విజయభారతి గారు సామాజిక సాహిత్యకారుల కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి బోయి భీమన్నగారు. వీరు తారకంగారి అర్ధాంగి. అటు తండ్రి ఇటు భర్త వీరి కంటే భిన్నంగా తన రచనా వ్యాసాంగాన్ని, సామాజిక అవగాహనని తనకు తానుగా రూపొందించుకున్నారు. నిజామాబాదులో డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ హైదరాబాదులోని తెలుగు అకాడమీకి వచ్చారు.
అప్పటికే నేను తెలుగు అకాడమీలో పరిశోధన విభాగంలో ఉద్యోగిగా చేరాను. అప్పుడు ఉన్నతాధికారులుగా లబ్దప్రతిష్టులైన డాక్టర్ బూదరాజు రాధాకృష్ణగారు, డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు, సుప్రసిద్ధ కథా రచయిత తాళ్లూరి నాగేశ్వరరావుగారు, డా. అక్కిరాజు రమాపతి రావుగారు, డా. పోరంకి దక్షిణామూర్తిగారు పనిచేస్తుండేవారు. రీసెర్చ్ ఆఫీసర్‌గా ఆచార్య జి. చెన్నకేశవరెడ్డిగారు, డా. అప్పం పాండయ్యగారు పనిచేస్తుండేవారు. అభ్యుదయ సాహిత్యం, విప్లవ సాహిత్యం, పరిశోధన రంగం చాలా చురుగ్గా పనిచేస్తూ ఉండేవి. అదిగో అప్పుడు విజయభారతిగారు తెలుగు అకాడమీలో ప్రవేశించారు. బోయి భీమన్నగారు అప్పటికే నాకు పరిచయం. జ్ఞానేశ్వర్‌గారు బోయ భీమన్న ప్రత్యేక సంచికకి నాతో భీమన్నగారి ఇంటర్వ్యూ చేయించారు. ఆ సంచిక తేవడంలో నేను పాలుపంచుకున్నాను.
విజయభారతిగారు రీసెర్చ్ ఆఫీసర్ హోదాలో ఉండేవారు. ఆమె ఒంటి చేత్తో తెలుగు సాహిత్య పదకోశం తయారు చేశారు. దీనిని తెలుగు అకాడమీ రెండు భాగాలుగా ప్రచురించింది. అప్పుడే పూర్తయిన నా తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజా సాహిత్యం పరిశోధన గ్రంథంలో పేర్కొన్న ప్రజాకవులందరినీ పట్టుబట్టి సాహిత్య పదకోశంలో చేర్చారు. నా ూష్ట్ర.ణ ్‌ష్ట్రవంఱంలో పేర్కొన్న అజ్ఞాత కవులు, అనామక కవుల వివరాలను మొదటిసారిగా పుస్తకంలోకి ఎక్కించారు. అలాంటి వారిలో వయ్య రాజారాం, సుద్దాల హనుమంతు, అడ్లూరి అయోధ్య రామ కవి వంటి వారు ఎందరో ఉన్నారు. రాను రాను విజయభారతిగారు సామాజికంగా, సాహిత్య పరంగా నిరంతరం కృషి చేసారు. అనామకంగా ఉన్న వాళ్ల గురించి, అలాంటి సాహిత్యం గురించి లోతైన అధ్యయనం ప్రారంభించారు. తనదైన రీతిలో సమాంతర సాహిత్యాన్ని, పురాణ సాహిత్యాన్ని అధ్యయనం చేసి కొత్త వెలుగులు నింపి రచనలు చేశారు. పుస్తకాలు రచించారు. ఆ కోవలో ఆమె తనదైన ముద్రను వేశారు. అటు బోయి భీమన్న, ఇటు తారకం గారల ప్రభావం ఏదీ లేకుండా తానే ఒక ప్రభావశీలిగా, నమూనాగా నిలిచిపోయారు. అది ఆమె వ్యక్తిత్వం.
ఆమె నిగర్వి. మితభాషి. మాట్లాడిన ప్రతి మాట ఎంతో విలువైనది. మేం సేకరించి సంపాదకత్వం వహించిన జాంబ పురాణం గ్రంథం ఆవిష్కరణ సభలో ఆమె ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. ఎన్నడు కూడా తన ఆలోచనలకు వ్యతిరేకమైన విషయాలను పట్టించుకోలేదు. అట్లని కావాలని విమర్శించలేదు. నిశ్శబ్దంగా పరిశోధన చేస్తూ, అధ్యయనం చేస్తూ, నిషితమైన అవగాహనని పెంచుకుంటూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. ఆమె ఫేస్‌బుక్‌లో ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు. ఆడంబర పదజాలానికి ఆమె వ్యతిరేకం. నిజాయితీగా రాసే రచనకి అభిమాని. రాసిన ప్రతి వాక్యానికి ఆమె జవాబుదారీగా ఉండేవారు. ఆమె మరణం సమాంతర సాహిత్యానికి, చరిత్రకు, సంస్కృతికి తీరని లోటు. మన కళ్ళ ముందు ఒక లోతైన అధ్యయనశీలిని, రచయితను కోల్పోయాం.