారిని గాయపరుద్దాం అని ప్లాన్ చేస్తారు.
ఈ మధ్య జరిగిన మతకలహాలనే తీసుకుంటే ఒక కరపత్రం తయారు చేసి పంచడం జరిగింది. ఇలాంటి కరపత్రం ఎవరైనా తయారు చేయొచ్చు. ఎవరినైనా సతాయించాలంటే ఇలాంటి కరపత్రాలు తయారు చేయొచ్చు అయితే దీనిని అంత సీరియస్‌గా ఎందుకు తీసుకోవాలి? శుక్రవారం రోజున నమాజ్ జరిగే సమయంలో ఆ కరపత్రాన్ని ప్రదర్శించడం నేల మీద పరచడం గోడల మీద అతికించడం ఇదంతా చాలా ప్లాన్డ్‌గా జరిగింది. గోడల మీద అంటించిన పోస్టర్లను తీసి పారేసి ఉండాల్సింది. అలా చేయకుండా కెమెరాలను ఫిక్స్ చేయడం, డ్రమ్ములు తీసుకురావడం ఇదంతా ఏమిటి? దీని అర్థం ఏమిటంటే ప్రభుత్వం, పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ కుమ్ముక్కై వీటిని జరిపిస్తారు. ఇప్పటికీ హైదరాబాదులో మీలో గాని నాలో గాని మతపరమైన అసహనాన్ని సృష్టించేవాళ్లు వాళ్లే. వాళ్ల రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ చేయిస్తారు. మీరే చెప్పండి మీ ముస్లిం మిత్రులు ఎవరైనా మీకు ఏదైనా నష్టం కలిగించారా? ఇన్ని మతకలహాలు జరిగాయి కదా! ఎవరైనా మిత్రుల్ని మిత్రులు చంపడం మీరు విన్నారా? హిందువులు గాని ముస్లింలుగాని, మీ ఇరుగు పొరుగు వాళ్ళు మీకు నష్టం కలిగించారా ఎప్పుడైనా? అది ఎప్పుడూ లేదు కదా! అయితే ఇవన్నీ ఎవరు చేస్తారు?
సజయా: తెలంగాణ సాయుధ పోరాటం గురించి మీకు తెలిసింది చెబుతారా?
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నేను చాలా చిన్నదాన్ని, అన్నింటినీ అర్థం చేసుకునే వయస్సు కాదు ఆ రాజకీయాలను పూర్తిగా అవగాహన చేసుకోలేదు గానీ మా నాన్న, మిత్రులు మగ్దూమ్ మొహినుద్దిన్, రాజ బహుదూర్ గౌడ్, జవ్వాద్ రజ్వీ వీళ్లంతా నాన్న దోస్తులు. ఆ సమయంలో వీళ్లంతా అండర్ గ్రౌండ్‌లో ఉండేవాళ్లు. ఉద్యమంలో పనిచేసేవాళ్ళు. వీళ్ళు నిషేధానికి గురైనప్పుడు రాత్రిపూట మా ఇంటికి వచ్చేవాళ్ళు . మీటింగ్‌లు జరిగేవి. మల్లేపల్లిలోని మా ఇల్లు చాలా సురక్షితమైందని వాళ్లు భావించేవాళ్లు. ఆ సమయంలో నేను ఆలోచించే దాన్ని. ఇదేమి ఉద్యమం. ఎందుకు జరుగుతోంది అని ఆలోచించే వాళ్ళం. మగ్ధుం మోహినుద్దీన్ తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద నాయకుడు. అంతేకాదు ఆయన ప్రముఖ కవి. ఉర్దూలో కవిత్వం రాసేవాడు. ఆయన ఎం ఏ చదివి లెక్చరర్ గా పనిచేసేవాడు. ఉద్యమం కోసం ఆయన ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. ఆయన అన్నీ వదిలేసుకుని తెలంగాణ ఉద్యమంలో పని చేసేవారు. ఆయన మా ఇంటికి వచ్చేటప్పుడు ఒక బికారిలాగా చిరిగిన బట్టలతో, తెగిపోయిన చెప్పులతో వచ్చేవాడు. తిండి తినేవాడుకాదు. శ్రామికులతో కలిసి పని చేసేవాడు. ఆయన్ని పట్టుకున్నప్పుడు జైల్లో పెట్టి బాగా కొట్టేవారు. ఆయన్ని చూసినప్పుడు ఇతని గమ్యం సిద్ధాంతం చాలా గొప్ప వని అనుకునేదాన్ని. సమస్తాన్ని వదులుకొని, సుఖదుఖాల్ని లెక్కచేయకుండా ఆయన ఈ ఉద్యమంలో ఎందుకు దిగాడు అని ఆలోచించినప్పుడు తెలంగాణ ఉద్యమం ఏమిటి? వీళ్లు ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు అనేది అర్థమైంది.
నేను హైస్కూల్లో ఉన్నప్పుడే కథలు రాసేదాన్ని. నేను మొదట్లో రాసిన కథల్లో ఈ ఉద్యమానికి సంబంధించి గ్రామాల్లో ఏం జరుగుతోంది. జనం దేని గురించి ఆలోచిస్తున్నారు అనేది ముఖ్యంగా ఒక యువకుడికి మరణశిక్ష విధించి, ఆ శిక్షని అతని ఇంటిముందే అతని బంధువుల ముందే అమలు జరపడం ఆ యువకుడిని అతని ఇంటి ముందే ఉరి తీయడం నన్ను చాలా కాలం వెంటాడింది. ఒక పీడకలలాగా చాలా కాలం నన్ను వెంటాడింది అ దృశ్యం. అతని పేరు తెలంగాణ ఉద్యమంలో లిఖించబడే ఉంటుంది అతని తల్లిదండ్రులని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని ఒక వలయంగా నిలబెట్టి ఆవలయంలోపల అతని ఉరి తీసిన దృశ్యం నా మనోఫలకం మీద చాలా రోజులు ఉండిపోయింది. పోలీసులు చేసిన ఈ రాక్షసకృత్యం తర్వాత తెలంగాణ ఉద్యమం ఒక్కసారిగా ఉధృతంగా ఎగసిపడింది. నన్ను విపరీతంగా ప్రభావితం చేసిన ఈ అంశాన్ని నేను ఒక కథలో రాశాను. ఆ తర్వాత ఉద్యమం నిషేధానికి గురైంది. కమ్యూనిస్టు పార్టీ రెండుగా సిపిఐ, సిపిఎంగా విడిపోయింది. ఉద్యమాన్ని ఆపేశారు. గుర్తుంచుకోవలసిన గొప్ప విషయమేంటంటే ఆ ఉద్యమంలో పనిచేసి ఇప్పటికీ ఉన్నవారు ఉన్నారు. ఈరోజు వారు సిద్ధాంతాన్ని వదులుకోలేదు. దానికే కట్టుబడి ఉన్నారు. వారు చేయాలనుకున్నవన్నీ ముగిసిపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన రాజ్ బహదూర్ గౌడ్ ఉన్నారు. ఆయన్ని చూస్తాను కదా! ఆయన ఆ కాలానికి చెందినవాడు, ఆయన ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉర్దూ ప్రమోషన్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. నేను దాని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నాను. అయితే ఆయన విమానాల్లో ప్రయాణించగల పొజిషన్లో ఉన్నప్పటికీ రైల్లో రెండవ తరగతిలోనే ప్రయాణిస్తారు. వాళ్లు విమాన చార్జీలు ఇస్తారు. నేను విమానంలోనే వెళతాను. కానీ ఆయన రైల్లోనే ప్రయాణం చేస్తారు. ఢిల్లీలో ప్రభుత్వం ఆయనకు బంగ్లా కార్లు అన్ని ఇచ్చినప్పటికీ ఆయన వాటిని వాడుకోకుండా కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులో చిన్న గదిలో బస చేస్తారు. గుండె జబ్బు ఉన్న మనిషి, మేము ప్రశ్నిస్తే ఆయన నేను అప్పుడు ఎలా ఉండే వాడినో ఇప్పుడు అలాగే ఉంటాను. విమానంలో నా పక్కన ఎంతమంది కూర్చోగలరు? వాళ్లకు లేని సౌకర్యం నాకెందుకు అంటారు. ఇలాంటి మనుషులు ఇప్పటికీ ఉన్నారు. అయితే అలాంటి ఉద్యమాలు అలాంటి వ్యక్తులు ఇప్పుడు చాలా అరుదు.
సజయ: హైదరాబాదులోని ముస్లిమ్స్ స్త్రీల గురించి చెబుతారా?
హైదరాబాదులో ప్రస్తుతం ముస్లిమ్ స్త్రీల కోసం పనిచేస్తున్న సంస్థలేవీ లేవు. గ్రామాల్లో స్త్రీలు నగరంలోని స్త్రీల కన్నా స్వతంత్రంగా ఉన్నారనిపిస్తుంది. వాళ్లు శ్రమ చేస్తారు. సంపాదిస్తారు. ఉద్యోగాలు చేస్తారు. పాత నగరంలోని ముస్లిం స్త్రీలు మాత్రం దయనీయమైన స్థితిలో ఉన్నారు. ముస్లిం విద్యా సంస్థలు గాని, ముస్లిం నాయకులు గానీ ముస్లిం బాలికల కోసం వారి విద్య కోసం గాని ఏమీ చేయడం లేదు.. వీళ్ళకు విద్యావకాశాలు న్యాయసహాయం తప్పకుండా లభించాలని నేను కోరుకుంటాను. వారికి ఇస్లాం మతం ఇచ్చిన హక్కులు వారికి లభించాలి. ఇంతకుముందు ముస్లిం కుటుంబాలలో వరకట్న సమస్య ఉండేది కాదు కానీ ప్రస్తుతం మొత్తం ముస్లిం కమ్యూనిటీలలో వరకట్నం ప్రవేశించింది. కట్నాలు తీసుకుంటున్నారు కట్నం ఇవ్వని వాళ్ళని హత్యలు చేయడం మీరే చూస్తున్నారు. ప్రతిరోజు పేపర్లు రెండు మూడు వరకట్న హత్యల్ని ప్రచురిస్తేనే ఉన్నాయి. వాటిల్లో హిందువులు ఉంటున్నారు. ముస్లింలు ఉంటున్నారు. ముస్లిం చట్టాల ప్రకారం ముస్లిం స్త్రీలకు లభించిన హక్కులు ఇప్పటికీ కూడా వారికి అందుబాటులోనికి రానీయడంలేదు. తనకి ఇష్టమైన పెళ్లి చేసుకోవడం అనే ఆమె హక్కును గౌరవించకుండా తల్లిదండ్రులు తమకి ఇష్ట మైనవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం. అలాగే విడాకుల విషయం. హిందూ మతం ప్రకారం స్త్రీలు పురుషులకి విడాకులు ఇవ్వలేరు. పురుషులు ఇవ్వగలుగుతారు. అయితే ముస్లిం మతంలో స్త్రీలు విడాకులు ఇచ్చే వీలుంది. పురుషులు ఎలా తలాక్ చెప్పగలరో స్త్రీలు అలాగే చెప్పవచ్చు. కానీ జరుగుతున్నది ఏంటి? ఒకవేళ స్త్రీలు విడాకులు ఇవ్వదలిస్తే ఆమె కోర్టుల చుట్టూ తిరగాలి. మనుషుల్ని తోడు తీసుకువెళ్లాలి. డబ్బు ఖర్చు పెట్టాలి. అన్నింటిని మించి ఆమె భర్త కూడా ఆమెకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడాలి. అప్పుడే ఆమె విడాకులు ఇవ్వగలుగుతుంది. లేని పక్షంలో నాలుగేళ్లు, ఐదేళ్లు ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. అతడు ఇవ్వదలుచుకుంటే మాత్రం ఒకటి లేక రెండు నిమిషాల్లో ఇచ్చేయగలడు. ఒకవేళ భర్త అమెరికాలో ఉండి, భార్య ఇండియాలో ఉన్నప్పటికీ అతను రాసి పంపితే కూడా విడాకులు దొరికిపోతాయి. ఈ పని స్త్రీలు కూడా చేయవచ్చు. కానీ ముస్లిం చట్టాలు నాయకులు ఈ విషయంలో స్త్రీలకి సహాయం చేయరు. నేనేమంటానంటే స్త్రీలకి ఏవైతే హక్కులున్నాయో, నేను కొత్తగా డిమాండ్ చేయడం లేదు కదా.
ముస్లిం మతం స్త్రీలకి ఏవైతే హక్కుల్ని ప్రసాదించిందో వాటిని పొందడానికి ముస్లిమ్ స్త్రీలకు సహాయం చెయ్యాలి. కానీ అలా చేయడం లేదు. అలాగే ఆస్తి హక్కు, ఆస్తిలో మూడవ వంతు కూతురికి చెందాలి. కానీ ఇవ్వడం లేదు. మీకు కట్నం ఇస్తున్నాం కదా! ఆస్తిలో వాటా ఎందుకివ్వాలి అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పోరాడదలుచుకుంటే కోర్టులకు ఎక్కాలి. అది చాలా లంబ చోడ వ్యవహారం అవుతుంది. మా ముస్లిం కమ్యూనిటీలో ఒక ఇంట్లో చాలామంది సంతానం ఉంటుంది. అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. ఆడపిల్లల ఆర్థిక స్థితిగతులు సరిగా ఉండవు. మగపిల్లల్ని చదివించాలనుకుంటారు. వాళ్ళని చదివిస్తే సంపాదిస్తారు. ఆడపిల్లలకి పెళ్లి చేస్తే సరిపోతుంది ఎందుకు చదివించడం అని అనుకుంటారు. ఆడవాళ్లు ఇంట్లోనే ఉండాలని స్త్రీల ప్రపంచం ఇల్లేనని మా వాళ్ళు తలపోస్తారు. చదివినా గాని ఏం లాభం? అప్పుడు కూడా ఇంటి పని చెయ్యాలి. డాక్టర్ గాని ఇంజనీరు గాని మన సొసైటీలో స్త్రీల పట్ల దృక్పథంలో మార్పు లేదు. చదువుకున్న భార్య అయినా గాని ఇంటిలో పడి ఉండాలని భావిస్తారు. ఉద్యోగం చేయక్కర్లేదంటారు. ఇంట్లో ఏం తక్కువ ఉంది ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి అంటారు. అదే కిందిస్థాయి ప్రజల్లో అయితే ఆడపిల్లల్ని పరాయి ఇళ్లల్లో పనికి పెడతారు. చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తారు. నా దగ్గర ఒక పని పిల్ల ఉండేది ఆమెకి చదువు చెప్పించాలని నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ ఆమె తల్లి ఆమెను గ్రామానికి తీసుకుపోయి పెళ్లి చేసేసింది. ఆమెను చదివిస్తే పెళ్లి సమస్య అవుతుందని చదువుకున్న పిల్ల గ్రామంలో అత్తవారింట్లో ఇమడదని ఆమె తల్లి చెప్పింది. ఎందుకంటే ఆమె పెళ్లి ఒక చదువురాని వాడితో జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే స్త్రీలకి చాలా సమస్యలు ఉన్నాయి. హిందువుల్లోనూ ఉన్నాయి. ముస్లింలలోనూ ఉన్నాయి.. మనం చాలా పోరాటం చేయవలసి ఉంది. మనమందరం కలిసి ఈ పోరాటాలు చేయాల్సి ఉంది. చిన్నచిన్న అంశాలే కాదు, పెద్దపెద్ద సమస్యల మీద మనం పోరాడాల్సి ఉంది. నేను అనుకుంటాను హిందువులు కానీ ముస్లింలు గానీ ఇవన్నీ ఆర్థిక సమస్యలు. ఒక తండ్రి సంపాదనని కుటుంబం అంతా తినాల్సిన దయనీయ స్థితి. దీనివల్ల లంచాలు దొంగతనాలు లూటీలు ఎక్కువైపోయాయి. మన రాజకీయ నాయకులనే తీసుకుందాం. పూర్వం రాజకీయ నాయకులకు ఎంతో గౌరవం ఇచ్చే వాళ్ళం. వాళ్ళు వస్తే లేచి నిలబడే వాళ్ళం. అలాంటివాళ్లు ఇప్పుడు ఎంత లంచగొండులైనారంటే జైళ్లలో ఉండాల్సిన వాళ్లు పార్లమెంటులో అసెంబ్లీలో కూర్చుంటున్నారు. అవినీతిపరులై, హత్యలు చేసినవాళ్లు అధికారంలో కూర్చుంటే మన పిల్లలు అలాగే తయారవుతారు. మన పిల్లలు కూడా కట్నం కోసం భార్యని హత్య చేయడానికి సిద్ధపడతారు. మన చుట్టూ వాతావరణం అలా కలుషితమైపోయింది. మనం రాంగ్ సైడ్‌లో స్కూటర్ నడిపితే పోలీస్ చలానా వేస్తాడు. పీవీ నరసింహారావును, జయలలితను ఎందుకు ఏమీ చేయరు. వారిని ఏమీ చేయకుండా వదిలేసినప్పుడు నేను అలాగే చేస్తాను. నన్ను మాత్రమే ఏం చేయగలరు? అనే ధోరణి ప్రబలుతుంది. దీనిమీద మనం మౌనం వహించకూడదు. మనం చదువుకున్న వాళ్ళం అందరం కలిసి అవినీతికి, లంచగొండితనానికి వ్యతిరేకంగా, సమాజంలోని దురన్యాయాలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలి. అలా చేయకుండా తమాషా చూడటం నేరం కాదా? దొంగతనం చేయడం, వేరొకరిని గాయపరచడం చూసి మనం పట్టించుకోకపోవడం నేరం కాదా! సొసైటీ మొత్తం ఖరాబుగా ఉంటే మార్పు ఎలా వస్తుంది. సమాజంలో మార్పు వస్తే స్త్రీల స్థితిలో కూడా మార్పు వస్తుంది.
సత్యవతి: స్త్రీల ఆలోచన ధోరణులు ఎలా ఉన్నాయి కొత్త భావాలు పుడుతున్నాయా? ఫెమినిజం గురించి ఏమైనా తెలుసా ?
స్త్రీల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. కుటుంబాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. పూర్వం కాలేజీలకు వెళ్ళొద్దనే వారు. రోడ్ల మీద నడవద్దు అనేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం అందరితో కలిసి నడవాల్సిన అవసరం ఉంది. మార్పులు వస్తున్నాయి అయితే ముందు సమాజం మారాలి. ఉదాహరణకు మీరే ఒక్కరే రోడ్డుమీద పోతున్నారనుకోండి. నలుగురు మగాళ్లు మిమ్మల్ని అటకాయిస్తే, అత్యాచారం చేస్తే సమాజం పురుషులనేమీ అనదు. స్త్రీలనే తప్పుపడుతుంది. ఆమెని అనుక్షణం వేలెత్తి చూపుతారు. హింసిస్తారు. ఇది మారాలి. పిల్లల్ని బయటకు పంపాలంటే భయపడాల్సిన రోజులివి. ఆమె ధైర్యంగా ఉన్నా కూడా సమాజంలో చెడు ఉంటే ఒక్కరే ఏం చేయగలరు? పోలీసులనే తీసుకుందాం. వంద రూపాయలు పారేస్తే కేసుల్ని మూసేస్తారు.
సజయ : మీ కథల్లో ఎలాంటి జీవితాలని చిత్రించారు?
వర్కింగ్ ఉమెన్ ప్రాబ్లం మీద రాశాను. కమ్యూనల్ హార్మోనీ గురించి నాలుగు ఐదు కథలు రాశాను. పోలీస్ ఎన్కౌంటర్లు అవుతున్నాయి కదా! వాటి గురించిన కథ మీకు ఇచ్చాను. ఆ కథలో పోలీసులు గ్రామస్తుల్ని హింసించడం గురించి రాశాను.

మరణం లేని మహా రచయిత్రి
– గిరిజ పైడిమర్రి
ఈ మధ్య నేను వసంత కన్నాబిరన్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రముఖ ఉర్దూ రచయిత్రి జిలాని భానో అవసాన దశలో ఉన్నారని ఆమె గురించి వ్యాసం రాస్తే బాగుంటుందని సూచించారు. జిలాని భానో అస్మిత సంస్థకు చైర్పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. విషయ సేకరణ చేసి పట్టుకుని పెట్టుకున్నాను. కానీ నా ప్రయాణం తొందరలో వెంటనే రాయలేకపోయాను. ఇప్పుడే ఆ మహా రచయిత్రి ఇకలేరని తెలిసింది.
జిలాని భానో 1936 జూలై 14న ఉత్తరప్రదేశ్‌లోని బదాయన్ గ్రామంలో జన్మించారు. ఇంటర్ విద్య తర్వాత వివాహ అనంతరం ఆమె హైదరాబాదుకు వచ్చారు. ఇక్కడనే తన విద్యను కొనసాగించారు. వాళ్ల నాన్న గొప్ప కవి స్కాలర్ కావడం వల్ల అనేక పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండేవి. వాళ్ళ అమ్మ కూడా ఇస్మార్ట్ చుగ్తాయి. పుస్తకాలను లైబ్రరీ నుంచి తెప్పించుకొని చదివే వారట. అందువల్ల ఆమెకు చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం అలవాటయింది. అందుకే కాబోలు తన ఎనిమిదేళ్ల వయసులోనే రాయడం మొదలుపెట్టారు. తన 14 ఏళ్ల వయసులో ‘దూర్ కి ఆవాజ’ అనే కథ రాశారు. కానీ మొదట అచ్చయిన కథ ‘ఏక్ నజర్ ఇదర్ బీ’ అనేది అది 1952లో ప్రచురించబడింది. హైదరాబాదు చరిత్ర సంస్కృతి అంటే ఆమెకు అభిమానం. హైదరాబాదు పరిస్థితుల నేపథ్యంతో రాసిన ‘నర్సయ్యకి బౌడి’ అని, టెలి నాటికను శ్యామ్ బెనగల్ ‘వెల్ డన్ అబ్బా’ అని పేరుతో సినిమాగా తీశారు. ఆమె స్వీయ చరిత్ర ‘అఫా²్జనా’ పేరుతో ప్రచురించబడింది. ‘రోషిని కే మినార’ ‘ఐవాన్ ఏ గజల’ మొదలైన 22 పుస్తకాలు రాశారు. అందులో కొన్ని పుస్తకాలు ఇంగ్లీషు, తెలుగు లాంటి ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. భాష విషయంలో కూడా ఆమెకు ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. మాతృ భాషలో విద్యాబోధన జరిగినప్పుడే విద్యార్థి సర్వతో వికాసం జరుగుతుంది అని తరచుగా చెప్పేవారు. భాష విషయంకంగా ఆమె చేసిన కృషి మరువలేనిది. జిలాని భానో సాహితీవేత్తగానే కాదు సామాజికవేత్త కూడా. మహిళా సమస్యలు వెట్టి చాకిరి నగర జీవితంలోని ఒత్తిళ్లు మొదలైన అంశాల మీద పనిచేశారు. ఆమె సాహిత్య సామాజిక సేవకుగాను పలు అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. 1960లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, 1985లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, 1989లో హర్యానా ఉర్దూ అకాడమీ అవార్డు, 2001లో పద్మశ్రీ, 2014లో త్రిపురనేని గోపీచంద్ జాతీయ పురస్కారం మొదలైనవి ఉన్నాయి. భౌతికంగా మన నుంచి దూరమైన సాహితీ రంగంలో ఆమె చిరస్థాయిగా నిలిచే ఉంటారు. జిలాని భానో గారికి నివాళి.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.