తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి

చాలా సంవత్సరాల క్రితం ఓ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఒక మీటింగులో మొదటిసారి విజయభారతి గారిని కలిసాను. ఆ మీటింగ్‌ ఏంటో ఇప్పుడు నాకు గుర్తులేదు. అంతకు ముందు ఎన్నో మీటింగుల్లో తనని కలిసాను కానీ ఎక్కువగా మాట్లాడిరది లేదు. ఆ రోజు ఆ మీటింగ్‌కి విజయభారతి గారు ఒక్కరే వచ్చారు.

మీటింగ్‌ అయ్యాకా నన్ను మా ఇంటి దగ్గర దింపుతారా అని అడిగారు. తప్పకుండా దింపుతానని చెప్పాను. మీటింగ్‌ అయిపోయిన తర్వాత అశోక్‌ నగర్‌ లో వుండే వారింటికి తీసుకెళ్తూ దారిలో బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాం. మీరు చాలా బాగా డ్రైవ్‌ చేస్తున్నారు. ఆడవాళ్ళందరికీ సొంత వాహనం ఉండాలి. ఎవరి మీదా ఆధారపడకూడదు అన్నారు నవ్వుతూ! ఆ రోజు నాతో దేవి కూడా ఉంది. ఆ రోజు తన పుస్తకాల గురించి చాలా విషయాలు మాట్లాడారు. మళ్ళీ ఒకసారి వస్తామని, రికార్డ్‌ చేస్తామని చెప్పి తనని ఇంట్లో దింపేసి వచ్చేసాం.
ఆ తర్వాత నేనొక్కదాన్నే ఒకసారి వెళ్ళాను. ఆ రోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ఏమీ గుర్తు రావటం లేదు. కొన్ని రోజుల తర్వాత అశోక్‌నగర్‌ నుంచి కుందన్‌ బాగ్‌ వెళ్లిపోయారని, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారని తెలిసింది. చాలాసార్లు వెళ్లాలని అనుకునేదాన్ని. కానీ ఆయన ఐఏఎస్‌ ఆఫీసర్‌ కాబట్టి చాలా సెక్యూరిటీ ఉంటుందని, ఇంట్లోకి వెళ్లడం చాలా కష్టమని ఎవరో చెప్పారు. ఆ తర్వాత విజయభారతిగారు చాలాసార్లు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. ఎన్నో పనులు చేయాల్సి ఉందని అంటూ బాగ్‌లింగంపల్లిలో వున్న ఒక ఫ్లాట్‌ గురించి చెప్పారు. అక్కడ తారకంగారి పుస్తకాలు, తన పుస్తకాలు చాలా ఉన్నాయని, ఒకసారి వాటిని సర్దిస్తే బాగుంటుంది, మీరు ఆ పని ఎవరితోనైనా చేయించగలరా అని అడిగారు. పుస్తకాలు చిందరవందరగా పడి ఉంటాయి, చెదలు పట్టేసాయేమోనని భయంగా ఉంది అన్నారు. ఎంతో మొహమాటంగా చాలా ఇబ్బందిపడుతూ అడిగారు. అయ్యో బాగ్‌లింగంపల్లి అంటున్నారు కదా తప్పక వెళ్ళి చూస్తాను, అడ్రెస్‌ చెప్పండి అంటే చెప్పారు. భూమిక ఆఫీస్‌కి పక్కనే ఉంది ఆ అపార్ట్మెంట్‌. డ్రైవర్ని పంపించి చూసి రమ్మని చెప్పాను. ఆ ఇంట్లో ఎవరో అద్దెకు ఉంటున్నారని, చాలా పుస్తకాలు ఉన్నాయని వచ్చి చెప్పాడు. ఆ విషయం విజయభారతి గారికి ఫోన్‌ చేసి చెప్పాను.
ఒకరోజు ఫోన్‌ చేసి అద్దెకున్న వాళ్ళు ఖాళీ చేస్తామంటున్నారు, ఫ్లాట్‌ని ఎవరితోనైనా శుభ్రం చేయించగలరా అని అడిగారు. ‘తనకు ఆ ఇంటికొచ్చి ఉండాలని చాలా కోరికగా ఉందని, ఆ పుస్తకాలను జాగ్రత్తగా చూసుకుంటూ, తారకం గారి పుస్తకాలు పబ్లిష్‌ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయని ఆ పని కూడా చూసుకోవాలని అనుకుంటున్నాను, నేను వచ్చేస్తే ఎట్లా ఉంటుంది. ఛాయాదేవిగారిని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టు నన్ను చూసుకుంటారా, అని అడిగితే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఈ విషయం గురించే రెండు రోజులకొకసారి ఫోన్‌ చేసేవారు. ఒకసారి గీతా రామస్వామి కూడా ఫోన్‌ చేసి ‘విజయభారతి గారు తన అపార్ట్మెంట్‌కి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. ఏం చేద్దాం, ఏమన్నా హెల్ప్‌ చేయగలమా’ అని అడిగారు. ‘అవును గీతా నాకూ రోజూ ఆ విషయం గురించే ఫోన్‌ చేస్తున్నారు. ఎవరినైనా ఒక ఫ్యామిలీని ఆవిడకు సహాయంగా పెట్టొచ్చు కానీ ఆవిడ ఒక్కరూ ఉండగలరా. కళ్ల ఇబ్బంది ఉంది. సరిగా వినబడడం లేదని చెబుతున్నారు. ఒకసారి నేను కుందన్‌బాగ్‌ వెళ్లి తనతో మాట్లాడతాను’ అని గీతకి చెప్పాను.
అంతకుముందు ఒకరోజు అడిగారు తను భూమికలో రాసిన వ్యాసాలతో పాటు ఇంకా చాలా మిగిలి ఉన్న వాటన్నింటిని కలిపి ఒక పుస్తకంగా వేయాలనుకుంటున్నానని, ఆ పుస్తకం తప్పకుండా రావాలని, చాలా మంచి వ్యాసాలు దాంట్లో ఉన్నాయని చెప్పారు. నాకు తెలిసిన తోటమాలి కుందన్‌బాగ్‌ క్వార్టర్లలో పని చేస్తున్నాడని చెప్పి, అతన్ని పంపిస్తాను, ఆ వ్యాసాలన్ని ఇవ్వండి అన్నాను. అప్పటి నుండి ఆ మాలి అర్జున్‌ మాకు పోస్ట్‌మేన్‌ అయ్యాడు. విజయభారతి గారు తన వ్యాసాలు సెక్యూరిటీలో ఇచ్చేవారు. అర్జున్‌ వాటిని తెచ్చి నాకిచ్చేవాడు. వాటిని డిటిపి చేయించేదాన్ని. మొత్తం వ్యాసాలన్ని డిటిపీ అయ్యాకా స్పిరల్‌ బైండిరగ్‌ చేయించి వాటిని తీసుకుని కుందన్‌బాగ్‌ వెళ్ళాను. ఆవిడ వద్దులెండి అర్జున్‌ కిచ్చి పంపించండి అన్నా కూడా వినకుండా వెళ్ళాను. డిటిపి చేయించిన కాపీ తీసుకుని వారి ఇంటికి దగ్గరకు వెళ్లి విజయభారతి గారికి ఫోన్‌ చేశాను. ‘నేను వచ్చాను బుక్‌ తీసుకుని, ఒకసారి మీరు ఆ బుక్‌ చూసి ఫైనల్‌ చేస్తే ప్రింటింగ్‌కి ఇద్దాము’ అని చెప్పాను. ‘అయ్యో మీరు వచ్చారా, బయట నిలబడి ఉన్నారా’ అని ఆవిడ వెనకవైపు ఉండే తన రూము నుంచి కర్ర పట్టుకుని నడుచుకుంటూ గేటు వైపు వచ్చారు. తనతో పాటు లోపలికి తీసుకెళ్లారు.
ఆరోజు చాలా విషయాలు మాట్లాడారు. తారకంగారి గురించి, బోయి భీమన్నగారి గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు. ‘‘మా అమ్మ బోయి నాగరత్నమ్మ’’ పుస్తకం గురించి చెబుతూ ‘ఆ పుస్తకం రాసినందుకు చాలామందికి కోపమొచ్చింది, మీరు చదివారా’ అని అడిగారు. ఆ తర్వాత తెలుగు అకాడమీలో తన అనుభవాలు, తాను ఎదుర్కొన్న వివక్ష గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ‘‘దక్షిణాంద్ర వాగ్మయము సంఘ జీవితం’’అనే పేరుతో తాను చేసిన పరిశోధన గురించి చెబుతూ తన పిహెచ్‌డి పుస్తకాన్ని వెతికి తీస్కొచ్చి చూపించారు. నేను ఆ పుస్తకాన్ని ఫోటో తీసుకున్నాను. తెలుగు అకాడమీలో ఎదుర్కొన్న అనేక సవాళ్ల గురించి, కులపరమైన వివక్ష గురించి తన అనుభవాలను చెప్పారు. చాలాసేపు తనతో గడిపి కొన్ని ఫోటోలు తీసుకుని నేను వెనక్కి వచ్చేసాను.
ఆ తర్వాత నేను డిటిపి చేయించి ఇచ్చిన పేపర్లన్నింటినీ చూసి ఇది ప్రింట్‌ చేసేద్దామండి అని అన్నారు ఫోన్‌లో. అనుపమ రమణమూర్తి గారు వేస్తామన్నారు, మీరు ఆయనకు పంపించండి అన్నారు. రమణమూర్తి గారితో మాట్లాడి ఆయనకి డిటిపి చేయించిన కాపీ పంపించాను. ఆ తర్వాత ఫోన్‌ చేసి తాను రాసిన ముందుమాటను అది కూడా పంపించండి రమణమూర్తి గారికి అన్నారు. ఆ పుస్తకానికి ఏం పేరు పెడితే బాగుంటుంది అని అడిగారు. మీరు మీ ఆర్టికల్‌లో ఉన్న ఒక టైటిల్‌ చాలా బాగుంది ‘‘ఈ దేశం స్త్రీలకు గుప్పెడు బూడిదనే మిగిల్చిందా’’ అనే వ్యాసం చాలా అద్భుతంగా ఉంది. దానినే పుస్తకానికి టైటిల్‌గా పెడదామండి అంటే చాలా బాగుందండి. చాలా మంచిగా ఉంది. ఇదే పెడదామండి అన్నారు. అలా ఆ పుస్తకం ప్రింట్‌ అయ్యింది.
ఒకరోజు ఉదయమే ఫోన్‌ చేశారు. తారకంగారి పుస్తకం ఆవిష్కరణ చేస్తున్నాము. జ్ఞానేశ్వర్‌ ఆ పని చూసుకుంటున్నారు. అదే రోజు నా పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాలి అన్నప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను. అయ్యో వద్దులెండి అంటే ఆ పుస్తకం రావడం వెనక మీరు చేసిన కృషి ఉంది, తప్పకుండా మీరే ఆవిష్కరించాలి అని అన్నారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లో పుస్తకాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు దక్కింది. నా కాలికి దెబ్బ తగిలి నేను వెళ్లలేని పరిస్థితిలో ఉన్నా గానీ విజయభారతిగారి కోసం ఆవిడ బాధపడతారని వెళ్లాను. ఆ రోజు ఆవిడ చాలా బాగా మాట్లాడారు. ఆ రోజు అనుకోలేదు విజయభారతి గారిని చూడడం అదే ఆఖరి సారి అవుతుందని. మళ్లీ కుందన్‌బాగ్‌ వెళ్లి ఆమెను కలుద్దామని చాలా అనుకున్నాను కానీ తను వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చారని తెలిసింది. తర్వాత ఆరోగ్యం బాగాలేదని, హాస్పిటల్లో అడ్మిట్‌ అయ్యారని ఒక్కరోజు తేడాలో చనిపోయారని తెలిస్తే చాలా బాధనిపించింది.
ఒక్కసారి బాగ్‌లింగంపల్లి వచ్చి తన పుస్తకాలను, తారకంగారి పుస్తకాలను చూసుకోవాలని వాటిని జాగ్రత్త చేయాలని ఆవిడకు చాలా కోరికగా ఉండేది. ఆ పుస్తకాలన్నీ చెదలు పట్టిపోతాయేమో, ఏమైపోతాయో అని చాలా దిగులు పడుతూ ఉండేవారు. చాలాసార్లు మేము ఆ ఇంటికి వెళ్లి ఖాళీ చేయమని అడిగినప్పుడల్లా అద్దెకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా వాయిదాలు వేస్తూ వచ్చారు. బహుశా వాళ్లు ఖాళీ చేసి ఉంటే విజయభారతి గారు ఒకసారి అయినా ఆ ఇంటికి వచ్చి చూసేవారేమో! ఆ పుస్తకాల్ని చూడాలని చాలా తపన పడటం వల్ల నాకు అనిపించేది ఒకసారి తీసుకొచ్చి చూపించాలి అని. కానీ ఇవన్నీ అనుకునే లోపే ఆవిడ మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
తెలుగు సాహిత్యంలో ఆవిడ చేసిన కృషి చిరస్థాయిగా నిలిపోతుంది. ఆవిడ అనువదించిన మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే జీవిత చరిత్ర, బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, నరమేధాలూ- నియోగాలూ, మహాభారతం పరిశీలన లాంటి పుస్తకాలు, ఆవిడ రాసిన ఎన్నో పరిశీలనా వ్యాసాలు తెలుగు సాహిత్యంలో గొప్ప స్థానాన్ని సంపాదించాయి. మహిళల హక్కులు, అంబేడ్కర్‌ దృక్పథం ఆవిడ రచనల్లో తలమానికం లాంటిది. భూమికలో ఎన్నో వ్యాసాలను రాసారు.
తెలుగు సాహిత్యంలో ఆవిడ కృషి అనన్య సామాన్యం. తను రాసిన పుస్తకాలు అంబేడ్కర్‌ జీవిత చరిత్ర గాని, అనువదించిన పూలే జీవిత చరిత్ర గాని తప్పనిసరిగా అందరూ చదవాల్సిన పుస్తకాలు. అలానే పురాణాల లోతుల్లోకి వెళ్లి లోపలి కథలను బయటకు తీసి విశ్లేషించిన పద్ధతి చాలా అద్భుతం. తన తల్లి గురించి రాసిన పుస్తకం ‘‘మా అమ్మ బోయి నాగరత్నం’’ చాలా సంవత్సరాల క్రితం చదివాను. విజయభారతి గారు అపురూపమైన వ్యక్తిత్వంతో, అద్భుతమైన వ్యక్తీకరణతో తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసి విమర్శనాత్మకమైనటువంటి గ్రంథాలను రాసి తన పేరు చిరస్మరణీయం చేసుకున్న మేధావి. వారికి నివాళి.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.