ఆధునిక సమాజానికి సంబంధించిన స్త్రీ ఐకాన్ బోయి విజయభారతిగారు. విజయభారతిగారిని చూసిన ఎవరైనా ఒకసారి మాట్లాడితే చాలు మనసారా అమ్మ అని పిలుస్తారు. తెలుగు అకాడమీ డైరెక్టరుగా, రచయితగా ఆమె సమాజానికి చేసిన కృషి చాలా అమూల్యమైనది. కులం, మతం పట్ల ఆమె వైఖరి ఈనాటికి ఎవరితోనూ సరి తూగనిది.
స్త్రీలు అందులోనూ దళిత స్త్రీల స్థితిగతులను విడమర్చి నిర్భయంగా చెప్పగలిగే స్వభావం అమ్మకే సొంతం. చూసినవారు ఎవరికీ ఆమె వివక్షకు లోనైన మనిషి అని అనుకోరు. కానీ, ఆమె జీవితం నల్లేరు మీద బండి నడక కాదు అనేది దగ్గరగా చూసిన వాళ్లకి, ఆమె చెప్పిన సంగతులు విన్నవారికి అర్థమై ఆశ్చర్యం కలగక మానదు. ఎవరూ చేయనిరీతిలో ఆమె చెప్పాలనుకున్న విషయాన్ని ఎంతో ధైర్యంగా చెప్పదలచిన దానిని ఎంతో సూటిగా చెప్పారు అనేది ఆమె రచనలు చదివితే అర్థమవుతుంది. శక్తి ఎవరి నుండో రాదు. మన స్వయంకృషి వల్ల వస్తుంది తప్ప తండ్రి నుండో, భర్త నుండో రాదని నిర్భయంగా చెప్పేవారు. అంత చదవరి అయినా భర్త కోసం ఆమె చేసిన త్యాగం చాలా గొప్పది. ఎవరు వెనుక ఎవరున్నారో లేదో తెలియదు కానీ బొజ్జా తారకంగారి విజయవంతమైన పోరాటం వెనుక అమ్మ మాత్రం ఉన్నారనేది సత్యం.
అమ్మకు ప్రకృతి అంటే అమితమైన ప్రేమ. మనుషులంటే ప్రేమ. మానవ సంబంధాల విలువలకు ఆమె నిలువుటద్దం. ఎవరికైనా ఆరోగ్యం బాగా లేదని తెలిస్తే వెంటనే ఫోన్లో పలకరించి బాగోగులు తెలుసుకొని ముఖస్తుతి కోసం మాట్లాడి ఆ విషయాన్ని మర్చిపోయే నైజం కాదు అమ్మది. నిరంతరం వారిని పలకరిస్తూ, మెళకువలు చెప్పి వాళ్లకు కొండంత ధైర్యాన్ని ఇచ్చేది. ఒక పని మొదలుపెట్టామని తెలిస్తే ఆ పని ఎలా జరుగుతుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలను తెలిపేవారు. కులం వర్గం జెండర్ పట్ల ఆమె దృక్పథం ముందు తరానికి దిక్సూచి. పురాణాలను విమర్శనాత్మకంగా ఆమె రాసిన రచనలను చూస్తే ఎంత లోతుగా ఆమె అధ్యయనం చేశారో అర్థం అవుతుంది. అంతేకాదు ఆమె చెప్పాల్సిన అంశాలని నిజాలని నిష్కర్షగా చెప్పిన తీరు, మతం గురించి కులం గురించి ఆమె వ్యక్తీకరించిన అంశాలు అమోఘం. పురాణాల్లో స్త్రీ పాత్రలు తాటకి, శబరి లాంటి వారిని ఎత్తి పట్టుకుని చూపిన విధానం ఈరోజు స్త్రీ
ఉద్యమాలకు ఎంతో బలం. సమాజం చేత చదివించాలని, సమాజాన్ని జ్ఞానవంతం చేయాలని ఆమె విపరీతంగా తపనపడే వారు. మనుషులను మార్చడం అనేది ఈ తరంలో జరగని పని అని, మతం, సాంప్రదాయాలు, కులం ఊబిలో ఎంతగా సమాజం కూరుకుపోయిందో ఆమె రచనల్లో వ్యక్తం చేసిన ఆవేదన ద్వారా తెలుస్తుంది. ఆమెకు తెలిసిన అంశాలని, జ్ఞానాన్ని నలుగురికి పంచాలనే తపన వలనే చివర వరకు అలాంటి రచనలు చేయగలిగారు.
నిచ్చెన మెట్ల వ్యవస్థలో స్త్రీల మీద ఉన్న ఒత్తిడి గురించి మాట్లాడుతూ దళిత స్త్రీలు దళితేతర స్త్రీల చేత, దళిత`దళితేతర పురుషుల చేత అణచబడుతున్న విధానం ఇప్పటికీ మారలేదని, మార్పు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మన ఆలోచన సరళి మారడం, మార్చడం ఉద్యమ నాయకుల కర్తవ్యం అనే వారు అమ్మ. దళిత స్త్రీ శక్తి ఉద్యమంలో ఆమె పాత్ర చాలా గొప్పది. మొట్టమొదటి మేనేజ్మెంట్ కమిటీకి విజయభారతి గారు ప్రెసిడెంట్‌గా, వసంత కన్నబిరాన్ గారు వైస్ ప్రెసిడెంట్‌గా ఉండి వారి అనుభవాలను, జ్ఞానాన్ని జోడిరచి ఉద్యమ ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డారు. ఆ కాలంలో దళిత పురుషులు సంఘంలో సభ్యులుగా ఉండి ఫెమినిస్ట్ దృక్పథంతో ఉన్న స్త్రీలను సభ్యులుగా వ్యతిరేకించినపుడు విజయభారతి గారు దళిత పురుష వాదనను తీవ్రంగా ఖండిరచి బ్రాహ్మణ స్త్రీల దృక్పథం మా పట్ల ఎంత ప్రమాదకరమో దళిత పురుష పితృస్వామ్య భావజాలం అంతకంటే ప్రమాదమని, దళిత స్త్రీల ఉద్యమానికి అందరి పాత్ర అవసరమని చెబుతూ మీరందరూ మాకు బాకీపడి ఉన్నారని చెప్పారు. కొన్ని విషయాలు ఎంత తీవ్రమైనవైనా చతురోక్తితో వారికి అర్ధం చేయించేవారు. దళిత స్త్రీ శక్తి మహాసభల్లో అనేక సమావేశాల్లో అమ్మ పాల్గొని ప్రసంగించడమే కాకుండా తరువాత జరిగిన అంశాల మీద చర్చ జరిపేవారు. ఇలాంటి ఉద్యమం మన అందరి కల అని ఆనందించేవారు. తరువాత అమ్మ ఆలోచనతోనే స్టేట్ ఉమెన్ రైట్స్ ఫోరం (ూఔRఖీ) రాష్ట్ర మహిళా హక్కుల వేదిక అనే సంఘాన్ని స్థాపించాం. కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరి స్త్రీలు ఒకచోట కూర్చోవడమే ఈ వేదిక ప్రత్యేకత. కొంతకాలం గడిచాక అది పురోగమించలేకపోయింది. తరువాత స్త్రీ సంఘాలు కలిసి సంవత్సరానికి ఒకసారి సమావేశమై ఒకరిని సత్కరించుకోవాలనే ప్రతిపాదనతో మొదటిసారి విజయభారతి అమ్మను సత్కరించుకున్నాము. ఆ సత్కారానికి ఆమె ఎంతో ఆనందించారు.
స్త్రీలుగా మనలను ఎవరైనా సత్కరిస్తాం అంటే వద్దన కూడదని, ఆ సత్కారాలు, అలాంటి సందర్భాలు మనకు చాలా అవసరమని, ఇటీవలే స్త్రీలను సత్కరించడం నేర్చుకున్నారని, గతంలో స్త్రీలు ఎంతటి వారైనా సత్కారానికి నోచుకోలేదని చెప్పేవారు. ఒక రచయితగా సాహిత్యంలో ఆమె చేసిన కృషికి తగిన గుర్తింపు రాలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. సాహిత్యంలో ఆమె అధ్యయనం చాలా విస్తృతమైనది. పురాణాల్లో మూలాలకు వెళ్లి అధ్యయనం చేసి మాతృస్వామిక వ్యవస్థను అద్దంలో చూపించారు. తెలుగు అకాడమీలో ఆమెను ఎంత వివక్షకు గురిచేసినా గానీ ఆమె చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్నిటిని విజయవంతంగా పూర్తి చేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా తారకంగారి రచనలను ఒక కొలిక్కి తీసుకురావాలని ఆమె పడిన తపన అంతా ఇంతా కాదు. దానిలో భాగంగానే ఆమె నన్ను అడిగిన పనిని సక్రమంగా నిర్వర్తించగలిగాను. కుప్పలుగా ఉన్న అనేక అంశాలకు సంబంధించిన పేపర్లను రేణుక అని దళిత స్త్రీ శక్తి కోఆర్డినేటర్‌ను పంపించి, వాటిని పొందుపరిచి ఒక కొలిక్కి తెచ్చి తారకం గారి రచనలన్నింటినీ పుస్తక రూపంలోకి తీసుకురావడానికి నా వంతు కృషిని అందించాను. కానీ ఆమె వెళ్లిపోయే వారం రోజుల క్రితం నాతో మాట్లాడినప్పుడు తారకంగారి వర్ధంతి సభలో చాలా బాగా మాట్లాడావు అని, అలాంటి తేదీలు గుర్తుంచుకొని స్మరించుకోవడం సభలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని నాతో మాట్లాడుతూ, మహిత ఇంట్లో ఉన్నానని, కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉందని, సుధాతో కలిపి ఒకసారి వీలు చూసుకుని రమ్మని చెప్పారు. బహుశా ఆమె రాసిన ఆత్మకథ కోసం, దానికి సంబంధించిన సమావేశం కోసం అయ్యుండవచ్చు.
తప్పనిసరిగా వస్తానని మాట ఇచ్చిన నేను నా మాటను నిలబెట్టుకునే లోపే అమ్మ చెప్పకుండా వెళ్ళిపోయారు. భౌతికంగా వెళ్ళిపోయారు కానీ ఆమె కళ్ళు సమాజాన్ని చూస్తూనే ఉన్నాయి. ఆమె తన శరీరంతో అనేకమందికి పాఠాలు చెప్తూనే ఉన్నారు. ఉద్యమాలు ఉన్నంతకాలం, మాలాంటి వాళ్ళు ఉన్నంత కాలం, అమ్మ మనందరికీ స్ఫూర్తిదాయకం. మనందరికీ అమ్మ ఎప్పుడూ తోడు ఉంటారు. జై భీమ్!