ఏది మార్గం??? – పి. ప్రశాంతి

పాతికెకరాల మాగాణి, ఏడెకరాల మెట్ట సాగుతో పాటు పాడి పశువులు, ఎడ్లు ఉన్న ఆసామి రంగయ్య. ఊర్లో అందరూ గౌరవించే పెద్దమనిషి. ఎవరికీ హానిచేయని మనస్తత్వం. ఆయనకి సరిజోడి జానకమ్మ. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా ఆది దంపతుల్లా ఉన్నారంటారు చూసినవాళ్ళంతా. వాళ్ళకి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ కుసుమ.

చూడచక్కని రూపం, ముట్టుకుంటే కందిపోతుందనిపించే రంగు, కోమలంగా ఉండే కుసుమ అంటే అందరికీ ఇష్టం. ప్రయాణాలు, తిరుగుళ్ళలో అలిసిపోతుందని పెద్దగా ఎక్కడికీ తీసుకెళ్ళేవారు కాదు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే జానకమ్మ, రంగయ్యలకి
పదేళ్ళు వస్తున్నా చంటి బిడ్డలా మారాం చేస్తూ, ముద్దు ముద్దుగా మాట్లాడే కుసుమది గారపు చేష్టలుగానే కనపడేవి. బడికి పంపిస్తే నచ్చక వచ్చేసిన కుసుమని ఒకటి రెండుసార్లు ఒప్పించాలని చూసినా ససేమిరా వెళ్ళనన్న కూతురికి ఇంట్లోనే చదువుకునే ఏర్పాటు చేశారు. ఎవరన్నా అడిగితే ‘చదివి ఉద్యోగం చేయాలా, ఊళ్ళేలాలా.. తనకి నచ్చకపోతే ఇక రాజీయే లేదు’ అంటూ కూతుర్ని సమర్ధించే వారు. ఒకసారి తీవ్రమైన జ్వరం వస్తే పట్నంలో పిల్లల డాక్టరు దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టరుకి ఏదో అనుమానం వచ్చి సైకాలజిస్ట్‌ని పిలిపించారు. వారిద్దరూ రకరకాల పరీక్షలు చేసి కుసుమకి మానసిక ఎదుగుదల లోపం ఉందని తేల్చారు. లేటు వయసులో గర్భం దాల్చడం, కాన్పు కష్టమవ్వడం, ఇంట్లోనే పురుడు పోసుకోవడం, బిడ్డ పుట్టేటప్పుడు సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం. ఇలా ఎన్నో కారణాలు చెప్పారు. ఇటువంటి వారికి ప్రత్యేక శిక్షణ ఉంటుందని, మార్పు సాధ్యమవ్వచ్ఛని డాక్టర్లు అన్నా అందులో ఖచ్ఛితత్వం లేదని, బిడ్డని కష్టపెట్టడం ఇష్టంలేదని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. కుసుమకి ఇల్లు, విశాలమైన పెరడు, దొడ్లు, ఇంటి వెనక తోటలే ప్రపంచం.
పదహారో ఏట పెద్దమనిషైతే శానిటరీ ప్యాడ్ వాడడం నేర్పిస్తూ దేవుడా నువ్వే దిక్కు అనుకుంది జానకమ్మ. బిడ్డతో నెలవారీ ఇబ్బందులు ఎదురైనా నెట్టుకొచ్చింది. ఇరవయ్యేళ్ళు వచ్చేసరికి కుసుమకి కూడా కొంత పెద్దరికం వచ్చినట్టుంది, పిల్ల చేష్టలు తగ్గి అమ్మకి పనిలో సాయం చేయడం, పనివాళ్ళతో కలిసి తోటలో పని చేయడం, కూరగాయలు, పళ్ళు కోసి ఇంట్లో పెట్టడం చేస్తోంది. కొన్నాళ్ళకి రంగయ్య, జానకమ్మ, అయినవాళ్ళు అందరూ కలిసి ఆలోచించి, పేదరికంతో చదువు మానేసి వ్యవసాయం చేస్తున్న దూరపు బంధువుల అబ్బాయి కిషోర్‌కి విషయాలన్నీ చెప్పి, ఇల్లరికానికి ఒప్పించి కుసుమతో పెళ్ళి జరిపించారు. పెళ్ళిలో కుసుమ అమాయకపు చేష్టలకి విసుగొచ్చినా తర్వాత ఆమెని ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. పెళ్ళి తర్వాత కుసుమకి కూడా కిషోర్ తోడిదే లోకమయ్యింది. పెళ్ళైన ఆరు నెలలకి నెల తప్పింది కుసుమ. ఇంట్లో అందరికీ ఒకపక్క సంతోషం, మరోపక్క భయం. నాలుగు నెలలు నిండేటప్పటికి తనలో మార్పు అర్ధంకాక చిరాకు పడేది, అన్నీ చిందర వందర చేసేది. ఐదో నెలలో గర్భస్రావం అయిపోయింది. ఆసుపత్రిలో అవసరమైన అన్నీ చేసి, మళ్ళీ నెలతప్పినా ఇలాగే అయ్యే ప్రమాదం ఉందని, హార్మోన్లలో వచ్చే మార్పు వల్ల కుసుమ మానసిక పరిస్థితి కూడా మార్పు చెందే అవకాశం ఉండొచ్చని, మళ్ళీ మళ్ళీ గర్భస్రావం అయితే గర్భసంచికి ఇన్ఫెక్షన్ రావొచ్చని, ముందుగా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెపుతున్నానని డాక్టరమ్మ అంటుంటే జానకమ్మకి గుబులయ్యింది. తర్వాత ఏడాదిలో రెండుసార్లు మూడునెలలు నిండీ నిండకుండానే గర్భస్రావం అయింది. ఇలా అయితే కుసుమ ప్రాణానికే ప్రమాదం అని కిషోర్ కండోమ్ వాడడం మొదలెట్టాడు. అదెందుకని కుసుమ అమాయకంగా అడిగితే ‘నీకు ఆరోగ్యం బాలేదు కదా అందుకు’ అని సర్ది చెప్పాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కుసుమ ‘నాకు ఇప్పుడు బాగుంది కదా, ఇంకా ఎందుకు, బాగున్నప్పుడు మందులు వాడకూడదంట’ అని మారాం చేసింది. ‘మనకి పిల్లలు వద్దు.. నువ్వు నా పాపాయివి కదా, ఇంకో పాప రాకుండా ఇది వాడాలంట..’ అని కిషోర్ చెప్పబోతే నువ్వు అన్నీ అబద్ధాలు చెప్తున్నావు. నాకు పాప కావాలి అని పెద్ద గొడవే చేసింది. ఎంత ప్రయత్నించినా కుసుమకి ఎవ్వరూ సర్ది చెప్పలేకపోయారు. ఎటూ పాలుపోక కిషోర్ ఆలస్యంగా ఇంటికి రావడం మొదలెట్టాడు. నాకు పాప కావాలి అని కుసుమ మారాం చేయడం ఎక్కువైంది. ఇందుకు పెద్దవాళ్ళు బాధపడ్డారే కానీ ఎటూ చెప్పలేకపోయారు.
ఒకనాడు కిషోర్, రంగయ్య పొలానికి వెళ్ళాక, జానకమ్మ వంట చేస్తుంటే పెరట్లోనించి మాటలు వినిపించి ఏంటా అని వెళ్ళింది. అక్కడ కుసుమ వాంతి చేసుకుంటుంటే వెనకనించి చెవులు మూసి ‘పరవాలేదు అమ్మాయిగారు, కంగారు లేదు, అయిపోయింది..’ అంటూ నీళ్ళు అందిస్తోంది ఇంటి పనిమనిషి రాణి. కుసుమని లోపల గదిలో పడుకోపెట్టి జానకమ్మ దగ్గరికొచ్చి మెల్లగా ‘అమ్మా.. మూడో నెలనుకుంటా.. పోయినసారి కూడా నెలసరి రాలేదంట..’ అని రాణి అంటుంటే జానకమ్మ అయోమయంలో పడింది.
తర్వాత ఐదు నెలలు కుసుమతో ఇంట్లో గందరగోళంగా గడిచాయి. ఒక్కోసారి కోపంగా దొరికినవన్నీ విసిరేసేది, ఉండుండి ఏడ్చేది, చాలాసార్లు రోజుల తరబడి ఎవ్వరితో మాట్లాడేది కాదు, ఒక్కోసారి ఆకలి అంటూ అదుపు లేకుండా తినేది, కొన్నిసార్లు ఏది పెట్టినా తినేదికాదు. కుసుమకి ఎనమిది నెలలు నిండబోతున్నాయి. రాణి రోజంతా కుసుమని కనిపెట్టుకుని పక్కనే ఉంటోంది. రాత్రిళ్ళు కిషోర్ నిద్రకాసుకుని ఉంటున్నాడు. ఆ రోజు తెల్లవారు ఝామున కిషోర్‌కి కునుకుపట్టింది. ఉన్నట్టుండి బాత్రూంలోనించి దబ్బుమని శబ్దం వస్తే మేలుకుని పరిగెత్తాడు కిషోర్. దగ్గరకి వేసున్న తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. నిశ్చేష్టురాలైనట్టు కుసుమ లెట్రిన్ సీట్ కమోడ్ మీద అలాగే కూర్చుని ఉంది. చుట్టూ రక్తం. డెలివరీ అయ్యి బిడ్డ కమోడ్‌లో పడిపోయింది. బిడ్డ తల సగం కమోడ్ కన్నంలో ఉంది. రాణీ అని అరిచి ఎలాగో బిడ్డని బయటకి తీసి కుసుమని లేపేసరికి ఆ కదలికలవల్ల అప్పుడు బిడ్డ ఏడవడం మొదలు పెట్టింది. అప్పటికి అందరూ చేరుకుని ఇద్దరినీ లోపలికి తీసుకొచ్చారు.
ఆసుపత్రికి తీసుకు వెళ్తే అన్ని జాగ్రత్తలు ముందే చెప్పినా వినలేదని డాక్టరు తిట్టింది. తప్పుచేసిన వాడిలా తలదించుకున్నాడు కిషోర్. బిడ్డకన్నా ఎక్కువ ప్రభావం తల్లి మీద పడే అవకాశం ఉందని, బాలింత జబ్బులు వచ్చే ప్రమాదం లేకపోలేదని, ప్రసవానంతర మానసిక పరిస్థితి చెప్పలేమని అంటుంటే వినడం తప్పించి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. జానకమ్మ మనసులో మాత్రం ‘గర్భసంచి ఆపరేషన్ చేయిస్తే నయమేమో.. బిడ్డ పుడితే కుసుమ సమర్దించుకోగలదో లేదో.. సరిగ్గా పాలన్నా ఇవ్వగలదో లేదో..’ అన్న శ్రేయోభిలాషుల మాటలకు తను ఎంత ఆవేశంగా స్పందించిందో గుర్తుకొచ్చి వాళ్ళే కరక్టేమో అని తీవ్ర ఆలోచనలో పడింది.
కుసుమలాంటి వారు, అంతకన్నా మానసిక వైకల్యం, బుద్ధిమాంద్యత, మానసిక అనారోగ్యం ఉన్న యువతులు, మహిళలు తమ లైంగికత పట్ల ఏమాత్రం ఎరుక, అవగాహన లేని పరిస్థితుల్లో, లైంగిక దోపిడీకి, అత్యాచారాలకి గురై తమ ప్రమేయం లేకుండా తల్లులు అయినప్పుడు అయ్యో అనడమేనా మనం చేయగలిగింది! గర్భసంచి తొలగించడం ఒక ప్రత్యామ్నాయం అవుతుందా!! దానివల్ల వచ్చే తీవ్రమైన దుష్పరిణామాలకు బాధ్యులు ఎవరవుతారు? ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో వైద్య నిబంధనలు (మెడికల్ ఎథిక్స్)కి, నైతిక విలువలు (మోరల్ వాల్యూస్)కి, వాస్తవ పరిస్థితులకి మధ్య ఘర్షణ అనివార్యమా?? ఏది మార్గం???

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.