మహాత్మా జ్యోతిబా ఫూలే, మాతా సావిత్రిబాయి, బాబాసాహెబ్ డా॥ అంబేడ్కర్` పెరియార్‌ల మహోన్నత సమతా సాంస్కృతిక సాహిత్యోద్యమ తాత్విక వారసురాలిగా తెలుగునాట ప్రసిద్ధికెక్కిన సాహిత్య క్రాంతిజ్యోతి అమ్మ డా॥ బి.విజయభారతి.
అరుదైన పరిశోధకురాలిగా, ఆలోచనాశీలిగా, ప్రత్యామ్నాయ సాహిత్య సృజనశీలిగా భావితరాలకు వెలుగుజ్యోతిని చూపిన విద్వత్‌శక్తి ఆమె రచనల్లో మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది.
పురుషాధిక్య వర్గ, వర్ణ వ్యవస్థపై సాహిత్య ఖడ్గాన్ని రaళిపించిన డా॥ విజయభారతి ఫూలే` అంబేడ్కర్` పెరియార్‌ల తాత్విక, ఉద్యమ అడుగు జాడల్లో నడిచి బ్రాహ్మణ మత సిద్ధాంతాల చిక్కుముడులను తన రచనల్లో బహిర్గతం చేశారు. ‘పురుష సూక్తం’ అనే రచనలో ‘‘వేదంలో పురుష సూక్తమూ, పురాణాల్లో విష్ణు పురాణమూ, భారతంలో భగవద్గీత, ధర్మశాస్త్రాల్లో మనుస్మృతి అగ్రగణ్యమైనవి’’ అంటున్నారు పండితులు అని పేర్కొంటూ` ‘‘పైవన్నీ వర్గ, వర్ణ వివక్షను సమర్థించేవే’’ అని విశ్లేషిస్తారు. డా॥ అంబేడ్కర్ రచనలు` ప్రసంగాలు` 4లో సరిగ్గా ఆయన ఈ ‘‘చిక్కుముడులను’’ విశ్లేషించి అశేష బహుజనాన్ని జాగృతం చేశారు.
ఈ రకమైన సబాల్టర్న్ (అట్టడుగు వర్గాల/వర్ణాల) గతితార్కిక చారిత్రక భౌతికవాద దృక్పథంతో పురాణేతిహాసాలను అధ్యయనం చేసి తన అద్భుతమైన విశ్లేషణతో మత గ్రంథాలలో దారుణమైన స్త్రీల అణచివేత, వర్ణ వ్యవస్థ నిర్మాణ చట్రంలో దోపిడీ ఎలా కొనసాగుతూ విస్తృతమైన అశేష భారత బహుజనాన్ని అణగదొక్కాయో అమ్మ డా॥ విజయభారతి తన రచనల్లో చక్కని తేటతెలుగులో సరళంగా మనకు కళ్లకు కట్టినట్టు వివరిస్తారు. ‘పురాణాల్లోనూ ఉంది కుటుంబ హింస’, రుక్మాంగద చరిత్ర’, ‘పరువు హత్యలు’… వంటి అనేక రచనల్లో (స్వతంత్ర భారతదేశం స్త్రీలకు గుప్పెడు ధూళినే మిగిల్చిందా… వ్యాస సంపుటి) మహిళలపై జరిగిన, జరుగుతున్న కుటుంబ హింస, లైంగిక దోపిడీ, కుల పరువు హత్యలు, మతపరమైన వ్రతాలూ, నోములూ, మహిళల ప్రగతికి అడ్డంకి కావడం, జోగిని వ్యవస్థ, వేశ్యా వృత్తి మూలాలు, గ్రామదేవతల ఆరాధన వంటి ఎన్నో క్లిష్టమైన సమస్యలను సామాన్య పాఠకులకు అర్థమయ్యే రీతిలో సులభ విశ్లేషణ చేయడం బహుశా డా॥ బి.విజయభారతికే సాధ్యమైన అనితరసాధ్య రచనా శైలి.
రుగ్వేదంలోని పురుషసూక్తంలోని రుక్కులు వివరిస్తూ 13వ రుక్కు (మంత్రం) చాతుర్వర్ణ వ్యవస్థకు మూల కారణమని అమ్మ డా॥ విజయభారతి సోదాహరణంగా వివరించారు. సత్యహరిశ్చంద్రుడు, షట్చక్రవర్తులు రచనల్లో ఆర్య సామ్రాజ్య విస్తరణ, వర్ణ వ్యవస్థను బలోపేతం చేయడం, శూద్రుల, మహిళలపై అణచివేతల గురించి అత్యద్భుత వివరణలు అందించారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్, మహాత్మ ఫూలే జీవిత చరిత్ర వంటి రచనలతో తెలుగునాట ప్రత్యామ్నాయ బహుజన ఉద్యమాలకు కరదీపికలు అందించారు. గుణాఢ్యుని కాలం నుంచి నేటివరకూ (1950) ‘తెలుగు సాహిత్య కోశం’ (ప్రాచీన, ఆధునిక యుగాలు) సంపాదకత్వం వహించి నన్నయ ముందు కాలం నాటి తెనుగు సాహిత్యంపై వెలుగులు ప్రసరింపజేశారు. సహచరులు, బహుజన మేధావి బొజ్జా తారకం గారితో కలిసి డా॥ అంబేడ్కర్ రచనలు` ప్రసంగాలు తెలుగు అనువాదాలకు (సంపుటాలు 1, 4, 10, 14) సంపాదకత్వం వహించారు. తండ్రి బోయి భీమన్నపై ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ రచనను, మామగారు బొజ్జా అప్పలస్వామి 1950వ దశకంలో సంపాదకత్వం వహించిన ‘జ్యోతి’ సంచికలను సంకలనం చేశారు. బొజ్జా తారకం ట్రస్టు చైర్మన్‌గా గనుమల జ్ఞానేశ్వర్ సహకారంతో ఆయన రచనలు పునర్ముద్రించారు. తొలితరం అంబేడ్కరైట్ అనుయాయులు, నాయకులు షెడ్యూల్డు కేస్ట్స్ ఫెడరేషన్ ఎమ్మెల్యే బొజ్జా అప్పలస్వామి జీవితచరిత్ర (బొజ్జా తారకం రచన) ఈనాటి తరాలకు ట్రస్ట్ ప్రచురణల్లో భాగంగా అందించారు.
అమ్మ విజయభారతిని నేను మొట్టమొదటిసారి 1994లో వారింట్లో కలుసుకున్నాను. అప్పుడు తెలుగునాట బహుజన సిద్ధాంతకర్త కాన్షీరామ్ నేతృత్వంలో (1994) బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల సందర్భం. చివరిసారిగా ఈ సంవత్సరం 2024 మార్చిలో హైదరాబాద్‌లో వారింటికి వెళ్లి కలిశాను. నాతో బాటు ప్రముఖ రచయిత్రి జి.విజయలక్ష్మి, అంబేడ్కరిస్టు గనుమల జ్ఞానేశ్వర్ గారు
ఉన్నారు. మేమంతా కలిసి అమ్మ విజయభారతిని శాలువతో సత్కరించాము. గుంటూరు నుండి నన్ను పరామర్శించడానికి ఇంత దూరం గుర్తుపెట్టుకుని వచ్చారా… అని ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఆమె ఇంకా ప్రేమతో నన్ను దగ్గరకు తీసుకుని అనేక ఉద్యమ విషయాలను చాలా సేపు మాట్లాడారు. ట్రస్టు ప్రచురణలను అమ్మ మాకు బహూకరించారు. అనంతరం ఆమె ఆత్మీయ ఆతిథ్యం అందించారు. చివరిగా అమ్మకి నమస్కరించి బయలుదేరుతుంటే అమ్మ ప్రేమగా ఆలింగనం చేసుకుని మాకు వీడ్కోలు పలికారు. అదే మాకు అమ్మతో చివరి వీడ్కోలు అవుతుందని ఊహించలేకపోయాను.
అమ్మ విజయభారతితో నాకు మరొక జ్ఞాపకం ఉంది. అదేమంటే 2008 సంవత్సరం నవంబర్ 25న హైదరాబాద్‌లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ దళిత్ ఉమెన్ తరపున మహిళలపై అన్ని రకాల హింసకు వ్యతిరేక నిరసన దినం రోజున ముఖ్యవక్తగా అమ్మను పిలుచుకుని గౌరవించుకున్నాము. ఈ సమావేశంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మేరుగ నాగార్జున గారు, ప్రముఖ కళాకారిణి చంద్రశ్రీ, ప్రముఖ రచయిత్రులు జూపాక సుభద్ర, జాజుల గౌరి, జి. విజయలక్ష్మి, అనిశెట్టి రజిత తదితరులు పాల్గొన్నారు. అలాగే 2000లో హైదరాబాద్ సెయింట్ ఆన్స్ బిల్డింగ్‌లో జరిగిన ఒక భారీ మహిళా సదస్సులో అమ్మ డా॥ విజయభారతిగారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో అమ్మ చేసిన ప్రసంగం నా ఉద్యమ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. అమ్మ ఈ సభలో మాట్లాడుతూ` ‘‘ఉన్నత విద్యావంతులైన ఉద్యమనేతలు కూడా తమ జీవిత భాగస్వామితో రాజకీయాలు చర్చించడానికి ఇష్టపడడం లేదు కానీ తన సహచర పురుష మిత్రులతో మాట్లాడుతుంటారు. ఇది వినడానికి సాధారణమైన ప్రకటనగానే వున్నా, నాయకుల్లో ఉన్న పురుషాధిక్య భావజాలాన్ని గూర్చి అద్భుతంగా వివరిస్తూ… మాతృసామ్య భావజాల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ అమూల్యమైన ఉద్యమ సందేశాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆ మాటలు నన్నెప్పుడూ నీడలా వెంటాడుతూ నా కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి.
అమ్మ విజయభారతితో 3దశాబ్దాల నా పరిచయంలో ఆమె నాకు క్రాంతిజ్యోతి మాత సావిత్రి బాయిలానే కనిపించారు. చదువు జ్ఞానానికి మూలం, జ్ఞానం విముక్తికి మార్గం అన్న సావిత్రిబాయి పూలే మాటలకు నిలువెత్తు జ్ఞానాక్షర రూపం అమ్మ డా॥ విజయభారతి.
1985 తరువాత తెలుగునేలపై ఒక ఉత్తుంగ తరంగంలా దళిత ఉద్యమం వచ్చింది. ఈ ప్రవాహ వేగంలో ఒక విడదీయరాని భాగంగా దళిత మహిళల సమస్యలను, వారి అస్థిత్వాన్ని, వారి చైతన్యాన్ని చరిత్రలో ఆమె శక్తిమేర నమోదు చేసిన మహాతల్లి. భవిష్యత్‌లో దళిత మహిళా లోకానికి, మొత్తం మహిళా జాతికి ఆమె రచనలు ఒక వేగుచుక్కలా నిలుస్తాయి. నేటి సమాజానికి ‘‘ఆధునిక సావిత్రి బాయి పూలే’’ డా॥ విజయభారతి అమ్మకి నా అక్షరాశృ నివాళి.