ట్రాన్స్ వ్యక్తుల జీవన యాత్ర అందరిలా కాదు. అది కుటుంబ అంగీకారం నుండి నిరాకరణ వరకు, ఆశ్రయం నుండి అసురక్షితత్వం వరకు, ఆత్మగౌరవం నుండి అవమానం వరకు విస్తరించే సంక్లిష్ట అనుభవాల సమాహారం. వారు ఉన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు వారి జీవనోపాధిని మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తు అవకాశాలను కూడా నిర్ణయిస్తాయి.
కుటుంబం అంగీకరించిన వారు కొంత భద్రతతో కుటుంబ వ్యవస్థలోనే కొనసాగగలుగుతారు. కానీ కుటుంబ నిరాకరణ ఎదురైనప్పుడు, చాలామంది తమలాంటి అనుభవాలు కలిగినవారిని వెతుక్కుంటూ బయటకు వస్తారు. లింగ గుర్తింపును బట్టి అవమానం, వివక్ష, చట్టపరమైన అనిశ్చితి ఎదుర్కొన్న వ్యక్తులు సులభంగా ఎవరినీ నమ్మరు. అందుకే కుటుంబాన్ని విడిచిన తరువాత వారు ముందుగా వెతుక్కునేది భద్రత, అంగీకారం, మరియు తోడ్పాటు.
ఈ నేపథ్యంలో చారిత్రకంగా ఏర్పడిన హిజ్రా గురు-చేలా వ్యవస్థ అనేక మందికి ఆశ్రయంగా మారింది. ఇది కేవలం సాంస్కృతిక సంప్రదాయం కాదు; పరస్పర ఆధారిత సామాజిక నిర్మాణం. ఇందులో సభ్యులకు గుర్తింపు, నివాసం, జీవనోపాధి, మరియు సమూహ రక్షణ లభిస్తాయి. ప్రతి గురువుకు ఒక నిర్దిష్ట పరిధి ఉంటుంది; ఆ పరిధిలోనే శిష్యులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు. బస్తీలు, మార్కెట్లు సందర్శించి ఆశీర్వాదాలు ఇస్తూ ఆదాయం సంపాదించడం, లేదా పెళ్లిళ్లు, శుభకార్యాల్లో “బధాయి” కార్యక్రమాలు నిర్వహించడం వంటి మార్గాలు కేవలం ఆర్థిక వ్యవహారాలు మాత్రమే కాదు – అవి ఆచారాధారిత ఆర్థిక వ్యవస్థ. సమాజంలో అంచులపై ఉన్నప్పటికీ, శుభకార్యాల్లో వారికి ప్రతీకాత్మక స్థానం లభించడం ఈ ద్వంద్వతను స్పష్టంగా చూపిస్తుంది: ఆహ్వానం ఉంది, కానీ సమానత్వం లేదు.
అయితే అందరు ట్రాన్స్ వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉండరు. కొందరు తమ లింగ గుర్తింపును గోప్యంగా ఉంచుకుని సిస్‌జెండర్ వ్యక్తుల్లా జీవిస్తారు. వివాహం చేసుకుని కుటుంబ వ్యవస్థలో కొనసాగుతారు. మరికొందరు కుటుంబ జీవితం ఒకవైపు కొనసాగిస్తూ, మరోవైపు ట్రాన్స్ సమాజంతో అనుబంధం ఉంచుతారు. ఈ “ద్వంద్వ జీవనం” అనేది మార్జినలైజ్డ్ వర్గాల్లో కనిపించే ఒక వ్యూహాత్మక జీవన విధానం – గోప్యత మరియు వ్యక్తీకరణ మధ్య సమతుల్యం.
సాంప్రదాయ జీవనోపాధుల పక్కన, ఆర్థిక నిర్బంధం మరియు నిర్మాణాత్మక వివక్షల కారణంగా కొంతమంది సెక్స్ వర్క్ వైపు మళ్లుతారు. ఇది వ్యక్తిగత అభిరుచి కంటే అవకాశాల కొరత ఫలితం. సాధారణ ఉద్యోగాల్లో అవకాశాలు పరిమితం. కార్యాలయ వేధింపులు, తక్కువ వేతనం, అవమానకర ప్రవర్తనలు స్థిర ఉపాధిని కష్టతరం చేస్తాయి. తక్షణ నగదు ప్రవాహం కలిగిన మార్గాలు ఆర్థికంగా ఆకర్షణీయంగా కనిపించడం సహజం.
అయితే అవకాశాలు కల్పించినప్పుడు ట్రాన్స్ వ్యక్తులలోని విభిన్న నైపుణ్యాలు స్పష్టంగా వెలుగులోకి వస్తాయి. నృత్యం, గానం, వంట, ప్రజా ప్రసంగం వంటి నైపుణ్యాలు అనేక సందర్భాల్లో కనిపించాయి. స్వచ్చంద సంస్థలు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాపులు, సాంస్కృతిక ప్రదర్శనలు వంటి వేదికలు కొంతకాలం వారికి గౌరవప్రదమైన అవకాశాలు కల్పించాయి. కొందరు మీడియా రంగంలో యాంకరింగ్ వంటి బాధ్యతలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ, ఈ అవకాశాలు సుస్థిర ఉపాధిగా మారలేదు. కొన్ని చోట్ల లైంగిక వేధింపులు, అవమానకర వ్యాఖ్యలు, “న్యూసెన్స” అనే ముద్రలతో తొలగింపులు చోటుచేసుకున్నాయి. ఈ అనుభవాలు తీవ్రమైన నిరాశను మిగిల్చాయి.
ఈ పరిస్థితి వ్యక్తుల వైఫల్యం కాదు; ఇది వ్యవస్థాత్మక వివక్ష. ట్రాన్స్ వ్యక్తుల జీవన అనుభవాలు, కుటుంబ నిరాకరణ వల్ల కలిగే మానసిక గాయాలు, సామాజిక ఒత్తిడులపై సాధారణ జనాభాలో అవగాహన లోపం ఉంది. ఫలితంగా కొందరిలో “మా సమాజంలో మేమే సంతోషంగా ఉంటాం” అనే వైముఖ్యం పెరుగుతుంది. ఇది వారి ఇష్టం కాదు; పునరావృతమైన నిరాకరణ ఫలితం.
విద్యా రంగంలో కూడా ఇదే నమూనా కనిపిస్తుంది. బాల్యంలో ఎదురయ్యే వేధింపుల వల్ల చాలామంది చదువు మధ్యలోనే ఆగిపోతారు. దీని ఫలితంగా నైపుణ్యాల లోటు ఏర్పడుతుంది. రాష్ట్ర స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ, సామాజిక స్వీకారం లేకపోవడం వల్ల వాటి ప్రభావం పరిమితంగానే ఉంది. అయినప్పటికీ ట్రాఫిక్ అసిస్టెంట్, మెట్రో రైలు సెక్యూరిటీ వంటి గౌరవప్రదమైన ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆసక్తి పెరగడం, అధికారిక రంగ ఉపాధుల వైపు క్రమంగా మార్పు జరుగుతోందని సూచిస్తుంది.
చట్టపరంగా కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. 2018లో భారత సుప్రీం కోర్టు తీర్పుతో సెక్షన్ 377లో మార్పు వచ్చింది. 2019లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల చట్టం అమలులోకి వచ్చింది. ఇవి చారిత్రక మైలురాళ్లు. కానీ చట్టపరమైన గుర్తింపు సామాజిక స్వీకారంగా మారకపోతే, ఆ హక్కులు కాగితాలకే పరిమితం అవుతాయి.
గత దశాబ్ద కాలంగా హెచఐవి నివారణ కార్యక్రమాల ద్వారా ట్రాన్స్ వ్యక్తులు పీయర్ ఎడ్యుకేటర్లు, ఔట్రీచ్ వర్కర్లు, కమ్యూనిటీ నాయకులుగా పనిచేశారు. జీవన అనుభవం ఆధారంగా అవకాశాలు లభించాయి. ఈ ప్రక్రియ ద్వారా వారికి ఆర్థిక స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, సామాజిక గుర్తింపు, నాయకత్వ నైపుణ్యాలు కల్పించబడ్డాయి. అయితే ఈ కార్యక్రమాలు ప్రధానంగా వ్యాధి నియంత్రణ లక్ష్యాలకు మాత్రమే కేంద్రీకృతమై ఉండడం వల్ల, దీర్ఘకాలిక ఉపాధి సుస్థిరతపై తగిన శ్రద్ధ లభించలేదు. నిధుల కోతలు, ప్రాజెక్టుల తగ్గింపు, కాంట్రాక్టు ఉద్యోగాల ముగింపు వల్ల చాలామంది మళ్లీ నిరుద్యోగులయ్యారు.
సముదాయ సమీకరణ ప్రయత్నాల ద్వారా ్పుదీOలు ఏర్పడినా, వాటి సామర్థ్యవృద్ధి మరియు దీర్ఘకాలిక సుస్థిరత కోసం నిరంతర మద్దతు అవసరం. కొత్త సభ్యులు నిరంతరం చేరుతున్న నేపథ్యంలో పునరావృత శిక్షణలు, నాయకత్వ వికాస అవకాశాలు, మానసిక మద్దతు అవసరం. ఒక సమగ్ర దృష్టికోణం ఉంటే, ట్రాన్స్ వ్యక్తులు ఆరోగ్య రంగాన్ని మించి ఇతర రంగాల్లో కూడా నాయకత్వాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.
ఈరోజు అనేక ట్రాన్స్ యువత ఫ్యాషన్, మీడియా, సినిమా, టీచింగ్, కార్పొరేట్ రంగాల్లో స్థిరపడాలని ఆశిస్తున్నారు. వారు కూడా మంచి విద్యను అభ్యసించి, గౌరవప్రదంగా జీవించి, సమాజంలో గుర్తింపు పొందాలని కోరుకుంటున్నారు. కానీ వ్యక్తిగత సంకల్పం సరిపోదు; వ్యవస్థాత్మక మద్దతు అవసరం. “వాళ్లు ప్రమాదకరులు” అనే అపోహలు, అవగాహనలేమి ఫలితం. సమాజం గౌరవం ఇవ్వకపోతే, అవకాశాలు కల్పించకపోతే, గౌరవప్రదమైన జీవితం ఎలా సాధ్యం?
డిగ్నిటీ అనేది దానం కాదు; అది హక్కు. ఆ హక్కు చట్టాలలో మాత్రమే కాకుండా, విద్యలో, ఉపాధిలో, సామాజిక స్వీకారంలో ప్రతిఫలించాలి. సమాజం, ప్రభుత్వం, విద్యాసంస్థలు, పౌరసమాజం సమన్వయంతో పనిచేసినప్పుడే సమగ్ర సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.
