ప్రమీలాతాయి

(గత సంచిక తరువాయి)

ఎట్లాగో మొత్తానికి పెట్రోలు సంపాయించి నేను వాళ్ళను

షెల్టరుకు చేర్చాను. కాని అప్జల్‌గంజ్‌ వంతెన దాటటమంటే అదో పెద్ద సాహసం అన్నమాట. కారుకి పర్దాలు కూడా లేవు. మేం దుప్పట్లు పట్టుకోని కూర్చున్నాం. అవేమో గాలికొకటే తపా తపా కొట్టుకోవటం రాజ్‌, జవాద్‌ కారులో కింద అంటుకోని కూర్చున్నారు. కాని పోలీసులు కూడా… అంతధ్వాన్నంగా వుండేశాళ్ళు… చెప్తున్నాను కదా!

నన్ను మగవాళ్ళతో సమానంగా చూశారా, నాకు బాధ్యతలప్పగించారా అని అడుగుతున్నారు కదా! తప్పకుండా ఇచ్చారు. ఏం చేస్తారు? ముఖ్య నాయకులంతా పోతే పార్టీ ఆఫీసు చూసుకోవటానికి ఇంకెవరున్నారు కనుక? నేనున్నాను. నామీద వాళ్ళకు పూర్తి నమ్మకం వుంది ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలో సమర్థతను గుర్తిస్తారు. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను దానికోసం పోరాడాననుకోండి. నా సమర్థతను చూపించుకోవల్సి వచ్చింది. నేను మీకు కొన్ని వుదాహరణలిస్తాను. బేగంబజారులో వుండేవాళ్ళం. మా మీటింగులెప్పుడూ రాత్రుళ్ళు సుల్తాన్‌బజారులో వుండేవి. నేనొక్కదాన్నే వెళ్ళేదాన్ని. నేనెవర్ని నావెంట రమ్మని అడిగేదాన్ని కాదు. ఇప్పుడయితే అడుగుతాను కాని అప్పుడు మాత్రం ఉహు-అడిగేదాన్ని కాదు. నీ శక్తిని నువ్వు నిరూపించుకోవాలి. అక్కడావుంది, ఇక్కడా వుంది, ప్రపంచమంతా వుందిది. వేరే దేశాల్లో చూస్తే కూడా చాలా తక్కువ మంది స్త్రీలు నాయకత్వంలోకి వస్తారు. ఒకసారెవరో లెనిన్‌ని అడిగారు, అట్లా ఎందుకవుతుంది అని. ఆయన సమాధానం నాకెప్పుడు గుర్తుంటుంది. ఆయననాన్నడు ఆడది శత్రువుతో కొట్లాడాల్సొస్తే చివరిదాకా వదిలిపెట్టదు, అదే తన దగ్గరవాళ్ళతో కొట్లాడాల్సొస్తే లొంగిపోతుంది అని. అప్పుడామెకి శక్తి వుండదు. ముందన్నీ గుర్తు పెట్టుకొని మా కాడరును ముందునుంచే తయారు చేయాలి. వాళ్ళ శక్తిని చూపించలేకపోవటం స్త్రీలలోపం కాదు, ఎంతమాత్రం కాదు. ఎట్లా అవుతుంది? కొంతవరకు వాళ్ళ ముందుకి రాలేదంటే వాళ్ళ పొరపాటు కావచ్చు. సాధారణంగా ఆ పరిస్థితులే వుండవు కదా? స్త్రీ సంఘాలు ప్రపంచంలో కూడా, నేను చూశాను. చాలా కొద్దిమంది నాయకులుగా ముందుకొచ్చారు. మగవాళ్ళు కూడా వాళ్ళ ఆధిపత్యం వదులుకోలేక పోయారు. అవునా కాదా?

నేనెప్పుడూ ఒక కమ్యూన్‌లో వుండలేదు కాని దాన్ని నిర్వహించాను. నిజంగా కామ్రేడ్సుకు వంటగానీ, ఇంటిపనిగానీ చేయటానికి టైముండేది కాదు. వంటకోసం ఒకబ్బాయిని పెట్టేవాళ్ళం. జవాద్‌, మహేంద్ర మాత్రం ఎప్పుడూ టైముకొచ్చి తినటంలో గొప్పవాళ్ళు. ఏది పెట్టినా తినగలిగేశక్తి వాళ్ళకుండేది, రాళ్ళైనా సరే. మేమే కమ్యూన్‌గా వుండటం వేరే విషయం. అప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా వుండేవి. మాకసలు టైముండేది కాదు. ఖాళీ టైంలో నేనొకసారి జనగామ మహాసభలకు వెళ్ళాను. జనగాం కిసాన్‌ సభ, నేను తెలంగాణా గ్రామాలకు వెళ్ళటం అదే మొదటిసారి. 1942లో అనుకుంటా 43, 44 అయినా కావచ్చు. నాకు గుర్తులేదు. నాకు భాష రాకపోయినా ఆ మహాసభకు వెళ్ళాలని కోరిక. జనం వచ్చారు. ఆడ, మగ అందరూ వచ్చారు. వేల సంఖ్యంలో ప్రవాహం లాగా. అట్లాంటిది ఈ రోజుల్లో వూహించటం కూడా కష్టం. ఒక్కటే ఆలోచన నా బుర్రకు తట్టింది. నేను కామ్రేడ్‌ రావినారాయణరెడ్డి నడిగాను- ”ఈ జనం అంతా చైతన్యవంతులవుతున్నారు, కాని మనకు సంఘ నిర్మాణం ఎక్కడుంది? వీళ్ళను మనం సంఘటితం చెయ్యగలమా?” మాకు సంఘ నిర్మాణంలేదు. జనంలో వుత్సాహం వుంది. మా మీద నమ్మకం వుంది కనుక వస్తున్నారు. కాని మాకు సంఘ నిర్మాణం లేదు. ఆ మేరకు కిసాన్‌సభకు కూడా వాళ్ళనొకటిచేసి చైతన్యవంతుల్ని చేసే శక్తిలేదు. అప్పుడదొక ప్రజా వెల్లువ. ఈ రోజువరకు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవల్సిన విషయం ఒకటుంది. అట్లా వచ్చిన ప్రజా వెల్లువను ఇముడ్చుకునే శక్తి గనక పార్టీకి లేకపోతే ఎన్నో రకాల సమస్యలొస్తాయి.

లేదు, నేను పెద్ద ప్రయోగాలు చేయలేదు. ఎక్కువ తిరుగలేదు. మీకు తెలుసా మాచిరెడ్డిపల్లి. ఆకునూరు అక్కడేం జరిగిందో? మొదటిసారి నేను సీతాదేవితో వెళ్ళాను. మేం అక్కడ స్త్రీలకు కలిసి అసలేం జరిగిందో తెలుసుకోవటానికి వెళ్ళాం. నాకు తెలుగు తెలీదు కనక సీతకూడా నాతో వచ్చింది. నల్గొండ వెళ్ళాం. మా పార్టీ ఆఫీసుకి తాళ్ళం వుంది. ఎక్కడికెళ్ళాలి, ఏం చేయాలని నిర్ణయం చేసుకోవల్సి వచ్చింది. పిల్లల ద్వారా కనుకున్నాం. వాళ్ళు వెంకట్రాంరెడ్డి గారింటికి మమ్మల్ని తీసుకెళ్ళారు. ఆయనొక నాయకుడు. మమ్మల్ని ఆకునూరు తీసుకెళ్ళాడు. ఘోరంగా వుండింది ఆ అనుభవం. రైతు నాయకులు, యువకులంతా బయటున్నారు. వాళ్ళను రక్షించే వాళ్ళెవరూ లేక పోయారు. మిలిటరీ రజాకార్లంతా వచ్చి వాళ్ళమీద ఇంట్లో దాడి చేస్తారని ఆ స్త్రీలు కూడా అనుకోలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత మేం సరోజినీ నాయుడుని కలిశాం, పద్మజ ఇందులో కల్పించుకుంటే బాగుంటుందని ఆమె సలహా ఇచ్చింది. అయితే అన్ని పార్టీలతో ఒక కమిటీ వేశాం. పద్మజ, రంగమ్మ గూడా అందులో వున్నారు. స్త్రీల సంఘాలు, మగవాళ్ళ సంఘాలన్ని కూడా అందులో వున్నాయి. ఈ లోపల ఒక విచారణ కమిటీని కూడా నియమించారు. పద్మజ ప్రశ్నలడుగుతోంది. మేమందరం కూర్చున్నాం. నేనన్నాను ”పద్మజా! వాళ్ళెట్లా సమాధానం చెప్తారు? మగవాళ్ళముందు వాళ్ళు వాళ్ళకు జరిగిన అవమానాన్ని, దౌర్జన్యాన్ని ఎట్లా చెప్తారు మనకి? నువు వాళ్ళను లోపలికి తీసికెళ్ళి అడిగితే మంచిది.” అయినా వాళ్ళకి చెప్పటం కష్టం. ”ఇంత దౌర్జన్యం నాకు జరిగిందని” ఒక స్త్రీతో చెప్పుకోవటం కూడా కష్టమే. ఒక స్త్రీకి చెప్పుకోవటం చాలా కష్టం… అట్లా ఆ విచారణ.

సాయుధపోరాటం విరమించినపుడు నా కేమనిపించిందంటారా? అవును, అప్పుడేం చేయాలని? కలిసి మాట్లాడటం కూడా చాలా కష్టమయ్యుండేది. మీరేమంటారాయన్ని, బి.ఎన్‌., నాకు ఆయన వేరే పేరేంటో తెలియదు. ఆయన మేమున్న చోటికి వచ్చేవాడు. ఆఖరుసారి అతనొచ్చినపుడు మహేంద్ర, అతను చర్చించారు. నేనంత పెద్దగా మాట్లాడటం మంచిదికాదని చెప్పాను. కాని వాళ్ళిద్దరూ మంచి వేడిమీదున్నారు. నేనూర్కేవింటూ కూర్చున్నాను. నేను మామూలు వ్యక్తిని, వాళ్ళు పెద్ద నాయకులు కదా! నేను జిల్లా కమిటీ సభ్యురాల్ని, వాళ్ళు రాష్ట్ర కమిటీ సభ్యులు. నేను మాత్రం ఏం చేస్తున్నాను? మామూలుగా పనిచేయటం, కామ్రేడులకు భోజనం పెట్టటం. సరే, అదట్లా వుండనీ, ఆ గుర్తింపు…. నువ్వీ ప్రపంచం వదిలిపెట్టి పోయినప్పుడే వస్తుంది. నువ్విక్కడున్నంత వరకూ ఏ గుర్తింపూ వుండదు. అంతే. ఆ… నేనేం చెప్తున్నాను. ఊ… అయితే వాళ్ళు సాయుధ పోరాటం గురించి చర్చిస్తున్నారు విరమించాలా వద్దా అని దళాలు పనిచేస్తున్నాయి, జనం వాళ్ళకు సహకరిస్తున్నారు, తిండి పెడ్తున్నారు – అంటూ బి.ఎన్‌. తన వాదనను సమర్థించుకుంటున్నాడు. నేనన్నాను అందులో ఏముంది. ఒక దోపిడీ దొంగకు కూడా అట్లాంటి సహకారం దొరకవచ్చు.

మధ్యప్రదేశ్‌లో అట్లాంటి వాళ్ళకు మద్దతుంది. జనానికి తప్పకుండా సానుభూతి వుంటుంది. మనకది కాదు గీటురాయి. ఉద్యమం మొదట్లో ప్రజలు పాల్గొన్నారు. అదట్లా వుండిది, అందుకే మేం దాన్ని ప్రజా వుద్యమం అనే వాళ్ళం. కాని చివరి దశ కొచ్చేటప్పటికి ఐక్య సంఘటన కూడా చీలిపోయింది. నెహ్రూ మిలిటరీ వచ్చింది. సహజంగానే కాంగ్రెస్‌ వాళ్ళు. రాజకీయంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని. కాంగ్రెస్‌ వాళ్ళ సానుభూతంతా పోయింది. పెద్ద భూస్వాములంతా అటువైపే వెళ్ళిపోయారు, నీతో ఎంత మందున్నారు? నేనిదే అన్నాను. మహేంద్ర అన్నాడనుకోండి ”నీకీ వివరాలన్నీ తెలియవు. నువ్వెందుకు కల్పించుకుంటావు,” అని ”ఏం ఎందుకు మాట్లాడకూడదు” అన్నా, ”నీకిష్టమున్నా లేకపోయినా నా అభిప్రాయం నేను చెప్పాలనుకుంటున్నాను.” మహేంద్ర నాతో అంగీకరించలేదని కాదు కాని మీకు తెలుసు మగవాడు తను చూపించాలనుకుంటాడు అతనేంటో, ఇప్పటికీ మీకదే కనిపిస్తుంది… ఎక్కడున్నాం మనం? నాకంత శక్తి లేకపోయినా అంతపని ఎట్లా చేయగలిగానని ఎవరైనా నమ్మగలరా? ఇప్పటికీ చేయగలను నేను. నాలో వుందది. కాని (చాలా తక్కువస్థాయి గొంతుతో) ఇప్పటిది మగవాళ్ళ ప్రపంచం.

నా గురించి నాలో నేనెట్లా వుండేదంటారా! ఆశయం కోసం పోరాటే వ్యక్తి గాను, ఒక స్త్రీగాను, తల్లిగాను లేక అసలు చెప్పాలంటే అన్ని రకాలుగా వుండేది, నేనింతకుముందే చెప్పాను అమ్మ సానుభూతి చూపించాల్సి నప్పుడు నాలో ఆ సానుభూతి పుండింది. నా ఆదర్శాలకు నిలబడాల్సి వచ్చినప్పుడు నిలబడ్డాను. ఆమె ఒక్కతీ నాకు తల్లి కాదు, మొత్తం మనవాళ్ళంతా నాకు తల్లిలాంటిది.

మా తమ్ముడు చచ్చిపోయిన తరువాత నాకు టైఫాయిడ్‌ వచ్చింది. చాలా తీవ్రంగా వచ్చింది, తర్వాత నాకు ముట్లు రావడం ఆగిపోయింది. నాకప్పుడు పదిహేడేళ్ళే. పీడా పోయిందనుకున్నా, ముందేమవుతుందనే ఆలోచన లేదు నాకు, నేనెప్పుడు పెళ్ళి గురించి ఆలోచించలేదు. నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మా డాక్టరు మేనత్తలు, డాక్టరు స్నేహితులు అందరూ పెద్ద సమస్యేం లేదు, అదొక వ్యాధి కాదు, అనారోగ్యం మూలంగా ఆగిపోవడం మాత్రమేనని అన్నారు. మందులిస్తామన్నారు. నిజానికి మళ్ళీ ముట్లు రావటానికి నేను ఇంజక్షన్లవీ తీసుకున్నా. డాక్టరు అచ్చమాంబను కూడా సంప్రదించాను. ఆమె దగ్గరికెళ్ళాను. బొంబాయిలో కూడా ఒక గైనకాలజిస్ట్‌ దగ్గరికెళ్ళా. నాకు కొన్నిసార్లు బాధనిపించేది (నిశ్శబ్దం) ఎందుకంటే ఇది ఒక్కరి జీవితానికి సంబంధించిన విషయం కాదు. ఇంకొకరి జీవితానికి సంబంధించినది కూడా. అతని గురించి నేను చాలా బాధ పడ్డాను. నా జీవితం దర్భురంగా వున్నా ఏం ఫరవాలేదు. నా జీవితం ప్రజల జీవితం. నా గురించి నేను ఆలోచించను. అతని గురించే నేను నిజంగా కుంగిపోయాను. నేనతనికి చెప్పాను కూడా ”ఇంకొకర్ని చేసుకోవాలంటే చేసుకో నాకేం అభ్యంతరం లేదు.” (నవ్వు) ఎవరినైనా పెంచుకోవాలనే ప్రసక్తి కూడా వచ్చింది. కాని దానికి నిజంగా టైము లేకపోయింది. జైలు నుంచి బయటకొచ్చి తర్వాత నామీద పెద్ద బాధ్యత వుండె. అతని కుటుంబాన్ని పోషించాలి. మా అమ్మ కూడా వుంది. ఇక ఆ ప్రశ్న రానే లేదు. మా అత్తగారు వాళ్ళు ఇప్పటికి వున్నారు, పాత సిటిలో, అతని తల్లి చెల్లెలు, ఆమె పిల్లలు. వాళ్ళు నా పెళ్ళి గురించేమన్నారంటారా! నాకు నిజంగా తెలీదు, ఆ రోజుల్లో మేం రహస్యంగా వున్నాం. అతని తల్లికి మాత్రం అది ఏం నచ్చలేదనుకుంటా. ఏమైనా వాళ్ళు మాత్రం అభ్యంతరం చెప్పలేకపోయారు. జైలు నించొచ్చిన తర్వాత కలకత్తాలో వున్న తమ్ముడు పోయాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలుండె. ఆ తర్వాత అతని బావమరిది పోయాడు. చెల్లెలు, ఆమె ఆరుగురు పిల్లలుండె. వీళ్ళలో ఎవరూ సంపాదించే వాళ్ళు లేరు. నేనొక్కదాన్నే సంపాదించే దాన్ని. ఆడదాన్ని, ఎట్లాగో తంటాలు పడ్డాం. అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేశాం, ఉద్యోగాలు చూసి పెట్టాం, అన్నీ చేశాం. ఇప్పుడందరూ బాగానే వున్నారు, అట్లా వాళ్ళవైపు నుంచి ఏం అభ్యంతరం రాలేదు. ఇప్పటికీ వస్తూ పోతూనే వుంటాం.

అందుకే నేను ఎమ్‌.ఏ చేయాల్సి వచ్చింది. నా వుద్యోగం ఉంచుకోటానికి, నేను ఈ స్కూలుకి హెడ్‌మిస్ట్రెస్‌ను దా ఏ వృత్తి తీసుకున్నా పెద్ద పోటీ వుంటుంది కదా! ఎమ్‌.ఏ. ఒకటే కాదు, నేను బి.ఎడ్‌. కూడా చేయాల్సి వచ్చింది. ఆ ట్రేనింగ్‌ లేకుండా హెడ్‌మిస్ట్రెస్‌గా కొనసాగించటం కుదరదు. ఇప్పుడయితే మామూలు టీచరుగా పనిచేయటం కూడా కష్టం. నా రోజుల్లో ఉత్త మెట్రిక్యులేషన్‌తో హెడ్‌మిస్ట్రెస్‌ నయింది నేనొక్కదాన్నే. అందుకే 1957లో ఉస్మానియాలో నేను బి.ఎడ్‌. చేయాల్సి వచ్చింది. 1962లో బెనారస్‌లో ఎమ్‌.ఏ. చేశాను. బొంబాయిలో ఒక్క స్కాటిష్‌ మిషన్‌ స్కూల్లో నేను చదివాను. ఆ ప్రిన్సిపాల్‌ ఎప్పుడు మా అమ్మను చూడ్డానికి వచ్చేది. వచ్చినప్పుడల్లా అంటూండేది – మీ అమ్మాయి చాలా తెలివి గలది, కాని ఇంగ్లీషు మాత్రం అసలు చదవదు. నేను ఇంగ్లీషు క్లాసులకే పోయేదాన్ని కాదు. బ్రిటీష్‌ వాళ్ళ భాష నేర్చుకోవటం చస్తే ఇష్టముండేది కాదు. చిన్నతనం నుంచే నాకు ఆ ద్వేషం వుండేది. మెట్రిక్‌ వచ్చిన తర్వాతనే అర్థం చేసుకున్నాను. ఇంగ్లీషు నేర్చుకోకపోతే పాసవను అని అప్పుడు నేర్చుకొన్నాను. తర్వాత ఇంగ్లీషు లిటరేచర్‌ తీసుకున్నాను. మా టీచర్లందరూ తెగ ఆశ్చర్యపోయారు. ఇదెట్లా సాధ్యమని అడిగారు.

నేను జర్మనీ నుంచి తిరిగొచ్చిందాకా పనిచేశాను. అది 1969లో వాళ్ళు నాకు కాలేజీలో వుద్యోగం ఇస్తామన్నారు. అప్పుడు మహేంద్ర ఎమ్‌.ఎల్‌.సి.గా వుండే మాకు అర్థిక ఇబ్బందులు వుండేవి కావు. అందుకని నేను పనిచేయలేదు. అవును, నేను ఎన్నికలలో కూడా పోటీ చేశాను. ఒకసారి, టీచర్ల నియోజకవర్గం నుంచి నాకు చేయాలనిపించలేదు. ఎందుకో అది నాకు తగ్గ పని కాదనిపించింది. నేను మౌనంగా పనిచెయ్య గలను. ఓట్లు సంపాయించాలంటే ధైర్యంగా చొరవగా మాట్లాడాలి. ఈ లక్షణాలు కావాలి. నాకా లక్షణాలున్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. నా కిష్టం లేదు కూడా…. కాని ఈ ప్రభుత్వపు టీచర్ల కమిటీ వాళ్ళు పెద్ద తప్పు చేశారు. అధికారికంగా వాళ్లొక టీచర్ని నామినేట్‌ చేస్తామని నిజానికి కాళోజీ నారాయణరావు గార్ని తీసుకొచ్చారు. ఆయన టీచరు కాదు. అందుకే కమిటీ వాళ్ళొచ్చి నన్ను నిలబడమన్నారు. (నవ్వు) పార్టీ కూడా నాకంత సపోర్టుందని వూహించలేదు. కాని నేను నలభై ఓట్లతో మాత్రమే ఓడిపోయింది. అది కూడా జిల్లాలనుంచి, సిటీలో నేనందరికి తెలుసు కనక నాకు మెజారిటీ వచ్చింది. జిల్లాల్లో అట్లా కాదు. తర్వాతెప్పుడూ మళ్ళీ నిలబడలేదు.

నేను జర్మనీలో ఏం చేశానంటారా! అక్కడ ఈ ప్రపంచ ప్రజాస్వామ్య స్త్రీల సంఘం వుంది. అది కేంద్రం. అక్కడ వాళ్ళకి పదిమంది సెక్రటరీలున్నారు, అందులో ఒకళ్ళు మనదేశం నుంచి ప్రతిదేశం వాళ్ళ ప్రతినిధిని ఎన్నుకోవాలి. 1967లో వాళ్ళు నన్ను పంపించారు. నేనంతకుముందే పోవాలనుకున్నాను. 67 చాలా ఆలస్యం నాకు. నిజానికి నేను ఇటు రాజకీయ రంగంలో పనినుంచీ అటు స్త్రీ ఉద్యమం నుంచీ రెండిటినుంచీ దూరమైపోయాను. అందుకే వెళ్ళటానికి ముందు కొంత సందేహించాను. కాని నాలో ఇంకా ఆ వుత్సాహం ఏమూలో వుండింది. అందుకే వెళ్ళాను. అప్పుడు ప్రపంచంలో స్త్రీల స్థానం గురించి నాకు నిజంగా ఏ విజ్ఞానం లేనందుకు నేను చాలా అవస్థ పడ్డాను. అన్నీ తెలుసు కాబట్టి రాజకీయంగా నాకేం భయం లేదు. కనీసం మెలకువగా వుండగలిగాను. కాని సంఘాలకు సంబంధించి నాకు కష్టమయింది. అందులో నా స్వభావం నువు చెప్పినదానికల్లా సరే అని తలూపే తత్వం కాదు, అందుకే నాక్కూడ కష్టమనిపించింది. కాని అప్పటికే నేను నేర్చుకుంటున్నాను, నాకది మంచి గుణపాఠం. యూరపునుంచి ఇంత దూరంలో కూర్చుని మనం ఎంతైనా విమర్శించవచ్చు. వాళ్ళు యుద్ధాల్లో ఎంత నష్టపోయారు! అవన్నీ కూడా తెలుసుకుంటాం మనం. ఈ కేంద్రం అంతకుముందు పారిస్‌లో వుండేది. తర్వాత ఫ్రెంచి వాళ్ళు అక్కడుంచుకోటానికి నిరాకరిస్తే దాన్ని తూర్పు బెర్లిన్‌కు మార్చరు. అదిప్పుడు అక్కడే వుంది. నా వుద్యోగానికి రెండు సంవత్సరాలు సెలవు పెట్టి పోయాను.

నేను రాజకీయాల్లోనుంచి ఎప్పుడు విరమించుకున్నా నంటారా? జైలునుంచి వచ్చిన తర్వాత. ఉద్యోగం చేయటం మొదలు పెట్టాను. స్త్రీలను కలవాలంటే మధ్యాహ్నాలు మాత్రమే కుదురుతుంది. ఎవరైతే పనిచేయగలరో వాళ్ళకు మన అనుభవాల్ని, అవసరమైతే మద్దతును ఇవ్వాలని మేం నిర్ణయించుకున్నాం. కాని జైలునుంచి బయటికొచ్చిన తర్వాత అన్నీ అంత సులభం కాలేదు. జైలునుంచొచ్చిన తర్వాత వుద్యోగంలో చేరాలంటే నాకు నిజంగా వూపిరాడనట్టుగా అయింది. 1952లో మేం విడుదలయితే 53 వరకూ మా మీద కేసు నడుస్తుండింది. తర్వాత మా మీదనుంచి బూర్గుల రామకృష్ణారావు కేసెత్తి వేశాడు. మేం బయటపడ్డాం, తర్వాత మెల్లిగా రాజకీయం పని, సంఘం పని, సోషల్‌ వర్కు అన్నీ…

నేనెందుకు విరమించుకున్నానని అడుగుతారు కదా! నిజమే, కొన్నిసార్లు పరిస్థితులు కారణం, తర్వాత టైము సంగతి సరేసరి. కొన్నిసార్లు కామ్రేడ్ల సహాయం కూడా చాలా ముఖ్యం. అప్పుడు ఎవరైనా నన్నర్థం చేసుకొని నాకు సహాయం చేసినట్లయితే నేనింకా ఎంతో చేయగలిగుండేదాన్ని.

కుట్టు కేంద్రాలు మొదలు పెట్టటంలాంటి పని తర్వాత వుండిందనుకోండి. కాని మొదట్లో జైలునుంచొచ్చినప్పుడు అందరూ దెబ్బ తినిపోయారు. మొత్తం పార్టీ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. మా మెదడు కూడా సరిగ్గా పనిచేసిందనుకోను… స్త్రీలను కూడగట్టటం కూడా… అప్పుడొక పెద్ద వెల్లువ వుండేది. వేల సంఖ్యలో ముస్లిం ష్త్రీలు రావటం చూశాను. అట్లాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. నేను 1952-53లలో బాజీ ఇంటికి ఒక మీటింగుకు వెళ్ళాను. అక్కడ మాదొక కుట్టు కేంద్రం వుండేది. ఇప్పటికీ వుంది. నా ఆదర్శానికి తగ్గట్టుగా కాదనుకోండి, అందుకే ఇప్పుడు నేనక్కడికి పోను. కాని ఆమెను కలుస్తాను. నన్ను పిలిస్తే కూడా నేను పోతాను. కాని మాకు మొదట్లో వున్న ఆదర్శాల మాటేంటి? చాలామంది అమ్మాయి లొచ్చేవాళ్ళు, చిన్న వాళ్ళు, కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళు, కొన్నిసార్లు చదువేం లేనివాళ్ళు, ఇది 1953లో. నేనేం చేయగలను? ఎక్కడైనా ఏం చేయగలను? నా స్కూల్లోనయినా జనాన్ని పరిశీలించేదాన్ని. అనుకునే దాన్ని ఫలానా వ్యక్తికి ఆసక్తి వుంది, శక్తి వుంది, మెల్లిగా ఆ వ్యక్తిని వుద్యమం వైపుకి ఆకర్షించవచ్చు. ఒక్క పార్టీలోకని కాదు. వుద్యమంలోకి, అట్లా కాడరును కూడా సంపాదించగలిగాం, ఇప్పుడు కనిపించరు వాళ్ళు, అది ఒక పనికి కేంద్రం, ఇందులో వచ్చిన వాళ్ళకి ట్రెయినింగిచ్చి వుద్యోగాలు చూపిస్తారు. అంతవరకు బాగానే వుంది కాని, అందులోంచి కాడరు మాత్రం రారు. మేం అరెస్టు కాకముందు మాతో మంచి విద్యార్థులుండేవాళ్ళు. 1950 తర్వాత అట్లాంటి విద్యార్థులెవరూ రాలేదు. వాళ్ళకి మంచి వుద్యోగాలు, భవిష్యత్తు అవసరమయినాయి.

మహేంద్ర రోజుల తరబడి ఇంటకొచ్చేవాడు కాదు. అప్పటిరోజులు చాలా కష్టమైనవి. పార్టీ అంతా కదిలిపోయింది. పార్టీలో కూడా అంతా అవకాశవాదులొచ్చారు. వాళ్ళను ఏరేయటం పెద్ద సమస్యయింది. అట్లా రోజులతరబడి మహేంద్రకు ఇంటికి రావటానికి వీలయ్యేది కాదు. నాకదొక సమస్యయింది, దిగులు పడటం, ఏమయిందో, ఎందుకు రాలేదో అని దిగులు పడేదాన్ని, వెతికి కనుక్కోవాల్సి వచ్చేది ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని అట్లా….

మగవాళ్ళకు కూడా నాకనిపించినట్టు వూపిరాడనట్లనిపిం చిందా? నాకు తెలీదు, మీరడిగారు కాబట్టి నాకేమనిపించిందో చెప్పాను. పార్టీ అంతా గందరగోళమైందని చెప్పాను కాని నా వుద్దేశం అది కాదు. పార్టీ మొత్తమంతా జైల్లో వుంది. ఉదాహరణకి సాయుధ పోరాటం మూలంగా ఎవరికీ – నాకు కూడా ఇల్లు దొరకలేదు. నేను ఎమ్‌.ఎల్‌.ఏ క్వార్టర్స్‌లో వున్నప్పుడు విశాలాంధ్రను ప్రకటించారు. ఎమ్మెల్యేలు కాని వాళ్ళందరూ క్వార్టర్స్‌ ఖాళీ చేయాలని ప్రకటన వచ్చింది. నాకు వేరేవాళ్ళ గురించి పెద్ద తెలీదు కానీ మాకు మాత్రం అక్కడుండడం ఇష్టంలేదు. అందుకని నేను మా అమ్మ తిరిగేవాళ్ళం. నేను స్కూలునుంచి రాగానే బయల్దేరి బస్తీలన్నీ తిరిగేది. ఎవరూ ఇల్లివ్వలేదు, కొంతమంది భయపడ్డారు, కొంతమంది ఎగతాళి చేశారు, మీకిల్లెందుకు, రష్యా డబ్బులిస్తుందిగా అని. ఇక్కడ రెండు రూములు దొరికితే వచ్చి చేరాం, మొదట్లో ఇక్కడ కూడా మమ్మల్ని వీళ్ళిష్ట పడలేదు. కాని ఇప్పటికి ఇరవై ఆరు సంవత్సరాల్నుంచి నేనిక్కడే వున్నాను.

నా సంగతి…కమల గానీ, సత్యవతి గానీ చూడండి, వాళ్ళ పరిస్థితి వేరే. నా పరిస్థితి… నేను కుటుంబాన్ని పోషించాలి. నేను సంపాదించేదాన్ని, నా వుద్యోగాన్ని అంటిపెట్టుకొని వుండడం తప్పనిసరయింది. నన్నెందుకింకా వుంచారని ప్రభుత్వం మా సంస్థనడిగింది. నన్ను వుద్యోగంలోంచి తీసేయాలన్నారు. సుందరయ్య నడిగాను. ”నేనేం చెప్పగలను? పార్టీలో పనిచేయట్లేదని చెప్పేయి” అన్నాడాయన, నేనుద్యోగం వదులుకోలేక పోయాను. కాబట్టే ఇదంతా జరిగింది. నాకు తెలుసు అతనికెక్కడా వుద్యోగం దొరకదని, కనీసం ఈ వూళ్ళో నా స్థానం, నా పని నాకు వుద్యోగం దొరకటానికి దోహదం చేశాయి. అవును, చాలా మంది మగవాళ్ళు వుద్యోగాలు చేస్తూ కూడా పార్టీలో బాధ్యతలు తీసుకున్నారు. కాని ఎవరిశక్తికైనా ఒక హద్దుంటుంది కదా! అటు కుటుంబాన్ని చూసుకోవాలి, ఇటు వుద్యోగం, ఇక రాజకీయాల్లో కూడా వుండటం నాకు సాధ్యం కాలేదు. నేను చేయలేకపోయాను. ఊహుం, చేయలేకపోయాను, అంటే నాకు శక్తి లేక పోయింది. నాకు ఎనీమియా వుండింది. ఇవన్నీ భరించాలంటే మానసిక శక్తి వుండాలి. అంతే కాకుండా అతని జీవితంలో ఎన్నడూ ఎవరికిందా పనిచేయలేదు. చేయగలిగి వుండేవాడు కాదు. అతనికసలు ఆ ఆలోచనే లేదు.

ఇంట్లో బాధ్యతల్లో మహేంద్ర పాలు పంచుకున్నాడా అని అడుగుతున్నారు కదా! ఏం బాధ్యతల్లో పాలు పంచుకోగలడు? ఇంట్లో వుండిందెక్కడ? ఎప్పుడూ బైటే, రాత్రి రెండు గంటలకి మూడు గంటలకి ఇంటికొస్తుండేవాడు. నేను అన్నీ చూసుకునే దాన్ని. అతని విషయాలన్నీ, భోజనం, బట్టలు, ఆరోగ్యం, అన్నీ నేనే చూసుకున్నాను.

నాకు నిజంగా కోర్కె వుండేది. ఎందుకంటే నాకెప్పుడూ ఇల్లంటూ లేదు. పెరిగింది అనాధాశ్రమంలో, నాకు నిజంగా అతని వైపు వాళ్ళతో వుండాలని వుండేది. కాని తనే వద్దాన్నాడు. వాళ్ళు నిన్నర్థం చేసుకోరు, వద్దు అన్నాడు. ఇక్కడ మేం స్వేచ్ఛగా వున్నాం. ఇక్కడ బైటకి పోవాలంటే పోతాను. వాళ్ళు పాతకాలం మనుషులు, అందుకే పోక పోవటం మంచిది. వాళ్ళవసరాలేంటో చూసే వాళ్ళం, ఇప్పటికీ చూస్తాం.

పార్టీ ఎందుకు ఏం కార్యక్రమాలు ఆలోచించలేదు? నాలాంటి కార్యకర్తల్ని చాలా మందిని పోగొట్టుకున్నారా? (కొంతసేపు నిశ్శబ్దం) ఈ ప్రశ్నకి జవాబు దయచేసి నాతో చెప్పించకండి… నేను జవాబు చెప్పలేను. జవాబు చెప్పే టైము ఎప్పుడో వస్తుంది. ఇది పార్టీ నిర్మాణానికి సంబంధించిన సమస్య. టైమే దానికి సమాధానం చెప్పాలి. దాని గురించి మనం మాట్లాడకపోవడమే మంచింది. నేనొక్కటే చెప్పగలను, మీకు మహారాష్ట్ర చీఫ్‌ జస్టిస్‌ తెలుసా? ఆయన నన్ను కలిశాడు, ఏదో ఫంక్షన్‌లో ఆయన కూడా వున్నాడు. ఏంటి ఎక్కడా కన్పించట్లేదు? అనడిగాడు. నేనేం చెయట్లేదు కనుక ఎక్కడా కన్పించట్లేదు అంతే, అని సమాధానం చెప్పాను. ఆయనన్నాడు, నీ మూలంగానే మహేంద్ర అంత పైకి పోగలిగాడు అని, నా కది చాలు. కొన్నిసార్లు మనమట్లా కూడా అనుకోవచ్చు. (ఇక్కడ నిర్మాణానికి సంబంధించిన కొన్ని విషయాల్ని ఆమె అడిగినట్లుగా రికార్డు చేయలేదు.)

నేను నాటకాలు వేసేదాన్ని, అవి నా దగ్గర లేవిప్పుడు. నేను ఆరు సోవియట్‌ నాటకాలు చదివాను. ఒక కాపీ కొనడానికి ప్రయత్నించాను కానీ మాస్కోలో కూడా దొరకలేదు. 1957లో నేనే కొన్ని నాటకాలు రాశాను. ”రొట్టె తామర” అనే నాటకం హిందీలో రాశాను. మన సభ్యులే ఈ నాటకాన్ని ప్రదర్శించే వాళ్ళు. నాతో ఇప్పుడేం లేవు. స్కూల్లో కూడా నేను నాటకాలు రాయటం, వేయించటం, పాటలు పాడించటం చేసేదాన్ని. నవజీవన మహిళామండలిలో కూడా చేశాను. అవన్నీ ఏమైపోయినయో తెలీదు. ప్రతిసారీ వార్షికోత్సవానికి ఏదో ఒకటి వుంటుంది. పిల్లలు డాన్సులు చేస్తూ, రాధాకృష్ణా అంటూ పాటలు పాడటం నా కిష్టమనిపించదు. చిన్న పిల్లలు ఆ పాటలు పాడటం నాకు బాగనిపించేది కాదు. నేనక్కడున్నంత కాలం అవన్నీ సాగనివ్వద్దనుకున్నాను. ఒక కొత్త వాతావరణం ఏర్పడటానికి నేనే నాటకాలు, పాటలు రాయటం, వేయించడం చేసేదాన్ని. మన చేతిలో అధికారం వున్నా ఇటువంటి విషయాల్ని జాగ్రత్తగా సమర్థించుకోవాలి. నవజీవన మండలిలో ఎక్కువమంది భార్యల్ని చేసుకునే పద్ధతికీ, స్త్రీల మీద దౌర్జన్యాలకూ వ్యతిరేకంగా స్త్రీలను చైతన్యవంతుల్ని చేయటం మాకు సమస్యగా వుండేది. అక్కడ కూడా నాటకాలేసే వాళ్ళం, ఉదయం పాటలు బాగా పాడేది. ఆంధ్రనుంచి ఒకమ్మాయి బెంగాల్‌ కరువు గురించి పాడేది. జనం ఏడ్చేవాళ్ళు. ఆ పాటలెక్కడున్నాయో తెలీదు. అచ్చమాంబ దగ్గర అన్నీ వుండేవి. ఆమె ఆంధ్ర, తెలంగాణాల మధ్య లింకుగా వుండేది, నేనామెతో రెండు నెలలున్నాను.

నేను ట్రేడ్‌ యూనియన్‌లో ఎప్పుడన్నా చేశానా అని మీరడుగుతున్నారా? ఆ రోజుల్లో చేయలేదు. వాళ్ళు నన్ను ఆహ్వానించే వాళ్ళు. పాతసిటీలో గుండీల ఫ్యాక్టరీ వుండేది. మేం సమ్మెనడిపాం అక్కడ, ట్రేడ్‌ యూనియన్లలో కూడా స్త్రీలు పనిచేసేంత కాడరు మనకెక్కడుంది? ఇప్పుడు నేను స్త్రీల రంగంలో పని చేయట్లేదు. ట్రేడ్‌ యూనియన్‌ రంగంలోనే వున్నాను. అప్పట్లో టైములేకుండా వుండేది….అవును…. నాకు అడివమ్మ గుర్తుంది. డి.బి.ఆర్‌.మిల్లులో చాలా వీరోచితమైన సమ్మె జరిగింది. నాకు జ్ఞాఫకం కాని, నేను ఆమెను జైల్లోనే కలిసింది. అప్పుడే ఆమెకు సన్నిహితమయింది. కొన్ని సంవత్సరాల క్రితం బట్టలు, డబ్బులకోసం నా దగ్గరకొచ్చేది, నాకు వుద్యోగం వచ్చినప్పుడు చేతనయినంతవరకు ఇతర్లకు సహాయం చేసేవాళ్ళం, ఇప్పుడైనా అట్లా చేయడం నా కిష్టం, ఆమె తరచుగా వచ్చేది. ఈ మధ్యకాలంలో రాలేదు. ఆమెకు ఇద్దరు కొడుకులున్నారట, వాళ్ళను బాలసంగంలో పెట్టిందట. ఈ మధ్య కొంతకాలమయింది వచ్చి… కనుక్కునే ఓపిక నాకు లేదు.

నేను ఇప్పుడు ట్రేడ్‌ యూనియన్‌లో పనిచేస్తున్నాను. రెండు యూనియన్లున్నాయి. చిన్న తరహా పరిశ్రమ రంగంలో రాయల్‌ లేబొరేటరీస్‌ వుంది. అదొక మందుల కంపెనీ. నేనక్కడ యూనియన్‌కు ప్రెసిడెంట్‌ని. మెజారిటీ సభ్యులు ఆడవాళ్ళే. రెండోది భారత్‌మెటల్‌ వర్క్‌ పరిశ్రమ. వాళ్ళు చిన్న డబ్బాలు తయారీ చేస్తారు. నేను 1969 నుండి ఈ రెండు యూనియన్లకి ప్రెసిడెంట్‌గా వున్నాను. అక్కడ పనివాళ్ళంతా చదువులేనివాళ్ళు. యూనియన్ల గురించి వాళ్ళ పరిజ్ఞానం చాలా తక్కువ. వాళ్ళ సమస్యల్ని పరిశీలించి వాళ్ళ డిమాండ్లతో సమస్యల్ని తీసుకోవటం మొదలుపెట్టాం. ఆర్థిక డిమాండ్లు, పనిపరిస్థితులు అట్లాంటివి, నా వుద్దేశం గురించి చెప్పాలంటే వాళ్ళల్లో చైతన్యం కలుగజేయటం. సమాజం దేశంగురి చెప్పాలంటే వాళ్ళల్లో చైతన్యం కలుగజేయటం సమాజం, దేశం గురించి వాళ్ళ పరిజ్ఞానం పెంచటం ఈ విషయాల్లో నేను పెద్ద సఫలం కాలేదు. (చాలా నొక్కి చెప్పింది) అది కావాలంటే వాళ్ళ బస్తీతో పరిచయం వుండాలి. అదే ముఖ్యం.

ఇప్పటి పరిస్థితుల గురించి నా అభిప్రాయమేమిటని అడుగుతున్నారు మీరు. ఆ ప్రశ్న గురించి ఆలోచిస్తే బాధ కలుగుతుంది. దాన్ని వదిలిస్తే మంచిది. మీరు వేరేవాళ్ళను కలిసారా? సత్యవతిని కలిసుంటారు. కమల కూడా బహుశా తన చరిత్ర చెప్పే వుంటుంది. కరుణాచౌదరి మొదట విద్యార్థి ఉద్యమంలో పనిచేసింది. తర్వాత ఔరంగాబాద్‌ వెళ్ళిపోయింది. మీరు హేమలతా గుప్తాను కూడా కలవాలి. మేం ఎప్పుడో ఒకసారి కలుస్తాం వీలయినప్పుడు. నాకిప్పటికీ అదే అభిమానం వుంది వాళ్ళమీద. వాళ్ళను చూసి గర్వ పడతాను. సత్యవతి కూడా ఎప్పుడయినా ఒకసారి వస్తుంది. మీరు లక్ష్మినికూడా కలవాలి. ఇంకొకతను కూడా వున్నాడు. వాళ్ళతో మాట్లాడితే వేరుగా వుంటుంది. అన్నీ వెళ్ళబోసుకుంటారు. మనం అన్నీ లోపలే వుంచుకుంటాం. ”సమయం రానీ, సమయం రానీ” అనుకుంటూ వుంటాం, వాళ్ళట్లాకాదు. అన్నీ చెప్పుకుంటారు. నాకు తెలిసిన మేరకు ఇట్లా వుంటుంది. మనం ఇంకా కొన్ని సమస్యల్ని సృష్టించుకోకూడదు. అందుకని మౌనంగా వుంటే మంచిది. మన భారతదేశం గురించి రాసిన వున్నతమైన వాళ్ళలో ఒక వ్యక్తి నాకు తెలుసు. నేను జర్మనీ వెళ్ళేముందు అతన్ని కలిశాను. అతను చాలా నిస్పృహగా మాట్లాడాడు. (అతని గురించి చెప్పినపుడు టేపు ఆపేయమని చెప్పటం జరిగింది.)

ఆత్మ విమర్శ గురించి కూడా… సరైన చోట ఉండాలి. బహిరంగంగా కాదు. సమయం దానికింకా సరిగాలేదు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఇంకా ఐక్యత లేదు. అట్లా ఏకం కావటంలో వాళ్ళకు ఆసక్తి కూడా వున్నట్లు లేదు. అందుకే బహిరంగంగా విమర్శించటం గురించి మీరు చాలా జాగ్రత్తగా వుండాలి. ఉద్యమంలో ఐక్యత వుంటే ఇట్లా వుండేదికాదు. మొదట శత్రువులు మనం ఏకం కావటాన్ని సహించరు. తర్వాత నాయకత్వ స్థానాలను అంటిపెట్టుకొని వుండే అవకాశ వాదులుంటారు. మూడోది పరిస్థితిని మనం సరిగా అంచనా వేయలేదు. ఇవన్నీ కారణాలు. మనం కలిసే వుండాలి. లేకపోతే మనం బూర్జువాను ఎదిరించి నిలబడలేం. బూర్జువా కూడా ఇంతకుముందు లాగా లేదు. రష్యాలో వున్నట్టుగా కూడా లేదు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ, చురుకైనవాళ్ళు. మనవాళ్ళు కూడా అదే తెలివి, చురుకుతనంతో లేకపోతే అది ప్రమాదకరం. ఏమవుతున్నదో చూడండి. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా అనుభవాలు మీకు తెలుసుకదా. స్వార్థం అనేది లేకుండా పనిచేయాలి. మనని మనం జాగ్రత్తగా చూసుకుంటూ వేరేవాళ్ళకోసం ఏం చేయలేం. నేనుత్త నాయకత్వం గురించే మాట్లాడుతున్నాను. కాడరు అట్లా లేదు. కాడరు ఎప్పుడు దీక్షగా పనిచేస్తుంది. నేనప్పుడప్పుడూ రాయాలనుకుంటాను. బెర్లిన్‌లో వున్నప్పుడు స్త్రీల గురించి రెండు మంచి పుస్తకాలు చదివాను. ఒకటి ఒక అమెరికన్‌ రాసింది. ఒకటి ఒక బ్రిటీషర్‌ రాసింది. నాకు పేర్లు గుర్తులేవు. నేను వాటినుంచి నోట్సు రాసుకున్నాను. నేను తిరిగొచ్చిన తర్వాత ఆ నోట్సుపయోగించి స్త్రీకోసం కొన్ని కరపత్రాలు రాయాలనుకున్నాను. ఎవరో కామ్రేడ్స్‌ ఆ నోట్సు తీసుకున్నారు. లేకపోతే అది మీకిచ్చేదాన్ని, మీక్కూడా చదవటానికి బాగుండేది. అమెరికన్‌ స్త్రీలు ఎంత కొట్లాడారు? మనం స్త్రీ విముక్తి ఉద్యమాల్ని ఎగతాళిచేస్తాం కాని, మనకేం ఐడియా లేదు. ఇప్పుడు చాలామంది విదేశాలకెళ్తున్నారు. పుస్తకాలు తెచ్చిపెట్టమని కొంతమందినడిగాను, కాని ఎవరూ తేలేదు, నవజీవన మండలిలో కూడా నేను క్లాసులు తీసుకునేదాన్ని. పార్టీ క్లాసులు కాదు, వివిధ దేశాల్లో స్త్రీల పరిస్థితుల గురించి చెప్పేదాన్ని. మనదేశం, గురించే ఎక్కువుండేదనుకోండి, ఫ్రాన్సు, రష్యా, చైనాల గురించి కూడా కొంత సమాచారం దొరికేది, అంతా నేను హిందీలో రాసేదాన్ని, ఒక కామ్రేడు దాన్ని ప్రింటు చేయిస్తానన్నాడు, అంతే దాన్ని నేను మళ్ళీ చూడలేదు.

పార్టీలో స్త్రీలు, పురుషుల సంబంధాల గురించి అడుగుతున్నారు. (ఆమె తను చెప్పింది రికార్డు చేయటం ఇష్టపడలేదు) ఒక సంఘటన మీకు ఆసక్తికరంగా వుండొచ్చు. అడవి ప్రాంతంనించి ఒకమ్మాయి వుండింది. ఆమెనరెస్టు చేసి నేనున్న జైల్లోనే పెట్టారు. ఆమె పేరు మల్లమ్మ. బిల్డింగులో ఒకవైపు నేనొక్కదాన్నే వుండేదాన్ని, మధ్యలో పెద్ద ఖాళీస్థలం వుండేది. అవతలవైపు నేరస్థుల్ని వుంచేవాళ్ళు, ఈ అమ్మాయి వాళ్ళతో వుండేది. తనను నాతో వుంచమని అడిగాన్నేను, వాళ్ళొప్పుకోలేదు. తర్వాత నేను నిరాహారదీక్ష చేసి ఆ అమ్మాయిని నా సెల్లులోకి రప్పించుకోవలసి వచ్చింది. ఆమె ఒక వ్యవసాయ కూలీ కూతురు. బియ్యం కూడా ఎప్పుడూ తినెరగదు. గంజినీళ్ళు తప్ప. అంత తక్కువ కుటుంబం నుంచి వచ్చింది. కాని దళంలో ఆ అమ్మాయి నేర్చుకున్నదేమిటి? సమానత్వం నేనూ కమ్యూనిస్టునే అందుకే మనకు సమాన హక్కులుండాలి అని, ఆమెకు ఇతర జ్ఞానమేమీ లేదు. ఆ పరిస్థితి చాలా దయనీయంగా వుండేది. చాలా దుర్భరమైన జీవితమని అనిపిస్తుంది. నరకం. మేమిద్దరం కలిసుండేవాళ్ళం కాని నేను నిద్రపోలేక పోయేదాన్ని, ఆమెప్పుడూ వేరేవాళ్ళతో కొట్లాటలు పెట్టుకునేది, జుట్లు పట్టుకొని బట్టలు చింపుకునేదాకా వచ్చేది, నేను కలగజేసుకొని కొట్టుకోవద్దు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ శిక్షిస్తారని చెప్పేదాన్ని. ఇవన్నీ వుండేవి, రాజకీయ చైతన్యం, విజ్ఞానం చాలా అవసరం….

యాకత్పురా, బ్రాహ్మణవాడీలో ఒక పెద్దయింట్లో మేం వుండేవాళ్ళం, నేను మీకిదవరకే చెప్పాను. చివరిదశలో ఎవరైనా పోరాటం గురించి పెద్దగా మాట్లాడితే నాకు చాలా భయం అనిపించేది. వేరేవాళ్ళు కూడా మాతో చెప్పారు. ఇంటిమీద నిఘావుంది జాగ్రత్తగా వుండమని, ఆ రాత్రి బి.ఎన్‌. వెళ్ళిపోయాడు. నేను మహేంద్రతో చెప్పాను. బి.ఎన్‌.కు చెప్పి పంపించేయమని, లేకపోతే అనవసరంగా అందరూ అరెస్టయిపోతారు. ఏవో తుపాకులు తీసుకురావటానికి ఎనిమిది గంటలకి మహేంద్ర బయటకి వెళ్ళాడు. తిరిగి రాలేదు, మర్నాడు ప్రొద్దున కూడా రాలేదు, రాత్రికీ రాలేదు, మూడోరోజు కూడా రాలేదు. నేను ఇల్లు వదిలిపెట్టి పోవాలని సిద్ధపడుతున్నాను, పెద్ద ఇల్లది, కరెంటు లేదు. మా కొరియర్‌ సికింద్రబాద్‌లో వున్నాడు. మహేంద్ర గురించి కనుక్కోమని కొంతమంది కామ్రేడ్స్‌కు చెప్పాను. అతను వెళ్ళిన స్థలంమీద పోలీసు దాడి అయింది కానీ, అతను తప్పించుకున్నాడని వాళ్ళు నాకు చెప్పారు. అట్లా జరిగితే కనీసం నాకు కబురు చేసేవాడు కదా! నేను బొంబాయి పోవటానికి నిర్ణయించుకున్నాను. తుపాకులు, తూటాలన్నీ కట్టిపెట్టాను, మూడు సంచీల నిండా తూటాలున్నాయి, నేను ఇవై నాలుగ్గంటలూ ఏదైనా శబ్దం వినపడుతుందేమోనని వింటున్నాను. ఏవో బండ్లు పోతున్న చప్పుడు వస్తున్నది. కాని నేనేం అనుమానించలేదు. సరిగ్గా ఆరుగంటలకు వాళ్ళు తలుపు తట్టారు. దానితో నా ఆట కట్టయిందని తెలిసిపోయింది. కొరియరు చాలా భయపడి పోయాడు. ఎక్కడో మూల దాక్కున్నాడు, నల్లగా వుండేవాడు, ఎవరూ కనుక్కోలేకపోయారు, నేను తలుపు తెరిచాను. పోలీసులు, ఆహ్వానం; వాళ్ళన్నారు ఇంకొక వ్యక్తి ఎక్కడ? నేనన్నాను మీరే చూసుకోండి నేనిక్కడే కూర్చున్నాను, నాకు తెలీదు, దాదాపు రెండు మూడు గంటలు వాళ్ళు మొత్తం ఆ బస్తీలో ప్రతి ఇల్లూ గాలించారు, ఒక ఇల్లు కాదు, బయటపడే అవకాశం లేకపోయింది; నా కర్థమయింది కాని, పాపం ఈ వ్యక్తి అర్థం చేసుకోలేదు. ఆ ఇన్‌స్పెక్టర్లందరికీ నేను తెలుసు, వెళ్ళేముందు ఇంకొక కామ్రేడొచ్చాడు, మీకు శశిరేఖ తెల్సా సుగుణమ్మ అక్క? ఆమె భర్త బియ్యంకోసం వచ్చాడు. పోలీసులడిగారు, ఇతనెవరు అని, నాకు తెలియదన్నాను, కాని అతను? ఒక్క చెంపదెబ్బతో అన్నీ బయటపెట్టాడు. వేరే వేరే స్థలాల్లో దాదాపు పదహారుమంది ఆంధ్రా కామ్రేడ్సుండే వాళ్ళు, అందరూ అరెస్టయిపోయారు. మేం పట్టుబడ్డప్పుడు మేం తప్ప ఎవరూ లేరు. నిజానికి తానెవరో నాకు తెలీదు, నేను పోలీసుల్ని తొందర చేశాను మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళమని, లేకపోతే ఇంకెవరైనా వస్తారేమో పట్టుబడిపోతారేమోనని భయం. తర్వాత పంచనామా జరిపి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు; బయటికి రాంగానే నేను నినాదాలిచ్చాను, ‘తెలంగాణా జిందాబాద్‌ కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్‌’ జనానికి తెలియాలి, మేమేదో వ్యాపారస్థులమనుకునే వాళ్ళందరూ, మేం దొంగలమో, ఇంకెవరో కాదని వాళ్ళకు తెలియాలి. మహేంద్ర అప్పటికే అరెస్టయిపోయాడట. నాకు తెలీలేదు, మమ్మల్ని బస్‌లోనే చాలాసేపు కూర్చోపెట్టారు. ఈ కొయిరు, ఇంకొకతను వున్నారు, వాళ్ళకు నీళ్ళు కావాలంటే నేను పోలీసుల్ని అడిగాను. వాళ్ళు నాకిస్తే నేను వాళ్ళకిచ్చాను, పోలీసులన్నారు, ”ఇట్లాంటి చెల్లెలుంటే ఎంత బాగుంటుందని.”

నన్ను పోలీసు స్టేషనులో ముప్ఫయ్యైదు రోజులుంచారు. పోలీసులొచ్చి నేనేం చేస్తున్నానని తొంగి చూసేవాళ్ళు, నేనూరికే వెనక్కి ముందుకీ నడిచేదాన్ని, ఏం చేస్తాను? ఘోరంగా వుండేది. జైల్లో వుండటం వేరు, పోలీసు కస్టడిలో ఘోరంగా వుంటుంది. మన టెన్షన్‌ మొత్తం వాతావరణంలో వుంటుందా టెన్షన్‌. నేను మా అమ్మకు కబురు పంపించాను. ”నేనిక్కడున్నాను (నవ్వు) కోర్టుకెళ్ళి మహేంద్ర పరిస్థితేంటో కనుక్కో, అతని ప్రాణానికేమైనా ప్రమాదముందేమో కనుక్కో” అని. మా అమ్మ లాయర్లతో అక్కడికొచ్చింది. ముప్ఫయ్యైదు రోజులయిన తర్వాత మమ్మల్ని జైలుకు తీసుకెళ్ళారు. నాకు శారీరకంగా ఏం హింస పెట్టలేదు కాని, మానసికంగా ఎంత టెన్షను. నువ్విక్కడున్నావు, తలుపులు, కిటికీలు అన్నీ మూసేస్తారు, లోపలికెవరూ రారు. అంతా నిశ్శబ్దం, వున్నట్టుండి తలుపులు తెరుచుకుంటాయి. చాలామంది పోలీసులొక్కసారి లోపలికొచ్చి కామ్రేడ్సును తీసికెళ్తారు. వాళ్ళను హింసించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు, కొన్నిసార్లు వాళ్ళ కేకలు కూడా నాకు వినిపిస్తాయి. ప్రశ్నలేయడానికి ప్రతిరోజు వచ్చేవాళ్ళు. ”నువ్వెక్కడ పుట్టావు? ఏం చదువుకున్నావు? నీ కామ్రేడ్సెక్కడ?” ”మీరే కనుక్కోండి, నాకేం తెలుసు, నేనెందుకు చెప్తాను? నేను మీ దాసిని కాదు.” ఆ తర్వాత మళ్ళీ వేసేవాళ్ళు, ఒక్కొక్క రాత్రి వాళ్ళు హింసించటం వినిపించేది ప్రత్యేకంగా ష్త్రీలని, చాలా బాధాకరమైనది, తొమ్మిది పదిగంటలకి నా తలుపు తెరిచి వాళ్ళంతా లోపలికొచ్చారు. కుర్చీలున్నాయి, అందరూ కూర్చోని ప్రశ్నలడగటం మొదలు పెట్టారు. ”మక్‌బుల్‌ ఎక్కడ? మహేంద్ర ఎక్కడ?” ”నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలిసినా నేను మీకు చెప్పను, నేను మీ కింద పనిచేయటం లేదు” అట్లా నడిచేది. వాళ్ళలో ఒకడన్నాడు, సరే రేపు వరంగల్‌ దగ్గర మంగనూరులో పోలీసు కాంపుకి తీసికెళ్ళండి అని. నేనన్నాను ”చాలా సంతోషం నేను చాలా రోజుల్నుంచి ఆ కాంపు చూడాలనుకుంటున్నాను.” అని. తర్వాత వాళ్ళెళ్ళిపోయారు, తర్వాత అక్కడ గార్డుకు చెప్పాను. వాళ్ళొచ్చినప్పుడు నువ్వు ఏదైనా గుర్తు చేయాలి లేకపోతే అంతమంది ఒక్కసారి చడీ చప్పుడు లేకుండా లోపలికొచ్చి పడితే షాక్‌లాగా అవుతుంది. ఏం చేస్తారో తెలీదు. కాని వాళ్ళూరికే నన్ను భయపెట్టారు, నేను ఈ అడివమ్మను చూశాను. బాగా బాధించారామెను. కాళ్ళు విరగొట్టారు, కాళ్ళకు గొలుసులేసి వాటిమీద నొక్కడం, నిలబడడం, డాన్సుచేయడం, చాలా ఘోరంగా చేసే వాళ్ళు. పార్టీకి తుపాకులు కొనటం కానీ, చేరవేయటంగానీ చేను చేశానా అని అడుగుతున్నారా? చేరేయటం చేశాను. నేనందులో ముఖ్యురాల్ని, కొనటం చాలా కష్టమైనది. తుపాకులు ఒక స్త్రీ సహాయం లేకుండా చేరేయటం కష్టమయ్యేది. మాకు పర్ధాలు కట్టిన రిక్షాలుండేవి. మాతో తుపాకులు పెట్టుకొని అట్లా చేరేసేవాళ్ళం. బురఖా వేసుకునే అవసరం వుండేది కాదు. కాని రిక్షా పరదా మాత్రం వుండేది. హిందూ స్త్రీలు కూడా పర్దాలు కట్టుకునేవాళ్ళు, కాయస్థులు, మార్వాడీలు, ఇతర్లు కూడా. నేనెప్పుడూ భయపడలేదు. నా రోజుల్లోని హీరోలను గుర్తు చేసుకునేదాన్ని, సుధీరాంబోసులాంటి వాళ్ళు. అట్లా ధైర్యం తెచ్చుకొనే దాన్ని, నేను చాలా ధైర్యంగా గర్వంగా వుండేదాన్ని, నాకిప్పుడు డెబ్భై ఏళ్ళు నిండుతాయి. నా ఆరోగ్యం నన్నెక్కువ చేయనివ్వదు. నాకు స్పాండిలైటిస్‌ వుంది. లేకపోతే నేనూరికే వుండను.

ఇదే ఆఖరు కలవటమన్నట్టు కాకూడదు, మళ్ళీ రండి.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.