ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్‌ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్‌ కాత్యాయనీ విద్మహే

విజయభారతిగారి ఎనభై మూడేళ్ళ జీవయాత్ర 2024సెప్టెంబర్‌ 28న ముగిసింది. ఆమె ప్రసిద్ధకవి, నాటక రచయిత బోయి భీమన్న గారి కూతురు కావచ్చు. మరొక ప్రసిద్ధకవి, పౌర` దళిత హక్కుల నేత, ప్రజాస్వామిక ఉద్యమాలకు వెన్నుదన్ను అయిన బొజ్జా తారకంగారి భార్య కావచ్చు.

అంతకన్నా సాహిత్య విమర్శ రంగంలో తనదైన ప్రత్యేక పాదముద్ర వదిలి వెళ్లిన వ్యక్తిత్వం ఆమెది. ఆ అడుగుజాడల తత్వాన్ని గురించి మాట్లాడుకొనటమే మనం ఇప్పుడు ఆమెకు ఇయ్యగలిగిన నివాళి.
విజయభారతిగారు నాకు 1980ల నుండి తెలుసు. అప్పుడు ఆమె తెలుగు అకాడెమీలో రీసెర్చ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. సాహిత్య పరిశోధక విద్యార్థిగా ఆ సంస్థ ప్రచురించే తెలుగు అనే పరిశోధనా పత్రికలో ప్రచురణకు వ్యాసాలు ఇయ్యటానికో, మరెందుకో అకాడెమీకి వెళ్ళినప్పుడు బోయి విజయభారతి గారిని కలిసి పరిచయం చేసుకొన్నాను. కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్‌ Ê సైన్స్‌ కళాశాలలో నా సహోద్యోగి, స్నేహితురాలు వి.శోభ ద్వారా అప్పటికే ఆమె గురించి విని ఉన్నాను. విజయభారతిగారు నిజామాబాద్‌ఉమెన్స్‌ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న కాలంలో శోభ కూడా అక్కడ అధ్యాపకురాలు. అలా విజయభారతిగారి గురించి విన్నాను. చూసాను. విజయభారతి అనగానే నాకు ముందు గుర్తువచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం నుండి ప్రాచీన సాహిత్యాన్ని సామాజిక సాంస్కృతిక కోణం నుండి విశ్లేషిస్తూ వచ్చిన ఎమ్మె విద్యార్థుల వ్యాసాల సంకలనం. ‘‘మన చరిత్ర- సంస్కృతి’’ ఆ పుస్తకం పేరు. ఖండవల్లి లక్ష్మీ రంజనంగారి ఆలోచనా సంకల్పాలతో బిరుదురాజు రామరాజుగారు సంపాదకులుగా ఆ పుస్తకం వచ్చింది. అందులో విజయభారతి గారి వ్యాసం ఉంది. ఆ ప్రభావంతోనో ఏమో ఆమె పిహెచ్‌డికి ‘‘దక్షిణ దేశీయాంధ్ర వాజ్మయం- సాంఘిక జీవనం’’ అనే అంశాన్ని ఎంచుకొని లక్ష్మీ రంజనం గారి పర్యవేక్షణలో పని చేసి 1969లో పిహెచ్‌డి పట్టా పొందారు. ఆ రకంగా సాహిత్యాన్ని సామాజిక చరిత్ర నిర్మాణానికి ప్రధానవనరుగా చేసుకొని ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసిన సురవరం ప్రతాపరెడ్డి మార్గం ఆ తరువాత విజయభారతి జీవితకాలపు సాహిత్య కృషిలో దళిత శ్రామిక అణచబడ్డ మహిళా వర్గాల చరిత్రగా సూక్ష్మస్థాయి చూపుతో పదునెక్కింది.
1985 కారంచేడు, 1990 చుండూరు ఘటనల పరిణామం దళితుల ఆత్మగౌరవ పోరాటంగా ఉధృతమయ్యే కొద్దీ సృజన సాహిత్యానికి, సాహిత్య విమర్శకు కూడా అంబేడ్కర్‌ ఆలోచనా విధానం ప్రాతిపదికగా బలపడుతూ వచ్చింది. అయితే అంతకంటే చాలా ముందే విజయభారతి అంబేడ్కర్‌ జీవితాచరణాల తత్వాన్ని తెలుగు వాళ్లకు పరిచయం చేసే పుస్తకం రాసి ప్రచురించటం గమనార్హం. 1990 నాటికి స్త్రీవాద ప్రభావంతో స్త్రీల జీవితాన్ని నియంత్రించే భావజాల సంస్కృతికి ప్రచార మాధ్య మంగా ఉన్న ప్రాచీన సాహిత్య అధ్యయనం ప్రారంభించి పితృస్వామ్య మాయను అర్ధం చేసుకొంటున్న నేను అదే సమయంలో విజయభారతిగారు హేతుదృష్టితో దళిత కోణం నుండి కులవ్యవస్థ మాయను విప్పిచెప్పటానికి పురాణేతిహాసాలను విమర్శకు పెడుతున్న తీరు చూసి భిన్న దృక్పథాల నుండి సాహిత్య అధ్యయనం ఎంత వెలుగుని ఇస్తుంది కదా అని ఆశ్చర్యపోయాను. ఆ రకంగా దళిత కోణం నుండి సాహిత్య అధ్యయనానికి, అంబేడ్కర్‌ను చదవటానికి నాకు తొలి ప్రేరణ ఆమే అయ్యారు.
అయితే విజయభారతి గారిని సీరియస్‌గా చదవటం అయినా, ఆమెతో ప్రత్యక్ష సంభాషణ అయినా 2010 నుండే అని చెప్పాలి. ‘తెలుగు సాహిత్య విమర్శ- స్త్రీల కృషి’ అనే అంశం మీద నా పర్యవేక్షణలో పరిశోధన చేసిన కందాళ శోభతో కలిసి విజయభారతిగారి సాహిత్య విమర్శ రచనలను అవ్యవధానంగా ఒకేసారి ఒక పద్ధతిలో చదవటం, చర్చించటం మంచి అనుభవం. మరువలేని జ్ఞాపకం. సాహిత్య విమర్శ రంగంలో స్త్రీల గురించి తెలిసిందే తక్కువ అంటే దళిత స్త్రీల కృషి గురించి ఏమి తెలిసినా అది అబ్బురమే. తాడి నాగమ్మ సాహిత్య విమర్శ వ్యాసాలు, ఆ తరువాత విజయభారతిగారి సాహిత్య విమర్శ రచనలు చదివి శోభ, నేనూ ఆ అబ్బురాన్నే పంచుకున్నాం. ఆ క్రమంలోనే 2012లో తాను ఆ ఇద్దరి సాహిత్య విమర్శ రీతులను పరిచయం చేస్తూ వ్యాసాలు ప్రచురించింది. తన సాహిత్య విమర్శ గురించిన వ్యాసం భూమికలో చూసి విజయభారతిగారు ఎంత సంతోషపడ్డారో..! శోభకు, నాకూ కూడా ఫోన్‌ చేసి మాట్లాడారు. 2024లో అకాల మరణంతో శోభ కూడా ఇప్పుడు జ్ఞాపకమే కావటం మరొక గుండె బరువు సంగతి.
జ్ఞానాన్ని, అధికారాన్ని నిర్దిష్ట వర్గాల సొత్తుగా చేసి, సమాజంలోని మరికొన్ని వర్గాల బౌద్ధిక భౌతిక అణచివేతకు దోహదం చేస్తూ పురాణేతిహాసాలు చేసిన సాంస్కృతిక భావజాల ప్రచారంలోని అసలు వాస్తవాన్ని మాయపొరలు విప్పి నిరూపించటం విజయభారతి ప్రాచీన సాహిత్య అధ్యయన విశ్లేషణల లక్ష్యం. కులం, జెండర్‌ రెండూ ఆమెను ఆలోచింపచేసిన, ఆందోళన పెట్టిన సమస్యలు. పురాణాలను, భారత రామాయణాలను ఆమె అందుకే చదివింది, వ్యాఖ్యానించింది పురాణాల మీద ఆమె పరిశోధనలు అయిదు సంపుటాలుగా వచ్చాయి. కులం-జెండర్‌ అనే రెండు అంశాలను ప్రధానంగా చేసి మహాభారతంపై ‘‘నరమేధాలూ- నియోగాలూ’’ అనే పుస్తకం రాసింది.
దశావతారాల కథనాలను, షట్చక్రవర్తుల చరిత్రలను విశ్లేషించటంలో, వ్యాఖ్యానించటంలో వర్ణధర్మ స్థిరీకరణకు జరిగిన ప్రయత్న క్రమాన్ని గ్రాఫ్‌ గీసి చూపించారామె. అందులో భాగంగా శూద్రులతో పాటు స్త్రీలు కూడా అణచివేతకు గురైనవాళ్లు అన్న అవగాహన కనబరిచారు. శాంత చిత్తులైన మునుల యజ్ఞయాగాదులకు విఘ్నకారులుగా చూపించి రాక్షస సంహారానికి రాజులను ప్రేరేపించిన చరిత్ర భారత, రామాయణాలలో కనబడుతుందని, ఇవి జాతిహనన చర్యలేనని నిర్ద్వంద్వంగా పేర్కొన్నారామె. అవి వర్తమానమై కొనసాగుతున్న దృశ్యం గురించి ఎరుక, హెచ్చరిక కలిగించటం ఆమె రచనల ప్రత్యేకత.
‘‘పురాణకథల ప్రపంచం ఏ సమాజం కోసం ఏర్పడిరదో ఏ వర్గాలను అణచిపెట్టటానికి ఉద్దేశించబడిరదో స్పష్టంగా తెలుసుకో గలిగినప్పుడు వర్తమాన నియంతృత్వాన్ని ఎదుర్కో గలుగుతాం’’ (నరమేధాలూ` నియోగాలూ, మహాభారతం, పరిశీలన, 2019, ముందుమాట) అని ఆమె చెప్పిన మాటలలో గతకాలపు సాహిత్య అధ్యయనం, సమకాలీన సామాజిక సందర్భం నుండి అనివార్యంగా చేయవలసినదన్న సూచన, గతాన్ని గతితార్కికంగా పరిశీలించటంవల్ల పొందిన అవగాహన ఆచరణగా రూపాంతరం చెందాలన్న ఆకాంక్ష ఉన్నాయి. ‘వ్యవస్థను కాపాడిన రాముడు’ వంటి రచనలలో అది కనబడుతుంది. ప్రాచీన సాహిత్యం ముఖ్యంగా పురాణేతిహాసాలు సామాజిక సంఘర్షణలను ఆధిపత్య అణచివేత చరిత్రలను అర్ధం చేసుకొనటానికి పనికివచ్చే ‘తరగని గని’ అంటారామె. ‘‘శూద్రులు, గిరిజనులు, స్త్రీలు ఉన్నత స్థానాలకు రావటాన్ని నిరోధించేందుకు ఏర్పరచిన అవతారం శ్రీరామావతారం’’ అని విజయభారతి చెప్పిన వాక్యం ప్రాతిపదికగా రాముడి గురించిన ఆమె విశ్లేషణలన్నీ ఒక దగ్గరకు తెచ్చి అధ్యయనం చేయటం ఇప్పటి అవసరం.
ఈ విధమైన అధ్యయనానికి పద్ధతిని విజయభారతి ప్రధానంగా అంబేడ్కర్‌ నుండి అందిపుచ్చుకున్నారని పిస్తుంది. వర్ణవ్యవస్థ పుట్టు పూర్వోత్తరాల, స్వరూప స్వభావాల విచారణకైనా, స్త్రీల స్థితిగతుల నిరూపణకైనా అంబేడ్కర్‌ వేదాలు, మనుస్మృతితో పాటు ప్రాచీన పురాణేతిహాసాలను విస్తృతంగా ఉపయోగించుకున్నాడు. అంబేడ్కర్‌ గురించి చిన్నప్పటి నుండి వింటూ, చదువుతూ అంబేడ్కర్‌ జీవితాన్ని ఒక స్వతంత్ర రచన వలె, -ముందుమాట రాసిన నార్ల అన్నట్లు- నవల వలె రాసిన ఒక సుదీర్ఘ అనుభవం. ఈ రకమైన అధ్యయన పద్ధతిని రూపొందించుకొనటంలో చోదక శక్తి అయివుంటుంది. ఆ క్రమంలోనే అంబేడ్కర్‌ ఆమెకు నిరంతర చింతన అయినాడు. అంబేడ్కర్‌ సంపుటాల తెలుగు అనువాదాలకు కొన్నిటికి సంపాదకత్వం వహించటం, బొజ్జా తారకంతో కలిసి రాముని కృష్ణుడి రహస్యాలు వంటి అంబేడ్కర్‌ రచనలను అనువాదం చేయటం, మహిళల హక్కుల గురించిన అంబేడ్కర్‌ దృక్పథాన్ని అనుశీలించటం చేస్తూ వచ్చారు.
విజయభారతి ఎంతటి అధ్యయనశీలో అంతటి స్నేహశీలి కూడా. ప్రజాస్వామిక చైతన్యంతో పనిచేసే మనుషుల పట్ల, సంస్థల పట్ల యెనలేని ప్రేమ. తమలపాకు లాంటి పలుచని మనిషి. ప్రసన్న వదనం. మాట మృదువైనా అభిప్రాయాలు దృఢమైనవి. 2017లో అనుకుంటా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆంధ్ర, తెలంగాణ శాఖలు రెండూ కలిసి హైద్రాబాదులో మహిళా రచయితలు, వివిధ ప్రజాఉద్యమాల యాక్టివిస్టుల అనుభవాల నుండి స్త్రీల సాహిత్యంపై ఒక చర్చా సదస్సు నిర్వహించినప్పుడు బోయి విజయభారతిగారు ఆ సదస్సుకు వచ్చి పాల్గొని పంచిన స్నేహం మమ్మల్ని ఆవరించుకొనే ఉంది. 2019లో పుట్ల హేమలత మరణించినప్పుడు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక హైదరాబాద్‌లో సంస్మరణ సభ పెట్టినప్పుడు పేపరు ప్రకటన చూసి సభకు వచ్చి మాకు ఓదార్పునియ్యటం ఎప్పుడూ మరువలేం. ప్రరవే స్త్రీవాదం మీద పెట్టిన అంతర్జాల ప్రసంగాలను ఆమె ఎంతో అభిమానించారు. అది మాకు కొండంత బలాన్ని ఇచ్చింది. అంబేడ్కర్‌ ఆలోచనలపై ఇలాగే అంతర్జాల ప్రసంగాలను ఏర్పాటు చెయ్యాలన్న ప్రయత్నం ఒక కొలిక్కివస్తున్న సమయంలో ప్రారంభ సమావేశంలో ఉండవలసిన విజయభారతిగారు లేకుండా పోవటం పెద్దలోటు.
2017లో నంబూరి పరిపూర్ణ గారి స్వీయచరిత్ర ‘వెలుగుదారులలో’ వచ్చింది. దాని మీద ఆంధ్రజ్యోతిలో వచ్చిన నా వ్యాసం చూసి విజయభారతిగారు ఫోన్‌ చేసి మాట్లాడటం కూడా నాకొక మంచి జ్ఞాపకం. నంబూరి పరిపూర్ణ తన స్నేహితురాలని, ఆమె స్వీయచరిత్ర గొప్ప రచన అని, దానిని పరిచయం చేసినందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పిన మాటలు చెవిలో ధ్వనిస్తూనే ఉన్నాయి.
విజయభారతిగారితో వేదిక పంచుకొన్న సందర్భాలు కొన్నే అయినా అవి నాకు ఆమెపై గౌరవాన్ని పెంచుతూ వచ్చాయి. ఇటీవల విరసం ప్రచురించిన వియ్యుక్క కథల సంపుటి పరిచయసభలో ఆవిష్కర్తగా ఆమె చేసిన ప్రసంగం కలిగించిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. పేరు నుండి వస్తువు, వ్యక్తీకరణ వరకూ అన్నీ నూతనంగా ఉన్న వియ్యుక్క కథల సంపుటాలు అభూత కల్పనలనుండి సాహిత్యాన్ని వాస్తవిక భూమికపై నిలబెడుతున్నాయని, చైతన్యం ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అని, మార్పు మహిళలవల్లనే సాధ్యం అని ఈ అజ్ఞాత రచయిత్రులు నిరూపిస్తున్నారని ఆమె నొక్కి చెప్పారు. మనుషులు ఒకరినొకరు పట్టించుకొనటం, కలవటం, సాహిత్య సామాజిక చర్చలలో పాల్గొనటం, పదిమందితో అభిప్రాయాలు పంచుకొనటం జీవించి ఉన్నామనటానికి గుర్తు అన్నారామె. ఈ సభకు తనను ఆహ్వానించినందుకు సంతోషపడుతూ, బ్రతికినంతకాలం జీవించి ఉండటం అంటే అదే అన్నారు. చలనం, ఛైతన్యం విజయభారతిగారి ఆదర్శం. దానిని మనదిగా చేసుకోనటమే ఆమెకు మనం ఇవ్వగల నిజమైన నివాళి.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.