విజయభారతి గారు దాదాపు 70వ దశాబ్దం చివరినుంచి నాకు తెలిసిన వ్యక్తి. కానీ ఆమెతో అంత సన్నిహితమైన పరిచయం ఆ రోజుల్లో ఉండేదికాదు. 1975-76 సంవత్సరాలలో నేను సంవత్సరానికి రెండు మూడు సార్లు నిజామాబాద్‌కు ప్రయాణం చేసేదాన్ని. ఆ సందర్భంలో తారకంగారి తోటి పరిచయం ఏర్పడిరది. ఆ రోజుల్లో తారకంగారు నిజామాబాద్‌లో అడ్వకేట్‌గా పనిచేసేవారు.
అంబేద్కర్ యువజన సంఘం, రైతుకూలీ సంఘాలతో కూడా సన్నిహితంగా పని చేసేవారు. ఆయన ఇంట్లో విజయభారతి గారు మొదటిసారి నాకు పరిచయం అయింది. ఆమె అక్కడ మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా తర్వాత కాలేజ్ వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు.
80ల తర్వాత హైదరాబాదులో సమావేశాలలో, సభలలో ఎక్కువ తారకంగారి తోటి కలిసే అవకాశం ఏర్పడిరది. ఇంటిని నిర్వహించుకోవడం పిల్లల్ని చూసుకోవడం, ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా పౌరహక్కుల ఉద్యమంలో రాజకీయ ఉద్యమాలలో చురుగ్గా పనిచేసే తారకంగారికి అండగా ఉంటూ బహుశా ఆమె బయటికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండేవి కావు అనుకుంటాను. స్త్రీశక్తి ఉద్యమ సందర్భంగా, తర్వాత అన్వేషిని ప్రారంభించినప్పుడు కూడా పరిశోధనల కోసం తెలుగు అకాడమీకి తరచూ వెళ్తుండేదాన్ని. విజయభారతి గారు మొదట రీసెర్చ్ ఆఫీసర్‌గా తర్వాత అకాడమీ డైరెక్టర్‌గా పనిచేసిన సందర్భంగా ఆమెను కలవడం, తెలుగు సాహిత్యం గురించి, స్త్రీల రచనల గురించి కొంతవరకు మాట్లాడే అవకాశం నాకు కలిగింది. అప్పుడే అర్థమైంది ఆమె చాలా అంశాల మీద పరిశోధనలు చేయటం, ముఖ్యంగా పురాణాల మీద కొత్త దృష్టి కోణంతో పుస్తకాలు రాయటం చాలా చేశారు కానీ ఆమె పేరు అంతగా బయటకి రాలేదు. బహుశా ఆమె చాలా మితభాషిగా ఉండటం కారణం కావచ్చు. మృదువుగా మాట్లాడటం ఆమెలో ఉన్న పత్య్రేకత. ఎప్పుడూ చిరునవ్వుతో గంభీరంగా హుందాగా కనిపించేది. ఆమె ఆవేశంగా మాట్లాడటం నేనెన్నడూ చూడలేదు. 90ల తర్వాత, దళిత ఉద్యమాలు ఊపందుకున్న సందర్భంలో, విజయభారతి గారిని సన్నిహితంగా కలిసే అవకాశం లభించింది. గోగు శ్యామల అన్వేషి లో నల్లపొద్దు పుస్తకం మీద పని చేస్తున్న కాలంలో రిసర్చ్ కమిటీ సమావేశాలకి ఆమె తప్పనిసరిగా హాజరయ్యేవారు. అన్వేషి కార్యక్రమాల సందర్భంగా విజయభారతి గారు చాలాసార్లు అన్వేషిలోను బయట కూడా కలవడం జరిగేది. అబిడ్స్‌లోని గోల్డెన్ త్రెషోల్డ్‌లో ‘దారులేసిన అక్షరాలు’ పుస్తకం ఆవిష్కరించటానికి ఆవిడ ముఖ్య అతిథి గా రావటం మాకు ఎంతో విలువైన జ్ఞాపకం.
ఇంకా ఎన్నో సందర్భాలలో విజయభారతి గారు వక్తగా మాట కాదనకుండా వచ్చేవారు. నేను మా తల్లిదండ్రుల మీద ‘అంతం వరకు అనంతం’ పుస్తకాన్ని ప్రచురించిన తర్వాత విజయభారతి గారు నాకు ఫోన్ చేశారు. ‘‘మీరు మీ అమ్మా నాన్నల గురించి వారి చరిత్ర గురించి ఎంతోమందితో మాట్లాడి పుస్తకాన్ని తయారు చేయడం, ఆ పద్ధతి నాకు చాలా నచ్చింది. నేను ఎప్పటినుంచో మా అమ్మ గురించి రాయాలనే కోర్కె నాలోనే ఉండిపోయింది. ఇప్పుడు నేను కూడా అటువంటి పుస్తకం రాయవచ్చన్న నమ్మకాన్ని మీరు నాకు కలగజేశారు. దానికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను’’ అన్నారు. ఇంత మంచి మెప్పుదల ఆమె నుంచి నాకు లభించడం నిజంగా సంతోషకరం. తెలుగు సాహిత్య ప్రపంచంలో, దళిత, స్త్రీ ఉద్యమ ప్రపంచాలలో ఆమెలేని లోటు ఎప్పటికీ పూరించలేనిది.