చెయ్‌

రోజూలాగే నిద్ర లేచి అమ్మకోసం తన గదిలోకి వెళ్ళాను. తను లేదు. అప్పుడే లేచేసినట్టుంది. తనని వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాను. మార్గశిరమాసపు చలి సర్రుమని కోస్తున్నట్టుంది. ఆ చలిలో వంటిమీద శాలువాయేనా కప్పుకోకుండా ఒక్కొక్క మొక్కముందూ నిలబడి ”చెయ్‌! చెయ్‌!” అంటూ నడుస్తోంది. నా గుండెల్లో సన్నటి బాధ. అమ్మకి కొద్దిగా మతిస్థిమితం తప్పింది. తనని ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు.

రోజూలాగే నిద్ర లేచి అమ్మకోసం తన గదిలోకి వెళ్ళాను. తను లేదు. అప్పుడే లేచేసినట్టుంది. తనని వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాను. మార్గశిరమాసపు చలి సర్రుమని కోస్తున్నట్టుంది. ఆ చలిలో వంటిమీద శాలువాయేనా కప్పుకోకుండా ఒక్కొక్క మొక్కముందూ నిలబడి ”చెయ్‌! చెయ్‌!” అంటూ నడుస్తోంది. నా గుండెల్లో సన్నటి బాధ. అమ్మకి కొద్దిగా మతిస్థిమితం తప్పింది. తనని ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు.

”లోపలికి వెళ్దాం, రామ్మా!” అన్నాను తన దగ్గిరగా వెళ్ళి చెయ్యి పట్టుకుని.

ఆ చేతిని అలాగే బిగించి పట్టుకుని, నా కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ ”చెయ్‌” అంది.

”ఏం చెయ్యను” మెత్తగా అడిగాను. తను ఆలోచనలో పడింది. ”అది చెయ్‌, ఇది చెయ్‌, అలా చెయ్‌, ఇలా చెయ్‌, అన్నీ చెయ్‌, నువ్వే చెయ్‌…” అంటూ నా వెంట నడిచింది. ఇది రోజూ జరిగే వ్యవహారం. ఎలాంటి మార్పు వుండదు. అమ్మని తీసుకెళ్ళి తన గదిలో కూర్చోబెట్టి కాఫీ తీసుకెళ్ళి ఇచ్చాను. తను తాగట్లేదు. వూరికే ”చెయ్‌, చెయ్‌” అంటోంది. వింటున్న నాకు విసుగొస్తోంది కానీ తను ఎంత ఘోషపడిందో అనుకుంటే మాత్రం బాధే.

అమ్మమ్మకి ఎనిమిదిమంది సంతానం. అందులో అమ్మ పెద్దది.

”ఏమే! అలా మొద్దులా కూర్చోకపోతే చెళ్ళెళ్ళకి జళ్ళెయ్యకూడదూ? తమ్ముడికి నీళ్ళు పొయ్యి…. ఆ బియ్యం కడిగి బుట్టలో పోసి నీళ్ళు వోడ్చి తీసుకురా! నాన్నకి కాఫీ ఇవ్వు. మిగిలిన కాఫీ అందరికీ గ్లాసుల్లో పోసివ్వు… గదులు తుడువు…” అలా ఒకదాని వెనకాల ఒకటి పూరమాయిస్తునే వుండేదట అమ్మమ్మ.

”నేనూ తన పిల్లల్లో ఒకదాన్ననిగానీ, పెద్దచెల్లికన్నా నేను ఏడాదే పెద్దనిగానీ అమ్మకి ఎప్పుడూ తోచేది కాదు. కళ్ళెదురుగా వున్నంతసేపూ ఏదో ఒకటి చెప్తునే వుండేది. గిలకలా తిరుగుతూ ఎన్ని చేసేదాన్నో! అవన్నీ చేసి అందర్నీ సవరదీసి స్కూలుకెళ్ళేసరికి నాకెప్పుడూ లేటే! అదీ ఒకొక్కరోజు అసలు వెళ్ళటానికి కుదిరేదీ కాదు. ఏమమ్మా! సంతానలక్ష్మీ. వచ్చావా? తీరిందా? అనేవాడు పంతులు” అని తన చిన్నతనాన్ని గుర్తుచేసుకునేది అమ్మ.

ఆ తర్వాతి ప్రకరణం ఆవిడ పెళ్ళి.

”అసలెలా పెరిగానో ఎప్పుడు పెరిగి పెద్దయ్యానోకూడా గుర్తులేదు నాకు. అప్పుడు చదువంటే ఇంత హైరానా వుండేదికాదుగా. అందుకు పదోతరగతి అయిందనిపించాను. ఇంతలో పెళ్ళిపెళ్ళన్నారు. మూడునాలుగు సంబంధాలు చూస్తే మీనాన్నావాళ్ళ సంబంధం కుదిరింది” అందొకసారి. ఆ మాటలో ఏదో వెల్తి. అమ్మ మాయింట్లో సంతోషంగా లేదా అంటే నవ్వుతూనే వుండేది. కంటతడి పెట్టగా ఎప్పుడూ చూడలేదు. అదే సంతృప్తికి నిర్వచనమా అంటే చెప్పలేను. కానీ మాయింట్లో వాతావరణం కొంత భిన్నంగా వుండేది. ఆ రోజుల్లో అందరిళ్ళలో అలాగే వుండేదేమో, ఒక్కో ఇంట్లో ఒక్కో వింతలాగ.

తాతయ్య బయటినుంచీ రాగానే మామ్మ ఆయనకి కాళ్ళు కడుక్కుందుకు చెంబుతో ఎదురెళ్ళేది. ఇంట్లోకి రాగానే మంచినీళ్ళగ్లాసు చేతికిచ్చి ఆయన తాగేదాకా నిలబడి ఖాళీగ్లాసు అందుకుని వెళ్ళేది. నాకిదంతా వినోదంగా వుండేది. పెద్దయ్యాక నాకూ అలాగే ఇస్తారు కామోసున నుకునేవాడిని. ఎందుకంటే ఆటలు ఆడిఆడి నాకాళ్ళు దుమ్ముకొట్టుకుపోయివుండేవి. బాగా అలసిపోయివుండేవాడిని. విపరీతమైన దప్పికవేసేది. కానీ కాళ్ళూచేతులూ కడుక్కున్నాకగానీ నన్ను ఇంట్లో అడుగుపెట్టనిచ్చేవాళ్ళుకాదు. నాకాళ్ళు నేనే కడుక్కోవాలి. పెరటిదాకా వెళ్ళి పెద్దగంగాళంలోంచీ నీళ్ళు ముంచుకుని కాళ్ళమీద పోసుకోవాలి. ఒక అరిపాదంతో రెండోకాలి పాదాన్ని శుభ్రంగా రుద్ది డుక్కోవాలి. అలా రెండుకాళ్ళూ మురికి వదిలేలా కడుక్కున్నాక చేతులూ, మొహం కడుక్కుని ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు ముంచుకుని తాగాలి. గ్లాసు కడిగి పెట్టాలి. ఇవన్నీ పెద్దపనుల్లా అనిపించేవి. పెద్దయ్యాకమాత్రం బామ్మ అలా చెయ్యడం అసంబద్ధంగా అనిపించసాగింది.

”ఎందుకు, తాతయ్య తాగేదాకా నిలబడి గ్లాసందుకోవడం? తాగాక తనే కిందపెడతారుగా?” అని అడిగానొకసారి బామ్మని.

”నువ్వే చూద్దువుగాని” అని నవ్వి బామ్మ నీళ్ళగ్లాసు అందించి వంటింట్లోకి వెళ్ళిపోయింది.

”ఏమేవ్‌. ఈ గ్లాసు తీసుకో… ఒసేవ్‌, గ్లాసు నాకిచ్చి వెళ్ళిపోయేవేమిటి?” అని తాతయ్య అరుపులు.

”కింద పెట్టచ్చుకదా, తాతయ్యా?” అని అడిగేను, అక్కడే వున్న నేను.

”ఇంకా గ్లాసు అక్కడే వుండిపోతుంది. తియ్యడానికి ఎవరికీ వొళ్ళొంగదు. ఐనా ఒక్క నిముషం నిలబడి గ్లాసు తీసుకుని వెళ్ళిపోయేదానికి నేను వంగుని కింద పెట్టాలా? అంత తీరికలేని పనులేం చేస్తోందట?” అన్నాడు తాతయ్య. బామ్మ వచ్చేదాకా ఆ స్తోత్రం సాగుతూనే వుంది.

”ఈ మాటలన్నిటికన్నా ఆయనన్నట్టు నిలబడి ఆ గ్లాసేదో తీసుకుని వెళ్ళిపోతే తీరిపోదూ?” అంది ఆవిడ. అలా అలవాటుపడిపోయారు ఇద్దరూ. నాన్నా అంతే. ప్రతీదీ చేతిదగ్గిరకి తీసుకెళ్ళి అందివ్వాలి. బ్రష్షుమీద పేస్టుదగ్గిర్నుంచీ. అలా అలవాటుచేసింది బామ్మ. ఈ వాతావరణంలోకి అమ్మ అడుగుపెట్టింది.

”ఇంట్లో ఎవ్వరూ ఏ పనీ చేసేవాళ్ళు కారు. ఎవరిపని వాళ్ళు చేసుకోవడానికీ నామోషీయే. అప్పటిదాకా ఇంటికి కేంద్రబిందువులా నడిపించిన బామ్మకూడా నేను రాగానే పనంతా నాకు వదిలేసింది. పెత్తనం తనదేసుమా! తనెలా చెప్తే అలా తూచాతప్పకుండా అన్నీ జరగాలనేది. చివర్లో వోపిక తగ్గి మంచానపడ్డాక కూడా అలాగే సాగించుకుంది. రంగడూ! స్వతంత్రంగా ఎంతపనేనా చెయ్యచ్చుగానీ ఒకళ్ళ పెత్తనంకింద చేసే పని చిన్నదే అయినా చాలా బరువుగా అనిపిస్తుంది!” అంది అమ్మ ఒక సందర్భంలో. అదే భావం నాలోను వుందో లేక దాన్ని నేను అందిపుచ్చుకున్నానో అదీకాక నాకు అవకాశం కలిసి వచ్చిందో, నా భావాన్ని బట్టి అవకాశాన్ని నేనే వెతికిపట్టుకున్నానో, నాది స్వతంత్రమైన వుద్యోగం. ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ని.

తన పెళ్ళైన ఏడాదికి అమ్మకి వుద్యోగం వచ్చింది. అదో తమాషా. అప్పట్లో సెంట్రల్‌గవర్నమెంటు వుద్యోగాలు చాలా తేలిగ్గా వచ్చేవట. పదోతరగతిలో మంచిమార్కులుంటే చాలు, పోస్టల్లోనూ, టెలికాంలోనూ, రైల్వేలోనూ వుద్యోగాలు ఇచ్చేవారు. పెళ్ళికి ముందు అమ్మ స్నేహితుల్తో సరదాగా పెట్టిన అప్లికేషనుమీద పెళ్ళయ్యాక ఇంటర్వ్యూకి రమ్మని వచ్చింది. అటువాళ్ళూ ఇటువాళ్ళూ దానిమీద తర్జనభర్జనపడి మొత్తానికీ అమ్మ వుద్యోగంలో చేరచ్చునని తీర్మానించారట.

”రంగడూ! వుద్యోగంలో చేరుతున్నానని చాలా గొప్పపడిపోయానుగానీ చేరాకగానీ తెలియలేదు అదెంత తెలివితక్కువపనో! ఇంటర్వ్యూ రోజునే ఆర్డరు అప్పటికప్పుడు టైపుచేయించి చేతిలో పెట్టారు వెంటనే వచ్చి చేరమని. దాన్ని చూసుకుని ఎంత మురిసిపోయానో… సంకెళ్ళు బంగారంవని చూసుకుని మురిసిపోయినట్టు” అంది అమ్మ తన వుద్యోగప్రహసనాన్ని గురించి చెప్తూ.

అమ్మ చాలా చురుగ్గా పనిచేసేదట. అందుకని ఏ బ్రాంచిలో పెండింగుంటే అందులో తనని వేసేవారట. రోజులు గడుస్తున్నకొద్దీ వయసు పెరిగి అమ్మలో ఓపిక తగ్గడం మొదలైంది. అలాగని తన బాధ్యతలేమీ తగ్గలేదు. అమ్మమ్మకి అనారోగ్యం…. బామ్మకి అనారోగ్యం…. కుటుంబ అవసరాలు. ఎవరికే కష్టం వచ్చినా అమ్మకేసే చూసేవారు. ఆపైన ఆఫీసులో వస్తున్న మార్పులు…

వాళ్ళ డిపార్టుమెంటు నష్టాల్లో పడింది ఆ నష్టాన్ని భర్తీచేసుకుందుకు వాళ్ళు అనేక పనులు తలకెత్తుకున్నారు. అక్కడినుంచీ అమ్మలో నిరాసక్తి మొదలైంది. దాన్ని ఎవరం గుర్తించలేదు. అలా అనేకన్నా ఎవరం గుర్తించడానికి ఇష్టపడలేదు, వున్న ఒకేఒకా పరిష్కారం పరిష్కర్తకి నచ్చనిదికాబట్టి. ఒక సమస్యని సమస్యగా గుర్తించకపోవడం అసలు సమస్యకన్నా పెద్దది.

”రంగడూ! సామాన్యంగా బతికే మనుషులం మనం. తినడానికింత తిండీ, నిలవడానికీ నీడా వుంటే బతుకు లాగించెయ్యగలం. నలుగురు మనని మంచి అంటే అదే బలమనుకుని బతికెయ్యగలం. ఇంతంత జీతాలూ, ఆ జీతాలకోసం ఏవేవో చెయ్యటాలూ, ఈ ఆరాటాలూ ఈ వయసులో అవసరమా?” అని ప్రశ్నించింది.

”వ్యవస్థ మంచిదే. కానీ దాన్ని తనకనుగుణంగా వుండాలని ఎవరో ఒకవ్యక్తి…. అతడు మన పై వుద్యోగి కావచ్చు, మనని పాలించే నేత కావచ్చు…. అనుకోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. అతడు గొప్ప ఎంట్రప్రెనర్‌ కావచ్చు, గొప్ప ప్రగతివాది కావచ్చు. అతడూ ఈ వ్యవస్థలోని భాగమే. కాబట్టి వ్యవస్థని అనుసరించి, వ్యవస్థలోని సహభాగస్థులననుసరించి వెళ్ళాలి. కాకపోతే తన స్వంత సంస్థని స్థాపించుకోవాలి. తన ప్రయోగాలకి వేదిక చేసుకోవాలి. అంతేగానీ తన వుత్సాహానికి అనుగుణంగా వ్యవస్థని మార్చాలనుకుంటే కాడికి కట్టిన ఎడ్లలో ఒకటి పడుచుదీ ఒకటి ముసలిదీ వుంటే వ్యవసాయం ఎలాసాగుతుందో అలా వుంటుంది సమాజం. ఇప్పుడలాగే వుందికదూ?” అనీ తనే అంది.

”నా శక్తిని మించిపోతున్నాయిరా రంగడూ, ఈ బాధ్యతలు. ప్రతివాళ్ళూ ప్రతీదీ చెయ్‌ చెయ్‌ అంటారు. ఎనిమిదేళ్ళ వయసునించీ ఈ మాట వినివిని విసిగిపోయాను. చేసుకునే వోపికలేని అమ్మమ్మకి అంతమంది పిల్లలం ఎందుకు? ఇంట్లోవాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వలేని బామ్మకి ఇంటి పెత్తనం ఎందుకు? ఎవరిపని వాళ్ళు చేసుకుంటే, ఇంటిపని సులువౌతుంది. ఆపైన అందరూ తలోచెయ్యీ వేస్తే వుద్యోగాలూ చెయ్యగలం. అందరూ కూర్చుని నామీద పెత్తనం చేస్తారు. అక్కడ ఆఫీసులోనూ అంతే. పైవాళ్ళకి ఆలోచన రావడం భయం, మానెత్తిన రుద్దుతారు. చెయ్యగలమో లేదో చూడక్కర్లేదా? యాభయ్యేళ్ళవయసులో కంప్యూటర్‌మీద చెయ్యడం నేర్చుకోమంటారు. ఇన్షూరెన్సుపాలసీలు అమ్మమంటారు. గోల్డ్‌ కాయిన్స్‌ అమ్మమంటారు. ఇంటింటికీ వెళ్ళి ఆర్డర్లు తెమ్మంటారు. ఏవేవో చెయ్యమంటారు. టార్గెట్స్‌ పెడతారు. సాఫ్ట్‌ స్కిల్సంటారు, కమ్యూనికేషన్‌ స్కిల్సంటారు. అవేవీ లేకుండానే అక్కడ పెద్దకూతురిగానూ, ఇక్కడ పెద్దకోడలిగానూ మీకు అమ్మగానూ ఇంత గౌరవాన్ని అందుకోగలనా? పెద్దపెద్ద కంపెనీల్లో మార్కెటింగ్‌కీ, సేల్స్‌కీ, అడ్వర్టైజింగ్‌కి దేనికి దానికే విడిగా వుంటారట. మరి మమ్మల్నేమిటి, అన్నిటికీ వాడుకుంటున్నారు? ఇవన్నీ నావల్లకావటంలేదు. వేళకి ఇంటికి వెళ్ళనివ్వరు. శలవులుకూడా వాడుకోనివ్వరు. వ్యక్తిగతజీవితం అంటూ లేకుండా పోయింది. తలొంచుకుని పని చెయ్యమంటే ఎంతేనా చెయ్యగలను. నలుగురికి చెప్పి చేయించగలను. ఇన్నేళ్ళ అనుభవం, తెచ్చుకున్న మంచిపేరు, మంచులా కరిగిపోయాయి” అని బాధపడేది. అంత జీతం వచ్చే వుద్యోగం మానటానికి నాన్న వప్పుకోవడంలేదు.

”మారుతున్నకాలంతోపాటు మారాలి. ఎప్పటికీ ఒక్కలాగే వుంటామనుకుంటే కుదురుతుందామరి?” అన్నారు నాన్న. అమ్మలో నిస్పృహ, అయిష్టంగా ఆఫీసుకి వెళ్ళేది.

”మీకు పని రాదు, ఇలాగైతే ఎలా? ఈ ఆఫీసులో మీ సర్వీసు అవసరంలేదు. ఇంకెక్కడికేనా ట్రాన్స్ఫరు పెట్టుకుని వెళ్ళిపొండి. కేపబుల్‌ హేండ్సుని తెచ్చుకుంటాం… మీకు పని రాదు, చెయ్యలేరు, ఈ వుద్యోగాలు వదలరు. జీతాలు మాత్రం కావాలి – అనిపించుకోవడానికి నేను ఆఫీసుకి వెళ్ళాలి” అని గొణుగుతూ వెళ్ళేది. స్కూలుకి వెళ్ళడానికి మారాము చేసే పసిపిల్లలా అనిపించేది నాకు. తన సమస్యలోని లోతు తెలిసేది కాదు. నాన్న వినీ విననట్టూరుకునేవారు.

మరీ విసుగొస్తే, ”అంటారు మరి. ఇంతంత జీతాలు తీసుకుంటున్నప్పుడు జవాబుదారీ తీసుకోవాలి. నాకిది రాదు, అది రాదు. ఇది చెయ్యను అది చెయ్యను అని గిరిగీసుకుని కూర్చుంటే ఎలా? ఎంతసేపూ నీకోణంలోంచే నువ్వు ఆలోచిస్తున్నావు. మీ ఆఫీసరు తనమీద ఎంత వత్తిడి వుంటే మిమ్మల్నిలా ప్రెజరైజ్‌ చేస్తున్నాడు? ఆయన కోణంలోంచీకూడా ఆలోచించు” అనేవారు పర్సనాలిటీ డెవలప్‌మెంటు పాఠాలు బాగా చదివి ఏదేనా తలుచుకుంటే అది జరిగేదాకా తగ్గని నాన్న. వాళ్ళ ఆఫీసులో నాన్నకి చండశాసనుడని పేరు. ఇంట్లో అమ్మనికూడా తనకింది వుద్యోగిని చూసినట్టే చూస్తారు పని విషయంలో.

”నాకున్నవి చాలవన్నట్టు మా పైవాళ్ళ సమస్యల గురించి కూడా నేనే ఆలోచించాలి కాబోలు!” అంది అమ్మ.

ఆ తర్వాత తనిలా…. దాదాపు ఆర్నెల్లనుంచీ. వుద్యోగం మానేసింది. లీవులు పెట్టించి వుద్యోగాన్ని నాన్న కాపాడుతున్నారు. ఈవేళో రేపో అమ్మని ఇన్‌ వేలిడేట్‌ చేస్తారు. పనికిరాదని వుద్యోగంలోంచి రిటైర్‌ చేస్తారు.

తనిప్పుడొక చెదిరిపోయిన జీవనచిత్రం.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

2 Responses to చెయ్‌

  1. ప్రసాద్ says:

    బాధ గానే వుంది ఆ స్త్రీ జీవితం చదవడానికి.

    నాకు ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు వుంటూనే వుంటాయి, ఇటువంటి కధలు చదివినప్పుడల్లా.

    ఇటువంటి స్త్రీలు, ముగ్గురు ఆడ పిల్లలూ, ఆ తర్వాత ఒక మగ పిల్లాడూ కలిగినప్పుడు ఎలా ప్రవర్తిస్తారూ ఆ పిల్లల పట్ల? తమ పట్ల తమ పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తించారో, అలాగే ప్రవర్తిస్తారా? లేక తమ జీవితం నించీ ఏమన్నా నేర్చుకుని, వేరేలా ప్రవర్తిస్తారా? అలాగే, తర్వాత కాలంలో కోడలు వచ్చినప్పుడు, ఆ కోడలు పట్ల ఎలా ప్రవర్తిస్తారూ? తన అత్తగారు, తన మామగారి వల్ల దాస్యం అనుభవించినప్పటికీ, తాను వచ్చాక తన మీద అత్తరికం చెలాయించింది కాబట్టి, తను కూడా తన కోడలి మీద అత్తరికం చెలాయించడానికి చూస్తుందా? లేక తాను వేరేలా ప్రవర్తిస్తుందా? చాలా వరకూ కధల్లో, ఇలాంటి స్త్ర్తీలకి వచ్చే కోడళ్ళు గయ్యాళి గానూ, వుండే అత్తలు గయ్యాళి గానూ, వున్న అమ్మలు బండగానూ వుంటారు. వీళ్ళు మాత్రమే సున్నితంగా వుంటారు. అందుకే ఇటువంటి కధలు చాలా అసమగ్రంగా వుంటాయి నాకు. ఆ తల్లి కష్టాలు చూస్తున్న ఆ కొడుకు ఏమీ చెయ్యడు. తన జీవితంలో తాను ఎలా వుంటాడో కధ చెప్పదు. అసలు కధలు పూర్తిగా అన్ని విషయాలూ చెప్పడం మానేశాయి. ఒకే ఒక్క విషయాన్ని, మిగిలిన వాటితో ముడి పెట్టకుండా, ఒకే దారిలో చెప్పుకుంటూ పోతాయి. చదివే వాళ్ళకి ప్రశ్నలు వస్తాయని కూడా ఆలోచించదు కధ. ఈ మధ్య కధల్లో నిజాయితీ లోపిస్తోంది. అంటే అబద్ధాలు చెబుతాయని కాదు. అన్ని నిజాలూ చెప్పవు. అవేవో అనవసరం అన్నట్టు వదిలేస్తాయి. దాంతో ఒకే వేపు నించీ కధ నడుస్తుంది. అది సహజత్వానికి దూరంగా వుంటుంది.

    ప్రసాద్

  2. S Sridevi says:

    రచయిత్రి స్పందన. ఇటువంటి జీవితాలు అసమగ్రంగానే వుంటాయి. వీళ్ళకి పరిష్కారం చూపించడానికి ఎవరూ ముందుకి రారు. ఆఫీసులూ ఇళ్ళూ నడవవు మరి. అమ్మ ఇష్టాలనీ కష్టాలనీ పిల్లలు సాధారణంగా నాన్న కళ్ళతోనే చూస్తారు. ఇక వీళ్ళు . . .అవకాశం దొరికితే వీళ్ళమీది వత్తిడిని పక్కవాళ్ళమీదికి నెడతారు. అలాంటి మనస్తత్వం లేనివాళ్ళు మాత్రం ఈ కథలోలా ఔతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.