గ్లోబల్ అధికార విశ్వరూపంలో ‘ది ట్రాఫిక్ ఇన్ విమెన’ పాత్ర – ఎ. సునీత

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి స్త్రీవాద ఉద్యమం మధ్యన 1975లో కొంతమంది మహిళా మానవ శాస్త్రజ్ఞులు (ఆంత్రోపాలజిస్టులు) ప్రచురించిన ‘మహిళా మానవ శాస్త్రం వైపు’ (టువార్డ్ యాన్ ఆంత్రోపాలోజి అఫ్ విమేన్) అనే పుస్తకంలో (ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో దొరుకుతుంది) గెయిల్ రూబిన్ ‘ది ట్రాఫిక్ ఇన్ విమేన్: టువార్డ్ ఎ పొలిటికల్ ఎకానమీ అఫ్ సెక్స’ అనే ఆసక్తికరమైన వ్యాసం రాస్తూ మహిళల రవాణా పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటులో ప్రధాన పునాది అనే ప్రతిపాదన చేశారు.

ఎంగెల్స్, లెవీ స్ట్రాస్, ఫ్రాఐడ్‌లు పితృస్వామ్యం, బంధుత్వం, ఈడిపల్ కాంప్లెక్ గురించి చేసిన సైద్ధాంతిక ప్రతిపాదనల్ని ఒక దగ్గరకి తెస్తారు. రాజకీయ ఆర్ధికంతో పాటు లైంగిక సంబంధాల ఏర్పాటు, పునరుత్పత్తి చరిత్రని ప్రత్యేకంగా అధ్యయనం చేస్తే తప్ప మనం పితృస్వామ్య కుటుంబాన్ని నాశనం చెయ్యటం కుదరదని ఎంగెల్స్ సిద్ధాంతీకరించటం మనకి తెలుసు. అధ్యయనం చెయ్యబడ్డ భిన్న మానవ సమాజ సంస్కృతుల్లో మూడవ వంతుని తీసుకుని మానవ శాస్త్రవేత్త లేవి స్ట్రాస్ మానవ సాంస్కృతిక అభివృద్ధిలో మగవాళ్ళు ఆడవాళ్ళని ఆస్తిగా స్వంతం చేసుకుని, ఒకళ్ళ కొకళ్ళు వారిని బహుమతిగా ఇచ్చుకుని, బంధుత్వాలు ఏర్పర్చుకోవటం ప్రధాన పాత్ర పోషించిందని చేసిన ప్రతిపాదన పెద్దగా తెలియదు.
స్వంత పిల్లలతో సంబంధాలు పెట్టుకోకూడదు అన్న నియమం, ఈ బహుమతి సంస్కృతితో కలిపి వివిధ ఆర్ధిక, రాజకీయ, భౌగోళిక నేపధ్యాల్లో పెళ్లి, కుటుంబం, బంధుత్వ వ్యవస్థల్ని రూపుదిద్దింది అని రూబిన్ అంటారు. స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంబంధాలు మాత్రమే కుటుంబం, బంధుత్వాలకి భూమిక కావటం, ఒకే జెండర్ వ్యక్తుల మధ్య లైంగిక సంబంధాలు ఉన్నప్పటికీ అవి కుటుంబం, బంధుత్వాలకి భూమిక కాకపోవటం కూడా యాదృచ్చికం కాదని అంటారు. బహుమతి ఇవ్వగలిగే వారీగాను (మగవాళ్ళు) బహుమతిగా రవాణా కాబడే వస్తువుగా (ఆడవాళ్ళూ) మారే వారి మధ్య వుండే తీవ్ర అసమానతలని గ్రహించి, ఒప్పుకోవటమే ఆధునిక జీవితంలో కూడా, ఆ వ్యవస్థ పూర్తిగా అంతరించి పోయి పెట్టుబడి దారీ వ్యవస్థ వచ్చేసినా, ఆంతరంగిక లైంగిక అస్తిత్వ ఏర్పాటులో కూడా ప్రధాన పాత్ర వహిస్తోందని అంటారు. కుటుంబాలు స్త్రీలు పురుషుల మధ్య సంబంధాల నుండి దూరం జరిగి, సమానత్వం వచ్చి, స్త్రీలు పురుషులు వైవిధ్య పూరిత సామాజిక పాత్రలు పోషిస్తే తప్ప మన ఆంతరంగిక లైంగిక అస్తిత్వాలలో మార్పు రాదనీ, అది వస్తే తప్ప స్త్రీవాదులు ఆశించే కొత్త ప్రపంచం ఏర్పడదనీ ఆమె అంటారు.
ఈ వ్యాసంలో రూబిన్ తెల్లజాతి స్త్రీల కుటుంబాలని ప్రమాణంగా తీసుకోవటం వల్ల కాబోలు నల్ల జాతి బానిస స్త్రీల/పిల్లల అనుభవం, వలస పాలనలో దేశీ జాతుల స్త్రీల/పిల్లల అనుభవం పరిగణనలోనికి తీసుకోలేదు. నల్లజాతి మగవాళ్ళతో పాటు, ఆయా ఆడవాళ్ళ, పిల్లల శరీరాల్ని స్వంత వస్తువు/ఆస్తిగా మార్చుకుని రవాణా చేస్తూ అమ్ముకోవటం యథేచ్ఛగా కొనసాగింది. బానిస ప్రజలకి కుటుంబాలు ఏర్పర్చుకునే స్వేచ్ఛ 19వ శతాబ్దపు చివర్లో మాత్రమే లభించింది. కెనడా, ఆస్ట్రేలియాలో దేశీ జాతుల పిల్లలని దశాబ్దాల పాటు తల్లి తండ్రుల నుండి వేరు చేసి హాస్టళ్లలో పెట్టి ‘తెల్ల జాతి, క్రిస్టియన్ నాగరికత’ నేర్పుతామనే పేరుతో నానా వేధింపులూ, హింసలు పెట్టారు. ఆధునిక ప్రజాస్వామ్యంలో జరిగిన వ్యవస్తీకృత హింస ఇది. ఈ వలస వాద దోపిడీకి మరొక రూపం పాలస్తీనాలో ఇప్పటికీ కొనసాగుతోంది. ఇజ్రాయిలీ రాజ్యం తమ సైనికులు చంపిన పాలస్తీనా బందీల శరీర అవయవాలని అమ్ముకుంటుందని అనేక నివేదికలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్త పెట్టుబడిదారీ వ్యవస్థలో ధనిక వర్గాల ప్రయోజనాల కోసం పేద ప్రజలు అనేక రకాలుగా తమ శరీరాలు, అవయవాలు, శ్రమ ధర పోస్తూనే వున్నారు. శ్రామిక మార్కెట్లలో ఆధునిక బానిసత్వం పలు రూపాల్లో ప్రపంచంలో కొనసాగుతోందని అంతర్జాతీయ శ్రామిక సంస్థ చెపుతోంది. https://www.ilo.org/topics-and-sectors/forced-labour-modern-slavery-and-trafficking-persons. మూడు దశాబ్దాల క్రితం వరకూ మన రాష్ట్రాల్లో వ్యవసాయంలో కొనసాగిన వెట్టి చాకిరి, ఇప్పటికీ ఇటుక బట్టీల్లో కొనసాగుతోంది. గల్ఫ్‌కి వెళ్లే మహిళా శ్రామికులని దుబాయ్ షేక్స్ అన్ని రకాల దోపిడీ చెయ్యటం అప్పుడప్పుడూ బయటికొస్తుంది. మన దేశం ఏ శ్రామికులనీ కాపాడనట్లే, ఈ శ్రామికులని కూడా గాలి కొదిలేసింది.
లైంగిక శ్రమ పరంగా చూస్తే, ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది స్త్రీలు, బాలికలు వ్యభిచారంలోకి బలవంతంగా దించబడుతూనే వున్నారు. సోవియెట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ చూసినా లైంగిక శ్రమ ‘పరిశ్రమ’లో రష్యన్ అమ్మాయిలే కనిపించారని అనేక నివేదికలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగానూ, మన దేశంలోనూ సినిమా, మోడలింగ్, కళా ప్రపంచంలో ఆడవాళ్ళ రవాణా, దోపిడీ జరుగుతుందని మీ టు ఉద్యమం వెల్లడి చేస్తే, రాజకీయాల్లో లైంగిక దోపిడీ గురించి కర్ణాటకలో ప్రజ్వల రేవన్న, ధర్మస్థలలో మాయమయిన యువతుల శరీరాలు మత సంస్థల్లో స్త్రీల దోపిడీ గురించి చెప్పకనే చెప్పాయి.
ఈ విస్తృత నేపథ్యంలో చూసినప్పుడు అమెరికన్ న్యాయశాఖ బయటపెట్టిన ‘ఎప్స్టీన్ ఫైల్స’ ఈ వ్యవస్థల కొనసాగింపే కదా అనిపిస్తుంది. కానీ ఈ ఫైల్స్ మనకి కొనసాగింపు కంటే ముందు కెళ్ళి గెయిల్ రూబిన్ సూత్రీకరించింది ఆదిమ పితృస్వామ్య సమాజ ఏర్పాటుని గుర్తుచేస్తున్నాయి. ఆడవాళ్ళ/పిల్లల రవాణా, దోపిడీ, బలి ఆధునిక జాత్యహంకార పెట్టుబడిదారీ మగస్వామ్య వ్యవస్థలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో చెప్తున్నాయి. కేవలం వలస జాత్యహంకార, ధన మగ స్వామ్యం మాత్రమే కాదు, చట్టాల కతీతంగా ఎదిగిన కులీన ధనిక కుటుంబాల అధికార విశ్వ రూపాన్ని మన కళ్ళ ముందు వుంచుతున్నాయి.
ఈ ఫైల్స్‌లో ఇతగాడు ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది మగవాళ్ళు – దేశ ప్రధానులు, అధ్యక్షులు, బ్యాంకులు, మీడియా, కంపెనీల అధిపతులు, ఇతర ఐశ్వర్యవంతులు, దౌత్యవేత్తలు, గూఢచారి సంస్థల బాధ్యులు, రాచ కుటుంబాల వ్యక్తులు, టెక్ సంస్థల అధిపతులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, మెడికల్ డాక్టర్లు, రాజకీయ నాయకులతో ఈమెయిల్స్ ద్వారా జరిపిన లక్షల పేజీల ఉత్తర ప్రత్యుత్తరాలు; అతడి అపార్టుమెంటు, దీవులు, విమానాలు, ఇతర భవనాలకు విచ్చేసిన వ్యక్తులు మగ, ఆడపిల్లలతో, యువతులతో ఉండగా అతడు చేసిన 2000 పైగా రహస్య వీడియో, ఆడియో రికార్డింగ్స;్ లక్షకి పైగా ఫోటోలు; అతని బాధితులు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కి, పోలీసులకి ఫ్లోరిడాలో ఇచ్చిన 2008/09లో ఇచ్చిన ఇంటర్వ్యూలు, రుజువులు, సాక్ష్యాలు, ఆర్ధిక లావాదేవీల వివరాలు, ఇంకా అనేక రకాల పత్రాలు వున్నాయి. (https://www.aljazeera.com/news/2026/2/10/struggling-to-navigate-the-epstein-files-here-is-a-visual-guide?utm_sourceRfacebook&utm_medium Rsocial&utm_campaign Rsocial)
ఈ వివరాలు బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, స్లోవేకియా, లాట్వియా, లిథుయేనియా, స్వీడన్, పోలాండ్ వంటి యూరోపియన్ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బహుశా ఎంతో కొంత కొంచెం సిగ్గూ – శరం ఇంకా మిగిలుండటం వల్ల కాబోలు. బ్రిటన్‌లో ప్రధాన మంత్రి సలహాదారు రాజీనామా చేసాడు. ఇంతకు ముందే బ్రిటిష్ రాజు చార్లెస్ సోదరుడు ఆండ్రూ కి రాజరిక అధికారాలు తీసేసారు. నార్వేలో మాజీ ప్రధానమంత్రి అవినీతిపై, ఓస్లో ఒప్పందం రూపొందించిన ఇద్దరు డిప్లొమాట్ల్లపై విచారణ మొదలుపెట్టారు. పోలాండ్ ఆ ఫైల్స్‌లో తమ దేశానికి చెందిన బాధితులు ఉంటే వారికి సహాయం కోసం కమిటీ వేసింది. ఫ్రాన్స్ కూడా తమ దేశానికి చెందిన కొంత మంది ఫాషన్ పరిశ్రమ అధినేతలపై విచారణ చేపట్టింది. (https://abcnews.com/International/wireStory/epstein-revelations-toppled-top-figures-europe-us-fallout-129944882. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఎప్స్టీన్‌తో సంబంధాలు పెట్టుకున్న అధికారిపై వేటు పడింది. ప్రముఖ ఎమిరేట్ వ్యాపారి బిన్ సులేమాన్ తన కంపెనీ నుండి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది.
ఈ విషయంలో ఏ సిగ్గూ లేని దేశం మాత్రం ఇజ్రాయిల్. అందరికీ ఈ దేశంతో సంబంధాలని కూర్చి పెట్టిన ఎప్స్టీయన్ పశ్చిమాసియాలో ఈ దేశ ప్రయోజనాల కోసమే పని చేసాడన్నది ఈ ఫైల్స్‌లో స్పష్టంగా తెలుస్తుంది. ఇజ్రాయిల్ గూఢచారి సంస్థ మొస్సాద్‌తో, మాజీ ప్రధాన మంత్రితో దగ్గరగా పని చేసిన ఇతడు ఈజిప్టు, కతర్, యూ ఏ ఈ వంటి అనేక దేశాలని నయానా, భయానా దానితో మంచి సంబంధాలు ఏర్పర్చుకునేలా చేసాడు. పాలస్తీనా స్వతంత్రతకి బొంద పెట్టిన ఓస్లో ఒప్పందాన్ని ఎప్స్టీన్ నార్వే డిప్లొమాట్స్ తో కలిసి రూపొందింప చేసాడు. దేశాల అధ్యక్షులని ఆడపిల్లల్ని ఎరగా వేసి తీసిన వీడియోలతో బహుశా బ్లాక్మెయిల్ చేసి ఉంటాడని అనేక మంది పశ్చిమాసియా నిపుణులు అంటున్నారు. కాబట్టే, ఆ ఇజ్రాయెల్ దేశం మాత్రం అతని నేరాల పైన ఏ విచారణ చేపట్టలేదు (https://www.youtube.com/watch?vRj1AoPlJgEBQ)..
ఈ దశాబ్దాల దురాగతం 2009లో ఒక 14 ఏళ్ల అమ్మాయి ఫ్లోరిడా రాష్ట్రంలో ఎప్స్టీన్ గురించి చేసిన లైంగిక వేధింపు ఫిర్యాదుతో బయటికొచ్చిన తర్వాత, అమెరికన్ విచారణ సంస్థలకి అనేక మంది తమ వాఙమూలం ఇచ్చారు. ఎప్స్టీన్ అరెస్టు అయిన వెంటనే అంతర్జాతీయంగా జాతీయ చట్టబద్ధ వ్యవస్థలకి అతీతంగా పనిచేసే ధన మగస్వామ్య నెట్‌వర్క్ రంగంలోకి దిగి, ఈ గంభీరమైన విచారణని నీరు కార్చి, ఎప్స్టీన్‌పై నేరాలని ‘తక్కువ వయసు కల ‘మహిళలని’ అమ్మాయిలని వ్యభిచారం చెయ్యమని అడగటం’ అనే తేలిక నేరానికి కుదించి, వ్గఙమూలం ఇచ్చిన సాక్షులకి, బాధితులకి చెప్పకుండా అతడితో ‘నిన్ను, నీ దగ్గరి వాళ్ళని ఎప్పుడూ విచారించాం’ అనే డీల్ చేసుకుని ఇతణ్ణి రిసార్ట్ లాంటి జైలుకి పంపించింది. ఈ డీల్ కుదిర్చిన లాయర్ ప్రస్తుతం అమెరికాకు కామర్స్ మంత్రి, ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. తర్వాత అమెరికన్ కేంద్ర విచారణ ఏజెన్సీ ఈ విచారణని గాలి కొదిలేసింది. 2018లో జూలీ బ్రౌన్ అనే మహిళా జర్నలిస్టు మయామి హెరాల్డ్‌లో రాసిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టు కారణంగా 2019లో మళ్ళా అరెస్టు చెయ్యబడిన ఎప్స్టీన్ నెల తిరగ కుండానే జైల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ‘ఆత్మహత్య’ చేసుకున్నాడు.
ట్రంప్ అధికారంలోకి రాక ముందు డెమోక్రాటిక్ పార్టీ సభ్యులే ఈ దుర్మార్గంలో పాల్గొన్నారని చెప్పిన ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఆ ఫైళ్లని బయట పెడతానని వాగ్దానం చేసాడు. పదవిలోకి వచ్చి తన పేరూ దానిలో పెద్ద ఎత్తున ఉందని తెలుసుకున్న తర్వాత నాలుక కరుచుకుని, తూచ్ అని చెప్పి ‘ఆబ్బె, దాన్లో ఏమీ లేదు, కుదరదు’ అన్నాడు. మళ్ళా రెండు పార్టీల సభ్యులూ కలిసి గొడవచేసి ఎప్స్టీన్ ట్రాన్స్పరెన్సీ చట్టం పాస్ చేస్తే, అప్పుడు న్యాయ శాఖ ఈ పత్రాలన్నింటినీ విడుదల చేసింది. కానీ, ఇప్పుడు కూడా, నేరాలకు పాల్పడిన అనేక మంది ధనిక, కులీనుల పేర్లు కనపడకుండా చేసి, వందకి పైగా బాధితుల పేర్లు వదిలేసింది. ఈ దుర్మార్గంలో పాల్గొన్న వాళ్ళ పేర్లలో బిల్ క్లింటన్, బిల్ గేట్స్, లారీ సమ్మర్స్, ప్రిన్స్ ఆండ్రూ, పీటర్ థియేల్, స్టీవ్ బాన్నోన్ లాంటి అనేక మందితో పాటు డోనాల్డ్ ట్రంప్ కూడా ప్రధానంగా వున్నారు. ఫైళ్లలో చిన్న చిన్న పిల్లలపై జరిగిన లైంగిక దుర్మార్గాలు, దాడులు, హత్యలు, వివరాలు వున్నాయి. వీటితో పాటు సాషా రెయిలీ అనే 50 ఏళ్ల మగ ఆర్మీ వెటరన్ తన 12 ఏళ్ల వయసులో తన తండ్రి, ఇతరులు లైంగికంగా వాడుకోవటమే కాకుండా తెల్ల మగవాళ్ల పార్టీలకి పట్టుకెళ్లి వాళ్లకి ఆటబొమ్మలా అప్పగించారని, తానూ డోనాల్డ్ ట్రంప్, జూన్ జోర్డాన్ లాంటి వాళ్ళ చేతుల్లో లైంగిక, భౌతిక దాడికి గురయ్యానని ఐదు గంటల ఇంటర్వ్యూ ఇచ్చాడు.
(https://www.youtube.com/watch?vR84PHEMLab6g&listRPLNBQenti5B4CRp4eJ-WIsf5it4HLZ4U gg&indexR1) తనతో బాటు వచ్చిన బాలికలని తుపాకులతో చంపేశారని, ఆ దాడులు భరించలేక చంపెయ్యమని తనతో వుండే పాప అడిగితే చంపేశాననీ కూడా చెప్పాడు. ఎప్స్టీన్‌పై దీర్ఘ కాలిక పోరాటం చేసిన వర్జీనియా గియూఫ్రె ఎంత తెలివిగా తన లాంటి 14-15 ఏళ్ల స్కూల్ పిల్లలని, ముఖ్యంగా కుటుంబాల్లో కూడా లైంగిక దోపిడీకి గురయిన వాళ్ళని, ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేని వాళ్ళని, కుటుంబాలు ఛిద్రమైన వాళ్ళని గురి చూసి ఎప్స్టీన్, అతని గర్ల్ ఫ్రెండ్ ఘిలైన్ మాక్స్వెల్ ఎంచుకుని తమ ట్రాప్‌లోకి లాగే వాళ్ళో వివరించారు.https://www.youtube.com/watch?vRLNLQmpT4oQ0 (ఇతర బాధితుల ఇంటర్వ్యూలు కూడా ఇక్కడ చూడొచ్చు). దీన్ని పిల్లల లైంగిక వేధింపులు, హింసలపై పనిచేసే థెరపిస్టులు ‘గ్రూమింగ’ అంటారు. వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకుని, వాళ్ళని దోపిడీ చేసినప్పుడు, ఆ పిల్లలు – ఇలాగే పెద్దవాళ్ళ ప్రేమని సంపాదించుకోవాలని – అర్ధం చేసుకుంటారు. గియూఫ్రె చాలా క్రూరత్వాన్ని ఎదుర్కొని, ఎలాగో ఈ సాలెగూడు నుండి బయటపడి ఆస్టేలియా వెళ్ళిపోయి, పెళ్లి చేసుకుని, పిల్లల్ని కన్న తర్వాత మళ్ళా పోరాటం మొదలుపెట్టి, ఎప్స్టీన్ సహచరిపై కేసు వేసి అతడి ఫైల్స్ బయటకి రావటానికి దోహదం చేసింది. ఆమె జ్ఞాపకాలు ‘నోబడీస్ గర్ల’ పేరుతో ఆమె క్రిందటి సంవత్సరం ఆత్మ హత్య చేసుకుని (అనుమానాస్పద పరిస్థితుల్లో) చని పోయిన తర్వాత పుస్తక రూపంలో ప్రచురించ బడ్డాయి.
రెండు దశాబ్దాల పైగా, న్యాయ వ్యవస్థ, పోలీసుల నీడలో, వేలాది మంది డాక్టర్లు, డెంటిస్టులు, డ్రైవర్లు, హెయిర్ డ్రెస్సర్లు ఇంకా ఎంతో మంది ఆడవాళ్లు, మగవాళ్ల సహకారంతో కొనసాగిన ఈ దుర్మార్గ పరిణామంలో రవాణా చెయ్యబడిన వందల, వేల మంది పిల్లలు, నయానా, భయానా ఇరుక్కున్న ఆడవాళ్లు కేవలం ‘వస్తువులు’ గా మాత్రమే పరిగణింపబడ్డారు. ఈ ఆడవాళ్ళని, ఆడపిల్లల్ని, పిల్లల్ని తమ ఆనందం కోసం వికృతంగా, క్రూరంగా, బలవంతంగా ఆట బొమ్మల్లా వాడుకోవటమే కాక, ఆయా లైంగిక కార్యకలాపాల్ని రికార్డు చేసి ఎన్నో దేశాల రాజకీయ, ఆర్ధిక సంబంధాలని, తన ప్రయోజనాలకు అనుగుణంగా నిర్దేశించటం కోసం జెఫ్రి ఎప్స్టీయన్ వాడుకున్నాడు. ఇజ్రాయెల్‌తో పాటు, దానితో దగ్గరి సంబంధాలున్న కులీన వర్గ మగవాళ్ల ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసం కూడా ఇవన్నీ ఉపయోగ పడ్డాయి. న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని పేరు పడ్డ ఎన్నో దేశాల చట్టాల నుండి ఎప్పటి కప్పుడు వీళ్ళు తమని తాము సురక్షితంగా కాపాడుకుంటూ వచ్చారు. వీళ్లల్లో అనేక మంది బహుశా తమ దేశాల్లో, మూడవ ప్రపంచ దేశాల్లో ఇంకా బయట పడని ఇటువంటి అనేక దారుణాలు, దుర్మార్గాల్లో తప్పకుండా భాగస్వాములు అయుంటారు.
చట్ట బద్ధ వ్యవస్థలకి అతీతంగా అమెరికన్ ధనికుల ఇల్లు/రిసార్టులు/దీవులలో ఈ యజమానులు- సేవకుల రాజ్యం – మనం దొరలు, భూస్వాముల పాలన అని వర్ణించుకున్న పాలన – పూర్తిగా పోయిందా అనే అనుమానం వస్తోంది. ఎలోన్ మాస్క్, పీటర్ థియేల్ లాంటి టెక్ కంపెనీల యజమానులు తమని తాము దేవుళ్ళ లాగా భావించుకుని కొత్త మానవ జాతిని సృష్టించాలని కలలు కంటున్నారు. వాళ్ళ ఇళ్లే, ఎప్స్టీన్ ఇల్లు/దీవి లాగా పెద్ద కోటల్లాగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా 2008 తర్వాత దెబ్బ తిన్న ఆర్ధిక వ్యవస్థల్లో పెరిగిన అసమానతల నేపథ్యంలో ఉద్యోగాలు సరిగ్గా దొరకని పరిస్థితుల్లో ఈ ఇళ్లల్లో/దీవుల్లో/రిసార్టులలో పని చేసే వందల మంది చట్టం, న్యాయ వ్యవస్థల బయట, కేవలం యజమాని కనుసన్నల్లో, ఏ సేవ అడిగితే, ఆ సేవ చేస్తూ ఉండటానికి సిద్ధపడుతున్నారు.
ఈ ప్రత్యక్ష ధనస్వామ్య యాజమాన్య వ్యవస్థలోని అంతర్గత శ్రామిక ఏర్పాట్లని మనకి ఎప్స్టీన్ ఫైల్స్ కళ్ళకి కట్టినట్లు చూపించాయి. అయితే, ఇంతకు ముందు అన్ని యాజమాన్య వ్యవస్థలు ఎదుర్కున్నట్లే ఈ యాజమాన్య వ్యవస్థ కూడా దాని శ్రామికులు/బాధితుల నుండే ప్రధాన సవాలుని ఎదుర్కుంటోంది. దీనిలో పనికి కుదురుకున్న వాళ్ళే ఈ వ్యవస్థని, దీని లోని అన్యాయాన్ని ఒప్పుకోమని ప్రకటిస్తున్నారు. ఆయా ఆడ, మగపిల్లలు పెద్దయి తమని దీనిలోకి తోసిన వ్యవస్థని ప్రశ్నించిన కారణంగానే ఈ దారుణం ఇప్పటికయినా బయటికొచ్చింది.
ఈ ఫైళ్లలో వేల సార్లు కనిపించే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాక ముందే అనేక లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కున్నాడు. అనేక మంది ఆడవాళ్ళని అత్యంత అసహ్యకరమైన మాటలన్నాడు. తీవ్రమైన స్త్రీ ద్వేషాన్ని ప్రతి రోజూ కనపరుస్తుంటాడు. ఇదంతా ప్రత్యర్థుల కుట్రలని నమ్మి అతన్ని మళ్ళా అధ్యక్షుడిగా ఎన్నుకున్న ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన’ సమర్ధక ఓటర్లే ఎప్స్టీన్ ఫైళ్ల నేపథ్యంలో పునరాలోచనలో పడ్డారు. ఈ దారుణాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి, అన్ని దేశాల్లో జరుగుతున్నాయి, కానీ సరయిన చర్యల కోసం అన్ని రకాల ఓటర్లు, పార్టీల నుండి అమెరికాలో వస్తున్న ప్రతిఘటనే ఈ ఎప్స్టీన్ ఫైళ్లని రాజకీయం చేసింది!

Share
This entry was posted in ఇంకు పెన్ను. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.