విజయభారతిగారితో మొదటి పరిచయం 1989 సంవత్సరంలో! అప్పుడే తారకంగారు ఎడిటర్‌గా నలుపు పత్రిక ప్రారంభమయిన కాలం. అన్వేషిలో నేను ఒక రిసెర్చ్ ప్రాజెక్టులో ఫీల్డ్ అసోసియేట్‌గా చేరిన సందర్భం. అందులో భాగంగా రాష్ట్రంలో వున్న ముఖ్యమైన లైబ్రరిలకి వెళ్లి నూటయాభై సంవత్సరాలనాటి మహిళల గురించి వచ్చిన పత్రికలనూ, పుస్తకాలనూ వెతికి వాటిని భద్రపరచటం నా పని.
సరిగ్గా గుర్తు లేదు కానీ, ఒక మీటింగ్ ఆహ్వాన పత్రాలు పట్టుకుని నేను కొంతమంది ఇళ్లకు వెళ్లి ఇచ్చే బాధ్యత తీసుకున్నాను. అప్పట్లో పోస్టల్ సర్విస్ తప్పించి కొరియర్ సర్వీసులు పెద్దగా లేవు. అశోక్‌నగర్ వెళ్లాలంటే అప్పటికీ ఇప్పటికీ 40వ బస్ నెంబర్ మాత్రమే దిక్కు. వో రోజు పొద్దున్నే కోఠీ విమెన్స్ కాలేజీ దగ్గర 40 నెంబర్ బస్ ఎక్కి 9 గంటలలోపు అశోక్ నగర్‌లో వుంటున్న తారకంగారి ఇంటికి వెళ్లాను. అప్పటికే తారకంగారు పరిచయం వున్నారు. విజయభారతిగారిని మొట్టమొదటిసారి చూడటం. ఆవిడ కవి బోయి భీమన్నగారి అమ్మాయని కూడా నాకు ఆ రోజే తెలిసింది. అశోక్‌నగర్ నాలాకి దగ్గరలో వుండే ఆ ఇల్లు, ఆ పరిసర ప్రాంతాలూ నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. తారకంగారు ఎవరో క్లయింట్లతో మాట్లాడుతున్నారు. అందరిళ్లలో లాగానే విజయభారతిగారు వంటింట్లో ఏదో పనిలో తలమునకలయ్యి వున్నారు. నేను తారకంగారిని విష్ చేసి మేడమ్‌ని పలకరిస్తా అని డైరెక్ట్‌గా కిచెన్ దగ్గరికి వెళ్లి పలకరిస్తే, అంత పని వొత్తిడిలో వుండి కూడా పరిచయం లేని నన్ను ఆప్యాయంగా పలకరించారు. నిజానికి పొద్దున్నే ఆడవాళ్లు వంద పనులు ఏకకాలంలో గిరాగిరా చేయాల్సి వుంటుంది. ఇంకా బయట కూడా పనిచేసే వాళ్లయితే ఆ వొత్తిడి ఎలా వుంటుందో అనుభవించే వాళ్లకే అర్థం అవుతుంది. ఆ టైమ్‌లో ఎవరన్నా అడ్డు వస్తే అట్లకాడతో వాత పెట్టాలనిపిస్తుంది. కానీ అక్కడున్నది విజయభారతిగారు కదా! ఆవిడ అలా చేయరని మనకు ఆవిడను చూస్తేనే అర్థమవుతుంది. అంతటి మెత్తటి మనిషి ఆవిడ. అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్లి ఆవిడని పలకరించి నేను తెచ్చిన ఇన్విటేషన్ ఇచ్చి, నేను చేస్తున్న ప్రాజెక్టు పని గురించి చెప్పటం, ఆవిడ నవ్వుతూ విని ‘మంచి పని చేస్తున్నావమ్మా’ అని ఆడపిల్లలు ఇలా చొరవగా వుండటం, బయట వూర్లకు వంటరిగా వెళ్లటం, పనిచేయటం తనకు చాలా నచ్చే విషయమని అన్నారు. ఆడపిల్లల పట్లా, రచనల పట్లా, భిన్న కార్యక్రమాల పట్ల విజయభారతిగారి ఆసక్తి అలాంటిది. వాళ్ళింటికి వెళ్లిన వెంటనే నాకు బాగా ఆకర్షించిన విషయం ఇంటి చుట్టూ చాలా చెట్లను పెంచుతున్నారు. ఎవరు వీటిని చూస్తారు అని తారకంగారిని అడిగితే, అంతా ఆవిడే చూసుకుంటారని చెప్పారు. అంటే, ఇల్లు చూసుకోవటం, పిల్లల అవసరాలూ, ఉద్యమ నాయకుడిగా, లాయర్‌గా వున్న భర్త కోసం నిరంతరం వచ్చేపోయే జనాన్ని చూసుకుంటూనే ఇంకో పక్క ఉద్యోగ బాధ్యతలు, ఇష్టమైన రచనా వ్యాసంగంతో పాటు మొక్కలను అపురూపంగా పెంచటం ఆవిడలో పైకి కనిపించని అపురూపమైన కార్యదక్షతకు నిదర్శనం. మొక్కలు పెంచటం తనకు చాలా ఇష్టమని చెప్పారు. అశోక్ నగర్ నుంచీ టోలిచౌకీకి ఆ తర్వాత మళ్లీ అశోక్ నగర్‌కి వచ్చినా గానీ ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు వాళ్ళింటికి వెళ్లినా ముందుగా దర్శనమిచ్చేది పచ్చగా తలలూపుతూ ఆహ్వానించే మొక్కలే!
విమెన్ రైటింగ్ ఇండియా తెలుగు పుస్తకావిష్కరణ చేయాలని అడిగినప్పుడు నామీద చాలా పెద్ద బాధ్యత పెడుతున్నారు అని చెప్పారు. ఆ సభకు వచ్చి ఆ సంకలనాన్ని ఆవిష్కరించి, స్త్రీల రచనల చారిత్రిక అవసరాన్ని వెలికితీయటం ఎంతో ముఖ్యమైన విషయం అని తన ప్రసంగంలో చెప్పారు. విజయభారతి గారి పరిచయం పెరిగేకొద్దీ ఆవిడ చేసిన రచనల ప్రాముఖ్యత బాగా అర్థం అయ్యేది. అంబేడ్కర్ జీవిత చరిత్ర అయినా, జ్యోతిరావ్ ఫూలే జీవిత చరిత్ర అయినా, పురాణాల మీద సాధికారికంగా ఆవిడ చేసిన విమర్శనాత్మక విశ్లేషణ అయినా తెలుగు సమాజానికి ఒక కొత్త చూపుని, అవగాహనను అందించాయి. అస్తిత్వ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలబడిన రచనలు అవి. మరో ముఖ్యమైన పరిశోధన తెలుగు భాషలో పారిభాషిక పదకోశం తయారుచేయటం. తెలుగు అకాడమీలో రిసెర్చ్ ఆఫీసర్‌గా, ఆ తర్వాత డైరెక్టర్‌గా తెలుగు భాషా వికాసం కోసం ఆవిడ ఎంతో కృషి చేశారనేది ఎంతో ముఖ్యమైన అంశం. ఏ భాష అయినా నిలబడాలంటే, ఆ భాషకు సంబంధించిన పరిశోధన నిరంతరం జరుగుతూ వుంటేనే, ప్రభుత్వాలు ఆ విషయం మీద శ్రద్ధ పెడితేనే, ఆయా విషయాల్లో నైపుణ్యం, సాధికారత వున్న వ్యక్తులకు బాధ్యత అప్పజెప్పినప్పుడే భాషావికాసం సాధ్యమవుతుంది. నిశ్శబ్ధంగా సుతిమెత్తగా కనిపించే విజయభారతి గారిలో ఒక నిష్కర్షమైన పరిశోధకురాలు వున్నారు. నిజానికి ఆవిడ పురాణాల మీద చేసిన వాఖ్యానాలు ఇంగ్షీషులోకి అనువాదమయి వుంటే ఆవిడ కేవలం తెలుగు సమాజానికే పరిమితమయిన రచయిత్రిగా వుండేవారు కాదు. వేరే భాషల నుంచీ అనువాదం ద్వారా తెలుగులోకి విస్తృత సాహిత్యం వచ్చింది కానీ, తెలుగు నుంచీ ఇంగ్షీషులోకి, ఇతర భాషల్లోకీ తెలుగు సాహిత్యం వెళ్లకపోవటం ఇప్పటికీ చాలా లోటుగానే వుంది. ఇప్పుడిప్పుడే కొంత ప్రయత్నాలు మొదలయ్యాయి గానీ అవి సరిపోవు. కొత్త పబ్లికేషన్స్ మొదలవ్వాలి కానీ ఆర్థిక, సాంకేతిక వనరులు లేకుండా అది సాధ్యమయ్యే విషయం కాదు. విజయభారతిగారు జీవించి వున్న సమయంలోనే ఆవిడ రచనల మీద ఏదైనా యూనివర్సిటీలో సమాలోచన జరిగివుంటే కొత్తగా పరిశోధనలోకి వచ్చే విద్యార్థులతో తన అనుభవాన్ని, ఆలోచనలను ఆవిడ పంచుకోగలిగి వుండేవారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదు, ఎవరైనా ఇప్పుడైనా ఆ బాధ్యతని తీసుకోవచ్చు.
విజయభారతిగారిలో నాకు బాగా నచ్చిన మరో విషయం, ఆవిడా తనకంటే చాలా చిన్న వయసువారితో కూడా చాలా గౌరవంగా మాట్లాడటం. ఎక్కడా చిన్నచూపు లేకపోవటం. ఎదుటివాళ్లు చేసే కృషిని మెచ్చుకోవటం, అలానే ప్రతి ఒక్కరిపట్లా మానవీయ స్పందనతో వుండటం. బోయి భీమన్నగారు చనిపోయినప్పుడు ఎర్రమంజిల్ కాలనీకి వెళ్లినప్పుడు ‘మీరు శ్రమ తీసుకుని రావటం చాలా అభిమానంగా అనిపిస్తోంది’ అని చెప్పారు. ఆరోగ్యం దెబ్బతిని తారకంగారు కోలుకుంటున్న సమయంలో ఒకసారి పిలిస్తే విజయనగర్ కాలనీలో అమన్‌వేదిక సంస్థ నడుపుతున్న స్నేహఘర్ అబ్బాయిల హోమ్‌కి ఇద్దరూ కలిసి వచ్చి వారితో కాసేపు గడిపి వెళ్లారు. అక్కడికి పిలిచినందుకు ఎంత సంతోషపడ్డారో, ‘ఎంత మంచి పని చేస్తున్నారమ్మా మీరందరూ’ అంటూ కలిసినప్పుడు చాలా సార్లు గుర్తు చేసుకునేవారు. 2015లో నేను తారకం గారితో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆరోజు ‘ఆయనకు మాట్లాడుతుంటే సమయం తెలియదు, ఎక్కువ సేపు మాట్లాడనివ్వకండి, తర్వాత తలనొప్పితో బాధపడతారు’ అని చాలా ఆరాటపడిపోయారు. ఆ తర్వాత ఆరేడు నెలల్లో ఆయన చనిపోయారు. తారకంగారు చనిపోయిన తర్వాత బాగా దిగులుపడ్డారు గానీ, ఆయన రచనను బయటకు తెచ్చే పని ద్వారా తనని తాను నిభాయించుకున్నారు. ఫేస్‌బుక్ అందరి పోస్ట్‌లనూ ఫాలో అయ్యేవారు. ఆవిడ ఆ వయసుకి ఫేస్‌బుక్‌లో యాక్టివ్ గా వుంటే సంతోషమనిపించేది. నాకు సరిగా వినిపించటం లేదు కదమ్మా, ఇక్కడయితే అందరి గురించీ తెలుస్తుంది అనేవారు. కోవిడ్ సమయంలో మా అమ్మ చనిపోయినప్పుడు, ఆ తర్వాత ఒక సంవత్సరంన్నర తర్వాత మానాన్న చనిపోయినప్పుడు ఈ రెండు సందర్భాల్లోనూ ఫోన్ చేసి ‘మీరు అన్నిటికీ వస్తారు, మీ దగ్గరికి వచ్చి పలకరించే పరిస్థితి లేదు ఏమనుకోకండీ, దిగులు పడకండీ’ అని చెప్పినప్పుడు గుండె తడితడిగా అయిపోయింది. తోటి మనుషుల పట్ల ఆవిడ చూపించే మమకారం చాలా గొప్పగా వుండేది. ఆవిడ బేగంపేట వాళ్ల అబ్బాయి రాహుల్ ఇంటికి వెళ్లిన తర్వాత ఒకే ఒక్కసారి, సతీష్ చందర్‌గారి పుస్తకావిష్కరణ సభకు రవీంద్రభారతికి వచ్చినప్పుడు కలిశాను. ఆ తర్వాత కూడా అడపాదడపా కొన్ని సమావేశాలకి ఆవిడ బయటికి వచ్చినప్పటికీ నేను ఆ సమయంలో సిటీలో లేకపోవటంతో కలవటం కుదరలేదు. నెలలో ఒకటి రెండు సార్లయినా ఫోన్ చేసేవారు. గెడ్డం రaాన్సీ, నేను వెళ్లి కలవాలని చాలాసార్లు అనుకున్నాం కానీ, వీలవలేదు. ఆ లోటు ఎప్పటికీ ఇంక తీరేది కాదు. జోహార్ విజయభారతిగారు!