రెండు తరాల పోరాటం – గనుమల జ్ఞానేశ్వర్‌

పూర్వ ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో డా॥ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జీవితం, ఉద్యమంపై తెలుగు ప్రజలకు స్ఫూర్తిని కలిగింపచేయడానికి 1944లో డా॥ అంబేడ్కర్‌ ఆంధ్ర ప్రాంతం పర్యటన, తెలంగాణ ప్రాంతంలో భాగ్యరెడ్డి వర్మ కృషి, అంబేడ్కర్‌ను ప్రోత్సహించడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

అయితే డా॥ అంబేడ్కర్‌ భావజాలం కొనసాగడానికి అంబేడ్కర్‌ జీవిత చరిత్రను తెలుగులో రాసి ప్రజలకు అందుబాటులోకి తేవడం మరో ప్రధాన కారణం. మొట్టమొదటిసారిగా ‘మానవతావాది అంబేడ్కర్‌’ పేరుతో ప్రముఖ బౌద్ధ ఉపాసకులు ఎస్‌. రాష్ట్రపాల్‌ (సికింద్రాబాద్‌) 1968లో అంబేడ్కర్‌ జీవిత చరిత్రను చిన్నదైనా సమగ్రంగా రాసి ప్రచురించారు. ఈ పుస్తకంలోని భాషా దోషాలను విజయభారతిగారు సరిదిద్దారు. ఆ తర్వాత 1969లో డా॥ యెండ్లూరి చిన్నయ్య అంబేడ్కర్‌ జీవిత చరిత్రను రచించి ప్రచురించారు. 1982లో మరో పుస్తకం డా॥ బోయి విజయభారతి రచించిన ‘బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌’ జీవిత చరిత్ర. ఈ పుస్తకం సరళమైన భాషలో ఎక్కువ సమాచారంతో అకడమిక్‌ పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. తొలి ముద్రణ వరంగల్‌లో జరిగింది. తారకంగారి బావగారు కోరుకొండ వెంకటేశ్వర్లు, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆప్‌ ఫ్యాక్టరీస్‌ ముద్రణకు సహాయపడ్డారు.
సంవత్సరంలోపే ఆ పుస్తకాలు అయిపోవడంతో 1983లో ద్వితీయ ముద్రణ హైదరాబాద్‌లో ప్రింట్‌ అయింది. ఈ పుస్తకం ముద్రణ పనిలో ప్రూఫులు దిద్దడంలో నా సహకారం అందించాను. ఈ రెండు ముద్రణలు ‘‘జనపద ప్రచురణలు, జనపద విజ్ఞాన కేంద్రం’’ విజయభారతిగారి స్వంత ప్రచురణ సంస్థ ప్రచురించింది. ఈ సంస్థకు బోయి విజయభారతిగారు ఛైర్మన్‌, బొజ్జా తారకం తదితరులు సభ్యులుగా ఉన్నారు. నేను కార్యదర్శిగా వ్యవహరించాను. ఈ పుస్తకం మూడవ ముద్రణ హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టుకి అప్పగించారు. పుస్తకం వెల పాఠకులకు అందుబాటులో ఉండడంతో, పత్రికా భాషలో రాయడంతో విజయభారతి రాసిన అంబేడ్కర్‌ జీవిత చరిత్ర బహుళ ప్రజాదరణ పొందింది. వేలాది కార్యకర్తలు అంబేడ్కరైట్స్‌ కావడానికి, చైతన్యవంతులు కావడానికి ఈ పుస్తకం దోహదపడిరది.
నాకు విజయభారతిగారితో పరిచయం ఆమె తండ్రి గారైన మహాకవి డా॥ బోయి భీమన్న గారి ద్వారా. 1969లో నేను ప్రభుత్వోన్నత పాఠశాల, ఎర్ర మంజిల్‌ కాలని, హైదరాబాద్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. భీమన్న ఇంటికి మేము ఉండే బాలాపురం బస్తీ చేరువలో ఉండడంతో తరచుగా వారి ఇంటికి వెళ్తుండేవాడిని సాహిత్య చర్చలు, లోకాభి రామాయణం మాట్లాడుకునే వాళ్ళం. 1969లో ఒకరోజు భీమన్నగారి ఇంట్లో (ఐ.సి.85, ఎర్రం మంజిల్‌ కాలని) అలమారుల్లోని పుస్తకాలు వెతికి చదువుతున్న విజయభారతి గారిని భీమన్న గారు పరిచయం చేశారు. అప్పుడు మేడం నిజామాబాదులో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. 1981లో మా బస్తీలో అంబేడ్కర్‌ జయంతి జరిపినప్పుడు తారకంగారిని ముఖ్య వక్తగా ఆహ్వానించడానికి అశోక్‌ నగర్‌ ఇంటికి వెళ్ళినప్పుడు మేడంగారితో కొంతసేపు పుస్తకాల ప్రచురణ, ముద్రణ పని గురించి మాట్లాడాను.
సుప్రసిద్ధ బి.సి. ఉద్యమ నాయకుడు సర్దార్‌ గౌతు లచ్చన్నగారి నేతృత్వంలో 1983లో ‘మహాజన’ వార పత్రిక వెలువడేది. ఆ పత్రికలో నేను ఉప సంపాదకుడుగా, విలేకరిగా పని చేశాను. ప్రభుత్వ సాంస్క్నతిక శాఖ స్పెషల్‌ ఆఫీసర్‌ డా॥ అంతటి నరసింహం కొంతకాలం, ఆ తర్వాత సీనియర్‌ జర్నలిస్టు టి.వి.కృష్ణ (టి.వి.కె) సంపాదకులుగా ఉన్నారు.
ఈ పత్రికలో మహాత్మా జ్యోతిరావ్‌ ఫులే జీవిత చరిత్ర 1983లో సీరియల్‌గా ప్రచురించాం. ధనంజయ్‌ కీర్‌తో ఆంగ్ల గ్రంథానికి బోయి విజయభారతి అనువాదకురాలు. ధనంజయ్‌ కీర్‌తో అనువాదం, ప్రచురణ హక్కులు తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో బొజ్జా తారకంగారు తోడ్పడ్డారు. ‘మహాజన’ వారపత్రిక కొంతకాలానికి ఆగిపోవడంతో మిగతా అనువాదం పూర్తిచేసి 1988లో పుస్తక రూపంలో తీసుకు వచ్చారు. దీనితో పాటు ‘‘రాముని కృష్ణుని రహస్యాలు’’ డా॥ అంబేడ్కర్‌ ఆంగ్ల రచనకు తెలుగు అనువాద గ్రంథం ఆవిష్కరించబడిరది. సభలో గౌతు లచ్చన్న, బి.ఎస్‌.ఎ. స్వామి, ప్రొ॥ జె.వి.రాఘవేంద్రరావు, ప్రొ॥ హరగోపాల్‌ పాల్గొన్నారు. ఫూలే జీవిత చరిత్ర తొలి ముద్రణను జనపద విజ్ఞాన కేంద్రంవారు చేపట్టారు. ఆ తర్వాత హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారికి అప్పగించడం జరిగింది. పత్రికలో ఫూలే జీవిత చరిత్ర సీరియల్‌గా వేద్దామని గౌతు లచ్చన్న తదితర బి.సి. నాయకులకు చెపితే, ఆయనెవరో మాకు తెలియదని అన్నారు. విషయాలు వివరంగా వివరించాక ‘సరే’నన్నారు. మహాత్మా ఫూలే జీవిత చరిత్రను తెలుగు వాళ్ళకు పరిచయం చేయడం, పుస్తక రూపంలో తీసుకు వచ్చిన ఘనత విజయభారతిగారికే దక్కుతుంది.
ఈ కార్యక్రమాల ద్వారా భీమన్న కుటుంబంతో పాటు తారకంగారి కుటుంబంతో కూడా సన్నిహిత పరిచయం ఏర్పడిరది. 2016 వరకు తారకంగారి సాంఘిక, రాజకీయ ఉద్యమాలలో (కారంచేడు నుంచి లక్ష్మింపేట వరకు), డా॥ విజయభారతిగారి సాహిత్య రచనా, ప్రచురణ రంగం 2024 వరకు కొనసాగింది. నా జీవిత ప్రస్థానంలో వాళ్ళతో పనిచేయడం గొప్ప స్ఫూర్తిని, శక్తిని అందించాయి. అంతకుముందు బోయి భీమన్నగారితో 1969 నుంచి 2005 వరకు ఆయన సాహిత్య, రచనా వ్యాసంగం నుంచి స్ఫూర్తిని పొందాను. అనుభవాన్ని గడిరచాను. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 1983లో భీమన్న సాహితీ షష్ఠిపూర్తి సభ, ప్రత్యేక సంచిక తెచ్చి, వెలువరించాం. ఒకసారి తారకంగారితో దేశంలో 1975లో విధించిన ‘ఎమర్జెన్సీ’ గురించి చర్చిస్తూ, జైలులో మీరు రాసిన కవితలు ఎందుకు ప్రచురించలేదు అని అడిగాను. అప్పటికే ఎమర్జెన్సీలో జైలు నుంచి విడుదలయిన సుప్రసిద్ధ కవులు జైలు అనుభవాలను, కవిత్వాన్ని ప్రచురించారు. జైలు కవితల ముద్రణ పని చూస్తానని తారకంగారితో చెప్పాను.
తారకం గారి అలవాట్లు తెలిసిన విజయభారతిగారు ఆయన రాసిన కవితలు ముక్కలు ముక్కలుగా, ఇంట్లో ఎక్కడెక్కడో చిత్తు కాగితాలపై రాసి ఉంచేసిన కవితల్ని ఏర్చి, కూర్చి నాకు ఇచ్చారు. 1983 జనవరిలో అశోక్‌ నగర్‌ ఇంట్లో కూర్చొని ముద్రణ యోగ్య ప్రతిని తయారుచేసి ప్రెస్సుకు ఇచ్చాను. అది ‘‘నది పుట్టిన గొంతుక (జైలు కవితలు)’’ పుస్తకం. ఆవిష్కరణ సభ (సిటి సెంట్రల్‌ లైబ్రరి) ఏర్పాట్లు కూడా చూశాను. ప్రజాకవి కాళోజి ఆవిష్కరించారు. ప్రముఖ కవి కె.శివారెడ్డి, వాసిరెడ్డి సీతాదేవి, బోయి భీమన్న, ఉమా వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేను 1975-1978లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో రెఫరెన్స్‌ సెక్షన్‌ ఇంచార్జిగా నెలకు రూ.75/-లు జీతంతో, లైబ్రరి మేనేజర్‌ గా నెలకు రూ. 200/- జీతంతో పని చేశాను. ఆ తర్వాత గ్రంథాలయ పాలక మండలి సభ్యుడిగా ఎన్నుకోబడ్డాను. అందులో పుస్తకావిష్కరణలు, సాహిత్య సభలు, కవి సమ్మేళనాలు విరివిగా తరచుగా జరుగుతుండేవి. వాళ్ళలో బ్రాహ్మణ భావజాలం ఎక్కువగా కనబడేది. నేను అందులో డా॥ అంబేడ్కర్‌, దళిత కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించాను. అందుకు భాషా నిలయం కార్యదర్శి ఎం.ఎల్‌. నరసింహారావు కూడా సహకరించారు. విజయభారతిగారి అంబేడ్కర్‌ జీవిత చరిత్ర పుస్తకాన్ని మా సహకారంతో భాషా నిలయం తరఫున ఆవిష్కరించడానికి ఒప్పుకున్నారు. 1982లో భీమన్నగారి సుభేలా నికేతన్‌, సాహిత్య, సాంస్క్నతిక ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో సభ జరిగింది. మహాకవి దాశరథి, కొలకలూరి ఇనాక్‌, బోయి భీమన్న, ఆచార్య దివాకర్ల వేంకటావధాని, జస్టిస్‌ కె. పున్నయ్య అతిథులుగా పాల్గొన్నారు. కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్‌-ఛాన్సలర్‌ ప్రొ॥ ఎం.ఏ.బిల్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. భీమన్న గారి సుభేలా నికేతన్‌ సంస్థ తరఫున జల్లి రాజగోపాలరావు, నాతి నారాయణమూర్తి చొరవ చూపారు.
బోయి విజయభారతిగారి మరో అద్వితీయమైన కృషి డా॥ బి.ఆర్‌. అంబేడ్కర్‌ రచనలు-ప్రసంగాలు ఆంగ్ల సంపుటాలను తెలుగులోకి అనువదించే ప్రాజెక్టు. డా॥ అంబేడ్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ కె.ఎస్‌.ఆర్‌. మూర్తి, ఐ.ఎ.ఎస్‌ చొరవతో డి.మురళీకృష్ణ ఐఏఎస్‌, పి.సైదులు, పి.రత్నం, పి.అంబేడ్కర్‌ ఇతర ట్రస్ట్‌ సభ్యుల ప్రోత్సాహంతో అనువాదం పని ప్రారంభమయింది. బోయి విజయభారతిగారు చీఫ్‌ ఎడిటర్‌గా వందమంది అనువాదకులు, రచయితలతో పని కొనసాగింది. డా॥ బోయి భీమన్న, డా॥ టి.వి. నారాయణ, జె.వీరాప్వామి, జస్టిస్‌ కె. పున్నయ్య, సలహాదారులుగా ఉన్నారు. గనుమల జ్ఞానేశ్వర్‌ సమన్వయ కర్త. విజయభారతిగారు అప్పటికి ఆంగ్లంలో వచ్చిన 11 సంపుటాల అనువాదం పనికి సలహాలు, సూచనలు, సంపుటాల కేటాయింపు, సంపాదకుల ఎంపిక, అనువాదకులకు మార్గదర్శకాలు అందజేశారు. అనువాదం పని, ముద్రణ వివరాలతో 37 లక్షల ప్రాజెక్టు తయారయింది. వాటి ప్రచురణకు మహారాష్ట్ర ప్రభుత్వం ట్రస్టుకు హక్కులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఎన్‌. జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పని పూర్తిచేయడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి బాధ్యత అప్పగించింది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న కాకి మాధవరావు, ఐ.ఎ.ఎస్‌ ప్రభుత్వం పక్షాన ఈ పని వెంటనే కార్యరూపం దాల్చడానికి కృషి చేశారు. విజయభారతిగారు సంపాదకులుగా డా॥ అంబేడ్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, అంబేడ్కర్‌ మెమోరియల్‌ ట్రస్టుకి కేటాయించిన 1, 4, 10, 14 సంపుటాల అనువాదిత గ్రంథాలు వెలువడ్డాయి. విజయభారతిగారితో పాటు సహ సంపాదకులుగా బొజ్జా తారకం, మొక్కపాటి సుమతి, డా॥ యార్లగడ్డ నిర్మల, అనిసెట్టి శాయికుమార్‌, ప్రొ॥ సుభాష్‌ చంద్రరెడ్డి వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం నాటి వైస్‌-ఛాన్సలర్‌ డా॥సి. నారాయణరెడ్డి మిగతా సంపుటాల అనువాదం పనిని వివిధ విశ్వవిద్యాలయాలకు అప్పగించారు.
రాముని కృష్ణుని రహస్యాలు
డా॥ అంబేడ్కర్‌ రచనలు- ప్రసంగాలలో నాలుగవ సంపుటం 1991లో ఆవిష్కరించిన తర్వాత ఈ పుస్తకంలోని 24వ రిడిల్‌ ‘‘ది రిడిల్‌ ఆఫ్‌ రామా అండ్‌ కృష్ణా’’ తొలగించాలని, పుస్తకాన్ని నిషేధించాలని పెద్ద ఎత్తున లక్షల మందితో ఆర్‌.ఎస్‌.ఎస్‌, తదితర హిందుత్వ భావజాల సంస్థలు నిరసన ప్రదర్శనలు చేశాయి. ముంబయి నగరం అట్టుడికిపోయింది. వారికి దీటుగా దళిత్‌ పాంథర్స్‌, అంబేడ్కరైట్స్‌ సంఘాలు ప్రజా ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం పుస్తకాన్ని నిషేధించలేకపోయింది. 24వ రిడిల్‌ లోని భావాలతో ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని రబ్బరు స్టాంపు కొట్టి అమ్మారు. దానితో ఉద్యమం చల్లబడిరది. ఆ రిడిల్‌లోని రాముడి గురించి బొజ్జా తారకం, కృష్ణుని గురించి బోయి విజయభారతి అనువదించారు. ‘‘రాముని కృష్ణుని రహస్యాలు’’ పేరుతో పుస్తకం అచ్చయింది. ‘‘హిందూ మతంలో చిక్కుముడులు’’ పేరుతో వెలువడిన నాలుగవ సంపుటానికి బొజ్జా తారకం, విజయభారతి గార్లు సంపాదకులుగా వ్యవహరించారు.
డా॥ అంబేడ్కర్‌ (1982), మహాత్మ జ్యోతిరావు ఫులే (1987), మహిళల హక్కులు- డా॥ అంబేడ్కర్‌ దృక్పథం (2017), భారతీయ సాహిత్య నిర్మాతలు- భోయి భీమన్న (2017) పుస్తకాలతో పాటు తన సునిశిత పాండిత్య ప్రకర్షణతో రామాయణ, మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాలను నిశితంగా విశ్లేషిస్తూ, పునఃపరిశీలిస్తూ, వాటిలోని మాయమర్మాలను ఎత్తి చూపుతూ, దళిత బహుజన కోణంలో సత్య హరిశ్చంద్రుడు (2002), షట్చక్రవర్తులు (2003), దశావతారాలు (2003), వ్యవస్థను కాపాడిన రాముడు (2005), పురాణాలు-మరో చూపు (2015), నరమేధాలు- నియోగాలు (2019), ఇతిహాసాలు- రామ కథ (2023), ఇతిహాసాలు- మహాభారతం (2023) వంటి పుస్తకాలు రచించారు.
డా॥ బి.ఆర్‌. అంబేడ్కర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌
ఈ ట్రస్టును 1984లో స్థాపించారు. డా॥ కె.లింగయ్య, బొజ్జా తారకం, డా॥ఎస్‌.మాధవరావు, డా॥ కె.గోపాలరావు, ఎం.జె.సుందరరావు, ఎన్‌.వి.రెడ్డి, బత్తుల పున్నయ్య, శంకర్‌ సింగ్‌, పి.రామచంద్రారెడ్డి స్థాపక సభ్యులు. వీరు గనుమల జ్ఞానేశర్‌ను కార్యదర్శిగా ఎంపిక చేశారు. విజయభారతిగారు ట్రస్ట్‌ సీనియర్‌ సభ్యురాలిగా, ట్రస్ట్‌ ఉపాధ్యక్షులుగా, సలహాదారులుగా సేవలందించారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 1987లో నిర్వహింపబడిన ప్రథమ అఖిల భారత దళిత రచయితల మహాసభల సందర్భంగా వెలువడిన ప్రత్యేక సంచికలో ‘హూ ఇస్‌ హూ’ (1888-1994)లో వెయ్యి మంది అఖిల భారత దళిత రచయితలు, కవులు, జర్నలిస్టుల సంక్షిప్త చరిత్ర (బయో డేటా)ను విజయభారతిగారు రూపొందించారు. ఇందుకు బొజ్జా మహిత కూడా సహకరించారు. విజయభారతిగారు మహాసభల నిర్వహణకు సలహాలు, సూచనలు అందజేశారు. సంచిక సంపాదక మండలిలో ఉన్నారు.
హైదరాబాద్‌లో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా శతజయంతి రెండు రోజుల సదస్సు 1995లో జరపడానికి, ‘‘దళిత సాహిత్య సమాలోచన రెండు రోజుల సదస్సు’’లకు పద్మభూషణ్‌ డా॥ బోయి భీమన్న శతజయంతి (2012) ఉత్సవాలకు విజయభారతి గారి మార్గనిర్దేశకత్వం, సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. పుస్తకావిష్కరణ సభలు, అంబేడ్కర్‌ స్మారకోపన్యాసాల వక్తల ఎంపికలోనూ ఆమె ఎంతో తోడ్పడ్డారు.
జనపద విజ్ఞాన కేంద్రం
విజయభారతిగారు ఛైర్మన్‌గా వారి కుటుంబ సభ్యులు తదితరులు సభ్యులుగా ఈ కేంద్రాన్ని 1983లో స్థాపించారు. గనుమల జ్ఞానేశ్వర్‌ దీనికి కార్యదర్శి. విజయభారతిగారు పుస్తకాలు ప్రచురణ నిమిత్తం దీనిని స్థాపించారు. రిజిష్టర్‌ కూడా చేశారు. ఈ సంస్థ తరపున ప్రచురించిన పుస్తకాలు:
(1) బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ (జీవిత చరిత్ర)- డా॥ బోయివిజయభారతి, (2) నది పుట్టిన గొంతుక- బొజ్జా తారకం, (3) మహాత్మా జ్యోతిరావు ఫులే (జీవిత చరిత్ర) – మూలం: ధనంజయ కీర్‌ అనువాదం- డా॥ బోయి విజయభారతి, (4) రాముని కృష్ణుని రహస్యాలు, మూలం: డా॥బి.ఆర్‌.అంబేడ్కర్‌, అనువాదం: బొజ్జా తారకం, డా॥ బోయి విజయభారతి, (5) ఆకలి కేక (కవితా సంపుటి)- జల్లి రాజగోపాలరావు, (6) వాల్మీకి చేత రామాయణం ఎందుకు వ్రాయించారు (విమర్శ)- వజ్రపు సాంబమూర్తి, (7) ద్రౌపది కవితలు- బోయి ద్రౌపది, (8) నాలాగే గోదావరి (కవితా సంపుటి)- బొజ్జా తారకం, (9)‘కాన్స్టిట్యూషన్‌ కూప్‌ డి ఎటాట్‌ (ఫ్రెంచి పదం) (రాజ్యాంగ సమీక్షపై ఆంగ్ల గ్రంథం)- బొజ్జా తారకం, (10) జల్లి రాజగోపాలరావు రచనలు (సమగ్ర సంపుటి), (11) నాగ భారతం- వజ్రపు సాంబమూర్తి మొదలైనవి.
సురవరం ప్రతాపరెడ్డి గారు ‘‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’’ పుస్తకం రాస్తే, విజయ భారతిగారి పిహెచ్‌.డి. సిద్ధాంత గ్రంథం ‘‘దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం- సంఘ జీవితము’’. సాంఘిక చరిత్రపై ఇది రెండవ గ్రంథం.
విజయభారతిగారు ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర, భాగ్యనగర్‌, ‘నలుపు’, ‘నీలిజెండా’, ‘మానవి దళిత శక్తి’, పత్రికలకు పరిశోధనా వ్యాసాలు అనేకం రాశారు. అంబేడ్కర్‌ అనుయాయి బొజ్జా అప్పలస్వామి జీవితం-ఉద్యమానికి సంబంధించిన సమాచారం ఎవరూ రికార్డు చేయలేదు. ఆ పరిస్థితుల్లో నేను, విజయభారతిగారి ప్రోత్సాహంతో అప్పల స్వామి గారిని మూడు గంటల పాటు ఆడియో ఇంటర్వ్యూ చేశాను.
ఆంధప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడక పూర్వం దళిత, ఆది ఆంధ్ర ఉద్యమాల గురించి ఆయన వివరంగా చెప్పారు. ప్రొ॥ యాగాటి చిన్నారావు 1956కు పూర్వం దళిత ఉద్యమంపై జె.ఎన్‌.యు (ఢల్లీి)లో పిహెచ్‌.డి. చేశారు. ఆయనకు ఈ ఆడియో ఇంటర్వ్యూ ఎంతో
ఉపయోగపడిరది. దానికి కొనసాగింపుగా 1956 నుంచి 1995 వరకు దళిత ఉద్యమంపై ప్రొ॥ కె.వై.రత్నం పిహెచ్‌.డి. చేశారు.
బొజ్జా తారకం గారి సారథ్యంలో జరిగిన ఆంధప్రదేశ్‌ దళిత మహాసభ, బహుజన సమాజ్‌ పార్టీ, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, అంబేడ్కర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌, పౌరహక్కుల ఉద్యమాలకు, కారంచేడు నుండి లక్షింపేట వరకు జరిగిన అన్ని దళిత ప్రజా ఉద్యమాలకు విజయభారతిగారు చేయూతనిచ్చారు, ఆర్థిక సహాయం చేశారు. కారంచేడు ఉద్యమం, కేసు సందర్భంగా తారకం గారు చీరాలకు అనేకసార్లు వెళ్ళవలసి వచ్చేది. ఇచ్చిన డబ్బులు మా ఇద్దరి ప్రయాణానికి బస్సు, ట్రైన్‌ టిక్కెట్లు కొనడానికి సరిపోకపోతే తారకం గారు, విజయభారతిగారిని అడిగి తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆమె సహకారంతోనే తారకం గారు అనేక ఉద్యమాలలో స్వేచ్ఛగా పాల్గొన గలిగారు. 1989లో నిజాం కాలేజి గ్రౌండ్‌లో బి.ఎస్‌.పి. ఆవిర్భావ సభకు, కాన్సీరామ్‌ నాయకత్వంలో ఢల్లీిలో 1991లో మండల్‌ కమీషన్‌ సీఫారసులు అమలు చేయాలని బోట్స్‌ క్లబ్‌ వద్ద జరిగిన 22 రోజుల ధర్నాలో వారం రోజులు తారకం గారితో పాటు విజయభారతి గారుపాల్గొన్నారు. నేను చివరి 10 రోజులు వారితో పాటు పాల్గొన్నాను.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. చేసిన తొలి దళిత మహిళగా విజయభారతి కాకూడదని జరిగిన కుట్రలాగా, తెలుగు అకాడమిలో దళిత మహిళ డైరెక్టర్‌ కాకూడదని తోటి ఉద్యోగులు ప్రయత్నాలు చేసారు. ఈ విషయాన్ని అప్పటి చీఫ్‌ సెక్రటరీ కాకి మాధవరావు గారి దృష్టికి తీసుకుని వెళ్తే, ఆయన విద్యాశాఖ కార్యదర్శిని పిలిచి అకాడమి ఉద్యోగుల సీనియార్టీ లిస్టును తెప్పించుకున్నారు. విద్యాశాఖ కార్యదర్శిని లిస్టు ప్రకారం ఎవరు సీనియర్‌ అని అడిగితే ‘విజయభారతి’ అని చెప్పక తప్పలేదు. వెంటనే మాధవరావు గారు విజయభారతి గారిని అకాడమి డైరెక్టర్‌గా నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శిగా ఆదేశాలు ఇచ్చారు. దానితో అకాడమి వారి ప్రయత్నాలు విఫలమై నిర్ఘాంతపోయారు. అప్పుడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, అకాడమి పాలక మండలి అధ్యక్షులూ అయిన దళిత మంత్రి అకాడమిలో విజయభారతికి సహకరించలేదు. డైరెక్టర్‌గా విజయభారతి అనేక ప్రాజెక్టులు చేపట్టి అకాడమీ ప్రతిష్ఠతను పెంచారు.
విజయభారతిగారు కీర్తి ప్రతిష్ఠలకు, గుర్తింపు కోసం ఎన్నడూ ప్రాకులాడలేదు. స్వయంకృషితో, స్వయం ప్రతిభతో రాణించింది. కష్టాలను, బాధలను, అయిష్టాలను, సమస్యలను, అసంతృప్తిని పైకి కనబడకుండా సహనంతో, పరిష్కరించుకుంటూ ధైర్యంగా బతికింది. తన పిల్లలు మహిత, రాహుల్‌లను ప్రయోజకులుగా తీర్చి దిద్దింది.
బొజ్జా తారకం ట్రస్ట్‌
విజయభారతిగారు బొజ్జా తారకం ట్రప్ట్‌ చైర్మన్‌గా తారకం గారి జయంతి- వర్ధంతితో పాటు అముద్రిత గ్రంథాలను ప్రచురించింది. కొన్ని పుస్తకాలను ఆంగ్లంలోకి అనువదింప చేసింది. దాదాపు 20కి పైగా పుస్తకాలను వెలువరించారు. 84 వ్యాసాలతో తారకంగారిపై రెండు స్మారక సంచికలు వెలువరించింది. ఈ విషయంలో విజయభారతిగారికి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ నిర్వాహకురాలు గీతా రామస్వామి, షేర్‌ మిర్రర్‌ కుఫిర్‌, అనుపమ ప్రింటర్స్‌ రమణమూర్తి అందించిన సహాయ సహకారాలు విజయభారతి, బొజ్జా తారకంల పుస్తకాల ముద్రణ, పునర్ముద్రణ విషయంగా వారు పడ్డ శ్రమ గణించతగ్గది.
విజయభారతిగారు నిర్యాణం చెందడానికి మూడు రోజుల ముందు ఫోన్‌ చేసి నేను ప్రూఫ్‌లు దిద్ది, ముద్రించవలసిన రెండు పుస్తకాల గురించి మాట్లాడిరది. పనిని ఆలస్యం చేసినందుకు నన్ను మందలించింది. విజయభారతి గారు పరుష పదాలను మాట్లాడదు. సుతి మెత్తగా, నెమ్మదిగా వినపడీ వినబడనట్లు సూటిగా, కరాఖండిగా మాట్లాడే స్వభావం ఆమెది.
విజయభారతిగారి నిర్యాణంతో రెండు తరాలుగా తెలుగు రాష్ట్రాల సాంఘిక, రాజకీయ, సాహిత్య ఉద్యమాలతో, డా॥ అంబేడ్కర్‌ దళిత, బహుజన ఉద్యమాలతో మమేకమై జీవించిన ప్రముఖ కటుంబాలతో నాకు ఉన్న కార్యాచరణ సంబంధాలకు ‘‘విశ్రాంతి’’ తెర దించినట్లయింది. తెలుగునాట ఉద్యమాలకు వెలితి ఏర్పడిరది.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.