అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్ మందార
(గత సంచిక తరువాయి…)
వెట్టి చాకిరీపై యాచారంలో మేం చేస్తున్న పోరాటానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ఇరుగుపొరుగు ప్రాంతాలకు తెలుస్తుండేవి. పత్రికల ద్వారా కాకుండా ఒకరినుంచి మరొకరికి మౌఖికంగా తెలిసేవి. ఇక్కడి జనాలకు అన్ని ఊళ్లల్ల్లో బంధువులుండేవారు. అందువల్ల అనేక ప్రాంతాల నుంచి జనం మా యాచారం కార్యాలయానికి వచ్చి చర్చలు జరిపేవారు.

కొందరైతే మెదక్ (150 కి.మీ.), మహబూబ్‌నగర్ (120 కి.మీ.), నల్గొండ (90 కి.మీ.) వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి తమ ప్రాంతంలో వెట్టి సమస్య ఎంత దారుణంగా వుందో మాకు వివరించేవారు. తీసుకున్న బాకీల కోసం అక్కడి భూస్వాములు జీతగాళ్లను చర్మం కమిలిపోయేలా కొట్టడం, నడుములు వంగిపోయేలా రోజుల తరబడి వీపుల మీద బండలు పెట్టి శిక్షించడం వంటి చిత్రహింసలకు ఎలా పాల్పడుతున్నారో చెప్పి మమ్మల్ని తమ ప్రాంతాలకు రమ్మని కోరేవారు. కానీ ఇక్కడి పనుýతోనే తలమున్కలైవున్న మాకు ఇబ్రహీంపట్నం తాలూకా బయటికి వెళ్లేందుకు ఏమాత్రం వెసులుబాటు వుండేదికాదు. అందువల్ల వారికి పిటిషన్లు bలా రాయాలో, ఏయే స్థానిక అధికార్లను కలవాలో వివరించి చెప్పేవాళ్లం. అయితే సామూహిక ప్రజా ఉద్యమానికి ఆ పిటిషన్లు ఏమాత్రం ప్రత్యామ్నాయం కావు. ఆ ప్రాంతాలలోని వెట్టి కూలీల పరిస్థితి ఎలావుందో, అక్కడేం జరిగిందో నాకు ఆ తర్వాత తెలియలేదు.
మా కార్యకలాపాలన్నీ అప్పుడు ఎక్కువగా యాచారం మండలం చుట్టుపక్కలే జరుగుతుండేవి. యాచారం ఇబ్రహీంపట్నానికి ఉత్తరం వైపున, కందుకూరుకు తూర్పు వైపున వుంటుంది. అక్కడ మాదిగలు పెద్ద సంఖ్యలో వుండేవాళ్లు. వారిలో చాలామంది చిన్న స్థాయి ప్రభుత్వోద్యోగులుగా పనిచేసేవారు. విద్యుత్ శాఖలో, టెలికామ్ విభాగంలో పనిచేస్తున్నవారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వార్డ్ బాయ్‌లుగా పనిచేస్తున్నవారు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో 4వ తరగతి ఉద్యోగులుగా పనిచేసేందుకు నగరానికి వెళ్లి వచ్చేవారు కూడా వున్నారు. ఆయా శాఖల్లోని దళిత సంక్షేమ సంఘాýతో అనుబంధం వల్ల వాళ్లు ఆర్థికంగానూ, సామాజికంగానూ కొంత మెరుగైన స్థితిలో వున్నట్టు అనిపించేది. ఏది ఏమైనా వాళ్లంతా మమ్మల్ని అభిమానించేవాళ్లు. టెలికాంలో పనిచేసే దళిత ఉద్యోగులు మాకు అప్పుడప్పుడు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించేవారు. సెల్ ఫోన్లు, ప్రజా టెలిఫోన్ బూతులు లేని ఆ రోజుల్లో అది మామూలు విషయం కాదు. ఆరోజుల్లో కేవలం రెడ్ల ఇళ్లల్లోనే టెలిఫోన్లు వుండేవి. వాళ్లు ఎలాగూ తమ ఫోన్లను ఉపయోగించుకోనివ్వరు. అలాంటి స్థితిలో టెలికాం శాఖలో పనిచేసే ఉద్యోగి బయట టెలిఫోన్ స్తంభం వద్దకు మమ్మల్ని రమ్మని చెప్పి అక్కడి నుంచి ఫోన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించేవారు. ఆ బిల్లుని ఏ రెడ్డి ఖాతాలోనో వేసేసేవారు. అదేవిధంగా మేం బహిరంగ సభలు జరుపుకుంటున్నప్పుడు దళిత ఉద్యోగులు మాకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించేవారు. ఇక మా తిండి విషయంలో యాచారం ప్రజలు చాలా ఉదారంగా సాయపడేవారు. మేం యాచారం వెళ్లినప్పుడల్లా బయట తినాల్సిన అవసరం వుండేది కాదు.
ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నిర్వహించే బహిరంగ సభలకు హైదరాబాద్ నుంచి కొందరిని ప్రధాన వక్తలుగా ఆహ్వానించేవవాళ్లం. బొజ్జా తారకం మా సమావేశాలకు ఎక్కువగా వచ్చేవారు. ఆయన పత్రికా సమావేశాలకు హాజరై పోలీసుల వేధింపులూ, చిత్రహింసలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు. కాలక్రమంలో అనేక నిజనిర్ధారణ కమిటీలు వచ్చాయి. వాటిలో అన్ని పక్షాలకు చెందినవాళ్లు` వామపక్షవాదులు, స్తీవాదులు, అంబేడ్కర్‌వాదులు వుండేవారు. మా బహిరంగ సభల్లో ప్రసంగాలు చేసిన వారిలో బి.ఎస్.ఎ. స్వామి, సురవరం సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ జి. హరగోపాల్, ఓల్గా వున్నారు. బి.ఎస్.ఎ. స్వామి వెనుకబడిన తరగతులవారి హక్కుల కార్యకర్త. బలమైన గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చిన న్యాయవాది. ఆ తరువాతి కాలంలో ఆయన హైకోర్టు జడ్జి అయ్యారు. ప్రొఫెసర్ హరగోపాల్ రాడికల్ వామపక్షానికి చెందిన మంచి వక్త. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పనిచేసేవారు. ఓల్గా ప్రముఖ తెలుగు రచయిత్రి. మొదట్లో మార్క్సిస్టు లెనినిస్ట్ ఉద్యమంలో పనిచేశారు. ఆ తరువాత 1980లలో ఆ ఉద్యమానికి దూరమై స్తీవాద ఉద్యమంలోకి వచ్చారు. ఒక ఎన్నికల సభ సందర్భంగా బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్‌పీ) అధినేత కాన్షీరామ్ కూడా వచ్చారు. ఆ సమయంలో బొజ్జా తారకం బీఎస్‌పీలో వుండేవారు. కాన్షీరామ్‌ను ఆహ్వానించడంలో ఆయనే సహాయం చేశారు. శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్‌పీకి వున్న అవకాశాలను అంచనా వేసేందుకు కాన్షీరామ్ అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చారు.
ఇబ్రహీంపట్నంలో గ్రామ స్థాయి సమావేశాల్లో మాట్లాడటం నాకు పెద్దగా సమస్యగా అనిపించేది కాదు. అవసరమైనప్పుడల్లా ఆ సమావేశాల్లో ఉపన్యసించేదాన్ని. కానీ భారీ బహిరంగ సభల్లో మాట్లాడాలంటే ఇష్టముండేది కాదు. చాలామంది మధ్యతరగతి ఉపన్యాసకుల సుదీర్ఘ ఊకదంపుడు ఉపన్యాసాలనీ, తమ గొంతును తామే మైక్‌లో వినడంపట్ల వారికున్న వ్యామోహాన్నీ, చెప్పిందే చెప్తూ అసలు విషయం గురించి మాత్రం స్పష్టంగా వివరించలేకపోవడాన్నీ గమనించిన తరువాత నాలో ఈ అయిష్టత ఏర్పడింది. నాకావిధంగా మాట్లాడటం రాదు కూడా. అందుకే ఎవరైనా వేదిక మీదకు రమ్మని పిలిచినా ఎప్పుడూ నిరాకరించేదాన్ని.
మా ఉద్యమం విస్తరిస్తున్న కొద్దీ భూస్వాముల నుంచి అడ్డంకులు ఎక్కువయ్యాయి. కానీ, ఇప్పుడు జనం మునపటిలా కాకుండా ధైర్యంగా వ్యవహరిస్తున్నారు. వారిలో అన్యాయాన్ని ఎదిరించాలన్న స్పహ పెరిగింది. 19 జులై 1986నాడు ఎలిమినేడు వెట్టి కూలీలు పని మానేసి సమ్మెలోకి దిగారు. అది మాకో పెద్ద విజయమనే చెప్పాలి. నిరంకుశ భూస్వామి అయిన భూపాల్ రెడ్డి అక్కడ బందూకుతో పెత్తనం చెలాయించేవాడు. ఇవాళ అతని కుటుంబానికి ఈ ప్రాంతంలో ఎంతో రాజకీయ పలుకుబడి వుంది. వెయ్యి ఎకరాలతో పాటు వారికి అనేక బస్సులూ, లారీలూ, పెట్రోల్ బంకులూ వున్నాయి. భూపాల్ రెడ్డి కొడుకు మంచిరెడ్డి కిషన్ (కష్ణా) రెడ్డి 2009 నుంచీ` ఈ పుస్తకం రాస్తున్న సమయం వరకూ ఇబ్రహీంపట్నంలో మూడు సార్లు శాసన సభ్యుడిగా వున్నాడు. మొదట తెలుగు దేశం పార్టీలో వుండేవాడు. 2018లో తెలంగాణా రాష్ట సమితిలో చేరాడు. జనం అతని స్వభావాన్ని బట్టి ‘నక్క’ అంటుండేవారు. నక్కలు జిత్తులమారితనంతో, తియ్యని మాటలతో బురిడీ కొట్టిస్తుంటాయి కదా.
కిషన్ రెడ్డి తండ్రి భూపాల్ రెడ్డికి సోదరుడైన రఘునందన్ రెడ్డి 1950లలో ఒక రజక స్తీ మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతనిపై కేసును కూడా రిజిష్టర్ చేశారు. ఆరోజుల్లో కేసు రిజిష్టర్ కావడం అంటే విశేషమే. అయితే, అతని న్యాయవాది బోనాల కష్ణారావు చలాకీతనంవల్ల ఆ కేసు వీగిపోయింది. చివరి నిజాం కాలంనాటికి భూపాల్ రెడ్డి, ఆయన ఐదుగురు సోదరులు కేవలం ఇరవై ఎకరాలున్న ఒక రైతు కుమారులు. అయితే ముస్లింలు కమ్యూనిస్టు రైతాంగ పోరాటం ధాటికి నిలబడలేక అక్కడి నుంచి పారిపోయినప్పుడు ఈ కుటుంబ పెద్ద భయోత్పాతం సష్టించి వారి భూముల్ని ఆక్రమించుకున్నాడు. ఆవిధంగా హైదరాబాద్‌కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతంలో 1980ల నాటికి దాదాపు 1200 ఎకరాల భూములు ఈ కుటుంబం నియంత్రణలోకి వచ్చాయి. ఎలిమినేడు, మాదాపూర్, జబ్బార్ గూడెం ` ఈ మూడు గ్రామాలను ఆరుగురు సోదరులు పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. వారిలో ఒకరు సహకార సంఘం చైర్మన్ కాగా మరొకరు అటవీ వనరులను నియంత్రించేవాడు. మూడోవాడు గ్రామ పట్వారీ. నాలుగోవాడు పోలీస్ పటేల్. ఐదోవాడు సర్పంచ్. వాళ్ల కొడుకులు కూడా అదే బాటలో నడిచారు. చెర్లపటేల్‌గూడెంకు చెందిన మాజీ పంచాయితీ సమితి అధ్యక్షుడు, బలమైన నాయకుడు అయిన యాదగిరి రెడ్డి చనిపోయిన తరువాత 1985 నుంచీ మంచిరెడ్డి కుటుంబం ఇబ్రహీంపట్నం మీద పట్టు బిగించారు. వారి కొత్త తరంలో ఒక సోదరుడు హెడ్ మాస్టర్‌గా వుంటే, మరొకరు గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. గ్రామంలో వాళ్లే బడా వ్యవసాయదార్లు.
1980లలో ఇబ్రహీంపట్నంలో వున్న ఏకైక పెట్రోల్ పంపు ఆ కుటుంబానిదే. వాళ్లకి ఇంకా అనేక బియ్యం మిల్లులుండేవి. రోడ్ల నిర్మాణం, విద్యుత్ కేబుళ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటి కాంట్రాక్టులన్నీ వాళ్లకే వచ్చేవి. కిషన్ రెడ్డి సోదరుడు రఘునందన్ రెడ్డి కొడుకు వెంకటరామి రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిఫ్ మెజిస్టేట్ కోర్టులో ప్రముఖ న్యాయవాది. కష్ణా రెడ్డి తన సోదరిని యడ్మ కష్ణా రెడ్డికిచ్చి పెళ్లి చేశాడు. అతను కల్వకుర్తిలో బలమైన స్వతంత్ర శాసన సభ్యులు. ఆతరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2004లో మళ్లీ ఆ పార్టీ తరఫున ఎంఎలఎగా గెలిచాడు. ఆ ప్రాంతంలోని ప్రతి ప్రముఖ రెడ్డి కుటుంబంతో వారికి వివాహ బంధుత్వాలున్నాయి. అందులో హైకోర్టు న్యాయమూర్తులు మొదలుకుని ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికార్ల వరకూ వుంటారు. ఈవిధంగా వాళ్ల సామ్రాజ్యం ఇక్కడ ప్రతిచోటా వేళ్లూనుకుని వుంది. అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఆ కుటుంబం ఇతర్లతో చాలా దుర్మార్గంగా వ్యవహరించేది. చేతిగడియారం దొంగిలించాడన్న అనుమానంతో ఒక డ్రైవర్‌ను వాళ్లు చెట్టుకు కట్టేసి చితక బాదారు. అలాగే వాళ్ల పళ్లతోటలో ఏ కూలివాడైనా ఒక పండు తెంపుకుంటే చాలు ఇలాగే దారుణంగా శిక్షించేవారు. జబ్బార్‌గూడెంలో రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో వాళ్లు అక్కడి ప్రజలతో దశాబ్దాల పాటు bట్లా పోట్లాడారో పాత ఇబ్రహీంపట్నం తాలూకా మొత్తానికి తెలుసు.
ఎలిమినేడు వెట్టి చాకిరీ కూలీలు పని మాని సమ్మెకు దిగడం అనేది అసాధారణ విషయం. 19 జులై 1986 నాడు వాళ్లు కనీస వేతనాల కోసం నినాదాలు చేస్తూ శాంతియుతంగా ఒక ఊరేగింపును తీశారు. భూస్వాముల ముఠా ఆ ఊరేగింపు మీద వెనక వైపు నుంచి కర్రలతో, రాళ్లతో దాడి చేసింది. స్థానిక కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, బాగా పలుకుబడి వున్న ఒక న్యాయవాది కూడా ఆ ముఠాలో వున్నారు. వెట్టి కూలీల ఊరేగింపు చివర్లో నెమ్మదిగా నడుస్తూన్న వద్ధుల మీద వాళ్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ దాడిలో దాదాపు ఇరవై మంది కూలీలు గాయపడ్డారు. కొద్దిమంది భూస్వాములకు కూడా దెబ్బలు తగిలాయి. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎసఐ అంజయ్యను భూస్వాములు బండ బూతులు తిట్టారు. పెద్ద బండ రాయితో అతణ్ని కొట్టారు. అంజయ్య తలమీద ఆరు కుట్లు పడ్డాయి.ఈ గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ ఐదారుగురు పోలీసులు డ్యూటీ మీదున్నారు. కానీ వారిలో ఒక్కరు కూడా తమ పై అధికారిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. ఆరోజు సాయంత్రం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో గాయపడ్డ కూలీలు మూలుగుతుండగా పొద్దుపోయిన తరువాత దాడి చేసిన భూస్వాములను అక్కడికి తీసుకొచ్చారు. వారి ‘అరెస్టు’ ను ఆమోదించేందుకు ఒక ఎఎస్‌పి స్థాయి పోలీసు అధికారి హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చారు. ఆ భూస్వాములను ఎస్కార్ట్‌తో హైదరాబాద్‌లోని ఒక గెస్ట్ హౌస్‌కు తరలించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో వుంటే వాళ్ల ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని అలా చేశారు. మర్నాడు ఉదయమే మెజిస్టేట్ గారు వ్యక్తిగత పూచీ కత్తుపై వారిని విడుదల చేసేశారు. సబ్ ఇన్స్‌పెక్టర్ అంజయ్యను (బీసీ కులానికి చెందిన వ్యక్తి) కొద్ది నెలల్లోనే అక్కడి నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆ కేసులో చార్జ్‌షీట్ కూడా నమోదు చేయలేదు. మేం ఆ విషయమై అడగడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడల్లా ఓ ప్రైవేటు ఫిర్యాదు చేసుకోండి అని సలహా ఇచ్చేవారు. ఈ ఘటనలో పాత్రలు తారుమారై ` ఒకవేళ వ్యవసాయ కూలీలే గనక ఆ భూస్వాములను, సబ్ ఇన్స్‌పెక్టర్‌ను కొట్టి వుంటే పరిస్థితి ఎలా వుండేదో ఎవరైనా ఊహించుకోవచ్చు.
భూస్వాములు వెట్టి కూలీలను ఆ మరునాడే పిలిపించి తక్షణమే తమవద్ద తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించమనీ లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనీ బెదిరించారు. అయినా వ్యవసాయ కూలీలు గట్టిగా నిలబడటంతో రెడ్లు వాళ్ల మీద సామాజిక బహిష్కరణను విధించారు. దళితులు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్న పొలాల్లో కోత కొచ్చిన పంటలను కోయనివ్వకుండా భూస్వాములు అడ్డుకున్నారు. ఏ రెడ్డి కుటుంబమైనా దళితులతో ఎలాంటి సంబంధమైనా పెట్టుకుంటే ఐదు వందల రూపాయల జరిమానా, ఐదు చెప్పు దెబ్బలు అంటూ మంచిరెడ్డి కుటుంబం హెచ్చరికలు జారీ చేసింది. అయితే చిన్న చిన్న కమతాలున్న రెడ్లు ఆ హెచ్చరికను పట్టించుకోమంటూ దళితులకు ప్రైవేటుగా భరోసా ఇచ్చారు. కానీ, మంచిరెడ్డి కుటుంబీకులంటే వున్న భయం వల్ల ఆ మాట పైకి అనలేకపోయారు.
జులై నుంచీ ఎంఆరఓ మొదలుకుని ఆర్‌డిఓకూ, కలెక్టర్‌కూ మేం సమర్పించిన పిటిషన్లన్నీ గాలికి కొట్టుకుపోయినట్టున్నాయి. ఆ గ్రామాన్ని సందర్శించిన విలేఖరులు దళితుల కడగండ్లను కళ్లకు కట్టినట్టు పత్రికలలో రాశారు. రంగారెడ్డి జిల్లా ఆర్‌డీఓ, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి కూడా గ్రామానికి వచ్చివెళ్లారు. కానీ, కౌలుదార్లకు రావలసిన బకాయీలను మాత్రం ఇప్పించలేకపోయారు. ఈలోగా వెట్టి చాకిరీ కార్మికుల దరఖాస్తులపై విచారణ జరపాల్సిన షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంస్థ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశోక్ రావు విచారణకు రెండు సార్లు తేదీలను ప్రకటించారు కానీ విచారణను జరపలేదు. ఆతర్వాత ‘బోగస్ పిటిషన్ల’ పట్ల జిల్లా ప్రణాళికా బోర్డు ఆగ్రహంగా వుంది కాబట్టి తాను విచారణ జరపడం లేదని పేర్కొన్నారు. అంతకు ముందే 9 ఏప్రిల్ 1986న పెండింగ్‌లో వున్న దరఖాస్తులనన్నింటినీ వెంటనే పరిష్కరించమని హైకోర్టు రంగారెడ్డి జిల్లా కలక్టర్‌కు ఆదేశాలిచ్చింది కాబట్టి మేము అసిస్టెంట్ bగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసును ఇచ్చాం. 23 అక్టోబర్ నాడు ఖైరతాబాద్‌లో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ గల ఈనాడు దినపత్రిక ఆఫీసు వెనకాలే వున్న జిల్లాపరిషత్ కార్యాలయం ముందు ఒక రోజంతా ధర్నా చేశాం.
ఎలిమినేడు మాదిగలందరినీ ఒక్క తాటిమీదకు తీసుకురావడం మాకు చాలా కష్టమైౖంది. ఒకప్పుడు ఆ ఊరి సర్పంచ్ పదవి ఎస్‌సీలకు కేటాయించారు. ఆ సమయంలో మంద స్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా వుండేవాడు. మాదిగ కులానికి చెందిన వ్యక్తిగా అతను మా పోరాటానికి ఆమోదం తెలిపేవాడు. నాతో స్నేహంగా వుండేవాడు. కానీ, ఆ ప్రాంత భూస్వాముల నేతత్వంలో నడిచే కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రం మా ఉద్యమం పట్ల చాలా ఆచితూచి వ్యవహరించేవాడు. ఇతర మాదిగలను వెనక్కి లాగుతుండేవాడు. తాము ఆ ప్రాంతంలోని అత్యంత శక్తివంతులైన రెడ్డి భూస్వాములను ఎదుర్కొంటున్నామన్న సంగతి మాదిగలకు తెలుసు. అందువల్ల సహజంగానే వాళ్లు జాగ్రత్తగా వుండాలి. మంచిరెడ్డి భూస్వాములు తమ చర్యల ద్వారా గ్రామంలోని మాదిగలంతా అనివార్యంగా ఒక్కతాటి మీదకు వచ్చేలా చేశారు. మేం ఎంతో కాలంగా ప్రయత్నించినా సాధ్యంకాని పని అది. భూస్వాములు కూలీలకు పని దొరక్కుండా చేయడం వల్ల కేవలం వెట్టి చాకిరీ కూలీలకు మాత్రమే కష్టాలు పరిమితం కాలేదు. కౌలుదార్లు, వ్యవసాయ కార్మికులు ప్రతి ఒక్కరిపై దాని ప్రభావం పడింది. ఈ విషయాన్ని అందరూ గ్రహించారు. దాంతో ఎలిమినేడు మాదిగలు భూస్వాముల ఇళ్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా పది రోజుల పాటు ముట్టడించారు. ఆ ముట్టడి కార్యక్రమంలో మహిళలే ముందువరుసలో వుండేవారు. మంచిరెడ్లు ఎవరూ ఇంట్లోంచి కాలు తీసి బయట అడుగు పెట్టలేకపోయారు. పెడితే మాదిగ మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుందని వారికి తెలుసు. ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ పోలీసు సాయుధ బలగాలు ఆందోళన కారులను ఈడ్చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. అదొక అపూర్వమైన ధర్నా. మహిళలు పోలీసుల మీద ఉమ్ముతూ, అవహేళన చేశారు. నినాదాలతో, పాటలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఏ భూస్వామీ వీధుల్లో స్వేచ్ఛగా తిరగలేకపోయాడు. చివరికి వాళ్లు కౌలుదార్లకు బకాయీలు చెల్లించడానికి అంగీకరిస్తూ వారితో ప్రైవేటు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
మా సంఘం మహిళలు సభల్లో, ధర్నాల్లో అద్భుతమైన పాటలు పాడేవారు. గంటల తరబడి పాడగలిగేవారు. అప్పటి కప్పుడు పాటలు సిద్ధంచేసి బాణీలు కూర్చేవారు. ప్రధాన గాయని ఒక చరణం ఆలపిస్తే మిగతావాళ్లంతా కోరస్ అందుకునేవారు. మొత్తం పరిస్థితిని పాటల్లో గొప్పగా వివరించేవారు. నేను వాళ్ల అసాధారణ సజనాత్మకతకు ఆశ్చర్యపడిపోతూ గంటల తరబడి ఆ పాటలను వింటూ కూర్చునేదాన్ని. వాళ్లు బాగా పాడారనే కాదు, అందరూ కలసి సమష్టిగా అప్పటికప్పుడు అందమైన కథలు అల్లి, చక్కని బాణీలను కూర్చి అద్భుతమైన పాటలను రూపొందిస్తుండడం వల్లకూడా.
ఎలిమినేడు పోరాటం ముగిసిన తరువాత సిపిఎం పార్టీ నుంచి కె. కష్ణమూర్తి నాయకత్వంలో ఒక ప్రతినిధి బందం ఆ గ్రామానికి వచ్చింది. గ్రామస్తులను కలుసుకున్న తరువాత వాళ్లు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో భూస్వాముల హింసాకాండను ఖండించారు. అంతటితో ఆగిపోకుండా కొన్ని విధ్వంసక శక్తుల పక్షపాత వైఖరిని కూడా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఆ విధ్వంసక శక్తుల్లో దళిత సంస్థలు, అవేర్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు (దాని నిర్వాహకుడు పి.కె.ఎస్. మాధవన్ అనే మలయాళీ. ఆరోజుల్లో హైదరాబాద్‌లో అనేక స్వచ్ఛంద సంస్థలకు మలయాళీలే సారథ్యం వహించేవారు) ‘వ్యవసాయ కూలీలకు ఒక ట్రేడ్ యూనియన్‌ను రిజిష్టర్ చేయించిన ఓ హైదరాబాద్ అడ్వొకేట్ భార్య’ కూడా వున్నట్టు అందులో పేర్కొన్నారు. వాళ్ల ఆరోపణ ఏమిటంటే ‘హరిజనులకూ హరిజనేతరులకూ’ మధ్య మేం చిచ్చు పెడుతున్నామట.
ఆ సమయానికి నాకు తెలుగు భాషలో మరికొంత ప్రావీణ్యం వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే నేను తెలుగులో ధైర్యంగా, సమర్థవంతంగా, అప్పుడప్పుడూ రెచ్చగొట్టే విధంగా కూడా కరపత్రాలు రాయగలుగుతున్నాను. స్థానిక ఎంఆరఓకు వ్యతిరేకంగా ఎప్పుడు ప్రదర్శన నిర్వహించినా మా కరపత్రం శీర్షిక ‘చెట్టుమీద కొంగ: ఎంఆరఓ దొంగ’ అన్న పద్ధతిలో వుండేది. ఎప్పుడైనా నాకు తెలిసిన తెలుగు భాష సరిపోక కరపత్రం రాయడంలో ఇబ్బంది అనిపిస్తే బొజ్జా తారకంను రాసిమ్మని అడిగేదాన్ని. ప్రతి సందర్భంలో మేం కరపత్రాలను వెలువరించేవాళ్లం. ప్రతి సమ్మె, ప్రతి సంఘటన, ప్రతి దుర్మార్గం మీద కరపత్రాలను ముద్రించి వేల సంఖ్యలో జనానికి పంచేవాళ్లం. హైదరాబాద్‌లోని అనుపమ ప్రింటర్స్ రమణమూర్తి మా కరపత్రాలూ మొదలైనవి ఉచితంగా ముద్రించి ఇచ్చేవారు.
ఒక ఊరు తర్వాత మరొక ఊరులో వెట్టిచాకిరీ కూలీలందరూ అప్పులు కట్టం, పనులకు రాం అంటూ ఎదురు తిరుగుతుండటంతో భూస్వాములు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. కొందరు భూస్వాములైతే తమ దగ్గర వెట్టి పనిచేసే కూలీల దగ్గరనుంచి ప్రామిసరీ నోట్ల మీద వేలిముద్రలు వేయించుకున్నారు. నాయనంపల్లి గ్రామానికి చెందిన అభిలేని జంగయ్య అనే వెలమ భూస్వామి 1985లో ఇబ్రహీంపట్నం మున్సిఫ్ కోర్టులో అలాంటి ప్రామిసరీ నోటు ఆధారంగా బాకీ వసూలుకోసం కేసు వేశాడు. అయితే, మా వకీలు ఆ డబ్బు రుణం కాదనీ వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ప్రకారం |îట్టి పనికి ఇచ్చిన డబ్బనీ వాదించి ఆ కేసును విజయవంతంగా కొట్టివేయించారు.
అదేగ్రామంలో వెట్టి కూలీలు అప్పులు కట్టడానికి నిరాకరించి పనులు మానేసినప్పుడు కొందరు భూస్వాములు ఆ వెట్టి కూలీల తాలూకు ఆడవాళ్లకు కూలిడబ్బులు నిలిపివేశారు. ఇది మాదిగలపై దొరలు చేసిన మరో ప్రతీకార దాడి. అప్పుడు ఇరవై మంది ఆడకూలీలు నానా అవస్థలు పడ్డారు. ఈ విషయంలో కార్మిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో వాళ్లు జిల్లా లేబర్ కమిషనర్‌కు తమ వేతన బకాయీలు ఇప్పించవలసిందిగా కోరుతూ పిటిషన్లు సమర్పించారు. 1986లో జిల్లా లేబర్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆ మహిళా కూలీలకు రావలసిన వేతన బకాయీలను భూస్వాముల నుంచి తక్షణమే వసూలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయినాసరే భూస్వాములు చెల్లించకపోవడంతో మేము 1987లో మున్సిఫ్ కోర్టుకు వెళ్ళాం. మున్సిఫ్ మెజిస్టేట్ దాదాపు సంవత్సరం పాటు స్పందించకుండా కేసును నానబెట్టారు. నిరాశా నిస్పహలకు గురైన మహిళా కూలీలు 1988లో జిల్లా జడ్జి వద్దకు వెళ్లారు. ఆ వెంటనే జిల్లా జడ్జి నుంచి మున్సిఫ్ మెజిస్టేట్‌కు కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఒక లేఖ వెళ్లింది. మున్సిఫ్ మెజిస్టేట్‌లో అప్పుడు చలనం వచ్చింది. ఆయన వెంటనే ఆ భూస్వాముల ఆస్తులను జప్తు చేసి మహిళా కూలీల వేతన బకాయీల వసూలుకు కోర్టు బంట్రోతును నియమించారు. తదనంతరం అంతా సినిమాలో లాగా జరిగింది. కొంతమంది భూస్వాములు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని మాయమైపోయారు. మరికొందరు భూస్వాములైతే ఇంటికొచ్చిన కోర్టు బంట్రోతును ఒక గదిలో గంటల తరబడి నిర్బంధించారు. చివరకు ఐదుగురు భూస్వాముల ఆస్తులు జప్తుచేయబడ్డాయి. అంతవరకూ కనీవినీ ఎరుగని సంఘటన ఇది. మొత్తం ఇబ్రహీంపట్నమే అదిరిపోయింది. భూస్వాములు లక్షలాది రూపాయలమేర సహకార బ్యాంకు రుణాలను ఎగ్గొట్టినా, వసూలు చేసిన భూమి శిస్తును తహశీల్దార్లకు కట్టకపోయినా గత ముఫ్పై ఏళ్లలో ఎన్నడూ వాళ్ల ఆస్తుల మీద ఇలా చేయి వేసిన సంఘటన ఒక్కటి కూడా లేదు. చాలామంది భూస్వాములు గడగడలాడుతూ వచ్చి మున్సిఫ్ మెజిస్టేట్ వద్ద వేతన బకాయీల మొత్తాలను చెల్లించి వెళ్లారు. ఆ తరువాత ఆ డబ్బును మహిళా కూలీలకు అందజేయడం జరిగింది. ఈ పోరాటం పద్ధెనిమిది నెలల సుదీర్ఘ కాలంపాటు కొనసాగినప్పటికీ అంతిమ విజయం దక్కింది. “ఆడోళ్లతోని ఏమైతది?” అంటూ అవహేళన చేసిన దొరల మొహం మీద కొట్టినట్టయింది.
మరో కేసులో మల్లా రెడ్డి అనే వెట్టి కూలీ తనను చౌదరిపల్లి గ్రామంలోని భూస్వామి వీజీ రెడ్డి చెర నుంచి విముక్తి చేయమని కోరుతూ యాచారం ఎంఆరఓకు ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ భూస్వామికి అది ఆగ్రహం తెప్పించింది. వెంటనే అతను మల్లా రెడ్డికి చెందిన ఒక ఆవునూ, రెండు దూడలనూ స్వాధీనం చేసుకున్నాడు. పైగా ఆ పశువులను తనే వీజీ రెడ్డికి అమ్మినట్టు మల్లా రెడ్డి చేత ఒక నోటు మీద సంతకం పెట్టించుకున్నాడు. మల్లా రెడ్డికి కొంత మానసిక వైకల్యం వుంది. అందువల్ల అతని భార్య యశోద ఆ సమస్యను తన చేతుల్లోకి తీసుకుంది. తమ పశువులు దొంగిలించబడ్డాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు కోర్టు వరకూ వెళ్లింది. అయితే వాటిని మల్లా రెడ్డి తనకు అమ్మినట్టు వీజీ రెడ్డి చేతిలో బలమైన సాక్ష్యం వుంది. నిజానికి భూస్వామి వీజీ రెడ్డికి ఆ పశువులు అవసరంలేదు. అతను కేవలం తిరగబడుతున్న మల్లా రెడ్డికి బుద్దిచెప్పాలనుకున్నాడు. పశువుల్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో పెట్టి వాటి ఆలనాపాలనా మల్లా రెడ్డి చూసుకునేలా ఇరువురి మధ్యా రాజీ కుదిర్చారు. వీజీ రెడ్డి బంగళా ఊరి చివరన వుండేది. నేను చౌదరిపల్లి నుంచి యాచారం వెళుతున్నప్పుడల్లా మమ్మల్ని పెద్ద ఇరకాటంలో పెట్టినందుకు వీజీ రెడ్డిని అసహ్యించుకుంటూ ఆ బంగళావైపు చూసేదాన్ని. అతను అప్పటికే ఊరి చివరన వుండేవాడు కాబట్టి అతని మీద సాంఘిక బహిష్కరణ ప్రకటించినా పెద్దగా ప్రయోజనం వుండదు. పైగా అతని వద్ద లైసెన్సు తుపాకీ వుండటంవల్ల జనం అతనంటే భయపడేవారు. మల్లా రెడ్డి యాచారం పక్కన మొగుళ్లంపు అనే చిన్న పల్లెలో వుండేవాడు. అతడిని అతని భార్య యశోదనీ యాచారం మాదిగలు అక్కున చేర్చుకుని తమ మాదిగ వాడలో ఆశ్రయమిచ్చారు. వారి కేసును సంఘం దష్టికి తెచ్చారు. వాళ్లు ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలబడ్డారు. ఆ మరుసటి సంవత్సరం మల్లా రెడ్డి యశోదలు తమ నివాసాన్ని శాశ్వతంగా యాచారంలోని మాదిగల వాడకు మార్చుకున్నారు.
ఆ తరువాత మేము హైకోర్టులో కేసువేసి వాళ్ల ఆవు దూడలను పోలీసు స్టేషన్‌నుంచి విడిపించాం. కాకపోతే అందుకు కొంత డబ్బును ఇబ్రహీంపట్నం క్రిమినల్ కోర్టులో డిపాజిట్ చేయాల్సి వచ్చింది. ఆ తదనంతరం ఆ డబ్బును మేం శాశ్వతంగా కోల్పోయాం. కానీ నైతిక విజయం మాత్రం మాకే దక్కింది. ఆ పశువుల్ని యాచారం పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు అవి ఊరంతా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తూ తిరిగాయి. యశోద, మా రైతు కూలీ సంఘం కలసి సాధించిన విజయాన్ని అవి ఒక వేడుకగా జరుపుకున్నాయి. ప్రతి చిన్న విజయం తరువాత ఊరేగింపును తీసినట్టు అప్పుడు మేం ఊరేగింపు తీయాల్సిన అవసరం రాలేదు.
వెట్టి చాకిరీ నిర్మూలన చట్టాన్ని అమలు చేయాలంటూ న్యాయస్థానాలపై ఒత్తిడిని తీసుకురావడంతో వందలాది మంది పిల్లలు పశువు కొట్టాల వెట్టి పనుల నుంచి విముక్తిని పొందారు. వాళ్లను మామూలు పాఠశాలల్లో వారి వయసున్న పిల్లల మధ్య చేర్పించడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే వాళ్లు చాలా కాలంగా చదువుకు దూరమైవున్నారు. మొదట్లో వాళ్లని మేం ఇబ్రహీంపట్నం, యాచారం, మేడ్‌పల్లి లోని ప్రభుత్వ ఎస్‌సీ, బీసీ వసతి గహాల్లో చేర్పించాం. అయితే అవి అప్పటికే క్రిక్కిరిసిపోవడంతో వేరే ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. వాళ్లని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ వసతి గహాల్లో చేర్పించాం. ఆరోజుల్లో అందుకు నిబంధనలు చాలా సులభంగా వుండేవి. పిల్లల కులం సర్టిఫికేటు, తల్లిదండ్రుల ఆదాయం సర్టిఫికేటు హాస్టల్ వార్డెన్‌కు సమర్పిస్తే సరిపోయేది. ఇబ్రహీంపట్నం, యాచారంల నుంచి పెద్ద సంఖ్యలో పిల్లల్ని తీసుకురావడం పట్ల వార్డెన్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు మేం పై అధికార్ల వద్దకు వెళ్లాం. అప్పుడు డి.ఆర్. గార్గ్, సోషల్ వెల్‌ఫేర్ కమిషనర్ మాకు సహాయం చేశారు. ‘ఎంత మంది పిల్లల్నైనా తీసుకురండి, మేం వసతి కల్పిస్తాం’ అంటూ హామీ ఇచ్చారు.
తమ పిల్లల్నే కాకుండా ఇతర పిల్లల్ని కూడా చదివించాలని తహతహలాడే వ్యవసాయ కూలీలు కూడా చాలామందే వుండేవారు. అలాంటివారిలో కప్పాడ్ గ్రామానికి చెందిన మేకల గాలయ్య ఒకరు. అతను ఒక ీVAంగార్డు యునిఫాంని అద్దెకు తీసుకుని ఊళ్లో పిల్లల్ని బడికి పంపించని తల్లిదండ్రులను కలసి మీలాంటి వారి జాబితాను తయారుచేసి పై అధికారులకు పంపిస్తున్నాననీ, వెంటనే మీ పిల్లల్ని బడికి పంపించకపోతే మీకు జైలు శిక్ష తప్పదనీ హెచ్చరించేవాడు. వాళ్ల పిల్లల్ని పట్టుకుని మీరు గనక మధ్యలో వసతి గహం నుంచి పారిపోయి వస్తే మీ అమ్మా నాన్నలు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించేవాడు. (అంతకు ముందు చాలా మంది పిల్లలు అలా వసతి గహాల నుంచి పారిపోయి వస్తుండేవారు). మేకల గాలయ్య తరచూ వివిధ వసతి గహాలకు వెళ్తూ పిల్లల యోగక్షేమాలు కనుక్కుని వారి తల్లిదండ్రులకూ, ఆ తల్లిదండ్రుల క్షేమసమాచారాలని పిý్లలకూ తెలియజేస్తుండేవాడు. అలాగే పిల్లల్ని హింసించే ఉపాధ్యాయుల గురించీ, హాస్టళ్లలో నాసిరకం తిండీ, పుస్తకాల కొరతా, పిల్లల గజ్జి వంటి ఆరోగ్య సమస్యలను పట్టించుకోకపోవడం వంటి సమస్యల గురించీ మా సంఘంకు చెప్పి తగిన చర్యలు తీసుకొమ్మని కోరేవాడు. హాస్టల్ పిల్లలకి ట్రంకు పెట్టెలు, ప్రతిఏటా పక్క దుప్పట్లు ఇప్పించమని అడిగేవాడు. మేం వాటన్నింటి మీదా ఆయా అధికార్లకు పిటిషన్లు సమర్పించేవాళ్లం.
ఆ పిల్లల్లో చాలామంది పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. కొందరు మాత్రమే కాలేజీల్లో చేరారు. కానీ మిగతా అందరూ తమ గ్రామాల్లో నాయకులయ్యారు. నల్లవెల్లిలో ప్రస్తుతం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాదరి ఒకప్పుడు తన గ్రామం నల్లవెల్లిలో వెట్టి కూలీ. మేం అతడిని యాచారం సమీపంలోని మేడ్‌పల్లి వసతి గహంలో చేర్పించాం. పాఠశాల చదువు పూర్తయిన తరువాత అతను మాతో కలసి అనియత విద్య ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. కష్టపడి చదువుకుంటూ గ్రాడ్యుయేషన్‌నూ ఉపాధ్యాయ శిక్షణనూ పూర్తి చేశాడు. అలాగే కందుకూరు రామచంద్రయ్య తన స్వగ్రామం నానక్‌నగర్‌లో సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఆతరువాత జిల్లా టెరిటోరియల్ ప్రదేశ్ కమిటీ సభ్యుడై మండల అభివద్ధి కార్యాలయ పనులను పర్యవేక్షించేవాడు. ఇక కిషన్‌పల్లి గ్రామానికి చెందిన గుడుగుండ్ల నరసింహ కూడా అనియత విద్యా కార్యక్రమ ఉపాధ్యాయుడిగా చేరాడు. ఆ తరువాత అతను సమీప గ్రామమైన మాల్‌కు ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు.
మా విద్యా కార్యక్రమాల అద్భుత ఫలితాలను చూసిన తరువాత స్వయంగా అనియత విద్యా పాఠశాలలను నెలకొల్పాలని సంఘం నిర్ణయించుకుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటికి నామ మాత్రపు నిధులను ఇస్తుండేది. 1977`78లో సామాజిక, ఆర్థిక, సాంస్కతిక పరిస్థితుల కారణంగా సాధారణ పాఠశాలల్లో చదువుకోలేకపోయిన 6 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం అనియత విద్యా పథకాన్ని (ఎనఎఫఇ) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. మొదట్లో అది విద్యాపరంగా వెనుకబడిన పది రాష్టాలకే పరిమితమయింది. ప్రధానంగా పట్టణాలలోని మురికి వాడలు, కొండ ప్రాంతాలు, గిరిజన, ఎడారి ప్రాంతాల మీద దష్టిని కేంద్రీకరించారు. వయోజన విద్యా శాఖవారు ఎనఎఫఇ సిలబస్‌ను రూపొందించారు. ఏడవ, పదవ తరగతి బోర్డు పరీక్షలకు సంసిద్ధం చేసేలా విద్యార్థులకు సహాయం చేసేవారు. ఇక్కడి ఉపాధ్యాయులకు కళాశాల చదువు, ఉపాధ్యాయ శిక్షణ వుండేదికాదు. పేద పిల్లలకు ఆ కార్యక్రమం ప్రామాణికంగా కాకుండా నాసిరకంగా వుండేది. ప్రభుత్వ నిధులు అందాలంటే ఒక సొసైటీ కావాలి. అందుకే నేను 1986లో ‘చేయూత’ అనే పేరుతో ఒక సొసైటీని రిజిష్టర్ చేయించాను. అందులో బ్యాంకర్ ఓ. దివాకర్, న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి, వ్యవసాయ శాస్తవేత్త డా. చౌదరి, డా. ఏకే వాసుదేవన్, నేనూ వ్యవస్థాపక సభ్యులం. వాళ్లంతా నా స్నేహితులే. అభివద్ధి కార్యక్రమాల కోసం ఉద్దేశించిన చేయూతని కేంద్ర, రాష్ట ప్రభుత్వాల నిధులు లభించేవిధంగా ఒక సొసైటీ కింద రిజిష్టర్ చేయించాం. కేంద్ర ప్రభుత్వ వయోజన విద్యా శాఖ వారి ఎనఎఫఈ కార్యక్రమంలో చేరి 25 పాఠశాలలను నెలకొల్పాం. అవన్నీ సాయంకాల పాఠశాలలు. అందులో పనిచేసే పార్ట్ టైమ్ ఉపాధ్యాయులకు 150 రూపాయల ఉపకార వేతనం చెల్లించేవాళ్లం. ఆ పాఠశాలల పట్ల మా సంఘం ఎంతో ఆసక్తిని కనబరిచేది. అందులో పనిచేసే ఉపాధ్యాయులు పాఠశాలకు సరిగా వస్తున్నారా… పాఠాలు సరిగా చెబుతున్నారా లేదా అని పిల్లల తల్లిదండ్రులు పాఠశాల బయట కూర్చుని పర్యవేక్షిస్తుండేవారు.
అయితే, ఈ ప్రాంతంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగు పరిచే విషయంలో మేం విఫలమయ్యామనే చెప్పాలి. కాకపోతే అవి కొంత బాగుపడ్డాయి. ఉపాధ్యాయుల హాజరు పెరిగింది. కానీ ఇక్కడ వ్యవస్థాపరమైన అడ్డంకులు అనేకం వున్నాయి. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరు లేక ఇద్దరు ఉపాధ్యాయులే వుండేవారు. వారిలో ఒక ఉపాధ్యాయుడు లేదా ఒకోసారి ఆ ఇద్దరు ఉపాధ్యాయులూ జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల నిర్వహణ, శిక్షణా వర్క్‌షాపులవంటి వాటికోసం అధికారికంగా వెళ్లిపోతుండేవారు. పాఠశాలకు రాని ఏ ఉపాధ్యాయుడి మీదనైనా ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ప్రతిసారీ వాళ్లు ఆవిధంగా అధికారిక పనులపై వెళ్లినట్టు సమాధానం వచ్చేది. పాఠశాలల పర్యవేక్షక అధికార్లు ఎవరూ లేకపోవడాన్ని కూడా మేం గమనించాం. అంతేకాకుండా ఒక పర్యవేక్షక అధికారి పరిధిలో ఐదు మండలాలుండేవి. ఒక్కరు ఆ అయిదింటినీ పర్యవేక్షించడం సాధ్యమయ్యేది కాదు.
ఉపాధ్యాయ సంఘాలు, అవి వామపక్షాలవైనా సరే ఈవిషయంలో ఏ సహాయమూ చేసేవికావు. తప్పు చేసిన ఉపాధ్యాయులను కాపాడ్డానికే అవి ప్రయత్నిస్తుండేవి. సిపిఎంకు చెందిన ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య నియంత్రణలో ఇబ్రహీంపట్నం ప్రాంతం వుండేది. గైర్‌హాజరీ, దొంగ సర్టిఫికెట్లు సమర్పించడం, బదిలీల కోసం పైరవీలు, లంచాలు ఇవ్వడం వంటి నేరాలకు పాల్పడిన ఉపాధ్యాయులను శిక్షించినప్పుడల్లా ఆ సంఘాలు గట్టిగా వ్యతిరేకించేవి. పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు మెరుగుపరిచే విషయంలో మాత్రం చూసీచూడనట్టుండేవి. గైర్‌హాజరీకి అలవాటు పడ్డ ఉపాధ్యాయులను అవి పట్టించుకోకపోయేవి. చాలామంది ఉపాధ్యాయులు రైతులుగా, రియల్టర్లుగా, చిట్‌ఫండ్ నిర్వాహకులుగా, బియ్యం మిల్లుల యజమానులుగా, బినామీ కాంట్రాక్టర్లుగా చురుగ్గావుంటూ తరచూ పాఠశాల విధులను ఎగ్గొడుతుండేవారు. అలాంటి కేసుల్లో కూడా ఉపాధ్యాయ సంఘాలు వారినే సమర్థించేవి.
మేం చేస్తున్న పనిగురించిన సమాచారం ఒకరి నుంచి మరొకరికి చేరుతూ ఇబ్రహీంపట్నం బయట కూడా ప్రచారం అయ్యేది. ఆయా మండలాల వ్యవసాయ కార్మికులు మా వద్దకు వచ్చేవారు. దాంతో తెలంగాణా భూస్వాములు రెచ్చిపోయి మా మీద రాజకీయ నేతలకు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. చివరికి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు అప్పుడు స్వయంగా సాంఘిక సంక్షేమ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా వున్న ఎస్.ఆర్. శంకరన్‌ని ప్రశ్నించారు. శంకరన్ వెట్టి చాకిరీ కార్మికుల గురించి వివరించబోతే “ఆ మాటకొస్తే నా మంత్రులంతా కూడా వెట్టి కార్మికులే కదా” అన్నారు ఎన్‌టీఆర్. ఆగ్రహపూరిత ఆ వెటకారం చివరికి 1986`87లో శంకరన్ దీర్ఘకాల సెలవు మీద వెళ్లిపోయేట్టు చేసింది. శంకరన్ సెలవుమీద వున్నప్పుడే పీపుల్స్ వార్ గ్రూపు నక్సలైట్లు ఆయననూ, మరికొందరు ఆయన సహచరులనూ గుర్తేడు వద్ద కిడ్నాప్ చేశారు. దాంతో ముఖ్యమైన రాజకీయ నేతలకు ఆయన మరింత దూరమయ్యారు. శంకరన్ ఎప్పుడూ నన్ను తప్పుపట్టలేదు. కానీ ఆయన సహచరులు మాత్రం నా పనికి మద్దతు ఇచ్చినందువల్లనే ఆయనకు ఈ పరిస్థితి దాపురించిందని నిందించారు. ప్రభుత్వం నుంచి ఆయన చాలా తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే వున్నారు. ఆతర్వాత సిపిఎం పార్టీకి చెందిన త్రిపుర ముఖ్యమంత్రి శంకరన్ సేవలు తమకు కావాలని అడగడంతో త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వెళ్లిపోయారు.
ఇబ్రహీంపట్నంలో మేం చేస్తున్న పని చట్టపరిధిలోదే. పోలీసులు కావాలనుకున్నా ఎంఎల్ ఉద్యమకారులతో వ్యవహరించినట్టు మాతో వ్యవహరించలేకపోయేవారు. అటు మీడియా, ఇటు న్యాయస్థానాలూ కూడా మా పట్ల సానుకూలంగా వుండేవి. అయితే కేవలం దరఖాస్తులు పెట్టుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ వుండదనిపించేది. ప్రభుత్వ విచారణాధికారులు యథాలాపంగా విచారణ చేసేవారు. తాము వెట్టి చాకిరీ కార్మికులనెవరినీ కనుగొనలేకపోయామని చెప్పేవారు. ఎందుకంటే తమ వద్ద పనిచేసే వెట్టి కూలీలకు తాము ఎలాంటి బాకీలూ ఇవ్వలేదని భూస్వాములు అప్పటికే ప్రకటించారు. అయితే మేం చేసిన ఒక మంచి పని ఏమిటంటే అలా ప్రకటించినవారి నుంచి ఆమేరకు రాతపూర్వకంగా రశీదులు తీసుకోవడం. మునుముందు భూస్వాములు కూలీలను బాకీలు చెల్లించమని మళ్లీ వేధించేందుకు వీలు లేకుండా అలా చేశాం. ఎవరైనా ఎక్కడైనా వేధింపులకు పాల్పడితే ఆ రశీదును చూపించి నోరు మూయించేవాళ్లం. మొత్తానికి వెట్టి కూలీలు తమ బాకీలను చెల్లించకుండానే తమకు తాముగా భూస్వాముల చెర నుంచి బయటపడ్డారు. ఆతరువాత
వాళ్లు తమకు ఇష్టమైన చోట తగిన వేతనంపై పని చేసుకునేవారు. భూస్వాములు తమ రుణాలను తిరిగి వసూలు చేసుకోలేక, కూలీలపై కేసులు పెట్టలేక లోలోపల కుమిలిపోయేవారు. కాకపోతే చట్టం ప్రకారం వెట్టికూలీలకు ప్రభుత్వం నుంచి లభించాల్సిన నష్టపరిహారం, పునరావాస సహాయం మాత్రం లభించకుండా పోయింది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.