కొత్తిమీర తేల్చేసింది – డా. తాడేపల్లి రామలక్ష్మి

“మేడమ్ గారు ఇవ్వాళ కాలేజ్‌కి డుమ్మా కొట్టేయకూడదూ!” తయారవుతున్న అనుపమను దుప్పటి సందులో నుండి చూస్తూ అడిగాడు గౌతమ్.
“ఓీVA, తమరికి ఈ రోజు ఆఫ్ అనా! అమ్మో! ఈ రోజు మానేస్తే ఆ కచ్చతో సెలవుల్లో కూడా ప్రశాంతంగా ఉండనీకుండా నాకు హెడ్ ఏక్ తెప్పిస్తుంది మా హెడ్.” అంది అనుపమ.

“కలిసి టైమ్ స్పెండ్ చేద్దాం అనూ ,
మళ్ళీ పదిహేను రోజుల తర్వాత నేను ఆఫీస్ ట్రిప్ నుండి తిరిగొచ్చే వరకూ కుదరదు కదా” గోముగా చూస్తూ చేతులు చాచాడు గౌతమ్. ఆ మాటకు అనుపమ హృదయవీణ శృతి లయ అన్నీ తప్పేసి ఆ పళానే ఏవేవో రాగాలు వాయించి పడేయడంతో, “సరేలే లీవ్ పెడతా” అని అతని చేతుల్లో ఒదిగిపోయింది. మరుక్షణంలోనే మ్రోగిన కాలింగ్ బెల్ శబ్దానికి లేచి “ఇప్పుడెవరా?” అనుకుంటూ వెళ్ళి తలుపు తీస్తే గౌతమ్ తండ్రి రమణారావు.
“రండి మామయ్య గారు”
“గౌతమ్ లేచాడా ?”
“ ఇప్పుడే లేచారు మామయ్య గారు”.
“ఏం నాన్నా, ఇంత పొద్దున్నే వచ్చారు?” బెడ్రూమ్ లో నుండి బయటకు వస్తూ కొంచెం టెన్షన్ గా అడిగాడు గౌతమ్.
“ఇవ్వాళ నీకు ఆఫ్ కదా, ఓ పనుంది మనిద్దరం కలిసి బయటకు వెళ్లాలి.
“సరే “ వాళ్ళిద్దరి మాటలు కిచెన్లో నుండి విన్న అనుపమ, “ఇప్పుడే అనవసరంగా లీవ్ మెసేజ్ కూడా పంపించాను,” అనుకుంటూ కాఫీ కలిపి తెచ్చింది.
“మళ్ళీ ఎప్పుడు రావటం?” గౌతమ్ ని అడుగుతున్నారు రమణారావు గారు.
“పదిహేను రోజుల తర్వాత నాన్నా.”
“అంటే పండగకి ఉండవన్నమాట?”
“అయితే గౌతమ్ వచ్చే వరకూ నువ్వక్కడకొచ్చి ఉండమ్మా “ కాఫీ అందుకుంటూ అనుపమతో అన్నారు రమణారావు గారు. “అదేంటి ఇలా అంటున్నారు, అత్తగారు చెప్పలేదా?” అనుకుని,
“ఈ పదిహేను రోజులూ నాకు కూడా సెలవులు మామయ్య గారు, నేనూ వైజాగ్ వెళ్తున్నా”.
ఆ మాటకు రమణారావు గారి ముఖం నల్లబడటం గౌతమ్, అనుపమ ఇద్దరూ గమనించారు.
అనుపమ కిచెన్లోకి వెళ్లి టిఫిన్ తయారు చేస్తుంటే గబగబా రెడీ అయి వచ్చిన గౌతమ్ “త్వరగా టిఫిన్ పెట్టేయ్, బయల్దేరాలి” అన్నాడు. “కలిసి టైమ్ గడపాలని ఉందని బలవంతంగా తనతో సెలవు పెట్టించిన మనిషి ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో చెక్కేస్తున్నాడు కదా, తనకు సారీ చెప్పకపోతే పోయే, “అయ్యో, కుదరటం లేదు అనూ”, అని ఒక్క మాటైనా అనాలని తెలీదా?” నొచ్చుకుంది అనుపమ.
“సర్లే.. తనూ ఈ టైమ్‌లో ప్యాకింగ్, మిగిలిన పనులు చేసుకుంటే సరి. ఎన్నాళ్లకో వెళ్తోంది పుట్టింటికి. ఉద్యోగ రీత్యా పెళ్ళి కాక ముందు నుంచీ ఇక్కడే ఉన్నా దరిదాపు ప్రతి పదిహేను రోజులకు వైజాగ్ వెళ్ళేది. పెళ్ళయ్యాక మాత్రం ఆరు నెలల తర్వాత మొదటిసారి వెళ్ళటం. అదీ, తన కాలేజ్ సెలవల్లోనే గౌతమ్ బెంగళూరు క్యాంప్ అవడంతో. “ముందురోజు ఫోన్ చేసినప్పుడు అదేంటే, ఈసారి పండక్కైనా నువ్వూ, గౌతమ్ కలిసి రావటం లేదా?” అని అనుపమ తల్లి వాపోయింది.
“పోనీలేమ్మా, తనకు ఎలాగూ అంత లీవ్ దొరకదు, దొరికినా పండగ రోజు కొడుకును వదిలి ఉండలేదు మా అత్తగారు. ఈ రకంగానైనా నేను నాల్రోజులు ఉంటాను. అయినా పండగకన్నా ముఖ్యంగా నేను వద్దామనుకున్నది చెల్లి పుట్టిన రోజు అని”
“అవునే, తన పుట్టిన రోజుకి నువ్వొస్తున్నావని తెలిసి దాని సంతోషానికి హద్దుల్లేవు. నువ్వా మాట చెప్పేవరకూ ఈసారి నా పుట్టిన రోజుకి అక్క దగ్గర లేదని ఏడుపు మొహం పెట్టుకుని, కొత్త డ్రెస్ కూడా కొనుక్కోలేదు, ఆడపిల్లల పెళ్లిళ్ళయాక ఇలాంటివి తప్పవని నేను సర్దిచెప్పాననుకో.”
ఆ సంభాషణ గుర్తు వచ్చి, ఈ పూట ప్యాకింగ్ చేయడంతో పాటు, షాపింగ్ కి వెళ్ళి చెల్లెలి కోసం ఏదైనా గిఫ్ట్ కూడా తీసుకోవాలి అనుకుంది అనుపమ. ఆలోచనల నడుమే టిఫిన్లు చేసి అందించేసింది. ఇంతలో గౌతమ్ కిచెన్లోకి వచ్చి, మేము బయటకు వెళ్తున్నాం, నీకెలాగో ఇప్పుడు ఖాళీయే కదా, నా బట్టలు ప్యాక్ చేసెయ్యవా, అలాగే ఈ నెల కూడా మన ఫ్లాట్ రెంట్ నువ్వే కట్టేసేయ్, అమ్మ నాన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి ఈ నెల నేను” అన్నాడు.
“సరే” అంది అనుపమ.
తమ ఇల్లు గౌతమ్ ఆఫీసుకి దూరం అనీ, లేట్ నైట్ ఇంటికి రావటం కష్టమౌతుంది అని తామే అద్దె ఇల్లు వెతికి మరీ గౌతమ్ వాళ్ళను అతని ఆఫీసుకు దగ్గరలో ఉంచారు అతని తల్లిదండ్రులు.
అనుపమ పనులు ముగించుకుని, చెల్లెలి కోసం ఓ గిఫ్ట్ కొని వచ్చేటప్పటికి గౌతమ్ ఇంట్లోనే ఉన్నాడు. “హే..వచ్చేసావా, నాకు ఫోన్ చెయ్యలేదే?” అంది అనుపమ.
“ఇప్పుడే వచ్చాలే, రా కూర్చో మాట్లాడుకుందాం.” అన్నాడు గౌతమ్.
“కూర్చుంటే ఎలా? రాత్రికి ప్రయాణం పెట్టుకుని?”
“అది కాదు అనూ, ఈసారికి నువ్వు వైజాగ్ వెళ్ళొద్దులే” .
“నువ్వూ క్యాంపుకి వెళ్తూ, నాకూ కాలేజ్ లేక సెలవుల్లో ఏం చేస్తాను ఇక్కడ?”
“అలా అంటావు ఏంటి? ఏదో అవసరార్థం ఇక్కడ ఉన్నాం కానీ అదీ నీ ఇల్లే కదా,
నువ్వు ఈ పదిహేను రోజులు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళితే బాగుంటుంది.”
“ఎవరికి?”
“అందరికీ, పండగకి నువ్వు అక్కడ ఉంటే బాగుంటుంది అంటున్నారు అమ్మ, నాన్న. ఇప్పటికే మనం వేరుగా ఉంటున్నామని చుట్టుపక్కల వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారుట. ఇప్పుడు సెలవుల్లో కూడా నువ్వు వైజాగ్ వెళ్ళిపోతే బాగోదు” అని నాన్న అన్నారు.
“నాకోసం ఉన్నామా వేరుగా? నేను కోరానా?
అయినా ప్రతి శని,ఆదివారాలు అక్కడే వెళ్ళి ఉంటాము కదా? అవన్నీ కనబడవా ఆ చుట్టుపక్కల వాళ్ళకి? పెళ్ళయ్యాక ఒక్క పండగకి అయినా వైజాగ్ వెళ్ళామా?, ప్రతి పండగ ఇక్కడేగా! ఇన్నాళ్ళకి నువ్వు ఊళ్ళో ఉండట్లేదని కదా వెళ్దామనుకున్నా? ఆడపిల్లలు పండగకి పుట్టింటికి వెళ్తారన్నది కూడా తెలీదా ఆ ఇరుగుపొరుగు వాళ్లకి? ఆ ‘ఇరుగు పొరుగు వారు’ అత్తగారి కల్పితపాత్రలే అని అర్థమై వళ్ళుమండి అడిగింది అనుపమ.
అదే మరి! పండగకి ఆడ పిల్లలు పుట్టింటికి వస్తారనేది రూల్ అయితే మా అక్క వాళ్ళు కూడా వస్తారు కదా పండగకి, అప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతే ఎలా?
మీ అక్క తన పుట్టింటికి వచ్చినప్పుడు నేను మా పుట్టింటికి ఎందుకు వెళ్లకూడదని, మీకో న్యాయం నాకో న్యాయం ఏంటని గట్టిగా అరచి అడగాలని అనిపించినా తమాయించుకుంది అనుపమ.
“ఎప్పుడూ ఉంటున్నాం కదా, ఈసారి మా చెల్లెలి పుట్టిన రోజు కూడా పండగ రోజే వచ్చింది. అందుకే వెళ్దాం అనుకుంటున్నా” బ్రతిమాలినట్లుగా అంది.
లేదు అనూ, నా మాట విను మా అక్క బావ పండగకి వచ్చినప్పుడు ఇంట్లో కోడలు ఉండకపోతే బాగోదని నాన్న ప్రత్యేకంగా నాతో చెప్పారు. అమ్మ కూడా చెప్పమందిట. పైగా మా ఇంట్లో ఈ పుట్టిన రోజులూ అవీ అంత ముఖ్యం కాదు. అమ్మ వాళ్ళ మాట వినకుండా నువ్వు పుట్టినరోజని వెళ్ళిపోతే బాగోదు. ఏదైనా పెళ్ళయ్యాక ఇదే నీ ఇల్లు కదా, ఇక్కడి పద్ధతులే పాటించాలి, ఇక్కడ పెద్దవాళ్ళకి నచ్చినట్లుగానే ఉండాలి. అప్పుడే అందరం సుఖంగా ఉంటాం” గట్టిగానే చెప్పాడు గౌతమ్. అతని గొంతులో గాంభీర్యానికి వెనక్కి తగ్గింది అనుపమ. అతని మాటకు ఒప్పుకుని కాదు, వాదించడానికి తన దగ్గర పాయింట్స్ లేకా కాదు, కేవలం తెగేదాకా లాగటం ఇష్టం లేక! పొద్దున్నే మామగారు ఎందుకు వచ్చారో గౌతమ్ను బయటకు తీసుకెళ్ళి ఏమి నూరిపోశారో అర్థం అయ్యి చాలా అన్యాయంగా అనిపించింది.
ఆడపడుచు వాళ్ళు పండగకి వస్తారట! పది నిమిషాల నడక దూరంలో ఉండి రెండు రోజులకోసారి వచ్చి రోజంతా ఉండి వెళ్ళే కూతురేమో పెళ్ళై పదేళ్లయినా కానీ పుట్టింటికే పండక్కి రావాలి, కోడలు మాత్రం ఒక్క పండక్కి కూడా పుట్టింటికి వెళ్లకూడదు. ఆవిడ పక్కనే వున్న వాళ్ళ అత్తగారింటికి వెళ్ళక్కర్లేదు కానీ తను మాత్రం ఆవిడ వస్తుందని పుట్టింటికి వెళ్లకుండా ఆగిపోవాలి. ఇదేం అన్యాయం? అయినా ఈసారి తన చెల్లెలి పుట్టిన రోజు అని కదా తను ఇంత గట్టిగా అడిగింది? అదేమంటే “మా ఇంట్లో పుట్టిన రోజులు అంత అలవాటు లేదు” అట! మొన్ననేగా పెద్దాడపడుచు పుట్టిన రోజని పట్టుచీర ఇంకా ఏవేవో గిఫ్టులు తనతోనే కొనిపించి మరీ కొరియర్ చేయించారు!” కడుపు మండిపోతోంది అనుపమకు. ఇవన్నీ తల్లికి ఫోన్ చేసి మొత్తుకుంది.
కొంత సేపు మౌనంగా విని, “పోనీలే అనూ… పాజిటివ్ గానే ఆలోచించు. ఏదేమైనా నువ్వు వాళ్ళతో ఉండాలనీ నువ్వు కావాలనే అనుకుంటున్నారు కానీ నిన్ను వద్దనుకోవటం లేదుగా వాళ్ళు! పండుగ పూట ఇంటి కోడలు కళకళలాడుతూ నట్టింట తిరగాలని కొంతమందికి ఉంటుంది. మీ ఆడపడుచుకు తన అత్తింట్లో ఆ ప్రాధాన్యత లేకే ఇక్కడికి రావాల్సి వస్తుందేమో? ఏదైనా అదే నీ ఇల్లు, నీ సామ్రాజ్యం, అక్కడే నువ్వు రాణిలా ఉండాలి, పంతాలకు పోయి నీ రాజ్యాన్ని నువ్వే విచ్చిన్నం చేసుకోకూడదు.” హితబోధ చేసింది తల్లి. సరే అని మనసు దిటవు చేసుకుంది అనుపమ.
“అంత ఆశ పెట్టి రావడం మానేస్తావా, నేనసలు పుట్టిన రోజే చేసుకోను పొమ్మ”ని కన్నీళ్ళు పెట్టుకున్న చెల్లెలిని బ్రతిమాలి బుజ్జగించింది. ఆ సాయంత్రం తను బెంగళూరు వెళ్తూ అనుపమని అతని తల్లిదండ్రుల దగ్గర దింపి వెళ్ళాడు గౌతమ్. పండుగ షాపింగ్, ఏర్పాట్లన్నీ అత్తగారు చెప్పినట్లు చేసింది. “మా ఇంటి పద్ధతి ప్రకారం ఇలా చేయకూడదు” అన్నప్పుడల్లా మనసు కలుక్కుమనిపించి, పోనీ “మన’ అనచ్చుగా అనిపించినా తనే ‘మమ’ అనుకుంటూ సర్దుకుంది.
పండుగ రోజు పొద్దున్నే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దామని ఫోన్ చేసినప్పుడు చెల్లెలి బిక్క ముఖం చూసి కలిగిన దుఖాన్ని , ఉక్రోషాన్ని పంటి బిగువున ఆపుకుంది అనుపమ. ఎనిమిది గంటల కల్లా ఆడపడుచు వాళ్ళు వచ్చేశారు. చీరతో పని చేయటం అలవాటు లేకపోయినా అత్తగారింట్లో ఉండటం వల్ల, అందునా పండగ అవటం వల్ల అత్తగారు చెప్పిన బరువైన పట్టుచీర కట్టుకునే వంటలో పాలుపంచుకోవాల్సి వచ్చి, నరక యాతనగా అనిపించసాగింది అనుపమకి.
“వైజాగ్ వెళ్తానన్నావు కానీ, కోడలువి నువ్విలా పట్టుచీర కట్టుకుని నట్టింట్లో తిరుగుతుంటే ఎంత లక్ష్మీ కళగా ఉంటుందో చూడు, నీకు మాత్రం అత్తింట్లో ఇలా మహారాణిలా తిరుగుతుంటే ఉన్న గౌరవం, ఆనందం పుట్టింట్లో దొరుకుతాయా?” అని అత్తగారు అంటుంటే… చేతుల్లో అప్పుడే తను ఎత్తిన అందరి ఎంగిలి టిఫిన్ పళ్ళాలు చూసుకుని నిర్వేదంగా నవ్వుకుంది అనుపమ. అయినా అందరితో సరదాగా కబుర్లు చెప్తూనే ఉంది. వంట చేస్తూ మధ్యలో ఒక సందేహం వచ్చి ఆవిడ చెప్పినట్లే చేద్దామని అత్తగారిని అడిగింది.. “అత్తయ్య గారూ, ఈ బంగాళదుంప, ఉల్లిపాయ కూరలో కొత్తిమీర వెయ్యనా వద్దా? మొన్నొకరోజు నేనీ కూర చేసి కొత్తిమీర వేస్తే మీ అబ్బాయి ఈ కూరలో కొత్తిమీర వెయ్యకూడదు అన్నారు, కానీ నాకు తెలిసి ఈ కూరలో కొత్తిమీర వేస్తారు.” ఆ మాట వింటూనే చుర చురా చూసింది విశాలాక్షి కోడలి వైపు. “వాడికి నచ్చదన్నప్పుడు మానెయ్యాలి కానీ “మీరు కొత్తిమీర వేస్తారా వెయ్యరా?” అని ఈ చర్చ ఎందుకు పెడుతున్నావ్ అసలు? వెయ్యం, మీ వైజాగ్ వాళ్ళ లాగా అన్ని కూరల్లో కొత్తిమీర వెయ్యం మేము. వాడికి అలవాటు లేదు కనుక నువ్వూ వెయ్యకు ఇకనుంచి. నీకు తినాలనిపిస్తే వైజాగ్ వెళ్ళినప్పుడు మీ పుట్టింట్లో వేసుకుని తిను. వాడింట్లో మాత్రం వాడికి నచ్చినట్లే వండు.” ఉగ్ర రూపంతో విరుచుకు పడింది. నివ్వెర పోయింది అనుపమ. ఏమంటోంది ఈవిడ? తను వండే వంటలో తనకిష్టమని కొత్తిమీర వెయ్యటానికి కూడా తనకిక్కడ అధికారం లేదా? పోనీ ఓసారి వాడికిష్టమైనట్లు, ఓసారి నీకిష్టమైనట్లు చేసుకో అనలేదు. అది అతని ఒక్కడి ఇల్లట! నాకు నచ్చినట్లు తినాలంటే పుట్టింటికి వెళ్లి తినాలట. ఏ పుట్టిల్లు? పెళ్ళయ్యాక అది నీ ఇల్లు కాదని పండగ సెలవుల్లో కూడా వెళ్ళనీయని పుట్టిల్లు. వాళ్లకి ఇష్టమైనట్లు ఉండడం కోసం… ఇది తన ఇల్లు. వాళ్ళ కోసం తనకు ఇష్టం అయిన వాటిని వదులుకోవాల్సి వస్తే చూపించే తాయిలం … నీ ఇల్లు, నీ సంసారం, నీ సామ్రాజ్యం!
బాధ్యతలు నెత్తిన మోపడానికి ఇచ్చిన మిధ్యా పదవులు… వంటింటి మహారాణిత్వం.. ఇంటి మహాలక్ష్మిత్వం, కానీ… అవన్నీ అబద్ధాలనీ… కోడళ్ళు అత్తవారితో కలిసి ఉండనీ, విడిగా ఉండనీ, స్త్రీలు తామే అద్దెలు కట్టనీ, ఈ. ఎమ్. ఐ లు కట్టనీ… ఏదీ తన ఇల్లు కాదనీ, కానీయరనీ…. తన ఇల్లు కాని చోట తన ఇష్టం ఏమీ సాగదని, సాగనీయరనీ.. పుట్టినప్పుడు ఆడపిల్లవి అనీ, మెట్టినప్పుడు ఆడదానివి అనీ అంటూ ఆడవాళ్ళను ఎక్కడైనా ‘ ఆడ ‘ అనే భావనలో ముంచుతూ పెంచుతారనీ, వంచుతారనీ… దాని దుంప తెగ ఒక చిన్న కొత్తిమీర రెబ్బ తేల్చేసింది. అనుకుంటుండగా…
అత్తగారు, ఆడపడుచు కలిసి పూజలో మణిద్వీప వర్ణన చదవటం మొదలు పెట్టేరు. కోడలికి తన ఇంట్లో తాను వండిన కూరలోనే కొత్తిమీర వేసుకునే హక్కు కూడా లేదనేవారు మహాశక్తి మణిద్వీపాన్ని ఏమి అర్థం చేసుకుని చదువుతున్నారు అసలు అన్న చిరాకుతో “వీళ్ళతో ఇలా కాదు” అనుకుని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది అనుపమ. “అమ్మాయ్! వండిన ప్రసాదాలు తీసుకురా, నైవేద్యం పెట్టాలి” అంటూ వెనక్కి తిరిగితే విశాలాక్షికి అనుపమ కనబడలేదు. ఎక్కడుందని లేచి చూస్తే గదిలో ఫోన్ మాట్లాడతూ కనబడింది. చిరాగ్గా మొహం పెట్టిన అత్తగారితో “ఏం లేదు అత్తయ్యగారు టికెట్ బుక్ చేస్తున్నా” అంది అనుపమ. “దేనికి?”
“పండుగకి ఇక్కడ కళకళలాడించటం అయిపోయిందిగా, సాయంత్రం ఫ్లైట్‌కి వైజాగ్‌కి టికెట్ బుక్ చేసుకున్నా.”.
“ఎందుకూ?” “కొత్తిమీర వేసిన బంగాళ దుంపకూర తిందామనిపించీ.” హా……….!

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.