ఆధునిక దృక్పథంతో పురాణాల విశ్లేషణకు ఆద్యుడు ఫూలే. బలి` వామన కథను తలకిందుల చేసి ఆధునిక కథనాన్ని ఆయన వినిపించారు. పురాణాలను పుక్కిటి పురాణాలని ఆయన కొట్టి పారేయలేదు. అవి గత కాలానికి చెందినవని పక్కన పెట్టేయలేదు. పురాణాల పట్ల విమర్శనాత్మక వైఖరి నుంచి తన సామాజిక దృక్పథాన్ని తీర్చిదిద్దుకున్నారు.
అక్కడి నుంచి వేల ఏళ్లుగా కొనసాగుతున్న భారత సామాజిక వ్యవస్థను వర్తమాన చారిత్రక సందర్భంలో నిలబడి పరిశీలించే పద్ధతిని తయారు చేసుకున్నారు. సమాజాన్ని విమర్శనాత్మకంగా చూడటానికి పురాణ కథనాలను కొత్తగా చూసే ఒరవడిని అందించారు. తద్వారా ఆయన సాహిత్య సాంస్కృతిక రంగాలను కొత్త భావజాల పునాదుల మీదికి తీసికెళ్లడానికి ప్రయత్నించారు.
అంబేడ్కర్ కార్యరంగం ఫూలే కంటే విస్తారమైనది. అయితే ఆయన కూడా పురాణ కథల మీద, రాముడు, కృష్ణుడు వంటి పాత్రల మీద, వేద వాగ్మయం మీద, బౌద్ధ` వైదిక సాహిత్య సంఘర్షణల మీద చాలా ప్రధానమైన కృషి చేశారు. ఆ రకంగా అంబేడ్కర్ ప్రగతిశీల సాహిత్య, సాంస్కృతికోద్యమాలకు చాలా దోహదం చేశారు. మానవ జీవితంలో పురాణాలకు ఉన్న స్థానం మీద ఈ ఇద్దరికీ గురి ఉంది. మన దేశంలోని అసమానతలను, అణచివేతలను అర్థం చేసుకోడానికి పురాణాల మీద విమర్శనాత్మక దృక్పథం ఉపయోగపడిరది. పురాణాలను, అందులోని పాత్రలను సామాజిక నేపథ్యంలో, సంఘర్షణల్లో భాగంగా వాళ్లు చూశారు. తద్వారా సామాజిక వాస్తవికతను చారిత్రకంగా కొత్త పద్ధతిలో నిర్మించే ప్రయత్నం చేశారు.
పురాణాలు తీరిక వేళల్లో చెప్పుకొనే కథలు మాత్రమే కాదు. వాటిలో ఆశ్చర్యం గొలిపే కథా సంవిధానం మాత్రమే లేదు. అవి కేవలం కథలుగానే గాక భావజాలంగా ప్రజల పురా చైతన్యంగా స్థిరపడిపోయాయి. ప్రజల మానసికతలో, విశ్వాసాల్లో, నడవడిలో, నైతికవర్తనలో భాగమయ్యాయి. ప్రజల ఆలోచనారీతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పురాణ కథలు, వాటిలోని పాత్రలు, అవి ప్రకటించే విలువలు సాంస్కృతికంగా బలీయమైన గతంగా మారి వర్తమాన జీవితాన్ని అనుక్షణం నిర్దేసిస్తున్నాయి. మంచి చెడులను, సుఖ దు:ఖాలను, విధి నిషేధాలను పురాణ కథలు, అందులోని సంబంధాలు నిరంతరం ప్రేరేపిస్తున్నాయి. మానవ జీవితాన్ని, సమాజాన్ని వివరించుకోడానికి ప్రజలందరి ఉమ్మడి వనరు పురాణాలు. గతాన్ని గుర్తు చేసుకోడానికి, భవిష్యత్తును ఊహించడానికి కూడా పురాణాలే వాహికగా ఉన్నాయి. ఈ కథల లోతుపాతులు కొందరికే తెలిసి ఉండవచ్చు. కానీ కామన్‌సెన్స్‌గా పౌరాణిక భావనలు అందరిలో స్థిరపడిపోయాయి. బ్రాహ్మణ అగ్రకులాల్లో ఒక రకమైన పౌరాణిక కథనాలు, దళిత శ్రామిక కులాల్లో మరో రకమైన కథనాలు ఉన్నాయి. ఈ పురాణాలకు ఉండే దేశీయ, జానపద కథనాలు లిఖిత పురాణాల ఆధిక్యతను ప్రశ్నిస్తాయి. ఇలాంటి తేడాలు ఎన్ని ఉన్నప్పటికీ సారాంశంలో అవి మన సామాజిక నిర్మితికి లోబడినవే. అవి అసమాన సామాజిక సంబంధాలను పదిలంగా కాపాడుతున్నాయి. అబ్బురపరిచే పురాణ కథనాలు మనుషుల సృజనాత్మక అవసరాలు తీర్చడమేగాక ఆత్మిక జీవితానికి అర్థ వ్యాఖ్యానం చేసుకోడానికి గీటురాళ్లుగా నిలిచిపోయాయి.
డా. బి. విజయభారతి రచనలు ఎక్కువ పురాణ సంబంధంగా ఉండటం యాదృశ్చికం కాదు. ఆమె చాలా ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారు. పురాణాలను పరిశీలించడమంటే ఆమెకు సామాజిక విశ్లేషణ చేయడమే. దీనిని ఒక చారిత్రక పరిశోధనగా కొనసాగించారు. దీనికి ఉదాహరణగా చెప్పగల రచనలు ఎన్నో చేశారు. అందులో ముఖ్యమైనది ‘పురాణాలు` మరో చూపు’. ఇది వేర్వేరు సందర్భాల్లో రాసిన వ్యాసాల సంకలనం. కానీ అన్నిటిలోనూ ఒక ధార కొనసాగింది. అన్నిటి వెనుక ఒక స్పష్టమైన పద్ధతి ఉన్నది.
‘రామాయణం, మహా భారతం ప్రతిపాదించిన అంశాలకు భిన్నమైన సామాజిక వ్యవస్థ పూర్వ సమాజంలో ఉండేది. స్వేచ్ఛాయుతమైన, క్రమబద్ధమైన జీవన విధానం ఉండేది. గణ రాజ్యాలు ఉండేవి. స్త్రీ రాజ్యాలు ఉండేవి. వర్ణ ధర్మం పేరిట గో బ్రాహ్మణాధికారం ఎక్కువైన కాలంలో ప్రజలు పాలకుల అధికారాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిరది. మత విషయాల్లో రాజ్యం జోక్యం చేసుకోవడం వల్ల స్థానిక అసుర జాతులు పాలకుల ఆధిపత్యాన్ని ప్రతిఘటించడం మహా భారత, రామాయణ కథలలో గమనించవచ్చు’ అని ఒక చోట ఆమె రాశారు. విజయభారతి పురాణ పరిశోధన వెనుక ఈ అవగాహన ఉన్నది. దీన్ని కేవలం దృక్పథంగానేగాక ‘ఒక పద్ధతిగా కూడా ఆమె’ తయారు చేసుకున్నారు.
ఒక పురాణంలో కనిపించే ఒక కథ మరో చోట ఇంకోలా ఉంటుంది. ఒక పాత్ర వేర్వేరు కథల్లో వేర్వేరుగా కనిపిస్తుంది. అవి పరస్పరం సంబంధం లేని కథలనిపిస్తాయి. ఇన్ని వైవిధ్యాలు, అంతులేని వైరుధ్యాలు ఉండే పురాణాలన్నిటి మధ్య ఒక సాధారణ అంశం దేవతలు, రాక్షసులు అనే రెండు భిన్న సమూహాలు ఉండటం. రాక్షసులను సంహరించి దేవతలు ధర్మాన్ని కాపాడటం. ధర్మంలో రాజ్యం, సంపద, స్త్రీలు భాగం. అన్ని పురాణాల సారాంశం ఈ సంఘర్షణే. స్థల కాలాలు గుర్తించడానికి వీల్లేని పురాణాల్లో భారత సామాజిక, చారిత్రక వ్యవస్థలను, వాటి పని తీరును పరిశీలించడమే ఆధునిక విశ్లేషణ. విజయభారతి రాసిన ఈ పుస్తకంలోని ‘పురాణాల్లో కనిపించే జాతులు’ అనే వ్యాసం దేవగణాలుగా, రాక్షస గణాలుగా కనిపించే దేశీయ తెగల గురించి, ఆర్యుల గురించి చాలా వివరంగా చర్చిస్తుంది. అట్లాగే పాళి, ప్రాకృతం, సంస్కృత భాషల గురించి ఆసక్తికరమైన చర్చ ఉంది.
‘సంస్కృత భాషను దేవభాషగా ప్రచారం చేయడంలోనూ ఆ భాషా పదాలకు రకరకాల అర్థాలు సృష్టించడంలోనూ ఎవరికి ఏ ఏ ప్రయోజనాలున్నాయో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. స్థానిక భాషలలో ప్రచారమవుతున్న విజ్ఞానాన్ని ప్రజలకు అందకుండా చేయడం పాలక అధిపత్య వర్గాలకు అవసరమైన కాలంలో సంస్కృత భాషా నిర్మాణం జరిగింది’ అని సంస్కృత భాషా పదాల అన్వయం క్లిష్టంగా ఉండటానికి ఆమె చాలా ఉదాహరణలు ఇచ్చారు. తొలి వేద కాలపు దాసులు, దస్యులు అనంతర కాలానికి అసురులుగా ప్రచారమయ్యారని, కొందరు అసురుల పేర్లు తరువాత దేవతాగణంలో చేరిపోయి వేద సూక్తాలలో కనిపిస్తాయనడానికి కూడా విజయభారతి చాలా వివరణ ఇచ్చారు.
పురాణాలలో దేవతలు, రాక్షసులుగా కనిపించే రెండు వర్గాల మధ్య సంఘర్షణను, అసురుల్లో కొందరు దేవతల్లోకి మారిపోవడాన్ని చారిత్రకంగా చెప్పడానికి ఆమె ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఒక చోట ‘ఈ దేశంలోని మొట్టమొదటి పాలకవర్గాలు అసురులు. వలసదారుల ఆక్రమణలతో వాళ్లు ప్రాభవం కోల్పోయారు. అందుకే వీరిని తొలి వేల్పులు అంటారు. హరప్పా సంస్కృతి క్రీపూ 5000`1500 వీరిదే. అదే మూల భారతీయ నాగరికత’ అంటారు. ఈ పుస్తకంలోని ‘పంచజనులు’, ‘నాగులు’ అనే విభాగాలు దేశీయ ప్రజా సమూహాలను వివరిస్తాయి. ‘చాలా తెగలను కలుపుకొని నాగులుగా వ్యవహరించడం కనిపిస్తుంద’ని రచయిత్రి అంటారు. దీనికి కొనసాగింపుగా ‘నాగ జాతిని ఉద్దేశించే ఆర్యులు దాస, దస్య పదాలు వాడారనే పరిశీలన కూడా చేశారు. దీనికి అంబేడ్కర్ చెప్పిన ‘ప్రాచీన భారతీయ వాణిజ్యం, సంస్కృతి దస్యులతో, ద్రావిడులతో ముడిపడి ఉన్నద’నే సూత్రీకరణ ఆసరా. మహా భారతంలో జనమేజయుడు చేసిన సర్పయాగంలో, మహా భాగవతంలోని కాళీయ మర్దనంలో నాగ జాతిని నిర్మూలన అనే ఆర్యుల ఉద్దేశం ఉందని వివరించారు. నాగులకు ప్రతీకగా పాములను ఈ కథలోకి తీసుకొచ్చారు.
నాగులను అణచివేయడం గురించి చరిత్రలో మనకు స్పష్టంగా కనిపించనప్పటికీ పురాణ సాహిత్యంలో ఆధారాలు ఉన్నాయని విజయభారతి అంటారు. దేశీయ తెగలకు వ్యతిరేకంగా ఆర్య సామాజిక సాంస్కృతిక వ్యవస్థలు నిర్మాణమయ్యే క్రమాన్ని పురాణాలు చిత్రించాయి. ఈ కథలు పూర్తిగా దేవతల వైపు నుంచి నడిచినా, ఇందులో దేశీయ తెగల గురించి కూడా ఉంది. ఆ ప్రజల తిరుగుబాట్ల గురించి కూడా ఉంది. వాళ్లను అణచివేయడమే లక్ష్యంగా సాగిన ఆర్యీకరణలో దేశీయ ప్రజల సాహసాలు కనిపిస్తాయి. సువిశాలమైన వాళ్ల స్థావరాలు, రాజ్యాలు, పాలనా పద్ధతులు, సంస్కృతులు కనిపిస్తాయి. వాళ్లను రాక్షసులుగా, ప్రమాదకారులుగా, చెడ్డవాళ్లుగా చిత్రించిన పురాణాల్లోనే వాళ్ల గాథలు కూడా అనేక వక్రీకరణలతో అయినా సరే ఉన్నాయి. విజయభారతి ఈ విషయాలను చాలా ఆసక్తికరంగా పరిశీలించారు. వందల వేల ఏళ్లుగా చెలామణిలో ఉన్న పురాణ కథల్లోపలికి వెళ్లి కొత్త అర్థాలను వెలికి తీశారు. ఎప్పటి నుంచో యథాతథంగా ఆమోదం పొందుతున్న పౌరాణిక భావజాలాన్ని విమర్శనాత్మకంగా చూడటం వల్ల ఆ కథలు సామాజిక అర్థాలు పలికాయి. బౌద్ధాన్ని ఎదుర్కొనే క్రమంలో ముందుకు వచ్చిన భక్తి భావన అన్ని పురాణాల్లో మౌలిక విషయం. సనాతనత్వానికి, అందులోని కులవ్యవస్థకు, పితృస్వామ్యానికి మూలం అక్కడ ఉన్నది. బౌద్ధంపై వైష్ణవం విజయం సాధించడం చాలా పురాణ కథల్లోని ఇతివృత్తం అని విజయభారతి అంటారు. ఈ ‘విజయం’ వల్లనే అనంతర కాలంలో నాగ జాతి వారిని వైదిక ధర్మానుయాయులుగా చూపడమూ జరిగిందని ఆమె అంటారు. అంతక ముందు ఉన్న మూల భారతీయ నాగరికతను ధ్వంసం చేసి ఆర్య నాగరికతకు సాధికారతను, ఆమోదాన్ని తేవడానికి పురాణాలు ఇట్లా దోహదం చేశాయి. లేదా ఈ విధ్వంస క్రమానికి ఆ పురాణ రాక్షసులు గెలిచిన ప్రతిసారీ ధర్మ సంరక్షణకు భగవంతుడు శతృసంహారం చేస్తాడు. తిరిగి దేవగణాలు అధికారంలోకి వస్తాయి. ధర్మంలాగే, భక్తి కూడా కీలకంగా పని చేస్తుంది. భక్తి అసురులకు కూడా ఉండవచ్చు. కానీ ధర్మం గెలిచేది దేవ గణాల భక్తి వల్లనే. అంతిమంగా బౌద్ధం మీద గెలిచింది ఈ వైష్ణవ భక్తి భావమే. దీన్నే ఆమె ‘బలవంతుల జీవన విధానమే మతంగా రూపుదిద్దుకున్నది’ అనే ఒక అద్భుతమైన మాటతో చెప్పారు. దీన్ని మరింత వివరంగా ‘అసురులు తమ ప్రాచీన సంస్కృతిని రక్షించుకుంటూ ఉండే ప్రజలు. తొలి అసురుల భావనలు వాస్తవ జగత్తునూ ప్రకృతి ధర్మాలను వాటి పరిణామశీలతనూ నిశితంగా పరిశీలించి ఏర్పరుచుకున్నవి. వారు వేద మతాన్ని అంగీకరించలేదు. వైదికాచారాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. భారతీయ దర్శనాల్లో అతి ప్రాచీనమైనదిగా చెప్పబడుతున్న చార్వాక మతం వైదిక సంస్కృతిని వ్యతిరేకించిన మతమే..’ అని చెప్పారు. ఇక్కడి నుంచి దేవాసుర సంగ్రామాలుగా పురాణాల్లో నమోదైన కథలను చూడాలి. పురాణాల్లోని దేవాసురులనే రెండు సమూహాలను కాల్పనికంగా చూడకుండా ప్రాచీన భారతదేశంలోకి వచ్చిన ఆర్యుల, స్థానీయ తెగల మధ్య సంఘర్షణగా చూడాలని విజయభారతి ప్రతిపాదించారు. ఈ మాట ఆమెకు ముందు కూడా కొందరు చెప్పారు. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమంటే అనేక పౌరాణిక ఘట్టాలను, దేవాసురుల యుద్ధ సన్నివేశాలను ఈ దృక్పథంతో చాలా ఆసక్తికరంగా చర్చించారు. అటు పురాణాల్లోకి, ఇటు సోషియాలజీలోకి ఏక కాలంలోకి వెళ్లి భారత సమాజ చారిత్రక సంఘర్షణలను ఎత్తి చూపించారు.
ఇదంతా చాలా విధ్వంసపూరితంగా జరిగింది. పురాణాల్లో రాక్షస సంహారంగా, ధర్మస్థాపనగా, తిరిగి దేవగణాలు తమ స్థానాన్ని సంపాదించుకోవడంగా, ఇంద్రుడికి అమరావతి సింహాసనం దక్కినట్లుగా, శాపవశాత్తు రాక్షస అవతారం ఎత్తిన వాళ్లకు విమోచన కలిగినట్లుగా, అంతిమంగా భగవంతుని దగ్గరికి వాళ్లు వెళ్లినట్టుగా అనేక చిలువలు పలువల కథనాల వెనుక భారత సమాజంలో జరిగిన విధ్వంసం ఉన్నది. స్థానిక తెగలకు దాసులనే ముద్ర వేయడం, వాళ్లను లొంగదీసుకోవడం, లేదా చంపేయడం అనే సామాజిక పరిణామం చాలా సంక్లిష్టమైనది. అది చాలా దీర్ఘకాలం జరిగింది. అనేక వైపుల నుంచి అది జరిగింది. అనేక రూపాల్లో, వివిధ దశల్లో జరిగింది. ఈ సంక్లిష్టతనంతా పురాణాలు ఆర్యభావనలోని మహాశక్తి సంపన్నమైన భగవంతుడి లీలలుగా పుణికిపుచ్చుకున్నాయి. అనూహ్యమైన కథనశక్తితో ప్రదర్శించాయి. అన్ని పురాణ కథలూ రాక్షస సంహారం తర్వాత పూర్వ స్థితికి చేరుకోవడంతో ముగుస్తాయి. వాస్తవానికి ఆర్యుల ప్రవేశానికి ముందు ఉన్న పూర్వ స్థితిని ధ్వంసం చేసి సనాతన మత, కుల, పితృస్వామ్య నాగరికతను సుస్థిరం చేయడమే ఈ కథల ముగింపు. ఆనాటి గణ రాజ్యాల స్థానంలోకి భూస్వామ్యం ప్రవేశించే క్రమంలో మహా భారతం నిర్వహించిన పాత్ర దీనికి ఉదాహరణ. అనేక విధ్వంసాల మధ్య నుంచి ప్రాచీన భారతదేశ చరిత్ర నిర్మాణమైంది.
విజయభారతి ‘పురాణాలు`మరో చూపు’ అన్నది ఈ విధ్వంస క్రమాన్ని చారిత్రకంగా ఎత్తి చూపడం. పురాణ కథల్లోకి వెళ్లి, అవి ప్రకటించిన భావజాలాన్ని తిరస్కరిస్తూ దేవ సంస్కృతి వైపు నుంచి, ఆర్య రాజకీయాల వైపు నుంచి రాసిన పురాణాలను దాసుల, దస్యుల వైపు నుంచి పరిశీలించడం ఆమె ఉద్దేశం. తద్వారా రాక్షస సంస్కృతిగా వక్రీకరించబడిన దానిని తల్లకిందుల చేసి దాని వాస్తవ స్వభావం వివరించారు. ‘దేవదానవ సంగ్రామాల’ను పురాణాలు వక్రీకరించాయని, దానవులే ధర్మపరులని ఒక చోట ఫూలే అన్నాడు. ఆయన ఈ మాట పౌరాణిక అర్థంలో అనలేదు. ప్రాచీన భారతదేశపు వాస్తవ చరిత్రకు సంబంధించిన వ్యాఖ్య అది. ఈ కోణంలో చూస్తే ఈ పుస్తకం పురాణ విశ్లేషణ మాత్రమే కాదు. భావజాల కేంద్రకంగా సాగే పురాణాల నుంచి హేతుబద్ధమైన ఆధారాలను వెతికి చరిత్రను నిర్మించే ప్రయత్నం. ఆధునిక శాస్త్రమైన చరిత్ర రచన పద్ధతికి కాల్పనికంగా సాగే పురాణాలు చుక్కెదురు. కానీ పౌరాణికుల ఉద్దేశానికి భిన్నంగా అవి వాస్తవికతను ఎంతో కొంత ప్రతిబింబించాయి. వాస్తవ సంఘర్షణను సురుల వైపు నుంచి రాసినా… అసురుల గాథలు కూడా వక్ర రూపాల్లో నమోదయ్యాయి. ఈ చారిత్రక దృక్పథంతో పురాణాలను పరిశీలిస్తే మన దేశ సామాజికతను వెలికి తీయవచ్చు. దాని చారిత్రక క్రమాన్ని గుర్తించవచ్చు. విజయభారతి చేసిన విస్తారమైన కృషి వెనుక ఈ అవగాహన ఉన్నది.
కోశంబి వేద వాగ్మయాన్ని విశ్లేషిస్తూ ప్రధానంగా రాజకీయార్థిక, చారిత్రక విశ్లేషణ చేశారు. ఆయన మార్గంలో అనేక మంది ప్రగతిశీల వామపక్ష మేధావులు కృషి చేశారు. చరిత్ర రచనను దాని భౌతిక పునాది మీద నిలబెట్టి సాహిత్య తదితర ఆధారాలన్నిటినీ వినియోగించుకున్నారు. విజయభారతి సామాజిక చారిత్రక దృక్పథంతో చేసిన ఈ పనిలో సాహిత్య సాంస్కృతిక కోణం బలంగా ఉంది. మన దేశంలో అనేక రాజకీయార్థిక పరిణామాలు జరిగినా పౌరాణిక మనస్తత్వం నుంచి ప్రజలు బైటపడలేదు. వాటిలోని భక్తి నుంచి విముక్తి కాలేదు. చార్వాకులు, బౌద్ధులు నెలకొల్పిన వివేకాన్ని, హేతువును ధ్వంసం చేసి ముందుకు వచ్చిన భక్తి నానాటికీ పెరిగిపోతున్నది. దీని మూలాలు పురాణాల్లో ఉన్నాయి. వాటి ప్రభావం వల్ల సామాజిక మనస్తత్వం కంటే పౌరాణిక మనస్తత్వం ఇప్పటికీ బలంగా ఉన్నది. దీన్ని ఎదుర్కోవాలంటే విజయభారతిగారు ప్రదర్శించిన పురాణాలపై మరో చూపు చాలా అవసరం.