తెలుగు నేల గర్వించ దగిన గొప్ప దళిత మేధావి, రచయిత్రి, విద్యావంతురాలు బోయి విజయభారతిగారు మన మద్య లేకపోవడం ఒక విషాదం. 1941 నుండి 2024 వరకు జీవించిన కాలం పూర్తిగా ప్రజలకోసం అనే చెప్పొచ్చు. కొందరికి మాత్రమే అరుదుగా లభించే ఆవకాశం. పుట్టి పెరిగిన బోయి భీమన్న కుటుంబ వాతావరణం, తాను పెళ్లి చేసుకొని మరొక కుటుంబాన్ని
ఏర్పాటు చేసుకొన్న బొజ్జా తారకంగారి నేపథ్యం కూడా ప్రజల కోసం ప్రజలకి అంకితం చేసిన వాళ్ళవే. తన 85 ఏళ్ల జీవితం పూర్తిగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి జీవించడం అసాధ్యమైన పని. అందరి జీవితాల్లాగా దళితులు అందునా దళిత మహిళల జీవితాలు సజావుగా జరగవు అనేక ఆటుపోట్లు, కుటుంబం, పిల్లల పెంపకం అందులో ప్రజల కోసం పనిచేసే సహచరుడు ఉండడం, అనేకసార్లు రాజ్య నిర్బంధాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. స్త్రీలకి కుటుంబ భారం అదనంగా ఉంటుంది. అందులోనే తన చదువుని, అనేక ఉన్నతమైన ఉద్యోగాలని సమర్ధవంతంగా నిర్వహించింది. తమ చుట్టూ ఉన్న వివక్ష, దోపిడీ, అసమానతలు నిండిన సమాజంలో సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంలో తాను జీవించినంత కాలం విజయభారతి కృషిచేశారు. తన బాల్యం స్వగ్రామం రాజోలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి జరిగితే, హైదరాబాద్ కోఠి మహిళా కళాశాల నుండి డిగ్రీ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులో మొట్టమొదటి పి.హెచ్.డి పట్టా పొందిన దళిత మహిళ ఆవిడ. డాక్టర్ విజయభారతి రచనల ద్వారా సమాజానికి తనదైన ఒక కొత్త దృష్టికోణాన్ని పరిచయం చేసింది. జ్యోతిబా పూలేని, అంబేడ్కర్‌ని మొదటగా తెలుగు ప్రజలకి అతి సరళమైన భాషలో అందుబాటులోకి తెచ్చింది. తాను వచ్చిన దళిత నేపథ్యం, పెరిగిన వాతావరణం తండ్రి బోయి భీమన్న ఆధునిక భావజాల వారసత్వం, తన సహచరుడు మానవ, దళిత హక్కుల నేత, న్యాయవాది, తుదిశ్వాస వరకు పేద, బీద, దళితుల పక్షాన నిలిచిన బొజ్జా తారకంతో సహజీవనం తనకంటూ ఒక ప్రత్యేక జీవనశైలిని ఇవ్వడంలో ప్రభావితం చేశాయి అనుకోవచ్చు. తాను పెరిగిన కాలం, ఆ సందర్భంలో కులవివక్ష, అంటరానితనం గురించి మాట్లాడిన వాళ్ళు చాలా అరుదు. కుల దృక్పథంతో రచనలు చేసిన మహిళలు కూడా తన కాలంలో లేరనే చెప్పాలి. దాదాపు ఇరవైకి పైగా వచ్చిన తన రచనలలో అనేక భాగాలుగా వచ్చిన పురాణాలు- కుల వ్యవస్థ- సత్య హరిశ్చంద్రుడు, పురాణాలు- కుల వ్యవస్థ- దశావతారాలు, పురాణాలు- కుల వ్యవస్థ- షట్చక్రవర్తులు, పురాణాలు- కుల వ్యవస్థ నాలుగవ భాగం, వ్యవస్థను కాపాడిన రాముడు, అయిదవ భాగం రామాయణ మునులు, నర మేధాలు` నియోగాలు- మహాభారతం పరిశీలన, పురాణాలు మరోచూపు వంటి పుస్తకాల ద్వారా పురాణాల్లో ఉన్న కులాన్ని, భావాలని విశ్లేషణ చేశారు. తన కాలం మహిళా కార్యకర్తలు, రచయితలు, ఉద్యమాలతో ఎప్పుడూ కలగలసి పోయేవారు. దళితుల జీవితాల గురించి, రచనల గురించి, అందులో కులం గురించి మాట్లాడితే విశ్లేషణలు, పొగడ్తలు, రావలసిన దక్కాల్సిన గౌరవం వాళ్ళు జీవించిన కాలంలో జరగవు. విజయభారతిగారికి కూడా అదే జరిగింది. తన చుట్టూ ఉన్న నలుగురు సమయం లేని వాళ్ళంగా మిగిలిపోయి తనని అంతగా పట్టించుకోలేదు అని చెప్పక తప్పదు. నిజానికి అందరం ఒక ప్రత్యేక సందర్భంలో ఉన్నాము. నిత్యం మహిళలు, పిల్లలు, అణగారిన కులాల ప్రజలపై పెరుగుతున్న నేరాల చుట్టూ తిరుగుతూ స్పందిస్తూ, చేతనైన పనులు, సహాయం చేస్తూ అందులోనే కొట్టుమిట్టాడుతున్నాం. విజయభారతిగారికి కొద్దిగా సమయం ఇవ్వలేకపోయాము అన్న భావన వెంటాడుతూనే ఉంది. సాధారణంగా రచనలు ఒక రకంగా, వ్యక్తిగత జీవితాలలో మరొక రకంగా ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాము కానీ విజయభారతిగారి వ్యక్తిత్వం చాలా అరుదు. మృదువుగా, సున్నితంగా, అందరితో స్నేహపూర్వకంగా ఉండడం తనకి మాత్రమే సాధ్యం అనిపిస్తుంది.
దళిత, స్త్రీవాద కోణంలో నుండి తెలుగులో రచనలు చేసిన వారిలో కూడా విజయభారతికి సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన చోటు ఉంది. నేటి కృత్రిమ సమాజంలో మానవ విలువలకి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడ్డ విజయభారతిగారిని స్మరించుకొని భావితరాలకు అందించడం మన బాధ్యతగా ఇప్పటికైనా తీసుకోవాలి. అందరితో పాటు ముఖ్యంగా దళిత మహిళలకి ఆదర్శంగా నేటి సమాజానికి విజయభారతి రచనలు, జీవితం చాలా అవసరం.