మన సమాజంలో మాల్స్, హైపర్ మార్కెట్లు, సూపర్ బజార్లు ఆధునిక జీవనశైలికి ప్రతీకలుగా మారిపోయాయి. వెలుగులు, అలంకారాలు, పెద్ద ఎత్తున డిస్కౌంట్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కానీ ఆ కాంతుల వెనక ఒక చేదు వాస్తవం దాగి ఉంది.
ఈ సంస్థల్లో పనిచేస్తున్న సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్‌కు ఉదయం నుండి రాత్రి వరకు ఎనిమిది నుంచి పది గంటల పాటు పూర్తిగా నిలబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు కస్టమర్లు లేని సమయంలో కూర్చునే స్టూల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సౌకర్యం కనుమరుగైపోయింది. కొంచం సేపు నిలబడి ఉన్నా కాళ్ల నొప్పి, నడుం నొప్పితో మనందరం బాధపడతాం. అయితే ప్రతిరోజూ గంటల తరబడి నిలబడే ఈ యువతీ యువకుల ఆరోగ్యం ఎలా ఉంటుందో ఊహించండి! కాళ్ల నొప్పులు, నడుం నొప్పి, రక్త ప్రసరణ సమస్యలు, మెడ సమస్యలు – ఇవన్నీ వారి జీవితంలో భాగమైపోయాయి.
వీరందరూ చుట్టుపక్కల గ్రామాల నుండి ఉపాధి కోసం నగరాలకు వస్తారు.పెద్ద పెద్ద మాల్స్, షాపుల్లో ఉద్యోగాలు సంపాదిస్తారు. వీరికి ఎలాంటి లేబర్ చట్టాలు వర్తించవు. మాల్, షాప్‌ల యజమానుల ఇష్టాఇష్టాలే తప్ప ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. ఉదయం నుండి రాత్రి వరకు నిలబడే ఉండాలి. కష్టమర్లు ఉన్నా లేకున్నా వీరు నిలబడే ఉండాలి. తక్కువ జీతాలకు గత్యంతరం లేకుండా ఈ పనులు చేయాల్సి వస్తోంది. కనీస మానవ హక్కులు, విశ్రాంతి హక్కులు, ఆరోగ్య పరిరక్షణ లేకుండా వారిని పనిచేయించడం అమానుషం. “కూర్చునే హక్కు” కోసం పోరాటం.
కార్మికుల “కూర్చునే హక్కు” కోసం కేరళలో జరిగిన పోరాటం స్ఫూర్తిదాయకం. ఈ ఉద్యమం 2007లో కోజికోడ్ నగరంలో ప్రారంభమైంది. అక్కడ ఒక షాపులో పనిచేసే 53 ఏళ్ల పాలితొడి విజ్జి అనే మహిళ ఒకసారి టాయిలెట్‌కు వెళ్లాలని తన యజమానిని అడిగింది. కానీ యజమాని ఆమెకు “నీళ్లు తక్కువగా తాగు లేదా ఆపుకో” అని అమానుషంగా సమాధానం ఇచ్చాడు. ఈ అవమానం విజ్జీని ఉద్యమ మార్గంలోకి నడిపించింది. షాపుల్లో పనిచేసే మహిళలకు కనీస టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని ఆమె గమనించింది.
2010లో ఆమె “పెన్‌కూటు” అనే మహిళల సంఘాన్ని స్థాపించి, మహిళా ఉద్యోగుల హక్కుల కోసం పోరాటాన్ని ప్రారంభించింది. మొదట్లో వ్యాపార సంఘాలు ఈ డిమాండ్లను తీవ్రంగా వ్యతిరేకించాయి. “కూర్చోవాలంటే ఇంట్లో ఉండండి” లాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసారు. అయినప్పటికీ విజ్జీ తన పోరాటాన్ని ఆపలేదు.
2014లో ఆమె కేరళ ప్రభుత్వం మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు చేసింది. ఈ సమస్యపై దృష్టి సారించిన తర్వాత, 2018లో కేరళ ప్రభుత్వం చట్ట సవరణను తీసుకువచ్చి, 2019లో “కూర్చునే హక్కు”ను చట్టబద్ధం చేసింది.
ఈ పోరాటం ద్వారా ఒక సాధారణ సేల్స్ మహిళ కూడా పెద్ద మార్పు తీసుకురాగలదని నిరూపితమైంది. విజ్జి చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తమిళనాడులో కూడా సేల్స్ పర్సన్స్ కూర్చునే హక్కు చట్టంగా తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంతవరకు దీనిమీద ఎలాంటి చట్టమూ చెయ్యలేదు.
లేబర్ చట్టాలు — అమలు లోపం
కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు ఉన్నా వాటిని పాటించే శ్రద్ధ యజమానులు చూపడం లేదు. లేబర్ డిపార్ట్‌మెంట్ కూడా ఇప్పటి వరకు ఈ అంశంపై స్పష్టమైన చర్యలు తీసుకున్నట్లు ఎక్కడా కనబడటం లేదు. ఈ అన్యాయంపై మనమందరం స్వరం విప్పాలి. షాపింగ్‌కి వెళ్లినప్పుడు వారిని గమనించాలి, వారిపట్ల సానుభూతి చూపాలి. సోషల్ మీడియా, పత్రికలు, టీవీ చర్చల ద్వారా సమస్యను ముందుకు తేవాలి. మాల్స్, షాపుల్లో కూర్చునే సౌకర్యాలు తప్పనిసరి చేయాలి. ముఖ్యంగా వారి కోసం టాయ్‌లెట్‌లు ఏర్పాటు చేయాలి. షిఫ్టు విధానం, విశ్రాంతి విరామాలు అమలు చేయాలి. అపాయింట్మెంట్ ఆర్డర్లు, స్పష్టమైన ఉద్యోగ నియమాలు ఇవ్వాలి. లేబర్ డిపార్ట్‌మెంట్ తక్షణమే విచారణ చేసి తగిన ఆదేశాలు జారీ చేయాలి.
ముగింపు: మెరిసే మాల్స్ వెనుక వేలాది మంది యువజీవితాలు నలిగిపోతున్నాయి.. వారికి కనీస మానవ హక్కులు, ఆరోగ్య హక్కులు కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతోంది. కేరళలో విజ్జి ప్రారంభిన లాంటి ఉద్యమం ఇక్కడ కూడా మొదలయ్యేలా మనం వారికి తోడ్పడగలిగితే బావుంటుంది.
