మన రాష్ట్రాన్ని ప్రపంచీకరణ చాలా వేగవంతంగా తాకడంవల్ల నగరాల ”అభివృద్ధి” జరిగి గ్రామీణ ప్రాంత ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది.వ్యవసాయ, చేనేత రంగాల విధ్వంసం, చేతి వృత్తులు పతనమవ్వడంవల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాలో పొట్టగడవని పరిస్థితులు నెలకొన్నాయి. పనుల్లేక, ఉపాధి హామీ పథకం లోపభూయిష్టంగా అమలవడంవల్ల తీవ్ర దారిద్య్రం తాండవ మాడుతోంది.దీన్ని ఆసరాగా తీసుకొని నగరాల్లోని పని చూపిస్తామని, ఉద్యోగాలు యిప్పిస్తామని భ్రమ పెట్టి ప్రతి రోజూ వందలాది స్త్రీలు, బాలికల్ని అక్రమంగా తరలిసున్నారు. ఇలా భ్రమల్లో వెళ్ళిన వాళ్ళు వ్యభిచార గృహాల్లో మునుగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే బలమైన ”ట్రాఫికర్స్ నెట్‌వర్క్” ఈ మానవ అక్రమ రవాణాని పకడ్బందీగా అమలు పరుస్తోంది. ఘోరమైన నేరాలకు పాల్పడుతోంది. ట్రాఫికింగుకి గురైన స్త్రీల జీవితాలు బాథాసప్తనదులు. నడిచేగాయాలు. ఒక్కొక్కరి కథ ఓ గుండె కోత. బాల్యం వీడని పసి మొగ్గలు సైతం రోజుకి వందమంది విటుల్ని ఇంకా విచ్చుకోని తమ జననాంగంలోకి చొప్పించుకునే భయానక, బీభత్స హింసని వివరించినపుడు కన్ను మూయలేని రాత్రుల అనుభవం వినే వాళ్ళందరిదీ. ఇంత ఘోర హింసకి పాల్పడుతున్నది ఎవరో కాదు ఒక తల్లి కొడుకు, ఒక భార్యకి భర్త, ఓ అక్కకి తమ్ముడు, ఓ చెల్లికి అన్న. ఓ పురుషుడు. సమస్త చరాచర ప్రపంచంలో ఏ జంతువూ కూడా ఇలాంటి దారుణాలకు ఒడికట్టదు.. తాము జత కట్టిన దానితో తప్ప సరాగాలకు పోవు. మరి బుద్ధి, జ్ఞానం, చదువు, సంస్కారం వున్న మనిషికిదేం మాయరోగం? పితృస్వామ్యం అచ్చోసిన అంబోతులు వీళ్ళు.
మానవ అక్రమ రవాణా అంటే ఏమిటి? ఎలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళల, బాలికల అక్రమ రవాణాలో ఎందుకు ముందు వరుసలో నిలబడింది? ప్రభుత్వాలు అక్రమ రవాణాకు గురైన బాధితులకోసం ఏం చేస్తున్నాయ్? ఏ ఏ వసతులు కల్పిస్తోంది. ఈ విషయాలన్నీ ఇందులో పొందుపరచాం.
-ఎడిటర్
మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి లేక తగ్గించడానికి మూడు విషయాలను మనం గుర్తుంచుకోవాలి. అవి ఆరికట్టడం, రక్షణ, ప్రాసిక్యూషన్. వీటిలో రక్షణ అనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా వసతి గృహాలకు సంబంధించిన వరకు ఈ రక్షణ అనే మాటకు చాలా విలువ ఉన్నది. రక్షణలేని అనేక కారణాల వల్ల పిల్లలు /మహిళలు మళ్ళీ అదే వృత్తిలో కొనసాగుతున్నారు, నెట్టివేయబడుతున్నారు.
ఈ వసతి గృహాల పరిస్థితులను మెరుగు పరచాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని నియమనిబంధనలు రూపొందించింది. ఈ వసతి గృహాలను ప్రభుత్వం, సివిల్ సోసైటీవారు నిర్వహించాలి.
1. వసతి గృహాల భద్రతకు సంబంధించిన నియమాలు
ప్రదేశం- ఏ రకమైన వసతి గృహామైనా జనం నివసించే ప్రదేశంలో ఉండాలి. దీనికి ఏ విధమైన పేరు పెట్టకూడదు. పెట్టినా బయటకు వ్యక్తపరచకూడదు. ఒక్కొక్క గృహాంలో 50 మంది వుండడానికి తగిన అన్ని వసతులు వుండాలి.
ఈ వసతి గృహాలు, ప్రమాదకర ప్రదేశాలకు దూరంగా ఉండాలి. వాటి వలన బాధితులకు ఎటువంటి ముప్పు కలుగకూడదు. అది (రెడ్‌లైట్ ఏరియా, వైన్‌షాప్, మురికివాడలు, ఆటో స్టాండ్, బస్ స్టాండ్, , రైల్వేస్టేషన్, రోడ్ సైడ్ స్టాల్స్ మొ. వసతి గృహాలు అన్ని రకాలైన వసతులు కలిగి ఉండాలి అది ముఖ్యంగా, మంచినీరు, కరెంటు, శుభ్రమైన పరిసరాలు వుండాలి. బయట వ్యక్తుల ప్రమేయం లేకుండా హోమ్‌లో అన్ని సౌకర్యాలు ఏర్పరచాలి..
సెక్యూరిటీ వసతి గృహాలకు 24 గంటలు రక్షణ ఉండాలి. రక్షణ సిబ్బంది బాగా శిక్షణ పొందిన వారై, సున్నితంగా ఆలోచించే మనసు కలిగి ఉండాలి. అంతేకాకుండా చెడు వ్యసనాలు లేకుండా ఉండాలి. ఎటువంటి అపాయకరమైన సామాగ్రి అనగా కిరోసిన్, పెట్రోల్, ఫినాయిల్, మందులు, యాసిడ్, సోప్ మొ. వాటిని బాధితులకు దూరంగా ఉంచాలి. స్టాక్ రిజిస్టరును నెలకొకసారి చెక్ చేయాలి.
ఎవరైన బాధితులు మానసిక వేదనతో బాధపడుతుంటే ఉంటే వారికి కత్తులు, స్క్రూడైవర్, తాడు, వైర్లు మొదలైన వస్తువులు అందకుండా చూడాలి. మానసిక వొత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం వుంటుంది. అన్ని తలుపులు, కిటీకిలు లోపల మరియు బయట నుంచి తెరిచే సౌకర్యం కలిగి ఉండాలి.
ఎవరైనా బయటివారు కలవడానికి వచ్చినప్పుడు అన్ని విషయాలను రిజిస్టర్‌లో రాసుకొని వారు మాట్లాడుకోవడానికి రాసుకుని అనుమతినివ్వాలి. వారు మాట్లాడుకోవడానికి సిసిటివీని అమర్చిన గదిని ఇవ్వాలి. వసతి గృహంలో వున్న వారికి మొబైల్ ఫోన్ వుండరాదు. వారు మాట్లాడాలంటే వసతిగృహ నిర్వాహకుల సమక్షంలోనే మాట్లాడాలి.
న్యాయపరమైన జాగ్రత్తలు మరియు వసతి గృహంనుండి వెలుపలికి వెళ్ళే పద్ధతులు
చిన్న పిల్లల లీగల్ కష్టడీ ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో జరగాలి. వసతి గృహంనుండి రక్షిత ప్రాంతానికి బాధిత మహిళ తరలి వెళ్ళేటపుడు ఒక సోషల్ వర్కర్ తప్పకుండా వారితో ఉండాలి.
నమ్మకం కలిగి వుండుట – బాధితురాలుని మీడియాకు దూరంగా ఉంచాలి. ఆమె వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ బయటకు రాకూడదు. బాధితురాలిని రెస్క్యు చేసినప్పటినుండి తను తిరిగి సమాజంలోకి వెళ్ళేవరకు మీడియాతో ఇదే పద్ధతి కొనసాగాలి. ఆమె గురించిన సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటివారికి ఇవ్వకూడదు.
వసతి గృహానికి కావలసిన సదుపాయాలు
వసతి గృహం పూర్తిగా వెలుతురు కలిగి, మరుగుదొడ్ల సదుపాయాలు కలిగి ఉండాలి. వెలుతురు కలిగిన వంటగది, హాలు, కౌన్సిలింగు గది, మెడికల్ గది, డైనింగు గది, పడకగదులుండాలి. విశ్రాంతి తీసుకోవడానికి, పని చేసుకోవడానికి వీలుగా ఉండాలి. తోటలు, ఆటస్థలం, విశాంత్రి స్థలం కలిగి ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచం, దిండు, 2 దుప్పట్లు, దోమతెర ఇవ్వాలి.
– హెచ్‌ఐవి రోగులు, వికలాంగులు, గర్భంతో వున్నవారు, విపరీతమైన రోగాలతో వున్న వారి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.
సిబ్బందిని ఎంచుకొనుట/ శిక్షణ
సరియైన ఇంటర్వ్యూ నిర్వహించి , వారి పూర్వాపరాలను పరిశీలించి, ప్రవర్తనని తెలుసుకొని వారిపై నేరాలకు సంబంధించిన రికార్డు లేనివారిని, వ్యక్తిత్వ వికాసం కలిగి, చెడు అలవాట్లు లేని వారిని తీసుకోవాలి. సిబ్బంది ఎటువంటి స్థానంలో వున్నా వారందరికీ తప్పనిసరిగా ట్రైనింగు ఇవ్వాలి. ట్రైనింగు మాడ్యుల్స్ ను తయారుచేసి అందరూ ఆచరించేలా చూడాలి. వసతి గృహాంలో కో ఆర్డినేటర్‌గా వ్యవహరించే వ్యక్తి పి.జి, ఎం.ఎస్‌డబ్ల్యు లేక ఎం.ఏ సైకాలాజీ చేసిన వారై ఉండాలి. ఇద్దరు కౌన్సిలర్స్ ఉండాలి. వీరిలో ఒక్కరు తప్పనిసరిగా అక్కడ బస చేయాలి.
వసతి గృహాంలో ఉండవలసిన సిబ్బంది వివరాలు
24 గంటలు ఉండే వార్డెన్ లేక సూపరిండెంట్ ఇద్దరు వంటవాళ్ళు, నలుగురు కేర్‌టేకర్స్ వుండాలి. ఒక ఆకౌంటెంట్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, రాయడం, చదవడం తెలిసి ఉండాలి. పార్ట్‌టైమ్ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మెడికల్ ప్రాక్టిషనర్స్ వుండాలి. అలాగే ఉచిత న్యాయ సహాయం కూడా వుండాలి.
బాధితురాలు తొలిసారి వసతిగృహంలోనికి వచ్చిన తరువాత ఒక వెల్‌కమ్ కిట్ ఇవ్వబడుతుంది. దానిలో ఆమెకు రెండు జతల బట్టలు, టవల్, పౌడర్, షాంపులు, కొబ్బరినూనె, దువ్వెన మొ. మరియు రెండు జతల లో దుస్తులు వుంటాయి. మొదటి గంటలో ఆమె స్నానం చేసి, ప్రెష్‌అప్ అవ్వడానికి సహాయం ఇవ్వాలి. ఆ తర్వాత తినడానికి ఏమైనా ఇవ్వాలి. పాతవారు , కొత్తవారికి పరిచయాలు చేయాలి. తాను వచ్చిన మొదట రోజు పూర్తిగా విశ్రాంతిని తీసుకోనివ్వాలి. మిగతా కార్యక్రమాలు అన్ని తరువాత రోజు చూసుకోవాలి. మోరల్ సపోర్టు ఇవ్వాలి. బాధితురాలి వివరాలకు సంబంధించిన సమాచారం మొత్తం ఒక పద్దతిలో రాయాలి. సమయం చూసి ఆమె ఫోటోను తీసుకోవాలి.
వ్యక్తిగత సమాచారం తీసుకునేటప్పుడు సరియైన సమాచారం అనగా అసలు పేరు, కుటుంబ సభ్యుల వివరాలు బంధువులు, అడ్రసు మొత్తం సమాచారం నిజాలైనవి ఉండాలి. తనకు సంబంధించిన న్యాయపరమైన హక్కులు, సామాజిక హక్కుల గురించి ఆమెకు వివరించాలి.
తనకు రావలసిన అన్ని రకాలైన సదుపాయ గురించి తనకు వివరించాలి. వాటిలో ప్రభుత్వం అందించే రూ. పదివేలు పరిహారం, పిల్లల చదువు యొక్క బాధ్యత, జీవనోపాధి ఇంకా అన్ని విధమైన సదుపాయాలు తెలియజేయాలి. బాధితురాలికి అన్ని విధాలైన వైద్య పరీక్షలు, హెచ్‌ఐవి పరీక్ష కూడా చేయించాలి.
రికార్డింగు మరియు డాక్యుమెంటేషన్
బాధితురాలి గురించిన వివరాలు పుస్తకంలో పొందుపరిచిన దానికి సరియైన ఫాలో అప్ ఉండాలి. అంతేకాకుండా ఆ పని చేసేవారు చాలా ఓర్పు కలిగి, ఉండాలి.
ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫైల్ ఉంచాలి. ఆ ఫైల్‌లో వ్యక్తిగత సమాచారం, రికార్డ్స్, వైద్యపరమైన సమాచారం, రిపోర్ట్, సహాయం, మందులు, ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన విషయాలు ఉండాలి. ఇవి చాలా గోప్యంగా ఉంచాలి.
ఆరోగ్య మరియు వైద్యపరమైన సపోర్టు
వసతిగృహాంలో చేరిన, వెంటనే వైద్య సహాయం అందించాలి. ఒక వేళ బాధితురాలు గర్భంతో ఉంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. హెచ్‌ఐవి పరీక్ష చేయించాలి. కేర్‌టేకర్స్‌గా ఉండేవారికి సరియైన శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా హెచ్‌్‌ఐవి పాజిటివ్స్ కోసంమానసిక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య వసతులు ఉండాలి. ( సైకాలజీ, సైకాట్రిస్ట్, సైకోధెరపిస్ట్) మత్తు పానీయాలు అలవాటు పడిన వారికి తగిన సహకారం కోసం మద్యపాన నివారణ, డీ ఎడిక్షన్ సెంటర్‌ల సమాచార వివరాలు ఉంచుకోవాలి.
కౌన్సిలింగు సపోర్టు
వసతి గృహాలలో అనుభవజ్ఞలైన కౌన్సిలర్స్ తప్పకుండా ఉండాలి. వీరు మహిళలే అయ్యుండాలి బాధితులలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపడానికి డాన్స్, వర్క్‌షాప్‌లు, పాటలపోటీలు, యోగా లాంటివి ఏర్పాటు చేయాలి.మానసిక సమస్యతో బాధపడుతుంటే కౌన్సిలర్స్‌ద్వారా కౌన్సిలింగు ఇప్పించాలి.పత్రికలు, మేగజైన్స్ అందుబాటులో వుంచాలి.
విద్య ఎవరికైతే సరియైన విద్య లేదో వారికి అక్షరజ్యోతి, విద్య పోగ్రామ్‌ద్వారా వారికి విద్యను అందించాలి. వారి పిల్లలను మంచి స్కూలులో చదివించాలి. ముఖ్యంగా ప్రభుత్వం బాధిత స్త్రీల పిల్లల చదువుపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకువాలి.
పౌరసదుపాయాల కల్పన
బాధిత స్త్రీకి చెందిన మొత్తం సమాచారం కలిగిన ఫార్మాట్‌ని జిల్లా కలెక్టర్‌కి మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి ద్వారా వెళ్ళాలి. దీనిద్వారా ఆమెకు గృహసదుపాయం, రేషన్‌కార్డు, ఓటర్ ఐడి లాంటి సౌరసదుపాయాలు బాధిత స్త్రీ పునరాసం కోసం ఆమెకు అందించాలి. ఇవన్నీ కూడా ఆమె రక్షించబడిన రోజు నుండి 6 నెలల లోపు అందేలా చూడాలి. ఆమె అనుమతితోనే వసతి గృహం నుండి బయటకు వెళ్ళిన తరువాత తిరిగి సమాజంలోని పంపే అన్ని ఏర్పాట్లూ చేయాలి. నెలకు ఒకసారైన తనను ఫాలోఅప్ చేయాలి. మొదటి 6 నెలలు నెలకోసారి పాలోఅప్ వుండాలి. ఎవరి కుటుంబాలలోనైనా వారిని సరిగా చూడకపోయినా అలాంటి కుటుంబాలను కొంచెం శ్రమపెట్టి వారిలో మార్పును తీసుకొని రావాలి. కుటుంబంలోని వారు అందరూ అంగీకరించిన తరువాతే ఆమెను పంపించాలి. బాధితురాలికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారికి అన్ని విషయాలో శిక్షణ ఇప్పించాలి. వసతి గృహాలు అన్నీ రిజిస్టర్ అయ్యి మహిళా శిశు సంక్షేమ శాఖ వారికి జవాబుదారీగా వుండాలి.
మానిటరింగు
ప్రాజెక్టు డైెరెక్టరు, మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ వారు 2 నెలల కొకసారి వసతి గృహాన్ని సందర్శించాలి. దాని స్థితిగతుల మీద రిపోర్టు రాసి సెక్రెటరీకి సమర్పించాలి. వసతి గృహంలో పనిచేసేవారు ప్రతినెల స్టాఫ్ మీటింగు పెట్టుకోవాలి.
అర్ధ సంవత్సర, సంవత్సర ప్రణాళికలు ఆడిట్‌లు/ప్రతిసంవత్సర సోషల్ ఆడిటింగు జరపాలి. దీనిద్వారా వసతి గృహం పారదర్శకంగా వుంటుంది. ట్రాఫికింగు అనేది పకడ్భందీగా ప్లాన్ ప్రకారం జరిగే ఘోర నేరం. మానవ హక్కుల ఉల్లంఘనే ట్రాఫికింగు. స్త్రీలు అంగీకరించి వస్తారనేది పచ్చి అబద్ధం, అసంబద్ధం. దీనినాపడానికి పోలీసుల పకడ్భందీ వ్యూహాలు, వేగంగా కదలడాలు చాలా అవసరం. ఈ భయానక సాలెగూడులో చిక్కుకుని, రక్షించబడిన బాధితులకు ప్రభుత్వం కొండంత అండ చూపాలి. వారికోసం నడుపుతున్న వసతి గృహాలు నివాస యోగ్యంగా వుండాలి. ఇక్కడి నుండి హుందాగా, మర్యాదగా ఆమె మళ్ళీ ప్రధాన స్రవంతిలోకి వెళ్ళిపోయేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ. ముఖ్యంగా ప్రభుత్వం, సివిల్ సొసైటీది.