ప్రత్యామ్నాయ సాహితీ ధృవతార డా॥ బోయి విజయభారతి – డాక్టర్‌ సుధారాణి

డాక్టర్‌ బోయి విజయభారతి గారికి మన:పూర్వక నివాళులు అర్పిస్తున్నాను. అమ్మతో మూడున్నర దశాబ్దాల సన్నిహిత సంబంధం నాది. విజయభారతిగారు నాకు పరిచయం కాకముందే వారి తండ్రి పద్మశ్రీ బోయి భీమన్నగారిని కలవడం జరిగింది. నేను జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో 1988`1992 మధ్య పరిశోధన విద్యార్థిగా ఉన్నపుడు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసాను.

ఆ సందర్భంగా వారిని ఇంటర్వ్యూ చేశాను. తరువాత కాలంలో ఢల్లీి నుండి హైదరాబాద్‌ వచ్చిన తరువాత తారకం గారిని, విజయభారతి గారిని కలవడం జరిగింది. తారకంగారు ‘నీలాకాశంలో ఎర్రనక్షత్రం’ అయితే, విజయభారతి గారు ప్రత్యామ్నాయ సాహితీ ధృవతార. వీరిద్దరిదీ మూడోతరం విద్యావంతుల కుటుంబం.
అమ్మతో నా తొలిపరిచయం తెలుగు అకాడమిలో చాలా ఆత్మీయంగా మాట్లాడారు. మా పెద్దబావ గారు (పెద్దక్క భర్త) మేదరి రాంచందర్‌ గారు, తెలుగు అకాడమీలో లా రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా 70వ దశకం నుండి పనిచేసినారు. 1978లో విజయభారతి గారు రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా చేరారు. అకాడమిలో జరిగే విషయాలు, గొడవలపై ఇంట్లో చర్చ జరిగేవి. బావగారు, ‘‘విజయభారతి గారు సౌమ్యురాలు, ప్రతిభాశాలి’’ అని పొగిడే వాడు. తెలుగు అకాడమీ తీసుకువచ్చిన పదకోశాలలో వారిద్దరు కలిసి పనిచేశారు. న్యాయ పదకోశం రాంచందర్‌ గారు తీసుకువచ్చారు. విజయభారతి గారు డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నకాలంలో మా బావగారి పదవీ విరమణ జరిగింది. పదవీ విరమణ సభలో విజయభారతిగారు మా అక్కయ్యను పిలిచి ‘‘రాంచందర్‌ గారు భోళా మనిషి… ఏమీ జాగ్రత్త పడలేదు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ విషయంలో జాగ్రత్త పడమని, పిల్లలను బాగా చదివించమని’’ మంచి సూచనలను ఇచ్చారని వారి మంచితనాన్ని అక్క ఎప్పుడు గుర్తు చేసుకొంటారు.
1992లో నేను డా। బి. ఆర్‌. అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం రావడంతో ఢల్లీి నుండి హైదరాబాద్‌ వచ్చాను. అంబేద్కర్‌ మెమోరియల్‌ ట్రస్టు, దళిత స్త్రీ శక్తి, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌, నేషనల్‌ దళిత ఫోరం నిర్వహించిన అనేక సమావేశాలలో విజయభారతి గారిని కలవడం జరిగేది. సెంటర్‌ ఫర్‌ దళిత స్టడీస్‌ (ష.స.ం)లో ఇద్దరమూ గౌరవసభ్యులుగా ఉండేవాళ్ళం. అమ్మ సమయపాలన బాగా పాటించేవారు. 2012 నుండి మూడుసార్లు ప్రెసిడెంట్‌గా క్రియాశీల పాత్ర పోషించారు. ంష, ర్‌ ూబపజూశ్రీaఅ చట్ట బద్ధత కోసం ఉద్యమం కొనసాగిన రోజులవి. నేషనల్‌ దళిత ఫోరమ్‌ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఇ.వి.చిన్నయ్య చైర్మన్‌, మా భర్త రవికుమార్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉండేవారు. బోర్డు మెంబర్‌గా చాలా సూచనలిచ్చేవారు. డా॥బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సభలో, తొలిసారి అమ్మ సమక్షంలో ఇచ్చిన నా ఉపన్యాసం విని సభానంతరం, ఆమె నన్ను అభినందిస్తూ మీ ఉపన్యాసం బాగుంది. విషయ అవగాహన విశ్లేషణ బాగుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి!’’ అని అన్నారు. ఆ మాటలు నాకు మార్గదర్శకంగా తోచాయి.
విజయభారతి గారు చూపిన ఆప్యాయత, ఆమె మాటల్లో ప్రతిబింబించిన స్నేహం నా మనసులో ముద్రవేసుకు పోయాయి. ఆమెను కలిసిన ప్రతి సందర్భం, సమావేశం నాకు ఆలోచన ప్రేరణ కల్పించేవి. ఆమె రచనల్లో ప్రబలమైన విశ్లేషణా సామర్థ్యం స్పష్టత నన్ను ఆకర్షించాయి. సమాజంలో ఉన్న వివక్షలను, అసమానతలను ఎదిరించే క్రమంలో ఆమె రచనలలోని ధిక్కారస్వరం నాలో స్పూర్తిని కలిగించేది.
కారంచెడు 1985, 1991 చుండూరులో దళితులపై ఊచకోత జరిగిన ఉద్యమాల్లో తారకంగారు కీలక పాత్రవహించారు. చుండూరు బాధితుల పోరాట కమిటీ కత్తి పద్మారావు ఆధ్వర్యంలో ఢల్లీిలో జరిగిన నిరసనకు జె.యన్‌.యులోని దళిత విద్యార్థులందరు వారికి అండగా నిలిచాము. ఢల్లీిలో వారి బాబోగులు చూడడం, ప్రధాన మంత్రిని, ఇతర మంత్రులను కలిసే విషయాల్లో మేము తోడ్పడ్డాము.
అంబేడ్కరిజం ప్రభావంతో విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చిన నాకు, బొజ్జా తారకంగారు దళితోద్యమ దిక్సూచిగా ఉండేవారు. వారితో కలిసి అనేక నిజనిర్ధారణ కమిటీలలో పాల్గొనటం, సభల్లో ఉద్వేగ భరితంగా ప్రసంగించడం చేసేదాన్ని. తారకం గారిని కలవడానికి టోలిచౌకిలోని గృహానికి తరచూ వెళుతుండేదాన్ని. అమ్మ ఆతిథó్యం నన్ను స్వాగతించేది. అమ్మకు మొక్కలంటే ప్రీతి. ఆమె ఇంటికి వెళ్ళినపుడల్లా అనేక మొక్కలను చూపేవారు. అమ్మ ఇచ్చిన ఇన్సులిన్‌ మొక్క ఇప్పటికీ శాఖోపశాఖలుగా విస్తరించి, అమ్మ జ్ఞాపకంగా ఉంది. అవసరమున్న ఎందరికో ఆ మొక్కలు ఇచ్చాను కూడా!
అమ్మ, తారకం గారు మా కుటుంబంలో జరిగే పెళ్ళిళ్ళు, వేడుకలకు హాజరయ్యేవారు. వారి బహుమతులు విలక్షణంగా వుండేవి. మా పాప లక్ష్య ఐదో పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు పెద్దబాలశిక్ష బహూకరించారు. మేము జరిపించిన మా మేనల్లుడి వివాహంలో నూతన దంపతులకు ‘అంబేడ్కర్‌ జీవిత చరిత్ర’ బహూకరించారు. 2006లో ఆంధ్రప్రదేశ్‌ జనచైతన్య మండలి వారి కాకినాడ సదస్సు కోసం తారకంగారు, విజయభారతిగారితో ప్రయాణించడం, వేదికలు పంచుకోవడం గొప్ప అనుభూతి. ఆ తర్వాత అనేక సభలు, సమావేశాల్లో కలిసి పాల్గొన్నాము. స్త్రీవాదం, దళిత ఉద్యమాలు సమాజంలో దళిత స్త్రీల స్థితిని గురించి అనేక విషయాలను చర్చించేవాళ్ళం. దళిత సమాజంలో స్త్రీల పట్ల దళిత పురుషుల ఆధిపత్య ధోరణి ఇంకా కొనసాగుతుందని బాధపడేవారు. విజయభారతి గారి అమ్మ నాగరత్నమ్మ గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంలో అమ్మను గురించిన అనేక విషయాలు పంచుకొన్నారు.
అంబేడ్కర్‌ మెమోరియల్‌ ట్రస్టు స్థాపక సభ్యులు తారకంగారు. విజయభారతిగారు వైస్‌ ఛైర్మన్‌ గాను, సలహా సంఘం సభ్యులుగాను వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం అంబేడ్కర్‌ మెమోరియల్‌ ఉపన్యాసానికి క్రమం తప్పకుండా వెళ్లేదాన్ని. వీరిద్దరి సమక్షంలోనే 2015లో ‘‘అంబేడ్కర్‌ ఉద్యమంలో దళితస్త్రీల భాగస్వామ్యం’’ అంశంపై ఉపన్యసించాను. బహుశ తారకంగారు హాజరైన చివరి సదస్సు అదే కావచ్చు. భారతదేశ దళితోద్యమంలో దళిత స్త్రీల భాగస్వామ్యంపై సమగ్ర చరిత్రను రాయమని అడిగారు. ఈ విషయంపై కొన్ని వ్యాసాలు ప్రచురితమైనాయి. కానీ పుస్తకం ఇంకా వెలువడలేదు. 2016లో తారకం గారి మరణంతో దళితోద్యమ నాయకత్వంలో పూరించలేని లోటు ఏర్పడిరది.
ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి! ట్రస్టు కమిటీ వారు, స్మారకోపన్యాసం ఇవ్వరాదన్న నిబంధన ఉన్నందున, అంబేద్కర్‌ గారిపై సమగ్ర అధ్యయనం చేసిన వీరిని ఎన్నోమార్లు, ఉపన్యాసమివ్వమని అడిగినా… అమ్మ ఆ నిబంధననను గౌరవించి సున్నితంగా తిరస్కరించేవారు. తెలుగు అకాడమి తొలి మహిళా డైరెక్టర్‌గా పనిచేసిన ఖ్యాతి విజయభారతి గారిది. ‘‘దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయము` సాంఘిక పరిస్థితులు’’ అనే అంశంపై పి.హెచ్‌.డి. పట్టా పొందిన స్త్రీలలో రెండవ వ్యక్తి. తెలుగులో డాక్టరేటు పొందిన తొలి దళిత పరిశోధకురాలు. విజయభారతి గారితో సామాజిక విషయాలపై చర్చ తరచూ జరుగుతుండేది. ‘‘నలుపు’’ పాత సంచికల ప్రతులను స్వయంగా వెతికి నాకు ఇచ్చారు. బోయి భీమన్నగారి శత జయంతి ఉత్సవాల నిర్వహణపుడు ‘‘బోయి భీమన్న రచనలు స్త్రీవాదం’’ అంశంపై ప్రసంగించాను. ఆ ప్రసంగాల ప్రత్యేక సంచికను వర్మగారు తీసుకువస్త్తామన్నారు. ఆ సందర్భంలో విజయభారతిగారిని భీమన్న గారి పుస్తకాల కొరకు అడిగితే, వెంటనే భీమన్న గారి రచనలు అన్నింటినీ నాకు ఇచ్చారు. ‘మధుగీత’, ‘మణిమానసం’, ‘రాఖీలు’, ‘రాగ వైశాఖి’, ‘పైరుపాట’, ‘పాలేరు’, ‘కూలిరాజు’ ‘రాగవాసిష్టం’ ‘ధర్మం కోసం ‘పోరాటం’, ‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు’ వంటి అనేక పుస్తకాల్ని నాకు ఇచ్చారు. నేను వ్యాసాన్నయితే రాశాను కానీ సంచిక ఎందుకో వెలువడలేదు. అమ్మతో కలిసి పనిచేసిన నా రచనా వ్యాసంగాల్లో ఎంతో ముఖ్యమైనది. ‘హిందుకోడ్‌ బిల్లు’’ అనువాదం. దానిని అనువాదం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా వందపేజీలు అనువాదం చేయడం జరిగింది. అమ్మ దేనిని బలవంతం చేయరు. వీలుంటేనే చేయండి అని అంటారు. మేము అమ్మను ఇబ్బంది పెట్టకుండా అనువాదం ఇచ్చాము. జ్ఞానేశ్వర్‌ గారు కో`ఆర్డినేట్‌ చేసేవారు.
తెలుగు అకాడమిలో పని చేసిన ఇరవై సంవత్సరాల కాలంలో పారిభాషిక పదకోశాలు, శాస్త్ర నిఘంటువుల రూపకల్పనలో గణనీయ పాత్ర పోషించారు. ముఖ్యంగా వీరి సంపాదకత్వంలో వెలువడిన, తెలుగు సమగ్ర సాహిత్య గ్రంథాలు ప్రాచీన సాహిత్యకోశం, ఆధునిక సాహిత్యకోశం ఇప్పటికీ సాహిత్య పరిశోధకులకు రెఫరెన్స్‌ గ్రంథాలుగా నిలిచి వున్నాయి. హిందూ పీఠాధిపతుల విమర్శలు, కుల వివక్ష తట్టుకొని ధైర్యంగా ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌ పదవిని విజయవంతంగా నిర్వహించింది. తారకంగారి సహకారంతో 1982లోనే డా॥ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్ర గ్రంథాన్ని అనువదించారు. దశాధిక ప్రచురణలు పొందిన ఈ పుస్తకం దళితోద్యమ నాయకులకు, యువతకు, మరెందరికో ఉపయోగపడిరది. ఈ పుస్తకావిష్కరణ సభలో జస్టిస్‌ పున్నయ్యగారు ఆ పుస్తకం టైంబాంబు లాంటిదనీ, విజయభారతి గారు చక్కగా అనువదించారనీ పేర్కొన్నారు. విజయభారతి గారు రచించిన డా॥ బి.ఆర్‌. అంబేడ్కర్‌, ఫూలే జీవిత చరిత్రలు, ఇతర రచనలు దళిత, స్త్రీవాద ఉద్యమాలకు ఊపిరినిచ్చాయి.
అమ్మ రచనలు అసమానతలపై నిప్పులు చెరిగే విధంగా ఉండేది. దళిత స్త్రీలపై హింస, కుల వివక్షత, వంటి అంశాలపై ఆమె చేసిన రచనలు మహత్తరమైనదివి. ఆమె రచనలు సులువుగా, సరళంగా అందరికీ అర్థం అయ్యేలా ఉంటాయి. ‘హరిశ్చంద్రుడు, అనగానే సత్యనిష్టుడు అనీ తప్పుడు కథలు చెప్పారు. హరిశ్చంద్రుడు కష్టాలు పడిరది అబద్ధాలు చెప్పలేక కాదు. కులం పొగొట్టుకోలేక! నిజానికి ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని, ‘సత్య హరిశ్చంద్రుడు’ అనే విమర్శనాత్మక పుస్తకంలో రాశారు. కులం గురించి, స్త్రీల గురించి వున్న గ్రంథాలను చదివి ‘షట్చక్రవర్తులు’ ‘దశావతరాలు’ రాశారు. మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యం వైపు మారుతున్న సమాజంలో అనార్య స్త్రీ అయిన తాటకను రాముడు ఎలా చంపాడో అంబేడ్కర్‌ రాశారు. అదే స్పూర్తితో రామాయణం మీద ‘వ్యవస్థను మార్చిన రాముడు’’ రాశారు. అలాగే, ‘‘రాముని కృష్ణుని రహస్యాలు’’ అనువాదం చేశారు. మహాభారతంలో స్త్రీలను అణచివేట్టే ధర్మసూక్ష్మాలను ‘‘నరమేధాలు నియోగాలు` మహాభారతం’’లో పరిశీలనగా తీసుకొచ్చారు.
‘‘అధికారం తమ చేతుల్లోంచి జారిపోతుందని భావించినపుడే బ్రాహ్మణులు రామాయణ, మహాభారతాలను ఇతర పురాణాలను ముందుకు తెచ్చారు. ఇప్పుడు మనకోసం మళ్ళీ ఓ భారతం, రామాయణం రావాల్సి ఉంది. అందుకే దళిత యువత ప్రాచీన సాహిత్యాన్ని పునర్విశ్లేషణ చేయాలి. మూలవాసులకు రాక్షసులు, నాగులు అని చెడ్డ పేర్లు పెట్టి, క్రూరంగా చిత్రించి, మన జాతి చరిత్రను మనం తెలుసుకోకుండా చేశారు. పురాణాల మీదే పురుషాధిత్యం, కులవ్యవస్థ బతుకుతున్నది… దాన్ని బద్దలు కొట్టాలంటే మనం పురాణాలు తిరగరాయాలి’’ అన్న ఉద్దేశాలతో ‘పురాణాలు` మరో చూపు’ టైటిల్‌తో సిరీస్‌ రాశారు.
అమ్మరాసిన పుస్తకాలలో కుల వివక్ష, హింస గురించి ప్రధానంగా ఉన్నాయి. 2024లో రాసిన ‘‘స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు గుప్పెడు బూడిదే మిగిలిందా?’’ పురాణాలలో స్త్రీలు, తాటక లాంటి వాళ్ళు రాక్షసులు కారు, వీళ్ళు రాణులు అని ఇందులో చెప్పడం జరిగింది. పురాణాల్లో ఆర్య స్త్రీల పట్ల గౌరవం, అనార్య స్త్రీలపట్ల హీనభావం చూపారని అన్నారు. ‘ఆర్యులు తమ అవసరాలకు పురాణాల్లో తాటక లాంటి వాళ్ళను తక్కువ చేసి చూపించారు’ అని పేర్కొన్నారు. నిమ్నజాతుల చరిత్రను రాసారు. అశాస్త్రీయమైన పురాణాలను పురుష సూక్తాన్ని, నియోగులను చీల్చి చెండాడారు. ప్రస్తుతం జరుగుచున్న పరువు హత్యలు కూడా ‘కుల హత్యలు’ అని తేల్చిచెప్పారు. ఎందుకంటే ‘‘పరువు హత్యల బాధితులు ఎక్కువగా సబ్బండ వర్ణాలు, నిమ్న వర్గాల వారు మాత్రమేనని’’ అని అమ్మ అన్నారు.
రోహిత్‌ వేముల విషయంలో స్పందిస్తూ, ‘ఎంతో దూరం నుంచి ఇక్కడ చదువు కోవడానికి దళిత యువత వస్తే, ఇక్కడి సమాజం ఎంత దారుణంగా హింసిస్తుందో బాధకరమని’ అన్నారు. దీని గురించి దళిత సమాజంలోని ప్రతివారు ఆలోచించాలని అమ్మ చర్చించారు. ‘‘ఎందుకు ఆత్మహత్యలు’’ అనే వ్యాసంలో ఈ విషయాలను అమ్మగారు ప్రశ్నించారు.
అమ్మ గోల్కొండ, భూమిక, నలుపు, కమ్యూనిజం, కృష్ణా పత్రిక, వార్త మొదలగు పత్రికలలో చాలా వ్యాసాలు రాశారు. అయితే, గోల్కొండ పత్రిక కోసం రాసిన వ్యాసాలు లభించడం లేదు. ‘‘భూమిక’’లో వచ్చిన వ్యాసాలను మనం చూడవచ్చు.
విజయభారతి గారి విద్వత్తుకు తగ్గ గుర్తింపు రాకపోయినా కొన్ని పురస్కారాలు వచ్చాయి. బోయి భీమన్న, జాషువాలతో పాటు చాలా అవార్డులు వరించాయి. అయితే, జాషువా అవార్డుకు సంబంధించి, స్త్రీ రచయిత్రులపై వివక్ష చూపారు. మొదటి మూడు పురుష అవార్డు గ్రహీతలకు 3 లక్షలు ఇస్తే, వీరికి 50 వేలు మాత్రమే ఇచ్చారు. దీనిని అమ్మ వేదిక మీదనే నిరసించారు. స్త్రీల పట్ల వివక్షను ప్రశ్నించి పైకం ట్రస్టుకే తిరిగి ఇచ్చేసారు.
ఇంకో విషయమేమిటంటే రమాబాయి అంబేడ్కర్‌ జీవిత చరిత్రను డాక్యుమెంటరీగా తీయడానికి అమ్మతో చర్చించడం జరిగింది. అమ్మ ఆరోగ్యం అప్పుడు కాస్త బాగలేక పోవడం వల్ల అది కొంత ఆలస్యమైంది. ఇటీవలే 2024 సమాంతర వరుణ్‌ ఒక డాక్యుమెంటరీ మా ఇద్దరితో తీయాలన్నపుడు నేను, అమ్మ కలిసి ఒక గంట నిడివి డాక్యుమెంటరీ చేసాము. చాలా బాగా వచ్చింది. ఇది ‘యూ ట్యూబ్‌’లో ఉంది. అమ్మ ఆత్మకథ రాయాలని చాలాసార్లు నేను అడిగాను. తనకూ రాయాలని ఉందనీ, ఆరోగ్యం సహకరించట్లేదనీ అనేవారు. నేను రాస్తానని ఒకసారి అన్నపుడు ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న వారికి తీరిక ఉండదని వారించారు. రీసెర్చ్‌ స్కాలర్‌ను పంపుతానంటే వద్దన్నారు. జూన్‌ 27 2024న జరిగిన పుస్తకావిష్కరణ సభలో మళ్ళీ నేను ఆత్మకథ ప్రస్తావన తేగా ‘నేను త్వరలో పూర్తిచేస్తా’నన్నారు జూలై నాడు ఫోన్‌ చేసి ఆత్మకథ ప్రతి కృష్ణకుమారికి ఇచ్చాను. దానికి ముందుమాట రాయమని కోరారు. సంతోషంగా ఒప్పుకున్నాను. అమ్మ తన రచనలను విమర్శనాత్మకంగా రాయమన్నారు. మొత్తానికి ఈ రచన బయటికి వచ్చినపుడు మన అందరి కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం.
అమ్మ చేసిన కృషిని, అమ్మ ప్రశ్నించే తత్వాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆశిస్తున్నాను. 83 ఏళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానం ` విజయభారతి గారిది. ఎన్నో సాధించినా ఒదిగి వుండే నిష్కళంక ప్రేమమూర్తి. తన అంతరంగంలోని భావ సంఘర్షణలో నుండి ఆవిష్కరించినట్టి ఆముద్రిత కవిత, గోగుశ్యామల చేసిన సంకలనం ‘‘నల్లపొద్దు’’లో ప్రచురించారు.
విద్యార్థి దశలో వివక్ష మొదలు తెలుగు అకాడమీలో వివక్ష వరకు అడుగడుగునా అంతులేని పోరాటం చేశారు. నా అభిప్రాయంలో వారి జీవనయానం, అవిశ్రాంత పయనమే! అందుకే ఆ కవితను ఇక్కడ ప్రస్తావించడం. సముచితంగా భావిస్తున్నాను. మనందరి జీవితాలకు అద్దం పట్టే కవిత ఇది.
అవిశ్రాంత పయనం
నడుస్తున్నాం…
ఎవరో తరుముతున్నటుల
విడివడిగా తోసుకుంటూ తప్పించుకుంటూ అవిశ్రాంతంగా
ఎక్కడ చూసినా జనమే
ఎవరి గోలలో వాళ్ళు
గతానుగతికంగా తోసుకుంటూ తప్పించుకుంటూ నడుస్తూ పోతున్నారు
………………..
గమనించటానికి అవకాశం లేదు, ఆగటానికి వ్యవధి లేదు
…………………
ఇదొక నడక పందెం… ఆగకు !
………….
ఆగావో వెనక నుంచి ఎవరో తోసేస్తారు
వాళ్ళ గమనమూ ఆగుతుంది` నీ బతుకూ ఆగుతుంది
నాతో కలిసి వున్న వారెవరో` స్పష్టంగా లేదు
నెత్తిమీద బరువుంది` నేనే మోస్తున్నాను
గంపలో పిల్లలా? కూతురా? మనమరాలా?
గంప తేలిగ్గానే ఉంది` అయినా దించుకోవాలి
ఎక్కడ దించాలి? అంతా జనమే! జనం కాని జనం!
గంప బరువుతో` చెప్పులు లేని కాళ్ళతో నడుస్తున్నాం
ఉక్కిరి బిక్కిరిగా గజిబిజిగా ఉంది`
దారి కనబడక బందీలమై పోవాలి
ఇలా ఎంతకాలం? కాళ్ళు పీకుతున్నాయి
(లోకమూ పీకుతుంది)
నిస్తేజంగా, నిస్త్రాణంగా ఉంది` ఊతం దొరకదు
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె
ఒంటరిగా సొమ్మసిల్లుతూ లేస్తూ అందిన ఆధారం దొరకబుచ్చుకుంటూ
సాగిలపడుతూ జరుగుతున్నాను ముందుకు
………..
ప్రయాణం సాగిస్తున్నాను` ఇలా ఎంత సేపు
…………..
ఏదో పరిచితమైన పరిమళం
జ్ఞాపకాల గుబుర్లు పాతనేస్తాలు
నిలువెత్తు మొక్కలు` ఎక్కడో చూశాను వీటిని
ఆ గతానుభవాలను` ఏదో సన్నని వెలుతురు
…………..
గోడలున్నాయా గుమ్మం ఎటో` అంతవరకు వెళ్ళగలనా…
…………….
అమ్మయ్య దగ్గర పడ్డాను
తలుపులు గుమ్మాలు లేని ప్రవేశం
లోపల గది లాగానే ఉంది
ఇంకా ఎవరో ఉన్నారు… ఆడవాళ్ళు మగవాళ్ళు
నన్నెరిగినట్టే ఉన్నారు` నా కోసం చూస్తున్నట్టే ఉన్నారు
సమాధానం దొరికీ దొరకనట్టు నిరామయ స్థితి
అలసిన దేహానికి విశ్రాంతి దొరికిందా!
నడక ఆగిందా ఇటు నుంచి రోడ్డు వుంది
రణగొణ ధ్వనులు లేని దారి ఉంది…

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.