కొంతమంది కవి పండితులు జలపాతాల్లాగా పరవళ్ళు తొక్కుతారు. అతి కొద్దిమంది సాహితీవేత్తలు పంటకాలువలా నిశ్శబ్దంగా ప్రవహిస్తూ పాఠకుల హృదయ క్షేత్రాలపై పచ్చని సృజన సంతకం చేస్తారు. బీడు బారిన నేలమీద ఆవరించిన కంటకాలను పంటకాలువ ప్రక్షాళన చేసినట్లు, జాతిని నిర్వీర్యం చేసే సాంస్కృతిక కాలుష్యాన్ని ఆ సృజనకారులు తమ రచనా వాహినితో శుద్ధి చేయటానికి ప్రయత్నిస్తారు.
డాక్టర్ బోయి విజయభారతి పంటకాలువ లాంటి అరుదైన సాహితీమూర్తి. విలువైన రచనలతో దళిత తాత్త్వికతను మరింత విస్తృతపరచిన విదుషీమణి. రచయిత్రిగా, అనువాదకులుగా, సంపాదకులుగా, పరిశోధకురాలిగా తెలుగు అకాడమి సంచాలకులుగా విజయభారతి విశేషమైన కృషి చేశారు. ఎవరూ స్పృశించని సాహిత్య విమర్శ పార్శ్వాల్లో గుండా ప్రయాణం చేశారు. ప్రత్యామ్నాయ భావధారతో స్త్రీవాద, దళిత, బహుజన, సాహిత్యాలకు విజయభారతి వినూతన స్పూర్తినందించారు. అస్తిత్వ ఉద్యమాలకు ఆమె బలమైన సాహిత్య ఆలంబనగా నిలిచారు. అణగారిన వర్గాల సర్వతోముఖ వికాసానికి జీవితాంతం పాటుపడిన మహనీయుల జ్ఞాన వారసత్వాన్ని బాల్యం నుండే విజయభారతి అందిపుచ్చుకొని, ఆ మహోన్నత మూర్తుల ఆశయాలను తన సాహిత్యం ద్వారా ప్రచారంచేశారు. దళితుల విద్యావికాసానికి ఎంతగానో తోడ్పడిన ‘‘సంఘోద్ధారక’ బిరుదాంకితుడు గొల్ల చంద్రయ్య మనవరాలుగా, పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న కుమార్తెగా, ఆది ఆంధ్ర ఉద్యమ నాయకుడు బొజ్జా అప్పలస్వామి కోడలుగా, జగమెరిగిన దళిత నేత బొజ్జా తారకం సహచరిగా పుట్టినింటి నుండి, మెట్టినింటి నుండి సముపార్జించుకున్న సామాజిక, సాహిత్య స్పృహతో విజయభారతి తనను తాను పుటం పెట్టుకున్నారు. సుప్రసిద్ధ కవి గా మన్ననలందుకున్న భీమన్న రిజిస్ట్రార్ ఆఫ్ బుక్స్ ఉద్యోగం చేయడంవల్ల జయభేరి పత్రిక సంపాదకుడు కావడం వల్ల గ్రంథాలయం లాంటి తండ్రి ఇంటిలోనే విజయభారతి పుస్తక పఠనం పట్ల అభిరుచిని పెంచుకున్నారు. చందమామ, బాల మిత్ర లాంటి పత్రికల్లో కథలు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శరత్, కొడవటిగంటి, చలం వంటి రచయితల పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడమే కాకుండా వారి రచనల్లోని మంచి చెడులను గురించి తన తండ్రితో నిర్భయంగా చర్చించేక్రమంలోఆమె విమర్శనాత్మకమైన దృష్టిని ఏర్పరుచుకున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలులో హైస్కూల్ విద్య, కాకినాడలోని పిఠాపురం మహారాజ కళాశాలలో విజయభారతి ఇంటర్ విద్య అభ్యసించారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళాకళాశాలలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యం.ఏ. పూర్తిచేశారు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీనిరంజనం ప్రోత్సాహంతో, డాక్టర్ పల్లా దుర్గయ్య పర్యవేక్షణలో ‘దక్షిణ దేశీయంధ్ర వాజ్మయం సాంఫీుక పరిస్థితులు’ అనే అంశంపై విజయ భారతి పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా దశాబ్ద కాలంపాటు బాధ్యతలు నిర్వహించారు. అనంతరం తెలుగు అకాడమిలో రీసెర్చ్ ఆఫీసర్‌గా, డిప్యూటీ డైరక్టర్‌గా ఇంఛార్జ్ డైరెక్టర్‌గా వివిధ హోదాలలో విద్యావిషయకంగా, పాలనాపరంగా అరుదైన సేవలందించారు. అకాడమి పురోభివృద్ధికి విజయభారతి ఎంతగానో తోడ్పడ్డారు.
కృష్ణా, గోల్కొండ పత్రికల్లో కథలు, వ్యాసాలు రాయడంతో, ఆకాశవాణిలో అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా విజయభారతి సృజన ప్రయాణం ప్రారంభమయింది. ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్ర’ అనే తొలి గ్రంథంతోనే విజయభారతి రచయిత్రిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అంతకంటే ముందు అంబేడ్కర్ జీవన ప్రస్థానం గురించి యెండ్లూరి చిన్నయ్య రాసిన పుస్తకం వెలువడినప్పటికీ విజయభారతి రచించిన ఈ గ్రంథం అనేక ముద్రణలు పొంది నేటికీ పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఈ పుస్తకం ‘’జీవిత చరిత్ర అయినా ఒక నవల వలె సాఫీగా సాగుతుందని, కొన్ని కొన్ని ఘట్టాలలో నాటకం వలే ముఖ్య దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు చూపుతుందని’’ నార్ల వెంకటేశ్వరరావు విజయభారతి రచనా శైలిని కొనియాడారు. ఈ గ్రంథానికి రాసిన ముందుమాటలో నార్ల చెప్పినట్లుగానే అంబేడ్కర్ జీవిత చరిత్ర పఠనయోగ్యంగా ఉండడంతో పాటు అశేష జనావళికి ఎంతో ప్రేరణ కలిగించింది. అంబేడ్కర్ జననం దగ్గర నుండి ఆయన జీవితంలోని మలుపులను, ఆయన ప్రారంభించిన రాజకీయ సాంఘిక
ఉద్యమ విశేషాలను, రచనల వివరాలను ఆ మహనీయుని ప్రబోధాలను, వ్యక్తిత్వాన్ని డెబ్భయ్యారు అంశాలుగా విభజించి విజయభారతి సరళా సుందరమైన శైలిలో ఈ గ్రంథాన్ని రచించారు. బహుముఖీనమైన అంబేడ్కర్ అసాధారణ కృషి గురించి కూలంకషంగా తెలుసుకోడానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది. ధనంజయ్ కీర్ రాసిన మహాత్మ జ్యోతిరావు ఫూలే జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించి, తెలుగు సమాజంలో ఫూలే ఆదర్శాలకు, ఆశయాలకు, భావజాల వ్యాప్తికి విజయభారతి మార్గదర్శకంగా నిలిచారు. ఈ రచయిత్రి రాసిన ఫూలే, అంబేడ్కర్ జీవిత చరిత్రలు ప్రజాస్వామ్యవాదులకు, దళిత బహుజన ఉద్యమకారులకు, నాయకులకు, కార్యకర్తలకు కరదీపికల్లా ఉపయోగపడ్డాయ నిచెప్పడం అతిశయోక్తికాదు. విజయభారతి రచనల్లో తెలుగు సాహిత్య కోశం అపూర్వమైన గ్రంథం.
నన్నయకు పూర్వం నుండి 1950 వరకు ఉన్న వెయ్యేళ్ళ సాహిత్యాన్ని పరిష్కరించారు. వేలాది మంది కవుల వివరాలను సేకరించటంతో పాటు ఒక క్రమపద్ధతిలో వాటిని పొందుపరచి అచంచలమైన కృషితో ఆమె తెలుగుసాహిత్య కోశం రూపొందించారు. తెలుగు అకాడమి ఉద్యోగి శివనారయ్య సహకారంతో విజయభారతి సంపాదకత్వంలో రెండు భాగాలుగా వెలువడిన తెలుగు సాహిత్య కోశం ప్రాచీన, ఆధునిక కవులకు సంబంధించిన మౌలిక మైన సమాచారాన్ని తెలుసుకోటానికి ప్రామాణికమైన ఆధార గ్రంథంగా నేటికీ ఉపయోగపడుతుంది. సాహిత్య కోశంలో అనేక తప్పులున్నాయని పనిగట్టుకొని కొంతమంది పండితులు నిరాధారమైన ఆరోపణలు చేశారు. అసూయతో కూడిన ఈ నిందారోపణలు అకాడమీకే పరిమితం కాకుండా చివరకు అసెంబ్లీని కూడా తాకాయి. అప్పటి ముఖ్యమంత్రి సూచనలతో ఏర్పడిన ప్రత్యేక కమిటీ ఈ విమర్శలను త్రోసిపుచ్చింది. వివిధ శాస్త్రాలకు సంబంధించిన పాఠ్య గ్రంథాల రూపకల్పనలో, అందుకు అవసరమైన పరిభాషను స్థిర పరచడంలో కూడా ఆమె కీలకంగా వ్యవహరించారు. తెలుగు అకాడమిలో అడుగడుగున ఏర్పడిన అవరోధాలను ధీరోచితంగా ఎదుర్కొని మొక్కవోని దీక్షతో విజయభారతి ముందుకుసాగారు.
శాస్త్రసాంకేతిక విజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న సందర్భంలో అందుకు ప్రతిబంధకంగా ఉన్న భావ వాతావరణ పరిస్థితులపై విజయభారతి అక్షరయుద్ధం చేశారు. ప్రగాఢ చింతనాభరితమైన తన సాహిత్యం ద్వారా ఆమె ఈ కాలానికి అవసరమైన వైజ్ఞానిక స్ఫూర్తిని అందించారు.
‘సత్య హరిశ్చంద్రుడు’, ‘షట్చక్రవర్తులు’, ‘దశావతారాలు’, ‘పురాణాలు మరోచూపు’, ‘వ్యవస్థను కాపాడిన రాముడు’, ‘ఇతిహాసాలు-రామకథ’, ‘ఇతిహాసాలు మహాభారతం’ వంటి గ్రంథాలు విజయభారతి ప్రత్యామ్నాయ పరిశోధనాదృష్టికి తార్కాణంగా నిలుస్తాయి. పురాణ కథలను ం ామాయణ, మహాభారతాలను దళిత దృక్పథంలో నుండి విజయభారతి పునర్మూల్యాంకనం చేశారు. కులం, జెండర్ కేంద్రంగా ప్రాచీన సాహిత్యాన్ని విలక్షణంగా పరిశీలించారు. ఆశ్రమ ధర్మాల కంటే వర్ణాశ్రమ ధర్మాలను పటిష్టంగా అమలు చేయడంపైనే షట్చక్రవర్తులు శ్రద్దవహించారని, వర్ణవ్యవస్థను సుస్థిరంగా కాపాడే భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశారని విజయభారతి విశ్లేషించారు.. కులవ్యవస్థను రక్షించడం, తదనుగుణమైన ఆలోచనలను ప్రచారం చేయడం, వాటిని తప్పనిసరిగా పాటించాలని ప్రబోధించటం హరిశ్చంద్రుని కథ లక్ష్యం (షట్చక్రవర్తులు) అని ఆమె సూత్రీకరించారు.
భద్ర మహిళలను మర్యాదగా అవమానించటం, కింది జాతి స్త్రీలను నీచంగా, పరుషంగా అవమానించటం, జాతి వైరాన్ని ఇతర వైరాలను స్త్రీలమీద తీర్చుకోవటం పురాణాల్లోనూ, సాహిత్యంలో కనిపిస్తుందని విజయ భారతి విమర్శించారు.
మహాభారతాన్ని సమకాలీన సామాజిక దృష్టితో పరిశీలిస్తూ. విజయభారతి రచించిన ‘నరమేధాలు నియోగాలు’ లోతైన పరిశోధనా గ్రంథం. మహాభారతంలోని సర్పయాగమూ, రాక్షస మేధమూ, ఖాండవ దహనమూ, శత్రువులను మూకుమ్మడిగా హతమార్చిన సంఘటనల తీరుతెన్నులను ఈ గ్రంథంలో విజయభారతి సోదాహరణంగా చర్చించారు. పురాణ కథలను పరమ సత్యాలుగా పవిత్ర విషయాలుగా విశ్వసించే వారు వాటిలోని అంతరార్ధాలను కూడా గ్రహించాలని ఆమె సూచించారు. అరుంధతీ వశిష్టులను ఆదర్శదంపతులుగా భావించే సమాజం, వర్ణాంతర వివాహాలను ఎందుకు అంగీకరించలేక పోతున్నదని విజయభారతి నిశితంగా ప్రశ్నించారు. జ్ఞాన సమాజం కులాల సమాజంగా ఎందుకు రూపాంతరం చెందిందని ఆమె నిలదీశారు. మహాభారతం చెప్పిన ధర్మోపదేశాలను గతితార్కిక దృష్టితో పరిశీలించటం నేటి సమాజానికి అవసరమని విజయభారతి వివరించారు.
‘’మహిళల హక్కులు డాక్టర్ అంబేడ్కర్ దృక్పథం’’ అనే గ్రంథంలో భారతదేశ మహిళా వికాసానికి సముచితమైన కార్యాచరణ ప్రణాళిక అందించిన బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను మహిళా విముక్తి ప్రదాతగా ఆమె నిరూపించారు. ఇటీవల విజయభారతి వెలువరించిన ‘స్వతంత్ర భారతదేశం స్త్రీలకు గుప్పెడు ధూళినే మిగిల్చిందా? వ్యాస సంపుటి విలక్షణమైనది. తాటక లాంటి అనేక పౌరాణిక పాత్రలను, రుక్మాంగద చరిత్రను, పురుష సూక్త స్వభావాన్ని, ప్రాచీన కాలంనుండి వెంటాడుతున్న మద్యపాన సంస్కృతి ఆనవాళ్లను, జాంబవ పురాణ విశిష్టతను తన వ్యాసాల్లో విజయభారతి విభిన్నంగా విశ్లేషించారు.
భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన బోయి భీమన్న జీవిత సాహిత్య ప్రస్థానాన్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ విజయభారతిరాసిన పుస్తకాన్ని కేంద్రసాహిత్య అకాడమి ప్రచురించింది. ‘మా అమ్మ బోయి నాగరత్నమ్మ జ్ఞాపకాలు ‘ అనే రచనలో తల్లితో పెనవేసుకున్న అనుభవాలను, కష్టనష్టాలను విజయభారతి సమీక్షించారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రచనలు ప్రసంగాలు అనువాద సంపుటాల్లో నాలుగు పుస్తకాలకు విజయభారతి సంపాదక వర్గ సభ్యులుగా వ్యవహరించారు. పౌరహక్కుల నేతగా దళిత నాయకుడిగా, ప్రజాన్యాయవాదిగా ప్రఖ్యాతిగాంచిన తన జీవనసహచరుడు బొజ్జా తారకం వివిధ సందర్భాలలో రాసిన అనేక వ్యాసాలను, కవితలను, మిగతా రచనలను కూడా శ్రద్ధతో సేకరించి గనుమల జ్ఞానేశ్వర్ సహకారంతో తన సంపాదకత్వంలో ఆమె ప్రచురించారు. తారకం ఉద్యమ, తాత్త్విక కార్యాచరణకు విజయభారతి బాసటగా నిలబడ్డారు. విజయభారతి సాహిత్య సేవలను గుర్తించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశిష్ట మహిళా పురస్కారంతో ఆమెను గౌరవించింది. భాగ్యరెడ్డి వర్మ జీవన సాఫల్య పురస్కారం కూడా విజయభారతి అందుకున్నారు. గత కొంతకాలంగా విజయ భారతి అనారోగ్యంతో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె గ్రంథాధ్యయనాన్ని నిరాఘాటంగా కొనసాగించారు. ఈ మధ్య కాలం వరకు విజయభారతి రచనలు చేస్తూనే ఉన్నారు. గతం లో ఆమె నలుపు, ఎదురీత, నీలిజెండా పత్రికల్లో అనేక అంశాలపై ఆమె వ్యాసాలు రాశారు. కొన్ని పుస్తకాలకు ముందు మాటలు రాశారు. అప్పుడప్పుడు ఆలోచనాత్మమైన కవితలు కూడా రాశారు. వీటన్నింటినీ సేకరించి ముద్రించాల్సిన అవసరముంది. ఆమె ఎంతో ఇష్టపడి, శ్రమకోర్చి రాసుకున్న దళిత సాహిత్య వికాసం, ఆత్మగౌరవ పోరాటాలు, లాంటి అముద్రిత రచనలను కూడా ప్రచురిస్తే విజయభారతి సాహిత్య ఔన్నత్యం సంపూర్ణంగా అర్థమవుతుంది. అరుదైన ఈ సాహితీమూర్తి అందించిన సృజన స్ఫూర్తిని ఆచరణాత్మకంగా ముందుకు తీసుకుపోవటమే ఆమెకు ఘనమైన నివాళి.