డా. బి. విజయభారతిగారు వుద్యమ శ్రేణులు చాలా గొప్పది అని భావించే కుటుంబ వారసత్వం నుంచి వచ్చి అంతే గొప్పగా తన కార్యాచరణను చాటుకున్న విశిష్ట వ్యక్తి. ఆమె పంతొమ్మిదవ శతాబ్దపు సంఘసంస్కరణ వుద్యమాలలో విస్మరణకు గురైన అధ్యాయం అయిన దళిత సమాజపు అంతర్గత సంస్కరణలో కీలకపాత్ర పోషించిన గొల్ల చంద్రయ్య గారి మనుమరాలు.
ఆమె తల్లి నాగరత్నమ్మగారు తమ తండ్రిjైున చంద్రయ్య గారి ఆదర్శాలను పుణికిపుచ్చుకుని స్వతంత్ర వ్యక్తిత్వంతో నిలబడిన అరుదైన స్త్రీ. విజయభారతిగారి తండ్రి బోయి భీమన్న రచయితగా తెలుగు సాహిత్యంలో తనదైన పేరు ప్రతిష్టలు పొందడం తెలిసిందే! ఆమె మామగారు, బొజ్జా అప్పలస్వామి బాబాసాహెబ్ అంబేడ్కర్ మార్గంలో రాజకీయాలను ప్రారంభించి అంబేడ్కర్ ప్రారంభించిన షెడ్యూలు క్యాస్ట్ ఫెడరేషన్ నుంచి మద్రాసు ప్రెసిడెన్సీకి శాసన సభ్యుడిగా యెన్నిక కావడమేగాక తెలుగునాట తమదైన తాత్విక దృష్టితో ‘చరిత్రను మార్చిన మనిషి’. యిక విజయభారతిగారి భర్త బొజ్జా తారకంగారు జగమెరిగిన హక్కుల వుద్యమకారుడు, రచయిత, మేధావి.
విజయభారతిగారు తెలుగు రాష్ట్రాలలో పి.హెచ్.డి డిగ్రీ పొందిన మొట్టమొదటి మహిళ(1969).ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆమె ‘దక్షిణ దేశీయాంధ్ర వాజ్మయం- సాంఘిక జీవనం’ అనే అంశంపై చేసిన పరిశోధన యెంతో విలువైనది. విజయభారతి గారు రెండు సంపుటాలుగా వెలువరించిన ‘తెలుగు సాహిత్య కోశం’ అనే గ్రంథం సుమారు వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రను రికార్డ్ చేసి పరిశోధకులకు మంచి రిఫరెన్స్‌గా మారింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ భావధార డా. బి.విజయభారతి కలాన్ని ముందుకు నడిపిన దిక్సూచి అనవచ్చు. ఆమె అంబేడ్కర్ జీవిత చరిత్రను రాసి 1982 నాటికే ప్రచురించడం విశేషం. ధనుంజయ్ కీర్ ఇంగ్లీషులో రాసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవిత చరిత్రను ఆమె తెలుగులోకి అనువాదం చేసిన కాలానికి కూడా తెలుగులో ఫూలే, అంబేడ్కర్ సాహిత్యం పెద్దగా రాలేదనే చెప్పొచ్చు. తర్వాత 90వ దశకంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించిన అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు అనే ప్రాజెక్ట్‌లో నాలుగు సంపుటాలకు సంపాదకవర్గ సభ్యురాలిగా వ్యవహరించారు. విజయభారతిగారు యిటీవల రచించిన ‘మహిళల హక్కులు- అంబేడ్కర్’, అనే రచన, ‘స్వతంత్ర భారతదేశం స్త్రీలకు గుప్పెడు బూడిదే మిగిల్చిందా?’ అనే వ్యాస సంపుటి, ‘మా అమ్మ బోయి నాగరత్నమ్మ జ్ఞాపకాలు’ అనేపేరున ఆమె తల్లి జీవిత చరిత్ర ఆమె స్త్రీవాద స్పృహకు నిదర్శనాలు.
విజయభారతిగారి రచనలలో ఆమె హిందూ పురాణాలు, ఇతిహాసాలపై చేసిన పరిశోధనాత్మక రచనలు విభిన్నమైనవి. హిందూ పురాణేతిహాసాలను బ్రాహ్మణేతర ధృక్పథం నుంచి పరిశీలించడం అనేది మహాత్మా ఫూలే ప్రారంభించగా బాబాసాహెబ్ అంబేడ్కర్ రాముడు- కృష్ణుడు రహస్యాలు వంటి రచనల ద్వారా విస్తృతపరిచాడు. యిదే ధోరణితో పండిత అయోతీదాస్, పెరియార్, భాగ్యరెడ్డి వర్మ పురాణ సాహిత్యాన్ని పరిశీలించి వ్యాఖ్యానించారు. అయితే ఫూలే అంబేడ్కర్ బ్రాహ్మణేతర వారసత్వాన్ని తెలుగులో పెద్దయెత్తున కొనసాగించిన వ్యక్తి విజయభారతి గారే అని చెప్పొచ్చు. ఆమె ‘పురాణాలు-మరోచూపు’, ‘షట్ చక్రవర్తులు’, ‘సత్య హరిచ్చంద్రుడు’, ‘దశావతారాలు’, ‘ఇతిహాసాలు-రామ కథ’, ‘ఇతిహాసాలు- మహాభారతం’, ‘వ్యవస్థను కాపాడిన రాముడు, ‘నరమేధాలు- నియోగాలు’ ఆమెను ఫూలే- అంబేడ్కర్ వారసురాలిగా నిలిపేవి. ఆమె సాహిత్య ధృక్పథాన్ని చాటే యీ రచనలు చేయడానికి ఆమె చేసిన శ్రమ ప్రతి పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రాచీన భారతదేశ చరిత్ర పొడవునా ఆర్య బ్రాహ్మణ వర్గాలకు, స్థానికులైన అనార్య తెగలకు భూమి మీద ఆధిపత్యం కోసం జరిగిన పోరు పురాణ సాహిత్యంలో బ్రాహ్మణ వర్గాలు తమకు అనుకూలంగా రాసుకున్నారని, నిజానికి జరిగింది అందుకు భిన్నమైనదని యీ పోరులో బ్రాహ్మణ వర్గాలు చేసిన కుట్రలను ఆమె రచనలలో బైటపెట్టారు. ప్రాచీన సాహిత్యంలో సురులు, దేవతలు, మునులుగా గౌరవప్రదంగా పేర్కొనబడినవారు బ్రాహ్మణులు కాగా అసురులు, రాక్షసులు, పిశాచులు, కిరాతులు, చండాలురు వంటి అగౌరవమైన పేర్లతో పేర్కొనబడిన వారంతా ఆర్య బ్రాహ్మణ, క్షత్రియుల చేతిలో పరాజితులుగా అణచివేతకు గురైనవారనే స్పృహను ఆమె రచనలద్వారా కలిగించారు. వారిని తమ మత గ్రంథాలలో అవమానకరంగా పేర్కొని వారు దుర్మార్గులని, క్రూర ప్రవృత్తిగలవారని మునులు దేవతలు చేసే యజ్న యాగాలను నాశనం చేసేవారని చెప్పడం ద్వారా ప్రజలలో వారిపట్ల యేహ్యభావం పెంపొందేలా చేశారని, అది సమాకాలీనంగా కూడా అనేక సందర్భాలలో ఆధిపత్య కులాలు అణగారిన కులాల పట్ల వ్యవహరించే తీరులో మనం చూస్తామని విజయభారతి గారు పేర్కొనడం గమనార్హం. భారత కుల సమాజంలో వైదిక హిందూ మత సాహిత్యం కులవ్యవస్థకు ఆమోదముద్ర వేసి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో వివిధ కులాల మధ్య అంతరాలు, అణగారిన కులాల పట్ల ఆధిపత్య కులాలు పాటించే వివక్ష, అంటరానితనం, వారిపట్ల శత్రుపూరితమైన ధోరణి సబబే అనే అభిప్రాయాలను స్థిరీకరింపజేసిందని ఆమె రచనలు రుజువు చేస్తాయి. ప్రాచీన కాలంలో స్థానికులైన నేటి దళిత, ఆదివాసులను తమ భూమి మీద పరాయివారిగా మార్చి, యేమార్చడానికి ఆర్యులు పన్నిన పన్నాగాలు, భూమి మీద అధికారం కోసం ఆర్య, అనార్య జాతుల మధ్య కొనసాగిన వైరం, ఆ వైరంలో ఆర్యులు పైచేయి సాధించి అనార్య జాతులను దాసులుగా, బానిసలుగా చేసుకోవడాన్ని హిందూ ఇతిహాస పురాణాలు సమర్ధించిన తీరు, అల్లిన కట్టుకథలు, పిట్ట కథలల్ని ఆమె యెండగట్టారు. బ్రాహ్మణులను భూసురులుగా, దేవుళ్ళుగా దళిత ఆదివాసీలను దుర్మార్గమైన రాక్షసులుగా, పిశాచాలుగా వారిపట్ల శత్రుత్వ భావం యీనాటికీ కొనసాగుతుందని, నేడు పెత్తనదారీ కులాల చేతిలో వున్న ప్రభుత్వాలు కూడా దళిత, ఆదివాసుల పట్ల అదే ధోరణితో వ్యవరిస్తూ వుండడాన్ని ఆమె జ్ఞాపకం చేశారు. స్థానిక ప్రజలను తమ భూమి మీద బానిసలుగా చేయడానికి వారి వారి సంపదను అపహరించడానికి రంగంలోకి దిగిన దశావతారాలు ముఖ్యంగా రాముడు వంటి పాత్రలు సాగించిన మారణహోమాన్ని ఆమె కళ్ళకు కట్టినట్టు విడమర్చి చెప్పారు. నరకాసురుడు, మహిషాసురుడు, శంబరాసురుడు, బలి చక్రవర్తి వంటి అనార్య ప్రముఖులను మట్టుబెట్టి వారిని హతమార్చిన రోజులను హిందువులు పండుగలుగా జరుపుకోవడం వెనుక దాగున్న దుర్నీతిని విజయభారతిగారి రచనలు యెత్తి చూపుతాయి. బ్రాహ్మణ మునులు తమ ప్రయోజనాల కోసం క్షత్రియుడైన రాముడిని వుపయోగించుకున్నాయని, వర్ణవ్యవస్థను కాపాడే పనిని అతనికి అప్పగించడంలో దాగున్న దుర్మార్గాన్ని విజయభారతి గారి ‘వ్యవస్థను కాపాడిన రాముడు’ గ్రంథం దుయ్యబట్టింది. రామరాజ్యం అంటే అంతరాల దొంతరలు కలకాలం వర్ధిల్లే వ్యవస్థ అని ఆమె చెప్పారు.
బ్రాహ్మణమత సాహిత్యం అనార్య దళిత, ఆదివాసి సంస్కృతులను తీవ్రంగా ద్వేషించింది. అనార్యులు శాంతి కాముకులు, వారి సరళమైన సామాజిక జీవనంలో స్త్రీ ప్రాధాన్యత గల మాతృస్వామిక వ్యవస్థ తాలూకు లక్షణాలను ఆర్య బ్రాహ్మణ వర్గాలు వ్యతిరేకించి వారి స్త్రీలను, వారి వ్యక్తిత్వాలను కించపరిచే కథనాలు అల్లారు. తాటక కథ, శూర్పణఖ కథ అందుకు వుదాహరణలు అని ఆయా కథలలో రామ లక్ష్మణులు అనార్య స్త్రీల పట్ల యెంత అమానుషంగా ప్రవర్తించి వారిని హతమార్చింది విజయభారతిగారి ‘వ్యవస్థను కాపాడిన రాముడు’, ‘పురాణాలు-మరోచూపు’ గ్రంథలు స్పష్టం చేశాయి. అహల్య, సీత వంటి హైందవ స్త్రీల పాత్ర చిత్రణలో పురుష ప్రయోజనాలు వున్నాయని, అనార్య స్త్రీ పాత్రల చిత్రణలో ఆర్య బ్రాహ్మణ పితృస్వామిక దృష్టి వుందని విజయభారతి గారు అంటారు. ఆమె మరో విశిష్ట రచన ‘నరమేధాలు-వియోగాలు’ మహాభారత కథ ఆధారంగా రాసినది. యిందులో కులం- పితృస్వామ్యం అనే అంశాలను ప్రధానంగా విశ్లేషించారు. యిప్పుడు నడుస్తున్న ‘గోబ్రాహ్మణ’ రాజకీయం, బ్రాహ్మణీయ వర్గాల శాఖాహార గొప్పతనం వెనక వున్న నరమాంస భక్షణల మూలాలు పురాణ సాహిత్యంలో నిక్షిప్తమై వున్నాయని ఆమె పరిశోధనలో తేల్చి చెప్పడం విశేషం. అలాగే ‘గ్రీన్ హంట్’ వంటి ప్రాజెక్టుల మూలాలు కూడా పురాణ కథలలో చెప్పిన రాక్షస సంహారంలో వున్నాయని, దండకారణ్యంలో గతంలో కూడా ఆర్య బ్రాహ్మణ వర్గాలు యిప్పటి పాలకుల మాదిరే ఆదివాసులను తమ ఆవాసాల నుంచి తరిమి వెంటాడి హతమార్చడం చరిత్ర అని విజయభారతి గారి విశ్లేషణ. బ్రాహ్మణ వర్గాల మత సాహిత్యంలో దాగున్న కుట్రలను అశాస్త్రీయతను విజయభారతిగారు బైటపెట్టి పీడితులకు తమదైన ఒక గొప్ప పోరాట వారసత్వం వున్నదని తమ పూర్వీకులు నేడు ఆధిపత్య వర్గాలుగా కొనసాగుతున్న వారి పూర్వీకుల కుట్రలకు బలైపోయారనే యెరుకను ఆమె తమ రచనల ద్వారా కలిగించడం నిజానికి చిన్న విషయం కాదు. యెంతో శ్రమ, సంస్కృత భాషా పరిజ్ఞానం అవసరమైన పని. సంస్కృత గ్రంథాలకు అనువాదాలు అందుబాటులో వున్నప్పటికీ ఆమె మూలంలో వున్న అంశాలను, అనువాదాలలో చోటుచేసుకున్న మార్పులను గురించి కూడా ఆయా సందర్భాలలో ప్రస్తావించడం డా. విజయభారతి నిశిత దృష్టికి తార్కాణం. బాబాసాహెబ్ అంబేడ్కర్ సంస్కృతంలో వున్న హిందూమత గ్రంథాల అధ్యయనాన్ని ‘గొడ్డుచాకిరీ’గా తీసిపారేసిన వారున్నారు. నిజానికి ఆ ‘గొడ్డుచాకిరి’ యీనాడు వున్న మతతత్వ ధోరణులను అర్ధం చేసుకోడానికి ప్రయోజనకరంగా వుంది. ఆయన చెప్పినట్టు పీడితునికి తాను పీడిరచబడ్డాననే స్ఫ్రృహ కలిగించడం అవసరం. ఆ పనిని విజయభారతి గారు విజయవంతంగా నెరవేర్చారు.
అంబేడ్కర్ స్త్రీ దృక్కోణాన్ని ఆవిష్కరిస్తూ విజయభారతి గారు రాసిన ‘మహిళల హక్కులు- డా. అంబేడ్కర్ ధృక్పథ్రం’ అనే గ్రంథం బాబాసాహెబ్ అంబేడ్కర్ భారతీయ స్త్రీకి నిజమైన ఆత్మబంధువు అని చాటుతుంది. ఆమె వెలువరించిన వ్యాస సంపుటి ‘స్వతంత్ర భారతదేశం స్త్రీలకు గుప్పెడు బూడిదనే మిగిల్చిందా?’లో చేర్చినవి ఆమె పత్రికలకు వివిధ సందర్భాలలో రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు, యిప్పటికీ ప్రాసంగికత వున్నవే! విజయభారతిగారి రచనలలో ఆమె తల్లి నాగరత్నమ్మగారి జ్ఞాపకాల సంపుటి వైవిధ్యమైనది. ఆత్మ కథనాత్మకమైన యీ పుస్తకంలో ఆమె తన తల్లి వున్నత వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిదాయకంగా చిత్రిస్తూ దళిత సమాజంలో దాగున్న పితృస్వామిక లక్షణాలను నిర్ద్వంద్వంగా యెత్తి చూపడం విశేషం. నిజానికి యీ రచన యెంతో తెగింపుతో, అనేక సవాళ్ళను అధిగమించి రాసినట్టు ఆ పుస్తకం బైటకు వచ్చిన తీరుని బట్టి అర్ధమౌతుంది.
డా. విజయభారతిగారు మొదట నిజామాబాద్ కాలేజిలో లెక్చరర్‌గా సుమారు పదేళ్ళు పనిచేసినాక తెలుగు అకాడమి వుప సంచాలకురాలిగా బాధ్యతలు శక్తిమంతంగా నిర్వహించారు. ఒకపక్క వుద్యోగ బాధ్యతలు యెన్నో సవాళ్ళ మధ్య నిర్వహిస్తూ, మరొకపక్క పిల్లలు, కుటుంబ బాధ్యతలలో తనభర్త బొజ్జా తారకంగారి వుద్యమానికి తనదైన తోడ్పాటునందిస్తూ సమాజం పట్ల బాధ్యతాయుతమైన రచనలు చేయడం అనే ముఖ్యమైన పనిని చివరివరకూ కొనసాగించడం విజయభారతి గారి ధీటైన వ్యక్తిత్వానికి నిదర్శనం. నిజానికి సాహిత్యంలోనూ, సామాజిక వుద్యమాల పరంగానూ తెలుగు రాష్ట్రాలలో ప్రముఖమైన ఆమె కుటుంబ నేపథ్యం విజయభారతి గారిని చాలాకాలం పాటు ఫలానా వారి కూతురుగా, భార్యగానే తప్ప వ్యక్తిగా ఆమె సాధించిన ఘనతను కనబడకుండా చేసిందనవచ్చు. మంచి సాహిత్య వాతావరణం, పుస్తకాలు చదువుకునే వెసులుబాటు వున్న విజయభారతి గారు రచనా రంగంలో యెంచుకున్న మార్గం విశిష్టమైనది. ఆమె చేసిన విస్తృత అధ్యయనాలు, రచనలు రాసిలోనూ, వాసిలోనూ యెంతో బలమైనవి. అయినప్పటికీ ఆమెకు పరిశోధకురాలిగా, రచయితగా దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదు. తెలుగు సమాజం ఆమెకు అప్పుపడిరదనే చెప్పాలి. విజయభారతి గారు తమ నిండైన జీవితాన్ని ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోవడం అబ్బురమనిపిస్తుంది. యీ దేశంలో వర్గకుల పితృస్వామిక సమాజం వున్నంతవరకు విజయభారతిగారి రచనల ప్రాసంగికత వుంటుంది. ఆమె వ్యక్తిత్వం వున్నతమైనది. అందరితో నెమ్మదిగా, సున్నితంగా వ్యవహరించడం ఆమెకు అబ్బిన విద్య. ఆమె అరుదైన అపురూపమైన మనిషి. ఆమె విస్తృతమైన పరిశోధనాత్మక రచనల ద్వారా మనకి ఒక గొప్ప సాహిత్య సంప్రదాయాన్ని యిచ్చి వెళ్ళారు. ఆమె రచనా దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడం డా. బి. విజయభారతిగారి అభిమానులుగా మన కర్తవ్యం.