దశావతారాల్లో హేతువాద దృక్పథం – డాక్టర్‌ తిరునగరి దేవకీ దేవి

తారీఖులు దస్తావేజులు ఇవి కావోయ్‌ చరిత్రకర్ధం అనే శ్రీశ్రీ అభిప్రాయం వాస్తవమే అయినా అవి ఎన్నెన్నో విషయాలను ప్రోది చేసి ఇస్తాయి అనేది కూడా వాస్తవమే. అది విజయభారతి గారి రచనల్లో మరింత స్పష్టం. విజయభారతి గారు 1941లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించారు. ప్రముఖ కవి బోయి భీమన్న గారి కూతురు.

ఆత్మాభిమానం, ఆత్మనిర్భరం, ఆత్మస్థయిర్యం, సామాజిక దృక్కోణం గల నాగరత్నమ్మ గారి కూతురు కూడా. హక్కుల పరిరక్షణకై నిరంతరమూ తపిస్తూ వాటికోసం పనిచేసిన న్యాయవాది బొజ్జా తారకంగారి సహధర్మచారిణి. డాక్టర్‌ మహితకు, ఐఏయస్‌ ఆఫీసర్‌ బొజ్జా రాహుల్‌కు జన్మనిచ్చిన తల్లి. విజయభారతిగారి మాతామహుడు (తల్లి తండ్రి) క్రైస్తవ మిషనరీ స్థాయిలో పాఠశాలలను స్థాపించి సాధారణ ప్రజలకు విద్యను అందుబాటులోకి తెచ్చిన మహనీయుడు. ఈ కుటుంబ నేపథ్యం విజయభారతిగారి జీవితం మీద చాలా ప్రభావాన్నే చూపిందనిపిస్తుంది.
విజయభారతిగారి విద్య మొదట రాజోలు, మద్రాసు, పిఠాపురం(కాకినాడ)లలో సాగింది. యం. ఏ మాత్రం కోఠి విమెన్స్‌ కాలేజీ హైదరాబాద్‌లో చదివారు. ఇక పరిశోధన విషయానికొస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దక్షిణ దేశీయ ఆంధ్ర వాజ్ఞ్మయం సాంఘిక పరిస్థితులు అనే అంశంపై చేశారు. ఇక్కడ చెప్పుకోదగిన, గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉస్మానియాలో తెలుగు పరిశోధనను పూర్తిచేసి సబ్మిట్‌ చేసిన మొదటి మహిళ విజయభారతి గారే అయినప్పటికీ ఆమె తర్వాత దివాకర్ల గారి వద్ద పరిశోధన చేసిన అభ్యర్థి వైవా మొదట పూర్తయి ఉస్మానియాలో మొదట పి.హెచ్‌.డి. చేసిన మహిళగా నిలిచిపోవడం. ఇందులో వర్గ వివక్ష స్పష్టమే కదా!
ఇక వృత్తి విషయానికొస్తే ఈమె కొంతకాలం సమాచార శాఖలో అనువాదకురాలిగా పనిచేసిన తర్వాత నిజామాబాద్‌ మహిళా కళాశాలలో 11 సంవత్సరాలు అధ్యాపకురాలిగా పని చేశారు. అనంతరం తెలుగు అకాడమీలో రిసెర్చ్‌ ఆఫీసర్‌ గా చేరి పదోన్నతుల్లో భాగంగా డైరెక్టర్‌ గా బాధ్యతలు నిర్వర్తించి 1999లో పదవీ విరమణ పొందారు. కళాశాల విద్య తెలుగు మీడియంలోనూ కొనసాగుతున్నందువల్ల విద్యార్థుల సౌలభ్యానికై అకాడమీ నిర్ణయం మేరకు అన్ని సబ్జెక్ట్స్‌ ల పారిభాషిక పదకోశాల నిర్మాణాన్ని సమర్థవంతంగా పూర్తి చేసారీమె. మరో చెప్పుకోదగిన విలువైన పని ప్రాచీన సాహిత్య పదకోశ, ఆధునిక సాహిత్య పదకోశ నిర్మాణాలు. వీటిలో రచనల వివరాలతో పాటు రచయితల వివరాలు పొందుపరిచే క్రమంలో విజయభారతి గారు అనేక గ్రంథాలయాల చుట్టూత అలసటను లెక్కించకుండా ప్రదక్షిణలు చేశారు. శ్రమ ఫలించి ఆ పదకోశాలకు నిండుతనం చేకూరిందనే చెప్పాలి.
కథాప్రక్రియతో రచనా వ్యాసంగం మొదలైనా అనంతర కాలమంతా విశ్లేషణాత్మక రచనలతోపాటు జీవితచరిత్రలతో రచనలు ముందుకు సాగినవి.
విజయభారతి గారి రచనలు: 1. బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్ర 1982 2. మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర (అనువాదం 1987) 3. నరమేధాలు` నియోగాలు (2019) 4. నాగరత్నమ్మ గారి(తల్లి) జీవిత చరిత్ర 5. సత్య హరిశ్చంద్రుడు (2002) 6. దశావతారాలు (2003) 7. షట్చక్రవర్తులు (2003) 8. వ్యవస్థను కాపాడిన రాముడు (2005) 9 . మహిళల హక్కులు డాక్టర్‌ అంబేద్కర్‌ దృక్పథం (2014) 10. పురాణాలు మరోచూపు (2017) 11. భారతీయ సాహిత్య నిర్మాతలు బోయి భీమన్న (2017)
12. విజయగాథ (2024)
పై రచనలన్నిటిలో మొదటి రెండు అణగారిన వర్గశ్రేయస్సును కోరుతూ సమసమాజం కావాలని తపించి ఆ మార్గంలో కృషిచేసిన వ్యక్తులకు సంబంధించిన చరిత్రలు కాగా గుండెనిబ్బరతతో ఆత్మగౌరవంతో జీవితాన్ని సాగించిన తల్లి నాగరత్నమ్మ జీవిత చరిత్ర మూడవది. మిగిలిన రచనలన్నీ (భారతీయ సాహిత్య నిర్మాతలు – బోయి భీమన్న తప్ప) మనువాద దృకృథంలోని అగ్రవర్ణాల కుట్రలను సహేతుకంగా సోదాహరణంగా చూపించిన ప్రయత్నాలు.
‘‘పరిత్రాణాయ సాధూనాం ధర్మ సంస్థాపనార్థాయ
వినాశాయచ దుష్కృతాం సంభవామి యుగేయుగే’’
భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని ప్రస్తావిస్తూ దీనిని దశావతారాలకు అనుసంధానిస్తూ ధర్మ సంస్థాపన అంటే వర్ణధర్మ సంస్థాపన అని చెప్తూ దశావతారాలలో వర్ణధర్మ పరిరక్షణ ఏ విధంగా జరిగిందో వివరిస్తారు. దశావతారాలలో కాలధర్మం అనే వాదన ఉన్నా రాజ్యం కోసం, అధికారం కోసం జరిగిన కుతంత్రాలతో అమాయకులు బలికావడాన్ని చర్చిస్తారు.
మత్స్య అవతారం బ్రహ్మ నిద్రపోతూ పలువరించిన వేదాలను హయగ్రీవుడనే దైత్యుడు వినడమే కాదు అతని అనుమతి లేకుండా నేర్చుకున్నాడట.. సుర వర్గానికే దాచిపెట్టుకున్న జ్ఞానాన్ని, తాను నేర్చుకున్నందుకు సంతోషం కలిగినా తాము వినకూడదనే, నేర్చుకోకూడదనే జ్ఞానం వునందున భయపడి సముద్రంలో దూకాడట. ఈ విషయం తెలిసిన విష్ణువు చేపరూపంతో ఆ దైత్యుని చంపి వేదాలను బ్రహ్మ కప్పచెప్పినట్లు భాగవతం (8.734) చెప్తుంది. ఈ సంఘటనలో ఆలోచించవలసిన విషయమేమిటంటే దైత్యుడు వేదాలను విన్నాడా? అక్షరరూపంలోని వేదాలను దొంగిలించాడా? అని. దైత్యుడు కేవలం విని ఉంటే అతణ్ణి చంపడంతో సమస్యకు పరిష్కారమవుతుంది. కానీ వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పచెప్పడమంటే అవి రాతలో నిక్షిప్తం చేసి ఉండవచ్చు అంటారు విజయభారతి గారు. అంతేకాదు, శాస్త్ర విద్యకోసం యుగాల నుంచి పోరాటం సాగుతున్నదని, ప్రతియుగంలోనూ దేవతలు, ఋషులూ ఆ విద్యలను తామే దాచుకుంటూ వచ్చారని ఇతరుల దగ్గర ఉన్న విద్యలను, శక్తులను మాత్రం ఏదోవిధంగా సాధించి స్వంతం చేసుకున్నారని చెప్తూ శుక్రాచార్యుని వద్దకు కచుని పంపించి మృతసంజీవని విద్యను నేర్చుకోవడాన్ని గుర్తు తెస్తారు.
వరాహావతారం గురించిన కథలు విభిన్నంగా ఉన్నా బ్రహ్మ సృష్టి కొనసాగించటానికి అతని సంతానమైన స్వయంభువు మనువు అతని వంశం ఉండటానికి చోటు లేకపోవడంవల్ల నారాయణుడు వరాహ రూపం ధరించి రసాతలం పోయినపుడు హిరణ్యాక్షుడు తన అధీనంలోని భూమిని తీసుకొని పోకుండా అడ్డగించడంతో వరాహుడు అతన్ని చంపి భూమిని తీసుకొని పోవడాన్ని భూసమస్యకు సంబంధించిన పోరాటంగా చెప్తారు. అంతేకాదు హింసతో కూడిన యజ్ఞాలకు విరోధులైన దైత్యుల నుండి భూమిని విడిపించి యజ్ఞాలు కొనసాగేలా చేయడానికే ఈ అవతారం నిర్దేశింపబడిరదని, ఇది పశుమాంసాన్ని ఇష్టపడే సురులు ప్రోత్సహించిన ధమనకాండ అని అంటారు. పచ్చని పంటపొలాలను అడవి పందులు తవ్వి నాశనం చేసే లక్షణాన్ని ఈ వరాహావతారంలో సూచిస్తారు.
ఇంద్ర సభకు వచ్చిన బృహస్పతికి నమస్కరించకుండా అవమానించినందుకు అతని సమస్త సంపదలు సముద్రంలో పడిపోవడంతో బ్రహ్మ సలహాతో సురులు దైత్యులతో సఖ్యంగా మెలిగి ఆ సముద్ర మథనానికి పూనుకున్నప్పుడు మొదట హాలాహలం, (దాన్ని శివుడు కంఠంలో నిలుపుకోవడం) సురభి, ఉఛ్ఛైశ్రవం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి, వారుణి అనే కన్యక చివరిగా అమృతభాండంతో ఆయుర్వేద వైద్యుడైన ధన్వంతరి వచ్చారట. మొదట వచ్చిన వాటిని దేవతలే స్వంతం చేసుకున్నందున ఆ భాండాన్ని దైత్యులు లాక్కోవడం, నారాయణుడు మోహినీ రూపంలో ప్రవేశించి ఆ అమృతాన్ని దేవతలకే పంచడం అందరికీ తెలిసిన విషయమే. ఈ క్షీరసాగరమధనం లో పాము తలవైపుగా పట్టుకొని ఆ విషాగ్నిని తట్టుకుంది దైత్యులే. కాని ఫలితం దక్కింది దేవతలకు.
క్షీరసాగరమధనంలో దైత్యులదే ఎక్కువ శ్రమ ఐనా ఫలితం దేవతలకే ఐందని చెప్తూ ఈ సన్నివేశాన్ని న్యాయంగా రావలసిన వాటా కోసం జనాభాలో అధిక సంఖ్యాకులైన బహుజనులు, దళితులు అడుగుతూనే ఉన్నా వారికి దక్కకపోవడంతో ధర్నాలు చేస్తున్నట్లే దైత్యుల నిరసనలు పోరాటాలు అంటారు విజయభారతిగారు.
తపశ్శాలి, ఆత్మగౌరవం కలవాడై స్వశక్తిమీద ఆధారపడిన వాడు తపస్సు చేసి జీవం ఉన్నవారి చేతగాని జీవం లేని వారి చేతకాని, దేవతల చేతకాని, దైత్యుల చేతకాని, రాత్రి గాని, పగలు గాని, ఇంటగాని, బయటగాని చావులేకుండా వరం పొందిన హిరణ్యకశిపుడు విష్ణువు గొప్పతనాన్ని అంగీకరించకపోవడంతో సజ్జనులను హింసిస్తున్నాడనే నెపంతో కొడుకు ప్రహ్లాదుని అతనికి శత్రువుగా చేసి రెచ్చగొట్టడం, హిరణ్యకశిపుడు స్తంభంలో విష్ణువును చూపించమనగానే ఆ స్తంభంలో నుండి సింహం తలతో నరసింహుడు సంధ్యాకాలంలో ప్రత్యక్షమై ఇంటా బయట కాకుండా హిరణ్యకశిపుని సంహరించడం మనందరికీ తెలిసిందే. ఇది కేవలం వైష్ణవ వ్యతిరేకత కారణంగా జరిగిన హత్యగా చూడవచ్చు అంటారామె. ఒక రకంగా ప్రతిపక్ష పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే అని కూడా అభిప్రాయపడతారు..
ఇక వామనావతారంలో నారాయణుని మాయోపాయాలు మరింత స్పష్టంగా కనపడతాయి. బలి చక్రవర్తి విశ్వజిత్‌ యాగం చేసిన తర్వాత దేవేంద్రుని మీదికి దండెత్తి ఆ ప్రాంతాన్ని వశం చేసుకున్నాడు. దీన్ని రాజ్య విస్తరణలో భాగంగానే గమనించవచ్చని, శివార్చనపరుడైన బలి చక్రవర్తితో వీళ్ళ వైరాన్ని శైవ వైష్ణవ మతాల మధ్య ద్వేషాలుగా గమనించవచ్చని చెప్తూ రాజ్యాన్ని సంపాదించుకోవడంలో భాగంగా అతని దానగుణ బలహీనతను ఉపయోగించుకొని వామనుని గా మూడు అడుగుల జాగను అడిగి విశ్వంభరుడిగా అతన్ని సంహరించాడని అంటారు. పైగా నారాయణుడు బలి చక్రవర్తిని సుతలం వైపుగా పంపిస్తూ, సుతలంలో ఉండే వారికి వ్యాధులు ఆతృతలు, బాధలు, నొప్పులు, దుర్మరణాలు వగైరా ఉండవని బుజ్జగించడమే కాక అక్కడ ఉండటంవల్ల అసుర భావం తొలగిపోతుందని కూడా సెలవిచ్చాడట. అంటే దేవతలతో మైత్రి భావంతోనే ఉండడం అన్నమాట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విజయభారతి గారు సురగణం ఎప్పుడూ ఎన్డీఏ ప్రభుత్వం లాగానే అధికారం చేపడుతూ ఉంటుంది. అందులో చేరే పార్టీలు బయటికి వచ్చే పార్టీలు దేశకాల పాత్రోచితంగా వాళ్ళు ఇచ్చే అధికార పదవులకు అనుగుణంగా పొత్తు కలుపుకుంటూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. ఇదంతా ఇండియా సంప్రదాయంగా అభివర్ణిస్తారు. ఇప్పటికీ కేరళలో ఓనం పండుగ రోజున బలి చక్రవర్తిని ఆహ్వానిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన కాలంలో ఆ రాజ్యమంతా చాలా సుఖసంతోషాలతో ఉన్నందున మళ్లీ ఆయన తిరిగి రావాలని కోరుకుంటారు. విచిత్రం ఏమిటంటే దేవతలకు మాత్రము అతడు వైరివర్గంలో వాడు. అందుచేతనే అతని అధికారాన్ని లేకుండా చేయడమే కాకుండా సుతలానికి పంపించడం గమనించాల్సిన విషయం.
కార్తవీర్యార్జునుడు ఒకనాడు వేట నుంచి వస్తూ జమదగ్ని ఆశ్రమానికి వచ్చినప్పుడు జమదగ్ని తన హోమధేనువు ద్వారా మంచి భక్ష్య పదార్థాలతో రాజపరివారానికి రాజుకు ఆతిథ్యం ఇచ్చాడట. దాంతో ఆయన సంతృప్తి పడక ఏకంగా ఆవునే తన రాజధానికి తీసుకురండి అని తన పరివారాన్ని ఆజ్ఞాపించడం, వారు ఆ ధేనువుని బలవంతంగా తీసుకుపోవడంతో విషయం తెలిసిన పరశురాముడు ఆగ్రహంతో మహిష్మతిపురం చేరుకొని, వాళ్ళతో యుద్ధం చేసి ఆ ఆవును తీసుకొని పోయాడట. దాంతో కార్తవీర్యార్జునుని కొడుకులు కోపంతో పరశురాముడు లేని సమయంలో జమదగ్ని తల నరకడం, ఆపై పరశరాముడు రాజ శబ్దం లేకుండా చేస్తానని శపథం చేసి ఆ శపథాన్ని నెరవేర్చాడు కూడా.
పై విషయాన్ని ప్రస్తావిస్తూ అధికార ప్రాబల్యం కోసం బ్రాహ్మణ క్షత్రియ కులాల మధ్య జరిగిన ఘర్షణ అని, పూర్వపు అవతారాల్లో ఈ రెండు వర్గాలు ఏదో ఒక విధమైన సర్దుబాటుతో మిగతా వర్గాల మీద పెత్తనం చేస్తూ వచ్చాయని, బ్రాహ్మణుడు గొప్ప అనే విషయంలో అంతర్గత ఘర్షణలు జరుగుతూనే ఉండేవని, విద్యాధికారం అందిపుచ్చుకొని ధర్మశాస్త్రాలంటూ కొన్ని విధి నియమాలు రాసేసి వాటినే ఆచరించాలని చెప్తూ బ్రాహ్మణ వర్గం పెత్తనం చేస్తూ వచ్చిందని అంటారు. బ్రాహ్మణ వర్గం కులగురువు హోదా సరిపోక రాజ్యాధికారానికి పోటీపడ్డారని చెప్తారు. ఒక్కోసారి రాజులై యుద్ధాలు చేశారు. వాస్తవానికి క్షత్రియులలో చాలా వంశాలు బ్రాహ్మణ మూలం కలవే (రాజుకు సంతానం లేకపోవడం లేదా ఏదో శాపం వల్ల అతనికి భార్యతో కలిసి పిల్లల్ని పొందే అవకాశం లేకపోవడం వంటి సందర్భాల్లో) రాజు భార్యకు సంతానం కలిగించే కార్యక్రమం నెత్తిన వేసుకున్నారు బ్రాహ్మణులు. (కౌరవ పాండవులు అలాంటి సంతానమే కదా!) ఆ గౌరవం చాలక ప్రత్యక్షంగా రాజభోగాలను ఆశించి అనుభవించిన సందర్భాలు ఉన్నాయని, వాళ్ళ అసూయ రోజురోజుకు పెరుగుతూ క్షత్రియులను భూమి మీద లేకుండా చేస్తాననేంతవరకు వెళ్ళింది. పరశురామావతారం అందుకు నిదర్శనం అంటారీమె.
రామావతారంలో సంతానం లేని దశరథుడు పుత్ర కామేష్టి యాగం చేయగా యజ్ఞ పురుషుడు ఒక పాయసాన్ని తెచ్చి ఇవ్వడం, దానిని దశరథుని ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలు తాగడం, రామ, భరత, లక్ష్మణ, శతృజ్ఞలు వారికి జన్మించడం మనందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విజయభారతి గారు గిరిజన పురుషుడు సంతానం కలగడానికి సంబంధించిన మూలికలు ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడతారు. మునులు అరణ్య భూముల్లో ఆశ్రమాలు నిర్మించుకొని వాటిని విస్తరించే క్రమంలో గిరిజన భూములను ఆక్రమిస్తూ ఉండేవాళ్ళు. తపోవనాల్లో గురుకులాలు ఉన్నప్పటికీ గిరిజనులకు శూద్రులకు విద్యనందించేవి కాదు. పైగా మునులు, వారి కుటుంబాలను ఆశ్రయించిన విద్యార్థులు ఆహారం కోసం, యజ్ఞాల కోసం, పశువులను చంపటం, అటవీ ఉత్పత్తులను తీసుకుపోవడం జరుగుతుండేది. మునులు తమ జీవితం కోసం వ్యవసాయం చేసిన దాఖలాలు లేవు. అటవీ సంపదను యథేచ్చగా వాడుకునేవారు. ఇది గిరిజనులకు కోపం కలిగించి ఆ యజ్ఞాలను వ్యతిరేకించటంతో వాళ్లని క్రూరులుగా, దుర్మార్గులుగా, రాక్షసులుగా చిత్రించడం జరిగిందని తాటక వధ కూడా అందులో భాగమేనని విజయభారతి గారు అభిప్రాయపడ్డారు.
వనవాసంలో తనను వివాహం చేసుకోమని కోరిన శూర్పణఖను ఆటపట్టించి, కోపం తెప్పించి ముఖానికి అందాన్ని చేకూర్చే ముక్కును కోయడంలో అతని ఏకపత్నీత్వ ప్రచారమే గాక ఓ వికృత మనస్తత్వం కనబడుతున్నదంటారు (పే. 57, దశా). శూద్రుడైన శంభూకుడు తపస్సు చేసిన కారణంగానే రామరాజ్యంలో బ్రాహ్మణుల బాలుడు చనిపోయాడనే నెపంతో శంభూకుని చంపి ఆ బ్రాహ్మణ బాలుని రక్షించాడట! ఈ సంఘటన శూద్రులకు తపస్సు చేసుకునే అర్హత లేదు అనేది రామావతారంలో స్పష్టం. గౌతముని రూపంలో వచ్చి అహల్యను ఇంద్రుడు అనుభవించటంలో ఆమెను తప్పు పట్టడానికి వీలు లేదు. అయినా ఆమె రాయిగా మారడం వంటి సన్నివేశాన్ని పొందుపరచడంలో, లంకలో ఉన్న సీతను అగ్ని ప్రవేశం చేయమనడంలోనూ, పట్టాభిషేకానంతరం సీతను గూర్చి ప్రజలు చులకనగా మాట్లాడుకుంటున్నారని తెలుసుకొని గర్భవతి అయిన ఆమెను రాజ్యం నుండి వెళ్లగొట్టడం వంటి సన్నివేశాలతో ఈ రామావతారం స్త్రీల పతివ్రతాత్వ ధర్మాన్ని సుస్థిరం చేసే ప్రయత్నం చేసిందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
మారీచుడు నాగజాతికి చెందిన వాడని, గంధర్వులు, యక్షులు, నాగులు కామరూపులు అనే విషయాన్ని గుర్తు చేస్తూ నాటకాలు వేయడం రకరకాల రూపాలు ధరించడం (మేకప్‌తో వేషధారణ చేయడం) వీరికి అలవాటైన విద్యలైనందున బంగారు లేడి లాగ కనిపించి సీతను ఆకర్షించారని అంటారు. రాముడి అశ్వమేధ యాగం సామ్రాజ్య విస్తరణలో భాగంగా. చిన్నచిన్న రాజ్యాలను ఆక్రమించుకోవడమే అని గుర్తు చేస్తారు. పురోహిత వర్గానికి అనుకూలంగా లేరనే ఉద్దేశంతో లక్షలాదిమంది గిరిజనులను రాముడు చంపాడనీ, ఆయనకు స్త్రీల పట్ల గౌరవభావం లేదని, పలు రకాలుగా వారిని అవమానించారని, వైష్ణవ మతాన్ని సుస్థిరం చేయడానికే ఈ రామావతారమని ఆమె అభిప్రాయం. కృష్ణావతారం విషయాన్ని ప్రస్తావిస్తూ మహాభారత కాలం నాటికి యాదవులు హిందూ సమాజంలో బలమైన వర్గంగా, రాజకీయ సాంఘిక శక్తిగా ఎదిగారంటారు. భారతం మొదట సంక్షిప్తంగా ఉండేదని అందులో గీత చిన్నగా నైనా ఉండేదో లేదో అనుమానమని కోశాంబి అభిప్రాయ పడుతూ భారతాన్ని మహాభారతంగా తిరగరాసినప్పుడు గీతను చేర్చారని, యుద్ధాలు రెచ్చగొట్టడం కోసం ఇలాంటివి విస్తరించారని, కృష్ణుని గురించిన గాధలెన్నో లోకంలో ప్రచారంలో ఉండటం వల్ల ఆ కథలన్నీ కలిపేసి కృష్ణావతారంగా రూపొందించి భగవద్గీత ప్రబోధం కృష్ణుని చేత చేయించారని కోశాంబి అభిప్రాయాన్ని గుర్తు చేస్తారు.
ద్రౌపదికి చీరలు ఇచ్చి ఆదుకోవడం, కుంతీదేవికి ఓదార్పు మాటలు చెప్పడం, కౌరవులతో సంధి చేసుకు రమ్మని ధర్మరాజు చెప్పినా ద్రౌపదికి జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని సంధికి గట్టిగా ప్రయత్నించక పోవడం వంటి సంఘటనలను పురస్కరించుకొని కృష్ణుని ఉదారవాదంగా చెప్తారు విజయభారతి గారు. కృష్ణుడు నాగజాతిని శాసించాడు అని చెప్పడంలో బహుశా కాళింది మర్ధనం అయ్యుంటుంది. ఇంద్రుని పూజలు చేయకపోవడం కారణంగా అతడు కురిపించిన రాళ్ల వానను తట్టుకునే క్రమంలో గోవర్ధన పర్వతాన్ని వేలితో గొడుగు లాగా ఎత్తిపట్టుకొని అందర్నీ కాపాడటం అనే సంఘటనలో అతనిలో దేవతలను లెక్కచేయని ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తారు. మహాభారతం నాటికి యాదవులు హిందూ సమాజంలో బలమైన వర్గంగా, రాజకీయ సాంఘిక శక్తిగా ఎదిగారని, జరాసంధ శిశుపాలాది రాజుల పట్ల, దుర్యోధనుని పట్లకురు యుద్ధంలోనూ కృష్ణుడు కొంత మాయావితనం, కుతంత్రం ప్రదర్శించినట్లు కనిపించినా ఇతని రాజనీతి అసారధారణమైనదిగా డాక్టర్‌ అంబేడ్కర్‌ ‘రిడిల్‌ ఆఫ్‌ కృష్ణ’ అనే వ్యాసంలో ఇతని అనుచితాలను నిశతంగా విమర్శించారని చెప్పినా తల్లిదండ్రుల పట్ల విధేయత, సోదరుని పట్ల గౌరవం, మిత్రుల, అనుచరుల పట్ల వాత్సల్యం, చెల్లెల్ని మన్నించడం, భార్యలలో అసంతృప్తి లేకుండా దక్షిణ నాయకత్వం వంటి గుణాలు కలిగి కుటుంబ వ్యవస్థలో ఆదర్శ పాత్రగానే నిలిచాడంటారు ఈమె.
బుద్ధావతారం విషయానికొస్తే ఈయన క్రీస్తు పూర్వము 573 నుండి 493 మధ్యకాలంలో సాకేత వంశంలో మాయాదేవికి శుద్దోదనునికి జన్మించాడు. ఇతడు పుట్టిన ఏడవ రోజునే తల్లి చనిపోతే పినతల్లి గౌతమి ఇతణ్ణి పెంచింది. ఇతడు పుట్టిన లుంబిని వనం నేపాల్‌ ప్రాంతంలో ఉంది. కపిల వస్తువును పాలించిన హేతువాది అయిన కపిల మహర్షి పేరిట ఇది కపిలవస్తునగరమైందని డాక్టర్‌ అంబేడ్కర్‌ గారి అభిప్రాయంగా చెప్తారు. ప్రాపంచిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం, కార్య కారణాత్మకంగా హేతు దృష్టితో ఆలోచించడం. దేవుని ప్రస్తావించకపోవడం బుద్ధుని విశిష్టత అంటారు. బ్రాహ్మణులు రూపొందించిన కర్మ సిద్ధాంతం ఫలితంగా ముఖ్యంగా శూద్రులు, స్త్రీలు అజ్ఞానంలో కూరుకుపోయారని, వర్ణధర్మ వ్యవస్థ మూలంగా ఆరోహణపరమైన అసమానతలతో సమాజం అస్తవ్యస్తమైందని గ్రహించిన బుద్ధుడు వేదాల ప్రామాణికతను అంగీకరించలేదు. విద్య అందరికీ అవసరమన్నాడు, యజ్ఞ హింసను, కర్మకాండను వ్యతిరేకించాడు. వర్ణధర్మ వ్యవస్థ అసహజమైనదని చెప్పాడు. ఇతని బోధనలను సమాజం హేతుబద్ధంగా ఆలోచించి అతడి అనుచరులుగా మారారు. అతడి ఆలోచనలు నమ్మకాలు బౌద్ధ ధర్మంగా ప్రచారంలోకి వచ్చి ఆ జనమంతా బౌద్ధమతస్తులుగా సమాజంలో గుర్తించబడ్డారు.
ఈ బుద్ధ అవతారాన్ని చర్చలోకి తెస్తూ, గొప్పవి పేరొందినవి అయిన సంఘటనలను తమకు అన్వయించుకోవడం, పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తులతో సంబంధం ఉన్నట్లుగా ప్రచారం చేసుకోవడం లోకంలో ఉంది. అదే క్రమంలో ధర్మపరంగా ప్రాచీన కాలంలో వేద మతాన్ని దెబ్బతీసిన బౌద్ధ, జైన మత ధర్మాలను ఎదుర్కోవడానికి మిధ్యా ప్రచారం చేసి సామాన్య ప్రజలను మోసగించడానికి బుద్ధుడిని దశావతారాల్లో చేర్చారంటారు. వేద విహిత కర్మల ఆచరణ వల్ల నరకానికి వెళ్లే వారి సంఖ్య తగ్గిపోవడంతో విష్ణువు సాకేత వంశంలో బుద్ధుడిగా పుట్టి వేదాలను వ్యతిరేకించటంతో కర్మ బ్రష్టులైన వారు నరకానికి పోవడం మొదలైందని, ఇది దశావతారాల్లోని బుద్ధుని అవతారానికి సంబంధించిన ప్రచారమని విజయభారతి గారు గుర్తు చేస్తారు. అంతేకాదు, ఆయన అనంతరం వచ్చిన మేధావులు అతని ఆలోచనలను అనుసరించి తమ ధర్మాలను వాటి సూత్రాలను సవరించుకొని వ్యాఖ్యానాలు రాసుకోవడమే గాక బుద్ధుని ప్రాథమిక ఆలోచనలను వక్రీకరించారని, దాన్ని నిర్మూలించడానికి శైవ, వైష్ణవాలు ఏకమై బౌద్ధ ఆరామాలను శైవ, వైష్ణవ ఆలయాలుగా మార్చారని బౌద్ధసన్యాసి తల నరికి తెచ్చిన వారికి వంద బంగారు నాణాలు బహుకరించేవారని, ఈ మతం వల్ల పురోహిత వర్గానికి ఆర్థిక నష్టం జరిగిందనే ప్రచారం కూడా ఉందని అనేక విషయాలను ప్రస్తావిస్తారు. బౌద్ధాన్ని వ్యతిరేకించిన ఈ సనాతన ధర్మవాదులే, బుద్ధుని అష్టాంగ మార్గంలోని గుణాలనే హిందూ దేవుళ్లకు ఆపాదించి కావ్యాలను రాశారని కొందరి పరిశీలకుల అభిప్రాయం. అంటే ఒకవైపు బౌద్ధాన్ని వ్యతిరేకిస్తూనే అనివార్యంగా ఆ బౌద్ధ ధర్మాన్ని, సూత్రాలను ధర్మాలను ప్రచారం చేసే ప్రయత్నం చేశారని తెలుస్తున్నది. ఇక కల్కి అవతారం భవిష్యత్తులో రాబోయే అవతారం.
సమాజమంతా ఈ దశావతారాలను చాలా పవిత్రంగా భావిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ అవతారాలలో వాళ్ల వ్యక్తిత్వాలు ఏ జనాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేశారో ఏమాత్రం గమనించరు. అంతా గుడ్డెద్దు చేల్లో పడ్డట్టే. వీరి కార్యక్రమాలు అంతా ఈనాటి ప్రభుత్వాలు గిరిజనులను వారి వారి స్థానిక స్థలాల నుండి తొలగించడానికి చేసే ప్రయత్నాల వంటివే అనే అంశం ఏమాత్రం వారి మెదళ్లకు తట్టడం లేదు. ఇంత విలువైన కోణాన్ని విజయభారతి గారు ఎంతో శ్రమపడి కూలంకషంగా అధ్యయనం చేసి ఈ దశావతారాలు పుస్తకంతో పాటు అనేక రచనలను పాఠకులకు ముందుకు తెచ్చారు. కానీ వాటికి రావలసినంత ఆదరణ రాలేదని అనిపిస్తుంది. ఒక ఇంటర్వ్యూలో తాను చేసిన కృషి ఏ శర్మనో, రావో చేసి ఉంటే విస్తృత ప్రచారం జరిగేదేమో అని బాధపడ్డారు. అది వాస్తవం కూడా.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.